ఆమె సరోజనే. బాగా పరిచయం ఉన్న మనుషులు కూడా, కొంచం కూడా ఎదురుచూడని ప్రదేశంలో, ఉన్నట్లుండి తారసపడితే, తడబాటు చెందడం సహజం. తిరుమారన్ ఒక్క క్షణం స్తంభించినట్లు అలాగే నిలబడి పోయాడు. గత ఆరేళ్లలో ఆమె ఎక్కడ ఉంది, ఏం చేస్తోంది అని తెలుసుకోవడానికి అతను కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు, ఆమె సన్నిహితుల గురించి ఎటువంటి కబురూ తెలియలేదు. ఆమె ఫేస్నుక్ వంటి మాధ్యమాలలో ఎటువంటు పోస్టులు పెట్టనందు వలన కొత్తగా ఏ విషయమూ తెలియలేదు. ఒకసారి ఆమెకు ఫోన్ చేయాలని చూసినప్పుడు ఆమె పాత నంబరు ప్రస్తుతం పనిచేయడం లేదని తెలిసింది.
ఫ్రీ మాంట్ అంటే కాలిఫోర్నియాలో ఉండే ఒక మినీ ఇండియా. పార్క్ బెంచిమీద కాస్సేపు కళ్ళు మూసుకుని ఉన్నట్లుండి కళ్ళు తెరిస్తే, ఏ హైదరాబాదులోనో, చెన్నైలోనో ఉన్నాము కాబోలు అని అయోమయం చెందుతాం. టార్గెట్ అంగాడిలో ఇంటికి కావలసిన కిరాణా సామాన్లు కొందామని వచ్చాడు తిరుమారన్. వచ్చిన పని అవగానే, ట్రాలీలో సామాన్లను పెట్టి తోసుకుంటూ బైటికి వచ్చి కారు వైపు వెళ్తున్నప్పుడే ఆమెను చూశాడు. ఆమె ఇతడిని చూడలేదు. తన కారు దగ్గర ట్రాలీని ఆపి సామాన్లను కారు వెనక వైపు లోడ్ చేస్తోంది. ఇతను ఎక్కువ సామాన్లను కొనలేదు కాబట్టి త్వరగానే సామాన్లను కారులో లోడ్ చేసి, ట్రాలీని దానికై కేటాయించిన ప్రదేశంలో పెట్టేసి తిరిగి వచ్చాడు. సరోజ చాలా సామాన్లు కొన్నట్లు ఉంది. ఇంకా లోడ్ చేస్తూ ఉంది. తిరుమారన్ గభాలున తన కారులో ఎక్కి కూర్చున్నాడు. ఎందుకనో ఆమె కంట పడడం ఇతనికి ఇష్టం లేదు.
తిరుమారన్ చూపు తిప్పుకోకుండా అలాగే ఆమెకేసి చూస్తూ, చేతిలో ఉన్న స్టార్ బక్స్ కాఫీ తాగసాగాడు.వేడిగా ఉంది.
సరోజను అతను ఆఖరు సారిగా కలుసుకున్నప్రదేశం, అంత ఆహ్లాదం కలిగించేదేమీ కాదు. చెన్నై, సైదాపేట ఫేమిలీ కోర్టు ఆవరణలో తల్లితండ్రులతో ఆమె నిలబడి ఉన్నప్పుడు చూశాడు. తిరుమారన్‍తో మూడేళ్ళ వివాహబంధం చట్టరీత్యా ఒక ముగింపుకు వచ్చిన రోజు. సరోజ పూర్తిగా రూపు మాసిపోయినట్లు కనబడింది.శూన్యం నిండిన కళ్ళతో నేలమీద పడి ఉన్న వేపపువ్వులనే చూస్తూ ఉండి పోయింది. తిరుమారన్ మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె అతడిని తలెత్తి కూడా చూడలేదు.
పెద్ద పెద్ద కళ్ళలో నీళ్ళు పూర్తిగా నిండి ఉన్నాయి. ఏ క్షణంలోనైనా బైటికి రావడానికి సిద్దంగా ఉన్నాయి.
“అర్ధం చేసుకో సరూ!” అని సంభోదించిన వాడల్లా, వెంటనే తమాయించుకుని, “సరోజా!” అని మార్చుకున్నాడు. తయారుగా ఉన్న కన్నీళ్లు బైటికి చిప్పిల్లాయి,
“ఇదే నీకూ నాకూ ఇద్దరికీ కూడా మంచిది. అమెరికా జీవితంలో నువ్వు అంతగా ఇమడలేక పోయావు. నువ్వు పెరిగిన వాతావరణం అలాంటిది. నేను చాలా ఓర్పు వహించాను. నీకే తెలుసు. సరే పోనివ్వు. ఏమేమో జరిగి పోయాయి.”
ఆమె ఏమైనా చెబుతుందేమోనని ఎదురుచూశాడు తిరుమారన్. కానీ ఆమె మౌనంగా ఉండి పోయింది. కొన్ని క్షణాల గాఢమైన నిశబ్ధం తరువాత దీర్ఘంగా నిట్టూర్చాడు
“ఎని వే… పరస్పర అంగీకారంతో ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నాం. ఆ విషయంలో నాకు సంతోషం. నేను కూడా నాలుగు రోజుల తరువాత అమెరికా వెళ్తున్నాను. వి కెన్ బి గుడ్ ఫ్రెండ్స్!”
ఆన్ లైన్ వివాహ వేదిక ద్వారా జాతకాలు, జాతి, అంతస్తు, మతం, రంగు అన్నీ చూసుకున్న తరువాతే వాళ్ళ పెళ్లి జరిగింది. సరోజ బి.ఏ. హిస్టరీ చదువుకుంది. సుమారుగా పాడుతుంది. గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ చేసింది. చూడగానే మనసులో నిలబడి పోయే ముఖవర్చస్సు. విశాలమైన కళ్ళు, వంపు తిరిగిన కనుబొమలు, రెండవసారి చూడాలనిపించేటంత అందం.
తిరుమారన్ అప్పుడే అమెరికాలో టెక్సాస్ నగరానికి ఆన్ సైట్ ఉద్యోగంలో భాగంగా వెళ్ళాడు. అమెరికా అబ్బాయి అనగానే మేట్రిమోనియల్ సంతలో గిరాకీ ఎక్కువయ్యింది. సరాసరి ఎత్తు, చిరుపాటి బొజ్జ ఉన్నా కూడా ఏ వంకలూ పెట్టలేని రూపం. సరోజ అందాన్ని చూడగానే అతను మైమరిచి పోయాడు. అప్పటికీ అతని అక్కయ్య మాలతి అంది.
“జాబ్‍కి వెళ్ళే అమ్మాయిని చూసి చేసుకోరా. ఇద్దరూ సంపాదిస్తే గాని ఆక్కడ నిభాయించుకోవడం కష్టం. ఇండియాలో లాగా కాదు.”
“అక్కా! అమెరికాకు వచ్చి చూడు. ఉద్యోగానికి వెళ్తున్న అమ్మాయిలు కూడా, పిల్లలను చూసుకోవడానికి ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటున్నారు. నేను కావలసినంత సంపాదిస్తున్నాను. ఆమె ఇంట్లో సంసార పక్షంగా ఉంటే చాలు.”
“ఇప్పుడు అలాగే అంటావు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఖర్చులు ఎక్కువైనప్పుడు తెలుస్తుంది. నువ్వు ఆమె మత్తులో పడిపోయావు. ఇక మీదట ఏం చెప్పినా నీ చెవులకు ఎక్కదు. పోరా పో.”
ప్రీ వెడ్డింగ్ షూట్ అని సరోజను పిలుచుకుని ఇద్దరు స్నేహితులతో కొడైకానల్ వెళ్లదానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రయాణానికి మొదటి రోజు అతనికి సరిగ్గా నిద్ర పట్టలేదు. సరోజ తరపున రావడానికి అంత దగ్గరి స్నేహితురాళ్ళు ఎవరూ కెరు. అమ్మా, నాన్నా వస్తే బాగుండదు అని ముందే ఖచ్చితంగా చెప్పేశాడు. ఆమెతో స్కూలులో చదువుకున్న స్నేహితురాలు ప్రేమ తోడుగా రావడానికి ఒప్పుకుంది. ఆమె కాస్త రెబెల్ టైప్.
“ఎందుకమ్మా దిగులు పడతారు? సరోజ గురించి మీకు తెలియదా? మదర్ తెరెసాకు ఏకైక వారసురాలు. తోడుగా నేను వెళ్తున్నాను కదా. జాగ్రత్తగా చూసుకుంటాను.” హామీ ఇచ్చింది.
సరోజకు సిగ్గు ఎక్కువ అన్నది అతనికి అప్పుడే తెలిసింది. అతని స్నేహితులతో ఎంతో ఆలోచించి, ముక్తసరిగా నాలుగు మాటలు మాట్లాడింది. ఒక మూలగా ఒంటరిగా నిలబడింది.
“సరదాగా ఉండు సరోజా! ఎందుకు ఇంత భయపడుతున్నావు?” మళ్ళీ మళ్ళీ అడిగిన తరువాత చెప్పింది.
“నాకు బైటికి వచ్చి ఇలా తిరడం అంతా అలవాటు లేదు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు కూడా స్నేహితులతో ఇలా నన్ను బైటికి పంపించిందిలేదు.”
తిరుమారన్ స్నేహితులు ఇద్దరు వెంట వచ్చారు. వాళ్ళు చేసిన రభస అంతా ఇంతా కాదు. ఒకటే గోల… ఫోటో షూట్ పేరిట వాళ్ళు చేసిన రచ్చ చూసి సరోజ ఇంకా బెదిరి పోయింది. క్రైస్తవుల పెళ్ళిలో వేసుకునే తెల్ల గౌను ఆమెకు ఇచ్చారు. తిరుమారన్ కోటు సూటు ధరించాడు.
“అయ్యో! ఇలా వేసుకుంటే, అమ్మకు తెలిస్తే తిడుతుంది.”
“ఏంటి సార్! మేడం దీనికే ఇలా అంటున్నారు. మేము బికినీ డ్రస్సులో కూడా ఫోటో షూట్ చేశాము.” బవిరి గడ్డంతో, గీత గీసినట్లు కనుబొమలను షేప్ చేయించుకున్న ఫోటోగ్రాఫర్ విసుగును ప్రకటించాడు.
సరోజ ససేమిరా ఒప్పుకోలేదు. ప్రేమ ఆమె తల్లికి ఫోన్ చేసింది.
“ఎందుకే పరువు తీస్తున్నావు. అంత దూరం వెళ్లావు కదా. అల్లుడుగారు చెప్పినట్లు నడుచుకో.”
పట్టుచీర ధరించి చలవ కళ్ళజోడు పెట్టుకుని బులెట్ నడపమని… ఇంకా ఏదేదో చెయ్యమని చెప్పారు. సరోజకు ముచ్చెమటలు పోశాయి.
ఫోటోగ్రాఫర్ తిరుమారన్‍ని పక్కకు తీసుకు వెళ్లి చెప్పాడు.
“సార్! మేడం చాలా బిగుసుకు పోయినట్లు ఉన్నారు. కొంచెం కూడా నవ్వు ముఖం పెట్టడం లేదు. జీవితాంతం ఉండబోతున్న విషయం ఇది. మీరే కాస్త నచ్చ చెప్పాలి. బోలెడు ఖర్చు చేసి ఇంత దూరం వచ్చాము.”
తిరుమారన్ సరోజ దగ్గిరికి వచ్చాడు. అతని గొంతులో కాస్త కరుకుదనం.
“ఏమిటి సరోజా! మన వేదా ఈ షూటింగ్ కోసం బులెట్ మీద తిరుచ్చి నుంచి వచ్చాడు. నువ్వు కాస్త నవ్వు ముఖం పెట్టుకోలేవా?”
“అనుకున్నంత మాత్రాన ముఖభావాలను మార్చుకోవడానికి నేనేమైనా సినిమా నటినా? వా వల్ల కాదు. నన్ను వదిలెయ్యండి.” మనసులో రోదించింది. బైటికి చెప్పలేదు. తలను మాత్రం ఆడించింది. ఆ తరువాతే అసలు నాటకం మొదలయ్యింది.
“మేడం! అలాగే సార్ పెదవులకు క్లోస్‍గా వెళ్ళండి. ముద్దు పెట్టుకోనక్కరలేదు. కానీ పెడుతున్నట్లు ఫీలింగు ఉంటుంది కదా, ఆ ఫీలింగును చూపించాలి.”
“సార్! మీరు షర్ట్ విప్పేసి ఇలా నీళ్ళలో నిలబడండి. ఆవిడను అలాగే ఎత్తి పట్టుకోగలరా?”
సరోజకు ఎలా ఉందో గానీ, ప్రేమ మాత్రం ఆ రెండు రోజులూ పండగ చేసుకుంది. వీళ్ళకు చేసి చూపించే సాకులో వేదకుమార్‍తో విడిగా ఒక ఫోటో షూట్ కొనసాగించింది.
“ఏంటి మేడం మీరు? ప్రేమా మేడంను చూడండి. ఆ ఫీలింగును అలాగే మీ ముఖంలో తీసుకురావాలి.”
సరోజకు ఏడుపు మాత్రమే వచ్చింది.
ఏడుపును పెదవుల మధ్య బిగబట్టి ఎలాగో గట్టెక్కించింది. ఫోటో షూట్ ముగించుకుని చెన్నైకి తిరిగి వచ్చేసరికి ఆమెకు ప్రాణం పోయినట్లు అనిపించింది. కారులో తిరిగి వస్తున్నప్పుడు తిరుమారన్ బిగుసుకు పోయిన ముఖంతోనే ఉండి పోయాడు. అతను ఏవేవో ఊహించుకున్నాడు.
ఇంటికి వచ్చాక సరోజకు బాగానే అక్షింతలు పడ్డాయి.
“ఆయన అమెరికా నుంచి వచ్చిన మనిషి. కాస్త ఫ్రీగా ఉండాలని ఎదురుచూస్తారు కదా. అల్లుడిగారి అక్కయ్య ఫోన్ చేసి చెప్పింది. షూట్ ముగించి వచ్చినప్పటి నుంచి తమ్ముడికి మూడ్ బాగా లేదట. భోజనం చెయ్యకుండానే పడుకున్నాడట. ముందు నువ్వు పిలిచి మాట్లాడు. తలక్రిందులుగా నిలబడి తపస్సు చేసినా ఇలాంటి సంబంధం దొరకదు. నువ్వు చేజేతులా పాడు చేసుకోకు.”
సరోజకు పట్టరానంత ఆగ్రహం వచ్చింది. స్కూల్లో చదువుకుంటునప్పుడు ఒకసారి నాటకంలో నటించడానికి పేరు ఇచ్చి వచ్చిందని ఆమె నాన్నగారు చెంప చెళ్ళుమనిపించారు. ఆ తరువాత అలాంటి కోరికలను మనసులోనే అణచి వేసింది. కొత్త మనుషులతో కలివిడిగా వ్యవహరించడం ఆమె స్వభావంలోనే లేదు. చాలా రోజుల పరిచయం తరువాతే కొద్దిగా మాటలు కలుపుతుంది. ఆమె తల్లికి ఇదంతా తెలుసు. ఉన్నట్టుండి అమెరికా అల్లుడి కోసం కొత్తగా సరోజ ఎక్కడినుంచి పుట్టుకు వస్తుంది?
గది తలుపులు బిగించుకుని కాస్సేపు కరువుతీరా ఏడ్చి, తన మొబైలు తీసింది. తిరుమారన్‍ని పిలిచింది.
“హలో!” అంటీ ముట్టనట్లు ధ్వనించింది అతని గొంతు.
“నా మీద కోపమా?”
“లేదు.”
“అలా కాదు. నాకు తెలుసు, మీకు కోపం వచ్చిందని. ఐ యాం సారీ. నేను మిమ్మల్ని చాలా అప్సెట్ చేశాను. నాకు ఇదంతా అలవాటు లేదు. ఇకపైన అలవాటు చేసుకుంటాను. కాస్త టైం ఇవ్వండి.” వెక్కి వెక్కి ఏడవ సాగింది.
“ఏయ్ సరోజా! పిచ్చిదానా! ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నీ మంచి కోసమే కదా చెబుతున్నాను. రేపు నువ్వు అమెరికాకు వచ్చి ఉండబోతున్నావు. అక్కడ అంతా ఓవరుగా, స్టైలుగా ఉంటారు. నువ్వు ఇదంతా అలవాటు చేసుకోవాలి. లేకపోతే అక్కడ చాలా ఇబ్బంది పడతావు.”
“అర్ధం అయ్యింది. నేను మార్చుకుంటాను.” పైకి అలా అన్నా కూడా ఏదో తెలియని జంకు ఆమె మనసులో వ్యాపించింది. అతనికి తనంటే ఇష్టం లేకుండా పోతుందో ఏమో? అతనికోసం ఏమైనా చెయ్యడానికి ఆమె తయారయ్యింది. ఆమెకు సాయం చేయడానికి ప్రేమ ముందుకు వచ్చింది.
“దీని కోసమా ఇంత సేపు ఏడుస్తూ కూర్చున్నావు?”
టెక్స్ట్ మెసేజీలు పంపించడం ఎలాగ అని మొదలు పెట్టి, ఎలాంటి లిప్ స్టిక్ వేసుకోవాలి అన్న దాకా నేర్పించింది. బుక్ మై షోకు టికెట్లు బుక్ చేసి పంపించినప్పుడు, తిరుమారన్ ఆశ్చర్య పోయాడు. ఈ మార్పు అతనికి బాగా నచ్చింది. ఆమె గిఫ్ట్ గా ఇచ్చిన పెర్ఫ్యూం అతన్ని మైకంలో ముంచేసింది. ఆమె వేసుకున్న న్యూ మాడల్ దుస్తులు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి.
“సరోజా! ఎంత అందంగా ఉన్నావో తెలుసా?”
ఆమె సిగ్గుపడుతూ మెల్లిగా నవ్వింది.
పెళ్లి సవ్యంగా ముగిసింది. టెక్సాస్‍కి చెందిన ఆస్టిన్ నగరంలో ఆమె దాంపత్య జీవితం మొదలయ్యింది. విమానంలో ఎక్కి అక్కడ విమానాశ్రయంలో దిగుతున్నప్పుడే గొంతులో భయం తాలూకు బంతి ఒకటి అడ్డం పడి, ఊపిరి ఆడనివ్వకుండా చేసింది. పెద్ద పెద్ద రోడ్లు, తోక పట్టుకుని వెళ్తున్నట్లు వేగంగా వెళ్తున్న కార్లు… చూస్తున్న కొద్దీ విభ్రాంతి కలిగింది. ఇరుగు పొరుగులో ఉన్న తమిళనాడుకు చెందిన కుటుంబాలు కొన్ని వచ్చి పలకరించి వెళ్ళాయి. టప్పర్ వేర్ డబ్బాలలో ఏవేవో వంటకాలు తీసుకు వచ్చారు. బిందు చెన్నైకి చెందిన ఇల్లాలు. మలయాళీ. ఇక్కడికి వచ్చి రెండేళ్ళు అవుతుందట. తనే ఇంటికి వచ్చి పరిచయం చేసుకుంది. నవ్వు ముఖం, సాయం చేసే స్వభావం. సరోజకు వెంటనే ఆమెతో సాన్నిహిత్యం ఏర్పడింది.
“మొదట్లో నాకు కూడా ఇలాగే ఉండింది. నీకు అన్నీ నేను నేర్పిస్తాను. మనిద్దరం కలిసి షాపింగ్ వెళ్దాం.”
సరోజ ఇక్కడి వచ్చిన రెండవ వారాంతరంలో స్థానికంగా ఉన్న స్నేహితుల కోసం ఒక పార్టీ ఏర్పాటు చేశారు. అతిథులు పట్టిక చూసిన తరువాత గొంతుకు అడ్డంగా ఉన్న బంతి మరి కాస్త పెద్దగా అయినట్లు అనిపించింది. సరోజ బిందును రమ్మని పిలిచింది.
“భయంగా ఉంది.”
“నేను చూసుకుంటాను.”
ఇంటి ముందున్న లాన్‍లో బార్బెక్యూ విందు. సాయంత్రం నాలుగు గంటల నుంచి అతిథులు రావడం మొదలైయ్యింది. తమిళం, తెలుగు మాట్లాడే గుంపు అది.
సరోజ ఒక తెల్లజాతి స్త్రీ చెయ్యిని అప్పుడే మొదటిసారిగా పట్టుకుని షేక్ హేండ్ ఇచ్చింది. పత్తిలాగా సుతిమెత్తగా ఉన్న ఆ చేతిలో అసాధారణమైన బలం. ఆమె కన్నా ఒకడుగు ఎక్కువ ఎత్తు. ఒక చేతిలో వైన్ బాటిల్ పట్టుకుని నిలబడింది. పెద్ద గొంతుతో మాట్లాడుతూ, అంతకన్నా పెద్ద గొంతుతో నవ్వింది. ఆమె బాయ్ ఫ్రెండ్ రోడ్రిక్ మెడలో పాములాగా టాటూ వేసుకుని ఉన్నాడు. చేతిలో గిటార్. ఆకుపచ్చ రంగులో కళ్ళు. ముందే పరిచయమున్న స్త్రీలను సుతారంగా హగ్ చేసుకుంటూ స్వాగతం పలికాడు.
అతను తనను సమీపించడం చూసి సరోజ సన్నగా కంపించింది. తను కూడా అతడిని హగ్ చేసుకోవాలా అన్న సందేహం కలిగింది. సంశయాన్ని తీర్చుకోవడానికి బిందు పక్కన లేదు. సరోజ దగ్గరికి రాగానే, “నమస్తే!” అంటూ చేతులు జోడించాడు రోడ్రిక్. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది సరోజకు.
బార్పెక్యూ అన్న పేరిట మాంసం మధ్యాహ్నం నుంచి సన్నని మంట మీద కాలుతూ ఉడుకుతోంది. అక్కడ ఉన్న బార్బెక్యూ రెస్టారెంటులో ఆర్డర్ ఇస్త్రే, తారు బండిలాంటి ఒక వాహనానికి ట్రక్కు జోడించి తీసుకు వచ్చేస్తారు. ఇంటి ముంగిట్లో కట్టెలు పేర్చి, మాంసపు ముక్కలను కాల్చి వడ్డిస్తారు. ఎటువంటి కట్టెలతో కాలిస్తే ఎలాంటి రుచి వస్తుంది అన్నదానికి ఒక పద్ధతి ఉంటుంది.
రోడ్రిక్ గిటారు వాయిస్తూ కాస్సేపు పాడాడు. మధురమైన గొంతు. అందరూ చప్పట్లు కొట్టి మరీ ఆస్వాదించారు. వైన్ మరియు బీరు ఏరులాగా పారాయి.
బిందు మాత్రం ఆ రోజు పక్కన లేకుంటే సరోజ ఉక్కిరిబిక్కిరి అయ్యేది. ఎందుకంటే మొదటి కప్పుతో టోస్ట్ చేసి ఆమెను అందరికీ పరిచయం చేసిన తరువాత తిరుమారన్, సరోజను పూర్తిగా మర్చిపోయాడు. ఆడా, మగా అంటూ అతనికి స్నేహితుల గుంపు ఒకటి. కప్పు ఖాళీ అవుతున్న కొద్దీ నింపుకుంటూ మరీ తాగుతున్నాడు. అతను అంత ఎక్కువగా తాగుతాడని ఆమెకి తెలియదు.
“నీకు ఏం కావాలి?”
“ప్చ్… ఏదో ఒకటి.”
బిందు లేచి వెళ్లి ప్లేటులో వేసి తీసుకు వచ్చింది. నిప్పులో కాల్చిన మాంసపు వాసన ఆమెకు కొత్త. ఎలాగో కష్టపడి తినేసింది. పెరుగన్నం ఉంటే చాలనిపించింది. ఉన్నట్టుండి అమ్మతో మాట్లాడాలని అనిపించింది. మాంసం సరిగా ఉడకలేదు కాబోలు. తినడానికి చాలా కఠినంగా అనిపించింది. కానీ అదే వేపుడును ఆస్వాదిస్తూ తింటోంది బిందు.
“సూపర్ గా ఉడికింది. ఇంత మెత్తగా టెక్సాస్‍లో తప్ప లోకంలో ఎక్కడా బీఫ్ దొరకదు.”
సరోజ లేచిన వేగానికి ఆమె వడిలో ఉన్న ప్లేటు ఎగిరి కార్పెట్ అంతా బార్బెక్యూ సాస్ ఒలికి పోయింది. అంతకన్నా వేగంగా బాత్రూం వైపు పరుగులు పెట్టే లోపల వికారంతో కడుపు తిప్పి, బాత్రూం గడప దగ్గరే సరోజ వాంతి చేసేసుకుంది. బిందు పరుగున వచ్చి స్వాంతనగా పట్టుకుంది.
ఆ తరువాత పార్టీ త్వరితంగా ముగిసి పోయింది.
“ఇట్స్ ఓకే తిరుమారన్. ఇంకో రోజు సెలెబ్రేట్ చేసుకుందాం. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ సరోజ!” అంటూ అతడిని ఓదార్చి అందరూ వెళ్లి పోయారు. తిరుమారన్ అర్ధమనస్సుతో అందరినీ సాగనంపి లోపలికి వచ్చాడు.
సరోజ మూడవసారిగా వాంతి చేసుకుంటూ ఉంది. తిరుమారన్ తల పట్టుకుని కూర్చుండి పోయాడు.
“ఏమయ్యింది మారన్! అంతా చేసేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు ఇలా చూస్తున్నారే?” బిందు బాత్రూం అంతా కడిగి శుభ్రం చేస్తూ అడిగింది. అతనికి ఇంకా అర్ధం కాలేదు.
“మొగుడూ పెళ్ళాం ఇద్దరూ కళ్ళప్పగించి చూడండి! నాకు ఆలస్యం అవుతోంది. సరోజా! నేను రేపు వస్తాను. కన్ఫర్మ్ చేసుకుందాం.” కొంటెగా కన్ను గీటి వెళ్లి పోయింది బిందు.
అప్పుడే తిరుమారన్ బుద్దికి స్పురించింది. బిందును సాగనంపి తలుపులు వేసేసి మేడ మీదికి వచ్చాడు. సరోజ మూడంకె వేసి పడుకుని ఉంది. తిరుమారన్ కోపంతో వార్డ్ రోబ్ ను కాలితో తన్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
“ఆర్ యూ ప్రెగ్నెంట్?”
ఆమె తలెత్తి చూసింది. ఏమీ చెప్పలేక పోయింది. గది మొత్తం గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది.
“షిట్!” రెండు చేతులతో తల పట్టుకుని మంచం మీద కూర్చున్నాడు.
“సంవత్సరం దాకా వద్దు అని చెప్పాను కదా ఇడియట్! ‘కాండం’ లేని సమయం చూసి దగ్గరికి వచ్చి కావలించికోవడం, డేట్స్ సరి చూసుకున్నానని ఇకిలించడం… మేటర్ అంటూ వస్తే నువ్వేమీ తక్కువదానివి కాదు. వేరే ఏదైనా చేయమంటే మాత్రం సిగ్గు ఎక్కువ అని బుకాయింపు.”
తాగిన మైకంలోనూ, కోపంలోనూ మాటలు హద్దులు లేకుండా రాసాగాయి. సరోజ ఏడవసాగింది.
“ఏడుస్తూ కూర్చో, అది ఒక్కటి మాత్రమే తెలుసు. వేరేమీ తెలియదు. వచ్చినప్పటి నుంచి ఇదొక్కటి మాత్రమే కదా చేస్తూ ఉన్నావు? ఏమో నేను హత్య చేయడానికే నిన్ను ఇండియానుంచి ఇక్కడికి తీసుకు వచ్చినట్లు దేభ్యం ముఖం పెట్టుకుని తిరగడం. అంతా నా తలరాత!” మళ్ళీ ఇంకోసారి వార్డ్ రోబును తన్నాడు. బెడ్ రూమ్ తలుపులు తీసి ధడాలున మూసేసి బైటికి వెళ్ళిపోయాడు.
సరోజ వెక్కిళ్ళుపెట్టి ఏడవసాగింది. “అమ్మా!” అని పెదవులు ఉచ్చరించాయి. కానీ శబ్దం బైటికి రాలేదు. చప్పుడు చేయకుండా ఏడిచింది. తిరుమారన్ అలా ఎప్పుడూ తూలనాడింది లేదు. కానీ అది ఆనకట్ట తెగిన తరుణం. ఆ తరువాత ఆ ప్రవాహం ఆగనే లేదు.
మర్నాడు వంట్లో నలతగా ఉన్నా లెక్క చేయకుండా లేచి వంట చేసింది. తిరుమారన్ తినకుండానే ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. పదకొండు గంటల తరువాత బిందు ఒక అట్టపెట్టెతో సహా వచ్చింది. గర్భనిర్ధారణ చేసే కిట్. దానిని ఎలా ఉపయోగించాలో తను చెబుతుంటే సరోజకు సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది.
“అయ్యో పాపం! చిన్నపిల్ల సిగ్గు పడుతోంది. వెళ్లి నేను చెప్పినట్లు టెస్ట్ చెయ్యి. గుర్తు పెట్టుకో. సరిగ్గా చేయాలి. నువ్వే చేసుకోగలవా? నేను హెల్ప్ చెయ్యనా?”
“వద్దు వద్దు” అన్నది సరోజ కందిపోయిన ముఖంతో. సరిగ్గా ఐదు నిమిషాల తరువాత సంకోచిస్తూ మునివేళ్ళతో పట్టుకున్న స్ట్రిప్‍ను చూపించింది.
బిందు ముఖంలో రంగులు మారాయి. “ఇదేమిటి? నెగటివ్ చూపిస్తోంది?”
“మీరే చాలా తొందరపడ్డారు” అంది సరోజ.
పది నిమిషాల తరువాత బిందుకు కాఫీ కలిపి ఇస్తూ జంకుతూ చెప్పింది సరోజ. “నాకు బీఫ్ తిని అస్సలు అలవాటు లేదు. నిన్న మీరు బీఫ్ అని చెప్పగానే కడుపులో తిప్పేసింది.”
“”దేవుడా! ఈ ముక్క అప్పుడే చెప్పి ఉండొచ్చు కదా?”
సరోజ నిదానంగా ఒక గుక్క కాఫీ తాగింది. తరువాత చెప్పింది. “అలా కాదు. మీరు ఏదో తెలియక ఇచ్చారు. నేను అప్పుడే చెబితే మీరు ఫీల్ అవుతారు కదా. ఈ ఊళ్ళో నాకు ఉన్న ఒకే ఒక స్నేహితురాలు మీరు” అంటూ కంట నీరు పెట్టుకుంది.
“సరోజా! నేను చెప్పేది కాస్త విను. నిన్న ఆ జెన్నీ వచ్చింది కదా. ఆమె వీగన్. గుడ్డు, పాలు ఏమీ ముట్టదు. ఆమెకు తినడానికి ఏమీ లేదని సలాడ్ పెట్టుకుని తిన్నది. ఆమె బాయ్ ఫ్రెండ్ రోడ్రిక్ చచ్చిన జంతువు ఏదైనా సరే తినేస్తాడు. ఈ దేశంలో ఎలాంటి క్రేజీ ఉన్నా, ఒక్క విషయంలో మాత్రం ప్రాణం పోయినా సరే వదులుకోవడానికి సిద్దంగా ఉండరు. అది వ్యక్తిగత స్వేచ్చ! అందువలన అందరూ మళ్ళీ మళ్ళీ తమకి నచ్చినవి, నచ్చనివి చెబుతూ ఉంటారు, కాస్త అధిక ప్రమాణంలోనే. రెస్టారెంటుకు వెళ్లి ఒక కాఫీ తాగాలన్నా సవాలక్ష నిబంధనలు పెడతారు. ప్రతి ఒక్కరు తాగే కాఫీ వేరు వేరుగా ఉంటుంది. ఇక్కడ నువ్వు ఏం నేర్చుకుంటావో లేదో. తప్పకుండా ఈ విషయం నేర్చుకోవాలి.”
“థాంక్స్ అక్కా!” అన్న సరోజను దగ్గరికి తీసుకుని కౌగలించుకుంది బిందు.
“చూశావా! అందుకే నేను ఎవరికీ సలహాలు ఇవ్వను. వెంటనే నా వయస్సును ఎక్కువ చేసేస్తున్నావు. బిందు అని పిలువు చాలు. సరే, నువ్వు రెడీగా ఉండు. మధ్యాహ్నం షాపింగ్ వెళ్దాం. అదే ఇక్కడ లేడీస్ టైం.”
తిరుమారన్ సాయంత్రం వచ్చాడు. మెల్లిగా విషయం చెప్పగానే అతని ముఖంలో రంగులు మారాయి. కోపం పోయి ప్రశాంతత చోటుచేసుకుంది. ముందురోజు తాను కటువుగా మాట్లాడినట్లు అతనికీ అర్ధం అయ్యింది. ఆ రాత్రి అతనే దగ్గరికి వచ్చి కౌగలించుకున్నాడు. సరోజ రహస్యంగా కళ్ళు తుడుచుకుంది.
జరిగినది అంతా తల్లితో చెప్పినప్పుడు, “మీ నాన్నతో ఇన్నేళ్ళ బట్టీ నేను కాపురం చెయ్య లేదా?” అని ఆవిడ సణిగింది.
ఆ తరువాత ఎప్పుడు తాగి వచ్చినా సరోజలోని లోపాలను వల్లించడం అతనికి అలవాటై పోయింది. ఇలాగే ఒక ఏడాది గడిచి పోయింది. ఇప్పుడు అదే సమస్య వేరొక రూపంలో ఎదురయ్యింది.
“నువ్వు ఒక పిచ్చోడివి. ఇప్పటికే ఇక్కడ మన వాళ్ళందరూ ఒక మాదిరిగా మాట్లాడుకుంటున్నారు. మామయ్య కూతురు, ఆమె మొగుడూ ఇలాగే వద్దు వద్దు అని వాయిదాలు వేశారట. ఆ తరువాత ఒక బిడ్డ కోసం లక్షల కొద్దీ ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇదంతా నీ ఐడియానా, లేక ఆవిడగారిదా? హీరోయిన్ లాగా అందం తగ్గి పోకుండా చూసుకుంటోందా?”
ప్రతిసారీ స్కైపులో మాట్లాడుతున్నప్పుడు, తిరుమారన్ అక్కయ్య మాలతి పురాణం మొదలు పెడుతుంది. పిల్లలు ఇప్పట్లో వద్దు అని అనుకున్న తిరుమారన్ ఒకానొక ఘట్టంలో అమెజాన్ ప్రైం డెలివరీ లాగా వెంటనే పిల్లలు కావాలని మొదలు పెట్టాడు. ఈ విషయంలో సరోజ ఇష్టాయిష్టాలకు తావు లేదు. అతను సతాయింపు ఎక్కువైన కొద్దీ ఎలాగైనా ఒక బిడ్డను కని ఇచ్చేస్తే చాలని అనిపించింది సరోజకు. పీరియడ్స్ వచ్చిన ప్రతిసారీ అతని ముఖం మాడిపోయేది. చిర్రుబుర్రులాడే ముఖంతో లాప్ టాప్ లో తల దూర్చేసుకుంటాడు. నెట్ఫ్లిక్స్ లో ఏదైనా సినిమా చూస్తూ కాలం గడిపేస్తాడు. భోజనం వడ్డిస్తే మాటా పలుకూ లేకుండా తింటాడు. ఏదైనా ఫోన్ వస్తే మాత్రం నవ్వుతూ మాట్లాడతాడు.
సరోజ బిందు దగ్గర మనసు విప్పి తన గోడును వెళ్ళ బోసుకుంది. బిందు సరోజను ఓదార్చింది.
“ఇదేమంత పెద్ద విషయమా? ఈ మగవాళ్ళకు ఆడవాళ్ళ సమస్యలు ఎప్పటికీ అర్ధం కావు. ఒకటి అర్ధం అయినట్లు నటిస్తారు. లేదా అర్ధం కానట్లు నటిస్తారు.”
రెండేళ్ళు గడిచిన తరువాత తిరుమారన్ బొత్తిగా ఓపిక లేనివాడిలాగా తయారయ్యాడు. ముట్టుకుంటే పేలిపోయే డైనమెట్ లాగా ప్రవర్తించసాగాడు.
అమెరికాలో దీని కోసం చికిత్స తీసుకోవడం తమ పరిధికి అందుబాటులో ఉండదు. కాబట్టి రెండు నెలలు సెలవు పెట్టి ఇండియాకు వచ్చారు. సంతాన సాఫల్యం కోసం అన్ని రకాల టెస్టులు చేయించి, కావలసిన చికిత్స చేయించుకుని మళ్ళీ అమెరికాకు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు.
రిపోర్టులు తీసుకు రావడానికి ఒంటరిగా వెళ్ళమని సరోజతో అన్నాడు తిరుమారన్. నిజం చెప్పాలంటే అతనికి లోలోపల ఒక చిన్న భయం. తనలో లోపం ఉండి ఉంటే? ఆ నిజాన్ని తట్టుకునే ధైర్యం అతనికి లేదు.
రిపోర్టులు తీసుకుని వచ్చిన సరోజ ముఖంలో నల్లని నీడలు. తిరుమారన్ సరోజ ఇంట్లోకి వచ్చీ రాకముందే అడ్డగించాడు.
“ఏమయ్యింది?”
సరోజ ఏమీ చెప్పకుండా నిలబడి పోయింది. కలత చెందిన కళ్ళ నుండి కన్నీళ్లు కార సాగాయి. అతని అక్కయ్య ఏమీ ఎరగనట్లు టి.వి. చూస్తూ కూర్చుంది.
“నోరు తెరిచి మాట్లాడి చావు!”
ఏమీ మాట్లాడకుండా అతని చేతికి రిపోర్టులను ఇచ్చేసి లోపలి వెళ్లి పడుకుంది సరోజ. అతనికి ఏమీ అర్ధం కాలేదు. కాగితాలను తిప్పి తిప్పి చూశాడు. బాగా ఆలోచించిన తరువాత వాటిని ఫోటో తీసి, డాక్టరు స్నేహితుడికి వాట్స్ అప్ చేశాడు. అతను పరిశీలించిన తరువాత తిరుమారన్‍కి కాల్ చేశాడు.
“సారీరా… కాస్త క్లిష్టమైన సమస్యే. బయలాజికల్ గా మీరిద్దరూ కలిసి బిడ్డను కనడం అసాధ్యం.”
“నా రిపోర్ట్ ఏమని వచ్చింది?”
“నీ రిపోర్టులో స్పెర్మ్ కౌంట్, షేప్ అన్నీ పక్కాగా ఉన్నాయి.”
“సరిగ్గా చూశావా?”
“నువ్వే చూసుకుని ఉండవచ్చు కదా. నార్మల్‍గా ఏ రేంజిలో ఉండాలో, ఇప్పుడు ఏ రేంజిలో ఉందో అంతా వివరంగా ఉంది, చూసుకో.”
తిరుమారన్ మనసులో ప్రశాంతత నెలకొంది.
“మరింకేమిటి సమస్య?”
“నీ భార్యకే సమస్య. అది ఏమిటి అంటే…”
“సరి చెయ్యడానికి కుదరదా?” తిరుమారన్ మధ్యలోనే ఆపి అడిగాడు.
“ఏది?”
“సరోజకు ఉన్న సమస్య గురించి.”
“సారీరా. నాకు తెలిసినంత వరకు సాధ్యం కాదు. బెట్టర్, యు గో ఫర్ అడాప్షన్. దత్తత చేసుకోండి. నేనే మీకు రెఫర్ చేస్తాను.”
“థాంక్స్ రా.”
ఫోన్ పెట్టేసి మళ్ళీ ఒకసారి రిపోర్టులను తీసి చూశాడు. తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. టి.వి. చూస్తున్న అక్కయ్య దగ్గరికి వెళ్ళాడు.
“అక్కా! నీతో కాస్త మాట్లాడాలి” అన్నాడు.
మర్నాటి నుంచి అతను సరోజతో ప్రవర్తించే విధం పూర్తిగా మారిపోయింది. ఇది జరిగిన ఒక వారం తరువాత సరోజను పుట్టింట్లో దిగబెట్టాడు.
“తను అమెరికాలో మనస్థిమితం లేకుండా ఉంది అత్తయ్యా. కొన్ని రోజులు మీతో ఉండనివ్వండి.”
రెండు నెలల సెలవు ముగిసిన తరువాత సరోజను ఇండియాలోనే వదిలేసి విమానం ఎక్కాడు. “రెండు నెలల తరువాత టికెట్ తీసి పంపిస్తాను. అప్పుడు రావచ్చు.”
సరోజ తల్లికి ఇదంతా ఏదో సరిగా లేనట్లు అనిపించింది. కానీ సరోజ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా తల దించుకుని కూర్చుండి పోయింది. అతను ఫోన్ చేసి మాట్లాడడం కూడా రాను రానూ తగ్గి పోయింది. బిందు మాత్రం అప్పుడప్పుడూ ఫోన్ చేసి మాట్లాడేది.
రెండు నెలల తరువాత టికెట్ రాలేదు. వివాహ రద్దు నోటీసు వచ్చింది. సరోజ తల్లితండ్రులు నిలువునా కూలిపోయారు. తిరుమారన్ కుటుంబం వాళ్ళు చేసేది ఏమీ లేదన్నట్లు చేతులు ఎత్తేశారు. సరోజ తండ్రి నేరుగా తిరుమారన్‍తో మాట్లాడి చూశారు.
“లేదు మామయ్యా. తను కూడా ఇక్కడ నాతో ఇమడలేక పోయింది. ఎప్పుడు చూసినా ఒకటే ఏడుపు, ఏదో పోగొట్టుకున్నదానిలా. అదీగాక, ఆమె ఒక బిడ్డకు తల్లి కాలేదు అని రిపోర్టు వచ్చింది. ఇది ఆమెకు కూడా తెలుసు. చట్టరీత్యా నాకు వివాహరద్దు కోరడానికి హక్కు ఉంది.”
సరోజ ఇంట్లో అందరూ అమెనే తప్పు పట్టారు.
“అన్ని విధాలా చక్కటి అల్లుడు. అనుసరించి బ్రతకడం చేతకాక పోయింది. అంతా తలరాత!” సరోజ తండ్రి తల బాదుకున్నారు.
సైదాపేట కోర్టుకు బైట తీర్పు ప్రతిని ఇచ్చేసి వచ్చినప్పుడు ఆమెను చూసింది ఆఖరుసారి. ఆ తరువాత తిరుమారన్ తన ఆఫీసులో కొత్తగా ఉద్యోగంలో చేరిన నేత్రా శర్మాను పెళ్లి చేసుకున్నాడు. ఫెవికాల్ రంగులో బొమ్మలా ఉంది. తిరుమారన్ కన్నా నాలుగు రెట్లు జీతం. ఆఫీసులో చాలా త్వరగా ప్రమోషన్లు తెచ్చుకుంది. తిరుమారన్ కుటుంబానికి ఇప్పుడు జాతి గుర్తుకు రాలేదు. ఉన్నట్లుండి సంఘ సంస్కర్తలుగా మారిపోయారు.
పెళ్ళైన నాలుగు నెలలకు ఆమెకు నెల తప్పింది. తిరుమారన్ సంతోషంతో ఎగిరి గంతేసినంత పని చేశాడు. మరుసటి ఏడాది అందమైన మగ పిల్లవాడు. వాట్సప్, ఫేస్ బుక్… అన్నింటిలో బాబు ఫోటోలు పంచుకున్నాడు తిరుమారన్. ముఖ్యంగా సరోజ వాటిని చూడాలని కోరుకున్నాడు. తరువాత ఆడపిల్ల. ఆ పిల్ల ఫోటోను కూడా సరోజకు షేర్ చేసి బ్లూ టిక్ వచ్చిందా చూస్తూ ఉండేవాడు. వేరే నంబరు నుంచి సరోజకు కాల్ చేసి చూశాడు. ఆ నంబరు ప్రస్తుతం పని చేయడం లేదని తెలిసింది.
నేత్రా శర్మ అంచెలంచెలుగా ఉన్నతి సాధిస్తూ వేరొక పెద్ద కంపెనీలో సి.టి.ఓ. పదవికి చేరుకుంది. అందుకోసం వాళ్ళు టెక్సాస్ నుంచి కాలిఫోర్నియాకు మారవలసి వచ్చింది. అతని జీతం నేత్రా శర్మ జీతంతో సరి పోల్చుకోలేనంత తక్కువగా ఉన్నందువలన, తిరుమారన్ జాబ్ వదిలేయాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే అతనికి ఉన్న టెక్నాలజీ పరిజ్ఞానానికి వేరే ఉద్యోగం దొరకలేదు. వర్క్ ఫ్రం హోం కన్సల్టెంటుగా మారాడు. ఆ తరువాత ఇంట్లో ఉండి బాధ్యతగా పిల్లలను చూసుకున్నాడు.
నేత్రా శర్మ ఆఫీసు పని మీద హవాయికి వెళ్ళింది. బోర్డ్ మీటింగ్ త్వరలో జరగబోతున్నందువలన దానికి కావాల్సిన ప్రణాళికలను సిద్దం చేయడం కోసం అక్కడ మీటింగ్. ఎలా చూసుకున్నా ఏడాదిలో సగం రోజులకు పైగా నేత్రా శర్మ ఇంట్లో ఉండదు. ప్రపంచంలో ఏదో నగరంలో, స్టార్ హోటల్ నుంచి మొగుడితో, పిల్లలతో మాట్లాడుతుంది.
పిల్లలను స్కూల్లో వదిలేసిన తరువాతే టార్గెట్‍కు వచ్చాడు తిరుమారన్. అది అతని దినచర్యలలో ఒకటి. అప్పుడే సరోజ అతని కంట పడింది.
సరోజను అమెరికాలో, అదీ ఫ్రీ మాంట్ ఏరియాలో అతను ఎదురు చూడలేదు. స్కూలు ముగియడానికి ఇంకా టైం ఉంది. ఆమెను బాగా పరిశీలించాడు.
సరోజ పూర్తిగా మారిపోయింది. జుట్టును ఫ్రీగా వదిలేసింది. మాటి మాటికి ముఖం మీద పడుతున్న ముంగురులను పైకి తోసుకోవడంలో ఒక స్టైల్. ముక్కు కుట్టించుకుంది. రోజూ వ్యాయామం చేస్తుంది కాబోలు. వేసుకున్న డ్రస్సులో పొందికగా స్మార్ట్‍గా కనబడింది. తిరుమారన్ సీట్ బెల్టుకు బైట ఉబ్బెత్తుగా ఉన్న తన పొట్ట వైపు చూసుకున్నాడు. సరోజ స్లీవ్ లెస్ డ్రస్ వేసుకుని ఉంది. భుజం మీద పువ్వు, సీతాకోక చిలుక పచ్చ పొడిపించుకుంది. ఆమె ఇంత ఆకర్షణీయంగా ఉంటుందని అని తిరుమారన్ కలలో కూడా ఊహించలేదు. టెస్లా కారును తనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే దానికన్నా మిన్నగా ఆమెలో ఒక విధమైన తుళ్ళింత, సంతోషం ప్రస్పుటంగా కనిపించాయి. అతని మెదడులో పాత సాతాను దూరి తొలచడం మొదలు పెట్టింది.
ఆమె కారు స్టార్ట్ చేసి బయలు దేరగానే, కొన్ని క్షణాలు ఆలోచించాడు. తరువాత కారును స్టార్ట్ చేసి ఆమెను వెంబడించాడు. పదిహేను నిమిషాలలో ఆమె ఇల్లు వచ్చేసింది. బాగా ధనవంతులు ఉండే ఏరియా అది. ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కోవాలని నేత్రకు ఎప్పటి నుంచో ఒక కల. సరోజ ఇల్లు ఉన్న వీధిలో రెండు సార్లు అటూ ఇటూ కారులో తిరిగాడు. స్కూలు విడిచే టైం అయ్యింది. ఉన్నట్లుండి గుర్తుకు వచ్చిన వాడిలా కారును తిప్పి అక్కడి నుంచి వెళ్లి పోయాడు.
ఆ రోజు రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. మరునాడు ఉదయమే అక్కడికి వెళ్లి చేరాడు. ఆ ఇంటి నుంచి కాస్త దూరంగా కారును ఆపుచేసి వెయిట్ చేశాడు. ఫహాద్ ఫాజిల్ లాంటి ఒకతను బైటికి వచ్చాడు. ఒక చిన్న పాపను నడిపిస్తూ తీసుకు వెళ్లాడు. అతనే ఆమె భర్త అయి ఉండాలి. బహుశ అతనికి ఇది రెండవ పెళ్ళిగా ఉండవచ్చు. అతని ముందే ఈ పాప ఉండి ఉంటుంది. అతను ఎప్పుడూ ఇంట్లోనే ఉంటున్నాడు. సరోజ మాత్రం బైటికి వెళ్లి వస్తోంది.
మరునాడు కూడా తిరుమారన్ అక్కడికి వెళ్ళాడు. కాఫీ తాగుతూ చాటుగా చూడసాగాడు. అతని కాళ్ళు నిలకడగా ఉండలేక అటూ ఇటూ కదులుతున్నాయి. సరోజ బయలుదేరింది. ఫహాద్ ఫాజిల్‍ను వీధిలో నులబెట్టి ముద్దు పెట్టుకుంది. తరువాత కారులో ఎక్కి బయలుదేరి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిన పది నిమిషాల తరువాత ఫహాద్ ఫాజిల్ తలుపు తీసుకుని బైటికి వచ్చాడు. నేరుగా తిరుమారన్ కారు వైపు అడుగులు వేశాడు. తిరుమారన్ కొంచం కూడా ఎదురుచూడలేదు. ఏం చెయ్యాలో తెలియక అలాగే కూర్చుండి పోయాడు. దగ్గరగా వచ్చిన అతను కారు విండో అద్దాన్ని మెల్లగా తట్టి దింపమని అన్నాడు.
“మీరు మిస్టర్ తిరుమారన్ కదా?”
తిరుమారన్ తడబడ్డాడు.
“సరోజ నిన్న మిమ్మల్ని ఇక్కడ చూసి చెప్పింది. ఐ యాం సంజయ్. సరోజ భర్తను.” తెరిచి ఉన్న కారు కిటికీ నుండి చెయ్యి చాపాడు. తిరుమారన్ కాస్త సంకోచిస్తూ అతని చెయ్యి పట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
“లోపలికి రండి. కాస్త బీరు తాగుతూ మాట్లాడుకుందాం. ఒక విధంగా మనం ఒకే ఫ్యామిలీకి చెందినవాళ్ళం కదా.”
తిరుమారన్ కాస్త సంకోచించాడు.
“ప్లీజ్!”
క్రిందికి దిగి కారు తాళం వేసి, అతని వెంట నడిచాడు.
“మూడు రోజులుగా వస్తున్నారు కదా?” అన్నాడు సంజయ్ నడుస్తూ.
“సారి. జోక్యం చేసుకోవాలని కాదు. సరోజ ఎలా ఉందో తెలుసుకోవాలని మాత్రమే.”
“మీ కన్సర్న్ అర్ధం అవుతోంది.”
తలుపులు తీసుకుని లోపలికి వచ్చారు.
“అంకుల్‍కి హాయ్ చెప్పమ్మా సితారా!” అన్నాడు. సిత్తార ఒక కేన్వాసులో రంగులతో గీతలు గీస్తోంది. “హాయ్ అంకుల్!” అంటూ ఇతన్ని చూసి నవ్వింది.
తిరుమారన్‍ని కూర్చోమని చెప్పి, ఫ్రిజ్ తెరిచి రెండు బీరు క్యాన్లు తీసుకు వచ్చాడు.
సోఫాలో కూర్చున్న తిరుమారన్ ఇంటి వైశాల్యాన్ని లెక్క కట్టాడు. అతని ఇంటి కన్నా మూడు రెట్లు పెద్దది.
“నైస్ హౌస్! వాట్ ఆర్ యూ డూయింగ్?”
“నతింగ్!”
“అర్ధం కాలేదు.”
“నేను ఒక సైంటిస్టును. నా పేరిట పది పేటంట్లకు పైగా ఉన్నాయి. దాని మూలంగా వస్తున్న డబ్బునే మేం ఖర్చు చేయలేకపోతున్నాం. అందువల్ల రెండేళ్లుగా ఏమీ చెయ్యకుండా ఉన్నాను. సరోజ, సితారా… వీళ్ళిద్దరే ఇప్పుడు నా ప్రపంచం. అవసరాలకు మించి డబ్బు ఉన్నందువల్ల దానధర్మాలు చేస్తున్నాను. ఇతరుకు ఇవ్వడం ద్వారా జీవితంలో ఆనందాన్ని పొందుతున్నాం. ఇండియాలో ఉన్న స్త్రీల కోసం చిన్న ఎన్.జి. ఓ. సంస్థ ఒకటి నడుపుతున్నాం. దాని నిర్వహణ బాధ్యతలు సరోజ చూసుకుంటోంది. ఇంట్లోనే కూర్చోవడం ఆమెకు సుతరామూ ఇష్టం ఉండదు.”
“మీరు సరోజను ఎలా కలుసుకున్నారు? తను కొంచం రిజర్వుడు టైప్ కదా?”
“ఓ… మీకు నా గురించి తెలియదు. కానీ మా అక్కయ్య మీకు పరిచయమే.”
“ఎవరు?”
“బిందు… ఆస్టిన్‍లో మీ పక్క బ్లాక్…”
“అవును. ఆవిడ సరోజకు సన్నిహితురాలు.”
“పెళ్ళే వద్దని అనుకున్న నన్ను నస పెట్టింది. సరే, మాట్లాడి చూస్తాను అని అన్నాను. నేను సరోజా ఒక ఏడాది స్కైప్‍లో మాట్లాడుకున్నాం. సరోజ అన్ని వివరాలు నాతో చెప్పిన తరువాతే, కలిసి బ్రతుకుదాం అని నిశ్చయించుకున్నాం.”
కొద్ది సేపు మౌనంగా గడిచింది.
“మేము డైవోర్స్ తీసుకున్నాం అని చెప్పిందా?”
“ఊం. అది కూడా చెప్పింది. ఏ రోజైనా మీరు ఇలా వస్తారని కూడా చెప్పింది.”
సంజయ్ చిన్నగా నవ్వాడు. అందులో కాస్త అవహేళన కలగలిసి ఉన్నట్లు అనిపించింది తిరుమారన్‍కి.
“ఈ పాప…” అంటూ అర్ధోక్తిలో ఆపాడు తిరుమారన్.
“మాకు పుట్టిన బిడ్డ.”
తిరుమారన్ ఏదో చెప్పాలని ప్రయత్నం చేసినప్పుడు, సంజయ్ చెయ్యి పైకెత్తి ఆపు చేశాడు.
“మీ అనుమానం నాకు అర్ధం అయ్యింది. దాన్ని క్లియర్ చేయడానికే మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచాను. సరోజ పెద్ద తప్పు చేసింది. దాన్ని సరి చెయ్యాలని నాకు అనిపించింది.”
“సరోజనా?”
“అవును. ఆమె ఒక గ్రాఫిక్ డిజైనర్ అని మీకు తెలుసా?”
తిరుమారన్ తెల్లబోయినట్లు చూసాడు.
“సరోజ గురించి ఆఖరు దాకా ఏమీ తెలుసుకోవడానికి మీరు ప్రయతించలేదు. సమస్యకు కారణం అదే.”
“అర్ధం కాలేదు.”
అతని చేతికి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చాడు.
“నిన్ననే మీతో మాట్లాడి ఉండేవాడిని. కానీ దీనిని వెతికి తీయాల్సి వచ్చింది.”
“ఇదేమిటి?”
“మీ ఇద్దరి ఫెర్టిలిటీ టెస్ట్ రిపోర్టులు. గుర్తు ఉందా?”
తల ఊపాడు.
“అది ఫోటోషాప్ చేసినది. సరోజ తన స్నేహితురాలైన డాక్టర్ సాయంతో దానిని మార్చింది. నిజానికి ఆమెలో ఎటువంటి సమస్యా లేదు.”
తిరుమారన్ బీరు క్యాను గభాల్న కింద పెట్టేశాడు.
“నో… నేను నమ్మను. సరోజ ఎందుకు తనమీద ఇలా ఒక అపవాదును వేసుకోవాలి?”
సంజయ్ చిన్నగా నవ్వుతూ ఒక గుక్క బీరు తాగాడు.
“”బాగా ఆలోచించి చూడండి. లోపం మీలో ఉందని తెలిస్తే ఆమెకు ఈ విడుదల మీ నుంచి దొరికి ఉండేదా?”
తిరుమారన్‍కి తల తిరుగుతున్నట్లు అనిపించింది. బీరు కారణం కాదు. పెన్ డ్రైవ్‍ను తిరుమారన్ చేతిలో పెట్టి గట్టిగా నొక్కాడు సంజయ్.
“ఈ పెన్ డ్రైవ్ లో ఒరిజినల్ రిపోర్టులు, ఫోటో షాప్ ఫైలు, ఆమె మార్చిన రిపోర్టులు అన్నీ ఉన్నాయి. ఇది మీకు చెప్పడంలో ఆమెకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు అన్నీ ముగిసి పోయిన తరువాతైనా మీరు తప్పకుండా తెలుసుకోవాలని నాకు అనిపించింది.”
తిరుమారన్ గభాలున లేచాడు. అతని కాళ్ళు వణుకుతున్నాయి. సంజయ్ వాకిలి దాకా వచ్చాడు. అతని భుజం మీద సానుభూతితో తట్టాడు. తిరుమారన్ ఫోన్ మోగింది. తీసి ఆఫ్ చేశాడు.
“దిగులు పడకండి. ఇప్పుడు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. మీరు దత్తత కూడా చేసుకోవచ్చు. మిస్టర్ తిరుమారన్! ఒక్క విషయం…”
ముందుగా నడిచి వెళ్తున్న తిరుమారన్ వెనక్కి తిరిగి చూశాడు.
“ఇకమీదట ఇలా వచ్చి నిలబడకండి.” ఈ మాటలు చెబుతున్నప్పుడు సంజయ్ ముఖంలో నవ్వు మాయమయ్యింది.
చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ బరువుగా అనిపించింది. తిరుమారన్ కారు వైపు నడిచాడు. మొబైల్ ఫోన్ మళ్ళీ మోగింది. నేత్ర పిలుస్తోంది. హవాయిలో బికినీ డ్రస్సులో ఉన్న ఆమె ప్రొఫైల్ ఫోటో అతన్ని చూసి నవ్వింది.
“డార్లింగ్! ఎక్కడ తిరుగుతున్నావు. పిక్ అప్ టైం అయ్యింది. నిన్నటి లాగా వాళ్ళని వెయిట్ చేయించకు. ప్లీజ్!” ఆమె గొంతులో కాఠిన్యం.
“ఆన్ మై వే హనీ. ఐ యాం ఆన్ మై వే” అన్నాడు తిరుమారన్ నమ్రతగా.”

చాలా మంచి కథ! తెలుగు పాఠకులకి ఈ కథ అందించినందుకు ధన్యవాదాలు గౌరీ! 💐