‘‘కృపయు సమాధానము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రీ, ఇదిగో నాయన, మీయొక్క దాసుడు, లోక యాత్రను ముగించుకొని మీయొద్దకు వచ్చుచుండగా..
పాస్టరు ప్రార్థన చదువుతుండగా గుప్పెడు మట్టి చేతిలోకి తీసుకున్నాను.
నాతోపాటు మా ఇద్దరన్నయ్యలు, అక్కయ్యలు, బంధువులు, స్నేహితులు తలా పిడికెడు మట్టి అందుకున్నారు.
సాయంకాలపు పసుపు ఎండలో కాఫిన్‌బాక్స్ దించిన గొయ్యి చుట్టూ అందరూ విచార వదనాలతో నిలబడి ఉన్నారు.
గుంతలో ఉన్న కాఫిన్‌బాక్సులో వాడు ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు. ఎప్పటిలానే. ఏమీ జరగనట్లుగా.
అందరికీ చివరి చూపు. కడపటి వీడ్కోలు.
గడ్డకట్టిన శరీరానికి తొడగలేక అలంకారప్రాయంగా వున్న నల్లకోటు వాడి ఒంటిమీద చిందరవందరగా పడేసి ఉంది.
మనిషిని క్రిస్టియన్ మతాచారం ప్రకారం ఇలా కాఫిన్ బాక్సులో పెట్టి ఖననం చేయడం నేనెప్పుడూ చూడలేదు. శ్మశానంలో మనుషుల్ని దహనం చేయడం మాత్రమే తెలుసు నాకు. ఇదంతా నాకు కొత్త.
వాడెప్పుడూ అంతే. ఏదీ మామూలుగా ఉండదు. ఏదో ఒక ప్రత్యేకత. అలా అని అసాధారణమూ కాదు.
ఇలా జరుగుతుందని అసలు ఏనాడూ అనుకోలేదు. ఇన్ని సంవత్సరాలూ వాడు లేని లోటు మాత్రమే మిగిలి ఆ బరువుని మోయలేక అలా అని ఎక్కడా ఒదిలేయనూ లేక కాగితం మీద పెట్టుకుంటే మనసుకు ఊరట కలుగుతుందని ఇలా రాయటం మొదలుపెట్టాను.
***
వాడి పూర్తిపేరు బాదర్ల హరేరామ కోటేశ్వర ప్రసాద్.
మా తాత ‘కోటయ్య’ పేరు.
ఇంట్లో అందరూ ‘హరి’ అని పిలిచేవారు. బయట ఫ్రెండ్స్ ‘ప్రసాద్’ అని పిలుస్తారు.
నాకు ముందర పుట్టినవాడు. నాకంటే మూడేళ్ళు పెద్దోడు.
మా ఇద్దరి మధ్య వయసు తేడా తక్కువ కాబట్టి చిన్నప్పటినుంచి నాకు వాడిని ‘ఒరే’ అని పిలవడం అలవాటయ్యింది.
చూడటానికి వాడు నాకంటే చిన్నవాడిలా కనిపించేవాడు. ఇద్దరం ఇంచుమించు ఒకే ఎత్తు. నాకంటే బక్కగా ఉండి వాడే నాకు తమ్ముడిలా కనిపిస్తాడు. మా నాన్నగారి పోలిక. కాకుంటే నలుపు. నేను అచ్చం మా అమ్మలా ఉంటానంటారు. మా నలుగురు అన్నదమ్ముల వరుసలో వాడు మూడోవాడు. మాకు ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. అందరికంటే నేను చిన్నవాడిని.
ఆ రోజుల్లో మా నాన్నగారు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో పనిచేస్తుండేవారు. మేము ఆనాటి గుంటూరు జిల్లా మాచర్ల పి.డబ్యు.డి.కాలనీలో ఉండేవాళ్ళం. నాకు ఊహ తెలిసింది మాచర్లలోనే. మా నాన్న గారు డిపార్ట్‌మెంటులో చిన్నపాటి క్లర్క్ కాబట్టి కాలనీలో మేమున్నది మూడు గదుల చిన్న ఇల్లు. వెనకాల పెరడు. ఇల్లు చిన్నదైనా ఇంటి చుట్టూతా విశాలమైన ఖాళీ స్థలముండేది. ఇంటికి నలువైపులా ఆకాశంలోకి కొమ్మలు చాచి ఏపుగా పెరిగిన పెద్ద పెద్ద వేప, దిరిశెన చెట్లు ఉండేవి. వాటికి తోడు మేము పెరట్లో కూరపాదులు పెట్టేవాళ్ళం. ఇంటిముందు గేటు నుంచి వాకిలి గుమ్మందాకా దారికి ఇరువైపులా రకరకాల పూలమొక్కలు ఎవరొచ్చినా తలలూపుతా ఆహ్వానం పలికేవి. పెరడులో ఎప్పుడూ పదిపదిహేను కోళ్ళు తిరుగుతుండేవి. గవర్నమెంట్ క్వార్టర్స్ కావడం వలన కాలనీలో ఇళ్ళన్నీ దూరదూరంగా ఉండేవి.
నాకు ఊహ వచ్చేనాటికి మా పెద్దక్క, పెద్దన్నయ్య ఇంటరు పూర్తి చేసి మా కాలనీ పక్కనే ఉన్న ఎస్.కె.బి.ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతుండేవారు. పెద్దన్నయ్య సూర్యశేఖర ప్రసాద్ మొదట్నుంచీ కాలేజీలో స్టూడెంట్ యూనియన్‌లో చేరి రాడికల్ భావాలు వంటబట్టించుకున్నాడు. అలా మా ఇంట్లో వామపక్ష భావజాలం వచ్చి చేరింది. కాలేజీ వార్షికోత్సవాల్లో రాడికల్ స్టూడెంట్స్ రష్యన్ ‘బ్యాలే’ ఆడేవాళ్ళు. సుందర్రావు అనే ఒక రాడికల్ స్టూడెంట్ పెద్దన్నయ్య స్నేహితుడు తరచుగా మా ఇంటికి వచ్చేవాడు. వాళ్ళది మాచర్ల దగ్గర జమ్మలమడక అనే ఊరు.
ఇంట్లో మొదటి అన్నయ్యలిద్దరూ పరస్పర విరుద్ధ స్వభావాలు కలవాళ్లు. పెద్దన్నయ్య అలా ఉంటే ఇంటరు చదివే రెండో అన్నయ్య కృష్ణ ప్రసాద్ పెద్దన్నయ్య ఆలోచనలకి పూర్తిగా విరుద్ధం. పేరుకు తగ్గట్టు కృష్ణుడే. ఎప్పుడూ ఆకతాయి పనులతో ఏదో ఒక గొడవ ఇంటికి తెచ్చేవాడు.
మా నాన్నగారు చేసేది చాలా చిన్న ఉద్యోగమే అయినా, ఇంట్లో లేమి ఉన్నా మా ఇంటికి రకరకాల వార, మాస పత్రికలు వచ్చేవి. పెద్దవారికి ఆంధ్ర జ్యోతి, ప్రభ, ఆంధ్ర పత్రిక, అలా. చిన్నవారికి చందమామ. ఆ రోజుల్లో మా ఇంట్లో నాకంటికి కనిపించిన రెండు పుస్తకాలు బుచ్చిబాబు చివరకు మిగిలేది, మరొకటి అల్లసాని పెద్దన మనుచరిత్ర. ఈ రెండూ మానాన్నగారు బందరు నేషనల్ కాలేజీలో బి.ఏ. చదువుతున్నప్పుడు కొనుక్కున్న పుస్తకాలు. డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు కాలేజీ ఫీజు కట్టలేక ఆయన చదువు ఆగిపోయిందని ఒకసారి చెప్పారు. పుస్తకాలు చదవటం ఆయన నుంచే మా ఇంట్లో వారసత్వంగా వచ్చిందనుకుంటాను. ఇన్ని పత్రికలు, పుస్తకాలు ఇంట్లో ఉన్నా వాటి గురించి ఆయనెప్పుడూ మాకెవరికీ పలానా పుస్తకం చదవమనికానీ, ఇంకెవరితోనన్నా పుస్తకాల గురించి చర్చలు జరిపినట్లు నేనెప్పుడూ చూడలేదు.
పగలల్లా స్కూలనో, కాలేజీ అనో ఇంటి పట్టున ఉండని మేము ఆదివారం వచ్చేసరికి అందరం ఇంట్లో ఉండేవాళ్లం. సెలవు రోజుల్లో మా అన్నలు మొక్కలకు పాదులు తీయడమో, కోళ్ళగూడు శుభ్రం చేయడమో ఏదో ఒక పనిపెట్టుకునేవారు. మా పెద్దన్నయ్య ఇంటి వెనకనున్న పెద్ద దిరిశెన చెట్టు విశాలమయిన కొమ్మల మీద కర్రలతో మంచె కట్టాడు. ఇంటికి ఒకపక్క తోటలో నేను గుబురుగా ఉన్న ఎత్తైన రేగుచెట్టుని గుడిసెలా మలిచి లోపల నేలంతా శుభ్రం చేసుకుని అందులో కూర్చునేవాడిని. ఆరోజుల్లో పాముల భయం తెలీదు నాకు. ఆ చెట్లలో ఎప్పుడూ పాముల్ని చూసింది లేదు.
ఆదివారం మధ్నాహ్న భోజనాలయ్యాక మానాన్నగారు పడక కుర్చీలో పడుకుని ఆకాశవాణి రేడియో నాటకం పెట్టేవారు. ప్రతి ఆదివారం మా ఇంట్లో జరిగే రివాజు ఇది. లోపల పనిచేసుకుంటున్న మా అమ్మగారు తప్ప మేమంతా నిశ్శబ్దంగా కూర్చుని నాటకాన్ని వినేవాళ్ళం.
రేడియోలో నాటకం వస్తున్నంతసేపూ చిన్నక్క క్లాసు పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటే పెద్దక్క చినిగిపోయిన బట్టల్ని సూదిదారంతో కుట్టుకుంటూనో ఉండేవారు. వాళ్ళిద్దరి చెవులు రేడియో మీదనే ఉండేవి. పెద్దన్నయ్య కిటికీ పక్కన కూర్చుని బయట చెట్లలోకి చూస్తూ ఆ నాటకం వినేవాడు.
మళ్ళీ ఆదివారం మధ్నాహ్నం ఎప్పుడొస్తుందా అని నాటకం కోసం ఎదురుచూసేవాళ్ళం. నాటకం పూర్తయ్యే సమయానికి బరువైన నిశ్శబ్దం ఇల్లంతా ఆవరించేది. మధ్యాహ్నాన్ని దాటిన సూర్యుడు తన లేత పసుపురంగు కిరణాలని ఇంట్లోకి ప్రసరించేవాడు. తెరిచిన కిటికీలనుంచి సన్నటిగాలి లోపలికి వచ్చేది. భారమైన హృదయాల్తో ఎవరికివారు సాయంత్రానికల్లా ఎటోకటు వెళ్ళిపోయేవాళ్ళు.
ఒకసారి రెండో అన్నయ్య గోడకానుకుని కూర్చుని ఏదో రాసుకుంటూ ఉంటే వెళ్ళి చూడబోయాను. నేను దగ్గరకు రావటం చూసి ‘‘ఎందుకురా ఇవన్నీ నీకు.. అన్నీ నీకేకావాలి. పోయి చదువుకోపో’’ అని కసురుకున్నాడు. నన్ను తిట్టడమైతే చేసాడు కానీ కాగితాలు మాత్రం నానుంచి దాచలేకపోయాడు. ఒకసారి తను బయటికి వెళ్ళిన తరవాత రహస్యంగా ఆ కాగితాలు తీసి చూసాను.
మందపాటి తెల్లటి కాగితాల మీద పెన్సిల్‌తో జానపద స్త్రీల బొమ్మలు. అందమైన కనుముక్కు తీరు. గుండ్రటి పెద్ద ముక్కుపుడక. జడకొప్పు, భుజాల మీద పలుచటి ఓణీ. తరువాత కాలంలో అవన్నీ గోపికల బొమ్మలుగా రూపొందాయి. అలా క్రమంగా లెక్కలేనన్ని రాధాకృష్ణుల బొమ్మలు గీసాడు.
బొమ్మలు గీయడంతోపాటు చిన్నన్నయ్యకు కథలు రాసే అలవాటు కూడా ఉండేది. కొంతకాలంపాటు నవల ఒకటి రాస్తూ సగంలో ఆపేసాడు. దానిపేరు ‘అడవిలో పిల్లవాడు’.
ఏ మనిషి గమ్యం ఎలా ఉంటుందో తెలీదు కదా. మనుషులు అనుకున్నట్లు జరిగితే అది జీవితమెలా అవుతుంది. చిన్నన్నయ్య నెల్లూరులో ఐ.టి.ఐ పూర్తి చేయగానే ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం వచ్చి చిన్న వయసులోనే మద్రాసు వెళ్ళిపోయాడు. ఎప్పుడో సంవత్సరానికి రెండు నెలల సెలవుతో ఇంటికి వచ్చేవాడు.
ఒకరోజు పెద్దన్నయ్య కాలేజీ లైబ్రరీ నుంచి ఒక పుస్తకం ఇంటికి తెచ్చాడు.
అది మక్సిమ్ గోర్కీ రాసిన ‘అమ్మ’ నవల. నేను గోర్కీ పేరు వినడం అదే మొదటిసారి.
కవర్ పేజీ మీద గోధుమ రంగు బిర్చి చెట్టు బొమ్మ.
రష్యా అనే దేశంలో ప్రగతి ప్రచురణాలయం ఆ పుస్తకాన్ని ముద్రించింది.
అప్పటికి రష్యా అనే దేశం ఒకటున్నదని మేమెవరం వినలేదు.
మానాన్నగారు పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని ‘‘పుస్తకం చూట్టానికి చాలా బాగుంది’’ అన్నారు.
ఆ తరువాత గోర్కీ మరికొన్ని కథల పుస్తకాలు ఇంట్లో వచ్చి చేరాయి.
పైవాళ్ళిద్దరూ అలా ఉంటే, మా మూడోవాడు హరన్నయ్య పనులు ఇంకోరకంగా వుండేవి. ఎప్పుడూ వాడి హైస్కూలు స్నేహితులతో తిరుగుతుండేవాడు. వాడి వ్యవహారం ఎప్పుడూ విచిత్రంగా ఉండేది నాకు.
మా ఇద్దరికీ ఎప్పుడూ పడేది కాదు. ఎప్పుడూ మెడలు పట్టుకుని నేలమీదపడి దొర్లుకుంటూ కొట్టుకునేవాళ్ళం.
వాడు నన్ను లెక్కచేసేవాడు కాదు. వాడి స్నేహితులతో ఆడనిచ్చేవాడు కాదు.
వాడిదంతా వేరే తరహా.
ఒకరోజు వాడూ నేనూ మాచర్ల చెన్నకేశవస్వామి తిరునాళ్ళకి వెళ్ళాం. ‘జనం తోపులాట ఎక్కువుంటది, జాగ్రత్తగా వెళ్ళిరండి’ అని ఇంట్లోవాళ్ళు చెప్పి పంపించారు. రైలు పట్టాల దగ్గరనుంచి గడియారం స్థంభం దాకా విపరీతమైన జనం. మెయిన్‌రోడ్డు నుంచి అన్ని బజార్లూ జనంతో నిండిపోయాయి. దారులన్నీ తెలిసినవేకాబట్టి తప్పిపోయినా ఇంటికి తిరిగిరావచ్చు. అనుకున్నట్టే గడియారపు స్థంభం దగ్గర మేమిద్దరం తప్పిపోయాం. వాడు కనిపిస్తాడేమోనని ఒక ఇంటి ఎత్తైన ప్రహరీగోడ ఎక్కిచూసాను. కనుచూపుమేరలో వాడెక్కడా లేడు. రధయాత్ర చూద్దామని జనం కాళ్ళమధ్య నుంచి తోసుకుంటూ గుడిదాకా వెళ్ళాను. చెన్నకేశవుడ్ని రధం ఎక్కిస్తున్నారు. బలిష్టమైన మనుషులు పెద్ద లావుపాటి గొలుసులు సరిచూసుకుంటున్నారు. కిక్కిరిసిన జనసందోహం. ఆ తోపులాటలో అరుపులు, కేకలు. మరోవైపు గాలిలో వెలుతురు హారతులు. తొక్కిసలాటలో నన్ను మళ్ళీ వెనక్కి నెట్టేసారు. ఇక రధయాత్ర చూడ్డం కష్టమని ఎలాగోలా జనంలోంచి బయటపడి ఇంటిదారి పట్టాను.
రైలుకట్ట దాటాక వాడు కనిపించాడు. చేతిలో చిన్న అట్టపెట్టె. అందులో ఏదో బొమ్మ ఉంది.
ఇద్దరం ఇంటికి వచ్చి ఎవరూ చూడకుండా మూలగదిలోకి వెళ్ళి ఆ పెట్టె తెరిచాం.
అదొక మీట నొక్కితే డోలు వాయించే విదూషకుడి రంగుల బొమ్మ. మా ఇంట్లో వస్తువులతో పోల్చితే ఆ రంగుల బొమ్మ చాలా ఖరీదైనదనిపించింది. దాని కొత్తదనాన్ని చూసి నాకు భయమేసింది. ఆ వంట గది మసక చీకట్లో మురికి గోడల మధ్య ఇమడని వస్తువులా అనిపించింది.
వాడు దాన్ని ఒకసారి కీ ఇచ్చి నేలమీద వదిలాడు.
అది ‘‘ట్రింగ్.. ట్రింగ్…’’ అని నేలమీదే గుండ్రంగా తిరుగుతూ డోలు కొట్టడం మొదలెట్టింది. ఆ చప్పుడికి ఇంట్లోవాళ్ళు ఎవరైనా వస్తారేమోనిని వాడు గభాల్న దాన్ని నొక్కేసాడు.
‘‘ఇది కొనడానికి డబ్బులు ఎక్కడివిరా?’’ అనడిగాను.
వాడు సమాధానం చెప్పలేదు. ఆ బొమ్మని వాడు ఇంట్లోవాళ్ళకి చూపించలేదు. బొమ్మని వంటగదిలో మా అమ్మగారు బట్టలు పెట్టుకునే ట్రంకు పెట్లెలో దాచిపెట్టి ఇంటి వెనకాలనుంచి బయటికి వెళ్ళిపోయాడు.
నేను ముందుగదిలోకి వచ్చి చూస్తే ముందు గదిలో పెద్దన్నయ్య స్నేహితుడు సుందర్రావు నిలబడి శ్రీశ్రీ మహాప్రస్థానం పైకి చదువుతున్నాడు. అతడికి ఎదురుగా పెద్దన్నయ్య కిటికీ అరుగుమీద కూర్చుని బయటికి చూస్తూ ఆసక్తిగా వింటున్నాడు.
‘‘…….పుష్కిన్, గోగోల్, షెకోవ్ టాల్‌స్టాయ్
దోస్తయెవ్‌స్కీ గోర్కీ కూప్రిన్
శిల్ప సామ్రాట్టులై జీవితం మధియించి
పాప పంకం నుండి పద్మాలు పుట్టించి
కార్మిక స్వర్గాన్ని కలగన్న రష్యా!
రష్యా! రష్యా! రష్యా! నా రష్యా!..’’
అప్పటికి గోర్కీ పేరు తెలిసినా టాల్‌స్టాయ్, దోస్తయెవ్‌స్కీ లాంటివి తెలియడం సంగతి తరవాత, నా వయసుకి పలకడానికి కూడా పెద్ద పేర్లు.
ఆ రోజుల్లోనే పెద్దన్నయ్యకి స్టాఫ్ సెలక్షన్ కమీషన్‌లో సెలక్టయినట్లు లెటర్ వచ్చింది. సెంట్రల్ సర్వీసులో ఉద్యోగంవచ్చి గుంటూరు వెళ్ళిపోయాడు.
అలా ఇద్దరన్నయ్యలూ ఉద్యోగాలొచ్చి వెళ్ళిపోయాక ఇంట్లో మిగిలింది అమ్మానాన్న కాక ఇద్దరు అక్కలు, నేనూ హరి.
నేను ఆరవ తరగతినుండి ఏడవ తరగతికి మారుతున్నప్పుడు మా నాన్న గారికి మాచర్ల నుంచి ప్రకాశం జిల్లా అద్దంకి ట్రాన్స్‌ఫర్ అయింది. తెలిసీ తెలియని చిన్ననాటి జ్ఞాపకాలనుండి బయటి ప్రపంచపు ఎరుక కలిగే వయసు. అప్పటిదాకా మాచర్ల తప్పితే బయటి ప్రపంచం ఒకటుంటుందని తెలీదు నాకు.
***
ఊహ తెలిసిన దగ్గరనుండి మాచర్ల వాతావరణానికి అలవాటు పడిన నేను బయటి ప్రపంచం అంటూ ఎరుగను. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి మాచర్ల నుంచి రైలులో గుంటూరులో మా అమ్మమ్మ దగ్గరకి వెళ్ళడం తప్పిస్తే ఊరు దాటింది లేదు. అలా ఆరవతరగతిలో ఉండగా అద్దంకి వచ్చిన నేను మళ్ళీ వెనక్కితిరిగి ఎప్పటికైనా మాచర్ల వెళ్ళిపోతాను అనే ఊహలోనే ఉండేవాడిని. ఆ దిగులు కొన్ని సంవత్సరాలపాటు నాలో ఉండిపోయి నేనొక ఎదగని పిల్లవాడిలా ఉండిపోయాను. ఎప్పుడూ నేను తిరిగిన చెట్లు, చేలు, మాచర్లలో మేమున్న ఆ మూడు గదుల ఇల్లు, అక్కడ గాలిలో వీచే దిరిశెన పూల వాసన, వేశవికాలంలో ఎండలో తళతళమని గాలికి ఊగే దిరిశెన కాయలు, ఐదో తరగతిదాకా నేను చదివిన రేకుల షెడ్డు స్కూలు పదేపదే గుర్తుకొస్తుండేవి. ఆకుపచ్చని సాయంకాలాలు ఎర్రటి పూలుండే గుల్‌మొహర్ చెట్లమీద వాలే రామచిలకల అరుపులు నిద్రలో కల్లోలం రేపేవి. అలా మాచర్లని మరిచిపోడానికి చాలాకాలమే పట్టింది.
క్లాసులో హరి నాకంటే మూడు తరగతులు ముందు. నేను ఆరవతరగతిలో ఉన్నప్పుడు వాడు హైస్కూలులో తొమ్మిది చదివేవాడు. మేమిద్దరం ఒకే స్కూలులో చదివినా ఇద్దరం ఒకేసారి చదవలేదు. నేను హైస్కూలులో ఎనిమిదో తరగతికి వచ్చేసరికి వాడు ఇంటర్ చదవటానికి జూనియర్ కాలేజీకి వెళ్ళిపోయాడు.
ఎనిమిదో తరగతిలో హైస్కూలులో చేరినప్పుడు మొదటిరోజు హిందీమాష్టరు పుస్తకం చూసి హిందీ చదవలగలిగేవాళ్ళందర్నీ ఒక్కొక్కరినే చదివిస్తా ముందువరుసలో కూర్చోపెడుతూ వచ్చాడు. నేను వచ్చీరాని హిందీ చదవడంమూలాన రెండోవరసలో చేరాను. అప్పటికే అక్కడ కూర్చున్న కాకుమాని శ్రీనివాసరావు ‘‘రా.. ఇలా కూర్చో’’ అని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అలా పరిచయమైన శ్రీనివాసరావు ఇప్పటికీ నన్ను విడిచిపోలేదు.
అప్పటికే నాకు ఇంట్లో చందమామ చదివే అలవాటు ఉండటం వలన ఆ పత్రిక చదివే శ్రీనివాసరావు మరింత దగ్గరయ్యాడు. ఇద్దరం చందమామనే కాక ఆరోజుల్లో వచ్చే బాలజ్యోతి, బాలమిత్ర కూడా కొనుక్కుని చదివేవాళ్ళం. క్రమంగా మా పఠనం పత్రికలనుంచి చిన్నసైజు జానపద నవలలు, పాకెట్ పుస్తకాల వరకు పెరిగింది. కొన్ని రోజులు డిటెక్టివ్ పుస్తకాలు చదివినా అద్దంకిలో శాఖాగ్రంధాలయం మూలాన మా ఇద్దరి అలవాటు బాలల జానపద సాహిత్యం నుంచి విపుల మాసపత్రికలోని అనువాద కథలు చదవటానికి విస్తరించింది. మా ఊహలు పుస్తకాల నుంచి కవిత్వం గాలిలోకి ఎగరనారంభించాయి. నేను నగ్నముని కొయ్యగుర్రం బట్టీపడితే వాడు ఇస్మాయిల్ చెట్టు కవిత్వంవైపు మళ్ళాడు.
ఒకసారి నేనూ శ్రీనివాసరావూ ఏదో కథ గురించి మాట్లాడుకుంటుంటే పడక కుర్చీలో కూర్చుని వింటున్న మా నాన్నగారు విని ‘‘రాతిప్రదేశంనుంచి ఊరిన ఊటనీరు చాలా తియ్యగా ఉంటుంది. జీవితం అనేది రాతి అంత కఠోరమైనది. అలాగే జీవితం నుంచి పుట్టిన సాహిత్యం కూడా అంతే తియ్యగా ఉంటుంది.’’ అని చెప్పారు. ఆయన కుర్చీకి పక్కనే మొకాళ్ళమీద చేతులానించి నిలబడి ఆయన నల్లఫ్రేము కళ్ళద్దాలతో ఏదో చదువుకుంటూ చల్లని నీడలో చెప్పిన ఆ మాటలు నా మనసులో ముద్రించుకుపోయాయి.
నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఒకరోజు మానాన్నగారు మా హరన్నయ్యకు పోస్టులో ఏదో పుస్తకం వచ్చిందని ఆఫీసునుంచి ఇంటికి కవరు తీసుకువచ్చారు. ఇంట్లోవాళ్ళకి పోస్టులో వచ్చే కవర్లు ఆయన తెరిచి చూడరు. మావాడు కవరు తెరిచి చూస్తే అది ఏదో మాసపత్రిక. అందులో వాడు రాసిన కథ పడిరది. కథ పేరు ‘వేట’. బి.హరి ప్రసాద్ అన్న పేరు కింద తుపాకీ పట్టుకున్న మనిషి బొమ్మ వేశారు. ఇంటికి పత్రిక వచ్చేంత వరకూ వాడు కథ రాసాడని ఎవరికీ తెలియదు. ఆ ఒక్క కథతో వాడు మా ఇంట్లోనేగాక వీథిలో కూడా ఒక మహారచయిత అయిపోయాడు. ఇంటిల్లిపాదీ ఆనందం పడ్డారు. మా నాన్నగారు కథ చదివి ‘‘కథ బాగానే ఉంది’’ అని కాంప్లిమెంటు ఇచ్చారు. ఒకరి తరవాత ఒకరు పోటీపడి కథ చదివాం. ఆరోజుల్లో పత్రికలో వాడి పేరు చూడటం వింతగా అనిపించింది.
వాడు అప్పటికప్పుడు తన నోటుపుస్తకాలలోని ఖాళీ పేజీలని చించి కథలు రాయడానికని ఒక కొత్త పుస్తకం కుట్టుకున్నాడు. ఆ తరవాత ఒకటిరెండు కథలు రాసాడుగాని అవేవీ పత్రికల్లో పడలేదు.
ఆ తరవాత వాడు కథలు రాయటం మానేసి క్రికెట్ మీద ఆసక్తి పెంచుకుని రెండుమూడు సార్లు సప్లిమెంటరీ పరీక్షలు రాసి అతి కష్టం మీద ఇంటరు పూర్తి చేసాడు.
ఆ తరవాత పెద్దక్కకి పెళ్ళయిపోయి చిన్నక్క డిగ్రీ చదువుకోసం గుంటూరు వెళ్ళిపోవడంతో ఇంట్లో అమ్మానాన్న వాడూ నేనూ మిగిలాము. వాడెప్పుడూ ఫ్రెండ్సనీ, ఆటలనీ బయట తిరుగుతుండేవాడు. పెద్దన్నయ్య ఎప్పడన్నా శని ఆదివారాలు గుంటూరునుండి అద్దంకి వచ్చేవాడు. రెండో అన్నయ్యకి సంవత్సరానికి రెండునెలలు సెలవులు. ఇంటికి ఒకరొస్తే ఒకరుండరు. ఇంట్లో పండగలు, పూజలు సెంటిమెంట్లు ఎప్పుడో పోయాయి. సంవత్సరంలో అందరం కలిసేది చాలా తక్కువ. ఇంట్లో మిగిలింది నేనొక్కడినే. ఆదివారాలు మధ్యాహ్నం పూట బ్లాక్ ఎండ్ వైట్ టీవీ దూరదర్శన్‌లో ఇండియన్ రీజనల్ సినిమా ఒక్కడ్నే చూస్తుండేవాడ్ని. అదయ్యాక మూడుగంటలకు రేడియోలో ఆకాశవాణి నాటకం. పెద్దన్నయ్య, చిన్నన్నయ్య లేకపోవడం చేత ఇంట్లో ఆదివారాల సందడి తగ్గిపోయింది.
వయసు ఎదుగుదలతోపాటు ఎవరికివారు వేరువేరు ఊళ్ళలో ఉద్యోగాలు చేస్తూ ఒంటరిగా ఉండటం చేత అందరికీ స్వంత అభిప్రాయాలు, వ్యక్తిత్వాలు ఏర్పడ్డాయి.
పెద్దన్నయ్య గుంటూరులో ఉండటం మూలాన ఎప్పుడన్నా అద్దంకి వచ్చేటప్పుడు సృజన, అరుణతార పత్రికలు తెచ్చేవాడు. మా ఇంట్లో గోర్కీ పుస్తకాల అనంతరం చాలారోజులకు కొడవటిగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథశాస్త్రి, మిహయిల్ షోలఖోవ్, చేగువేరా పుస్తకాలు చేరాయి.
అలాంటి రోజుల్లో ఒకసారి గుంటూరు నుంచి పెద్దన్నయ్య, తేజ్‌పూర్ నుంచి చిన్నన్నయ్య వచ్చారు.
వాళ్ళిద్దరి మధ్య ఉండే కొద్దిపాటి మాటలుకూడా తగ్గాయి. ఇంట్లో ఉన్నంతసేపు ముభావంగా ఉండేవారు.
వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండగానే ఆ ఆదివారం మధ్నాహ్నం దూరదర్శన్‌లో అదూర్ గోపాలకృష్ణన్ ‘ముఖాముఖం’ మళయాళ సినిమా సినిమా వచ్చింది. చాలాకాలం తరవాత ఇద్దరూ ఇంట్లో కూర్చుని ఆ సినిమా చూసారు.
ఒకరకంగా ఆ సినిమా కమ్యూనిస్ట్ పార్టీమీద పెట్టిన ఒక విమర్శ. సినిమా. మొత్తం శ్రీధరన్ అనే ట్రేడ్ యూనియన్ లీడర్ చుట్టూ తిరుగుతుంది. కమ్యూనిస్టు పార్టీలో చురుకుగా ఉండే శ్రీధరన్ ఫాక్టరీ యజమాని హత్యకి గురికావడంతో అండర్‌గ్రౌండ్‌కి వెళ్ళిపోతాడు. చాలామంది అతడు చనిపోయాడనే అనుకుంటారు.
శ్రీధరన్ జైలునుంచి బయటికి వచ్చాక బయట పరిస్థితులన్నీ మారిపోతాయి. పార్టీ చెప్పేదానికీ చేసేదానికీ పొంతన ఉండదు. సిద్ధాంతాన్ని జీర్ణించుకున్నవాళ్ళు, పార్టీని నమ్ముకున్నవాళ్ళు గందరగోళంలో కొట్టుమిట్టులాడుతుంటారు. విచిత్రం ఏమంటే జైలునుంచి బయటికి వచ్చిన శ్రీధరన్ ఎవరితో మాట్లాడకుండా ఊరికే నిద్రపోతూ ఉంటాడు. ఎవరేమి మాట్లాడిరచినా సమాధానం చెప్పడు. వింటూనే అలా నిద్రపోతుంటాడు. అతడికి అతినిద్రవ్యాధి పట్టుకున్నట్లుంటుంది. చివరికి ఇంట్లో డబ్బు దొంగతనం చేసి తాగడం కూడా మొదలుపెడతాడు.
మొదటినుంచి శ్రీధరన్ ద్వారా పార్టీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్న సుధాకరన్ అనే వ్యక్తి పార్టీ విధానాలతో విసిగి తన గోడు ఎవరికి వెళ్ళబోసుకోవాలో తెలియక శ్రీధరన్ ఎందుకు ఊరికే నిద్రపోతున్నాడో, ఎందుకు పట్టించుకోడో ఎంతకీ అర్థం కాక సతమతమౌతుంటాడు.
చివరికి సుధాకరన్‌ని పార్టీ బహిష్కరిస్తుంది. శ్రీధరన్ చేతికి ఒక స్టేట్‌మెంట్ ఇచ్చి సంతకం పెట్టమని అడుగుతారు. శ్రీధరన్ సమాధానం చెప్పకుండా కూర్చుండిపోతాడు. ఆ రాత్రి శ్రీధరన్ హత్య చేయబడతాడు.
చివరికి వీధుల్లో పార్టీ కార్యకర్తలు జెండాలు పట్టుకుని ఊరేగుతూ ‘‘లాంగ్‌లివ్ శ్రీధరన్’’, ‘‘కార్మికుల ఐక్కత వర్థిల్లాలి’’ లాంటి నినాదాలతో సినిమా ముగుస్తుంది.
ఈ సినిమా చిన్నన్నయ్యకి ఎందుకో బాగా నచ్చింది.
అందరం సినిమా చూస్తుండగానే అతడు ‘‘ఈ శ్రీధరన్ అంటే ఎవరో కాదు.. కమ్యూనిస్ట్ పార్టీనే’’ అన్నాడు.
‘‘ఎందుకలా అనిపించింది నీకు?’’ అన్నాడు పెద్దన్నయ్య.
‘‘కమ్యూనిస్ట్ పార్టీ ఆత్మవిమర్శని విస్మరించింది. దానికి అదూర్ గోపాలకృష్ణన్ శ్రీధరన్ అతినిద్రని దాని పతనానికి మెటాఫర్‌లా వాడాడు.. చూస్తుంటే ఎవరికైనా తేలిగ్గా అర్థమయిపోతుంది’’ అన్నాడు.
పెద్దన్నయ్య కాసేపు మౌనంగా ఉండిపోయాడు.
సినిమా అయ్యిక వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైన వాదులాట జరిగింది. అప్పుడే లోపలి గదిలోంచి బయటికి వచ్చిన మానాన్నగారు ‘ఎందుకీ గొడవ ఎప్పుడూ మీకిద్దరికీ?’ అని ఇద్దర్నీ కలిపి తిట్టారు.
ఆయన అవతలికి వెళ్ళాక ‘‘నీవు నైతికంగా దిగజారిన మనిషివి. అన్నీ నీకు అలాగే అనిపిస్తాయి’’ అన్నాడు పెద్దన్నయ్య.
చిన్నన్నయ్య దుందుడుకుగా ముందుకు రాబోయాడు. అప్పుడే లోపలికి వెళ్ళిన నాన్నగారు మళ్ళీ ఏదో పనిమీద ముందుగదిలోకి వచ్చి ‘‘ఏమిట్రా మీ గొడవ’’ అని కోపంగా వాళ్ళవంక చూడకపోయుంటే ఆరోజు పెద్ద గొడవే అయ్యేది.
చిన్నన్నయ్య కోపాన్ని అణుచుకుంటూ బయటికెళ్ళిపోయాడు.
రాత్రి పదిగంటలకు గుంటూరు వెళ్ళాల్సిన పెద్దన్నయ్య బ్యాగుతీసుకుని నాలుగు గంటలకే బస్టాండుకు బయటలుదేరాడు.
ఆ మధ్యాహ్నం మేం రేడియో నాటకం వినలేదు.
ఆ తరవాత వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేనెప్పడూ చూడలేదు.
ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం తరవాత కృష్ణన్నయ్య బొమ్మలేయడం మానేసాడు. తను రాసే ‘అడవిలో పిల్లవాడు’ నవల ఎక్కడో పోయింది. ఇంట్లో ఎంత వెతికినా నాకు కనబడలేదు.
***
ఇంట్లో ఒకరితరవాత ఒకరు కాలేజీ చదువులకు వస్తుండటంతో మానాన్నగారు ఎంప్లాయిమెంట్ న్యూస్ తెప్పించేవారు. ఆ రోజుల్లో ఢల్లీి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో (JNU) విదేశీ భాషల్లో ఐదు సంవత్సరాల ఎమ్.ఏ. కోర్సు ఉండేది. ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఆ కోర్సుకు సంబంధించిన నోటిఫికేషన్ పడిరది. దాని ప్రకారం యూనివర్శిటి ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, జపనీస్ భాషలను నేర్చుకోడానికి ఆ కోర్సులో చేరొచ్చు.
ఊరికే ప్రయత్నించి చూద్దామని పెద్దన్నయ్య అప్లికేషన్ తెప్పించి హరి చేత అప్లై చేయించాడు. ఎంట్రన్స్ పరీక్ష రాసిన కొన్నాళ్ళకు హరి సెలక్టయినట్లు యూనివర్శిటీనుంచి ఉత్తరం వచ్చింది. పెద్దన్నయ్య రష్యన్ లాంగ్వేజి తీసుకోమని పట్టుబట్టాడు. తనకి కమ్యూనిస్ట్ సోవియట్ రష్యా అంటే ఇష్టం.
అన్నయ్య చెప్పినట్లే హరి ఎం.ఏ. లో రష్యన్ లాంగ్వేజి, లిటరేచర్ తీసుకుని తొందరలోనే వాడు అడ్మిషన్ లెటర్ తీసుకుని ఢల్లీి వెళ్ళిపోయాడు.
ఇంటర్మీడియట్‌దాకా అంతంత మాత్రమే ఉండే వాడి చదువు ఢల్లీిలో యూనివర్శిటీలో చేరాక చాలా మారిపోయింది. క్లాసులో వాడే మెరిట్ స్టూడెంట్. వాడికి రష్యన్ చెప్పే ప్రొఫెసర్స్ బాగా దగ్గరయ్యారు.
యూనివర్శిటీలో మొదటి సంవత్సరం పూర్తయ్యాక డిల్లీలో సోవియట్ రష్యా ఎంబసీ వాళ్ళు రష్యన్ చదివే కొంతమంది విద్యార్ధులని ఎంపిక చేసి మాస్కో తీసుకెళ్ళడానికి యునివర్శిటీతో చర్చలు జరుపుతున్నారని ఆ లిస్టులో హరి పేరు కూడా ఉందని తెలిసింది. ఈ విషయం తెలియగానే ఇంట్లో సంతోషపడ్డారు.
‘మనవాడు కమ్యూనిస్టు రష్యాకి వెళ్ళబోతున్నాడ’ని పెద్దన్నయ్య సంబరపడ్డాడు.
వాడు మాస్కో వెళ్ళిన వారానికి వాడినుంచి మరొక ఉత్తరం వచ్చింది. వాళ్ళంతా మాస్కో వెళ్ళాక అక్కడనుంచి కొంతమంది విద్యార్థులని మళ్ళీ ఎంపికచేసి సోవియట్ రిపబ్లిక్స్‌లోని రకరకాల యూనివర్శిటీలకి పంపించారట. అందులో భాగంగా వాడిని యుక్రెయిన్ రిపబ్లిక్ రాజధాని కీవ్ యూనివర్శిటీకి పంపించారంట. వాడు కీవ్ నుంచే ఉత్తరం రాశాడు.
కొంతకాలం తరవాత పోస్టులో మాకు కీవ్ యూనివర్శిటీ ఫొటోలు వచ్చాయి. మా నాన్నగారు ఆ ఫొటోలు ఒక్కొక్కటి తీసి చూపిస్తున్నప్పుడు మేము ఆత్రంగా చూసాము. నావరకు నాకు కనీవినీ ఎరుగని ఒక సుదూర నగరంలో తీసిన ఆ ఫొటోలని చూడటమే ఒక వింత. ఫొటోలో వాడు ఒక బజారులో మనుషుల గుంపు మధ్య నిలబడి ఉన్నాడు. పైనంతా ఆకాశం మబ్బు పట్టినట్లుంది. అందులో కనిపించే మనుషులందరూ చలికోట్లు వేసుకుని నెత్తిమీద మందపాటి టోపీలు పెట్టుకున్నారు. మందపాటి ఆ కాగితపు ఫోటోలని పట్టుకుని చూడటమే అపురూపంగా అనిపించింది. అప్పటినుంచి నాకు పోస్టులో సోవియిట్ స్టాంపులు, పోస్టుకార్డు సైజులో ఉండే పుష్కిన్ పెయింటింగ్స్ ఉన్న గ్రీటింగ్ కార్డులు వచ్చేవి. అవి నా ఫ్రెండ్స్‌కి చూపించి గొప్పగా ఫీలయ్యేవాడిని.
నా స్నేహితులు ‘‘మీ ‘రష్యా అన్నయ్య’ ఏం చేస్తున్నాడని’’ అడిగేవారు. అదేదో నేనే రష్యా వెళ్చొన్నట్లుగా చూసేవాళ్ళు. అమెరికా వెళ్ళినవాళ్ళ ఆచూకి తెలిసినంత తేలిగ్గా ఇతర దేశాలకు వెళ్ళినవాళ్ళ గురించి తెలియదు. నా స్నేహితులకు ఏం చెప్పాలో నాకేం తోచేది కాదు. ఆ రోజుల్లోనే చిన్నప్పుడు చూసిన గోర్కీ ‘అమ్మ’ నవల పూర్తి చేసాను. గోర్కీ నవలలకంటే ఆయన రాసిన ఆటోబయోగ్రఫీ, కథలు నాకు బాగా అనిపించాయి.
ఆ మధ్యకాలంలో అద్దంకి గుంటూరు రెండుమూడు సార్లు తిరగాల్సి వచ్చింది. అలా ఒకసారి గుంటూరులో పెద్దక్కయ్య వాళ్ళింటికి ఇంటికెళ్తే పెద్దన్నయ్య అక్కడే ఉన్నాడు. ఆయనతోపాటు ఇంకెవరో ఉన్నారు.
నేను వెళ్ళగానే అన్నయ్య లోపలికి పిలిచి ‘‘చిన్నా.. ఈవిడేరా మీ ఒదిన’’ అన్నాడు.
నేను ఆమెవంక చూసి ‘‘సరే.. అవునా’’ అన్నాను. అంతకంటే ఎక్కువ ఆవిడతో మాట్లాడలేదు. నేనెప్పడూ ఆవిడని ఒదినా అని కూడా పిలిచింది లేదు. అలా అని అగౌరవం ఏమీ లేదు. కొందరంతే. అందులో నేనూను.
వాళ్ళది ప్రేమ వివాహం కాదు. కులాంతర వివాహం. ఆయనకి ఆవిడ ఎవరి ద్వారానో పరిచయం. ఆవిడకి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగం. పెళ్ళయ్యాక వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు.
నా ఇంటర్ పూర్తయ్యాక చదువు సజావుగా సాగలేదు. నేను చీరాల కాలేజీలో బి.యస్సీ చదువుతానని గొడవపెట్టాను. కనీసం ఒంగోలులోనైనా చదువుతానని పట్టుబట్టాను. మా ఇంట్లోవాళ్ళు అద్దంకి దగ్గర శింగరకొండ డిగ్రీకాలేజీలో చదివితే బి.ఏ. చదువు లేదంటే ఇంతటితో ఆపేసేయ్యమని చెప్పారు. నేను అలిగి ఏదీ చేరకుండా కొంతకాలం నాగార్జునా యూనివర్శిటీలో ప్రైవేటుగా బి.ఏ.ఫిలాసఫీ కట్టి ఒక సంవత్సరం మాత్రమే చదివాను. ఆలోపు టైపు లోయర్ పూర్తిచేసి షార్టుహాండులో జాయినయ్యాను.
దాదాపు తొంభైయవ దశకమంతా నా జీవితమంతా ఆటుపోట్లతో అతలాకుతలమైపోయింది. మానాన్నగారికి అద్దంకినుంచి కృష్ణాజిల్లా గుడ్లవల్లేరుకి బదిలీ కావడంతో ఇష్టంలేకున్నా అద్దంకిని విడిచిపెట్టాల్సోచ్చింది. మొదట్నుంచి విశాలమయిన గవర్నమెంటు క్వార్టర్స్‌లో పెరిగిన మేము గుడ్లవల్లేరులో బజారులో ఇరుకిరుకు ఇళ్ళ మధ్య ఉండాల్సొచ్చింది. అక్కడ ఉండగానే షార్టుహ్యాండు లోయరు పాసయ్యాను.
ఇంతలో సోవియట్ రష్యాలో గోర్బచెవ్ అధికారంలో పెరిస్త్రోయికా, గ్లాస్త్‌వోస్త్ సంస్కరణల మూలంగా చాలా మార్పులు మొదలయ్యాయి. తూర్పు యూరప్‌లో, సోవియట్ యూనియన్‌లో జరుగుతున్న పరిణామాలను చూసి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిష్టులు నివ్వెరపోతున్న కాలం.
1990 ఆగష్టులో యుక్రేయిన్‌లో లెనిన్ విగ్రహాన్ని క్రేన్లతో కూల్చివేయడాన్ని టీవీలో మేమందరం చూస్తుండిపోయాం.
చరిత్ర గమనం ఎవరి చేతుల్లోనూ లేదంటాడు టాల్‌స్టాయ్ యుద్ధము`శాంతి నవలలో. ‘చరిత్ర తన దారిన తను పోతూ ఉంది. మానవ స్పందనలతో దానికి పనిలేదు. ఆర్థిక, రాజకీయ భౌగోళిక శాస్త్రాల ధర్మాలతో అన్వయించడం చరిత్ర ధర్మాలకు విరుద్ధం’ అంటాడాయన.
1991 క్రిస్‌మస్ తరువాత రిపబ్లిక్కులు స్వతంత్రం ప్రకటించుకోవడంతో సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది. సోవియట్ రిపబ్లిక్కులు వరసగా స్వతంత్రం ప్రకటించుకున్నాయి. కీవ్ రాజధానిగా యుక్రేయిన్ స్వతంత్ర దేశమయింది.
సోవియట్ యూనియన్ పతనం తరవాత పెద్దన్నయ్యలో చాలా మార్పు వచ్చింది. వయసులో ఉన్నప్పుడు ఉవ్వెత్తున లేచిన ఆశయాలు కొంత వయసయ్యాక ఉడిగిపోతాయి. తను చదివిన పుస్తకాలు, సాహిత్యం కంటే చిన్నతనం నుంచి తను చూసిన పేదరికం ఆయన్ని బాగా ప్రభావితం చేసుండవచ్చు. ఆ పేదరికం మీద ఆయన పగ తీర్చుకోవడం మొదలుపెట్టాడు. పెద్దన్నయ్య కాలేజీ స్నేహితుడు సుందర్రావు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
ఆరోజుల్లోనే నా చేతికి టాల్‌స్టాయ్ పుస్తకాలు చేతికి వచ్చాయి. ముందుగా కథలు కాకుండా ఆయన రాసిన నవల ‘అన్నా కెరినినా’ మొదలు పెట్టాను. టాల్‌స్టాయ్ అర్థం చేసుకున్న జీవితం సమగ్రం, సంపూర్ణం అనిపించింది. ఆ నవలలో లెవిన్ అనే పాత్ర ద్వారా జీవిత సారాంశాన్ని చూపడానికి ప్రయత్నించాడని అనిపించింది. ఆయన రచనలు రూపపరంగా కళాత్మకంగా, సారంశంలో ఆధ్మాత్మికం అనిపించాయి.
క్రమంగా గోర్కీ కనుమరుగవుతూ టాల్‌స్టాయ్ ముందుకు వచ్చాడు. చెట్టు కొమ్మలు పెరిగి విశాలమయి ఆకాశంలోకి చొచ్చుకుపోయినట్లుగా జీవితం రకరకాల కోణాలలో విశాలమవుతూ వుంది. ఆ తరవాత ‘ఇవాన్ ఇల్యీచ్ మరణం’, ‘విందు నాట్యం తరువాత’ కథలు చదివాక మరణంలోంచి చూస్తే మానవ జీవితానికుండే పరిమితులు, ఉనికిలోంచి చూస్తే ప్రకృతిలో కనిపించే అనంతత్వం మరికాస్త అవతగతమయ్యాయి.
హరి కీవ్ వెళ్ళిన నాలుగేళ్ళకు మా రెండో అన్నయ్య పెళ్ళి కుదిరింది. పెళ్ళిపనులకు అంతా నేనే తిరగాల్సి వచ్చింది. ఇంతలో అందిన మరో శుభవార్త. కీవ్ నుండి మా హరి పెళ్ళికి ఇండియా వస్తున్నట్టు కబురు చేసాడు. ఇంట్లో చిన్నన్నయ్య పెళ్ళి, పాతరోజుల్లోలాగా అందరం మళ్ళీ ఒకచోట కలవబోవడం, జీవితం అందంగా, నిండుగా కనిపించింది. సంపూర్ణతనిచ్చేదేదో అర్థమవుతున్నట్లు, ఇంకాస్త తెలుస్తున్నట్లు అనిపించింది. ఇదంతా చూసాక టాల్‌స్టాయ్ మరింత దగ్గరగా అనిపించాడు.
ఒకపక్క ఇల్లంతా పెళ్ళి హడావుడి. మరోపక్క మాస్కోనుంచి ఢల్లీిదాకా హరి ప్రయాణం. తీరా వాడు డిల్లీ దాకా వచ్చాక దేశమంతటా భారత్‌బంద్ మొదలైంది. వాడు ఏదోరకంగా డిల్లీలోనే ఫ్లైట్ పట్టుకుని హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ నుండి కార్లో గుడ్లవల్లేరు ప్రయాణం. పెద్దన్నయ్య విజయవాడదాకా ఏదోరకంగా వెళ్ళి వాడితోపాటు కారులో వచ్చాడు.
దాదాపు ఏడెనిమిదేళ్ళ తరవాత వాడిని చూడటం. పూర్తిగా సన్నగా అయిపోయాడు. కొత్తగా మీసాలు తీసే అలవాటు వచ్చింది.
పెద్దన్నయ్య వాడు వచ్చినరోజు రాత్రి ముందుగదిలో చాప మీద పడుకుని కుళ్ళికుళ్ళి ఏడవటం చూసాను. తెలిసిందేమంటే హరి కీవ్ యూనివర్శిటీలో వాడి జునియర్ అమ్మాయినెవరో ప్రేమించాడు. ఇక్కడ పెళ్ళయిపోగానే వాడు తిరిగి యుక్రేయిన్ వెళ్ళిపోవాలి. వెళ్ళిన తరువాత వాడిక ఇండియా రాడు. అందుకనే పెద్దన్నయ్య బాధపడుతున్నాడు.
వాడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడని తెలుసుకున్న మా నాన్నగారు ‘‘చదువుకోడానికని వెళ్లినవాడివి, నువ్వు చేయాల్సిందేమిటి చేస్తున్నదేమిటి? ఏమిట్రా ఇదంతా? ’’ అని కోపగించుకున్నారు. అప్పటికి ఆయనకి వాడి ప్రేమ విషయం తెలియదు.
వాడు ఆయన మాటలు విననట్టు సమాధానం చెప్పలేదు.
‘‘మరి అక్కడే ఉండిపోతావా? ఇక్కడికి రావా?’’
‘‘………… ’’
‘‘అక్కడే ఉండిపోవాలనుకున్నవాడివి ఎందుకొచ్చావు? రాకుండా అక్కడే ఉండాల్సింది. ఇక మాతో ఏంపని?’’ అని మానాన్నగారు విసురుగా కోపంతో బయటికి వెళ్ళిపోయారు. మా అమ్మగారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.
ఆ పూట మా అందర్నీ కూర్చోబెట్టి వాడు చెప్పిన విషయం ఏమంటే వాడు పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి పేరు విక్టోరియా పాపనోవా. యూనివర్శిటీలో వాడికి జూనియరు. ఆమె గురించి ఇంట్లోవాళ్ళకు చెప్పేటప్పుడు ‘వికా’ అని చెప్పేవాడు. వాళ్ళుండేది కీవ్‌కి దూరంగావున్న క్రెమ్నెన్‌స్కీ (Khemelnitsky) అనే ఒక టౌను. ఆమెకి తండ్రి లేడు, తల్లికి ఉంది. ఆ ముసలావిడకు కొంత గవర్నమెంటు పెన్షను వస్తుంది. దానిమీదే వాళ్ళ కుటుంబం గడవడం.
చిన్నన్నయ్య పెళ్ళి తరవాత హరికి చుట్టాలంటూ స్నేహితులంటూ ఊళ్ళు తిరగడమే సరిపోయింది. నాకయితే వాడితో కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడాలనుంది.
నేనెరిగిన గోర్కీ, టాల్‌స్టాయ్ రచనల ప్రస్తావన వాడెప్పుడూ తేలేదు. ఒకసారి నేను ‘టాల్‌స్టాయ్’ అనబోతే అది తప్పన్నట్లు తోలుస్తోయ్ అని సరిచేసాడు. నావంక నవ్వు మొహంతో ఆశ్చర్యంగా చూస్తూ అలెగ్జాండర్ పుష్కిన్ కవిత్వాన్ని చదవడం ఇంకా గొప్ప అనుభవమనీ, దాన్ని రష్యన్ నుంచి ఇంగ్లీషులోకి ట్రాన్స్‌లేట్ చెయ్యడం కష్టమనీ, ఇక ఏ రష్యన్ నవలైనా తెలుగులో కంటే ఇంగ్లీషులో చదవటం మంచిదని చెప్పాడు.
అప్పటికి నేను పుష్కిన్ పేరు వినడమేగాని చదివింది లేదు.
సోవియట్ యూనియన్ కూలిపోవడం గురించి వాడేమైనా చెబుతాడేమోనని చాలాసార్లు అడగటానికి ప్రయత్నించాను. వాడుంటున్న దేశం ఎలా ఉంటుందో, అక్కడ ప్రజలు ఎలా ఉంటారో.. ఇలా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందామని నా కోరిక.
హరి త్వరలోనే యుక్రేయిన్ వెళ్ళిపోయాడు. ఆ తరవాత వాడు యూనివర్శిటీలో ఎప్పుడు చదువు పూర్తిచేసిందీ, ఎప్పుడు విక్టోరియాని పెళ్ళి చేసుకుందీ తెలీదు. కొంత కాలానికి వాడికి కొడుకు పుట్టినట్లు, పిల్లవాడికి ‘విజయ్’ అని పేరు పెట్టినట్లు ఉత్తరం రాశాడు. ఆ తరవాత ఎప్పుడన్నా కీవ్ నుంచి మందపాటి ఉత్తరంతోపాటు పిల్లవాడి ఫొటోలు కూడా వచ్చేవి.
వాడు ఇండియానుంచి తిరిగి యుక్రేయిన్ వెళ్ళిపోయిన రెండు సంవత్సరాలకి మానాన్నగారు గుడ్లవల్లేరులో రిటైరయ్యారు. అక్కడనుంచి ఆయన ఉద్యోగ విరమణ జీవితం మొదలయ్యింది. ఆయన రిటైరవడానికి ముందే హైదరాబాద్ వచ్చేసాను. అక్కడనుంచే నా జీవితంలో గడ్డురోజులు మొదలయ్యాయి. మా అమ్మగారు, నాన్నగారు హైదరాబాద్ వచ్చేసి పెద్దన్నయ్య దగ్గర ఉండటంతో వాళ్ళతో ఉండటం నాకు ఇష్టంలేకుంటయింది.
నేను హైదరాబాద్ వచ్చిన మొదట్లో సెంట్రల్ యూనివర్శిటీ హాస్టల్లో నా స్నేహితుడు కాకుమాని శ్రీనివాసరావు దగ్గర ఉండి అక్కడనుంచి టైపు ఇనిస్టిట్యూట్‌లో జాబ్‌వర్క్ పనిచేయడానికని ప్రతిరోజూ అబిడ్స్ వచ్చేవాడిని. ఆ తరవాత కొంత కాలానికి విద్యానగర్‌లో ఒక లాయరు దగ్గర స్టెనోగా పనిచేస్తూ ఉస్మానియా యూనివర్శిటీ దగ్గర వడ్డెర బస్తీలో గది అద్దెకు తీసుకుని ఉండేవాడిని. ఆ పార్ట్‌టైమ్ ఉద్యోగంలో కూడా కుదరక రామోజీఫిల్మ్ సిటీలో రెండు మూడు నెలలు పనిచేసి అక్కడా ఉండలేక రెండుమూడు ఉద్యోగాల తరవాత ఉప్పల్‌లో గంగప్ప ఇండస్ట్రీస్‌లో చేరేంత వరకూ అన్నీ ఒడిదుడుకుల.ే నా జీవితంలో ఎన్నడూ చూడనన్ని ఆకలి, దారిద్య్రం ఆరోజుల్లోనే అనుభవించాను.
అప్పటికి హరిని చూసి రెండుమూడు సంవత్సరాలు గడిచిపోయాయి. విజయ్ పుట్టిన నాలుగైదేళ్ళకి ఇంకో కొడుకు కూడా పుట్టాడని తెలిసింది. ఆ రెండోవాడి పేరు ‘థియోడర్’ అని పెట్టినట్లు తెలిసింది.
అప్పటికి వాడు ఇండియా నుంచి వెళ్ళిపోయి ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి.
ఆరోజుల్లో ఇండియా నుంచి రష్యాకి వెళ్ళినవారి సంగతేమైనా తెలిసేదేమోగాని యుక్రేయిన్‌లో ఉన్న ఇండియన్స్ గురించి ఆచూకీ అంత తేలిగ్గా తెలిసేది కాదు.
‘పెళ్ళైపోయింది కదా. సంసారంలో పడిపోయి ఇంటికి ఉత్తరం రాయడం మరచిపోయుంటాడ’నుకున్నాం. కనీసం ఫోన్ చేసి మాట్లాడదామన్నా ఆరోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు. మాకు లాండ్‌లైన్ లేదు. మేము చేద్దామనుకున్నా వాడు ఉంటున్న ఇంటికి ఫోన్ ఉందో లేదో తెలీదు. ఉంటే ఎదోరకంగా మాట్లాడకుండా ఎందుకుంటాడు?
ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటే చాలుననుకుంటూ ఉండేవాళ్ళం.
దాదాపు ఆరేడు సంవత్సరాలు వాడి గురించి ఏమీ తెలియకుండానే గడిచిపోయాయి.
2006 ఆగస్టులో మా అమ్మగారు చనిపోయారు. ఒక చీకటిపడుతున్న సాయంత్రం కూర్చున్న మనిషి కూర్చున్నట్లుగానే కన్ను మూసారు.
వాడికి కబురు అందలేదు.
ఆ విషయం చెప్పడానికి మా దగ్గర వాడి అడ్రసూ లేదు. కబురు చెప్పడానికి ఫోనూ లేదు.
వాడు లేకుండానే మా అమ్మగారి అంత్యక్రియలు జరిగిపోయాయి.
***
అప్పటికి వాడిని చూసి పదేళ్ళయింది. ఆఖరుసారి చూసింది 1993 లో.
ఏమయుంటాడు వాడు? ఎక్కడ ఉండి ఉంటాడు? వాడి పిల్లలు ఎలా ఉన్నారు? ఏదన్నా ఉద్యోగం చేస్తున్నాడా? కుటుంబ పోషణ ఎలా జరుగుతా ఉంది వాడికి?
అసలు బతికే ఉన్నాడా?
ఎలా తెలుస్తుంది మాకు?
కొన్ని సంవత్సరాలుగా మా అందరికీ ఇవే ఆలోచనలు. ఇంట్లో తర్జనభర్జనలు.
అప్పటికే ప్రపంచమంతా ఇమెయిల్ అందుబాటులోకి వచ్చింది. అందరూ యాహూ మెయిల్ వాడుతున్నారు. ‘వాడు కనీసం ఇమెయిల్ ద్వారా అయినా మాతో టచ్ ఉండొచ్చు కదా’ అనుకునేవాడిని.
ప్రపంచంలో యుక్రేయిన్ అప్పటికి ఒక అజ్ఞాత దేశం. ఆ దేశం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అందరికీ తెలిసిన అమెరికా, రష్యాలా కాదు. యూరప్‌ని ఆనుకుని ఉన్న మామూలు దేశం. వాడు దేశ రాజధాని కీవ్‌లో ఉన్నాడా? లేక వాళ్లావిడ ఊరు ఖెమ్నెస్‌స్కీ నగరంలో ఉన్నాడా?
ఒకప్పుడు ఆ దేశంలో చెర్నోబిల్ అనే ప్రాంతంలో అణు ప్రమాదం జరిగింది.
ఆ ప్రమాదంలో అనేకమంది చనిపోయారు. ఇప్పటికీ దాని వలన బాధలు పడేవాళ్ళున్నారు. ప్రపంచంలోనే అణుక్షేత్రాలు ఎక్కువగా ఉన్న దేశం అది. సోవియట్ ఉనికిలో ఉన్నప్పుడు మొత్తం ఖూR కి అదొక అణుబాంబుల కర్మాగారం.
నేను పనిచేసే ఆఫీసులో నాకు కంప్యూటర్‌తోపాటు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండటంచేత నెట్‌లో వాడి గురించి వెతకడం మొదలుపెట్టాను.
వెతకగా మొదటిసారిగా తెలిసిన విషయం ఏమంటే ఆ దేశంలో బంగాళా దుంపలు ఎక్కువగా పండిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పొలంలో పనిచేస్తే ఒక బస్తా బంగాళా దుంపలే కూలిగా ఇస్తారు. అప్పటికి ఆ దేశ పరిస్థితి అది.
నెట్‌లో సెర్చ్ చేస్తూ కనిపించిన ప్రతి యుక్రేయిన్, రష్యన్, గవర్నమెంట్ వెబ్‌సైట్లన్నిటిలోంచి కాంటాక్ట్ డిటెయిల్స్ తీసుకుని వాళ్ళందరికీ ఇంగ్లీషులో ఇమెయిల్స్ పంపించాను. మావాడు చదువుకోడానికి వెళ్ళినట్లు, అక్కడే యుక్రెయిన్ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని, గత పదేళ్ళుగా వాడికోసం ఇక్కడ ముసలి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారని వాడి డిటెయిల్స్ అన్నీ పంపించాను. ఇండియిన్, యుక్రెయిన్‌లో ఎంబసీలకి, విదేశీవ్యవహారాల శాఖలకి, ఆఖరికి యుక్రెయిన్ రేడియోలో వాడి గురించి ప్రకటించమని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఇమెయిల్స్ పంపాను.
ఆరు నెలలపాటు అలా ప్రయత్నం చేసాక కీవ్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ నుంచి ఇమెయిల్ వచ్చింది. వాడు క్షేమంగానే ఉన్నాడని.
‘అమ్మయ్య’ అనుకున్నాను.
ఇమెయిల్‌లో వాడితో మాట్లాడటానికి ఒక ఫోన్ నెంబరు కూడా ఇచ్చారు.
వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబరుకు మా ఆఫీసు నుంచి ఐ.ఎస్.డి. కాల్ చేస్తే ఎవరో ఆడమనిషి ఫోను తీసింది. పేరు చెప్పిన కొంతసేపటికి గుర్తుపట్టింది. అది ఇంటి పక్కవాళ్ళ నెంబరు అని అర్థమయింది. అప్పటికి ఆ చలి దేశంలో సమయమెంతయిందో తెలీదు. ఫోను పక్కన పెట్టిన చప్పుడు. దూరం నుంచి వీథిలో ఎవరివో ఆడవాళ్ళ మాటలు వినిపించాయి. ఆ తరవాత అదే మనిషి మళ్ళీ వచ్చి ఏదో చెప్పింది. ఆవిడ మాటలు ఎంతకీ అర్థం కాలేదు. ఆవిడకి ఇంగ్లీషు రాదు. ఆవిడ మాట్లాడిరది రష్యనో, యుక్రేయిన్ భాషో తెలీదు. ఎంతకీ ఆవిడ చెప్పేది అర్థం కాక చివరికి ఫోను పెట్టేసాను.
ఆ తరువాత చాలాసార్లు అదే నెంబరులో ట్రై చేసాక మక్సీమ్ సోబోలెవ్ అనే రష్యన్ లైన్‌లో కలిసాడు. అతను హరికి ఫ్రెండ్. అతను చెప్పినదాని ప్రకారం వాడు కీవ్‌లో లేడు. యుక్రేయిన్ ఓడరేవు (సీ పోర్ట్) ఒడెస్సాలో ఉన్నాడట.
మక్సీమ్ మరొక నెంబరు ఇచ్చాడు.
ఆ నెంబరుకు డయల్ చేస్తే దొరికాడు. కొన్ని సంవత్సరాల తరవాత.
నేనడిగినదానికి దేనికీ సమాధానం చెప్పలేదు. అన్నిటికీ ‘అంతా బాగానే ఉంది’ అన్నాడు.
అన్నేళ్ళ తరవాత మాట్లాడినా వాడిలో ఏ ఉద్వేగమూ లేదు.
ప్రతిసారి ఫోనులో మాట్లాడటం కష్టంగా అనిపించి చివరికి వాడి కోసం నేనే ఒక యాహూ ఇమెయిల్ ఐడి క్రియేట్ చేసి దాని పాస్‌వర్డ్ వాడికి చెప్పి ఇమెయిల్ పంపమని చెప్పాను.
అలా చేసిన రెండో రోజులకి ఇమెయిల్ పంపాడు. అప్పటినుంచి వాడితో కాంటాక్ట్ మొదలైంది.
వాడు చెప్పినదాని ప్రకారం చదువు పదేళ్ళ క్రితమే పూర్తయింది. వికా కోసం, పిల్లల కోసం కీవ్‌లోనే ఉండాల్సి వచ్చింది. పెళ్ళైన కొన్నాళ్ళవరకూ భార్యాపిల్లలతో బాగానే ఉన్నాడు. తరవాత సరైన ఉద్యోగం లేక జీవితంలో కష్టాలు మొదలయ్యాయి.
చాలాకాలం పాటు ఒక ఉద్యోగం లేదు. స్థిరత్వమూ లేదు.
ఉద్యోగం కోసం దేశం విడిచిపెట్టి అజర్‌బైజాన్ వెళ్ళాడు. అక్కడ కొన్నాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా చేసాడట.
భార్యాపిల్లలని చూసి నాలుగేళ్ళయింది. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో వాడికి కూడా తెలీదు.
దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీలేదు నాకు. ఒకవేళ వాడు వికాతో విడిపోయాడేమో. ఆ వివరాలేం తెలియలేదు.
మక్సీమ్ ద్వారా తెలిసిన విషయం ఏమంటే వాడు యుక్రేయిన్‌లో చాలాకాలం చేతిలో డబ్బులు లేక చాలా దారిద్య్రం అనుభవించాడు. పిల్లలకు పాల డబ్బాలు కొనడం కోసం చేతికొచ్చిన అన్ని పనులూ చేసాడు. ఇంగ్లీషు ట్యూషన్లు చెప్పాడు. చేయడానికి పని దొరక్క ఇళ్ళకు సున్నాలు కొట్టాడట.
మెడికల్ రిప్రజెంటేటివ్‌గా చేసాక కెమికల్ ఇండస్ట్రీలో చేరి క్రమంగా ఒడెస్సా పోర్టు కేంద్రంగా పనిచేసే ఇంపోర్ట్ ఎక్సోపోర్టు కంపెనీల్లో రష్యన్ ట్రాన్స్‌లేటర్‌గా చేరాడు. ఈ క్రమంలో వాడు యుక్రేయిన్ దాటి రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ అజర్‌బైజాన్, టర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు తిరుగుతా చివరికి కజకిస్తాన్ చేరాడు.
అక్కడ కెమికల్స్, పౌల్ట్రీ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే ఒక రష్యన్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఆ కంపెనీకి ఇండియాలో బ్రాంచీలు ఉన్నాయి. వాడు ఇండియన్ కాబట్టి కొన్నాళ్ళతరవాత బెంగుళూరులో ఉండి పనిచేసే అవకాశం వచ్చింది.
మొదటిసారి నాతో ఫోనులో మాట్లాడిన సంవత్సర కాలానికి వాడు కజకిస్తాన్ నుంచి ఇండియా రావడం నిర్ణయమైంది.
***
వాడు కజకిస్తాన్ నుంచి డిల్లీ వచ్చి హైదరాబాదు రాకుండా అటునుంచి సరాసరి బెంగుళూరు వెళ్ళాడు. అక్కడే వాడు పనిచేసే కంపెనీ కార్పోరేట్ ఆఫీసు ఉందట. బెంగుళూరులో హోటల్లో దిగుతున్నాననీ, వీలుచూసుకుని హైదరాబాదు వస్తానని కబురు పంపాడు.
వాడు సరాసరి బెంగుళూరు వచ్చాడని తెలిసి మా నాన్నగారే వాడిని చూడటానికి బెంగుళూరు బయలుదేరారు. ఆయనతో పాటు మా పెద్దక్క కొడుకు బాలు కూడా వాడిని చూడటానికని వెళ్ళాడు. బెంగుళూరులో వాడెక్కడో ఆఫీసు పనిమీద హోటల్లో దిగాడట.
వీళ్ళను చూసి ‘‘నేనే వారం రోజుల్లో హైదరాబాదు వచ్చేవాడ్ని కదా. ఎందుకు శ్రమపడి ఇంతదూరం రావడం’’ అన్నాడట.
అన్నట్టుగానే వాడు వారం తరవాత బెంగుళూరు నుంచి హైదరాబాదు వచ్చాడు.
అన్ని సంవత్సరాల తరవాత వాడిని చూసాక నాకు లోపలినుంచి దు:ఖం పొంగుకు వచ్చింది. వాడిని పట్టుకుని ఏడవాలనిపించింది.
వాడితో ఎన్నో విషయాలు చెప్పాలనిపించింది. ఇన్నాళ్ళూ నేను పడిన దు:ఖం,… అనుభవించిన బాధ, వాడిని వెతకడానకి చేసిన ప్రయత్నం.. ఏమీ మాటలు రాక వాడిముందు మూగవాడి మాదిరి నిలబడిపోయాను.
వాడిలో నన్ను బాధించేదేమంటే వాడికి సంబంధించిన ఏ విషయాన్నీ నాతో పంచుకోడు. ఏదీ చెప్పడు.
వాడు నన్ను ఎప్పటికీ చిన్నవాడిగానే, ఒక తమ్ముడిగానే చూస్తాడు. అదే మా ఇద్దరిమధ్య ఉన్న అంతరం అనిపిస్తది.
సంతోషం కలిగించిన విషయం ఏమంటే వాడిక ఇండియాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకోవడం.
కాకినాడ దగ్గర రిలయన్స్ గ్యాస్ పైప్‌లైన్ పనులు జరుగుతున్నట్లు అందులో పనిచేసే రష్యన్ ఇంజనీర్లకి తెలుగు ట్రాన్స్‌లేటర్‌గా చేరినట్లు చెప్పాడు. రష్యన్ నేర్చుకోడానికని కమ్యూనిష్టు రష్యా వెళ్ళొచ్చినవాడు చివరికి ఇండియా వచ్చి ఇలా రిలయన్స్‌లో చేరడం ఒక వింత.
కాకినాడ నుంచి ఒకటి రెండు సార్లు హైదరాబాద్ వచ్చినప్పుడు వాడి తాగుడు అలవాటు బయటపడిరది.
నేనూ ఎప్పుడన్నా పుచ్చుకుంటాను. సరదా కోసమో, స్నేహితులు కలిసినప్పుడో ఏదైనా.. కొన్నిరోజులు విరామం వస్తే. అదీ ఒకటో రెండో పెగ్గులు.
వాడు తాగడం అలా ఇలా కాదు. అదేదో మామూలుగా తాగటం కాదు. మనిషి పడిపోయేటంతగా తాగటం. ఎంత తాగినా తినేవాడు కాదు. ఊరికే తాగటం, తాగేటప్పుడు ఒకటే సిగరెట్లు కాల్చడం. జేబులో డబ్బులు ఖాళీ అయ్యేంతగా తాగటం. ఇంత వ్యసనం వీడికెట్లా వచ్చిందో తెలీదు.
కాకినాడలో ఎక్కడ ఉండేవాడో తెలీదు. ఎప్పుడు ఫోన్ చేసినా పనిలో ఉన్నానురా అనేవాడు. మోకాలులోతు బురదలో దిగి రష్యన్ ఇంజనీర్లతోపాటు నడవటం, వాళ్ళు చెప్పింది తెలుగులో అనువదించి వర్కర్లకు, ఇతర తెలుగు ఇంజనీర్లకి చెప్పడం వీడి పని.
ఇదిలా ఉండగా వాడు మళ్ళీ పెళ్ళికి ప్రయత్నాలు మొదలుపెట్టాడని తెలిసింది. వాడికి ఆ సంబంధం ఎవరు తెచ్చారో వాళ్ళు ఎలా పరిచయమయ్యారో మాకెవరికీ తెలీదు. యుక్రేయిన్‌లో తనకు భార్యాపిల్లలు ఉన్నారన్న సంగతి కూడా వాళ్ళకు చెప్పాడో లేదో అని కంగారు పడ్డాము. వికాతో విడాకులు అయ్యాయో లేదో మాకు చెప్పలేదు.
ఆమె పేరు ‘సారా’. వాళ్ళది రాజమండ్రి దగ్గర ఏదో పల్లెటూరు. ఆమె క్రిస్టియన్.
కాకినాడలో కలిసి పనిచేసే వాడి కొలీగ్ ఎవరో తెచ్చాడు ఆ సంబంధం.
పెళ్ళికి హైదరాబాద్‌నుంచి ఎవరూ వెళ్ళలేదు. విజయవాడలో ఉన్న చిన్నక్క తప్ప.
ఆ తరువాతి కాలంలో విదేశీ భాషల అనువాద సంస్థలో ఎవరో వ్యక్తి పరిచయమయ్యాడు. కాకినాడలో ఉండగానే అతని ద్వారా రష్యన్ నుంచి ఇంగ్లీషులోకి అనువాదాలు చేసే ప్రాజెక్టులు కొన్ని దొరికాయి. ఆ తరవాత వాడికి EFLU (English & Foreign Languages University) యూనివర్శిటీలో రష్యన్ భాష చెప్పే పంజాబీ ప్రొఫెసర్ ఎవరో పరిచయం అయ్యాడు.
ఆయన ద్వారా EFLU లో ప్రొఫెసర్ పోస్టుకి అప్లై చేసాడు.
పరీక్షలు, ఇంటర్యూ అయ్యాయి. వాడి పదిహేనేళ్ళ ప్రవాస జీవితం అందుకు బాగా పనికొచ్చింది. రష్యన్ కూడా తెలుగులా వాడికి మాతృభాషే అయింది. చివరికి వాడికి కావలసిన ఉద్యోగం వచ్చింది. యుక్రేయిన్‌లో ఇన్ని సంవత్సరాలుగా దొరకని ఉద్యోగ అవకాశం ఇప్పుడు ఇండియాలో దొరికింది. అది కూడా తనకు నచ్చిన ప్రొఫెసర్ ఉద్యోగం.
పెళ్ళయి, ఉద్యోగం వచ్చి ఆర్థిక సమస్యలు తీరినా తాగుడు అలవాటు మాత్రం పోలేదు. చాలాసార్లు ఫోన్లు పోగొట్టుకున్నాడు. ఒక్కోసారి రాత్రిపూట ఇంటికి రాకుండా ఎక్కడెక్కడో పడుకుని పొద్దున్నే ఇంటికి వచ్చేవాడు.
ఈ వ్యసనానికి కారణం వాడు భార్యాపిల్లలకి దూరంగా ఉండటమేనని నాకనిపిస్తుంది.
ఇండియా వచ్చాక వీడు ఒక్కసారైనా భార్యతోగానీ, పిల్లలతోగానీ ఫోనులో మాట్లాడిరది లేదు. ఒకసారి మాత్రం విజయ్‌కి బాలేదని వికా ఇమెయిల్ పంపిస్తే పిల్లవాడికి ఆపరేషన్ చేయడానికని డబ్బులు పంపించాడు. ఆ తరువాత ఎన్నడూ వాళ్ళగురించి మాదగ్గర ఎత్తింది లేదు. గట్టిగా అడిగితే ‘‘వాళ్ళంతా బాగానే ఉన్నారు’’ అని ముక్తసరిగా సమాధానం చెప్పేవాడు.
ఉద్యోగంలో చేరాక కొంతకాలానికి యూనివర్శిటీ క్వార్టర్స్‌లోకి మారారు.
ఎంత ప్రయత్నించినా సారా వాడి చేత తాగుడు మాన్పించలేకపోయింది. కొన్నిసార్లు ఆటోవాళ్ళు ఎత్తుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టేవాళ్ళు. ఒక్కోసారి రాత్రుళ్ళు ఇంటికి వచ్చేవాడు కాదు. యూనివర్శిటీలోనే స్టూడెంట్లు ఎక్కడైనా హాస్టల్ రూమ్‌లో పడుకోబెట్టేవారేమోలే అనుకునేవాడ్ని.
ఆ రోజుల్లోనే నా జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటనలు మరికొన్ని జరిగాయి.
ఒక సాయంత్రంవేళ మందులషాపుకని బయలుదేరిన మా నాన్నగారు ఎంతసేపటికీ ఇంటికి తిరిగిరాకపోవడంతో ఫోను చేస్తే ఇంకెవరో ఫోనెత్తి ‘ఈ పెద్దాయన కింద పడిపోతే ఎవరో హాస్పిటల్‌లో చేర్చారని’ చెప్పారు. మేమందరం ఆ హాస్పిటల్‌కి వెళ్ళి చూస్తే ఆయనప్పటికే కోమాలోకి వెళ్ళిపోయారు. హరీ నేనూ ఆయన డెడ్‌బాడీని ఆఖరిగూటికి చేర్చడానికి కార్లో వాళ్ళ ఊరు తీసుకెళ్ళాం. ఒక రాత్రంతా ప్రయాణం. వాడు యుక్రేయిన్‌లో ఉన్నప్పుడు ‘నేను బతికుండగా చూస్తానా వాడిని’ అని ఆయన కలవరించేవారు. ఆయన ఉండగానే వాడు ఇండియా వచ్చేశాడు. ఆయన చనిపోయాక కూడా స్వయంగా ఆయన్ని అంత్యక్రియలకోసం వాళ్ళ ఊరు చేరుస్తున్నాడు. అదే విషయం వాడితో అన్నాను ఆ రాత్రి ప్రయాణంలో. ఆయన మరణం చాలా కాలం వెంటాడిరది నన్ను
అందులోంచి కోలుకోక ముందే నన్ను, తొమ్మిదేళ్ళ నాకొడుకుని అనాధలని చేసి నా భార్య చనిపోయింది.
నా జీవితంలో కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి.
నా కొడుకుని విజయవాడలో వాడి అమ్మమ్మ దగ్గర ఉంచి నేను అమీర్ పేట్ హాస్టల్‌కి మారాను.
మరొక మూడేళ్ళకి హాస్టల్ జీవితం కూడా సరిపడక ఒకరిద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి అమీర్‌పేటలోనే రూమ్ తీసుకున్నాను.
పెళ్ళయినా హరిలో మార్పు రాలేదు. వాడికి మళ్ళీ పిల్లలు కలగలేదు.
వాడి మనసులో ఏముందో ఎవరికి తెలుసు. ఇద్దరు కొడుకులు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇల్లు విడిచిపెట్టాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఒకదాని తరవాత ఒకటి దేశాలు దాటుకుంటూ చివరికి స్వదేశం వచ్చాడు.
పిల్లల్ని చూసి కొన్ని సంవత్సరాలైపోయింది. ఇంటికి ఫోను చేస్తున్నట్లుకూడా లేదు. భార్యాభర్తల ఏం జరిగిందో తెలీదు. ఒకవేళ విడిపోయినా ఆ విషయం మాకు స్పష్టం చేయలేదు.
అసలే కారణమూ లేదేమోనని కూడా అని మరొక భయం. కారణమంటూ ఉన్న వ్యసనం కంటే ఏ కారణంలేని వ్యసనం ప్రమాదకరం.
ఏమిట్రా నీవు చేస్తున్న పని అని అడిగితే ‘‘ఏముందిరా.. ఇవాళ చనిపోతే రేపటికి రెండోరోజు అనుకుంటారు’’ అన్నాడు.
వాడి తాగుడు అలవాటు నాకు దిగులు పుట్టించింది. చివరికి వీడేమైపోతాడా అని నా భయం.
వాడు నన్నింకా ఏమీ తెలియని తమ్ముడిగానే, చిన్నవాడిగనే చూడ్డం మూలాన ఆ అంతరాన్ని చేధించడం నాకు సాధ్యం కాలేదు. వాడిని అంతకుమించి మందలించడానికి అవకాశం కుదరలేదు.
వాడు నన్ను ‘ఒరే’ అని పిలిచేంతమేరకే చనువిచ్చాడు.
ఇదంతా చూసాక ఆరోజుల్లో వాడు పైచదువుల కోసం ఢల్లీి వెళ్ళకుండా ఉండుంటే బాగుండేది కదా అనిపించింది. వెళ్ళినా ఆ యూనివర్శిటీలో ఆ రష్యన్ భాష కాకుండా ఏ ఫ్రెంచో, జపనీసో తీసుకునుంటే బాగుండేది. అసలది కూడా లేకపోతే మాత్రమేం.. ఇక్కడే మాతోనే ఉండి ఏదో ఒకటి చూసుకునేవాడు కదా అనిపించేది.
నాకు చదువు వంటబట్టనప్పుడు మా నాన్నగారు చివాట్లు పెడుతుంటే మా అమ్మగారు అడ్డొచ్చి ‘చిన్నాణ్ణి ఊరికే అలా తిట్టకు, చదువు రాకపోతేనేం.. ఏదన్నా కొట్టుపెట్టుకుని బతుకుతాడు’ అనేవారు.
వాడు కూడా అలా ఏదోరకంగా మాతోనే ఉండేవాడు కదా అనుకున్నాను.
ముందుకు నడిచేకొద్దీ జీవితం ‘అనుకున్నంత వీజీ ఏం కాదు’ అని అని అర్థమయ్యింది.
ఆరోజుల్లోనే విశాలాంధ్రలో దోస్తయెవ్‌స్కీ ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ ఇంగ్లీషు పుస్తకం కనపడితే కొని చదివాను. ఆ నవలలో రాస్కాల్నికోవ్ చేసిన నేరానికి స్థిరమైన కారణాలకంటే అతడి అస్థిరమైన మనస్తత్వమే కారణమనిపిస్తుంది. అన్నయ్య జీవితం కోసం త్యాగం చేయాలనుకున్న అతడి చెల్లెలు దూనియా, కుటుంబాన్ని పోషించడానికి పడుపువృత్తిని ఎంచుకున్న సోనియా రాస్కాల్నికోవ్‌లో అలజడి రేపుతారు. నెపోలియన్‌లా శక్తివంతమైన మానవుడు కావాలనుకున్నాడు. కానీ హత్యానేరం బరువుని అతడు మోయలేకపోతాడు. సోనియా దయ, కరుణ, ప్రేమ అతడిని నేరం ఒప్పుకునేట్లు చేస్తాయి. జీవితంలో ఉన్న విరోధాభాసని అందులోని విషాదాన్ని దోస్తయెవ్‌స్కీలాగా ఎవరూ చెప్పలేరని అనిపించింది. విదేశాల్లో ఉన్నప్పుడు దోస్తయెవ్‌స్కీ జూదమాడేవాడని, తన అదృష్టాన్ని జూదం ద్వారా పరీక్షించుకునేవాడని ఎక్కడో చదివాను. అటువంటి అస్థిరత దోస్తయెవ్‌స్కిలో కూడా ఉందేమో. ఆయన రాసిన ‘ది గాంబ్లర్’ అనే ఇంగ్లీషు పుస్తకం గురించి తెలిసింది కాని ఎక్కడా దొరకలేదు.
నేను ముందు గోర్కీని కాకుండా ముందు దోస్తయెవ్‌స్కిని చదివుంటే ఎలా ఉండేది? ఆ వయసులో నాకు దోస్తయెవ్‌స్కి అర్థమయివుండేవాడా?
***
ఒక ఉదయం హరికి ఛాతీ నొప్పి వచ్చిందనీ, అప్పటికప్పుడు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నామనీ సారా ఫోనుచేసింది.
అంతకుముందెప్పుడూ వాడికి ఇలాంటి కంప్లైంట్స్ లేవు.
‘పొద్దున్నే ఉన్నట్లుండి ఇట్లాంటి వార్త ఏమిటి?’ అనుకుంటూ కంగారుగా ఆఫీసునుంచి సరాసరి హాస్పిటల్‌కి పరిగెత్తాను.
వెళ్ళేసరికి వాళ్ళు ఎమర్జన్సీ వార్డులో కనిపించారు. హరి మంచం మీద పడుకుని ఉన్నాడు. వాడిలో ఏ ఆందోళనా కనపడలేదు. ఇదంతా మామూలే అన్నట్లు చూసాడు. దగ్గరకి రమ్మని పిలిచి ‘‘నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకోరా’’ అన్నాడు ప్రాధేయపడుతున్నట్లు.
సారా డాక్టర్లకోసం అటూ ఇటూ ఆందోళనగా తిరుగుతూంది.
ఆపూట వాడి గుండెకి రెండు బ్లాక్స్ పడ్డాయని డాక్టర్లు చెప్పారు.
ఆ మధ్యాహ్నం వాడి గుండెకి రెండు స్టెంట్లు వేశారు.
మూడు రోజుల తరవాత ఇంటెన్సివ్ కేర్ నుంచి జనరల్ వార్డుకి మార్చారు.
జనరల్ వార్డుకి మార్చినరోజు సాయంత్రం ఆఫీసునుంచి హాస్పిటల్‌కి వెళ్ళాను.
కొంచెం నీరసంగా కనిపించాడు.
రాత్రి తొమ్మిది గంటలకు ఇక వెళ్తానన్నట్లు లేచి నిలబడితే బెడ్ మీద వెనక్కి చేరగిలబడి ‘‘ఈ రాత్రికి ఇక్కడే పడుకోరాదురా’’ అన్నాడు.
‘ఆఫీసునుంచి డైరెక్టుగా వచ్చాననీ, మర్నాటినుంచి పడుకోడానికే వస్తా’ అన్నాను.
‘‘సరేరా.. బై’’ అన్నాడు నావంక చూస్తూ.
అదే వాడు నాతో మాట్లాడిన ఆఖరుమాట. అదే ఆఖరి చూపు. అంతా సజావుగా సాగిపోతుందనే నమ్మకంతోనే ఉన్నాను అప్పటికి వరకూ.
అన్యమస్కంగానే ప్యాట్నీ దగ్గర బస్సెక్కి అమీర్‌పేటలో దిగాను.
అక్టోబరు నెల చలి రోజురోజుకీ పెరుగుతూ ఉంది. గదిలో చాప మీద కలత నిద్ర. పడుకున్న ఎప్పటికో నిద్రలో ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తే జాన్‌బాబు. వాడి బావమరిది. మగత నిద్రలోనే తీసాను. అవతలినుంచి పూడుకుపోతున్న గొంతు..
‘‘ప్రసాద్‌గారూ…. అంతా అయిపోయింది సర్… ఆయనిక లేడు’’ అన్న ఏడుపు…
అతను చెప్పేది నాకు కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంది. తరువాత చెప్పేది వినకుండానే ఫోన్ కట్ చేసాను.
‘వాడిక లేడు.’ చీకట్లో ఇంకా చీకటి కమ్ముకుంది.
హరి ఇక ఈ లోకంలో లేడు.
అలా అనుకోగానే కళ్ళముందు నల్లటి వాన.. అంతా నల్లగా .. పులిమినట్లు..
వాడు పుట్టిన నలభై ఆరేళ్ళకి, సోవియట్ యూనియన్ కూలిపోయిన పాతికేళ్ళకి, వాడి కుటుంబాన్ని విడిచిపెట్టిన పదిహేనేళ్ళకి వాడు ఆ లోకం నుంచి, మా కుటుంబం నుంచి, నానుంచి శాశ్వతంగా దూరమయ్యిడు.
ఒకరోజు ముందు ఏదీ లేదు అంతా సబబుగానే ఉందనుకున్నోడు, …
ఇంకా బతుకుతాడు అనుకున్నోడు… ఉన్నట్టుండి మాయమయ్యాడు.
లేచి దుప్పటి పక్కనపడేసి బట్టలేసుకుని బయటికి నడిచాను.
అప్పటికి నడిరాత్రి దాటి ఒంటిగంట అయ్యింది. ఆ చీకటి చలిరాత్రి అమీర్‌పేట్ మైత్రీవనం దగ్గరకి వచ్చి ఏదన్నా వెహికల్ దొరుకుతుందేమోనని నుంచున్నాను. ఎత్తైన మెట్రోపిల్లర్ల మీద నుంచుని వర్కర్లు వెల్డింగ్ పని చేస్తున్నారు. పైన వాళ్ళ చేతుల్లో టార్చిలైట్లు, వెలుగుతున్న నిప్పురవ్వలు ఆ చీకటాకాశంలో వెలుతురు ముద్దల్లా ఉన్నాయి. వాళ్ళనలా చాలాసేపు చూస్తుండిపోయా.
హాస్పిటల్‌కి వెళ్ళేసరికే చిన్నక్క పెద్దన్నయ్య రిసెప్షన్‌లో కూర్చునివున్నారు. చిన్నక్క గుడ్లమ్మటి నీళ్ళు కుక్కుకుంటూ ఖర్చీఫ్‌తో కళ్లు తుడుచుకుంటా బెంచీమీద ఒణుకుతా ఉంది. దూరంగా పెద్దన్నయ్య చేతులు వెనక్కి కట్టుకుని నుంచున్నాడు. ఉప్పల్ నుంచి రావాల్సిన చిన్నన్నయ్య ఇంకా అక్కడికి చేరుకోలేదు. నడిరాత్రి దాటడం మూలాన హాస్పిటల్‌లో జనం లేరు. కొంతసేపటికి హాస్పిటల్ వెనకనుంచి స్ట్రెచర్ మీద ‘డెడ్‌బాడీ’ తీసుకొచ్చారు. వాడ్నలా చూడగానే పెద్దన్నయ్య కళ్ళుతుడుచుకున్నాడు. స్ట్రెచర్‌తోపుడుకి ఊగుతున్న వాడి నిర్జీవశరీరాన్ని నిశ్చేష్టుడ్నై నిలబడి చూస్తూవున్నా.
అలా నవంబరు 1, 2015లో వాడు కళ్ళుమూసాడు. అప్పటికి వాడిది పెద్ద వయసేం కాదు. నిండా యాభైఏళ్ళు కూడా లేవు.
ఆ రాత్రి అంబులెన్సులో వాడి శరీరాన్ని యూనివర్శిటీ క్వార్టరుకు తీసుకువచ్చాం. ఇంటి లోపలే మంచం మీద పడుకోపెట్టారు వాడ్ని. తల మాత్రం కనిపించేలా నిండా దుప్పటి కప్పారు.
తెల్లవారాక యూనివర్శిటీలో వాడి స్టూడెంట్స్, తోటి ప్రోఫెసర్లు ఒక్కొక్కరే చూసి పోతున్నారు.
కిటికీలోంచి పడే సూర్యోదయంలో వాడి మొహం వంక చూసాను. అన్నీ మరిచిపోయి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నట్లున్నాడు. నిన్నగాక మొన్న చివరిసారి హాస్పిటల్‌లో కలిసి వస్తున్నప్పుడు ‘గుడ్ బై రా’ అన్న మనిషి `
ఇలా శాశ్వతంగా గుడ్‌బై చెప్పేశాడు.
దగ్గరకు వెళ్ళి నుదుటిమీద చేయి వేశాను. చల్లగా తగిలింది. నిర్జీవ శరీరం. వాడే.
వాడి అంత్యక్రియలు ఏ మతాచారం ప్రకారం చేయాలి అన్న ప్రశ్న బయలుదేరింది. మేము హిందువులం. ఇక్కడ వాడు చేసుకున్న భార్య క్రిస్టియన్. నేనెరిగి వాడు ఎప్పుడూ ఏ దేవుడికీ మొక్కింది లేదు. మా ఇంట్లో ఆచారాల పట్టింపు ఎవరికీ లేదు. మాకు కర్మకాండల వ్యవహారాలు తెలియవని ఊరు నుంచి మా చుట్టాలద్దిరిని రప్పించారు.
అందరూ తర్జనభర్జన పడుతుండగా వాడి మామయ్య ఆనందరావు ‘‘ఆయన మామంచి మనిషి. మమ్మల్ని ఆదరించాడు. అల్లుడైనా నాకు కొడుకులాంటి వాడు. మా మతాచారం ప్రకారమే అంత్యక్రియలు చేస్తాం’’ అన్నాడు.
ఏ మతాచారాలు పాటించని మా కుటుంబసభ్యులకి ఆయన చెప్పినాదానికి అభ్యంతరం లేకపోయింది.
ఆ ప్రకారమే తార్నాక అవతల మౌలాలి క్రిస్టియన్ శ్మశానవాటికలో వాడిని ఖననం చేయడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి.
అప్పటికే శరీరం గడ్డకట్టి బిగుసుకోపోవడం వలన వాడికి స్నానం చేయించాక ఒంటిమీద కోటు తొడగడానికి వీలు కుదరలేదు.
చివరికి వాడిని ఇంట్లోంచి తెచ్చి బయట కాఫిన్ బాక్స్‌లో పెట్టారు. తెచ్చిన కొత్త బట్టలను అలానే వాడి ఒంటిమీద పరిచారు.
యునివర్శిటీలో వాడుండే క్వార్టరు నుంచి కొంతదూరం కాఫిన్ బాక్స్ మోసుకెళ్ళి వ్యానులో ఎక్కించాం. లోపల ఇద్దరు మనుషులతోపాటు నేను కూడా ఎక్కాను.
అటూ ఇటూ కదిలే కుదుపులకు కాఫిన్ బాక్స్ ముందువైపు సగం నా ఒళ్ళో పెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో వాడిని ఒళ్ళో పొదుపుకున్నట్లుయింది. నా రెండు చేతుల మధ్య శిలువ గుర్తు. ఇప్పుటివరకు నాకు తెలిసిన మా కుటుంబంలోకానీ, చుట్టాల్లోకాని ఇలా కాఫిన్‌బాక్స్‌లో పెట్టి ఖననం చేయబడ్డ మనిషి లేడు. మాలోంచి వాడిని వేరు చేసిన సవాలక్ష విశేషాలలో ఇదీ ఒక విశేషమే. ఒక్కసారిగా ఊహ తెలిసిన దగ్గరనుంచి వాడి జ్ఞాపకాల బరువు చుట్టుముట్టాయి. వాడెప్పుడూ అంతే. చిన్నప్పుడు మాచర్ల తిరునాళ్ళలో కొన్న రంగుల బొమ్మ దగ్గరనుంచి చివరికి ఇలా నా చేతుల్లో మిగిలిన కాఫిన్‌బాక్స్ దాకా వాడి జీవితంలో అన్నీ వింతలే.
ఇవేమీ లేకుండా అందరిలా అత్యంత సామాన్యంగా, సాధారణంగా వాడి జీవితం ఉండుంటే ఎంత బాగుండేది..
వాడు వాడుగా మాకు మిగిలేవాడు.
అసలు వీడు ఇక్కడే ఈ రకంగా చనిపోవాడానికే అన్నన్ని దేశాలు దాటి వచ్చాడా?
అదేదో అక్కడే వాడు ప్రేమించి పెళ్ళి చేసుకున్నావిడ దగ్గర, ఇద్దరి కొడుకుల దగ్గర అక్కడే చనిపోకూడదా.. ఇదంతా ఎందుకు.. నాకీ చేతిలో బరువెందుకు.. నాకీ అనంత భారమెందుకు..
అనేక మరణాలతో ముక్కలయి బతుకీడుస్తున్న నేను వీడి చావుని కూడా జీవితాంతం మోయాలి కదా.. వాడి జీవితానికి సంబంధించి ఇక్కడ నాకు గుచ్చుకున్నన్ని జ్ఞాపకాలు ఇంకెవరికి గుర్తున్నాయి. ఎందుకు నాకింత వేదన మిగిల్చాడు వాడు?
వ్యాను వెనక డోరు తెరుచుకోవడంతో దిగాల్సిన చోటు వచ్చిందని అర్థమయింది. అప్పటిదాకా కాఫిన్‌బాక్స్‌ని అలాగే పట్టుకుని కూర్చున్నాను. ఒంటిమీద బట్టలు తడిసిపోయాయి. అప్పటిదాకా నా ఎదురుగా కూర్చున్న మనిషెవరో నన్నే విచారంగా చూస్తున్నాడు.
కాఫిన్ బాక్స్ గోతిలోకి దింపి కడసారిగా చివరిచూపుకోసం తెరిచారు.
పాస్టర్ ప్రార్థన అందుకున్నాడు. మాకందరికీ అది కొత్త… ఎప్పుడూ కనింది లేదు. వినింది లేదు.
‘‘కృపయు సమాధానము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రీ, ఇదిగో నాయన, మీయొక్క దాసుడు, లోక యాత్రను ముగించుకొని మీయొద్దకు వచ్చుచుండగా.. అతనిని మీ అక్కున చేర్చుకొని ఆదరించుమని అడుగుతున్నాము. మన్నైనది వెనకటివలె తిరిగి భూమిని చేరునని మీరు మీ లేఖనములలో సెలవిచ్చియున్న ప్రకారము, ఈ యొక్క దాసుని దేహమును మట్టికి మన్నుగా అప్పచెప్పుచున్నాము. అతడు తిరిగి పునరుద్ధానము చెంది లేచి మాలో ఒకడిగా ఉంటాడని నమ్ముచున్నాము. ఆదరణ కోల్పోయిన తన కుటుంబమునకు మీరే తోడు నీడగా ఉండమని, ప్రియమైన ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రీ.. ఆమెన్’’
చివరికి శవపేటికను మూసేసారు. వాడిని అలా ఎంత చూసినా ఆ చూపు చాలదేం. అదే వాడిని ఆఖరుసారి చూడ్డం. తలాకొంత పిడికెడు మట్టి ఆ గోతిలో వేశాం.
చివరికి వాడిని అలా పూడ్చిపెట్టాం.
ఇప్పటికీ అనేక జ్ఞాపకాలు ఒకేసారి ముసురుకుంటున్నప్పుడు ఒకదాని మీద ఒకటి గుర్తుకువచ్చి ఏది ముందో ఏది ఎక్కడో తారుమారయి తెలియని దిగులు కలుగుతుంది. నాకసలు అలా రష్యా వెళ్ళొచ్చిన అన్నయ్య ఒకడుండేవాడని చెబితే ఇప్పటి స్నేహితులెవరూ నమ్మరు కూడా.
వాడు చనిపోయాక సారా యూనివర్శిటీ క్వార్టరు ఖాళీచేసి వాళ్ళ అన్నదమ్ముల దగ్గరకి రాజమండ్రి వెళ్ళిపోయింది.
వాడిని పూడ్చిపెట్టినచోట సిమెంటు కట్టడం ఏదీ మేము కట్టించలేదు. ప్రతి సంవత్సరం ఒకరోజన్నా అక్కడికి వెళ్ళి కొన్ని పూలుజల్లి మౌనం పాటించాలనే ఆచారం, ఆలోచన ఈ దుర్మార్గపు జీవితంలో మాకెప్పుడూ కలగలేదు. ఇప్పుడు ఆ సమాధుల తోటకి వెళ్ళినా అదెక్కడుందో కూడా మేమెవరం గుర్తుపట్టలేం. భవిష్యత్తులో కూడా వాడి సంబంధీకులెవరన్నా అక్కడివచ్చి వాడిని పలకరిస్తారనే నమ్మకం కూడా ఏమీ లేదు.
వాడిని వాడి కుటుంబంతో సహా అందరూ మరిచిపోయారు.
ఈ లోకంతో ఇంకెవరితో పనిలేకుండా నిశ్చలంగా ఆ మౌలాలి సమాధులతోటలో ఒక అజ్ఞాత సమాధిలో వాడు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు.
B. Ajay Prasad
Short Story Writer