కొప్పర్తి సార్ తనను బహువచనం తో సంభోదించవద్దని ‘ఒక నిరాకరణ ‘ అనే కవితలో అంటాడు. అయితే ఆయన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నప్పడు అలా అనడం కూడా ఒక ప్రజాస్వామిక విలువగా భావించి అందుకైనా ఆయన్ని గౌరవించాలనిపిస్తుంది. కొప్పర్తి గారి వ్యక్తిత్వంలో మూడు పాయలను గమనించవచ్చు
1కవిగా కొప్పర్తి
2చారిత్ర అధ్యయనపరుడిగా కొప్పర్తి
3 ప్రగతిశీల ప్రజాస్వామికవాదిగా కొప్పర్తి
కవియైన కొప్పర్తిని బాధిత హృదయమే నడిపిస్తుంది. ‘చెక్కిలిపై నిలిచిన కన్నీటి బొట్టును భూగోళంగా చూడాలి, మనిషిని కావాలి ‘ అంటాడొక కవితా పాదంలో. అంటే సామాన్య మానవుడి దుఃఖం ప్రపంచపు దుఃఖంగా ఎంచే ప్రగతిశీల మార్గం తనది,
కొప్పర్తి సార్ 1974లో మొదటి కవిత రాసినా అచ్చయిన మేరకు 1981నుంచీ కవిగా ఆయన్ను చదువుకోవచ్చు. ప్రారంభ దశలో కవిత్వం అంటే
భాషలో స్తంభించిన
ఒక అనుకంపన
భావనలో అభివ్యక్తిలో ప్రదర్శితమైన
ఒక హృదయ పరిఛ్ఛేదన.
ఇది కవి అజంతా ను తలపించే విషయం. కవి అజంతా కూడా రాసింది తక్కువ కవితలే అయినా చివరిదాకా రాసిన అక్షరాల అనుకంపనకు గురవుతూనే వుండేవాడట. రాసిన మొత్తం కవితలన్నీ తనకు కంఠాపాఠంగా గుర్తుండేవట. జీవితమంతా నలభై కవితలే రాసిన కవి వాటిని తన హృదయ పరిఛ్ఛేదనతో నిర్మించి వుంటాడు. ఆలాంటి అజంతా పేరుతో అవార్డు తీసుకుంటున్న కొప్పర్తి గారు కూడా 1974 నుంచి 2026 దాకా వంద కవితలు మించి రాయలేదు. అజంతా అయినా కొప్పర్తి అయినా రాయడం రాక కాదు రాసేదేదైనా హృదయ పరిఛ్ఛేదన నుంచి రాయడాన్ని లక్షణంగా చేసుకోవడం వల్ల తక్కువ రాసారు. ఆ రాసిన రాశి అజరామరంగా నిలుపుకున్నారు. కొప్పర్తి సంఘటనాత్మక కవిత్వం కంటే ఫినామినన్ కవిత్వం రాసాడు.అక్కడక్కడా సంఘటనల మీదా వ్యక్తుల మీదా కవిత్వం వున్నా దాన్ని కూడా జనరలైజ్ చేసే పధ్ధతి, తాత్వికతను అద్దేందుకు ప్రయత్నం కన్పిస్తుంది. ఉదాహరణకు ‘దిద్దుబాటు’ అనే కవితలో ఆదర్శ వివాహం, అంతర్కుల వివాహం చేసుకున్న జంటను సాంస్కృతికమైన కుల సంకేతాలైన నలుపూ తెలుపూ రంగుల కలయికగా చెప్తూ తర్వాత ప్రతి స్టాంజా సంకేతాత్మకంగా వాడతాడు వాళ్ల జీవితాదర్శం యితరులకు వర్ణమాల దిద్దడంగా సూచిస్తాడు. ఇది ఆ జంట గురించి రాసినట్లు అన్పిస్తూనే కాన్సెప్చువల్ స్థాయిలో కూడా నిలబడుతుంది. గాంధీ మీద రాసిన మూడు కవితలు డిస్కోర్స్ స్థాయిలో నిలబడతాయి.
కొప్పర్తి గారు తన కవిత్వాన్ని బాధోపనిషత్ అంటారు. ఈ కవికి ,
‘బాధంటే కవిత్వం/ బాధంటే బతుకు/ బాధంటే ప్రపంచపు ప్రాణస్పందన/ బాధను మోసే హృదయం ధరిత్రిని మోసే శ్రమజీవి లాంటిది/బాధంటే తెలీని హృదయం చరిత్రంటే తెలీని శతాబ్దం’
కొప్పర్తికి కవిత్వమంటే మెలాంకలీ స్ట్రెయిన్.
‘ఎందుకో బాధగా వుంది
జీరలాంటి బాధ/ సన్నని తీగలాంటి బాధ / లోహపు కవచమేదో లోలోపల గుచ్చుకున్న బాధ….
కారణమేదీ లేదు/ కారకులెవరూ లేరు/ బాధ కంటే కాస్త కూడా తక్కువగా లేదు..
నులివెచ్చగా వుంది/ కొంచెం జ్వరంగా వుంది/ వొళ్లు వొళ్లంతా కవిత్వంగా వుంది.’ అని అందుకే అంటాడు.
తన కవిత్వంలో కన్నీటికి చాలా విలువుంది. తన కవిత ‘కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్ ‘లో,
‘రక్తం కన్నా కన్నీళ్లే గొప్పవంటాడు.హృదయం రక్తం లో తేలుతూ వుంటుంది గానీ దాని ఉనికిని చాటేది కన్నీళ్లే’
అంటాడు. ‘రక్తాన్ని ఎక్కించగలరు గానీ కన్నీళ్ల నెవరైనా ఎక్కించగలరా’ అని నిలదీస్తాడు.
అజంతా కవిత ‘చెట్లు విరిగిన దృశ్యం ‘ కవితలాంటిదే ఇది కూడా. అజంతా నేరుగా తన మీద ఏ సామాజిక తాత్వికతల ప్రభావముందో చెప్పుకోడు గానీ ఆయన స్వప్న లిపి చదివితే ఆ వేదనలన్నీ దిగువ మధ్యతరగతి, శ్రమజీవుల హృదయాన్ని ఆవిష్కరించేవే. కొప్పర్తి తన స్ఫూర్తి ప్రభావాలను చెప్పుకోవడానికి సంకోచించడు. ఒక ఆధునిక ఆలోచనాపరుడిగా ప్రగతిశీల భావధారను తన కవిత్వంలో, తను రాసిన వ్యాసాలలో వ్యక్తీకరించకుండా వుండలేడు. అలా అని వాటిని మొండిగా అనుసరించడు. కొప్పర్తి సార్ కు డోగ్మా చాలా దూరం. మార్క్సిస్టు ఆచరణ వాదిగా ఆయన గ్రాంసీ యిస్ట్. పోస్ట్ మోడర్న్ పరిభాషలో శకలవాది.అందుకే , ఒక ప్రజాస్వామిక వాదిగా
‘ నేను కవిత్వాన్ని/ చైతన్యాన్ని వాదాన్నీ తత్త్వాన్ని.
నేను కవిని/ ముస్లింని దళితుణ్ణి స్త్రీని ‘
అనగలుగుతాడు.
ఫక్తు భౌతికవాది, అగ్నోస్ట్ అయినప్పటికీ గాంధీ యిజపు అభిమాని. గాంధీ లోని మాస్ మొబిలిటీని గుర్తిస్తూనే గాంధీయిజంలో స్త్రీత్వాన్ని దర్శిస్తాడు.గాంధీతో పాటు బుద్ధుడు, అశోకుడు, జీసస్ స్త్రీలుగా మారిన పురుషులు అంటాడు. ఇక్కడ స్త్రీత్వం అంటే ప్రపంచానికి జీవాన్నిచ్చే శక్తి, ఆరోగ్య కరమైన పునరుజ్జీవనాన్నిచ్చే గుణమని అర్థం.
ఇలా విలక్షణంగా ఆలోచిస్తాడు కాబట్టే ప్రజాస్వామిక విలువలు ఎత్తిపట్టే విధంగా తన కవిత్వంలో వ్యక్తమవుతాడు.
కొప్పర్తి ఒక చరిత్ర కారుడు. తన చారిత్రక ద్రుక్కోణం తన కవిత్వంలో ప్రతిఫలించింది. కాలస్పృహ అనే కవితలో
‘నదీ మూలం తెలిసినట్లు
కాలమూలం తెలిస్తే బావుణ్ణు ‘ అంటాడు.
చరిత్ర ను గురించి రాస్తూ,
‘మనం లేనప్పుడు నది ప్రవహించింది.మనం ఉండనప్పుడూ నది ప్రవహించింది.’అంటూ నదీలోయ నాగరికతలను చెప్తాడు.
ఈ కవికి నదీ, చరిత్ర, కాలమూ పర్యాయపదాలు. ఒకదాని
కొకటి పూరకాలు.
శిల్ప పరంగ కవి కొప్పర్తి పర్ఫెక్షనిస్ట్. మంచి నిర్మాణంతో కవితను సాంద్రంగా మలుస్తాడు. ఈ పర్ఫెక్షనిజం వల్లనే తక్కువ కవిత్వం రాసాడు. 2013 తర్వాత కవిత్వం పక్కన పెట్టి సామాజిక వ్యాసాలు రాసాడు. అదే సంభాషణ పేరుతో వెలువడింది.
తన వ్యాసాలలో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర కు పట్టిన దుస్థితి కి చారిత్రక కారణాలను అన్వేషించాడు. కోస్తాంధ్ర ప్రాంతం రాజధాని కేంద్రంగా మారకపోవడానికి, ఒక పెద్ద నగరం నిర్మాణం కాకపోవడానికి కారణాలు వెతికాడు.వేంగీ
చాళుక్యుల తర్వాత, రెడ్డి రాజుల పాలనలో మాత్రమే రాజధాని నగరం కోస్తాంధ్ర లో వుంది. అంతకు ముందూ , ఆ తర్వాతా రాజధాని కేంద్రం కోస్తాంధ్ర బయటే వుండడాన్ని వివరించాడు. ప్రకాశం పంతులు తప్ప మరొక నాయకుడు కోస్తాంధ్ర నుంచి ఎదగకపోవడాన్ని గుర్తిస్తాడు.
చరిత్రను వ్యాఖ్యానించేప్పుడు కొప్పర్తి గారు ఆధారాల మేరకే పరిమితమవుతాడు. తన వ్యాసాల్లోకి సాహిత్య తత్వం రానివ్వడు. కవితాత్మక పదజాలం వాడడు. మార్క్సిస్టు చలనశీలత లేదా గతిశీలత ఆయన కవిత్వం లోనూ వ్యాసాలలోనూ కన్పిస్తుంది. అయితే గ్రాసీ శకలాల చరిత్రను కొప్పర్తి అనుసరిస్తాడు. అది కవిత్వం లో భాషంటే మాండలికమే అనే సమర్థనతో ఒక కవిత (‘ఒక వినిర్మాణం’) కన్పిస్తుంది. ఆధిపత్యాన్ని ధిక్కరించడంలో ‘నన్నయను మూసేసి నన్నెచోడుడ్ని తెరవడంగా ‘ అగుపిస్తుంది. ఒక ప్రజాస్వామిక వాదిగా కవిత్వంలో రాయలసీమ ను ఎత్తిపట్టడం చూస్తాం . రాయలసీమ అనే శీర్షికతో
‘ దేశపటంలో గీచిన నదులు గీతల్లా/ ఈ ధరిత్రి నిండా పగుళ్లు/ అవి శతాబ్దాలుగా హరితకు నోచుకోని చరిత్ర మిగిల్చిన ఆనవాళ్లు ‘ అని నిష్టురమైన నిజాన్ని రాసాడు.
ఇంకో చోట రాయలసీమ ను లేమికీ, పేదరికానికీ సూచనగా, కవి సమయంగా వాడాడు.
‘ ఒకే వంటగది/ మీకు మీ వంటగదిలాగా చవులూరిస్తుంటే/ వాళ్లకు మాత్రం ఎప్పటిలాగే రాయలసీమై మిగులుతుంది ‘
ఒక ప్రజాస్వామిక వాదిగా, చరిత్రకారుడిగా కొప్పర్తిని హిందూ ఆధిపత్య శక్తులు చేస్తున్న నర్రేషన్ ఎక్కువ బాధ పెట్టినట్లుంది. ఎన్నో అబద్ధాలు జన సమూహాలను మాయజేసి ద్వేషం వెదజల్లడానికి కారణమవడం చూసి వేదనకు గురి చేసినట్లుంది.
నెహ్రూ ఒక ముస్లిం అనీ
హరప్పా మొహంజదారో నాగరికత ను ఆర్యులే నిర్మించరనీ
ఆర్యులు భారతదేశం నుంచి సెంట్రల్ ఏసియాకు వలస వెళ్లారనీ
భారత దేశానికి స్వాతంత్ర్యం అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాతనే వచ్చినట్లనీ
అయోధ్య లో రామాలయం ప్రజాస్వామ్య న్యాయ వ్యవస్థ చర్చల ద్వారా సాకారమైందినీ
రాముడు చారిత్రక పురుషుడనీ
రాముడే నల్లనివాడై రావణుడు బ్రాహ్మణుడు అయినప్పుడు వర్ణ వివక్ష ఎక్కడున్నట్లనీ
ప్రపంచంలో ఎన్నో దేశాలకు మత జాతీయత వున్నప్పుడు భారతదేశంలో హిందూ జాతీయవాదం ఎందుకు వుండకూడదనీ
ఇలాంటి ఆర్గుమెంట్లు ప్రచారం చేస్తూ సత్యానంతర కాలంలోకి మనం అడుగుపెడుతున్న సందర్భంగా కొప్పర్తి సార్ కవిత్వం వదిలేసి వ్యాసాల ద్వారా ఈ అసత్యాలను పూర్వపక్షం చేసేందుకు ప్రయత్నించాడు.ఈ సందర్భంగానే గ్రాంసీనీ, రోమిళ్లా థాపర్ నూ డివివిఎస్ మూర్తి గారనీ వ్యాసాలతో ఆవిష్కరించాడు.
ఒక ఆలోచనాపరుడిగా ఆధునికుడు కొప్పర్తి. ఆయన్ను గౌరవించుకోవడమంటే ప్రజాస్వామిక విలువలను ఎత్తిపట్టడమే. ధ్వేషభావాలు పెచ్చరిల్లుతున్న వర్తమానం లో దానికి ప్రతిగా భావజాల శిబిరాన్ని ప్రచారం చేయడమే. ఆ మేరకు సామరస్యం కోసం మనం ప్రయత్నించడమే. పాతనూ, పనికిరాని చెత్తనూ వూడ్చి, మన ప్రాంగణాన్ని సర్వజనహితం చేయాలనుకోవడమే. ఆయన్ను గౌరవించుకోవడమంటే మనల్ని మనం విమర్శించుకోవడాన్ని ప్రోత్సహించడమే. ప్రజాస్వామిక సమాజంలో ఆత్మ విమర్శ చాలా అవసరం. ఈ పనికి పూనుకున్న పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘాన్ని గౌరవవందనంతో అభినందిస్తున్నాను.
*




