ముదిమి పిల్లలు 

Spread the love

అక్కడ అంతా అనుభవాలు పండిన అమ్మలు, అయ్యలూ .. వారి కళ్ళలో ఎల్ కేజీ పిల్లల్లాంటి ఉత్సాహం. “ఈ రోజు ఎక్కడికి తీసుకువెళ్తారు? ఏం చూపిస్తారు “. అంటూ సందడి చేస్తున్నారు. 

వీల్ చైర్ మామ్మ గారు అందరికంటే ముందే సిద్దమై కూర్చున్నారు.

ఒకప్పుడు భర్తతో కలిసి దేశమంతా తిరిగిన ఆమె, ఇప్పుడు ఒంటరితనంలో కాలం గడుపుతూ..  యాక్సిడెంట్ తర్వాత డిమెన్షియా మొదలైంది.  ఇంటి నాలుగు గోడలు దాటి బయట ప్రపంచంలోకి వెళ్లడం ఆమెకు ఎప్పడూ ఇష్టమే. ఇలా చిన్న చిన్న సరదాలు సంతోషాలు కూడా కోల్పోయిన దిగులుతో ఉన్న నాలుగు నెల్లల నుంచి  అక్కడికి వస్తున్నది.  అటువంటి ఆమెకు రాజీవ్  ఏర్పాటు చేసిన పిక్నిక్ కొత్త ఊపిరి నిచ్చినట్లు గా ఉంది.  

మొదటిసారి బయటకు తీసుకెళ్లినప్పుడు ఈ మామ్మని వీల్ చైర్ తో మేనేజ్ చేయడం కష్టం కాబట్టి వద్దన్నాడు రాజీవ్.  నన్ను ఎందుకు తీసుకెళ్ళరని పెద్ద యుద్ధమే చేసి గెలిచింది.  నిర్వాహకులు అనుకున్నట్లుగానే బిర్లామందిర్ లో వీల్ చైర్ తో వెళ్లడం చాలా కష్టమైనా నాకు బాగుంది అంటూ ఆమె నవ్వుకుంది.. అయినా ఆ మామ్మగారి ఉత్సాహాన్ని ఎవరు ఆపగలరు?

ఈ రోజు బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యాక ఇప్పటికే రెండు సార్లు టాయిలెట్ కి వెళ్లి వచ్చింది. డైపర్ వేసుకుందో లేదో మళ్ళీ మళ్ళీ చూసుకుంది.  తన వాటర్ బాటిల్, హ్యాండ్ బ్యాగ్ సర్దుకుంటూ ‘నాకు నచ్చినట్టు ఉంటా. మీకిష్టమైతే చూడండి . లేకపోతే పోండి ‘ తనను ఎవరో చూసి నవ్వినట్లనిపించి గొణిగింది.    

మరోసారి ‘నా బాగ్ ఎక్కడ? ఎవరైనా దొంగిలించారా ? అని ఆందోళన పడింది. డిమెన్షియా లక్షణమైన ఆందోళన, పునరావృతి ఆమెలో స్పష్టంగా కనిపిస్తూ…  

రాజీవ్ కి ఆమెను ఎప్పుడు చూసినా తన నాన్నమ్మ గుర్తొస్తుంది. భర్తను కోల్పోయి కొడుకును ఒంటిచేత్తో పెంచిన ఆమె, చివరి రోజుల్లో అల్జీమర్స్ తో ఇంట్లో బందీగా మిగిలిందని అప్పుడు ఎవరికీ తెలియదు. చాలా వింతగా ప్రవర్తించేది.  చివరి రోజుల్లో ఆమె ఎవరో గుర్తులేక, ఎవరినీ గుర్తుపట్టలేక ఇంట్లో వాళ్లందరినీ అనుమానించేది. 

‘ఎవరు నువ్వు ?’  అని అనుమానించేది.  చీరలు దాచుకుని , దొంగలు దొంగలు .. దొంగలు వచ్చేశారు ‘ అని అరిచేది. 

ఆమె వింత ప్రవర్తనను ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదు.  పైగా ఎందుకిలా చేస్తోందని విసుక్కునేవారు.  నాన్నమ్మ మనసు ఆ వ్యాధిలో బందీ అయిందని  గుర్తించే నాటికి ఆలస్యమైంది.  లోకం విడిచి వెళ్లిపోయింది.  నాన్నమ్మను వైద్యులకు చూపినా, లేదా ఆమెకు ఆనందం కలిగించే క్షణాలను ఇవ్వగలిగితే ఇంకొంతకాలం ఉండేదేమో అని గిల్టీగా ఫీలవుతున్నాడు రాజీవ్.  

నాన్నమ్మ మానసిక పరిస్థితి చూసిన తర్వాత తాను క్లినికల్ సైకాలజీలో చేరాడు.  వృద్ధుల జీవన నాణ్యత పెంచడం అతని లక్ష్యంగా పెట్టుకున్నాడు.  ప్రస్తుతం  

క్లినికల్ సైకాలజీ లో మాస్టర్స్ చేస్తున్న రాజీవ్ ఓ రోజు ఆ దారమ్మట వెళ్తూ డిమెన్షియా కేర్ సెంటర్ బోర్డు చూశాడు. వెంటనే నాన్నమ్మ గుర్తొచ్చి లోపలికి వెళ్లి సెంటర్ కార్యక్రమాల గురించి తెలుసుకున్నాడు.  ఆ సెంటర్ కు వచ్చే వాళ్లతో వీలయినప్పుడల్లా గడపాలని నిశ్చయించుకున్నాడు. వారిలో తన నాన్నమ్మను చూసుకుంటూ , వారికి ఆనందం ఇవ్వాలనుకున్నాడు. ఈ పిక్నిక్ ఆలోచన అలా పుట్టిందే.. 

ముదిమి వాకిట ఉన్న వారితో ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ చాలా దగ్గరయ్యాడు. ఎంతో ప్రేమగా ఆప్యాయంగా నోరారా పలకరించే రాజీవ్ ని చూస్తే అక్కడున్న వారందరికీ అభిమానం.   కసురుకోకుండా విసుక్కోకుండా ప్రేమగా పలకరించే రాజీవ్ అంటే వాత్సల్యం, ప్రేమ. 

మరో బాల్యంలోకి అడుగు పెట్టడంతో పాటు, డిమెన్షియా చొరబడి గందరగోళ పరుస్తున్న వాళ్లలో రాజీవ్ ని చూడగానే కొత్త ఉత్సాహం వస్తుంది. తమ ఇంట్లో సభ్యుడిగా భావిస్తారు. అతనేం చెప్పినా చక్కగా స్పందిస్తారు. 

ఎప్పుడూ మాట్లాడకుండా మౌనంగా అందరినీ గమనిస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ, గొణుక్కుంటూ ఉండే సుబ్బారావు మొదటిసారి విహార యాత్రకు ప్లానిటోరియం కి వెళ్ళినప్పుడు చక్కగా మాట్లాడారు. నక్షత్రాల గురించి చాలా కబుర్లు  చెప్పారు. ఆకాశం, నక్షత్రాలతో తన జ్ఞాపకాలన్నీ ఒకొక్కటిగా అతని మదిలో చేరి మాటలు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. అధ్యాపకుడిగా పిల్లలకు పాఠాలు చెప్పిన రోజుల్లోకి వెళ్లిపోయారు. అక్కడ తనతో ఉన్నవారికి పిల్లలకు పాఠం చెప్పినట్లు చెప్పడం  అందరికీ ఆశ్చర్యం. తర్వాత తెలిసింది సుబ్బారావు యూనివర్సిటీ లో జియో ఫిజిక్స్ పాఠాలు చెప్పిన అధ్యాపకుడని. 

అప్పటి నుండి రాజీవ్ సెంటర్ కి వచ్చినప్పుడల్లా ‘ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం’ అని అడిగేవాడు. కానీ ఈ రోజు సుబ్బారావుకి జ్వరం రావడం వల్ల సెంటర్ కి రాలేదు. 

ఎప్పుడూ నున్నటి తలతో నవ్వుతూ కనిపించే ఆండాళ్ళు ఆంటీ ఎప్పుడూ ఆప్యాయంగా పలకరిస్తుంది. రాజీవ్ ని చూడగానే అబ్బాయి బాగున్నావా అని పలకరిస్తుంది.  కానీ ఈ రోజు కొద్దిగా ఉద్రిక్తంగా కనిపిస్తున్నది. ఆ చూపుల్లో తీవ్రత, మాట అస్తవ్యస్థంగా. 

తన వాటర్ బాటిల్ ఎవరైనా తీసుకుంటారేమోనని చీర కుచ్చిళ్ళ మధ్య దాచడానికి యత్నిస్తూ తంటాలు పడుతున్నది.  అప్పుడే వస్తున్న రాజీవ్ అది చూసి నాన్నమ్మను  తలచుకున్నాడు.  నాన్నమ్మ కూడా ఇంతే దిండు కవర్లో పాత చీరలు కుక్కి చంకలో పెట్టుకునేది. తన బట్టల కోసం దొంగలు వస్తున్నారని హడావిడి చేసేది.  తన చీరలు ఎవరో ఎత్తుకుపోయారని కంప్లైంట్ చేసేది అనుకున్నాడు.  

‘వచ్చాడొచ్చాడు .. ‘ ఆనందంతో అరిచింది వీల్ చైర్ బామ్మ. రాజీవ్ ని చూసిన వారందరి మొహాల్లో వెలుగు.  

‘మేం నీకోసం ఎంత ఎదురు చూడాలి? ఇప్పుడా వచ్చేది?’ అధికారయుతంగా ప్రశ్నించింది వీల్ చైర్ బామ్మ. 

‘నాయినా ఇప్పుడా వచ్చేది’ అలక గా  ఆండాళ్ ఆంటీ 

ఏ నిమిషము ఏమి జరుగునో ఎవరూహించెదరు ‘ అంటూ పాట హమ్ చేసారెవరో.. మెత్తగా చేయి నొక్కి వదిలింది మేరీ ఆంటీ. 

రాజీవ్ ని చూడగానే వాళ్ళకి తమ సొంత మనిషిని చూసినంత ఆనందం.  నిజానికి రాజీవ్ తో వారి పరిచయం పెద్దదేం కాదు. మహా అయితే ఐదారు నెలలు అంతే. 

అంతలో కేర్ టేకర్స్  వనజ, స్వప్న మంచి నీళ్లు, బిస్కెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటివన్నీ వాన్ లో సర్దేశారు.

ఒక్కొక్కరిని మినీ బస్ ఎక్కించి కూర్చోపెట్టారు.  ఆండాళ్ళు ఆంటీ నేనిక్కడ కూర్చోను, నన్ను బయటికి తోసేద్దామని ఎత్తులేస్తున్నారా అని అరిచింది. స్వప్న ఆమెను వెనుక సీటులోకి తీసుకెళ్లాక శాంతించింది. 

ఇది నా సీటు. నా పక్కన ఎందుకుర్చున్నావని పెద్ద పెద్ద రంకెలు వేశాడు మారుతీరావు అంకుల్ 

కిటికీ పక్కన కూర్చుని వేళ్ళతో ఏవో లెక్కలు వేసుకుంటూ ‘ఎలాగైనా ఈ అప్పులన్నీ తొందరగా తీరిపోయే మార్గం చెప్పండి.. నా నెత్తి మీద లక్షల కోట్ల అప్పు బరువు దించండి ‘, ప్లీజ్ ‘ప్రాధేయపడుతూ శంకర్ నాయక్ తాతయ్య . 

‘ఆవిడ నా బాటిల్ దొంగిలించాలని ఇందాకటి నుంచి చూస్తోంది. అయ్యో.. నేనెలా కాపాడుకోవాలి? 

మనసులో ద్రోహ చింతన పెట్టుకుని ప్రేమ నటిస్తూ.. హూ .. మీకు ప్రత్యేక ధన్యవాదాలు ..” చేతులు రెండూ జోడించి అరిచింది ఆండాళ్ళు ఆంటీ.  ఆమె వాటర్ బాటిల్ ఒకటి ఎప్పుడో ఎక్కడో పోయింది. అప్పటి నుంచి ఇంతే. తన బాటిల్ కోసం దొంగలు వస్తున్నారు అనుకుంటుంది. 

చివరగా ఎక్కిన పెద్ద కళ్ల సరస్వతమ్మ ‘బాబ్బాబు నన్ను తాజ్ మహల్ కి తీసికెళ్ళవా ‘  అని రాజీవ్ చేయి పట్టుకుని బతిమాలుతోంది. 

వెంకటేశం తాతయ్యకి మతిమరుపు వచ్చిందని ప్రతిదీ చిన్న నోట్ బుక్ లో రాసుకోవడం అలవాటు చేశారు ఇంట్లో వాళ్ళు.  ఆ బుక్ లో ఇంట్లో వాళ్ళ పేర్లు , ఫోన్ నంబర్లు , కేర్ సెంటర్ నంబర్ అన్నీ రాసి ఉంటాయి. తాను ఎక్కడికి వెళ్ళింది అడిగి తెల్సుకుని ఆ బుల్లి నోట్ బుక్ లో రాసుకుంటాడు. ఇప్పుడు కూడా తనతో నోట్ బుక్ పెన్ తెచ్చుకున్నాడు.  

అప్పుడు సమయం ఉదయం పదకొండు అయిందేమో .. మినీ బస్ కదిలింది  

‘రింజిమ్ రింజిమ్ హైదరాబాద్ .. బస్సు  వాలా జిందాబాద్ ” పాట అందుకున్నారోకరు. కోరస్ కలిపారు కొందరు. వాళ్ళను చూస్తుంటే విహారయాత్రలకు వెళ్లే పిల్లల సంబరం  కనిపిస్తున్నది.  

‘ఆపండి మీ గోల’ విసుక్కుంది అండాళ్ ఆంటీ.  

‘పాపం నీళ్లలో ఎంతసేపు ఉంటావు, వచ్చెయ్. నాతో వచ్చెయ్. మజా చేద్దాం ‘ అంటూ హుస్సేన్ సాగర్ లో నిలబడ్డ తధాగతుడిని చూస్తూ అల్లరి మొదలు పెట్టిన 

వీల్ చైర్ బామ్మ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తూ ‘ నాయనా నేనిక్కడే ఉంటా. నాకిక్కడ చాలా బాగుంది.’ అన్నది. 

నీళ్లంటే నాకు భయం అని కళ్లు మూసుకున్న ఆండాళ్ ఆంటీ ని ఉడికిస్తూ.. ‘బస్సు ఆపండి..  ఆపండి..  నేనిక్కడ ఈత కొట్టాలి’ అని అరిచింది. 

ఆ రోజు  ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్, అమరవీరుల స్థూపం చూస్తూ ట్యాంక్ బండ్ మీదుగా  ఇందిరాపార్కు కి చేరారు. 

ఇందిరా పార్క్ లో ఓ చెట్టుకింద కూర్చుని  అంత్యాక్షరి ఆడారు.  అంత్యాక్షరి చాలా ఎంజాయ్ చేసారు. చాలా ఉత్సాహంగా పాటలు పాడారు. పాట మధ్యలో నుంచి పాడితే ఒప్పుకోలేదు.  ఆ తర్వాత కొద్ది సేపు వైకుంఠపాళి ఆడారు.  పాము నోటిలో పడటం సరస్వతి మామ్మకి అస్సలు నచ్చలేదు. ఆట ఆపేసి ఏటో చూస్తూ కూర్చుంది.  ఆ తర్వాత మిగతావాళ్ళు కూడా పాము కోరలకు చిక్కి పక్కకు జరిగిపోయారు. 

ఎవరినీ పట్టించుకోకుండా చెట్లపై చేరిన పక్షుల ముచ్చట్లు వింటూ అప్పుడప్పుడు తానూ గొంతు కలుపుతూ కాసేపు ఆనందించింది వీల్ చైర్  బామ్మ.  

‘అయ్యో .. నా వాటర్ బాటిల్.. నా వాటర్ బాటిల్ .. ‘ ఆయాసపడుతూ కంగారుగా అందరినీ అడుగుతున్నది ఆండాళ్ ఆంటీ . 

‘ఆంటీ .. ఇదిగో మీ వాటర్ బాటిల్ అంటూ ఆమె పక్కన ఉన్న బాటిల్ అందించాడు రాజీవ్.  ‘మా నాయినే.. మా నాయినే .. నువ్వెంత మంచోడివి. నా బాటిల్ ని దొంగల దగ్గరనుంచి రక్షించావ్ ..’ అంటూ సంతోషంగా రాజీవ్ ని చూస్తూ మెటికలు విరిచింది. 

తన హ్యాండ్ బ్యాగ్ నుంచి తెల్ల కాగితాలు, పుస్తకం తీసి ఏదో బొమ్మ గీస్తున్నది సరస్వతి ఆంటీ.  హుస్సేన్ సాగర్ నీటి మధ్యలో ఉన్న బుద్ధుడు, ఆ వెనుక దూరంగా కనిపించే జాతీయపతాక, నీళ్లపై తేలియాడే బుల్లి పడవ వేస్తున్నది.  

అది చూసిన రాజీవ్ ‘అబ్బ ! ఎంత బాగా వేస్తున్నారో .. ‘ అని మెచ్చుకుంటూ ఉంటే ఆవిడ కొద్దిగా సిగ్గుపడుతూ ‘ఇది నీకోసమే అబ్బాయ్…  నీకు నా గిఫ్ట్’ అన్నది.  

గతంలో బొమ్మలు గీసే ఆమెను తిట్టేవారు. కానీ రాజీవ్  మెచ్చుకోలు ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 

అంతలో ‘మరి నాకివ్వవా ? ‘కినుకగా వీల్ చైర్ బామ్మ. 

‘ఎందుకివ్వనూ.. నీకూ ఇస్తాలే ..నా దగ్గర చాలా ఉన్నాయి ‘ చేతులు చకచకా కదిలించడానికి యత్నిస్తూ బొమ్మవేస్తూన్న సరస్వతమ్మ ఆంటీ.  

హుస్సేన్ సాగర్ దృశ్యాన్ని తదేకంగా చూస్తున్న వీల్ చైర్ బామ్మ మదిలో  తన పెళ్లయిన కొత్తలో చూసిన దృశ్యాలు  మెదిలాయి. భర్తతో కలిసి చేసిన పర్యటనలు, ప్రయాణాలు, పడవలో భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్లిన జ్ఞాపకాలు ఒకదాని వెంట ఒకటి ముసురుకుని తనలో తానే చిన్నగా నవ్వుకుంది వీల్ చైర్ బామ్మ. 

‘బుద్ది లేదూ.. ఆ బుద్ధుడిని తప్ప మమ్మల్ని ఫోటో తీసే పనిలేదా .. తియ్యి అన్నది.’ ఆజ్ఞాపిస్తున్నట్లుగా వీల్ చైర్ బామ్మ. 

సరస్వతమ్మ వేస్తున్న బొమ్మనీ, ఆ పక్కనే తదేకంగా తథాగతుడిని చూస్తున్న వీల్ చైర్ బామ్మ ఫోటో చూపించాడతను.  ఏంటయ్యా.. బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? 

మాకు చెప్పకుండా, అనుమతి లేకుండా ఫోటో ఎలా తీసావ్? గద్దించింది. 

బిక్కమొహం వేసిన అతన్ని చూసి నవ్వుతూ ..’ఏదో సరదాగా అన్నాను. బిగుసుకోకు. ఇంట్లో ఒక్క దాన్ని, కాలం చేసిన మాయలో ఇది పెద్ద కుటుంబం. అందుకే నాకు ఇష్టం. రేపటి వరకు ఈ జ్ఞాపకాల వెంటే తిరుగుతూ ఉంటా ‘ నవ్వుతూ అన్నదామె. అయితే ఆ జ్ఞాపకాలు వెతికి పట్టుకోవడం ఆమెకు అంత సులభమైన పని కాకపోవచ్చు. 

ఆహా.. ఈ గాలి సుగంధం, ఆ పక్షుల శబ్దాలు , ఆకురాలే శబ్దం విని ఎంత కాలమైందో .. అనుకుంటూ అటు ఇటు తిరిగి అలసి పోయిన వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళకి బిస్కెట్స్ , నీళ్లు ఇచ్చారు వనజ, స్వప్న.  

సిమెంట్ బల్లపై కూర్చుని తింటూ  ‘మొగలి పూల వాసన భలే ఉంది కదా ..’ అన్నది ఆండాళ్ ఆంటీ. ఆమెకు వాసన తెలియడం మానేసి చాలా కాలమైంది.  మొగలి పూల వాసన భలే గుర్తించిందని ఆశ్చర్యపోయింది వనజ. 

స్వప్న తన మొబైల్ లో మ్యూజిక్ పెట్టింది. దానికి అనుగుణంగా ఎవరికి  తోచిన విధంగా వారు డాన్స్ చేస్తున్నారు.  కొందరు తోచిన ఎక్సర్సైజ్ చేస్తున్నారు.  వాళ్లందరిలోకి బాల్యం తిరిగి ప్రవేశించినట్లుగా ఉన్నారు. 

‘ఆండాళ్ ఆంటీ ఎపిసోడ్ లో ఉంది. అస్థిరంగా అటూ ఇటూ నడుస్తూ ఉంది. ఒక్కోసారి ఎవరో తరిమినట్లే నడుస్తున్నది. ఎక్కడ పడిపోతుందో అన్నట్లుగా ఉంటుంది. కానీ వాసన బాగానే పసిగట్టింది. అది ఆమెలో గొప్ప మార్పు ‘ అన్నది వనజ తోటి కేర్ టేకర్ స్వప్నతో. 

‘పచ్చని ప్రకృతి, రంగులు, వాసనలు మనిషిలోకి ప్రవహించి ఉత్తేజాన్నిస్తాయేమో ! అన్నదామెనే మళ్ళీ.   

సూర్యుని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ, పూల అందాలు మనసులో ముద్రించుకుంటూ అటూఇటూ తిరుగుతున్నారు కొందరు. 

‘రకరకాల కుటుంబ నేపథ్యం నుంచి, సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వారంతా తిరిగి బాల్యం ఒడిలోకి చేరినట్టు ఉత్సాహంగా ఉన్నారు..  ప్రకృతి వారి మనసులను సున్నితంగా తడమ గల పుష్పంలా ఉంది’ అన్నది కేర్ టేకర్ వనజ. 

వనజ మాటలు వింటూ అందరినీ లెక్కిస్తున్న స్వప్న ‘ నోటు బుక్ తాతయ్య  ఏరీ ..  కనిపించట్లేదు’ అన్నది. 

ఆ మాటలు విన్నాడు రాజీవ్.  ‘ఆందోళన పడకండి. ఎవరినీ గందరగోళ పరచకండి. ఇక్కడే ఎక్కడో ఉంటారు. మీరు వీళ్లందరినీ జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. నేను వెతికి తీసుకొస్తా .. ‘ అని రాజీవ్ వెతకడం మొదలు పెట్టాడు. 

అవతల ఎక్కడో ఉన్న మరో సమూహం దగ్గరకు వెళ్లి తెలిసిన వాళ్ళెవరూ కనిపించక ఆదుర్దాగా తిరిగిన చోటే తిరుగుతున్న నోట్ బుక్ తాతయ్యను  దూరం నుంచి గమనించి అక్కడికి వెళ్ళాడు రాజీవ్.  

రాజీవ్ ను చూస్తూనే ముఖం చాటంత చేసుకుని గబగబా వచ్చి అతన్ని పట్టుకుని ‘ఏంటి నేను తప్పిపోయానని అనుకున్నావా? ఎమ్ లేదు.. నేనే  వీళ్లందరినీ చూద్దామని వచ్చా..  నేనే వచ్చా .. ‘ లోపలి కలవరం తగ్గిందేమో హాయిగా నవ్వేశాడు.  ఆ నవ్వులో జతకలిపాడు రాజీవ్. 

ప్రశ్నగా మిగిలిన జీవితపు పయనం వారిది. రకరకాల  డిమెన్షియా తో జీవిస్తున్నారు.  వీళ్ళతో ప్రయాణం ఇంట్లో వాళ్ళకి కత్తిమీద సాములా ఉంటుంది. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొంటూనే…  

ఆనందాల కొత్తలోకం చిగురించినా చిగురించకున్నా.. వారిని ఒంటరిగా వదిలేయడం కాదు చేయాల్సింది.  సమాజంలో భాగం అయ్యే అవకాశం ఇవ్వాలి. నాణ్యమైన జీవితాన్ని ఇవ్వగలగాలి అనే సంకల్పంతో  అప్పుడప్పుడు బయటకు తీసుకు పోయే సాహసం చేస్తున్నారు కేర్ సెంటర్ లోని సామాజిక కార్యకర్తలు, వాలంటీర్లు, కేర్ గివర్స్. 

‘ఇవాళ సుబ్బారావు గారు రాలేదు కానీ వచ్చి ఉంటే చాలా ఆనందించేవారు.’ ఓరకంట  వీల్ చైర్ మామ్మ చేస్తున్న అల్లరి పనులు గమనిస్తూ  అన్నది వనజ 

‘అవును, నిజమే. పిక్నిక్ వెళ్లడం మొదలు పెట్టాక ఆయనలో చాలా మార్పు కనిపిస్తున్నది. తనలో తానే ఉండే ఆయన నలుగురిలో కలుస్తున్నారు. ఆండాళ్ ఆంటీని చూసిన తర్వాత అర్థమైంది. మనం తీసుకొచ్చింది కొన్ని గంటలే కావచ్చు కానీ  రుచి వాసన, ప్రకృతి దృశ్యాలు, రకరకాల శబ్దాలు వారి ఇంద్రియాలను ప్రేరేపిస్తాయని తెలిసింది’ అన్నది స్వప్న. 

‘ఆరుబయట సమయం గడపడం వల్ల ఒంటరితనం తగ్గుతుంది, నిద్ర మెరుగవుతుంది.  తమ చుట్టూ ఏమి జరుగుతున్నదో తెలుసుకోవడానికి వీలవుతుంది.  బయటకు వెళ్లడం వలన ఆ వ్యక్తుల జీవన నాణ్యత మెరుగవుతుంది.  ఇంట్లో బందీలుగా ఉంచడం కంటే ఇలా అప్పుడప్పుడు ఆనందం ఇవ్వడం ఎంతో గొప్పది కదా!

రోజువారీ దినచర్య భిన్నంగా ఉండటంతో ఆండాళ్ ఆంటీ తప్ప దాదాపు అందరూ సంతోషంగా చురుగ్గా ఉన్నారన్నది వనజ. 

‘అబ్బ నాకెంత హాయిగా ఉందో.. కార్డ్స్ చూద్దాం , అది చెప్పు ఇది చెప్పు బళ్ళో టీచర్ లాగా ఎవరూ అడగట్లేదు. ‘  వనజ స్వప్న ల మాటలు విన్న మేరీ మామ్మ 

‘అవును, ఇంట్లో వాళ్ళు ఇంటికి వచ్చినవాళ్లు అంతా క్రాస్ వర్డ్ పజిల్స్ చెయ్యమని చెప్పేవాళ్లే. మీ విల్ పవర్ పెంచుకునే ప్రయత్నం చెయ్యి అంటూ ఏదో ఒకటి చెప్పి ఒత్తిడి పెంచే వాళ్లే. ఆ చెట్టు మీద పిట్టలు ఏవీ మనని అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పవు’ తడబడుతున్న మాటలు కూడదీసుకుని అన్నది ఆండాళ్ ఆంటీ. 

ఆ మాటలు వింటున్న రాజీవ్ మనసులో తృప్తిగా ఉంది. తాను అనుకున్న లక్ష్యం అదే. 

ఆరుబయట వాతావరణం అందించడానికి గొప్ప మార్గం పిక్నిక్.  చిత్తవైకల్యం కలిగిన వాళ్ళు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి పోవడానికి పిక్ నిక్ లు దోహదం చేస్తాయి. 

బహిరంగ వాతావరణం, సున్నితమైన వ్యాయామం, ప్రకృతి , స్వచ్ఛమైన గాలి ఎప్పటికప్పుడు మారుతున్న దృశ్యాలు ఇంద్రియ ప్రేరణ కలిగిస్తాయి. మంచి విశ్రాంతి నిస్తాయి. ప్రశాంతతను కలిగిస్తాయి.  

రాలిన ఆకులు , పక్షుల కిలకిలారావాలు , ప్రకాశవంతమైన పూల రంగులు , ఉత్తేజపరుస్తాయి 

చిత్తవైకల్యం కలిగిన వ్యక్తులు తమ కుటుంబీకులు, సంరక్షకులు, సన్నిహితుల సహవాసాన్ని ఆస్వాదిస్తారు కానీ వారికేమో సమయం ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికీ ఆ విషయం గుర్తించరు.   

వసంత ఋతువులోని దృశ్యాలు , శబ్దాలు ఆస్వాదిస్తూ .. పిక్ నిక్ లు చాలా రోజులు ఆనందాన్ని , అనుబంధాన్ని మిగులుస్తాయి . 

ఆరు బయటకు వెళ్లడం వల్ల ఆందోళన, ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి . మానసిక స్థితి మెరుగవుతుంది . ఉత్సాహం పెరుగుతుంది.  వీళ్లను చూస్తే పిల్లల మనసు పెద్దల శరీరంలో దాగి ఉన్నట్లు అనిపిస్తుందనుకున్నాడు రాజీవ్. 

అల్జీమర్స్ డిమెన్షియా  ఉన్న వారి జీవన నాణ్యత పెంచడం గురించి ఆలోచిస్తున్న రాజీవ్ చేతిలో తాను గీసిన చిత్రం పెట్టింది సరస్వతమ్మ. అది చూస్తూ మురుస్తున్న రాజీవ్ కి అకస్మాత్తుగా ముద్దిచ్చింది వీల్ చైర్ బామ్మ. 

గంట మోగించింది వనజ.  ముదిమి పిల్లలంతా బస్సు ఎక్కారు.  నోట్ బుక్ తాతయ్య చేతిలో బుల్లి పుస్తకం కిందపడిపోయింది.  దాంట్లో ‘ రాజీవ్ నా మనవడు ‘ అని రాసి ఉంది. అది చూసిన రాజీవ్ స్థాణువై అలా చూస్తుండిపోయాడు. 

నాన్నమ్మను ఒక్కసారైనా ఇలా బయటకు తీసుకెళ్లి ఉంటే.. ఆమె నవ్వు చిరస్థాయిగా మదిలో భద్రంగా ఉండేది. ఆమెకు ఇలాంటి ఆనందం ఇవ్వలేకపోయానని అతని మనసులో బాధ ,కళ్ళలో తడి. 

అది చూసిన వీల్ చైర్ బామ్మ అతని చేయి పట్టుకుని ‘నీవు నాకు తిరిగి దొరికావు కదా ‘అనగానే, ఆమె లో కోల్పోయిన నాన్నమ్మ కనిపించి రాజీవ్ గుండెలో ఒక తృప్తి . 

వి. శాంతి ప్రబోధ 

వి. శాంతి ప్రబోధ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *