ఊదారంగు మధ్యాహ్నం…

Spread the love

ఎంతకీ పూర్తికాని కలలో… స్లోమోషన్ ఎఫెక్ట్లో ఒక దృశ్యం… ఊదారంగులో వెంటాడుతోంది! చుట్టూ కొండల్లా నిలబడిన ప్రహారీ గోడల మధ్య సువిశాలమైన సామ్రాజ్యంలా విస్తరించిన పురాతన పెంకుటిల్లు…. పదడుగుల ఎత్తుండే పెద్ద అరుగులు మోకాలెత్తు మెట్లు…. మైదానంలా పరచుకున్న సిమ్మెంట్ కారిడార్… పైన ఆస్బెస్టాస్ రేకుల షెల్టరు…. పేద్ద దేవిడి !

వందలకొద్దీ జనం చేరుకుంటున్నారు అక్కడికి… అలా చేరిన, చేరుతూన్న, చేరబోతూన్న వందలాది, వేలాదిలో…

నేను వొక్కణ్ణీ !

సమూహంలో ఏకాకిని !

వాళ్ళంతా ‘అతని కోసం’ నిరీక్షిస్తున్నారు. నేను కూడా వాళ్ళతో కలిశాను. అయితే… . అతనెవరో నేనెరుగను! అతని కోసం నేనెందుకు ఎదురు చూడాలో… ఆ వివరాలు తెలియవు. అసలక్కడ నేనెందుకున్నానో తెలీదు!

స్లోమోషన్లో  ఇదే దృశ్యం…

ఊదారంగులో వెంటాడుతోంది…

            రాత్రి తెల్లార్లూ గ్రామ దేవత సంబరాల్లో జాగారం చేసి…. నిద్రపోయి… మళ్ళా మామూలుగా పొద్దుటే లేచి, ముఖం కడుక్కుని, కాఫీ తాగి బరువుగా మళ్ళీ పడుకున్నాక హఠాత్తుగా మొదలై ఉంటుంది ఉదారంగుకల! మెల్లగా అది రిపీటవుతూనే ఉంది. ఉన్నట్టుండి ఫోన్ మోగింది. ఫోన్ మోత కలలోనా? మెలకువలోనా?

            బహుశా మేలుకోవడానికే కాబోలు…

            అసంకల్పిత ప్రతీకార చర్యలా రిసీవర్ అందుకున్నాను.

            “ఏం చేస్తున్నారూ?” అవతల్నుంచి రాజుగారి కంఠం.

            “ఏమీ… లేదు… చె… ప్పం…. డి” అన్నా మత్తుగా.

            “ఒక చోటకెళ్ళాలి… తోడు రండి… కారు రెడీగా ఉంది”

            రాజుగారి హుకూం.

            ఎక్కడికీ అనే ప్రశ్న ఎక్కడైనా ఉంటుందేమో కానీ రాజుగారి దగ్గరుండదు!

            ‘సరే…’అని ఫోన్ పెట్టేశాను.

            నిద్రకీ, మెలకువకీ మధ్య పెరట్లోకి అడుగులేశాను.

            రోహిణీ కార్తెలో, మిట్ట మధ్యాహ్నపు వేళ…

            మత్తులోంచి మెలకువలోకి రావడం కోసం…

            మా నూతిలోంచి నాలుగు బకెట్ల కలని తోడిపోసుకున్నాను. చల్లటి నీళ్ళకి బదులు… నూతి రాతి పొరల అడుగున నిశ్చలంగా… నిర్మోహంగా…. నిర్గుణంగా… దాగున్న కలని స్నానం చేశాను.

            దేహం మీంచి జారి… కల ఆత్మలో యింకుతోంది. ఒక కలలోంచి మేలుకుని ఇంకో కలలోకి నడిచినట్టు కలలో మెలకువలా, అనాలోచితంగా బయలుదేరాను.

          నా కోసం ఎదురు చూస్తున్నారు రాజుగారు.

                ‘కారెక్కండి’ ఆజ్ఞాపించారాయన.

            మిట్ట మధ్యాహ్నం…. ఒక ఉదారంగు కల నన్నావహించింది. రిమోట్ సాయంతో ఎవరో నన్ను ఆ కలలో ప్రవేశపెట్టారు!

            మరి దీని సారాంశం ఏమిటి?

            నిద్రకీ, మెలకువకీ మధ్య ఆవిష్కారం ఏమిటి?

            తెలీడం లేదు. అసలు కలకి సారాంశం, దత్తాంశం ఉంటాయా? కల… దానిష్టం! ఉన్నట్టుండి వెన్నులోంచి చలి మొదలయ్యింది. వెన్నులోంచి పుట్టే చలిభయం…

                కలలోనా? జీవితంలోనా? కలలో పుట్టే ఫీలింగ్ మెలకువలోకి ఎలా చేరుతుంది?

ఇంతకీ… ఊదారంగు మిట్టమధ్యాహ్నపు కలలాంటి సమయం ఎక్కడికి  చేరుస్తుందీ?

కారు ఒక చోట ఆగింది.

కార్లోంచి దిగాక వెన్నులో చలి మాయమయ్యింది!

వేడిగాలి వొళ్ళంతా పాకింది.

రాజుగారి వెనకే అడుగులేయడం మొదలెట్టాను.

ఎదురుగా కనిపించిన దృశ్యాలు నాకు బాగా పరిచయమైనట్టుగా ఉన్నాయి. వీటిని ఇలాగే… ఎక్కడో చూశాను!

ఎక్కడ చూశానూ? అన్నీ తెలిసిన పరిసరాలే…

            ఎన్నడూ చూడని ఒక ఊరిలో ఎంతో బాగా ఎరిగిన చోటు! ఎలా సాధ్యం?! హఠాత్తుగా గుర్తుకొచ్చింది.

            ఇది స్లోమోషన్లో నన్ను వెంటాడుతున్న కల! చాలా సేపటి క్రితం డిస్ కనెక్టయిన కల… నిజంగా మళ్ళీ మొదలయ్యింది! అదే విశాలమైన దేవిడీ… వందలకొద్దీ చేరుకుంటున్న జనం… తేనె పట్టులా పట్టిన జనం! ఇంత క్రితం దాకా వేధించిన ఒకానొక స్వప్నస్థితి పచ్చిగా జీవితంలోకి చొరబడి పోయినట్టుంది! స్వప్నానికీ…. సత్యానికి తేడా లేనట్టుంది.

            అసలంతమంది అక్కడికి ఎందుకు చేరినట్టు? కలని కట్టుకుని, కలని తిని, తాగి, కలని మాట్లాడి కలని కలదిరుగుతున్నట్టున్న కలవరపాటులో ఏమరుపాటుగా వాళ్ళతోపాటూ నేనూ…

                ‘అతనికోసం’ నిరీక్షణ ! ఎవరతను?

            ఎంతకీ పూర్తికాని కలలో రిపీట్ అయ్యే సన్నివేశాల్లాగా… స్లోమోషన్ అడుగుల్లాగా… రణగొణధ్వని మాటలమధ్య… అసంకల్పితంగా… అతని కోసం ఎదురుచూడటం దేనికీ?

            నిద్రాకాని, మెలకువాకాని, స్వప్నమూకాని, సత్యమూకాని ఊదారంగు, నిరీక్షణ ఫలితం ఏమిటి?

            ‘అతను’ ఇట్నించి వస్తాడో, అట్నుంచి వస్తాడో, అసలు వస్తాడో రాడో, అనుకునే లాంటి ఎదురుచూపు కాదు!

అతను ఒక చోట నుంచి బయలుదేరాడు…

ఈ చోటికి వస్తాడు…

ధూం ధాంగా వస్తాడు! వందిమాగధులతో వస్తాడు!

ఇలా అని కర్ణపిశాచులు ఘోషిస్తున్నాయి…

            నిమిష నిమిషానికీ ‘అతని అడుగుల చప్పుడు’ కర్ణపుటాల్ని మారుమోగిస్తోంది!

ప్లాస్టిక్ గ్లాసుల్లో పంపిణీ చేస్తున్న ఐస్ వాటర్ నిమిషాల్లో ఆవిరైపోతోంది.

            మాటలు… మంద్రంగా… భీకరంగా… మౌనంగా… ఆదుర్దాగా… తడితడిగా… పొడిపొడిగా… విజృంభిస్తున్నాయి.

            తేనెటీగలు ఝుయ్ మన్నట్టు…

            ముసురుకుంటున్న మనుషుల హావభావాలు…

             కలగాపులగమై… బయటపడుతున్న ఊక !

            ఉబుసుపోక ఉబ్బరంగా ఉక్కపెడుతున్న ఊక !

             ఐస్ గడ్డ కరిగిపోకుండా… మాటల ఊక!

            అంతటి రణగొణ ధ్వనిలోనూ ఒక గడ్డకట్టిన శ్మశాన నిశ్శబ్దం దాగుంది. లాంచీ ప్రయాణంలో పొగ గొట్టం ప్రక్కన కూర్చున్నప్పుడు… చెవులు హెూరెత్తుతాయి. ఊక వొదిలే గొట్టాం కర్ణపుటాల్ని నుజ్జుచేస్తుంది. కానీ లాంచో వొడ్డుకు చేరేముందు… అంతదాకా పొగగొట్టపు ధ్వనిలో దాంకున్న నిశ్శబ్దం.. ఒక్కసారిగా వొడ్డుని ఆవరిస్తుంది సరిగ్గా అట్లాంటి నిశ్శబ్దమే అక్కడ చేరిన వందలాదిలో ఆవరించి, పొంచి ఉంది!

ఈ సమూహంలో నేను ఒంటరిని…

ఒక సామూహిక ఎదురుచూపులో నన్నెవరు బంధించారు?

అతనెవరు? నేనెవరు?

ఎప్పుడూ ఎక్కడా ఎలాగా తెలియని ‘అతను’ వస్తుంటే నాకెందుకూ? అతన్ని తెస్తుంటే నాకెందుకూ?

అతని రాక నాకేల?

కర్ణపిశాచి అరుస్తోంది…..

‘అతను’ నదిని దాటాడు!

పొలాలు దాటాడు…

వంతెనలు దాటాడు….

ఘడియో… క్షణమో… ప్రయాణం ముగుస్తుంది!

ఎదురుచూపు ముగుస్తుంది !

ఉన్నట్టుండి… నాలో ఉత్సుకత మొదలయ్యింది.

 నేను ఎదురుచూపులో భాగం అయిపోయాను!

నిమిష నిమిషం కర్ణపిశాచులు అరుస్తున్నాయి…

నాలో ఆత్రం….

ఇక్కడికి అతను రావడానికి ఎంత సమయం పడుతుందీ?

                “ఘడియో…క్షణమో!”

నాలో కంగారు… అతనెలా ఉంటాడూ?

బహుశా ఎత్తరిగా… ఎర్రగా… ఆజానుబాహువా?

లేక నల్లగా… పొట్టిగా… గుమ్మటంలాగానా!

లేక పీలగా… ఎక్కినరంలా…?

ఆలోచిస్తున్నాను.

            జీవితం ఏ లిప్తలోనూ ఎరగని అపరిచితుడి ఆగమనంలో భాగమై… నిరీక్షిస్తున్నాను.

            తేనెటీగల పట్టులా జనం. మాట్లాడుకుంటున్నారు… నవ్వుకుంటున్నారు… కళ్ళు నులుముకుంటున్నారు. కరచాలనాలు… నమస్కారాలు… అర్ధ నమస్కారాలు… రకరకాల ధ్వనులు…లాంచీ పొగగొట్టం దగ్గర కూర్చున్న ఫీలింగ్. కాలం లాంచీ అతని వొడ్డుకు చేరాలి… అప్పుడు… అతన్లో దాంకున్న నిశ్శబ్దం బయటపడాలి.! హఠాత్ నిశ్శబ్దం… హఠాశూన్యం… హఠాత్ వైరాగ్యం… హఠాత్ దుఃఖం… హఠాత్… అంతా హఠాత్ గా మారుతుంది !

కర్ణపిశాచి అరిచింది… అతను వీధి మొగలో ఉన్నాడు…

ఔట్లు పేలాయి… నినాదాలు లేచాయి… జువ్వలు ఎగిరాయి…

అరణ్యాలన్నీ… సముద్రాల్నీ… నదుల్నీ…. పంటపొలాల్ని….  

బంజరు భూముల్నీ…. వంతెనల్నీ…. అవరోధాల్నీ… అధిగమించి

అక్కణ్ణుంచి ఇక్కడికి చేరుకున్న అతను –

నా ఊదారంగు అసంకల్పిత అసంబద్ధ నిరీక్షణ !

అతను… అపరిచిత శవకళ !

జీవితంలో కానీ… కలలోకానీ…

ఎన్నడూ, ఎప్పుడూ, ఎక్కడా, ఎలాగా కనీవినీ ఎరగని

‘అతని’ గురించి మాత్రమే కాదు

‘అతని శవం’ గురించి సైతం

సుదీర్ఘ రోహిణీకార్తె నిరీక్షణ ముగిసింది !

ఎంతకీ పూర్తికాని కల – నిజమైన స్లోమోషన్ ఎఫెక్ట్ రుచి చూపించి మరీ  అతన్ని రప్పించింది!

అతనొచ్చాడు …

ధూంధాంగా… ఠీవిగా.. ఎనిమిది కాళ్ళ రధంపైనెక్కి,

అతనొచ్చేశాడు !

లాంచీ వొడ్డుకు చేరింది… మాటల పొగగొట్టం ఆగింది.

భయంకర నిశ్శబ్దం… శ్మశాన నిశ్శబ్దం…

అతని అపరిచిత శవ స్వరూపం కోసం ఎత్తు అరుగు మీద ఆత్రంగా నిలబడ్డాను…

తాగి పారేసిన డిస్పోజబుల్ గ్లాసుల కుప్పల్లోంచి నిశ్శబ్దంగా చప్పుడు చేస్తూ… అతను… నా ముందునుంచీ రహస్యంగా వెళ్ళిపోయాడు!

              అతన్నీ… అతని శవాన్నీ కనబడకుండా  ‘పేక్’ చేసి పారేసింది ఊదారంగుకల…!

వేలమంది అతన్ని చుట్టుముట్టి పట్టేశారు తేనెటీగల్లా….

అపరిచితంగా అతన్నలా దాచిపెట్టి

నన్ను గెంటేసింది ఊదారంగు కల!

ఎం.ఎస్. సూర్య నారాయణ
ఎం.ఎస్.సూర్య నారాయణగా పేరు గాంచిన శ్రీ పొన్నపల్లి శ్రీరామారావు 19-01-1948 తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ లో జన్మించారు. తన సాహిత్య ప్రయాణంలో అనేక కథలు, కవితలు, దీర్ఘ కవితలు, ఆత్మకథలు రచించిన వీరు 'శబ్దభేది'  కవితా సంకలనాన్ని, 'అనల వీణ'  అను దీర్ఘ కావ్యాన్ని ప్రచురించారు. 'ఊదారంగు మధ్యాహ్నం' అనే కథా సంకలనం వెలువడింది.
అనేకసార్లు ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, భక్తి టి.వి.లలో తన కవితలు, కథలు చదివి వినిపించారు. వీరి రచనలు ఇంగ్లీషు, తమిళ భాషలలో అనువాదమయ్యాయి. మాతా అమృతానందమయి మూడు ప్రఖ్యాత పుస్తకాలను ఇంగ్లీషునుంచి తెలుగుకు అనువదించారు.  'ఆంధ్ర ప్రదేశ్ జిల్లా ఉగాది పురస్కారం', 'సాందీపని గురు పురస్కారం' వంటి పలు స్థానిక పురస్కారాలు పొందిన వీరు ఇప్పటికీ తన సాహితీ సేద్యాన్ని కొనసాగిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *