నాస్తికుడి దైవ ప్రార్థన

Spread the love

పారిస్ నగర ప్రధాన వైద్య కళాశాల. ప్రపంచ నలుమూలల ఉన్న వైద్య విద్యార్థులు చదువుకోవాలని ఆశపడే విద్యా కేంద్రం.
అలాంటి చోట డాక్టర్ హోరేస్ బియాంచోన్ శరీరధర్మ శాస్త్రానికి సరికొత్త సిద్ధాంతాన్ని అందించి, యుక్త వయసులోనే సెలబ్రిటీగా మారాడు. ఈ స్థితికి చేరక ముందు అతని తొలి దశ చదువంతా, ఫ్రాన్స్ దేశపు శస్త్రచికిత్స చరిత్రలోనే అత్యంత గొప్ప సర్జన్ – వైద్య ప్రపంచంలో అరుదైన తోకచుక్కలా ఓ వెలిగిన డాక్టర్ దేశ్‌ప్లీన్ పర్యవేక్షణలో సాగాయి.
దేశ్‌ప్లీన్ ఆవిష్కరించిన అద్భుతమైన ప్రత్యేక వైద్య పద్ధతిని, ఎవరికీ నేర్పించక తనతో పాటే సమాధిలోకి తీసుకుపోయాడు. అందుకే, సందర్భం వచ్చిన ప్రతిసారీ “సర్జన్ యొక్క కీర్తి అనేది, కేవలం నటులు-నాట్యకారులు-సినీతారలు పొందే కీర్తి లాంటిదే!”నని బియాంచోన్ తాత్వికంగా గుర్తుచేసుకునేవాడు. వేదిక మీద ప్రదర్శన సాగుతున్నంత కాలమే వారి ప్రతిభ వెలిగేది. లోకం వీడి పోయాక ఆ నైపుణ్యం ఆనవాళ్లు ఏమీ మిగలవు. వీరంతా ఆ క్షణానికి మాత్రమే హీరోలు. రంగస్థలం నుంచి నటుడు దిగిపోయాక చప్పట్లు ఎలా మూగబోతాయో, సర్జన్ చేతిలో కత్తి ఆగిపోయాక అతని కీర్తి కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. అలాగే, ఎంతో ప్రసిద్ధిగాంచిన దేశ్‌ప్లీన్ పేరు ఇక తెరమరుగు కానుంది.
లోకానికతను, మనుషుల పట్ల కఠినుడు! దైవం పట్ల పరిపూర్ణ నాస్తికుడు!. మానవ శరీరాన్ని కోసి, ప్రతి అవయవాన్ని జల్లెడ పట్టి ఎంత వెతికినా ‘ఆత్మ’ అనే పదార్థం కంటికి కానరాలేదని, కనుక పరమాత్మా లేడని బలంగా నమ్మాడు. రోగిని చూడగానే అతని లోపల ఉన్న వ్యాధిని పసిగట్టేసే అంతర్దృష్టి ఉన్న దేశ్‌ప్లీన్, మనుషుల మనస్తత్వాలను కూడా అంతే నిశితంగా చదివాడు. ఉన్నత – అధమ హోదాల తేడా లేకుండా మనుషుల్లో పేరుకుపోయిన స్వార్థపరత్వం, ద్వందనీతిని చూసి చూసి మానవ జాతి పట్ల కినుక వహించాడు.
కానీ, విరుద్ధ భావాల – విభిన్న సంఘర్షణల కాల రచనలో, మనిషి అంతరంగంపు అపరిచిత కోణం లోకానికి వెల్లడవుతూనే ఉంటుంది.


***


దేశ్‌ప్లీన్ ఆసుపత్రి అయిన ‘హోటల్-డ్యూ’ (Hôtel-Dieu) లో ఎంతోమంది హౌస్ సర్జన్స్ ఉండేది. వారిలో హోరేస్ బియాంచోన్ అంటే దేశ్‌ప్లీన్‌కు ప్రత్యేక అభిమానం, నమ్మకం. దానికి కారణం లేకపోలేదు. పల్లె నుంచి పారిస్ నగరానికి వచ్చిన బియాంచోన్, క్వార్టియర్ లాటిన్‌లోని పేదల హాస్టల్‌లో ఉండేవాడు. లేమి కొలిమిలో కాలి, నిఖార్సైన వజ్రంలా బయటకు వచ్చిన నిజాయితీగల యువకుడు. స్నేహితుడి కోసం తల తాకట్టు పెట్టడానికైనా, రాత్రంతా మేల్కొని సహాయం చేయడానికైనా వెనుకాడని వాడు. ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసే ఆ మనిషితనాన్ని, అతనిలోని అసలుసిసలైన ప్రతిభను దేశ్‌ప్లీన్ గుర్తించాడు.
అందువల్లే, కీర్తివంతుడు ధనవంతుడైన దేశ్‌ప్లీన్… అవేవీ లేని జూనియర్ డాక్టర్ బియాంచోన్‌తో గాఢమైన స్నేహాన్ని పెంచుకున్నాడు. తన కన్సల్టేషన్లకు, పెద్ద పెద్ద ధనవంతుల ఇళ్లకు బియాంచోన్‌ను వెంటబెట్టుకుని వెళ్లేవాడు. అక్కడ వచ్చే ఫీజులో కొంత భాగం అతని పేద జేబులో చేరేలా చేస్తూ, పారిస్ జీవిత రహస్యాలను నేర్పించాడు. దేశ్‌ప్లీన్ తన మనసున కొట్టుమిట్టాడే అంతరంగ విషయాలను, ఎవరికీ తెలియజేయలేని ఏకాంతపు ఆలోచనలను సైతం బియాంచోన్‌తో పంచుకునేవాడు. అలాగే గురువు జీవిత ప్రతి కదలికను, శిష్యుడు నిశితంగా గమనించేది.
ఒకరోజు దేశ్‌ప్లీన్ ఆసుపత్రి వార్డులో రౌండ్స్ పూర్తిచేసి వస్తుండగా, పారిస్ నగరపు వీధుల్లో ప్రతిరోజూ బరువైన నీటి డబ్బాలను మోసే ఔవర్నాట్ ప్రాంతపు నీటి కార్మికుడి గురించి చెప్పాడు బియాంచోన్. “1821 నాటి చలికాలం కఠినతలో కేవలం బంగాళాదుంపలు మాత్రమే తింటూ, కష్టపడి పనిచేయడం వల్ల తీవ్రమైన శ్వాసకోశ వ్యాధికి గురై, మరణం అంచున ఉన్నా”డని వివరించాడు.
ఆ మాట వినగానే, సమాజం పట్ల ఎప్పుడూ నిర్దయను చూపే దేశ్‌ప్లీన్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతని కళ్లలో ఒక వింతైన ఆందోళన కనిపించింది. తన అపాయింట్‌మెంట్‌లు, ధనవంతుల విజిట్స్ అన్నీ తక్షణమే రద్దు చేసుకున్నాడు. తన గుర్రపు క్యారేజీని అత్యంత వేగంగా పరిగెత్తించుకుంటూ, బియాంచోన్‌తో కలిసి ఆ పేదవాడి చీకటి గదికి వెళ్లాడు. ఆ మురికి కూపంలో, మంచం పై పడి ఉన్న అతన్ని చేతులోకి ఎత్తుకుని ఆసుపత్రికి తరలించాడు. రాత్రింబగళ్లు శ్రమించి, స్వయంగా చికిత్స చేసి పునర్జన్మ నిచ్చాడు. అంతటితో ఆగకుండా, అతను గౌరవంగా బ్రతకడానికి ఒక కొత్త గుర్రాన్ని, నీటి బారెల్‌ను కొనుక్కోవడానికి కావలసిన భారీ మొత్తాన్ని కూడా తన జేబు నుండి ఇచ్చాడు.
కోలుకుని వెళ్లిన ఆ నీటి కార్మికుడు, ఒకరోజు తన స్నేహితుడికి ఒంట్లో బాగోకపోతే నేరుగా దేశ్‌ప్లీన్ దగ్గరికే తెచ్చి—”సార్, నిన్ను కాదని వీడ్ని వేరే ఎవరి దగ్గరకు తీసుకెళ్లగలను!” అన్నాడు. ఆ మాటలకు దేశ్‌ప్లీన్ నవ్వి, అతని చేతులు పట్టుకుని, “మరేం పర్లేదు! నీ వాళ్లందర్నీ నా దగ్గరికే తీసుకురా, చూస్తాను” అన్నాడు. దేశ్‌ప్లీన్‌కు ఈ నీటి కార్మికులపై, ముఖ్యంగా ఔవర్నాట్ ప్రాంతానికి చెందిన శ్రామికులపై ఎందుకంత ప్రత్యేకమైన అనురాగం, సానుభూతి ఉన్నాయో బియాంచోన్‌కు అస్సలు అర్థం కాలేదు. అదో చిక్కుముడి!.


***


కొన్ని నెలల తర్వాత, ఒకరోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో బియాంచోన్ అనుకోకుండా ‘సెయింట్-సుల్పిస్’ చర్చి మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి చర్చి వెనుక వీధి వైపు ఒక గుర్రపు క్యారేజీ వచ్చి ఆగింది. అందులోంచి దిగిన వ్యక్తిని చూసి బియాంచోన్ నిర్ఘాంతపోయాడు. అది మరెవరో కాదు… డాక్టర్ దేశ్‌ప్లీన్! ఎప్పుడూ తన క్యారేజీ లేనిదే అడుగు తీసి అడుగు వేయని ఆ నగరపు అత్యంత ధనిక సర్జన్!, ఆ సమయంలో ఒంటరిగా, చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నారేమోనన్న గమనింపుతో, చర్చి చిన్న తలుపు తెరిచి దొంగలా దూరాడు లోనికి.
తీవ్ర నాస్తికుడైన తన గురువు, దేవుడి ఉనికిని అపహాస్యం చేసే ఆ సైన్స్ మేధావి, చర్చిలోకి వెళ్లడం! బియాంచోన్‌కు నమ్మబుద్ది కాలేదు. అనారోగ్య సమస్యలు లేని దేవుళ్లంటే అతనికి గిట్టదని, ఆయన వారికి చికిత్స చేయాల్సిన అవసరం ఎంతమాత్రం ఉండదనీ తెలుసు. తారాస్థాయికి చేరిన కుతూహలంతో, సడి చేయని పిల్లి పాదాల అడుగుల్తో, తను కూడా నెమ్మదిగా లోపలికి చేరాడు. చర్చి లోపలి చీకటి-వెలుగుల మధ్య, మూలనున్న ‘మేరీ మాత’ బలిపీఠం ముందు చూసిన దృశ్యానికి బియాంచోన్ గుండె ఆగినంత పనైంది.
డాక్టర్ దేశ్‌ప్లీన్… మోకాళ్ల మీద కూర్చుని, చేతులు జోడించి అత్యంత వినయంగా, భక్తిశ్రద్దలతో ప్రార్థిస్తున్నాడు! ఆ పవిత్ర ప్రార్థన సమయమంతా అలాగే మోకరిల్లి ఉన్నాడు. ప్రార్థన ముగిశాక, చర్చి సంక్షేమం కోసం, అక్కడి పేదల కోసం, కానుకల పెట్టెలో భారీగా డబ్బులు వేశాడు. ఆపరేషన్ థియేటర్‌లో క్లిష్టమైన సర్జరీ చేస్తున్నపుడు ఎంతటి గంభీర ఏకాగ్రతను కలిగి ఉంటాడో, అంతటి నిశ్శబ్ద ధారణ ఆయన ముఖంలో కనిపించింది.
‘ఈయన ఇక్కడికి ప్రార్థన కోసమో లేక క్రీస్తు జన్మ రహస్యం మీద శోధన కోసమో రాలేదు కదా!’ని లోలోన నవ్విపోతూ, ‘నలుగురితో కలిసి వస్తే ఏదోలే అనుకోవచ్చు. కాని, ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఇక్కడ ఇలా చేస్తున్నాడంటే? ఇదేదో ఆరా తియ్యాల్సిన అంశమే!’నని బియాంచోన్ తలిచాడు. ఒక్క క్షణం తానేదో గూఢచర్యం చేస్తున్న భావన మదిన మెదిలి, గురువుగారు చూస్తే బాగుండదని, కంటపడకుండా అక్కడ్నుంచి జారుకున్నాడు.
సరిగ్గా అదే రోజు రాత్రి దేశ్‌ప్లీన్, అతన్ని పేరువోయిన రెస్టారెంట్‌కు డిన్నర్‌కి తీసుకెళ్ళాడు. భోజనం పూర్తయి డెజర్ట్ తింటున్న సమయంలో, బియాంచోన్ కావాలనే మాటల మధ్యలో చర్చి ప్రస్తావాన్ని దూర్చాడు. “చర్చి సంప్రదాయాలు – ప్రార్థనలు ఒక పెద్ద బూటకం. భక్తి పేర అమాయకుల్ని మోసం చేసే నాటకం” అంటూ తుట్టెను కదిల్చాడు. దానికి దేశ్‌ప్లీన్ ఉత్సాహపడిపోతూ—”అవును, ఆ మత నాటకాల వల్లే, నెపోలియన్ యుద్ధాల మారణకాండను మించిన రుధిరం చిందిందం”టూ వోల్టేర్ శైలిలో తన నాస్తికత్వాన్ని, హేతువాదాన్ని పూర్తిగా ప్రదర్శించాడు. కానీ, ఉదయం తాను చర్చికి వెళ్ళింది, అక్కడ మోకరిల్లింది జాడమాత్రంగానైనా ముఖ కవళికల్లో కానరాకుండా జాగ్రత్త పడ్డాడు.
‘మరి, ఉదయం చూసిన ఆ పరమ నాస్తిక భక్తుడెక్కడ?’ని బియాంచోన్ మనసున నవ్వుకున్నాడు. అలాగే, ‘తానేమైనా భ్రమపడ్డానా!’ నే సందేహమూ కలిగింది. అయినా గురువు అబద్దం ఎందుకు ఆడతాడు? వారి మధ్యన దాపరికాలకు తావేలేదు. ఇలాంటి వాటి అంతు, చెలిమి పూరిత చర్చల్లో తేల్చుకునే వారేనాయె.
ఆ తర్వాత మూడు నెలల కాలం.
బియాంచోన్ చర్చ్ సంఘటన్ని అస్సలు మర్చిపోలేదు. అనుమానపు ప్రశ్నయి మెదడు తొలుస్తూనే ఉంది. ఓ రోజు ఆసుపత్రి వార్డులో కేస్ షీట్లు చూసుకుంటుండగా, అక్కడికి వచ్చిన తోటి ఫిజీషియన్ దేశ్‌ప్లీన్ చేయి పట్టుకుని, “ఏంటి? మొన్న సెయింట్-సుల్పిస్ చర్చి వెళ్లినట్టున్నారు!” అంటూ బియాంచోన్ ముందే అడిగాడు.
దేశ్‌ప్లీన్ ఏమాత్రం తడబడలేదు. ముఖంలో ఎలాంటి హావభావాలు పలికించకుండా, చాలా సాధారణంగా, మృదు స్వరంతో “అవును. పదహారో లూయీ కూతురు లేదూ ! ఆ జమీందారిణి చెబితే మోకాలి చిప్ప వ్యాధితో బాధపడుతున్న చర్చి ఫాదర్‌ను పరీక్షించడానికి, వైద్యం చేయడానికి వెళ్లా” నన్నాడు.
ప్రశ్నించిన డాక్టర్ సమాధానపడి వెళ్ళిపోయాడే కానీ, పక్కనుండి ఇదంతా వింటున్న బియాంచోన్ మాత్రం ఆ మాటల్ని అస్సలు నమ్మలేదు. ‘మోకాలి చిప్పలు పరీక్షించడానికి అంత రహస్యంగా వెళ్లాలా? అదీ మేరీ మాత బలిపీఠం ముందు గంటల తరబడి మోకరిల్లి వైద్యం చేయాలా? అబద్దాన్ని అతికినట్టు చెప్తున్నా, ఆయన అక్కడికి ప్రార్థనకే వెళ్లా’డని నిశ్చయించుకున్నాడు. ఈ సంఘటన దేశ్‌ప్లీన్ నిర్ణీతకాలభక్తి వెనుక ఉన్న మిస్టరీని సాయంకాలంనీడలా మరింత పెంచి పెద్దది చేసింది.
సరిగ్గా మరో సంవత్సరం గడిచింది.
బియాంచోన్ తన డైరీలో గుర్తుపెట్టుకుని మరీ రాసుకున్న ఆ రోజు – ఆ వేళ రానే వచ్చింది. ఉదయం తొమ్మిదింటికల్లా అతను సెయింట్-సుల్పిస్ చర్చి మూల మలుపు వద్ద ఉత్సుక ఉదరంతో వేచి ఉన్నాడు. కాలయంత్రం ఖచ్చితాన్ని పాటిస్తూ, క్యారేజీ వచ్చి ఆగింది. అందులోంచి దిగిన దేశ్‌ప్లీన్ అలాగే చుట్టూ చూస్తూ, నెమ్మదిగా గోడ చాటు నుండి చర్చిలోకి వెళ్లి, మళ్లీ ఆ మేరీ మాత బలిపీఠం ముందు కూర్చుని అదే ఏకాగ్రతతో ప్రార్థనలు జరిపించాడు. మనసా వాచా నాస్తికుడు, కర్మ మాత్రం ఆస్తికుడిలా ఆచరిస్తున్నాడు.
ఈ దృశ్యం బియాంచోన్‌కు పెను సవాల్‌ను విసిరింది. ఒక మేధావి ఆలోచనలకు, అతని ప్రవర్తనకు మధ్య ఇంతటి పరస్పర విరుద్ధత ఉండటం ఎలా సాధ్యం?. దేశ్‌ప్లీన్ వెళ్ళిపోయాక, బియాంచోన్ నేరుగా చర్చి కేర్ టేకర్ దగ్గరకు వెళ్లాడు.
బియాంచోన్ అతని చేతిలో కొన్ని నాణేలు పెట్టి—”ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిన ఆ పెద్ద మనిషి క్రమం తప్పక ప్రార్థనకు వస్తుంటారా?” అని అడిగాడు. దానికతను గౌరవంగా తలవంచి, “బాబు, నేను ఇక్కడ గత ఇరవై ఏళ్లుగా ఉంటున్న. ప్రతి ఏటా నాలుగు సార్లు ఆయన ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. ఈ పవిత్రమైన ప్రార్థన నిరంతరం సాగడానికి అవసరమైన నిధిని సమకూర్చి, దీన్ని ప్రారంభించిందే ఆ డాక్టర్ గారు!” అన్నాడు.
ఆ మాట వినగానే బియాంచోన్ తల తిరిగిపోయింది. సంపూర్ణ నాస్తికుడు చర్చిలో సొంత డబ్బుతో ప్రార్థనలను స్థాపించడం… మేరీ మాత పీఠం ముందు మోకరిల్లడం… అంతుపట్టకుండా ఉంది తనకు. కానీ, ఎంతటి సాన్నిహిత్యం కలిగివున్నా గురువును నేరుగా ప్రశ్నించే ధైర్యం బియాంచోన్‌కు లేకపోయింది. వారిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకునే అవకాశం కోసం చకోరమై నిరీక్షించాడు.
ఆ తర్వాత, దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ కాలం కరిగిపోయింది.
బియాంచోన్ హౌస్ సర్జన్సీ పూర్తయి డాక్టరయ్యాడు. పారిస్ నగరంలో, 1830 విప్లవం ఆకాశ జెండై రెపరెపలాడుతున్న కాలమది. రాజు పై ప్రజలు తిరుగుబాటు చేశారు. చర్చిలపై ఉన్న బంగారు సిలువలను కూల్చి వేస్తున్నారు. వీధులన్నిటా నాస్తికత్వం, తిరుగుబాటు వెల్లువై ప్రవహిస్తున్నాయి. మత విశ్వాసాల్ని బహిరంగంగా తగలేస్తున్న రోజులవి. అలాంటి అల్లకల్లోలపు ఉదయాన, దేశ్‌ప్లీన్‌ను సెయింట్-సుల్పిస్ చర్చిలోకి వెళ్లడం బియాంచోన్ మళ్లీ చూశాడు.
ఈసారి బియాంచోన్ దాక్కోవాలని అనుకోలేదు. ఎలాగైనా ఈ రహస్యాన్ని బద్దలు కొట్టాలని నిశ్చయించుకున్నాడు. దేశ్‌ప్లీన్ చర్చిలోకి వెళ్లి మోకరిల్లగానే, బియాంచోన్ కూడా వెనకాలే వెళ్లి, ఏమాత్రం సంకోచించకుండా నేరుగా ఆయన పక్కనే మోకాళ్లపై కూర్చున్నాడు. దేశ్‌ప్లీన్ పక్కకు చూశాడు. తన ప్రియ శిష్యుడిని చూసి ఆయన ముఖంలో ఎలాంటి ఆశ్చర్యమూ, కోపమూ కలగలేదు. ఇద్దరూ కలిసి నిశ్శబ్దంగా ఆత్మశాంతి కోసం చేసే ఆ ప్రార్థనలో పాల్గొన్నారు.
ప్రార్థన ముగిశాక, ఇద్దరూ కలిసి చర్చి బయటకు వచ్చారు. పారిస్‌లోని అత్యంత దరిద్రమైన, ఇరుకైన ‘రూ డెస్ క్వాట్రే-వెంట్స్’ వీధిలో నడుస్తుండగా… బియాంచోన్ స్థిరమైన స్వరంతో “సార్, నేను మిమ్మల్ని గత ఏడేళ్లుగా గమనిస్తున్నాను. భగవంతున్ని నమ్మని మీరు, చర్చి ప్రార్థనలు ఎందుకు జరిపిస్తున్నారు? ఆనాడు ఆసుపత్రిలో మోకాలి చిప్ప వ్యాధి ఫాదర్ గురించి మీరు చెప్పిన మాట అబద్ధమని నాకు తెలుసు. మీ సిద్ధాంతాలకు, మీ ప్రవర్తనకు ఎక్కడా పొంతన లేదు. ఈరోజు నాకు నిజమేదో మీ నుండి వినాలని ఉంది.” అన్నాడు.
దేశ్‌ప్లీన్ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా గడిపి- ఆ దారిలో ఉన్న ఓ ఆరు అంతస్తుల పాడుబడి, శిథిలావస్థకు చేరిన భవనం వైపు అడుగులు వేశాడు. దాని పై అంతస్తు కిటికీలో ఒక చిన్న పూల కుండీ, దండెం మీద ఆరేసిన బట్టలు వేలాడుతున్నాయి. దాన్ని చూపిస్తూ “బియాంచోన్! నేను ఆ పైన ఉన్న చిన్న గదిలో రెండేళ్ల పాటు కష్టాల్ని కడుపార తాగుతూ బతికా.”
ఆయన కళ్లు గతం వైపు చూస్తూ చిప్పిల్లాయి. పూడుకుపోయిన గొంతు సవరించుకుంటూ తన జీవిత కథ చెప్పడం ప్రారంభించాడు:.
“ఈ పారిస్ నగరంలో నా తొలి రోజులు ఎంతో నరకప్రాయంగా సాగాయి. మెడిసిన్ చదివేప్పుడు కూడా కడు పేదరికాన్ని అనుభవించాను. ఆకలితో కడుపు కాలుతుంటే, దాహంతో గొంతు ఎండిపోతుంటే… పుస్తకాలు కొనడానికి చేతిలో పైసా లేక, కట్టుకోవడానికి మంచి బట్టలు – వేసుకోవడానికి చెప్పులు లేక అల్లాడిపోయాను. ఆ నా చలికాలపు గదిలో కనీసం నిప్పు కూడా వెలిగించుకునే స్తోమత ఉండింది కాదు. చేతులు గడ్డకట్టుకుపోతుంటే, మంచు పొగల ఊపిర్లతో రాత్రంతా మేల్కొని చదువుకునేది. నా కోప స్వభావాన్ని అర్థం చేసుకోలేదు ఎవరూ. పైగా దూరం పెట్టేది. అగ్గువకు దొరికే నిలువ రొట్టెలు కొని, వాట్ని పాలలో నానబెట్టుకుని తినేవాణ్ణి. రోజు విడిచి రోజు మాత్రమే భోజనం. ‘ఆపరేషన్ ఫీజులు ఎక్కువ తీసుకుంటా’డని అరిచే ఆ ధనవంతులను, ఒక్క వారం రోజులు పారిస్ వీధుల్లో చేతిలో చిల్లిగవ్వ లేకుండా వదిలేస్తే, ఆకలి బాధలు అంటే ఏంటో తెలిసొచ్చేది.
ఒక రోజు పూర్తిగా నిరాశలో కురుకుపోయాను. నా వల్ల కాదని చదువు ఆపేసి సైన్యంలో చేరిపోవాలనుకున్నా. సరిగ్గా ఆ సమయంలోనే స్వగ్రామం నుండి మా అత్తయ్య పంపిన బట్టల పెట్టె ఒకటి వచ్చింది. అందులో నా కోసం కుట్టిన చొక్కాలు ఉన్నాయి. దాన్ని తెచ్చిన క్యారేజీ వాడు “నలభై ఫ్రాంకుల పోస్టు చార్జీ కట్టాల”న్నాడు. నా దగ్గర దమ్మిడి లేదు. ఆ డబ్బులు కట్టి పెట్టె విడిపించుకోవడం కోసమని, వీధుల్లో పడి అప్పు దొరుకు దారి వెదుకుతూ తిరిగాను.
ఆ రాత్రి విఫల మనస్సుతో గదికి చేరిన నన్ను, పక్క గదిలో ఉండే బోర్గోట్ గమనించి, లోనికి వచ్చాడు. అతను సెయింట్-ఫ్లోర్ ప్రాంతం నుండి వచ్చిన ఒక పేద నీటి కార్మికుడు. అమ్మానాన్న లేక, అనాథ శరణాలయంలో పెరిగాడు, చదువుకోలేదు. జీవనోపాధికి ప్రతిరోజూ పారిస్ వీధుల్లో నీళ్లు మోసేవాడు. కారే చెక్కిలి నీటిధారల్ని తోడై చూస్తూ, నా బాధంతా గుండెతో విన్నాడు.
వెంటనే తన నడుముకున్న ఒక పాత, మురికి తోలు పర్సును బయటకు తీసి “చిన్న బాబు ఏడ్వకు, నువ్వు చదువుకున్నోడివి. నేను ఒంటరిని. నా సంపాదన నాకే సరిపోదు కానీ, నీ బాధ నేను చూడలేకపోతున్నా”నంటూ నా అద్దె బాకీలు, ఆ పెట్టె చార్జీలు మొత్తం ఇచ్చేశాడు.
ఆ తర్వాత మేమిద్దరం ఒక చిన్న గూడు లాంటి గదిలోకి మారాము. బోర్గోట్ రోజుకు యాభై కాసులు సంపాదించేవాడు. ఒక గుర్రాన్ని, నీటి బారెల్‌ను కొనుక్కొని జీవితాంతం నీళ్లు మోసే కష్టం నుండి తప్పించుకోవాలని ఇరవై రెండేళ్లుగా వంద క్రౌన్లను దాచుకున్నాడు. తన జీవితకాల కల సాకారం చేసుకునే సంపదంతా… నా భవిష్యత్తు కోసం, నా పరీక్షల ఫీజుల కోసం త్యాగం చేశాడు.
అప్పటి నుండి నన్ను తన కొడుకులా ప్రేమించేవాడు. నేను అహోరాత్రులు చదువుకుంటుంటే, దూరం నుంచి తల్లిలా చూసి సంతోషించేవాడు. మంచి ఆహారం పెడుతూ, దుస్తులు ఉతుకుతూ, నన్నో మహారాజులా చూసుకున్నాడు. ఆ నిరుపేద హృదయం ఎంత ధనమైందో మాటల్లో వర్ణించలేను బియాంచోన్! ఆయనకో పెంపుడు కుక్క ఉండేది. అది చనిపోతే, “దేవుడు దాని ఆత్మను స్వర్గానికి తీసుకెళ్తాడా!, దానికోసం చర్చిలో ప్రార్థన చేయించవచ్చా!”ని నన్ను ఎంతో అమాయకంగా అడిగాడు. ఆయనకున్న ప్రేమ నంతటినీ నాపైన కురిపించాడు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే, దానికి కారణం బోర్గోట్ త్యాగఫలమే!
హౌస్ సర్జన్సీ చివర్లో బోర్గోట్ కు నీళ్ళ బండి, గుఱ్ఱం కొనిచ్చాను. అందుకతడు కోప్పడుతూనే, ఆనంద బాష్పాలు రాల్చుతూ “ఇదేం బాగులేదు. బండి ఎంత బాగుందో!, గుఱ్ఱం ఎంత బలంగుందో! అయినా నువ్విలా చేయకుండాల్సింది” అన్నాడు. ఆయన్నలా చూడటం నిజంగా నాకది అపురూప దృశ్యం. మరపురాని గొప్ప అనుభవం. తర్వాత నా థీసిస్ కూడా అతనికే అంకితం చేశాను.
కానీ, విధి చాలా కఠినమైనది బియాంచోన్. నా మొదటి పరీక్ష పాసైన ఆనందం సమయంలో… బోర్గోట్ రెండోసారి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. పగలనక – రాత్రనక నీళ్లు మోయడం వల్ల అతని శరీరం పూర్తిగా క్షీణించి పోయింది. మొదటిసారి మృత్యు ముఖం నుంచి బయటికి లాగిన నా చేతుల్లోనే, ఆ పేద గదిలోనే, చివరి శ్వాస విడిచాడు. చనిపోయే ముందు ఒక నోటరీ ద్వారా తనకున్న కొద్దిపాటి సామాగ్రి, బట్టలు కూడా నాకే ఇచ్చాడు.
బోర్గోట్‌కు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కానీ దేవుడిపై అచంచలమైన నమ్మకం ఉంది. పవిత్ర మేరీ మాతను తల్లిగా ఎంచి కొలిచేవాడు. ఆయనొక పరమ కాథలిక్ భక్తుడు. నేను నాస్తికుడ్నని తెలిసినా, నా సిద్ధాంతాల గురించి ఎన్నడూ ఒక్క ముక్క కూడా ప్రశ్నించలేదు.
ఆయన మరణ శయ్యపై ఉన్నప్పుడు మాత్రం, చర్చి ద్వారా ఒక క్రైస్తవుడికి అందవలసిన అన్ని పవిత్ర ఆచారాలు దక్కేలా చూడమని వేడుకున్నాడు. ఒక పుణ్యాత్ముడి దక్కాల్సినంత పవిత్రంగానే అతని మరణం ముగిసింది.
ఆయన్ని స్మశానానికి మోసుకెళ్లిన ఏకైక వ్యక్తిని నేనే. నా జీవితాన్ని నిలబెట్టిన ఆ మహానుభావున్ని మట్టిలో కలిపి వచ్చాక, గుండె నిండా ఒకటే ఆవేదన నిండుకుంది. ఆయనకు బాకీ పడ్డ అప్పును ఎలా తీర్చుకోవాలి? కుటుంబం లేదు, భార్యాపిల్లలు లేరు కానీ, ఆయనకు ఒక నమ్మకం ఉండింది. చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం చర్చిలో జరిపించే ప్రార్థనల గురించి, ఎంతో భయపడుతూ, సున్నితంగా చెప్పేవాడు. అయినంత మాత్రాన, తను చేసిన సేవలకు ప్రతిఫలంగా నేనది చేయాలని మాత్రం ఎన్నడూ ఆశించలేదు.
కానీ, నేను గొప్ప సర్జన్‌నై అపారమైన డబ్బు సంపాదించిన తర్వాత… బోర్గోట్ ఆత్మకు ఇచ్చిన మాట ప్రకారం, ప్రతి సంవత్సరం నాలుగు సార్లు ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిపించడానికి అవసరమైన మొత్తాన్ని నేను సెయింట్-సుల్పిస్ చర్చికి ఇచ్చి, ఈ ప్రార్థనను స్థాపించాను. బోర్గోట్ కోసం నేను చేయగలిగిన ఏకైక పని అతని పవిత్రమైన నమ్మకాన్ని గౌరవించడమే.
అందుకే, ప్రతి సంవత్సరం ప్రార్థనలు జరిగే రోజుల్లో, అన్ని పనుల్ని పక్కన పెట్టి ఒంటరిగా చర్చిను సందర్శిస్తాను. నాస్తికుడికి ఉండే సంపూర్ణమైన నిజాయితీతో, కృతజ్ఞతతో ఆ దేవునికి ఇలా నివేదిస్తాను:
‘మహోన్నతుడైన దేవా… పవిత్రంగా జీవించిన వారి కోసం మరణానంతర వాసాన్ని నువ్వు సృష్టించి ఉంటే, ఆ స్వర్గంలోకి మా మంచి బోర్గోట్‌ను పంపించు. ఒకవేళ అతను ఏదైనా చిన్న చిన్న పాపాలకు శిక్ష అనుభవిస్తూ బాధపడుతుంటే, ఆ బాధను నాపై మోపు. అతనికి బదులుగా నన్ను అనుభవించనివ్వు. తద్వారా అతను ఆ స్వర్గలోకం లోకి వీలైనంత తొందరగా ప్రవేశించేలా చూడు.’
మిత్రమా బియాంచోన్! నాలాంటి సిద్ధాంతాలు గల నాస్తికుడు ఇంతకంటే ఎక్కువ ఏమీ చేయలేడు. నేను నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను… బోర్గోట్‌కు ఉన్నలాంటి అచంచలమైన పవిత్ర విశ్వాసం గనుక నాకు ఏర్పడితే, దాని కోసం నా కీర్తిని, నా ఆస్తిని ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ, నా సైన్స్ నన్ను ఆ నమ్మకం వైపు వెళ్లనివ్వదు. అయినా, బోర్గోట్ కోసం నేను ఈ ప్రార్థనను నాస్తికుడిగానే కొనసాగిస్తాను.”
దేశ్‌ప్లీన్ తన అంతరంగాన్ని పూర్తిగా ఆవిష్కరించిన ఆ క్షణంలో బియాంచోన్ మది చెమ్మగిల్లి కళ్ళలోంచి ఉబికింది. బయటికి కఠినుడిగా, నాస్తికుడిగా కనిపించే గురువు హృదయాంతరాల్లో హిమాలయమంత కృతజ్ఞతా పర్వతం దాగి ఉందని ఊహించలేదు. ఆసుపత్రిలో ఆనాడు తోటి డాక్టర్‌తో దేశ్‌ప్లీన్ ఆడిన ఆ చిన్న అబద్ధం వెనుక ఎంతటి పవిత్రమైన దాపరికం దాగి ఉందో ఇప్పుడతనికి సంపూర్ణంగా బోధపడింది.
అప్పట్నుంచి వారు మరింత సన్నిహితులయ్యారు. తర్వాతి కాలంలో డాక్టర్ దేశ్‌ప్లీన్ గుండె జబ్బుతో మరణించే వరకు బియాంచోన్ సంరక్షణలోనే గడిపాడు. అయితే, ‘ఆ గొప్ప సర్జన్ చివరి శ్వాసలో నాస్తికుడిగానే చనిపోయాడా లేక ఆస్తికుడిగా మారాడా’ని అడిగితే బియాంచోన్ ఈ రోజుకీ ఖచ్చితంగా చెప్పలేడు.
కానీ “బోర్గోట్ దిగివచ్చి, తన మిత్రుడైన దేశ్‌ప్లీన్ కోసం స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటా”డనే భావం, విశ్వాసులకు తప్పకుండా సంతోషాన్నిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
అలాగే- ఫ్రాన్స్ దేశం కోసం ప్రాణాలు అర్పించి, దేశ కీర్తిని పెంచి, సమాధుల్లో భూమిపుత్రులై శయనిస్తున్న అసామాన్యుల స్థలి ‘పాంథియోన్‌’ స్మారక భవన ముఖద్వారం మీద చెక్కబడ్డ వాక్యం: “ఒక కృతజ్ఞత గల దేశం, తన గొప్ప బిడ్డలకు సమర్పించే నివాళి”… ఈ సామాన్య గురు-శిష్యులకూ శిలాక్షరమై వర్తిస్తుందని చెప్పడానికి బియాంచోన్ ఏమాత్రం సంశయించడు.

***

బాల్జాక్

ప్రపంచ ప్రఖ్యాత రచయితలలో వేళ్ళ మీద లెక్కపెట్టగల అతికొద్ది మందిలో ఫ్రెంచ్ రచయిత బాల్జాక్ ఒకడు. హోనొర్ డి బాల్జాక్ 20 మే 1799 సంవత్సరంలో జన్మించాడు. చార్లెస్ డికెన్స్, గుస్టావ్  ఫ్లాబర్ట్, హెన్రి జేమ్స్, ఫిదోర్ దోస్తయేవ్ వంటి మహారచయితలను బాల్జాక్ ప్రభావితం చేసాడని అంటారు. బాల్జాక్ రచనలలో ‘హ్యూమన్ కామెడి’ చాల ప్రసిద్ధి పొందినది. నవలలతో పాటు అనేక కథలు, నాటకాలు కూడా రాసాడు. 1950 లో బాల్జాక్ మరణించాడు.

పిన్నంశెట్టి కిషన్

మానవీయ దృక్పథం తో సాహిత్య సృజన చేస్తున్న పిన్నంశెట్టి కిషన్ 8 ఫిబ్రవరి, 1962 న వేములవాడ లో జన్మించారు.
తండ్రి: అచల పరిపూర్ణ శ్రీకరానంద పిన్నంశెట్టి చెన్నయ్య. తల్లి: శ్రీమతి మంచె లక్ష్మీబాయి.

ఎం. ఏ., బీఎడ్., చదివి తూనికలు-కొలతలు శాఖ అధికారిగా పదవీ విరమణ చేశారు. దాదాపు అరవై కథలు, వందకు పైగా కవితలు, కొన్ని విమర్శనా వ్యాసాలు రాశారు.

కథా విభాగంలో “ లేంబాళ వాటిక కథలు “,
కవితా విభాగంలో “ నల్ల పద్యం “ సంపుటాలు వెలువడ్డాయి.

వేములవాడ నేపథ్యంలో 1970 నుంచి 1990 వరకు గల ఊరి సామజిక స్థితిగతుల్ని ఆత్మకథనాత్మక శైలిలో “ లేంబాళ వాటిక కథలు “ రాశారు.లేంబాళ వాటిక కథలకు గూడూరి సీతారాం కథా పురస్కారం-2024 నకు మరియు పీచర సునీతా రావు స్మారక సాహిత్య పురస్కారం-2025 నకు లభించాయి.2023 వ సంవత్సరానికి, కథా విభాగంలో లేంబాళ వాటిక కథలు సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం వచ్చింది.  "నల్ల పద్యం" కవితా సంపుటికి హాసిని రామచంద్ర లిటిరరీ పౌండేషన్ ఖమ్మం వారి పురస్కారం 2024 గాను లభించింది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *