తొలి కోడి కూతతో లేచి కూర్చుని, పయిటలోంచి తాళి బొట్టు తీసి కళ్ళకద్దుకున్నది సీతమ్మ. చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకుంది.
పక్కనే నులక మంచంమీద పడుకున్న మొగుడు రామయ్య వైపు చూసింది. మంచి నిద్రలో ఉన్నాడు. మొగుడి ముఖంలో ముఖం పెట్టి, రెండు చేతులతో అతని ముఖం మీద నిమిరి తన కణతలకు చేర్చి మెటికలు విరిచింది. పటపటమన్నాయి వేళ్ళు. ఆపేక్షగా నవ్వుకున్నది. రామయ్య కప్పుకున్న దుప్పటి సరిచేసింది.
సన్నగా, ఎర్రగా ఉంటుంది సీతమ్మ. మడిమలపైకి కట్టిన నేత చీర, మెళ్ళో పసుపుతాడు, నుదుటిపైన చింతగింజంత ఎర్రటి కుంకుమతో చూడ చక్కగా ఉంటుంది. సుమారుగా ముప్పై ఐదేళ్ళ వయసు కనిపించకున్నా భాద్యతలు తెచ్చిపెట్టిన పెద్దరికంతో మసులుకుంటుంది.
సంవత్సరం క్రితమే తమ ఒక్కగానొక్క కూతురి పెళ్లి చేసి గౌరవంగా అత్తవారింటికి పంపిన నేర్పరితనం సీతమ్మది.
తల్లినీ కూతురినీ ఏమరుపాటుగా చూస్తే అక్కాచెల్లెల్లనుకుంటారు. కానీ దేవుడు మామూలుగా ఊరుకోడుగా…అందరికీ ఎక్కడో అక్కడ ఒక నల్లటి మరకని అంటిస్తాడని అంటారు. తనని నిత్యం తలుచుకోవడానికి దానినొక అవకాశంగా కల్పిస్తాడేమో.
చిన్నప్పుడు వ్యవసాయబావిలో ఈతకొట్టేటప్పుడు ఎడమకాలి మడిమ వెనకాల దరి కోసుకుపోయి నరం తెగింది. అందుబాటులో ఉన్న ఆకు పసరు వేసి కట్టుకట్టినా చీలమండలం కిందినుంచి బలహీనంగా తయారయ్యింది కాలు. కొంచం భూమ్మీద ఈడ్చినట్టుగా, గమ్మత్తుగా నడుస్తుంది.
దేవుడిచ్చిన రూపం, గుణంతో తన అవిటితనాన్ని నలుగురూ మరిచిపోయేటట్టు చేసింది సీతమ్మ.
మొగుడంటే వల్లమాలిన ప్రేమ సీతమ్మకి. ఒంటరిగా ఉన్నా… పదిమందిలో ఉన్నా ఆ ప్రేమని తెలపడానికి ఏ మాత్రం వెనకడుగు వేయదు. ఆ ప్రేమ అలా అలవోకగా, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడన్నంత సహజంగా ఉంటుంది.
ఉన్నవారింటికి కూతుర్నివ్వాలి, లేనింటి నుంచి కోడలిని తెచ్చుకోవాలన్న దానికి వ్యతిరేకంగా ఈ ఇంట అడుగుపెట్టింది. అవిటితనం అనే గీత ఆమె నుదుట అలా రాసింది.
కాస్తంత పెద్ద ఊరిలోనే పుట్టి, ఆరు వరకు చదివినా, అక్షరమ్ముక్క రాని రామయ్య ఉండే ఈ మారుమూల గూడానికి మెట్టింది.
ఇంటా, బయటా, పెరట్లోని పనులన్నీ పూర్తి చేసేసింది.
చలికి బిర్రబిగుసుకుపోయి ఇక తప్పదన్నట్టు సూర్యుడు బయటకు రావడానికి అవస్థపడుతున్నాడు.
కాగిన పాలకడవని పొయ్యి మీది నుంచి దింపేసి చాయి పెట్టి, మొగుడి దగ్గరకొచ్చి తట్టి, “లే… తెల్లారింది, మొఖం కడుక్కొని రా…పొయ్యి మీద చాయి పెట్టిన”, లేపింది.
లేచి కూర్చున్న మొగుడికి వేపపుల్ల అందించి, “సల్ల సలివెడుతుంది, గోళెంల నీళ్ళు మస్తు సల్లగున్నయి, మొఖం కడగనీకె ఉడుకునీళ్ళు గిట్ల పెట్టియ్యాల్నా?” అనడిగింది.
“ఏమొద్దు తియ్యి…ఏమంత సలివెడుతుంది”, అనుకుంటూ వేపపుల్ల నోట్లో వేసుకుని బయటికి నడిచాడు.
పెరట్లోకెళ్ళి ముఖం కడుక్కుని తుడుచుకుంటూ వంటింట్లోకి వచ్చేసరికి గ్లాసుల్లో చాయి పోసింది సీతమ్మ.
పొయ్యి దగ్గరకొచ్చి కూర్చుని చాయి గ్లాసు చేతిలోకి తీసుకున్నాడు… కొంచం చప్పరించి, “నిజంగనే మస్తు సల్లగున్నయి నీళ్ళు…నన్ను లేపొద్దా… ఆవుకాడ నువ్వెందుకు సాపుజేసి పాలు పిండుకొచ్చినవు… నేను చేస్తుంటి గదా!” అన్నాడు రామయ్య.
“నువ్వు మంచి నిద్రలున్నవ్… ఎందుకు లేపాలెనని లేపలే… ఎవరు చేస్తే ఏంది? నువ్వు చేసినా గదే… నేను చేసినా గదే!” నవ్వింది సీతమ్మ.
“సలికి సీకట్లనే లేసి చేసుడెందుకు…జరంత సేపు పండుకుంటె ఏమయితది… లేసినంక చేసుకుంటుంటిమి….జల్ది జల్ది చేసి ఏడికన్న పోయేదున్నదా మనం?”
“ఇడ్సిపెట్టు గని… శాంతమ్మ నేను నాగారం అంగడికి పొయ్యొస్తం, కొమటాయనకు నువ్వులు గావాల్నంట… ఇప్పుడు ధర బాగనే ఉన్నదంట… చెప్పి పంపిండు… అట్లనే జరన్ని ఎచ్చాలు, సబ్బులు అయిపోవచ్చినయి కొన్కరావాలె… నువ్వు అంబాటాళ్ళనే రా ఇంటికి…రొట్టెలు జేసి… అన్నమొండి పోత… పెరుగు ఉట్టిమీదుంటది…మరవకు”, చాయి గ్లాసు పక్కన పెడుతూ అన్నది సీతమ్మ.
“రొట్టెమీదికి ఏం జేస్తున్నవు?” తాను కూడా గ్లాసు పక్కన పెట్టి అడిగాడు రామయ్య.
“ఉల్లిగడ్డ పప్పేస్త… నీ కిష్టంగద”, బదులిచ్చింది.
రామయ్య లేచి అద్దం దగ్గరకెళ్ళి తల దువ్వుకుని… తలుపు సందులో ఉన్న కర్ర తీసుకుని, తువ్వాలు బుజం మీద వేసుకుని…”నేను పోతున్న బాయికాడికి₹, అని ఆవుని విడవడానికి కొట్టంలోకి వెళ్ళాడు.
“జల్దే రా ఇంటికి… మల్ల మర్సిపోయి బాయికాడ్నే ఉండేవు”, లోపల్నించి గొంతు పెంచి జవాబుచెప్పింది సీతమ్మ.
“మాయ పొద్దు… మీరు గూడ జల్ది పోయి జల్ది రాండ్రి… పోద్దుమూకకముందే”, అరచినట్టి చెప్పుకుంటూ ఆవుని అదిలించాడు రామయ్య.
నల్లగా, సన్నగా, బలంగా ఉంటాడు రామయ్య. ఎండనక, వాననక చేసే మొద్దు పనికి రాటుదేలి రాయిలాగా అయ్యాడు.నల్లటి మొఖం మీద మరింత నల్లటి మచ్చలు స్పష్టంగా కనిపిస్తాయి. అతని రూపానికీ, గుణానికీ ఏ మాత్రం పోలికుండదు.
పురుటిలోనే తల్లి చనిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. రామయ్య మేనమామల ఇంట పెరిగాడు.
పాలేరు కంటే దారుణంగా వాడుకున్నారు వాళ్ళు. కానీ… వ్యవసాయంలో ఆరి తెరాడు. తెల్లవారేదీ… పొద్దు గుంకేదీ కూడా తెలీకుండా చేలల్లో చెట్టులా పెరిగాడు. చెట్లూ, చేమలూ, కోళ్ళూ, గొర్రెలూ పశువులే అతనికి ఆప్యాయత పంచే నేస్తాలు. పద్నాలుగేళ్ళపుడు చెనగ చేసుకి కాపలాగా వెళ్లి, అడవి పంది బారిన పడి తండ్రి చనిపోయాడు.
రామయ్య సొంత గూటికి చేరుకున్నాడు. ఎకరానికి మూడు గుంటలు తక్కువున్న వాగుపక్కన భూమి, గూడెంలో చిన్న పాక…ఇవీ తండ్రి మిగిల్చిన ఆస్తి. తండ్రి చనిపోయాక ఒంటరి వాడయ్యాడు. మామలు ఎవరూ పట్టించుకోలేదు.
కష్టం తప్ప కల్లాకపటం తెలియని మనిషి, చదువూ సంధ్యా లేని మనిషి, ఎద్దులా… మొద్దులా పని చెయ్యడం తప్ప ఇంకా ఏదీ చేతకాని మనిషి. చెట్టునూ… పుట్టనూ… పిట్టనూ… పశువునూ మాలిమి చేసుకున్నంత తొందరగా మనుషులతో కలవలేడు.
మూడునాలుగేళ్ళు ఇంట్లోనూ… చేలోనూ కష్టపడ్డాడు. ఒక ఆవుని సంపాదించుకున్నాడు. ఇంటిని చక్కదిద్దుకున్నాడు. రామయ్యకి పద్దెనిమిదేళ్ళపుడు దూరపు బంధువులు కలిసి పట్టుబట్టి సీతమ్మని రామయ్యకి కట్ట బెట్టి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు.
రామయ్య… సీతమ్మ పేర్లలో కుదిరిన జోడు ఇంకా ఎందులోనూ కుదరలేదని నలుగురూ నోరుతోనూ… నొసటితోనూ వెక్కిరించారు. గంతకు తగ్గ బొంతన్నారు. కాకి ముక్కుకు దొండపండన్నారు.
నలుపూ, తెలుపూ చిత్రాల్లాంటి ఇద్దరి జీవితాల్లో రంగులు మెరుగులు దిద్దుకున్నాయి. వెలుగులు విరజిమ్మాయి. సీతమ్మ మెట్టినింట కాలుపెట్టాక మనుషులనీ ప్రేమించడం నేర్చుకున్నాడు రామయ్య. విడిచి, మరచి పోయిన బంధువులను వదులుకుని ఒకరికొకరు తోడయ్యి ఒంటరితనాన్ని పారద్రోలారు.
పుట్టి బుద్దెరిగినప్పటి నుంచీ ఇంత ప్రేమ ఎరగడు రామయ్య. సీతమ్మ ప్రేమ ముందు తన ప్రేమ చాలా చిన్నగా అనిపిస్తుందతనికి. రామయ్య అమాయకమైన స్వచ్చమైన ప్రేమకు సీతమ్మ జోడుగా ఒదిగిపోయింది.
తన పొలంలోకి అడుగుపెట్టి ఒకసారి తనివితీరా చుట్టూ చూసుకున్నాడు రామయ్య.
ఆవసరమైన చేలోకి నీళ్ళు మళ్ళించి, కలుపు పెరిగిన మల్లల్లో కలుపు తీసాడు అక్కడక్కడా చేన్ల గట్ల మీద బాగా ఎండిన పెద్ద కొమ్మలను నిలువునా నాటి, దాని మొదట్లో సోరనో, చిక్కుడో, కాకరో, బీరో … ఏవో ఒక విత్తనాలు నాటి, వాటి తీగలను ఎండిన కొమ్మలపైకి మళ్ళించారు సీతా రామయ్యలు.
అంగుళం భూమి కూడా వృధా కానివ్వడు రామయ్య. అంతా కలియదిరుగుతూ ప్రతి కొమ్మనీ, రెమ్మనీ స్పృశిస్తూ, పలకరిస్తూ తన్మయత్వంలో మునిగిపోయాడు.
“రామన్నా… రామన్నా…” అన్న పిలుపుకి తేరుకుని చూసాడు. గొర్రెలు కాసే వెంకటయ్య.
చేతిసంచీలో తీసుకువచ్చిన టిఫిన్ ని అందించి, “నువ్వు యాదిమరుస్తవని చెప్తనే ఉన్నది సీతక్క, అందుకే నాతోటి పంపించింది”, వెక్కిరించాడు వెంకటయ్య.
“సరే తియ్యి”, నవ్వాడు రామయ్య. వెనుదిరిగి వెళ్తున్న వెంకటయ్యతో అరిచినట్టే చెప్పాడు, “జరుండు… ఆన్గపుకాయున్నది తెంపిస్తా”.
“గిప్పుడు ఒద్దన్నా… పొద్దుమూకినంక ఇట్లకెల్లి ఒస్త గద, అప్పుడిద్దువుగని”, అని గొర్రెలను పిలుస్తూ వెళ్ళిపోయాడు వెంకటయ్య.
వాగులో కాళ్ళూ చేతులూ కడుక్కుని వచ్చి జామచెట్టుకింద గోనె సంచి పరుచుకుని, సీతమ్మ పంపిన రొట్టెలనీ, అన్నాన్నీ తినేసాడు. “టిఫిన్ కట్టిస్తే ఎప్పుడూ గింతే… రెండు ముద్దలు ఎక్వనే అయితది”, అని ప్రేమగా పెళ్ళాన్ని తిట్టుకున్నాడు. గిన్నెలనీ, కంచాన్నీ వాగులో కడిగి తెచ్చి సంచీలో సర్దేశాడు.
జామచెట్టుకింద ఓ వారగా వేసిన అల్లం మొక్కలకి, కుండతో నీళ్ళు తీసుకువచ్చి తడిపాడు. తరువాత తీరిగ్గా గొనె సంచి మీద నడుము వాల్చాడు. ఆకుల సందుల్లోంచి నీలి రంగు ఆకాశాన్ని చూసి ముచ్చటపడ్డాడు. కాసింత సేపు కునుకు తీశాడు.
దూరంగా అడవిలోంచి నెమలి అరుపుకి లేచి కూచున్నాడు రామయ్య. “మస్తు సేపు పండుకున్న”, అనుకున్నాడు.
తను పడుకున్నపుడు జామ కొమ్మల్లో కనిపించిన నాలుగు దోర జామకాయల్ని కోసాడు, సీతకిష్టమని.
ఎండుకొమ్మపై పాకిన తీగ నుంచి గింజ చిక్కుడుకాయలని వెతికి వెతికి కోసాడు. ఈ గింజలంటే సీతమ్మకి ప్రాణమని అనుకుంటూ. ఇంకా ఏం చేస్తే… ఏం ఇస్తే సీత సంతోషిస్తుందో అవన్నీ చేసినా ఇంకా…ఇంకా… ఏదో ఇవ్వాలనిపిస్తూంది… ఏదో చెయ్యాలనిపిస్తూంది సీతమ్మకి… ఇంకా ఏమివ్వగలను అనుకున్నాడు రామయ్య.
పెసర, ఉలవ చేలో ఆకడక్కడా పెరిగిన గోంగూరని కోసాడు, “రేపు పుంటికూర తొక్కు నూరిపియ్యాలె”, అనుకుంటూ. అట్లాగే దోసెడు పెసర కాయల్నీ కోసాడు, “సాయంత్రం పూట గివ్విటిని ఉడకబెట్కోని తింటే కమ్మకుంటది”, అనుకుంటూ. ఇవన్నీ సీతమ్మ నేర్పించిందే రామయ్యకి.
అవన్నీ తన బుజంమీద ఉన్న తువ్వాలులో కొన్ని, చేతి సంచిలో కొన్ని సర్దుకున్నాడు. ఆవుకి నీళ్ళు తాగించి గడ్డి కోసి మోపు కట్టాడు. వెంకటయ్య కోసం సోరకాయని కోసాడు.
సూర్యుడు, పశువులు, పక్షులు గూటి వైపు వడివడిగా అడుగులు వేసే సమయంలో అన్నీ సర్దుకుని, గడ్డిమోపెత్తుకుని, ఆవుని తోలుకుని అందరితో పాటు అడుగులు కలిపాడు రామయ్య.
వాకిట్లోకి అడుగుపెట్టి, కొట్టంలో ఆవుని కట్టేసి, దాని ముందు కొంచం గడ్డి వేసి ఇంట్లోకి నడిచాడు.
వంటింటిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. తను తీసుకువచ్చిన కూరగాయలతో వంటింట్లోకి అడుగువెయ్యబోతూ, ఒక్క క్షణం ఆగి తొంగి చూసాడు. వంటింట్లోంచి, పెరట్లోకి ఉన్న తలుపు దగ్గర శాంతమ్మ, సీతమ్మ కూర్చుని ఉన్నారు. రామయ్య కుతూహలంగా ఓ చెవి అటువైపేసి వినసాగాడు.
“నేను దవాఖానాకి పొయ్యోచ్చేటాలకు, సంచంత నింపినవు, ఏమేం కొన్కచ్చినవే?” అడిగింది శాంతమ్మ.
“నేనేం తెచ్చిన్నే? మీ యన్నకు గీ మైసూరుపాకంటే పానం, గందుకే ఒక పూడ తెచ్చిన, గట్లనీ గీ కారంబూంది అంటే, సిన్న పొరలు ఎగవడ్డట్టు ఎగవడ్తడు మీ యన్న, గందుకే తెచ్చిన”, జవాబిచ్చింది సీతమ్మ.
“అన్నీ అన్నకు ఇష్టమైనవే తీసుకొస్తివి, నీకేం తెచ్చుకోకపోతివి?”
“నా కెందుకు తియ్యి…మీ యన్నకే సెప్పులు తెద్దామంటే మంచివి కనపడలే… ఇయ్యాల సేపలు తెచ్చి పులుసు ఒండుదామనుకున్న… చానొద్దులాయే మీ యన్న సేపలో… సేపలో అనవట్టిండు… యాడ మంచి సేపలు కనవడలే…ఇగ నేనేం తెచ్చిన్నే అంగట్ల మీ యన్నకి”, అనుకుంటూ తన చేతిలోని సంచి గుమ్మరించింది సీతమ్మ.
కొబ్బరినూనె సీసా, సబ్బులు, కుంకుమ పొట్లం, మొలతాడు, మైసూరుపాకు పొట్లం, కారంబూంది పొట్లం, నారింజ బిళ్ళల పొట్లంతో పాటు ఒక కాగితం కూడా దొర్లింది సంచిలోంచి.
“ఏందే ఆ కాయితం…ఏదో ఫోటువ లెక్కుంది?” శాంతమ్మ.
“ఏంలేదేంలేదు…” అంటూ దాన్ని వీపెనక దాచింది సీతమ్మ.
“ఏందో నాకు సూపియ్యవానే?” అలిగినట్టు బెదిరించింది శాంతమ్మ.
వెనకగా పెట్టిన చేతిని ముందుకు చాచి శాంతమ్మకు ఇచ్చింది.
“ఎవరిదే గీ ఫోటువ ….మస్తుగున్నడు”, ఆశ్చర్యపోతూ అడిగింది శాంతమ్మ.
“ప్రసేన్ అంటనే… సిన్మా యాక్టరంట, మస్తుగొడ్తున్నడు గద? అంగట్ల కన్లవడంగనే కొన బుద్దయ్యింది”, సీతమ్మ మొఖం విప్పారింది.
“అంతగణం నచ్చిండానే నీకు”.
“అవును, ఎంత ముద్దుగున్నడు. ఆ ఒడ్డూ, పొడుగూ… ఆ కండలూ… ఆ బుజాల వరకున్న నెత్తెంటికలూ… ఆ సన్నని మీసాలూ…మూతీ… తెల్లగ… అబ్బ మొగోడంటే గిట్లుండాలె… అన్నట్టున్నడు… గందుకే ముచ్చటవడి కొనుక్కున్న”, వెలిగిపోయింది సీతమ్మ మొఖం.
అన్నీ వింటూనే ఉన్న రామయ్య, ఉత్సాహం కొద్దీ, “ఎంత సేపయ్యిందే ఒచ్చి?” అంటూ వంటింట్లోకి అడుగుపెట్టాడు.
రామయ్య అలికిడి విని చప్పున శాంతమ్మ చేతిలోని ఫోటోని లాక్కుని తన తొడ కింద దాచేసింది సీతమ్మ. అది రామయ్య కన్ను దాటి పోలేదు.
“ఇప్పుడే ఒచ్చినం”, అన్న సీతమ్మ జవాబుతో పాటు, “నేను పొయ్యొస్తనే”, అంటూ శాంతమ్మ వెళ్ళిపోవడం జరిగిపోయింది.
రామయ్య తెచ్చిన సంచీ, తువ్వాలూ సీతమ్మ కందించాడు.
కింద గుమ్మరించిన వాటిని సర్దినట్టే సర్దుతూ… కొబ్బరి నూనె సీసా గూట్లో అద్దం వద్ద పెడుతూ… చురుగ్గా ఆ ఫోటోని అద్దం వెనక పెట్టేసింది సీతమ్మ. అదేం గమనించనట్టే… ఓరకంట చూసేసాడు రామయ్య.
“నీ కొరకు మైసూర్ పాకు … కారంబూంది తెచ్చిన… కాళ్ళు జేతులు కడుక్కొచ్చుకో… తిందువు గని”, అంటూ వాటిని ఓ ప్లేట్లో సర్దింది సీతమ్మ.
పెరట్లోకెళ్ళి మొఖం కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు రామయ్య. ప్లేటు అందించి… అదీ… ఇది… ఎప్పటిలాగే…ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నది సీతమ్మ.
రామయ్య ధ్యాసంతా అద్దం వెనకే ఉన్నది.
తొందరతొందరగా ఇల్లూడ్చింది… దీపం వెలిగించింది… పొయ్యి వెలిగించి రొట్టెలు చేస్తూ…గల గలా మాట్లాడుతూనే ఉంది సీతమ్మ…అంగడి విశేషాలు చెపుతూనే ఉంది.
అన్యమనస్కంగా ఊ కొడుతున్నాడు రామయ్య.
వంటంతా అయిపోయ్యాక పెరట్లోకి వెళ్ళింది సీతమ్మ.
వెంటనీ లేచి అద్దంవెనక నున్న ఫోటో తీసి చూసాడు. అతని కళ్ళు చెదిరిపోయాయి.
అబ్బ… అనుకున్నాడు. నిజంగా మగాడంటే ఇట్లాగుండాలి అనుకున్నాడు. సిన్మా యాక్టర్లు దేవతలయ్యుండ వచ్చన్న గట్టి నమ్మకం ఏర్పడింది ‘ప్రసేన్’ ఫోటో చూసి రామయ్యకి.
ఆ గిరజాల జుట్టూ…నుదుట చంద్ర వంకా… చెవులకు రింగులూ… సన్నని చిరునవ్వూ… రామయ్యకి ‘ప్రసేన్’ తెగ నచ్చేసాడు. ఫోటోని చూస్తూ ‘ప్రసేన్’ అని పిలిచాడు… ముద్దుపెట్టుకున్నాడు. తనివితీరా ఫోటోని చూసుకుని మళ్ళీ ఎప్పటిలాగే అద్దం వెనక పెట్టేసాడు.
***
మూడ్రోజులుగా చప్పబడి ఉన్నాడు రామయ్య. ఏ పనీ ముందులా ఉత్సాహంగా చెయ్యటం లేదు. ఎంత సేపూ ఏదో ఆలోచన. మనసుపెట్టి పని చెయ్యడం మరచి పోయాడు. చేనుకు నీళ్ళు మల్లిస్తూ వాగులో జారి పడ్డాడు. ఆవుకి గడ్డి కోస్తూ బొటనవేలి మీద గాటు పెట్టుకున్నాడు. ఆవు పేడ తీసుకెళ్ళి పెంటలో వెయ్యక వాగులో గుమ్మరించి వచ్చాడు.
సీతమ్మ ఎంత గుచ్చి గుచ్చి అడిగినా… పొడి పొడి జవాబులే ఇస్తున్నాడు.
తల దువ్వుకునే నెపంతో, ఇంట్లోంచి బయటికెళ్ళేప్పుడూ… వచ్చేప్పుడూ, సీతమ్మ చూడకుండా అద్దం వెనక ఫోటోని చూసి చిరునవ్వు నవ్వుతాడు.
రామయ్యకి ఏదో అయ్యిందని దిష్టి తీసింది సీతమ్మ… పీరహ్మదు వద్దకు తీసుకెళ్ళి ఉప్పుతో మంత్రమేయించింది. నాలుగోనాడు పనుంది నాగారం వెళ్లి వస్తానని పొద్దున్నే వెళ్లి వచ్చాక కొంచం తేరుకున్నాడు రామయ్య.
ఒకనాడు అడవిలోకి వెళ్లి బూరుగు చెట్టెక్కి బూరుగు దూది గోనె సంచుల్లో నింపుకు వచ్చి కొత్త పరుపులు, దిండ్లు కుట్టించాడు. నులక మంచం తాళ్ళు బిగదీసి కట్టాడు. వీలైనంతగా ఇంటిని అందంగా ఉంచే ప్రయత్నం చేయ్యసాగాడు…కానీ ఒక్కరోజూ వాటిపై పడుకోలేదు.
నేను చెప్పేంతవరకు ఏ కోడినీ కోయ్యవద్దని సీతమ్మకి చెప్పేసాడు.
నాగారం వెళ్లోచ్చిన నాల్రోజుల తరువాత మళ్ళీ మొదటికే వచ్చింది రామయ్య సంగతి.
అస్తమానం వాకిట్లో మంచమేసుకుని కూర్చుంటాడు. గూడెంలో ఏ చిన్న అలికిడైనా వెంటనే అక్కడ వాలతాడు. గూడెంకి అవతల అల్లంత దూరంలోంచి ఏ మోటారు చప్పుడైనా… చెవులు రిక్కించి వింటాడు. అలా బండ్ల బాట దాకా వెళ్లి నిల్చుంటాడు. పొలం వద్ద ఉన్నపుడు… ఎవరైనా కనిపిస్తే… “గూడెంలకి ఎవరో ఒచ్చిండ్రట గదా?” అని ఆరా తీస్తాడు. అస్తమానం అదే ధ్యాస.
ఇదంతా చూస్తున్న సీతమ్మకి దిగులు కమ్ముకుంది. రామయ్య గురించి బెంగ పెట్టుకుంది. గ్రామ దేవతలందరికీ మొక్కింది.
***
అమావాస్య వెళ్లి పౌర్ణమి వచ్చింది.
రామయ్య పొలానికెళ్ళాడు. అతని పరధ్యానం సీతమ్మకి అంటుకుంది. ఇంటి పట్టునే ఉండిపోయిందా రోజు.
పక్క ఊరి నుంచి ఒక స్కూలు పిల్లవాడు వచ్చి, “రామయ్య ఇల్లు గిదేనా?” అడిగాడు సీతమ్మని.
అవునని తలూపింది సీతమ్మ.
సీతమ్మ కూచున్న అరుగు మీద కూచుంటూ, “గాయల్ల ఓ నాడు మా ఇస్కూలుకు ఒచ్చిండు. మా సార్ తోని “ప్రసేన్” కి ఉత్తరం రాసియ్యమన్నడు. మా సార్ కసురుకున్నడు. మా సార్ అటుబోవుడు సూశి, నేనే దగ్గరుండి ఆయన చెప్పింది రాసిన. అడ్రసేమో తెల్వది. సిన్మా యాక్టర్లందరూ హైదరాబాదుల బంజారాహిల్స్ ల ఉంటరని, గదే రాసిన. గిదేమో మల్ల ఎన్కకొచ్చింది. మా సార్ నన్ను తిట్టి. గీ ఉత్తరాన్ని ఇచ్చి రమ్మని తోల్తే ఒచ్చిన”. అని ఒక ఉత్తరం సీతమ్మ చేతిల పెట్టి సైకిలెక్కి ఆగకుండ వెళ్లిపోయాడు.
తేరిపారా చూసింది ఉత్తరాన్ని సీతమ్మ. అక్షరాలు కూడదీసుకుని చదివింది. ముందు పక్క “ప్రసేన్”, హైదరాబాద్ అడ్రసు ఉంది, వెనక ‘రామయ్య’, అని ఈ గూడెము, మండలమూ, జిల్లా అడ్రసూ ఉంది.
ఉత్తరం చివర చింపి, విప్పి చదివింది సీతమ్మ.
“ప్రసేన్ సార్,
నమస్తే సార్, నా పేరు రామయ్య. మా ఇంటామెకు నువ్వంటి ప్రాణం సార్. దినాం నిన్నే యాది జేసుకుంటది. నీ ఫోటో చూసి మురుస్తది సార్.
ఆమె చాన బాగుంటది సార్, మంచిది సార్. తెల్లగ మల్లెపువ్వులెక్క ఉంటది. చిదిమి దీపం పెట్కోవచ్చు సార్. అసోంటామె ఈ దునియలనే ఉండది సార్. నవ్వితే బీర పువ్వులెక్క నవ్వుతది సార్. నీకు గూడ తప్పకుండ నచ్చుతది సార్. ఒట్టు సార్, నువ్వంటె ప్రాణం ఎల్లగొట్టుకుంటది.
ఒక్కసారి మా గూడానికి రావాలె సార్. రెండు మూడు దినాలు మా ఇంట్ల ఉండి పోండి సార్. మా ఇంట్లనే అన్ని వసతిగ, తయ్యారుగ పెట్టిన సార్.
మీరు తప్పకుండ రావాలె సార్, మా ఇంటామె సంతోషిస్తది.
ఎనక నా అడ్రసు రాస్తున్న సార్, తప్పకుండ రావాలె సార్.
ఉంటం సార్. నమస్కారం. ఇట్లు, భవదీయుడు, రామయ్య”
రామయ్య పేరు కింది అతని వేలి ముద్ర.
ముందు ఏడ్చింది సీతమ్మ, తరువాత మనసారా నవ్వుకుంది. మొగుడి మీద ప్రేమ రెట్టింపయ్యింది. క్షణం….క్షణం, ఆనందం, సంతోషం ఆమె కుదిపేసాయి.
కాసేపయ్యాక ముసి ముసిగా నవ్వుకుంది. కాలు నిలవక ఇంటి పని సమస్తం చిటికెలో చేసేసింది. కోడిని కోసి కూర వండింది. పొద్దు గూకేలోపు వంటంతా చేసేసి, స్నానం చేసి ఉతికిన మంచి చీర కట్టుకని తయారయ్యింది.
గూట్లో దీపం పెట్టాక వచ్చాడు రామయ్య.
ఆవుని కట్టేసి, దాని ముందర గడ్డేసి వంటింట్లోకి వచ్చి, గూట్లోని అద్దం ముందు తల దువ్వుకుంటూ అటూ ఇటూ చూసి, అద్దం వెనక చూసాడు. కనిపించలేదు. గూడు మొత్తం వెతికాడు. ఫోటో లేదక్కడ….
బిత్తరపోయాడు. అయోమయంగా దిక్కులు చూస్తున్న రామయ్య వెనకగా నెమ్మదిగా, నిశ్శబ్దంగా వచ్చిన సీతమ్మ, అతని చేతుల కింది నుంచి చేతులు పోనించి గట్టిగా కావలించుకుంది. “నేనంటే ఎందుకింత ప్రేమ, నువ్వు ప్రేమించినంత ఇదిగ నేను నిన్ను ప్రేమిస్తున్ననా అన్న అనుమానం ఒస్తున్నది నాకు. నా కిష్టమైనవన్నీ తెస్తనే ఉంటివి, ఇస్తనే ఉంటివి. ఏ మొగడైన గిట్ల జేస్తడా ? మంచి చెడు సూసేది లేదా? మొగులు మీదికెల్లి గాలిమోటరు పోతుంటే అందరు ఇడ్డూరంగ సూస్తరు. సిన్న పిల్లలైతే సప్పట్లు కొట్టుకుంట ఎగుర్తరు. ముచ్చట పడ్డనని గది గూడ కొన్కస్తావా?” అని కళ్ళలోంచి ధారాపాతంగా కారుతున్న ఆనందభాష్పాలని తుడుచుకునే ప్రయత్నం చెయ్యకుండా నిష్టూరంగా అన్నది సీతమ్మ, తన మొగుడిని ఇంకాస్త గట్టిగా హత్తుకుని.
వెనక్కి తిరిగి, తడిచిన సీతమ్మ బుగ్గలు తుడిచి, ఆమెని తన గుండెల్లోకి పొదువుకున్నాడు రామయ్య.
***
మూడ్రోజులుగా చప్పబడి ఉన్నాడు రామయ్య. ఏ పనీ ముందులా ఉత్సాహంగా చెయ్యటం లేదు. ఎంత సేపూ ఏదో ఆలోచన. మనసుపెట్టి పని చెయ్యడం మరచి పోయాడు. చేనుకు నీళ్ళు మల్లిస్తూ వాగులో జారి పడ్డాడు. ఆవుకి గడ్డి కోస్తూ బొటనవేలి మీద గాటు పెట్టుకున్నాడు. ఆవు పేడ తీసుకెళ్ళి పెంటలో వెయ్యక వాగులో గుమ్మరించి వచ్చాడు.
సీతమ్మ ఎంత గుచ్చి గుచ్చి అడిగినా… పొడి పొడి జవాబులే ఇస్తున్నాడు.
తల దువ్వుకునే నెపంతో, ఇంట్లోంచి బయటికెళ్ళేప్పుడూ… వచ్చేప్పుడూ, సీతమ్మ చూడకుండా అద్దం వెనక ఫోటోని చూసి చిరునవ్వు నవ్వుతాడు.
రామయ్యకి ఏదో అయ్యిందని దిష్టి తీసింది సీతమ్మ… పీరహ్మదు వద్దకు తీసుకెళ్ళి ఉప్పుతో మంత్రమేయించింది. నాలుగోనాడు పనుంది నాగారం వెళ్లి వస్తానని పొద్దున్నే వెళ్లి వచ్చాక కొంచం తేరుకున్నాడు రామయ్య.
ఒకనాడు అడవిలోకి వెళ్లి బూరుగు చెట్టెక్కి బూరుగు దూది గోనె సంచుల్లో నింపుకు వచ్చి కొత్త పరుపులు, దిండ్లు కుట్టించాడు. నులక మంచం తాళ్ళు బిగదీసి కట్టాడు. వీలైనంతగా ఇంటిని అందంగా ఉంచే ప్రయత్నం చేయ్యసాగాడు…కానీ ఒక్కరోజూ వాటిపై పడుకోలేదు.
నేను చెప్పేంతవరకు ఏ కోడినీ కోయ్యవద్దని సీతమ్మకి చెప్పేసాడు.
నాగారం వెళ్లోచ్చిన నాల్రోజుల తరువాత మళ్ళీ మొదటికే వచ్చింది రామయ్య సంగతి.
అస్తమానం వాకిట్లో మంచమేసుకుని కూర్చుంటాడు. గూడెంలో ఏ చిన్న అలికిడైనా వెంటనే అక్కడ వాలతాడు. గూడెంకి అవతల అల్లంత దూరంలోంచి ఏ మోటారు చప్పుడైనా… చెవులు రిక్కించి వింటాడు. అలా బండ్ల బాట దాకా వెళ్లి నిల్చుంటాడు. పొలం వద్ద ఉన్నపుడు… ఎవరైనా కనిపిస్తే… “గూడెంలకి ఎవరో ఒచ్చిండ్రట గదా?” అని ఆరా తీస్తాడు. అస్తమానం అదే ధ్యాస.
ఇదంతా చూస్తున్న సీతమ్మకి దిగులు కమ్ముకుంది. రామయ్య గురించి బెంగ పెట్టుకుంది. గ్రామ దేవతలందరికీ మొక్కింది.
***
అమావాస్య వెళ్లి పౌర్ణమి వచ్చింది.
రామయ్య పొలానికెళ్ళాడు. అతని పరధ్యానం సీతమ్మకి అంటుకుంది. ఇంటి పట్టునే ఉండిపోయిందా రోజు.
పక్క ఊరి నుంచి ఒక స్కూలు పిల్లవాడు వచ్చి, “రామయ్య ఇల్లు గిదేనా?” అడిగాడు సీతమ్మని.
అవునని తలూపింది సీతమ్మ.
సీతమ్మ కూచున్న అరుగు మీద కూచుంటూ, “గాయల్ల ఓ నాడు మా ఇస్కూలుకు ఒచ్చిండు. మా సార్ తోని “ప్రసేన్” కి ఉత్తరం రాసియ్యమన్నడు. మా సార్ కసురుకున్నడు. మా సార్ అటుబోవుడు సూశి, నేనే దగ్గరుండి ఆయన చెప్పింది రాసిన. అడ్రసేమో తెల్వది. సిన్మా యాక్టర్లందరూ హైదరాబాదుల బంజారాహిల్స్ ల ఉంటరని, గదే రాసిన. గిదేమో మల్ల ఎన్కకొచ్చింది. మా సార్ నన్ను తిట్టి. గీ ఉత్తరాన్ని ఇచ్చి రమ్మని తోల్తే ఒచ్చిన”. అని ఒక ఉత్తరం సీతమ్మ చేతిల పెట్టి సైకిలెక్కి ఆగకుండ వెళ్లిపోయాడు.
తేరిపారా చూసింది ఉత్తరాన్ని సీతమ్మ. అక్షరాలు కూడదీసుకుని చదివింది. ముందు పక్క “ప్రసేన్”, హైదరాబాద్ అడ్రసు ఉంది, వెనక ‘రామయ్య’, అని ఈ గూడెము, మండలమూ, జిల్లా అడ్రసూ ఉంది.
ఉత్తరం చివర చింపి, విప్పి చదివింది సీతమ్మ.
“ప్రసేన్ సార్,
నమస్తే సార్, నా పేరు రామయ్య. మా ఇంటామెకు నువ్వంటి ప్రాణం సార్. దినాం నిన్నే యాది జేసుకుంటది. నీ ఫోటో చూసి మురుస్తది సార్.
ఆమె చాన బాగుంటది సార్, మంచిది సార్. తెల్లగ మల్లెపువ్వులెక్క ఉంటది. చిదిమి దీపం పెట్కోవచ్చు సార్. అసోంటామె ఈ దునియలనే ఉండది సార్. నవ్వితే బీర పువ్వులెక్క నవ్వుతది సార్. నీకు గూడ తప్పకుండ నచ్చుతది సార్. ఒట్టు సార్, నువ్వంటె ప్రాణం ఎల్లగొట్టుకుంటది.
ఒక్కసారి మా గూడానికి రావాలె సార్. రెండు మూడు దినాలు మా ఇంట్ల ఉండి పోండి సార్. మా ఇంట్లనే అన్ని వసతిగ, తయ్యారుగ పెట్టిన సార్.
మీరు తప్పకుండ రావాలె సార్, మా ఇంటామె సంతోషిస్తది.
ఎనక నా అడ్రసు రాస్తున్న సార్, తప్పకుండ రావాలె సార్.
ఉంటం సార్.
నమస్కారం.
ఇట్లు,
భవదీయుడు,
రామయ్య”
రామయ్య పేరు కింది అతని వేలి ముద్ర.
ముందు ఏడ్చింది సీతమ్మ, తరువాత మనసారా నవ్వుకుంది. మొగుడి మీద ప్రేమ రెట్టింపయ్యింది. క్షణం….క్షణం, ఆనందం, సంతోషం ఆమె కుదిపేసాయి.
కాసేపయ్యాక ముసి ముసిగా నవ్వుకుంది. కాలు నిలవక ఇంటి పని సమస్తం చిటికెలో చేసేసింది. కోడిని కోసి కూర వండింది. పొద్దు గూకేలోపు వంటంతా చేసేసి, స్నానం చేసి ఉతికిన మంచి చీర కట్టుకని తయారయ్యింది.
గూట్లో దీపం పెట్టాక వచ్చాడు రామయ్య.
ఆవుని కట్టేసి, దాని ముందర గడ్డేసి వంటింట్లోకి వచ్చి, గూట్లోని అద్దం ముందు తల దువ్వుకుంటూ అటూ ఇటూ చూసి, అద్దం వెనక చూసాడు. కనిపించలేదు. గూడు మొత్తం వెతికాడు. ఫోటో లేదక్కడ….
బిత్తరపోయాడు. అయోమయంగా దిక్కులు చూస్తున్న రామయ్య వెనకగా నెమ్మదిగా, నిశ్శబ్దంగా వచ్చిన సీతమ్మ, అతని చేతుల కింది నుంచి చేతులు పోనించి గట్టిగా కావలించుకుంది. “నేనంటే ఎందుకింత ప్రేమ, నువ్వు ప్రేమించినంత ఇదిగ నేను నిన్ను ప్రేమిస్తున్ననా అన్న అనుమానం ఒస్తున్నది నాకు. నా కిష్టమైనవన్నీ తెస్తనే ఉంటివి, ఇస్తనే ఉంటివి. ఏ మొగడైన గిట్ల జేస్తడా ? మంచి చెడు సూసేది లేదా? మొగులు మీదికెల్లి గాలిమోటరు పోతుంటే అందరు ఇడ్డూరంగ సూస్తరు.
సిన్న పిల్లలైతే సప్పట్లు కొట్టుకుంట ఎగుర్తరు. ముచ్చట పడ్డనని గది గూడ కొన్కస్తావా?” అని కళ్ళలోంచి ధారాపాతంగా కారుతున్న ఆనందభాష్పాలని తుడుచుకునే ప్రయత్నం చెయ్యకుండా నిష్టూరంగా అన్నది సీతమ్మ, తన మొగుడిని ఇంకాస్త గట్టిగా హత్తుకుని.
వెనక్కి తిరిగి, తడిచిన సీతమ్మ బుగ్గలు తుడిచి, ఆమెని తన గుండెల్లోకి పొదువుకున్నాడు రామయ్య.
అప్పుడే చల్లగా వీచిన గాలికి ఆ గది మూలలో ముక్కలుముక్కలుగా చించి ఉన్న ప్రసేన్ ఫోటో, ఉత్తరం ముక్కలు బయటికి కొట్టుకుపోయాయి.

కొట్టం రామకృష్ణారెడ్డి
రచయిత కొట్టం రామకృష్ణారెడ్డి పుట్టింది ఘట్ పల్లి గ్రామం, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా.
ప్రస్తుత నివాసం హైదరాబాద్. బడి, కాలేజీ చదువంతా భాగ్యనగరంలోనే గడిచింది. వ్యవసాయ కుటుంబ నేపథ్యం, కథల్లో గ్రామీణ చిత్రణకు ఉపకరించింది. మానవ సంబంధాలు, వారి నడుమ ఉండే భావోద్వేగాలు ఇష్టమైన ఇతివృత్తాలు. 'నూనె సుక్క, ఇంకిన్ని కథలు' మొదటి కథాసంపుటి. 2022 సంవత్సరానికి 'శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం' వారి పురస్కారం వచ్చింది. 'చీకటి యుద్ధం, మరికొన్ని కథలు' రెండో కథాసంపుటికి, 'తెలంగాణా సారస్వత పరిషత్' వారి పురస్కారం 2026 సంవత్సరానికి ఇచ్చారు.
