మేకలు

Spread the love

“వచ్చే మంగళవారం వారాల పండుగ సేత్తాము గాబట్టి కోడి, కోక, ఆనాటికి జత పెట్టుకోవలసిందమ్మో!

జిండాకు…. మండాకు…. మండాకు జిండాకు… బారికి వెంకడి దండోరా ఆఫ్ కేక ఊరి జనం చెవుల్లో మారుమ్రోగుతుంది. అడు

అదునుకు వర్షం కురవడం, దమ్ములు ఆ వెనుక ఉడుపులు ఆ ఊర్లోని పొలాలు పచ్చపచ్చగా నవ్వుతూ గాలికి హాయిగా తలలూపుతున్నాయి.

మంగళవారం రానే వచ్చింది!

ఊరుకు తూర్పు దిక్కున మాలపేట బారుకులు అసిరమ్మ గుడికి బయలుదేరమని ఇంటింటికీ కబుర్లు చేరవేస్తున్నారు.

దక్షిణం వైపునున్న మాదిగవాడ బారుకులు డప్పులు, తుడుంకుండలు కాపడంలో తలమునకలైనారు.

ఇంకోవైపు గూలలు పూజారిని అలంకరించడంలో నిమగ్నమైనారు.

మరోప్రక్క మంగళ్ళు, చాకళ్ళు, నాయుళ్ళు పురమాయించిన పనుల్లో హడావిడిగాతిరుగుతున్నారు.

జజ్జనకరి… జజ్జనకరి… జజ్జనకరి…

పూజారి తలమీద ఘటంతో సన్నగా ఊగుతూ గుడివైపు పరుగులాంటి నడకతో అడుగులేస్తుంటే కాళ్ళు కడిగి, పసుపు రాసి బొట్టుపెట్టిన పట్టా మేకపోతును ఆ వెనుకగా నడిపిస్తుంటే దారి పొడుగునా జనం… ఊక బోస్తే ఊక రాలదు.

ఒక చేత్తో జంగిట్లో పసుపు, కుంకుమ, ముగ్గు పిండి, మరో చేత్తో చెంబులతో నీళు ఏ పట్టుకుని ఆడోళ్ళు, కోళ్ళు పట్టుకుని మగోళ్ళు, పిల్లలు పెద్దలు వారాల సంబారానికి గుడికి చేరువౌతున్నారు గోలగోలగా…

ఒనుము చెట్టు ముందు కళ్ళాపి జల్లి ముగ్గులు వేశారు.

అక్కడ చేరిన జనం చుట్టూరా చాకలి అక్షతలు చల్లి కట్టు కట్టేడు. కట్టు కట్టి ఏ ఒక్కరూ పూజ పూర్తి కాకుండా వెళ్ళకూడదని మరీ మరీ చెప్పాడు.

కట్టు కట్టిన హద్దు దాటి చెప్పులతో ఎవరూ రాకూడదని మనవి చేశాడు.

చదువుకున్న కుర్రాళ్ళు వెప్పులిప్పడానికి యిష్టపడక హద్దుకు బయట ఉండి సినిమా చూస్తున్నట్టు నిలుచున్నారు.”

మనసులో భయం వున్నా…. బయటకు మాత్రం అమ్మవారి మీద జోకులేస్తూ ఆడు పిల్లల దగ్గర ఫోజులు కొడుతున్నారు కొందరు.

ఉన్నట్టుండి పూజారి అరుపులు!

పూజ తంతు పూర్తయ్యాక చాకలి ఒక దెబ్బతో మేక మెడను తగ్గోశాడు. తెగిన మెడ చుట్టూ రక్తం చివ్వున ఎగిరింది.

ఒకే వేటుకు తల తెగ్గోసినందుకు అతని కళ్ళలో గొప్ప వెలుగు.

కోకలు అమ్మవారికి చూపించి కోలు సాధించుకోవచ్చునని చాకలి కేకేశాడ ఆనందంతో…

అందరూ కోళ్ళకు బొట్లు పెట్టి… కాళ్ళు కడిగి, ఓరింపెట్టి తినపించ సాగారు.

కొన్ని కోళ్ళు తినడానికి బెదురుతూ సంకోచిస్తున్నాయి.

“అమ్మవారికి కోపమేటో

అనుకుంటూ తినపించడానికి ప్రయత్నిస్తున్నారు కొందరు.

కొన్ని తిండి దొరికిన సంతోషంతో టకటక పొడుస్తూ తింటున్నాయి.

అది చూసి అమ్మవారి అనుగ్రహం పొందినట్లు సంతోషంతో కొందరు పొంగిపోతున్నారు.

చాకళ్ళు, మంగళ్ళు, బారుకులు, కొడవళ్ళతో కోళ్ళ పీకలను తెగ్గోస్తూ, గావంచాల్లోను. తువ్వాల్లోనూ సంచుల్లోనూ కోళ్ళ తలల్ని వేసుకుంటున్నారు.

ఒకేసారి వందల మూగజీవాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి!

అక్కడి నేలంతా నెత్తుటి మయం!

అక్కడ జనాల ముఖాల్లో ఆనంద తాండవం! “ఒరే ఎవుడ్రా నువ్వు సుట్ట పోడి సేత కోళ్ళు కోయించి ఎక్కువ బుర్రలు కూడేసీడానికి సూత్తన్నావు మా మొప్పము”

కేకేస్తూ మంగళి వెంకటి మీదకి దూసుకెళ్ళాడు చాకలి లక్షుము.

“నా యిష్టం నాయిడోల ఇల్లు. నువ్వెవుడివి అడగడానికి- నాను కోయించుతాను నీ దిక్కున్నికాడ చెప్పుకో!

            మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి తనకు మద్దతు ఉన్నాడన్న ధీమా చాకలి లక్షుము కళ్ళల్లో.

“నీ యిష్టమంతా యికన కుదరదు. ఈవేల అటో ఇటో తేలిపోవాల. రండ్రా మనోలందరు!”

            చాకళ్ళు, మంగళ్ళు కొడవళ్ళు, కర్రలు పట్టుకుని మొగిసిపోయారు.

“ఒరే లక్షుంగా నువ్వు ఎవుల్ని బట్టి నీలుగుతున్నావో మాకూ తెలుసురా… నీ కెంత బలముందో… మాకెంత బలముందో యిప్పుడు తేలిపోవాల. మొన్న దొంగనోటుతోని గెలిసీడింగాదు. ఎన్నో ఓట్లు తోటి గెలిసీసినారేటి? ఒక్కవోటు. అదైనా ఏటి? పెళ్ళం ఓటు. పెళ్ళం అసుపత్రిలో ఉంటే ఓటు హక్కు లేని సెల్లెల్ని తీసుకొచ్చి ఏయించుకొని గెలిసీసినారు. పెళ్ళానికి సెల్లెలికీ తేడా నేదురా మీ పెసిడెంటుకి”.

            బయటనుండి ఎవరో ఎగదోశారు.

            కర్రలు లేచాయి! నీరెండకు కొడవళ్ళు మెరిశాయి!

మూర్ఖత్వం వాళ్ళ ముఖాల మీద చీకటిలా పరుచుకుంటుంది!

ఎన్నికల పగలు పడగలిప్పాయి.

ఇరు పార్టీల వారు కేకలేస్తూ పంచెలు ఎగ్గట్టారు.

ఎవరి తలలు బద్దలౌతున్నాయో!

నెత్తురోడుతోంది!

తుళ్ళిన నెత్తురుతో నేల తడిసి ఎర్రబడతోంది!

            పిల్లలే బలౌతున్నారో!

పెద్దలే రాలిపోతున్నారో…!

ఏమీ అర్ధం కాని అయోమయం.

            కోళ్ళు, మేకల రక్తంతో ఎర్రబడ్డ నేల మనుషుల రక్తంతో కలిసి చిక్కబడుతోంది!

            ఒక తల బంతిలా తెగిపడింది! అంతే… జనం కకావికలయ్యారు!! అసిరమ్మ గుడి ఆవరణ నిర్మానుష్యమైంది! భయంకర నిశ్శబ్దం గాలిలో తేలియాడుతోంది!

తెగిపడ్డ మనిషి తల! ఆ పక్కనే బలి మేక తల! చుట్టూ తెగి రాలి పరుచుకున్న కోడి బుర్రలు! ఆకాశం చిన్నబోయినట్టు… మబ్బుపట్టి ఏడ్చినట్టు సన్నగా చినుకులు రాలుస్తోంది!.. చిత్తడి చిత్తడిగా ఎరుపెక్కిన నేల!

            “నాయినా దేశిమెలిపోయి తిరిగొచ్చినావు ఇందుకేన్రా… రెండు పచ్చాల మనుసులు నువ్వు దగ్గరోడవని సార్జీ డబ్బులిచ్చి మరీ రప్పించినారు యిందుకేన్రా… వారాల అసిరమ్మకి మేకపోతు బలైపోతే… ఎలచ్చను అసిరమ్మకు నువ్వు బలైపోనావురా నాయినా!”

            మొక్కు సాదించుకోవడానికి వచ్చిన ఓ ముసిల్ది తల తెగిన తన కొడుకు శవం ప్రక్క కూర్చొని గుండెలు బాదుకొని రోధిస్తుంది!

            నిలువెల్ల అలుముక్ను దుఃఖంతో ముసిల్దాని ఏడుపు రాగం బరువుగా గాలిలో తేలిపోతోంది.

వియ్యేవో… రిపోర్టు చెయ్యడానికి పోగా…

            గ్రామ దేవతలు పారిపోగా.. గుడిలో అసిరమ్మ మాత్రం చోద్యం చూస్తున్నట్టు… చిరునవ్వులు చిందిస్తూనే ఉంది.

            రాతి బొమ్మ ముందు రాలి పడ్డ శిరస్సు సూన్యంలోకి చూస్తూ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నట్టుంది!

చింతా అప్పల్నాయుడు

విశ్రాంత ఉపాధ్యాయుడు చింతా అప్పల్నాయుడుగారు  పార్వతీపురం (మన్యం జిల్లా) లో 1 జులై 1960 న జన్మించారు. సాహిత్యరంగంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న వీరు ప్రభుత్వ అక్షరాస్యతా కార్యక్రమంలో గిరిజన /నిరక్షరాస్యులను చైతన్య పరిచే అనేక నాటికలు రాసి వాటిలో నటించారు. ‘నకజకనరి నాం.. నాం..’ కథల సంకలనంతో పాటు ‘దుక్కి’, ‘ఇల మీద దేవత’, ‘అరిసేతిలో బువ్వపువ్వు’ వంటి కవిత్వ సంకలనాలు తెచ్చారు. ఫ్రీవర్స్ ఫ్రంట్, రంజనీ కుందుర్తి అవార్డు (హైదరాబాద్) ఎక్స్ రే వంటి అనేక అవార్డులు అందుకున్నారు. 2026 సంవత్సరానికి ‘చాసో కథా పురస్కారం’ అందుకుంటున్న సందర్భంలో వారిని అభినందిస్తూ ఈ కథను పునర్ముద్రిస్తున్నాము.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *