కథలు రాయడం మొదలుపెట్టి ఇరవై ఏళ్లు గడిచిన సందర్భంలో గతంలో వచ్చిన నా రెండు సంకలనాలలోని కథలన్నీ కలిపి ఇలా ఒకే పుస్తకంగా వేయదలిచినపుడు ముందుమాట ‘రాస్తే బాగుంటుంది’ అని మిత్రుడు సలహా ఇస్తే ఇలా రాయడం మొదలుపెట్టాను. మా పూర్వీకులు ఎవరిలోనూ కవులు, రచయితలు లేరు. అందరూ రైతులే. మా అమ్మగారి తరపు పూర్వీకులు (ముత్తాతలు) దేవాలయాల్లో శిల్పాలు చెక్కేవారని విన్నాను కాని అదెంతవరకు నిజమో తెలీదు. కథలు ఎందుకు రాసాను? అనుకునేకంటే కథలు ఎలా రాయగలిగేను? అనుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. పదిమందిలో పట్టుమని పదిమాటలైనా మాట్లాడలేని వాణ్ని. నోట్లో నాలుక లేనివాణ్ణి. మా ఇంట్లో ఆకరోడ్ని. ఊహ తెలిసిన చాలా కాలం వరకు మనుషులంటే ఆమడ దూరం పారిపోయేవాణ్ణి. ఎవరైనా ముందునుంచి ఇంటికి వస్తే వెనక గుమ్మం నుంచి బయటికి వెళ్లిపోయేవాడిని. మానాన్న గారు ఎప్పుడన్నా ఇంటికి వచ్చిన అతిథులకు నన్ను చూపించి ‘వీడు మా ఆఖరబ్బాయి’ అంటే ‘ఈ పిల్లాడు మీ అబ్బాయా.. ఎప్పుడూ చూడలేదే’ అని ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆరేడు తరగతులు వచ్చేవరకు నేను ఇంట్లో ఎక్కువ ఉండేవాడ్ని కాదు. మా అమ్మ ఎవరితో మాట్లాడేది కాదు. ఇంట్లో వాళ్ళతో కూడా. చాలామంది ఆవిడకు మానసిక రుగ్మత అనుకునేవాళ్లు. ఆమె ఎక్కువ మాట్లాడదు అంతే. నాకూ ఆమె తీరే వచ్చింది అనుకునేవారు. ఏ కారణం చేతనో నేను మా అమ్మ ఆలనా పాలనలో పెరగలేదు. ఇంట్లో అన్నయ్యల, అక్కయ్యల గారాబం అయితే ఉండేది చిన్నోడిగా. నేను సామాజికుడ్ని కాదు. నాకు ఎక్కువ సామాజిక పద్ధతులు తెలియవు. ఇంటి మనిషిని కాకపోవడం చేత ఊరి చివర పోరంబోకు భూముల్లో, చెట్లలో పుట్లలో అడవులలో, కొండల మధ్య, చంద్రవంక (మాచర్ల), గుండ్లకమ్మ (అద్దంకి) నదీతీరాల్లో ఎక్కువగా తిరిగేవాడిని. రేగిపళ్లు, కలేక్కాయలు, జీరంగులు, తూనీగలు, గువ్వలు, పావురాళ్ళు నాకు చాలా చిన్నతనంలో తెలిసొచ్చాయి. అన్నీ ఒంటరి తిరుగుళ్లే. యాపిల్ పండ్లు ఉంచే చెక్క పెట్టెలతో పావురాళ్ళ గూళ్ళు తయారు చేసేవాడిని. ఈ వనవాసం నుంచే ‘మృగశిర’, ‘పొదుగు’ లాంటి కథలు పుట్టాయి. ‘కథలు రాయబడతాయి’ అన్న మాట నేను నమ్ముతాను. ఒంటరితనం వలన కాబోలు పుస్తకాలు చదవడం అలవాటైంది. ఇంట్లో పత్రికలు ఉండటం చేత కూడా కావొచ్చు. చందమామ సీరియల్స్ ఫాలో అయ్యేవాడిని. ఆ సీరియల్స్ (ముగ్గురు మాంత్రికులు) లో ఉండే ఒక ముఖ్య పాత్ర పింగళుడి పేరు పెట్టి ‘ఒరే పింగళా’ అని మా అన్నయ్యలు ఎగతాళి చేసేవారు. అలానే టామ్ సాయర్, హకల్ బెరీఫిన్ పుస్తకాలు కూడా పదే పదే చదివేవాడిని. ‘టామ్ సాయర్ వందోసారి’ అని ఇంట్లోవాళ్ళు ఆటపట్టించేవాళ్ళు. ఆవిధంగా చెట్లు పుట్టల మధ్య నుంచి పుస్తకాలలోకి నా జీవితం విస్తరించింది. మేము మాచర్ల నుంచి అద్దంకి మారాక నా నా ఒంటరి ప్రపంచం మరింత విశాలమైంది. ఒకవైపు గుండ్లకమ్మ, ఇంకో వైపు నల్లవాగు, మరోవైపు శింగరకొండ.. ఇలా ఊరికి అన్నివైపులా తిరగడం. ఎనిమిదవ తరగతిలో ఉండగా నా క్లాస్మేట్ కాకుమాని శ్రీనివాసరావు పరిచయమయ్యాడు. వాడు ప్రతిరోజూ మంచి నీళ్ళ కోసం గుండ్లకమ్మ వచ్చేవాడు. ఇద్దరం స్కూలు అయ్యాక లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం. చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి పత్రికలు చదివేవాళ్ళం. కొత్త పుస్తకాలు ఏమైనా వస్తే లైబ్రేరియన్ మాచేత వాటికి స్టాంపులు, నెంబర్లు వేయించి రిజిస్టరులో రాయించేవాడు. అలా సాహిత్య అకాడెమీ, నేషనల్ బుక్ ట్రస్ట్ అనువాద పుస్తకాలు పరిచయమయ్యాయి. ఇవి కాక శరత్, ఠాగూర్ బెంగాలీ అనువాద సాహిత్యం, రష్యన్ (రాదుగ ప్రచురణలు) అనువాదాలు, బౌద్ధ జాతక కథలు, తెలుగు సాహిత్యంలో చలం, రావిశాస్త్రి, బుచ్చిబాబు, పాలగుమ్మి పద్మరాజు కొడవటిగంటి రచనలు, విపుల, చతుర పత్రికలూ.. అలా మా లైబ్రరీలో అందుబాటులో ఉన్న ప్రతిదీ కొన్ని సంవత్సరాలపాటు చదివాం. ఆ హైస్కూలు, కాలేజీ రోజులలో ఇది కవిత్వమని ఇది కథ అని విడివిడిగా చూడలేదు. అనువాదాలూ, కథలతో పాటు శ్రీశ్రీ, తిలక్, శేషేంద్ర, నగ్నముని, ఇస్మాయిల్ వంటి కవుల కవిత్వాన్ని కూడా అంతే ఇష్టంతో చదువుకున్నాం. ఇదంతా గొప్ప సాహిత్యమని, ఇవన్నీ చదివి తీరవలసినవని ఆ రోజుల్లో మాకెవరూ చెప్పలేదు. మొదటినుంచి కొండల మధ్య, అడవుల్లోంచి నిశ్శబ్దంగా పారే సెలయేరులా గడిచిన జీవితం ఇంటర్ తరవాత 1990 నుంచి సుడిగుండాలతో అతలాకుతలమైంది. నేను పెరిగిన ప్రదేశాలనుంచి ఒక్కసారిగా హైదరాబాదులోకి వచ్చిపడ్డ జీవితం అనేక ఒడిదుడుకులు చవిచూసింది. నిరుద్యోగం, ఆకలి దారిద్ర్యంతో మండే ఎండల్లాగా సంవత్సరాలు గడిచాయి. 1994లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో కొంతకాలం మిత్రుడి హాస్టల్ రూములో ఉన్నాను. ఆరోజుల్లో ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ఎం.ఏ. చదివే కవి ఎం.ఎస్.నాయుడు పరిచయమయ్యాడు. ‘నీ దుఃఖం ఒక అబద్ధం, నీ సంతోషం ఒక మాయ, అసలు ఈ జీవితమే ఒక పెద్ద మహామాయ’ అన్నట్లు ఉండేవాడు. అప్పటికప్పుడే వాగ్గేయకారుడిలా అబ్బురమైన కవిత్వం రాసేవాడు. ‘మనుషులలో ఇలా సాధ్యమేనా?’ అన్నట్లు ఆశ్చర్యం గొలిపేవాడు. నాలోని ఎన్నో గోడలను కూలగొట్టినవాడు. కఠోరమైన కాలంలో నాయుడితో స్నేహం ఒక ఊరట. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆరోజుల్లోనే ఒకరాత్రి భోజనాల టైము అయిపోయిన తరవాత హాస్టల్ మెస్‌కి వచ్చి టేబుల్స్ మీద ఎంగిలి పళ్ళాలను చూసి ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం, అర నిముషం దాటితే అసహ్యం’ అన్నాడు నాగప్పగారి సుందర్రాజు. ఆ మాటలు ఇప్పటికీ అలా గుర్తుండిపోయాయి.
నేనెంత అసామాజికుడినో ఈ ప్రపంచం అంత నిర్దాక్షిణ్యంగా నన్ను తనలోకి లాక్కుంది. దానిమూలంగా ఆ పదేళ్ళపాటు దారిపొడుగునా గాయాలు. ఈ దెబ్బతో నా భావనా ప్రపంచం చాలవరకు కూలిపోయింది. ఆ కాలంలో నేను నా గతాన్ని దాదాపు మర్చిపోయాను. పదేళ్ల ఎటూ కాని కాలం. కాలం మెలికల్లో గింగిరాలు తిరుగుతున్న కాలంలో అప్పటికే గన్నవరంలో తెలుగు లెక్చరరుగా సెటిలైన కాకుమాని ‘పత్రికలలో కథలు బాగా వస్తున్నాయని’ చెప్పి, ‘నువ్వు కూడా కథలు రాయొచ్చు కదరా’ అన్నాడు. అప్పటికి నాకు ముప్పై ఏళ్ళు దాటిపోయాయి.
అప్పటికి నేను అబిడ్స్, ఉప్పల్ బస్ డిపో టైప్ ఇనిస్టిట్యూట్స్లలో, లాయర్ల దగ్గరా చిన్న చిన్న జాబ్ వర్క్స్ చేసుకుంటూ చివరికి ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక కంపెనీలో స్టెనోగా చేరాను. నా అస్థిర జీవితానికి ఒక చిన్న దారంటూ దొరికి నేను కొంత స్థిమితపడటానికి అవకాశం లభించింది. అక్కడికి దగ్గరలో ఉన్న ఉప్పల్ బీరప్పగడ్డ బస్తీలో రూము తీసుకుని జీవిక కొనసాగించాను. అక్కడ నుంచి కొత్త జీవితం. కంపెనీ యాజమాన్యం, బలమైన యూనియన్ రాజకీయాలు, ధర్నాలు, కార్మికుల ఉద్యమాలు, కార్మిక నాయకులు యాజమాన్యంతో కుమ్మక్కవడం, కంపెనీ మూత పడటం, నేను సికింద్రాబాద్‌లో కార్పోరేట్ ఆఫీసుకి మారడం, మళ్ళీ అక్కడ ఇంకో కొత్త ప్రపంచం ఈ తరవాత పెళ్లి, కుటుంబ జీవితం.. ఇప్పటికీ అదే. ఈ మధ్యలో జీవితం అతలాకుతలం.
నేను కథలు రాయడం మొదలుపెట్టినప్పుడు కథలు రాయడానికి ముఖ్యమైంది జీవితానుభవమా లేక పఠనానుభావమా అని తర్కించుకోలేదు. అప్పటికప్పుడు గతాన్ని తవ్వుకోలేదు. ఒక అర్థరాత్రి పోలీస్ సైరన్ వినిపించి అర్ధగంటలో ‘జాతక కథ’ రాసాను. ఒకరాత్రి బస్సులో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటనతో ‘మనిషి రూపాలు’ కథ వచ్చింది. ఉప్పల్ బీరప్పగడ్డ బస్తీలోలో నాతోపాటు తన ప్రవాస జీవితం గడిపిన మిత్రుడి ప్రేమ కథని ‘ఆమె నీడ’గా రాసాను. భైరవకోనలో జరిగిన సంఘటనతో రాసిన ‘లోయ’ కథ ఇప్పుడు చూసుకుంటే ‘అది నేనే రాశానా’ అని నాకే వింతగా ఉంటుంది. అది భైరవకోన క్షేత్ర మహిమ అనుకుంటాను చాలాసార్లు. ఎవరి నమ్మకాలు వారివి. ఏ కథని ఎలా రాయాలి అని ముందే ఎప్పుడూ ఊహించలేదు. రాసిందంతా రాస్తున్న క్రమంలోనే వచ్చింది. అనుకున్నవన్నీ రాయగలిగానా అంటే రాయకుండా వదిలేసినవే ఎక్కువ. కథ మీద ఇప్పుడున్న ఎరుక మొదట్లో ఉండి ఉంటే ఇంకొన్ని మంచి కథలు వచ్చుండేవి కదా అనిపిస్తుంది. జీవితం గిరగిరమని గింగిరాలు తిప్పించి కొట్టిన రాపిడికి రాలినవే ఈ కొన్ని. కొట్టుకుపోయినవి ఎన్నో. చాల ఆలస్యంగా రాయడం మొదలుపెట్టిన నాకు మొదటినుంచి ఇప్పటిదాకా కథ మీద ఎప్పటికప్పుడు దృష్టి మారుతూనే ఉంది. కథలు స్ఫురించినంత తేలికగా కాగితం మీదకు రావు. రాస్తుండే స్ఫురణ వేరు. మనచేత కథ రాయించేది అది మాత్రమే అనుకుంటాను. ఏది కథ అవుతుంది? అనే చిన్న ప్రశ్న నాలో నిరంతరం అనేక పరిధుల్ని దాటుకుంటూ సువిశాలం చేస్తూనే ఉంది. నేను కథలు రాయడానికి ముఖ్యకారణమైన కాకుమాని నా ప్రతి కథ వెనక ఉన్నాడు. కథ రాసి పంపగానే నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెప్పేవాడు. గుణదోషాలను సరిచేసి మొదటినుంచి నాకు వెన్నుదన్నుగా నిలబడ్డాడు. చిన్ననాటి నుంచి మేము పంచుకున్న సాహిత్య విషయాలు అనేకం. నా కథల్లో కేవలం వాస్తవమొక్కటే లేదు, కల్పన కూడా గూడు కట్టుకుని ఉంది. నాకు తెలియకుండానే అక్కడ నా జీవితం కూడా వెల్లడైంది. అలా కథలు రాస్తున్న కొత్తలో కథలను ప్రేమించే మిత్రుడు, కథకుడు గొరుసు జగదీశ్వరరెడ్డి పరిచయం అయ్యాడు. ఆయనిచ్చిన ప్రోద్బలానికి ఎప్పటికీ ఋణపడి ఉన్నాను.
నా సాహిత్య స్నేహితులలో 2007లో పరిచయమైన పక్షి కళ్ళవాడు ‘భగవంతం’. కొత్తగూడెం నుంచి కొత్తగా మాట్లాడేవాడు. అతడి మాటలు ‘గాలిలో నృత్యం చేస్తున్నట్లు’ కార్తీకమాసపు చెట్ల ఆకుల మాదిరి సజీవంగా తాజాగా నవనవలాడుతూ ఉంటాయి. మేమిద్దరం పంచుకున్న కథల కబుర్లు ఎన్నో.
నేను కథలలోకి రాకముందు ఉప్పల్ చౌరస్తాలో ఆఫీసు నుంచి తిరిగివచ్చే వేళకు సాయంత్రపు చీకట్లలో నా కోసం ఎదురుచూస్తుండేవాడు వేగాబాండ్, కవి చిత్రకొండ గంగాధర్. కాస్త ఆలస్యమైతే పబ్లిక్ ఫోన్ (కాయిన్ బాక్స్) నుంచి కాల్ వచ్చేది. పగలంతా సెంట్రింగ్ పని చేసి వచ్చేవాడు. వీలు కుదిరినప్పుడల్లా ఆటవిక మద్యంతోనో పద్యంతోనో సేద తీరేవాళ్ళం. నాచేత కవిత్వం రాయించాలని చూసేవాడు. నేను నా పోస్టు మోడరన్ సందేహాలతో అతడిని విసిగించేవాడిని. తనకే రాజకీయ గొడవా పట్టదు. వీలయినంత కవిత్వం, గ్రీకు మైథాలజీ, ఫ్రెంచ్, రష్యన్ సాహిత్యాలు తనకిష్టం. ‘మామా రోమా’ (పసోలిని), ‘యులిసిస్ గేజ్’ (ఏంజిలో పౌలస్) వంటి గొప్ప సినిమాలు అతడి వల్లనే చూసాను. 2011లో అదృశ్యమైన గంగాధర్ మళ్ళీ కనపడలేదు. వేరే రాష్ట్రానికి వెళ్లి తమిళమో మలయాళమో నేర్చుకుంటానని చెప్పేవాడు. చివరికి ఆ సంవత్సరంలోనే ఆత్మహత్య చేసుకున్నాడని 2017లో తెలిసింది. సరిగ్గా ఆ మధ్యకాలంలో నాకు చీకటి రోజులు.
1990ల్లో పదేళ్ళపాటు నా జీవితంలో ఏర్పడిన సంక్షోభం 2012లో మళ్ళీ మొదలైంది. భార్య మరణం, నాలుగేళ్ళపాటు మళ్ళీ చీకటి రోజులు, ఒంటరి హాస్టల్ జీవితం. పది సంవత్సరాలపాటు కుటుంబ జీవితం గడిపి అమీర్ పేట హాస్టల్లో పళ్ళెం చేతిలో పెట్టుకుని భోజనం కోసం క్యూలో నిలబడినప్పుడు ‘ఏం జీవితంరా నాయనా ఇది’ అనిపించేది. ఆరోజుల్లో అబిడ్స్‌లో పాతపుస్తకాల కోసం తిరుగుతుంటే అనిల్ బత్తుల పరిచయమయ్యాడు. ‘యోగి వేమన’ సినిమాలో అభిరామ్ వైరాగ్యం పొందిన వేమారెడ్డిని ఉద్దేశించి ‘ఏది పట్టుకున్నా బ్రహ్మాండమేనా?’ అంటాడు. అనిల్ బత్తులకి కూడా ఏది పట్టుకుంటే అదే. ఆ తిక్కకి లెక్కేలేదు. ఆ పిచ్చి నాకు నచ్చుతుంది. నా అమీర్ పేట ఒంటరి దిగులుని అనిల్ స్నేహం కొంత అవతలకి నెట్టింది. నిదానంగా నేను మళ్ళీ కథల లోకంలోకి వచ్చాను.
కథా వస్తువు ఎంత ఆసక్తిగా అనిపించేదో అది వ్యక్తమయ్యే తీరు కూడా అంతే నన్ను ఆకర్షించింది. క్రమేణా ఈ కథావస్తువు కూడా కరిగిపోతూ ఉంది. ఇప్పుడు ‘సాహిత్యమంటే శిల్పం మాత్రమే’ అని కూడా నమ్ముతాను. ప్రతి కథా ఎప్పటికప్పుడు నాకు కొత్తనే. పూడూరి రాజిరెడ్డి, మెహెర్లతో కథల గురించి చర్చించుకొనేటప్పుడు మామధ్య కథ గురించి ఎన్నో విషయాలు explore అయ్యేవి. మేం ముగ్గురం కలిసి తిరిగిన పురాతన కోటలు, చెరువులు, ఊళ్లు, మా ప్రయాణాలు ఎప్పటికి గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకాలు. మా జీవితాలలో కొన్ని అంశాలను తీసుకుని మెహెర్ దర్శకత్వంలో మేము తీసిన ‘వెళ్లిపోవాలి’ సినిమాకి వచ్చిన స్పందన గొప్ప అనుభవం. ప్రతి ఒక్కరి సాంగత్యం నుంచి నేనెప్పుడూ ఎంతోకొంత నేర్చుకుంటూనే ఉన్నాను. తోటి కథకులతోపాటు మపాస, చెకోవ్ వంటి కథకులు ఎన్నుకునే వస్తువులు, వాళ్ళ రచనా విధానం నన్ను నిత్యం వెంబడిస్తూనే ఉంటాయి. ఎప్పుడూ విస్మయపరుస్తూనే ఉంటాయి. నిత్యం వాళ్ళనే స్మరించుకుంటాను. అనేక మంది కథకులను చదువుకుంటూ తెలుసుకుంటూ అంతిమంగా చెకొవ్ దగ్గర నిలిచిపోయాను.
చివరికి ‘నీకు జీవితానుభవం ఎక్కువా? లేక ‘అంతా పఠనానుభావమేనా?’ అంటే నిస్సందేహంగా ‘జీవితానుభవమే ఎక్కువ’ అంటాను. అదే ఎక్కువ నా మీద ప్రభావం చూపింది. అన్ని రంగులనీ చూపెట్టింది. మరి ‘జీవితానుభవం ఒక్కటి ఉంటే సరిపోతుందా?’ అంటే ‘పఠనానుభవం’ ఇచ్చే జీవితానుభవం మరొకటి అంటాను. సృజనకి ఇది ఆధారం అని చెప్పలేం. క్షణంలో స్ఫురించి మాయమయ్యే ‘లిప్తకాలపు’ కల్పనానుభవం కూడా అవసరమే అంటాను. అర్థం పర్థం లేని కలల అలలు కూడా ముఖ్యమే కదా అనిపిస్తాయి. జీవితంలోని కొన్ని పార్శ్వాలను మాత్రమే సాహిత్యంగా మలచవచ్చు అన్న అభిప్రాయం నుంచి జీవితంలో దేన్నైనా కథలుగా మలచవచ్చు అనే అభిప్రాయం దగ్గరకు వచ్చి ఆగాను. నిర్దిష్టంగా ఏ సూత్రాన్ని, ఏ సిద్ధాంతాన్ని పాటించలేదు. ఎప్పటికప్పుడు, ఏ కథకి ఆ కథ సందర్భాన్నిబట్టి ‘అలా’ రాసాను అంతే. ఆ కథలలో నా అమాయకత్వమూ ఉండచ్చు.. అశ్రద్ధా ఉండొచ్చు.. అశక్తతా ఉండొచ్చు. అది నా అహంకారమో, అజ్ఞానమో కూడా కావచ్చు.
ఇప్పుడు వెనక్కి తిరగేసి చూసుకుంటే నాకు కల్పన మీదే మంచి గురి ఉన్నా రాసినవన్నీ కేవలం కల్పిత కథలే కావు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీటన్నిటిలో నీడలా నేనూ ఉన్నాను. కొన్ని కథలను కాలక్రమంతో కలిపి కుడితే ఒక ఆత్మకథ అవుతుంది.
ఎక్కడ తిరిగినా, ఏం చదివినా మొదటినుంచి కవిత్వం సరస్సు దగ్గర సేద తీరుతాను. గతంలో శేషేంద్ర, అజంతా, మోహన్ ప్రసాద్‌ల కవిత్వాన్ని కలవరించి పలవరిస్తే ఇప్పుడు సిద్ధార్థ, ఎం.ఎస్.నాయుడు, పసునూరు శ్రీధర్ బాబు లాంటి కవులు గొప్ప అనుభవాన్నిచ్చి నా భావనా శక్తిని సానబెడుతుంటారు. ముఖ్యంగా సిద్ధార్థ పంచే పాఠకానుభూతి, ఆయన కవిత్వానుభవం గొప్ప శక్తి.
ఇక ~
ఇప్పటికైతే ఇక్కడిదాకా వచ్చాను. ఈ నీటి చలమ ఇంకా నిండే ఉంది. కళ్ళూ చెవులూ ఉన్నంతవరకు కథలు ఊరుతూనే ఉంటాయి. నడవాల్సిన ఓపిక కావాలి అంతే. ఇంకా రాయాలని ఉంది. ఎప్పటికప్పుడు జీరో లెవెల్‌కి దిగిపోయి మళ్ళీ మళ్ళీ కొత్తగా మొలకెత్తాలనీ ఉంటుంది.

B. Ajay Prasad
Short Story Writer


Inspiring journey..I eagerly read to know how you depict a story.. May be you discuss those more
బాగుంది చాలా చాలా