ఇటీవలే వాడ్రేవు చిన వీరభద్రుడు తన కథలను ( 1980-2023 ) ప్రకటించాడు. ముప్పై యైదు కథలతో ఎమెస్కో ప్రచురణలతో పుస్తకం వెలువడింది.ఇందులో మూడు విభాగాలుగా కథలను విభజించారు. మొదటి విభాగం ( 1980-90), రెండవ విభాగం(1990-2013),మూడవ విభాగం ( 2013-2023).
మొదటి రెండు విభాగాలలోని కథలు ఇంతకుముందే అచ్చైనవి. ప్రశ్న భూమి కథా సంపుటి లో కొన్ని వచ్చివున్నాయి. మూడో విభాగం లోని ‘అవినిమయం’ కథ కథ -2017లో వచ్చింది. ‘ బయ్యన్న ‘ , ’43 ఎకరాల జొన్న పంట ‘ భద్రుడు తన బ్లాగ్ లోనూ , ఫేస్ బుక్ లోనూ ప్రకటించి వున్నాడు. మిగిలిన తొమ్మిది కథలు నేరుగా యీ పుస్తకం లోనే అచ్చయ్యాయి.ఆ మేరకు యీ తొమ్మిది కథలూ పాఠకులు చూస్తే యీ పుస్తకం లోనే చూడాలి. ఈ పుస్తకం పెద్దగా ప్రచారం కాకపోవడం వల్ల ఎక్కువ మంది యీ కథలను చూడకుండా పోవడం జరుగుతోంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది యీ మూడో విభాగం కథల గురించి మాత్రమే.
ఈ పన్నెండు కథల్లో ‘ సంజీవి ‘ , ‘ రెండు ప్రపంచాలు ‘
‘ తల్లులూ, కొడుకులూ’ ఆత్మకథనాత్మక కథలు. చిన వీరభద్రుడి అంతరంగం, తల్లిదండ్రులకు ఎదురైన క్లిష్టతలూ, వాటిని ఎదుర్కొన్న తీరూ దుఃఖభరిత కంఠ స్వరంతో యీ కథల్లో వెల్లడించాడు. ‘బయ్యన్న’ , ‘ 43 ఎకరాల జొన్న పంట ‘ , ‘ ‘ అవినిమయం ‘ , ‘ మాప్ మేకింగ్ ‘ , ‘ విందు తర్వాత ‘ , ‘ నమ్మదగ్గ మాటలు ‘ యీ ఆరు కథలూ గిరిజన కథలు.ఇవన్నీ మన వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైన గిరిజన జీవితాల్లోని ఘర్షణలు. మిగిలిన మూడు కథల్లో, కొత్త రాజధాని నిర్మాణం మీద ఒక కథ . కరోనా లో వలస కూలీలు ప్రయాణంలో నిబధ్ధతో పనిచేసిన మానవతావాదులైన కార్యకర్తల గురించి ఒక కథ. మత అసహనం పెరుగుతున్న స్థితి మీద ఒక కథ.
చిన వీరభద్రుడి అంతరంగిక కోణం తెలుసుకోవడానికి యీ పుస్తకంలోని పర్సనల్ కథలు వుపయోగపడతాయి . ‘రెండు ప్రపంచాలు’ కథలో ‘ ‘ ‘నువ్వెప్పుడూ రెండు ప్రపంచాల మధ్య నడుస్తూనే వున్నావు.ఆ అడవులు ,ఆ కొండలు ,ఆ వాగులు, ఆ మబ్బులు అదొక ప్రపంచం. ఆ రాతలు , ఆ మాటలు,ఆ కథలు , ఆ కవితలు, అది మరొక ప్రపంచం. ఆ రెండు ప్రపంచాల్నీ కలపాలనే కదా నీ తాపత్రయం? ఆ రెండు ప్రపంచాలనీ నీలో కలుపుకోవాలనే కదా, నీ ప్రయాణం!’. అంటూ తన గురించి తానే చెప్పుకుంటాడు. శిల్పరీత్యా ఈ
కథంతా సెకెండ్ పర్సన్ లో నడుస్తుంది. కథ చెప్పే కథకుడు తనను తాను నువ్వు, నువ్వు, నీకిలా జరిగింది అనుకుంటూ బాల్యం నుంచి తల్లి మరణం దాకా దాదాపు యాభై సంవత్సరాల కాలాన్ని దృశ్యీకరిస్తాడు. కథ ఆద్యంతం వానలు చిన వీరభద్రుడితో పాటు శరభవరం రాజవొమ్మంగి నుంచి పాడేరు, కర్నూలు , హైదరాబాద్ దాకా వెన్నంటే వుంటాయి. ఆ వానా కాలాలు గిరిజన ప్రాంతాల్లో ఎంత పరీక్షా కాలాలో , అవెంతలా భయపెడతాయో చూపిస్తాడు.తన వుద్యోగ జీవితంలో గిరిజనులకు ప్రతిఘటనను నేర్పించినందుకు తానెదుర్కున్న కష్ట నష్టాలనూ చూపిస్తాడు.అంతేకాదు హోరున కురుస్తున్న అంతర్బాహిర్ దుఃఖవర్షపు కవిత్వంలోనూ పాఠకుల్ని తడిపేస్తాడు.తను కొండకోనల అటవీ వానల్లో తనతో నడిచే కవితా వానల్లో మునిగిపోయి తన తల్లి కళ్లలో నిండిపోయిన’ వంట మంటల ‘ పొగలను నిర్లక్ష్యం చేసాననే అపరాధ భావనతో కథను ముగిస్తాడు.ఇలాంటి ధోరణిలోనే నడిచే కథ సంజీవి. అందులో తనెన్నడూ చూడని పిన్ని కొడుకు మరణ దృశ్యాన్ని తను మోస్తున్నట్టే పాఠకులూ మోసేలా రాస్తాడు. రాజవొమ్మంగి గిరిజన ప్రాంతంతో తన తాత తండ్రుల కుటుంబానికి యేర్పడ్డ అవినాభావ సంబంధం లేదా అనివార్య సంబంధం లోని వేదననూ , తన తండ్రికి గిరిజన భూముల పట్ల గల నిబధ్ధతనూ ‘ తల్లులూ, కొడుకులు ‘ కథలో చెప్తాడు భద్రుడు.
చిన వీరభద్రుడి కథల్లన్నింటిలోనూ తలమాణికమైన కథలు ‘ మాప్ మేకింగ్ ‘ ‘ నమ్మదగిన మాటలు ‘ .ఈ కథలు ఇటీవల సంవత్సరాల్లో భద్రుడు చేసిన గిరిజన కథన ప్రయాణానికీ , డిస్కోర్స్ కీ సంబంధించిన నరేటివ్స్. భద్రుడు తనదే అయిన గిరిజన నరేటివ్ ను ఈ పుస్తకంలోని ఆరు కథల్లో వ్యక్తీకరించాడు . ఇవి ఎక్కడా అచ్చవకుండా(అవినిమయం కథ తప్ప)నేరుగా యీ సంపుటిలోకి వచ్చాయి. ఎంతో చర్చనీయాంశం కాదగిన యీ డిస్కోర్స్ యీ పుస్తకపు రెండు అట్టల మధ్యా మౌనంగా మిగిలిపోయింది.
మాప్ మేకింగ్ కథ, అధికారి అయిన కథకుడికీ, భద్రుడికి ఆల్టర్ ఇగో లాంటి భువన రేఖ అనే అమ్మాయి కీ జరిగే డిస్కోర్స్. ఈ కథ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగే కాలంలో భద్రాచలం చుట్టూ వున్న ఆదివాసీ ప్రాంతాల పంపకం వల్ల గిరిజనుల అస్తిత్వం ప్రమాదంలో పడడం చుట్టూ అల్లుకున్నది.మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద అల్లుకున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గీసుకున్న కొత్త మాప్ లో చింతూరు కు చోటుందా. వర రామచంద్ర పురానికి చోటుందా. కూనవరానికి చోటుందా.రెండు మెజారిటీ వర్గాలు తమ తమ భవిష్యత్తు గురించి కొత్త మాపులు తయారుచేసుకుంటున్నప్పుడు అందుల్లో చోటు లేకుండా పోతున్న అబోరిజనల్స్ గురించి వూహించండి.మీ యింటి మీద యివ్వాళ కన్పిస్తున్న ఆకాశం రేపు కన్పించదు.మీ యింటి ముందున్న చింతచెట్టు నీడ నీకు యింకెంత మాత్రం మిగలదు. ఆ ఆవేదనా, యాంగ్విష్ , యాంక్సైటీ ఎలా వుంటాయి. అంటూ ప్రశ్నిస్తుంది కథ. నిలువనీడ లేకుండా పోతున్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల తరఫన గొప్ప ఆర్గ్యుమెంట్ చేస్తుందీ కథ.
శిల్ప పరంగా గొప్ప నైపుణ్యం కన్పిస్తుందీ కథలో. కథలోని ప్రొటాగనిస్ట్ ను వెంటాడే అన్వేషణ, భువనరేఖ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు కమ్ రీసెర్చర్ . భువనరేఖ అనే పేరే ఒక సంకేతం. కథ ప్రారంభమే గూగుల్ మ్యాప్ సెర్చింగ్ తో మొదలవుతుంది. రాష్ట్ర స్థాయిలో గిరిజన వ్యవహార లను పర్యవేక్షించే ఉన్నతాధికారి నిస్సహాయత, జరుగుతున్న సంక్షోభంలో రాజ్యం వైపు నిలబడాల్సి వుండడమనే అనివార్యత, తన ఆల్టర్ ఇగో లాంటి యింకో పాత్ర చేత జరుగుతున్న విధ్వంసం మీద అంతర్జాతీయ కన్సల్టెంట్ రిపోర్ట్ నెపంతో పరిశోధన, ఎత్తిచూపుతూ విమర్శా యీ కథలో కన్పిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక మ్యాప్ మేకింగుల ( పెరిప్లెస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ,టాలమీ గీసుకున్న భూగోళం)గురించి సూచన , పెరిప్లెస్ , మార్కోపోలో, వాల్టర్ రాలే లాంటి యాత్రికుల ప్రస్థావన, బాల్కన్ దేశాల విచ్ఛిత్తి, మిడిల్ ఈస్ట్ లో, బ్రెజిల్ లో జాతుల సమస్యా , సెర్బియా క్రొయేషియా సివిల్ వార్ కథలోకి తెస్తుంది భువనరేఖ. వాటి సామ్యంలో చింతూరు ట్రైబల్ మండలాల గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతుంది. గాఢమైన విషయాలతో, పదునైన చర్చలతో, పొరలు పొరలుగా అల్లుకున్న కథనంతో ఆదివాసీ జీవితాల మీద గొప్ప వేదన యీ కథ. గతంలో శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సమస్యల చుట్టూ శ్రీనివాస మూర్తి , వెంకటకృష్ణ లాంటి కథకులు కథలు రాసున్నప్పటికీ, పోలవరం ముంపు మీద అరుణ్ సాగర్ కవిత్వం రాసున్నప్పటికీ ఆదివాసీ కోణంలో యిదే తొలి కథ . శిల్ప పరంగా, వస్తు నిర్వహణ పరంగా చాలా పరిణితి చెందిన కథ.అయితే యీ కథ ముగింపు నిరాశాపూరితంగా వుంది. భువనరేఖ, ఆమె కలుస్తున్న అధికారి యిద్దరూ ఏమీ చేయలేని నిస్సహాయులుగానే
మిగులుతారు.
ఆధునిక జీవితాన్ని గడుపుతూ, ఆధునిక ఆదర్శాలను వల్లెవేస్తూన్న మన హిపోక్రిసీని ప్రశ్నిస్తాయి ఈ కథలు. ప్రీమాడర్న్ సమాజాల పట్ల మన వ్యవస్థల డొల్లతనాన్ని నిర్ధారిస్తాయి. ‘ నమ్మదగ్గ మాటలు ‘ కథలో ఆదివాసీకి నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగించేది వాళ్ల సంస్కృతి మాత్రమే ననీ, మన అంకితభావం లేని చర్యలు కావనీ చెప్తుంది. నమ్మదగ్గమాటలు కథ ఒక జర్నలిస్టు కోణం నుంచి నడుస్తుంది. ఆదివాసీ ప్రాంతాల్లో ‘ విషజ్వరాలు ‘ అనేది ఒక కల్పిత ( ఆ పదం కూడా కల్పితమే) భావం అనీ , దాని చుట్టూ ఎప్పటికప్పుడు వ్యవస్థలలోని అధికార వ్యక్తులు చేసే హంగామా, డ్రామా అంతా వాళ్ళ అంకిత భావన లేని తనానికీ, నిర్లక్ష్యానికి గుర్తని యీ కథ మాట్లాడుతుంది. వర్షాకాలం ఆదివాసీ ప్రాంతాల్లో మలేరియా, డెంగూ వ్యాపించి చేసే కల్లోలానికి ఆధునిక వైద్యం యిచ్చే పరిష్కారం కంటే ఆదివాసీ పూజారులైన గురవయ్యలు యిచ్చే స్వాస్థత, ఆ ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని
యిస్తుందనీ, గురవయ్యలు ఆధునిక వైద్యానికి అడ్డు చెప్పకుండా తమ సంస్కృతిలో భాగమైన పూజ ద్వారా చాలా మేలు చేయగలరనీ యీ కథ చెబుతుంది. ఆదివాసీ సంస్కృతిని అవహేళన చేసే , లేదా దాన్ని ధ్వంసం చేయాలని చూసే మన ఆధునికత కంటే వారి పురా సంస్కృతి లోనే నమ్మదగినది వుందని, అదే ఆదివాసీ జీవితాన్ని నడిపిస్తుందని యీ కథ ప్రకటిస్తుంది.ఇక్కడితో భద్రుడు కథ ఆపినప్పటికీ ఆధునిక సమాజాల వ్యాప్తి అనివార్యమైన వర్తమాన దశలో , ఆదివాసీ సంస్కృతిని మాత్రమే ఎత్తిచూపుతూ ఆధునిక వ్యవస్థల దురాగతాలను నిలువరించ గలమా అనే కథనప్రశ్న మిగిలే వుంటుంది.
గిరిజన సమస్యకున్న అనేక కోణాలను యీ కథల ద్వారా ఆవిష్కరించాడు భద్రుడు. ’43 ఎకరాల జొన్న పంట ‘ గిరిజనులకు దొరికిన అవకాశాన్ని ( భూ వసతి) మన సమాజంలోని ఆధిపత్య శక్తులు ఎలా నిర్వీర్యం చేయడానికి చూస్తాయో చెబుతుంది. ‘బయ్యన్న’ చెంచుల దేవుడు. చెంచుల సామాజిక జీవితంలో విడదీయలేనంతగా పెనవేసుకుపోయిన సాంస్కృతిక అంశం బయ్యన్న పూజ. అతడ్ని మరిచారంటే చాలు ఆ గుంపులోని ఎవరో ఒకరి వొంటి మీదకు వచ్చి తనకు కావలసినట్లుగా పూజ చేయించుకు పోతాడు. మన దగ్గరి మిత్రుడైనా మన మెసేజ్ కు బదులివ్వడేమో గానీ బయ్యన్న మాత్రం చెంచు వాడు పిలవకపోయినా పలికే మిత్రుడి లాంటి వాడని చెప్తాడు భద్రుడు. ‘అవినిమయం ‘
కథ ఒక గిరిజన ( సుగాలీ/ బంజారా) యువకథకుడు ఒకానొక అగ్రవర్ణ, మధ్యతరగతి మేధావి ( విమర్శకుడు) దగ్గరకు ఒక కథను చదివి వినిపించి అభిప్రాయం తెలుసుకుందామని వస్తాడు గానీ ఆయనకు తన (అక్క ) కథ విన్నా దాన్ని అనుభవంగా గ్రహించే యిఛ్ఛ లేదనీ, ఆ విమర్శకుడు ఆయనే చెప్పిన ‘ఇగ్నోరెన్స్ కొలెస్ట్రాల్’ వల్ల తన కంతా తెలుసు అనే ఆధిపత్య భావానికి గురై నిష్పాక్షికంగా తటస్థంగా వుండడమనే వ్యూహాన్ని అనుసరించవచ్చనే అపోహకు గురౌతాడు. తనూ , తన ( అక్క)కథా అక్కడ నిలబడదగ్గవి కావని గ్రహిస్తాడు. భద్ర జీవితాల ధగధగల ముందు వెలలేక అమ్ముడుపోతున్న అడవి బతుకులు యే
సృజన ప్రదర్శనకు యిఛ్ఛగించవని తేల్చుకుంటాడు. గిరిజన బతుకుల్లోని నిష్టురత్వాన్ని చూపే కోణమిది. అయితే ఆ విమర్శకుడి మీద పెడుతున్న యీ విమర్శ కు కథలో ఆధారమైతే లేదు . ఈ కథకుడు ఆత్మ న్యూనతకు గురవడం వల్లే అట్లా అపోహ పడ్డాడనిపిస్తుంది.
‘విందు తర్వాత ‘ కథ , గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవల మీద విమర్శ. ఒక ఆర్ అండ్ బీ ఇంజనీర్ అనుభవంగా గిరిజన ప్రాంతాల్లో వుండి సరిగా డ్యూటీ చేయిని డాక్టరమ్మ వల్ల పురిట్లో చనిపోయిన లింగమ్మ వ్యథ. ఈ కథలోని ఇంజనీర్ ‘ గ్రామాల్నీ, పట్టణాల్నీ కలుపుతూ రోడ్లు వేయడం నా వృత్తి. కానీ నేను చూసిన ఆ రెండు ప్రపంచాల్నీ కలపడానికి ఏ రోడ్డు వేయాలో నాకిప్పటికీ తెలియలేదు ‘ అనుకుంటాడు.
భద్రుడి దృష్టి కోణంలో ‘ రెండు ప్రపంచాలు ‘ మూడు రకాలుగా కన్పిస్తుంది. వ్యక్తిగా తన కళాభిరుచి ప్రపంచం దాని ఎదురుగా అధికారిగా చూసే సామాజిక, రాజకీయ ప్రపంచం. రెండవది, గిరిజన అమాయక ప్రీ మోడర్న్ ప్రపంచం దాని ఎదురుగా హిపోక్రసీ నిండిన ఆధునిక మైదాన ప్రపంచం. మూడవది, భద్రుడి సృజన ప్రపంచంలో కూడా రెండుగా కన్పించే,(తన సిగ్నేచర్ ట్యూన్ లాంటి) ప్రకృతీ, పరిసరాలూ, పశుపక్ష్యాదులూ దీని ఎదురుగా సామాజిక ప్రపంచం. మొదటిదీ మూడవదీ ఒక్కటే లాగా అన్పించినా రెండింటి మధ్య సూక్ష్మమైన తారతమ్యాలు వున్నాయి. అన్ని కథలలోనూ నిష్టురమైన సమాజ దృశ్యాల పక్కనే ప్రకృతీపరిసరాలనూ చిత్రించడం వుంటుంది . సృజన బయట వున్న రెండు ప్రపంచాలు, సృజన లోపలా అదే గాఢతను సంతరించుకోవడం కన్పిస్తుంది. ఈ పన్నెండు కథల్లో ఒక్క’ ఎన్ హెచ్ 44′ తప్ప మిగిలిన వన్నీ ఉత్తమ పురుష కథనాలే. ‘ నేను ‘ చెప్పిన కథలే. ‘విందు తర్వాత ‘ కథ ఒక ఇంజినీర్ చెప్తున్నట్టూ, ‘నమ్మదగ్గమాటలు ‘ కథ ఒక జర్నలిస్టు చెప్తున్నట్టూ, ‘అవనిమయం’ కథ ఒక యువ కథకుడు చెప్తున్నట్టూ, మిగిలిన కథలన్నీ భద్రుడే నేరుగా చెప్తున్నట్టు వుంటాయి.
కథల కంఠస్వరం గంభీరంగా, ఒక నిష్టురమైన సత్యాన్ని చెప్పేవాడి గొంతులాగా, పంటి బిగువున దుఃఖాన్ని అదిమి
పట్టుకున్న వాడి గొంతు లాగా నడుస్తుంది. ప్రతి కథలోనూ
పరిసరాలను , రంగులనూ వర్ణించడం యీ కథలకు ఒక సిగ్నేచర్ ను యిచ్చింది.
మల్లిపురం జగదీష్ లాంటి ఆదివాసీ రచయిత మరొకరు లేరు. అందువల్లే ఆదివాసీ అంతరంగిక విషయాలు కథలుగా చదివే అనుభవం మనకు జరగదు. విప్లవోద్యమం నేపథ్యంలో కొందరు ఆదివాసీ రచయితల
రచనలు మనకు అందుబాటులో వున్నా వాళ్ల దృష్టికోణం
భిన్నమైనది. భద్రుడు ఆదివాసీ ప్రాంతాల్లో పుట్టడం వల్ల ఆదివాసీ విషయాల పట్ల అంకితభావంతో వుంటాడు. ఆ మేరకు భద్రుడు ఆదివాసీ ప్రాంతపు కథకుడిగా ఆ కథలే రాసాడు.మరెవరూ స్వంతం చేసుకోలేనంతగా ఆదివాసీ సమస్యలను పట్టించుకున్నాడు . భద్రుడు లోపలా బయటా అసలుసిసలు ఆదివాసీ అని యీ ఆరు కథలూ
సాక్ష్యం పలుకుతున్నాయి.
*