అధ్యాయం -1
కారాగారంలో మస్లోవా
ఈ చిన్నిభూమిని ఛిద్రం చేయడానికి కిక్కిరిసినట్టున్న వందలవేలమంది మనుషులు, ఎవరికెన్ని విధాలుగా సాధ్యమౌతుందో అన్ని ప్రయత్నాలూ చేసారు. నేలంతా రాళ్ళు పరిచారు. పచ్చదనమంతా పెరికేసారు. అడవులన్నీ నరికేసారు. ఆకాశమంతా పెట్రోల్, బొగ్గు పొగలతో నింపేసారు. పక్షుల్నీ, జంతువుల్నీ పారదోలారు.
అయినా వసంతం చిగురిస్తూనే ఉంది, ఆ నగరంలో కూడా!
సూర్యుడు వెచ్చగా వెలుగుతున్నాడు. గాలి మృదువుగా వీస్తోంది. ఎక్కడైతే మట్టిని తవ్వలేదో అక్కడంతా పచ్చనిపచ్చిక మళ్ళీ మొలుస్తూ పరిచిన రాళ్ళమధ్య నుండి పైపైకి లేస్తోంది. నగరంలోని రహదారుల పక్కనుండే సన్నటి కాలిబాటల మీద కూడా అదే పరిస్థితి.
బిర్చ్, పాప్లర్, వైల్డ్ చెర్రీ చెట్లు- వాటి జిగురుటాకులను విప్పుకుంటూ పరిమళాలు వెదజల్లుతున్నాయి. లిండెన్ చెట్లు మొగ్గలను విప్పుతూ విస్తరిస్తున్నాయి. కాకులు, పిచ్చుకలు, పావురాళ్ళు అన్నీ వసంతహేలలో ఓలలాడుతూ తమతమ గూళ్ళు సిద్ధం చేసుకోవడంలో తలమునకలై ఉన్నాయి. సూర్యకాంతికి ఈగలు రొదపెడుతూ గోడల మీద తారాడుతున్నాయి.
చెట్లూ పక్షులూ పురుగులూ పిల్లలూ సమస్త జీవులూ సంతోషంగా ఉన్నాయి. కానీ, ఒక్క జ్ఞానమున్న మనిషి మాత్రం, ఆడా మగా తేడా లేకుండా, తమని తాము మోసం చేసుకుంటూ, ఒకర్నొకరు మోసం చేసుకుంటూ వున్నారు. తాము బాధపడుతూ ఇతరుల్ని బాధపెడుతూ బతుకుతున్నారు.
సమస్తజీవరాశి సంతోషం కోసం, హృదయాలను శాంతి సఖ్యత ప్రేమలతో నింపడం కోసం, భగవంతుడు ప్రసాదించిన ఈ అపూర్వ సౌందర్యవసంతోదయాన్ని ఒక్క మనుషులు మాత్రమే పవిత్రమైనదిగా భావించలేదు, గౌరవించదగినదిగా గుర్తించలేదు. కేవలం ఒకర్నొకరు అణగదొక్కే కుట్రలపైనే వాళ్ళు దృష్టి కేంద్రీకరించారు.
అందుచేత- ఆ ప్రభుత్వపట్టణంలోని ఆ జైలు ఆఫీసులో కూడా ఈ వసంత ఋతువును కొందరు మనుషులూ, అన్ని జంతువులూ అందంగా ఆహ్వానించారన్న నిజాన్ని ఎవరూ పవిత్రమైనదిగా పరిగణించలేదు. ప్రాముఖ్యమైనదిగా పట్టించుకోలేదు.
దానికి బదులుగా కిందటిరోజే ఒక ప్రత్యేక నంబరుతో, అధికారిక ముద్రతో వచ్చిన ఆ నోటీసును మాత్రం అత్యంత ముఖ్యమైనదిగా గుర్తించారు. ఆ నోటీసు ప్రకారం, ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆ జైల్లో ఉన్న ముగ్గురు ఖైదీలను (ఒక పురుషుడు, ఇద్దరు స్త్రీలు- అందులో ప్రధాన నేరస్తురాలిని ప్రత్యేకంగా తరలించి) కోర్టులో హాజరుపరచాలని ఆర్డర్ వేయబడింది.
అందుకే ఈరోజు ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 8 గంటలకు, జైలు కారిడార్‌లోకి ముందుగా ఒక జైలర్ ప్రవేశించాడు. అతని వెనకే నెరిసిన రింగుల జుట్టూ, గోల్డ్ స్లీవ్స్ జాకెట్టూ, బ్ల్యూ బోర్డర్ బెల్టూ ధరించి, బాధతో బరువెక్కినట్టున్న మొహంతో ఒక లేడీ గార్డు ఆ కారిడార్లోకి ఎంటరయ్యింది.
‘మస్లోవానే కదా?’ ఒక సెల్ దగ్గరికి వచ్చాక డ్యూటీలో ఉన్న ఆ జైలర్‌ని అడిగిందామె.
అవును అన్నట్టుగా తలూపి, ఇనుప తాళాన్ని కటకటలాడిస్తూ ఊపి, కారిడార్ కంటే ఎక్కువ దుర్వాసన వెదజల్లుతున్న సెల్ తలుపును తెరిచాడు జైలర్.
‘మస్లోవా! కోర్టుకెళ్లాలి, త్వరగా రా’ అని గట్టిగా అరిచి, మళ్ళీ తలుపు మూసేసాడు.
పచ్చని పంటపొలాల మీదనుంచి వీచే గాలులు హాయిగొలిపే తాజాగాలిని జైల్లోకి మోసుకొస్తున్నా, కారిడార్‌లో ఉన్న గాలి మాత్రం టైఫాయిడ్ క్రిములతో, మురుగునీటి దుర్వాసనతో, కుళ్ళిన పదార్థాల కంపుతో, తారు వాసనతో నిండిపోయి కొత్తగా అక్కడికి వచ్చేవాళ్ళకి వికారం కలిగించేలా వుంది. అలాంటి వాతావరణం ఆ లేడీ గార్డుకి అలవాటే అయినప్పటికీ ఆమె ఈ దుర్వాసనని గమనించకుండా ఉండలేనంత గాఢంగా వుంది. ఆమె అప్పుడే బయటినుంచి జైల్లోపలికి రావడం వల్ల కారిడార్‌లో అడుగుపెట్టగానే నిద్ర ఆవహిస్తున్నట్టుగా అనిపించింది. సెల్ లోపలి నుండి ఆడఖైదీల అరుపులు, వాళ్ళ హడావుడి, ఫ్లోర్ మీద అటూఇటూ తిరుగుతున్నట్టు అడుగుల సవ్వడి వినిపిస్తున్నాయి.
‘ఇదుగో, మస్లోవా! తొందరగా రా… నీకే చెప్పేది!’ జైలర్ మళ్ళీ గట్టిగా అరిచాడు.
కొద్ది క్షణాల్లోనే పొట్టిగానూ గట్టిగానూ ఉన్న ఒక యువతి గబగబా సెల్ లోంచి బయటకి అడుగుపెట్టి నిటారుగా నడుస్తూ జైలర్ దగ్గరికి వచ్చింది. పొడవైన తెల్ల స్కర్టూ జాకెట్ట్టు ధరించి దానిమీద బూడిదరంగు ఓవర్ కోటూ వేసుకుందామె. మోకాళ్ళ పొడవుండే స్వచ్ఛమైన నూలు సాక్సులు, జైలు బూట్లు వేసుకునుంది. తలచుట్టూ తెల్లటి కర్చీఫ్ గట్టిగా భిగించి కట్టుకుంది. ఆమె నల్లనిజుట్టులోని కొన్ని ముంగురులు కర్చీఫ్ కింద నుంచి నుదుటిమీద నర్తించేట్టు ఆకర్షణీయంగా సర్దుకుంది.
వెలుతురు తక్కువుండే జైలు గదిలో సుదీర్ఘజీవితం గడిపిన ఖైదీల మొహాల్లో కనిపించే ఒకానొక నిస్తేజమైన తెల్లదనం ఆమె మొహంలో కూడా వుంది. అది- వెలుతురు పడని సెల్లార్‍లో మొలిచే బంగాళాదుంప మొలకల నిస్సార తెలుపుని గుర్తుకుతెచ్చేలా వుంది. ఓవర్ కోటు మీద నుంచి కనిపిస్తున్న విశాలమైన మెడ, వెడల్పాటి పొట్టి చేతులు కూడా అదే పాలిపోయిన తెలుపురంగులో ఉన్నాయి. దానికి పూర్తి విరుద్ధంగా నిగనిగలాడే ఆమె నల్లనికళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. వాటిల్లో ఒకదానికి కొంచం ‘మెల్ల’ ఉన్నట్టు తేడాగా కనిపించింది.
వాళ్ళకి దగ్గరగా వచ్చి, తల కొంచెం వెనక్కి వంచి, విశాలమైన ఛాతీని విరుచుకుని, నిటారుగా నిలబడింది మస్లోవా. ఏ ఆదేశాన్నైనా ఆమోదించటానికి సిద్ధమే అన్నట్టుగా జైలర్ కళ్ళల్లోకి సూటిగా చూసింది.
జైలర్ తలుపు మూసేయబోతుండగా ముడుతలు పడిన మొహంతో ఉన్న ఒక ముసలావిడ, నెరిసిన తలని తలుపులోంచి బయటకు పెట్టి మస్లోవాతో మాట్లాడటం మొదలుపెట్టింది. తలుపుతో సహా ఆ ముసలావిడ తలని వెనక్కినెడుతూ బలంగా మూసేసాడు జైలర్. ఆ సెల్ లోంచి ఇంకో స్త్రీ నవ్వు వినిపించింది. తలుపుకున్న చిన్నకన్నం లాంటి గ్రిల్ వైపు తిరిగి సన్నగా నవ్వింది మస్లోవా. తలుపుకి అటువైపున్న గ్రిల్‍కి తన మొహాన్ని అదిమిపెట్టి కరుకు స్వరంతో గట్టిగా అంది ముసలావిడ:
‘చూడూ, విచారణ పేరుతో వాళ్ళు నిన్ను రకరకాల ప్రశ్నలు అడుగుతారు. నువ్వు చెప్పిందే మళ్ళీమళ్ళీ చెప్పు. దానికే కట్టుబడి ఉండు, అనవసరమైన మాటలేవీ జారకు.’
‘సరేలే, ఇంతకంటే దరిద్రంగా ఇంకేం జరుగుతుంది. ఏదోవిధంగా ఆటోయిటో తేలిపోతేనే బాగుంటుందనిపిస్తుంది నాకు.’ అంది మస్లోవా.
‘అవును, ఏదోరకంగా ఏదోటి తేలిపోతుందిలే.’ అధికారిక దర్పంతో చమత్కరించి ‘పద, ముందుకు నడువ్!’ అని గద్దించాడు జైలర్.
ముసలావిడ కళ్ళు గ్రిల్ లోంచి మాయమైపోయాయి. మస్లోవా కారిడార్ మధ్యలోకి అడుగేసింది. లేడీ గార్డ్ ముందు నడుస్తుండగా, ముగ్గురూ రాతిమెట్లు దిగి కిందికి వచ్చారు. మరింత దారుణంగా కంపుకొట్టే మగఖైదీల వార్డు పక్కనించి నడుస్తుంటే, అందరూ గ్రిల్సుల్లోంచి కళ్ళు బయటపెట్టి ఆమెనే చూస్తున్నారు. గబగబా ఆ వార్డు దాటేసి ఆఫీస్‍కి చేరుకున్నారు. అక్కడ, మస్లోవాను తీసుకెళ్ళటానికి ఇద్దరు సైనికులు సిద్ధంగా ఉన్నారు.
టేబుల్ వెనక సీట్లో కూర్చున్న క్లర్క్, పొగాకు వాసన కొడుతున్న పేపరొకటి ఒక సైనికుడికి ఇచ్చి, మస్లోవాను చూపించి, ‘తీసుకుపోండి’ అన్నాడు.
స్పోటకపు మచ్చలతో, గుంటలు పడిన ఎర్రటి ముఖంతో ఉన్న ఆ సైనికుడు ‘నీజ్నీ నోవ్‌గొరోడ్’ ప్రాంతపు రైతు. అతను పేపర్ని కోటుజేబులో పెట్టుకుని, ఆజానుబాహుడైన తన సహసైనికుడు ‘చువాష్’ వైపు చూస్తూ కన్నుగీటాడు. తర్వాత ఇద్దరు సైనికులు లేడీగార్డు కలిసి మస్లోవాను తీసుకుని జైలు ఎంట్రెన్స్ వైపు నడిచి, ప్రహారి దాటి బయటకు వచ్చారు. అక్కడినుంచి అస్తవ్యస్థంగా ఉన్న కచ్చారోడ్డు మీదుగా నగరం వైపు నడవడం మొదలుపెట్టారు.
ఇస్వోస్త్చిక్‌లు (గుర్రపుబగ్గీ డ్రైవర్లు), వ్యాపారులు, వంటవాళ్ళు, పనిమనుషులు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అదాటున ఆగి ఆడఖైదీ బట్టల్లో ఉన్న మస్లోవాని వింతగా చూస్తున్నారు. కొంతమంది తలాడిస్తూ, ‘మాలాగా నీతిగా బతకాలి. ఎలాంటి చెడ్డపని చేసినా చివరికి ఇలాంటి గతే పడుతుంది,’ అనుకున్నారు. చిన్నపిల్లలు ఆమెను దొంగను చూసినట్టు చూస్తూ భయం భయంగా నిలబడ్డారు. ఆమె ఎవరికి హాని చేయకుండా పక్కనున్న సైనికులు ఆపుతారన్న ఆలోచన వాళ్ళకి కొంత ఊరటనిచ్చింది. బొగ్గు అమ్మడానికి నగరానికి వచ్చిన ఒక పల్లెటూరి రైతు, టీ తాగి తిరిగి ఇంటికి వెళ్తూ ఆమెని చూసి జాలిపడి ఒక నయాపైసా నాణెం ఆమె చేతిలో పెట్టాడు. ఆమె సిగ్గుపడి ఏదో గొణుక్కుంది.
అందరి దృష్టి తన మీదే ఉండటం గమనించిన మస్లోవాకి కొంచెం ఆనందం కలిగింది. జైల్లో ఉండే వెగటు వాసనకు బదులు, బయట పీలుస్తున్న స్వచ్చమైన తాజాగాలి ఆమెకు మరింత ఆహ్లాదం కలిగించింది. కాని కాళ్ళకు తొడుక్కున్న నాసిరకం జైలుబూట్లతో రాళ్ళురప్పలున్న ఆ రోడ్డు మీద నడవడం ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది.
మస్లోవా ఒక జొన్నదుకాణం పక్కగా నడుస్తుండగా దాని ముందు దర్జాగా, నిర్భయంగా, స్వేచ్ఛగా తిరుగుతూ కువకువలాడుతున్న ఒక పావురాల గుంపుని చూసింది. తనకి అందుబాటులో ఉన్న ఒక నీలిబూడిద రంగు పావురాన్ని కాలితో నెమ్మదిగా తాటించబోతుండగా అది టపటపమని ఎగురుతూ, తన రెక్కలతో ఆమెకు వింజామర విసురుతున్నట్టుగా అక్కడక్కడే తిరుగాడింది.
ఆ పావురాన్ని చూసి చిన్నగా నవ్వింది మస్లోవా. వెంటనే తన ప్రస్తుత పరిస్థితి గుర్తుచేసుకుని బలంగా గుండెలనిండా ఊపిరి పీల్చుకుని ముందుకు కదిలింది.
అధ్యాయం -2
మస్లోవా బాల్యం
ఖైదీ మస్లోవా జీవితకథ మామూలు కథే.
మస్లోవా తల్లి ఒక గ్రామీణ మహిళ కూతురు. పెళ్ళికి ముందు ఆమె ఓ డెయిరీఫామ్‍లో పనిచేసేది. ఆ డెయిరీఫామ్ ఓనర్లు ఇద్దరు స్వయానా అక్కాచెల్లెళ్ళు. దొరసానులిద్దరూ వయసుమళ్ళిన పెళ్లికాని స్త్రీలే.
మస్లోవా తల్లి ప్రతి సంవత్సరం ఒక బిడ్డకు జన్మనిచ్చేది. గ్రామీణ యువతులకు ఇలా అవాంఛితంగా పుట్టిన పిల్లలు కూలీ పనికి వెళ్ళే తల్లులకు అడ్డం కాబట్టి వాళ్ళను ముందు బుద్ధిగా బాప్తీస్మము జరిపించి, ఆ తర్వాత నిర్లక్ష్యంగా వదిలేయడం ఎంత సాధారణ విషయమో ఆ పిల్లలు తరచుగా ఆకలితో చనిపోవడం కూడా అంతే మామూలు విషయం. మస్లోవాకి ముందు ఆమె తల్లికి పుట్టిన అయిదుగురు పిల్లలు కూడా అలాగే చనిపోయారు. వాళ్ళందరూ బాప్తీస్మము తీసుకున్న తర్వాత తల్లి నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల తగినంత పోషకాహారం అందక, ఆకలితో అలమటించి చనిపోయారు.
ఒక జిప్సీ దేశదిమ్మరి వల్ల ఆమెకు పుట్టిన ఆరవబిడ్డకు కూడా అదే గతి పట్టాల్సింది. కాని ఒకరోజు దొరసాని వాసన కొడుతున్న ఆవుపాలను పంపించినందుకు కోపంతో పనివాళ్ళ మీద కేకలేసి నానా తిట్లు తిట్టింది. సరిగ్గా ఆ సమయంలోనే అప్పుడే ప్రసవించిన తన ఆరవబిడ్డతో పశువులపాకలో సొమ్మసిల్లి పడిపోయిన మస్లోవా తల్లిని గమనించిందామె. ఆ పశువుల పాకలో ఆమెను పడుకోనిచ్చినందుకు కూడా పనివాళ్ళను గట్టిగా మందలించి, అక్కడినుంచి వెళ్ళిపోతూ ఆ నవజాత శిశువును చూసి ఆగింది. అందంగా ఆరోగ్యంగా అమాయకంగా ఉన్న ఆ పసిపాపను చూడగానే ఆమె హృదయం ద్రవించిపోయింది. ఆ చిన్నారికి గాడ్‌మదర్ (గోదామాత) గా ఉండేందుకు ముందుకొచ్చింది. తన దత్తపుత్రిక మీద ప్రేమతో ఆ తల్లికి కొన్ని పాలూ, కొంత డబ్బూ ఇచ్చి పాపను బాగా పెంచమని చెప్పింది. అలా ఆ చిన్నారి బతికి బట్టకట్టింది.
దొరసానులిద్దరూ ఆ పాపను ‘చావుతప్పిన పిల్ల’ అని సరదాగా పిలిచేవాళ్ళు. పాపకు మూడేళ్ళు రాగానే తల్లి అనారోగ్యంతో చనిపోయింది. ఇక ముసలి అమ్మమ్మకు కూడా ఆ పిల్లని పెంచడం బరువే అనుకుని దొరసానులిద్దరూ పాపను పెంపకానికి తెచ్చుకున్నారు. ఆ నల్లకళ్ళ చిన్నపిల్ల ఇప్పుడు అందమైన యువతిగా ఎదిగింది. ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరిగే ఆ అమ్మాయిని చూసి ఇద్దరు వృద్ధమహిళలు ఆనందంతో పొంగిపోయేవాళ్ళు.
పాపకి గాడ్‌మదర్‌గా ఉండటానికి ముందుకొచ్చిన ‘సోఫియా ఇవానోవ్నా’ ఆ సోదరీమణుల్లో చిన్నావిడ. ఆమె మనసు వెన్నపూస. పెద్దావిడ ‘మరియా ఇవానోవ్నా’ మాత్రం కొంచం కఠినంగానే ఉండేది. సోఫియా ఆ పాపకు మంచిమంచి బట్టలు తొడిగి చదవడం రాయడం నేర్పించేది. పాపను ఒక చదువుకున్న సంస్కారవంతమైన యువతిగా తీర్చిదిద్దాలని తపించేది. ‘మరియా’ మాత్రం పాపకు పనీపాటా నేర్పించి మంచి పనిమనిషిగా తయారు చేయాలని అనుకునేది. అందుకే పాపను బాగా కష్టపెట్టేది. కరుకుగా వ్యవహరించేది. పొరపాటు చేస్తే శిక్షించేది. కోపం ఎక్కువైతే కొట్టేది కూడా.
రెండు విభిన్న ప్రభావాల మధ్య పెరిగిన ఆ అమ్మాయి సగం పనిమనిషిలా, సగం చదువుకున్నదానిలా తయారయ్యింది. వాళ్ళు ఆమెను ‘కటూషా’ అని పిలిచేవాళ్ళు. ‘కటింకా’ లాగా గొప్ప పేరు కాకపోయినా, ‘కట్కా’ అనే అతి సామాన్యమైన పిలుపు కంటే ఇది చాలా మంచి పేరు.
కటూషా కుట్టుపని చేసేది, ఇల్లు ఊడ్చేది. దేవుని బొమ్మలు భద్రపరిచే ఇనప్పెట్టెలను పాలిష్ చేయడం లాంటి తేలికైన పనులు చేసేది. అప్పుడప్పుడూ ఆ ఇద్దరు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి, పుస్తకాలు చదువుతూ వాళ్ళకు వినిపించేది.
ఒకట్రెండు మంచి సంబంధాలు వచ్చినా కటూషా పెళ్లి చేసుకోలేదు. తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్న ఏ కూలీ వాడికి భార్యగా వెళ్ళినా తను జీవితాంతం కష్టాల పాలౌతుందని ఆమె బలంగా నమ్మింది. చిన్నప్పటి నుండి చాలా సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడిందామె. పదహారేళ్ళు వచ్చేవరకు అలాగే సకల సౌఖ్యాలతో బతికింది.
దొరసానుల మేనల్లుడు ఒక యువరాజు. యూనివర్సిటీలో చదువుకుంటూ కొన్నిరోజులు తన మేనత్తలతో గడపడానికి వాళ్ళింటికి వచ్చాడు. కటూషా వెంటనే అతడితో ప్రేమలో పడిపోయింది. కాని ఆ నిజం ఒప్పుకోవడానికి ఆమె మనసుకు కూడా ధైర్యం లేకపోయింది. రెండేళ్ళ తర్వాత అదే మేనల్లుడు సైన్యంలో చేరబోయే ముందు ఓ నాలుగురోజులు తన మేనత్తల ఇంట్లో ఉందామని మళ్ళీ అక్కడికి వచ్చాడు. అక్కణ్ణించి వెళ్ళిపోవడానికి ముందురోజు రాత్రి అతడు కటూషాను మోసం చేసాడు. పోతూపోతూ ఆమె చేతిలో ఓ వంద రూబిళ్ల నోటు పెట్టి వెళ్ళిపోయాడు.
ఐదునెలల తర్వాత కటూషాకి కడుపు ఖాయమని అర్థమైంది. ఆ పరిస్థితిలో ఆమెకు ప్రతిదీ అసహ్యంగానే అనిపించసాగింది. ఈ అవమానం నుండి ఎలా బయటపడాలా అని మనసులో ఎప్పుడూ ఒకటే ఆలోచన. అందుకే అప్పటినుండి ఆమె కొంచం నిర్లక్ష్యంగా, పరధ్యానంగా పనిచేయడం ప్రారంభించింది. ఒకసారి తనకే తెలియకుండా దొరసానులిద్దరితో చాలా దురుసుగా ప్రవర్తించి, ‘నేను పని మానేస్తున్నాను’ అని కోపంగా చెప్పేసింది. వెంటనే పశ్చాత్తాపపడింది గాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. దొరసానులిద్దరూ ఆ అమ్మాయి ప్రవర్తనలో ఏదో తేడా రావడం గమనించారు. అసంతృప్తితో ఆమెను అక్కణ్ణించి పంపించారు.
తర్వాత కటూషా ఒక పోలీసు ఆఫీసర్ ఇంట్లో పనిమనిషిగా చేరింది. అక్కడ కూడా మూడునెలలకు మించి ఉండలేకపోయింది. యాభైయ్యేళ్ల వయస్సున్న ఆ ఆఫీసర్ ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఓసారి అతను మరీ హద్దుమీరబోయాడు. కటూషా కోపంతో అతణ్ణి ‘ముసలి పిశాచీ, దరిద్రపు వెధవా!’ అని తిడుతూ ఒక్క తోపు తోయడంతో వాడు కింద పడిపోయాడు. తర్వాత ఆమెను నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి గెంటేసాడు.
ప్రసవ సమయం దగ్గర పడడటంతో కటూషాకి వేరేపని వెతుక్కునే సమయం కూడా లేకుండా పోయింది. చివరికి ఒక పల్లెటూరికి చేరుకుని ఒక మంత్రసాని ఇంట్లో తలదాచుకుంది. ఆ మంత్రసాని దొంగసారా కూడా అమ్ముతుంది. కటూషాకు సుఖప్రసవమే అయ్యింది గాని అదే ఊళ్ళో విషజ్వరంతో బాధపడుతున్న ఒక రోగిని చూడ్డానికి వెళ్ళిన మంత్రసాని వల్ల కటూషాకు కూడా ఆ వ్యాధి సోకింది. పుట్టిన మగబిడ్డను వెంటనే అనాథ పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్ళాల్సి వచ్చింది. అక్కడ పిల్లాణ్ణి పరిశీలించిన ఒక ముసలావిడ బిడ్డ అక్కడికి రాగానే చనిపోయాడని చెప్పింది.
మంత్రసాని ఇంటికి వచ్చినప్పుడు కటూషా దగ్గర మొత్తం 127 రూబిళ్ళు ఉండేవి. వాటిలో 27 ఆమె సంపాదించినవి. మిగతా 100 ఆమెను మోసం చేసిన యువరాజు ఇచ్చినవి. రెండునెలల తర్వాత ఆమె చేతిలో కేవలం 6 రూబిళ్లే మిగిలాయి. ఆమెకు డబ్బు పొదుపు చేయడం రాదు. తన కోసం పెట్టుకునే ఖర్చే కాకుండా ఎవరడిగినా లేదనకుండా ఇచ్చేది. రెండునెలలు కటూషాకు ఆశ్రయం ఇచ్చినందుకూ, తన మంత్రసాని పనికి కలిపి మొత్తం 40 రూబిళ్ళు మంత్రసాని తీసుకుంది. పిలాణ్ణి హాస్పిటల్ లో చేర్పించడానికి 25 రూబిళ్ళు ఖర్చయ్యాయి. ఒక గేదెని కొనుక్కుంటానని మంత్రసాని 40 రూబిళ్ళు అప్పుగా కూడా తీసుకుంది. మిగిలిన 20 రూబిళ్ళు ఆమె బట్టలకూ చిరుతిండ్లకూ ఖర్చైపోయాయి.
ఇక బతకడానికి వేరేదారి లేక కటూషాకి మళ్ళీ ఏదైనా పని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఇంట్లో పనిమనిషిగా చేరింది. అతను పెళ్ళైనవాడే. అయినా మొదటి రోజునుంచే ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతన్ని చూస్తేనే ఆమెకు అసహ్యం వేసేది. తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేది. ఆఫీసర్ మంచి అనుభవశాలి. మాయాశీలి. ఆమెను ఎక్కడికైనా పంపించే అధికారం కలిగిన యజమాని. మొత్తానికి అనుకున్నది సాధించాడు.
అతని భార్యకి విషయం తెలిసింది. ఒకరోజు తన భర్త, కటూషా ఏకాంతంగా గదిలో ఉండటం చూసి కోపంతో ఆమెను కొట్టడం మొదలుపెట్టింది. కటూషా కూడా ఎదురు తిరిగింది. ఇద్దరికీ పెద్ద గొడవే అయ్యింది. చివరికి ఇద్దరూ కలిసి జీతం కూడా ఇవ్వకుండా కటూషాని బయటకు గెంటేసారు.
కటూషా అక్కణ్ణించి సిటీలో ఉండే ఆమె మేనత్త దగ్గరికి వెళ్ళింది. మేనత్త భర్త ఒక బుక్ బైండర్. ఒకప్పుడు బాగా బతికినవాడే. ఇప్పుడు వ్యాపారం సరిగ్గా నడవక పనిచేయడం తగ్గించి, మందుతాగడం పెంచాడు. కొద్దోగొప్పో వచ్చే సంపాదనంతా క్లబ్బులో తగలేసేవాడు. మేనత్త ఒక చిన్న లాండ్రీషాపు పెట్టుకుంది. వచ్చిన డబ్బుతో తనను, తన పిల్లలను, తాగుబోతు మొగుణ్ణి పోషించేది.
కటూషాను తన షాపులోనే పనిలో పెట్టుకుంటాను అంది మేనత్త. అక్కడ పనిచేసే ఇతర మహిళా నౌకర్లు పడుతున్న బాధలు, కష్టాలు చూసి కటూషా కంగారు పడింది. ‘రిజిస్ట్రి ఆఫీసు’లో పనికోసం అప్లై చేసుకుంది. ఒక మహిళ దగ్గర పని దొరికింది. ఆమెకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. భారీకాయం, బుర్ర మీసాలున్న ఆమె పెద్దకొడుకు చదువు అటకెక్కించి కటూషా ఇంట్లో చేరిన వారంరోజుల్లోనే ఆమె ప్రేమిస్తున్నానంటూ రోజూ వెంటపడేవాడు. తప్పంతా కటూషా మీదికి తోసేసి ఆమెను పనిలోంచి తీసేసి పంపించేసింది ఆ కుర్రాడి తల్లి.
ఎంత ప్రయత్నించినా ఎక్కడా పని దొరక్కపోవడంతో కటూషా మళ్ళీ రిజిస్ట్రి ఆఫీసుకు వెళ్ళింది. అక్కడ మెడనిండా నగలు, వేళ్ల నిండా వజ్రపుటుంగరాలు, భుజాలకు దండకడియాలు ధరించి బాగా ముస్తాబైన ఒక ధనిక స్త్రీ పరిచయమైంది. కటూషాకు పని అత్యవసరమని అర్థం చేసుకున్న ఆమె తన అడ్రెస్ చెప్పి ఇంటికి రమ్మని ఆహ్వానించింది. కటూషా వెంటనే వెళ్ళింది. ఆవిడ కటూషాని చాలా ప్రేమగా స్వాగతించింది. కేకులు, స్వీట్లు, ద్రాక్షసారా తెచ్చి కటూషా ముందు పెట్టింది. తర్వాత ఒక పనివాడిని పిలిచి, ఒక కాగితం మీద ఏదో రాసి, దాన్ని ఎవరికో ఇచ్చిరమ్మని పంపింది.
ఆ సాయంత్రం- నెరిసిన గడ్డం, పొడవాటి జుట్టుతో, ఎత్తుగా ఉన్న ఒకతను ఆ ఇంటికి వచ్చాడు. కటూషా దగ్గర కూర్చుని మెరిసే కళ్ళతో తదేకంగా ఆమెనే చూస్తూ, చతుర్లాడి నవ్విస్తూ సరదాగా మాట్లాడటం ప్రారంభించాడు. ఇంతలో ఆ స్త్రీ అతణ్ణి పక్కగదిలోకి పిలిచి ‘ఇప్పుడే ఊరునుంచి వచ్చింది, కొత్తపిల్ల’ అని చెప్పడం కటూషాకి వినిపించింది. తర్వాత కటూషాను కూడా పక్కకు పిలిచి, అతనొక రచయిత అనీ, అతనికి చాలా డబ్బు ఉందనీ, అతనికి నువ్వు నచ్చితే ఇక నీకు ఏ లోటూ ఉండదని చెప్పింది.
అతడికి కటూషా నచ్చింది. ఆమెకు 25 రూబిళ్ళు ఇచ్చాడు. తరచూ కలుసుకుందామని చెప్పాడు. ఆ డబ్బు తొందరగానే అయిపోయింది. ఇంట్లో ఆశ్రయం ఇచ్చినందుకూ, ఇంటి ఖర్చులకు గానూ ఇంటావిడకి కొంత డబ్బు కట్టింది కటూషా. మిగిలిన డబ్బు టోపీలు, రిబ్బన్లు ఇతర అలంకరణల కోసం ఖర్చుపెట్టింది. కొన్నిరోజుల తర్వాత ఆ రచయిత మళ్ళీ ఆమెను పిలిపించుకున్నాడు. ఈసారి కూడా 25 రూబిళ్ళు ఇచ్చాడు. ఆమె కోసం ప్రత్యేకంగా వేరే గది అద్దెకు తీసుకుంటానని చెప్పాడు.
రచయిత ఉండే లాడ్జ్ పక్కనే ఆమె కోసం ఒక గది అద్దెకు తీసుకున్నాడు. ఆ గది పక్కనే, ఎప్పుడూ సరదాగా ఉండే ఒక కుర్ర దుకాణాదారుడు ఉండేవాడు. కటూషా తొందరగానే అతణ్ణి కూడా ప్రేమించేసింది. ఈ విషయం రచయితకు చెప్పి తనకోసం వేరే ఒక చిన్నగదిని అద్దెకు తీసుకుని అక్కడకు మారిపోయింది. పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసిన ఆ కుర్రాడు కటూషాకు కనీసం మాట కూడా చెప్పకుండా వ్యాపార నిమిత్తం ‘నిజ్ని’కి వెళ్ళిపోయాడు. వాడు తనను వదిలించుకున్నాడని ఆమెకు స్పష్టంగానే అర్థమయ్యింది. మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయింది కటూషా. అదే గదిలో అదే జీవితం ఇంకొంతకాలం కొనసాగించాలనుకుంది గాని పోలీస్‍లు వచ్చి ఆ వృత్తికి తప్పకుండా లైసెన్స్ తీసుకోవాలని ఒత్తిడి చేసారు.
కటూషా మళ్ళీ తన మేనత్త ఇంటికే చేరుకుంది. ఆమె వేసుకున్న ఖరీదైన బట్టలు, టోపీ, ఓవర్‌కోట్ చూసిన మేనత్త ఇక ఆమెను తన లాండ్రీ పనిలో సహాయం చేయమని అడగలేదు. తన కోడలు ఇలాంటి చిన్నచిన్న పనులు చేసే స్థాయి దాటేసిందని అర్థం చేసుకుంది. ‘లాండ్రీ పని’ చేయాలా వద్దా అన్న ప్రశ్న కటూషాకి అస్సలు తలెత్తనే లేదు.
క్షయరోగంతో బాధపడుతూ, లాండ్రీ పనిలో కష్టపడుతున్న బక్కచిక్కిన పనిమనుషులని చూసి కటూషా జాలి పడింది. భయంకరమైన వేడి ఉండే గదిలో, తలుపులు కిటికీల నుంచి వచ్చే వేడి గాలిలో, సబ్బునీటి ఆవిరి నిండిన వాతావరణంలో, తమ బలహీనమైన చేతులతో బట్టలు ఉతుకుతూ, నిలబడి ఇస్త్రీ చేస్తున్న ఆడవాళ్ళని చూసి తనకు కూడా ఇలాంటి గతి పడితేనో అన్న ఆలోచనకే ఆమె భయంతో వణికిపోయేది.
అంతకుముందే కటూషాకు స్మోకింగ్ అలవాటైంది. ఆ కుర్ర దుకాణాదారుడు ఆమెని వదిలేసాక మందుతాగే అలవాటు కూడా పెరుగుతూ వచ్చింది. మద్యం రుచి ఆమెకు అంతగా నచ్చకపోయినా తన బాధలు మరచిపోవడానికి, తాను స్వేచ్ఛగా ఉన్నట్టు భ్రమించడానికి, తనకు తాను గొప్ప అని ఊహించుకోవడానికి మందు ఆమెకు సహాయపడేది. తాగకపోతే ఆమెకు ఇలా అనిపించేది కాదు. కేవలం బాధ, అవమానం మాత్రమే గుర్తొచ్చేవి.
ఇలాంటి సమయంలో మరో కొత్త స్త్రీ ఆమె దగ్గరికి వచ్చింది. సిటీలోని గొప్పభవనాల్లో ఒకదాంట్లోకి ఆమెను పంపించగలనని చెప్పింది. అందులో ఉండటం వల్ల కలిగే ఉపయోగాలు, పొందగలిగే లాభాలు వివరించింది.
ప్రస్తుతం కటూషా ముందు రెండే దారులున్నాయి. ఒకటి పనిచేసుకుని బతకటం. రెండు ఈమె ఇచ్చిన అవకాశాన్ని అందుకోవడం. ఆమె రెండోదే ఎంచుకుంది. ఇలా చేయడం వల్ల తనను మోసం చేసిన యువరాజూ, రచయితా, కుర్ర దుకాణదారుడూ, ఇంకా తనను బాధపెట్టిన చాలామంది మీద ప్రతీకారం తీర్చుకున్నట్టే అనిపించింది.
ఈ నిర్ణయం తీసుకోవడానికి కటూషాని సమ్మోహనపరిచి ప్రేరేపించిన మరో ముఖ్యమైన కారణం- ఆమెకు నచ్చిన డ్రెస్సులు కొనుక్కునే అవకాశం ఉందని ఆ స్త్రీ చెప్పడం. వెల్వెట్, సిల్క్, సాటిన్ బట్టలూ, లో-నెక్ ఉండే డాన్స్ డ్రెస్సులూ- ఆమెకు ఏవి నచ్చితే అవి కొనుక్కోవచ్చని చెప్పిందామె. జిగేలుమనే పసుపుపచ్చని పట్టు వస్త్రానికి, నల్లటి వెల్వెట్ గుడ్డని కలిపి కుట్టిన లో-నెక్ షార్ట్-స్లీవ్స్ గౌను వేసుకుంటే తానెంత అందంగా ఉంటుందో ఒకసారి మనసులో ఊహించుకుంది కటూషా. ఆ ఊహకే పడిపోయిందామె. వెంటనే తన పాస్‌పోర్టును ఆవిడకు అప్పగించేసింది. ఆ సాయంత్రమే ఆవిడ గుర్రపు బగ్గీని పిలిపించి ‘కరోలినా అల్బెర్టోవ్నా కిటాయేవా’ నడిపే ప్రసిద్దికెక్కిన ఒక వేశ్యాగృహానికి కటూషాని తీసుకెళ్ళింది.
ఆరోజు నుండి కటూషా మస్లోవా మానవీయ విలువలకు, దైవిక నియమాలకు విరుద్దంగా ఒక నిరంతర పాపపు జీవితాన్ని ప్రారంభించింది. లక్షలాదిమంది స్త్రీలు జీవిస్తున్న చీకటి బతుకు అది. అలాంటి జీవితం గడిపే ప్రతీ పదిమంది స్త్రీలలో తొమ్మిదిమంది జీవితం భయంకరమైన రోగాలతోనూ, అకాల వృద్ధాప్యంతోనూ, కొన్నిసార్లు మరణంతోనూ ముగిసేది. ప్రజాసంక్షేమమే పరమావధి అని చెప్పే ప్రభుత్వం కూడా ఇలాంటి వృత్తిని ప్రోత్సహించడంతో పాటు దానికి చట్టబద్ధత కూడా కల్పించింది.
కటూషా మస్లోవా ఇలాంటి జీవితాన్ని ఏడేళ్ళపాటు గడిపింది. ఈ ఏడు సంవత్సరాలలో ఆమె రెండుసార్లు వేశ్యాగృహాలను మార్చింది. ఒకసారి హాస్పిటల్ కి వెళ్ళింది. ఏడో సంవత్సరంలో, ఆమెకు ఇరవయ్యారేళ్ళ వయస్సున్నప్పుడు, ఒకరోజు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి జైల్లో పెట్టడానికి కారణమైన ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వల్లనే దొంగలు హంతకులతో కలిసుండే ఊపిరాడని ఉక్కపోతల చెరసాలలో ఆమె మూడునెలల నిర్బంధించబడింది.
ఇప్పుడు విచారణ కోసం కోర్టుకు తీసుకెళ్ళబడుతోంది.
అధ్యాయం – 3
ప్రిన్స్ నెఖ్లుడోవ్
సుదీర్ఘ నడకతో అలసిపోయిన మస్లోవా ఇద్దరు సైనికులతో కలిసి ఆ భవనానికి చేరుకునే సమయానికి, ఆమెను మొదటిసారి కవ్వించి మోసం చేసిన ‘ప్రిన్స్ దిమిత్రి ఇవానొవిచ్ నెఖ్లుడోవ్’ ఇంకా తన విశాల విలాసపు మంచంలోని స్ప్రింగ్ పరుపు మీద పరచిన పక్షిఈకల మెత్తదనం కలిగిన దుప్పట్లో పడుకుని ఉన్నాడు. చక్కగా ఇస్త్రీ చేసిన మెత్తటి తెల్లటి లెనిన్ నైట్-షర్ట్ ధరించి, సిగరెట్ కాలుస్తూ తాను ఈరోజు చేయాల్సిన పనుల గురించీ, నిన్న జరిగిపోయిన విషయాల గురించీ ఆలోచిస్తున్నాడు.
ఉన్నత రాజవంశానికి చెందిన సంపన్న కుటుంబం ‘కోర్చాగిన్’లతో గడిపిన నిన్నటి సాయంత్రాన్ని గుర్తుచేసుకుని దీర్ఘంగా నిట్టూర్చాడు దిమిత్రి. వాళ్ళ అమ్మాయిని అతను పెళ్ళి చేసుకుంటాడని ఊరంతా గుసగుసలాడింది. చేతిలోని సిగరెట్ ముక్కను పారేసి, సిల్వర్ కేస్ నుండి ఇంకో సిగరెట్ తీసుకోబోయి మనసు మార్చుకుని, తన దృఢమైన శరీరాన్ని స్థిరంగా పైకిలేపి, మృదువైన తెల్లని కాళ్ళను కిందకుదించి, వాటిని చెప్పుల్లో దూర్చి, విశాలమైన భుజాలమీదుగా సిల్క్ డ్రెస్సింగ్ గౌన్ వేసుకుని, బలంగా అడుగులేస్తూ వడివడిగా తన డ్రెస్సింగ్ రూమ్‌లోకి నడిచాడు దిమిత్రి.
అక్కడ- టూత్ పౌడర్‌తో నాజూకుగా పళ్ళను (వాటిలో చాలా వరకు పూడ్చినవే) తోముకుని, సువాసన కోసం ‘ఎలిక్సిర్’తో నోటిని పుక్కిలించాడు అతను. తర్వాత సుగంధ సబ్బుతో చేతులు కడుక్కుని, పొడవైన గోళ్ళను ఒక ప్రత్యేక పద్ధతిలో శ్రద్ధగా శుభ్రం చేసుకున్నాడు. ఆ తర్వాత మార్బుల్ సింక్‍కి భిగించిన ట్యాప్ నుండి చల్లటి నీటిధారను మొహంపైనా బలిష్టమైన మెడపైనా పడేలా వదిలాడు. ఇదంతా అయ్యాక మూడోగదిలోకి వెళ్ళేసరికి అక్కడ అతని కోసం షవర్ బాత్ సిద్ధంగా వుంది.
కండలు తిరిగిన శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేసుకుని, గరుకైన టవల్‍తో తుడుచుకుని, చక్కటి అండర్‌గార్మెంట్స్ వేసుకుని, అద్దం ముందు కూర్చున్నాడు. నల్లటి గడ్డాన్నీ నుదుటిపైన పల్చబడుతున్న ఉంగరాల జుట్టునీ దువ్వుకున్నాడు.
అతను వాడే ప్రతీ వస్తువూ- బట్టలూ, బూట్లూ, నెక్‌టై లూ, ‘టై’ కి పెట్టే పిన్నులూ, షర్టులూ, వాటి మీద అలంకరించే ‘స్టడ్సూ’- అన్నీ అత్యుత్తమ నాణ్యతతో దీర్ఘకాలపు మన్నిక గలిగిన ఖరీదైన వస్తువులు.
నెఖ్లుడోవ్ చాలా తీరికగా బట్టలు వేసుకున్నాడు. అక్కణ్ణించి డైనింగ్ రూమ్‍లోకి వెళ్ళాడు. అక్కడొక పెద్ద టేబుల్, దాని నాలుగు కాళ్ళు సింహపు పంజా ఆకారంలో చెక్కబడి, ఆ దీర్ఘచతురస్రాకార గదిలో దర్జాగా నిలబడినట్టుగా వుంది. దానికున్న భారీ సైడ్‌బోర్డ్ కూడా అదే శైలిలో వుంది. ఆ గది ఫ్లోర్ ని అంతకు ముందురోజే ముగ్గురు మనుషులు పాలిష్ చేసి మెరుగుదిద్దారు.
గంజితో ఇస్త్రీ చేసిన చక్కటి గుడ్డతో ఆ డైనింగ్ టేబుల్ మొత్తం కప్పబడి వుంది. దానిమీద కమ్మటి పరిమళం వెదజల్లుతున్న వెండి కాఫీపాట్, చక్కెర గిన్నె, తాజా మీగడ జగ్గు ఉన్నాయి. వాటి పక్కనే తాజా బ్రెడ్ రోల్స్, రస్క్‌లు, బిస్కెట్లతో నిండిన వెదురు బుట్ట వుంది. అతని ప్లేట్ పక్కన ‘రెవ్యూ డెస్ డ్యూక్స్ మాండ్స్’ అనే ఫ్రెంచ్ మాసపత్రిక చివరి సంచికా, ఒక న్యూస్ పేపరూ, కొన్ని ఉత్తరాలూ ఉన్నాయి.
నెఖ్లుడోవ్ ఆ లెటర్లు తెరవబోతుండగా- సంతాప దుస్తుల్లో, నుదుటిని కప్పేసిన ‘లేస్ టోపీ’తో బొద్దుగా ఉన్న ఒక నడివయసు స్త్రీ చడీచప్పుడు లేకుండా లోనికి ప్రవేశించింది.
అగ్రాఫెనా పెత్రోవ్‍నా! గతంలో నెఖ్లుడోవ్ తల్లికి వ్యక్తిగత సేవకురాలు. తన యజమానురాలు ఈ ఇంట్లోనే ఈమధ్యే చనిపోవడంతో ప్రస్తుతం ఆమె కొడుకుతో ఉంటూ ఇంటి వ్యవహారాలు చూసుకుంటోంది. అగ్రాఫెనా పెత్రోవ్‍నా దాదాపు పదిసంవత్సరాల పాటు వేర్వేరు కాలాల్లో నెఖ్లుడోవ్ తల్లితో కలిసి విదేశాల్లో గడిపింది. అందుకే ఆమెలో ఉన్నత కుటుంబ స్త్రీలో కనిపించే రూపం, సంస్కారం కనిపిస్తాయి. పెత్రోవ్‍నాచిన్నపిల్లగా ఉన్నప్పటినుండీ ఆ ఇంట్లోనే పనిపిల్లగా చేరి, ఆ కుటుంబంలోనే పెరిగింది. అందుకే, దిమిత్రి ఇవానొవిచ్ నెఖ్లుడోవ్‍ని ముద్దుగా ‘మితింకా’ అని పిలుచుకునే చిన్ననాటి రోజులనుంచి ఆమెకు బాగా తెలుసు.
‘గుడ్మార్నింగ్ దిమిత్రి ఇవానొవిచ్.’
‘గుడ్మార్నింగ్ అగ్రఫీనా పెత్రోవ్‍నా. ఏంటీ ఏదైనా పనుందా?’
‘కోర్చాగిన్ ఇంటి నుండి ఒక లెటర్ వచ్చింది. తల్లి రాసిందో, కూతురు రాసిందో తెలీదు! ఇందాకే వాళ్ళ దాసి తెచ్చి ఇచ్చింది.’
అర్థవంతమైన చిరునవ్వుతో పెత్రోవ్‍నా ఒక ఉత్తరాన్ని అతనికి ఇస్తూ చెప్పింది.
‘నేరుగా పంపించారా! సరే ఇవ్వు!’
అంటూ లెటర్ అందుకుంటూ పెత్రోవ్‍నా చిరునవ్వుని గమనించి కనుబొమ్మలు చిట్లించాడు నెఖ్లుడోవ్.
పెత్రోవ్‍నా చిరునవ్వుకి కారణం ఆ ఉత్తరం కోర్చాగిన్ యువరాణి పంపిందేమో అన్న అనుమానం. నెఖ్లుడోవ్ ఆమెను పెళ్ళి చేసుకుంటాడని పెత్రోవ్‍నా ఊహించింది. ఇది నెఖ్లుడోవ్‌ని కొంచం అసహనానికి గురిచేసింది.
‘అయితే కొంచంసేపు ఉండమని దాసీకి చెప్పనా?’ అంటూ లేచింది. అన్నం మెతుకులు తుడిచే ‘క్రంబుల్ బ్రష్’ ఎప్పుడూ పెట్టేచోట గాక మరో చోట ఉండటం గమనించి దాన్ని పాతస్థానంలో సర్ది, గంభీరంగా గదినుంచి బయటకు వెళ్ళిపోయింది.
పరిమళభరితమైన ఆ ఉత్తరాన్ని తెరిచి చదవడం ప్రారంభించాడు నెఖ్లుడోవ్. గరుకు అంచులున్న మందపాటి బూడిదరంగు కాగితంపై చేతిరాతతో ఇంగ్లీషులో ఇలా వ్రాయబడి ఉంది:
మీరు తరచూ మర్చిపోయే విషయాలను మీకు జ్ఞాపకం చేసే బాధ్యతను నేను తీసుకున్నాను కాబట్టి, కొంచం స్వేచ్ఛ తీసుకుని మీకో విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ ఏప్రిల్ 28 రోజున మీరు న్యాయస్థానంలో ‘జ్యూరీ మెంబర్’ హోదాలో హాజరుకావాల్సిన అవసరం ఉందని మీకు గుర్తుచేస్తున్నాను. నిన్న తమరు యథాలాపంగా మాకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం అసాధ్యం. ఎందుకంటే మీకు కోర్టు పని ఉంది కాబట్టి ఆరోజు ఎట్టి పరిస్థితిలోనూ నాతో, కోలోసఫ్‍తో కలిసి మీరు ‘ఆర్ట్ గ్యాలరీ’కి రాలేరు. ఒకవేళ మీరు గుర్రం కొనకుండా మిగిల్చిన ఆ 300 రూబిళ్ళు జరిమానా కింద కోర్టుకు కట్టడానికి సిద్ధ పడితే తప్ప.
నిన్న మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం నాకు గుర్తొచ్చింది కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరచిపోకండి.
యువరాణి M. కోర్చాగిన్
మరో వైపున ఫ్రెంచ్ భాషలో ఒక నోట్ రాసి వుంది.
అమ్మ మీకు చెప్పమంది. మీ కోసం గుర్రపుబగ్గీ రాత్రివరకు ఎదురుచూస్తూ ఉంటుంది.
ఏ సమయమైనా సరే, మీరు తప్పకుండా రండి.
M. K.
లెటర్ చదివి ముఖం చిట్లించాడు నెఖ్లుడోవ్.
ప్రిన్సెస్ కొర్చాగిన్ గత రెండు నెలలుగా నెఖ్లుడోవ్‌ని మెల్లగా తన వైపుకు ఆకర్షించి, కనిపించని వలల్లో అతన్ని బంధించి మరింత దగ్గరయ్యేందుకు వేసే చిలిపి ఎత్తుగడల కొనసాగింపే ఈ ఉత్తరం కూడా.
సాధారణంగా పురుషులు యవ్వనదశ దాటి మధ్యవయస్కులయ్యాక, మరీ బలంగా ప్రేమలో పడితే తప్ప పెళ్ళి గురించి ఆలోచించరు. అదేగాక నెఖ్లుడోవ్ తన మనసు మార్చుకుని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నా, వెంటనే ప్రిన్సెస్ కొర్చాగిన్‍తో పెళ్ళి గురించి మాట్లాడలేడు. దానికి అతనికి కొన్ని బలమైన కారణాలే ఉన్నాయి. పదేళ్ళకిందట అతను మస్లోవాను మోసంచేసి వదిలేయడం మాత్రం ప్రధాన కారణం కాదు. నిజానికి ఆ విషయం అతను పూర్తిగా మర్చిపోయాడు. ఒకవేళ అతను జీవితంలో అస్సలు పెళ్ళే చేసుకోవద్దని నిర్ణయించుకుని, దాన్ని బలపరిచే కారణాల కోసం వెతుక్కున్నా మస్లోవా విషయాన్ని కనీసం లెక్కలోకి కూడా తీసుకునేవాడు కాదు.
అసలు కారణం ఏంటంటే-
నెఖ్లుడోవ్‌కి ఒక వివాహిత మహిళతో సంబంధం వుంది. అతనికి సంబంధించినంత వరకు ఆ సంబంధం ఒక ముగిసిన అధ్యాయం. కాని ఆమె అలా అనుకోలేదు.
నెఖ్లుడోవ్‌కి స్త్రీల దగ్గర కొంచం సిగ్గు, బిడియం ఎక్కువే. అతనిలోని ఈ లక్షణమే ఒక జిల్లా అధికారికి భార్య అయిన ఆ స్త్రీకి మరింత నచ్చింది. నెఖ్లుడోవ్‌ని వశపరుచుకోవాలనే కోరికను కలిగించింది. ఇదంతా ఎన్నికల సమయంలో నెఖ్లుడోవ్ ఆ జిల్లాలో ఉన్నప్పుడు జరిగింది.
ఆ మహిళతో సన్నిహిత సంబంధం రానురానూ నెఖ్లుడోవ్‌ని చిక్కుల్లో పడేసింది. రోజురోజుకీ అతనికి చిరాకు పెరుగుతూ వచ్చింది. ఆమె మోహంలో పడిపోయాక నెఖ్లుడోవ్ తాను చేసిన తప్పుకు బాధపడ్డాడు. అయితే ఆమె అనుమతి లేకుండా ఆ బంధాన్ని తెంచుకునే ధైర్యం అతనికి లేదు. ఒకవేళ కొర్చాగిన్ యువరాణిని నిజంగానే ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలనుకున్నా ఆమెతో ఆ విషయం చెప్పేంత స్వేచ్ఛ తనకి లేనట్లుగా అతను భావించడానికి గల అసలు కారణం ఇదే.
టేబుల్ మీదున్న ఉత్తరాల్లో ఒకటి ఆమె భర్తదే. అతని చేతిరాతను, పోస్టాఫీస్ ముద్రను చూడగానే నెఖ్లుడోవ్ మొహం ఎర్రబడింది. ఒక తెలియని భయమేదో లోపల్నించి సర్రున పాకినట్టు అనిపించింది. ఏదైనా ప్రమాదం ఎదురౌతుందనిపించినపుడు అతనికి ఎప్పుడూ ఇలాగే అనిపిస్తుంటుంది. నెఖ్లుడోవ్‌కి ప్రధానమైన ఎస్టేట్ ఉన్న జిల్లాకు అతనే అధికారి.
ఉత్తరం తెరవగానే అతని ఆందోళన ఒక్కసారిగా అంతమైపోయింది. మే నెలాఖరులో ఒక ప్రత్యేక సమావేశం జరుగుతుందనీ, అందులో స్కూళ్ళూ రోడ్ల గురించి కీలక చర్చలు ఉండబోతున్నాయని అతను ఆ ఉత్తరంలో రాసాడు. అయితే ఈ చర్చలకు ప్రతికూల వర్గం నుంచి తీవ్రవ్యతిరేకత ఎదురవుతుందనీ, అందుకే నెఖ్లుడోవ్ తప్పకుండా ఈ సమావేశానికి హాజరై తమకు బలమైన మద్దతునిచ్చి సహాయపడాలని కోరాడు.
ఆ జిల్లాఅధికారి మంచి స్వేచ్ఛావాది. తన రాజకీయ పోరాటంలో పూర్తిగా నిమగ్నమైపోయి, తన సొంత జీవితంలో వచ్చిన అసలైన ప్రమాదాన్ని గమనించలేకపోయాడు.
ఆమె సాన్నిహిత్యంలో అనుభవించిన భయానక సంఘటనలను గుర్తు చేసుకున్నాడు నెఖ్లుడోవ్. ఒకసారి ఆమె భర్తకి తమ రహస్య వ్యవహారం తెలిసిపోయి తనను వ్యక్తిగత పోట్లాతాకు రమ్మని సవాల్ చేయబోతున్నాడని నెఖ్లుడోవ్ భయపడ్డాడు. పోరు తప్పదనుకుంటే ముందు గాల్లోకి కాల్పులు జరపాలని కూడా అనుకున్నాడు.
మరో భయంకరమైన సంఘటనను కూడా అతనికి జ్ఞాపకం వుంది. ఒకరోజు ఆమె విపరీతమైన ఉద్వేగంతో పార్క్‌లోకి పరుగెత్తి చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.
‘నేనిప్పుడు అక్కడికి వెళ్ళలేను. ఆమె నుండి సమాధానం వచ్చే వరకు ఏమీ చేయలేను,’ అనుకున్నాడు నెఖ్లుడోవ్.
వారం కిందటే ఆమెకు తన నిర్ణయాన్ని తేల్చి చెబుతూ ఒక ఉత్తరం రాసాడతను. అందులో తన తప్పును అంగీకరిస్తున్నాననీ, పరిహారానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అంతేకాదు, ఆమె క్షేమం కోరుకునే తాను ఈ సంబంధానికి ముగింపు పలుకుతున్నానని స్పష్టంగా తెలియజేసాడు. ఆ ఉత్తరానికి ఇప్పటివరకు ఆమె నుండి సమాధానం రాలేదు.
జవాబు రాకపోవడం కూడా ఒక శుభసూచకమే అనుకున్నాడతను. ఎందుకంటే ఆ సంబంధాన్ని ముగించడానికి ఆమె ఒప్పుకోకపోతే వెంటనే ఉత్తరమైనా రాసుండేది లేదా ఎప్పట్లాగే తానే స్వయంగా వచ్చేసి ఉండేది. ఎవరో ఒక ఆఫీసర్ ఆమె మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడని నెఖ్లుడోవ్ విన్నాడు. ఈ విషయం అతనిలో అసూయను రేకెత్తెంచి బాగా బాధపెట్టింది. అదే సమయంలో, ఈ రకంగానైనా తనను హింసిస్తున్న ఆమె మోసపు బంధం నుంచి విముక్తి కలుగుతుందేమోనని ఆశ కూడా కలిగింది.
మరో ఉత్తరం అతని ఎస్టేట్ మేనేజర్ నుండి వచ్చింది. నెఖ్లుడోవ్ తన భూములను స్వాధీనం చేసుకోవడానికి స్వయంగా అక్కడికి రావాల్సిన అవసరం ఉందని అందులో రాసాడు మేనేజర్. ముందుముందు ఈ భూములను ఎలా ఉపయోగించాలనే విషయం మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు. నెఖ్లుడోవ్ తల్లి బతికున్నప్పుటి లాగానే భూములను కౌలు పద్దతిలో కొనసాగించాలా, లేక పశువుల సంఖ్యను పెంచి భూములను స్వయంగా సాగుచేయాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. గతంలో దివంగత మహారాణికి సూచించిన సలహానే ఇప్పుడు యువరాజుకు కూడా చెబుతున్నాననీ, ఇలా సొంతంగా భూమిని సాగుచేయడమే చాలా లాభదాయకంగా ఉంటుందనీ రాసాడు. అలాగే ఒకటో తేదీన జమ చేయాల్సిన 3,000 రూబుల్ల ఆదాయాన్ని పంపించలేకపోయినందుకు క్షమాపణలు కోరాడు. ఆ డబ్బు తర్వాతి పోస్టులో తప్పకుండా పంపిస్తానని హామీ ఇచ్చాడు. దీనికి కారణం కౌలు రైతులు విశ్వాసంగా లేకపోవడమేననీ, వాళ్ళ దగ్గరి నుంచి డబ్బు వసూలు చేయడం కష్టమైపోతుందనీ, అందుకే అధికారుల సహాయాన్ని కోరాల్సివచ్చిందనీ వివరించాడు.
ఆ ఉత్తరం నెఖ్లుడోవ్‌కి కొంత విచారాన్ని కొంత ఆనందాన్ని కలిగించింది. అంత పెద్ద ఎస్టేట్ మీద తనకు అధికారం సంక్రమించడం అతనికి ఆనందంగా అనిపించింది. ఇక విచారం ఎందుకంటే- హెన్రీ జార్జ్, హెర్బర్ట్ స్పెన్సర్ సిద్ధాంతాలకు అతను పెద్ద అభిమాని.
పుట్టుకతోనే అతి పెద్ద ఆస్తికి వారసుడైనా కూడా ప్రైవేట్ భూస్వామ్యాన్ని న్యాయం అనుమతించదని స్పెన్సర్ తన ‘సోషల్ స్టాటిక్స్’ గ్రంథంలో చెప్పిన సిద్ధాంతం నెఖ్లుడోవ్‌ని బాగా ప్రభావితం చేసింది. వయస్సుకు తగిన స్పష్టత, ధృఢనిశ్చయంతో అతను ‘భూమిని వ్యక్తిగత ఆస్తిగా చూడకూడదు’ అని వాదించడం మాత్రమే కాకుండా యూనివర్సిటీలో దీని మీద వ్యాసాలు కూడా రాసాడు. అంతేకాదు, ‘వ్యక్తిగతమైన భూమి ఉండటం తప్పు’ అనే తాను నమ్మిన సిద్ధాంతాన్ని పాటిస్తూ తండ్రి నుండి తనకు సంక్రమించిన చిన్నభూమిని రైతులకు పంచేసాడు.
ఇప్పుడు తల్లి నుంచి వారసత్వంగా సంక్రమించిన ఎస్టేట్‍తో అతిపెద్ద భూస్వామిగా మారిన నెఖ్లుడొవ్ ముందర రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి: పదేళ్ళ కిందట తండ్రి భూమిని రైతులకు పంచినట్టే ఇప్పుడు కూడా తల్లి ఆస్తిని వదిలేయాలి. రెండు: మునుపటి తన సిద్ధాంతాలన్నీ తప్పులు, అబద్ధాలు అని మౌనంగా అంగీకరించాలి.
మొదటిదాన్ని ఎంచుకోలేకపోయాడు నెఖ్లుడొవ్. ఎందుకంటే ఈ భూములు తప్ప అతనికి వేరే ఆస్తేం లేదు. ఉద్యోగం చేయాలన్న ఆసక్తి అస్సల్లేదు. పైగా, ఇంతకాలంగా అలవాటుపడిన విలాస జీవితాన్ని అంత తేలిగ్గా వదులుకోలేడు. ఇప్పుడతనిలో మునుపటి ఉత్సాహం లేదు. యువకుడిగా ఉన్నప్పుడు అతనికున్న బలమైన విశ్వాసాలు, ధృడనిశ్చయం, అసాధారణమైన పనులు సాధించాలనే తపన అన్నీ పోయాయి.
ఇక రెండో మార్గం భూస్వామ్య వ్యతిరేక సిద్ధాంతాలను తిరస్కరించడం. భూస్వామ్య వ్యవస్థలోని లోపాలను అన్యాయాలను ఎత్తిచూపిన స్పెన్సర్ ‘సోషల్ స్టాటిస్టిక్’ నుండి స్ఫూర్తి పొంది, వాటిని తనకు అపాదించుకుని నెఖ్లుడొవ్ సొంతంగా స్పష్టమైన తిరుగులేని సిద్ధాంతాలను తయారుచేసుకున్నాడు. తర్వాత కాలంలో హెన్రీ జార్జ్ రచనల ద్వారా వాటిని ధృవీకరించుకుని వాటికి మరిన్ని మెరుగులుదిద్ది స్థిరపరుచుకున్నాడు. అంత గొప్ప సిద్ధాంతాలను ఇప్పుడు తిరస్కరించడం కూడా నెఖ్లుడోవ్‌కి అసాధ్యంగానే అనిపించింది.
