కవితాత్మ

Spread the love

చైనీస్ కవి హాన్ ఫూక్. బాల్యం నుండే అతడిలో కవితా రహస్యాలన్నీ తెలుసుకోవాలన్న తపన జ్వలించింది. ఈ అన్వేషణకే తన జీవితాన్ని అంకితం చేశాడు. ఇది అతడి గురించి ప్రచారంలో వున్న ఒక కథ…

ఆ రోజుల్లో దేనికీ లోటులేని జీవితం హాన్‌ది. కంటికి రెప్పలా చూసుకొనే తల్లిదండ్రులు నలుగుర్లో హుందాగా బతికిన సంసారం. తల్లిదండ్రుల అంగీకారంతోనే ఓ బంగారు బొమ్మను పెళ్లి చేసుకోవటానికి సన్నాహాలు జరిగాయి. అప్పటికి హన్‌కు ఇరవయ్యేళ్లు. అందగాడు. బాగా చదువుకున్నవాడు. తను రాసిన కవితలు సాహితీ ప్రియుల ప్రశంసలు పొందుతున్నాయి.

హాన్‌ది సంపన్న కుటుంబమేం కాదు కానీ సుఖంగానే జరిగిపోతుంది. పెళ్లైతే కట్నంతో మరింత సుఖంగా గడుస్తుంది. వధువు సౌందర్యరాశి. కాని హన్‌కు శాంతి లేదు. నిజంగా కవి కావటమెలాగ?

ఒకనాడు-

నది మీద దీపోత్సవం జరుగుతోంది. హాన్ అద్దరి నిలుచున్నాడు. రెపరెపలాడుతూ నీళ్ళ మీద తేలుతున్న వేలాది దీపాల్ని చూశాడు. ఆడా, మగా, పిల్లలూ, పడవలూ పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ, ఆలింగనాలు చేసుకొంటూ, పండగ దుస్తుల్లో పువ్వుల్లా కదులుతున్న ఆకారాలు, కేరింతలు, గానాలు, నవ్వులు, వేణునాదాలు, కంజీరలు… వంగిన నీలి ఆకాశం కింద ఆనంద హేల.

ఇంత అద్భుతాన్ని లోపల ఇముడ్చుకోలేని హాన్‌లో అలజడి ప్రారంభమైంది. కవితాన్వేషణలో తొలి ప్రస్థానం.

ఒకవైపు… వెళ్లి వాళ్లతో కలిసి, తన కాబోయే వధువు సాన్నిహిత్యంలో క్రీడించి మైమరచిపోవాలని…

కానీ అంతకన్నా తీవ్రమైన కోరిక… ఈ దృశ్యాన్ని, ఈ అనుభవాన్నంతా జీర్ణించుకొని, స్పందించి కవితగా మలచాలని. నీళ్లు, నీళ్లలో దీపాలు, గట్టు మీద మనుషులు, రంగురంగుల దుస్తులు, ఆనంద క్రీనీడలో ఉత్తేజితమైన మొహాలు, నీలాకాశం కింద కావాలి కవిత.

ఆ క్షణంలోనే తెలిసిపోయింది.

            ఏ అందమూ, ఏ సంతోషమూ తన మనసును నిలకడగా వుండనివ్వవని, జీవితంలో ఇక ఏమీ జరగదనీ, తను ఇందులో పాలుపంచుకోలేడు. అన్నీ పరిశీలిస్తూ, స్పందిస్తూ ప్రేక్షకుడుగా మిగిలిపోవటమే తనకు రాసుంది.

            ఈ లోకానికి తను కాందిశీకుడు. ఒక విచిత్ర వ్యక్తి. ఇక్కడే వున్నాడు. కాని ఈ లోకం తనది కాదు. చూడటం వరకే తను చెయ్యగలిగింది. ఎప్పుడూ తను ఒంటరి వాడు. ఎన్ని సన్నిహిత, హార్దిక సంబంధ బాంధవ్యాలున్నా, శాంతికి నోచుకోని ఒంటరి.

అప్పుడు మొలకెత్తింది ఒక గొప్ప విషాదం. నిర్వేదం. ఒక లిప్తపాటైనా సంతోషం కావాలంటే వివిధ భంగిమల, వివిధ భావాల లోకాన్ని కవితతో పట్టుకోగలగాలి. కవితలో లోకం మౌలికమై, శుద్ధమై, శాశ్వతమవుతుంది.

            ఈ ఆలోచనలన్నీ సుప్తావస్థలో వచ్చాయా, తను స్పృహలోనే ఉన్నాడా అన్న జ్ఞానం కూడా లేదు. ఆకాశం నుంచి వూడిపడ్డట్టుగా ఓ వృద్ధుడు దర్శనమిచ్చాడు. హాన్ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే వృద్ధుడు రెండు మూడు గేయాలు చదివాడు. అప్పటి దాకా హాన్ రాయాలనుకొని రాయలేని భావాల కవితారూపం అవి. ఆ మాటల పొందిక, ఆ పద చిత్రాలు అద్భుతం.

            “ఎవరు మీరు? నా ఆత్మ లోతుల్లోని స్పందనల్ని అపురూపమైన కవితలుగా మలిచిన మహానుభావులు. ఇంత గొప్ప కవిత్వం నేనింతవరకూ వినలేదు”

            వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. ఒక అలౌకికత కన్పించింది. అది జ్ఞానుల ఆశీర్వదంలో వికసించే దరహాసం.

            “నువ్వు కవిత్వం సాధన చెయ్యాలనుకుంటే నా వెంటరా. ఆ పశ్చిమోత్తర పర్వతాలలో నదీతీరంలో వుంటుంది నా కుటీరం. పరిపూర్ణ పద ప్రపంచానికి నేను వాచస్పతినని అంటారు”

            ఆ మాటల అర్ధం హాన్‌కి పూర్తిగా బోధపడక ముందే వృద్ధుడు అదృశ్యమయ్యాడు. ఇలా అదృశ్యం కావటమనేది ప్రాపంచిక సూత్రాలకు విరుద్ధం గనక, ఇదంతా అలసిపోయి నిద్రించిన తనకు కలలో కన్పించిన దృశ్యమనుకున్నాడు.

            లేచి, నది దాటి పండగ చేసుకుంటున్న మనుషుల్తో కలిసి వినోదించ ప్రయత్నించాడు. కానీ ఆ వృద్ధుడి మాటలు మరచిపోలేకపోయాడు. తన ఆత్మ పరాధీనమైపోయింది.

* * *

కొన్నాళ్ల తర్వాత హాన్ తండ్రి పెళ్లి ముహూర్తం పెట్టటానికి పెద్దల్ని పిలిపించాడు.

            “నాన్నా, నా మాటలు మీకు బాధ కలిగిస్తే క్షమించండి. కవితా రహస్యాల్ని అధ్యయనం చెయ్యాలనే కోరిక నాలో ఎంత తీవ్రంగా ఉందో మీకు తెలుసు. కవితా ప్రస్థానంలో నేనింకా ఓనమాల దశలోనే ఉన్నాను. అందువల్ల మరికొన్నాళ్లు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. కవితాధ్యయనానికి అంకితమవుతాను. ఈ దశలో వివాహమూ, గృహబాధ్యతలూ అంటే కార్యదీక్షా, ఏకాగ్రతా తగ్గిపోతాయి. నా ప్రయత్నంవల్ల నాకు ఆనందమూ, మన కుటుంబానికి కీర్తీ వస్తాయని నా విశ్వాసం” అంటూ విన్నవించుకున్నాడు హాన్.

            కొడుకు కోరికకు సంతోషించి, తండ్రి “కవిత్వం కోసమే అయితే సంతోషమే. కానీ నీకూ, వధువుకు మధ్యన ఏమైనా భేదాలు వచ్చాయా? లేదా మరో అమ్మాయిని చూడమంటావా?” అని అడిగాడు.

            ఆ పిల్లంటే తనకు ప్రాణమని చెప్పాడు హాన్. దీపోత్సవం నాటి సంగతులు వివరించి, కలలో కనిపించిన ఆ జ్ఞానిదగ్గర శిష్యరికం చేసి కవిత్వం గురించి తెలుసుకోగలిగిందంతా తెలుసుకోవటమే తన జీవిత ధ్యేయమన్నాడు.

            “దైవేచ్ఛ ఎలాగుంటే అలా జరుగుతుంది. నీ జ్ఞానార్జనకు మరో సంవత్సరం తీసుకో” అన్నాడు తండ్రి.

            “ఏడాదో రెండేళ్లో ఎవరికి తెలుసు? అన్నాడు హాన్,

            అలా హాన్ తండ్రి దగ్గర శలవు తీసుకుని, ప్రియురాలికి వీడ్కోలు లేఖ రాసి ప్రయాణమయ్యాడు.

            అనేక రోజులు నడక తర్వాత నది, తీరాన కుటీరం దర్శనమిచ్చాయి. ఎదురుగా చాపమీద కంజీర వాయిస్తూ ఆనాటి జ్ఞాని. సంగీత నాదాలు ఆకాశంలో తెల్లటి మబ్బుల్లా తేలివస్తున్నాయి. ఆ మధుర స్వరాలలో తన్మయుడైపోయాడు.

            ఎంతసేపటికో ఆ పరిపూర్ణపద వాచస్పతి కంజీర పక్కన పెట్టి లేచి వచ్చి హాన్‌ను కుటీరం లోపలికి తీసుకెళ్లాడు. ఆ వాత్సల్యం హాన్‌ను పులకింపజేసింది.

            ఒక నెల గడిచేసరికి తను అప్పటికి అల్లిన కవిత్వంమీద వెగటు పుట్టింది. అతి ప్రయత్నం మీద పాత కవిత్వ జ్ఞాపకాల్ని చెరిపేసుకున్నాడు. మరికొన్ని నెలలకు మొత్తం కవితా ప్రపంచ జ్ఞాపకాల్ని తొలగించుకున్నాడు. ఆ వాచస్పతి నోరు తెరచి మాట్లాడలేదు. నిశ్శబ్దంలోనే, పద ప్రపంచానికి అతీతంగా సాగింది బోధన కంజీరతో. ఒకసారి శిశిరాకాశంలో ఎగురుతున్న రెండు పక్షుల గురించి ఓ గీతం రాశాడు. అది అతడికి బాగా నచ్చింది. కాని వాచస్పతికి చూపించటానికి ధైర్యం చాల్లేదు. అనాలోచితంగానే హాన్ గీతాన్ని గానం చేసినప్పుడు వాచస్పతి విన్నాడు. కాని ఏమీ వ్యాఖ్యానం చెయ్యలేదు. కంజీర ఆగలేదు. సంగీతం ప్రకృతిని మార్చివేసింది.

            నడి వేసవిలో చల్లగాలి వీచింది. మిట్టమధ్యాహ్నం కెంజాయ మారింది. ఎక్కడినించో వచ్చిన రెండు పక్షులు ఆకాశంలో వలయాలు సృష్టిస్తూ ఎగిరాయి. ఆ వాతావరణమూ, ఆ ఆకాశం, ఆ పక్షుల వయ్యారం హాన్ రాసిన గీతంలోకన్నా ఎన్నో రెట్లు అద్భుతంగా, ముగ్ధమనోహరంగా వున్నాయి. తన గీతంలోని నిష్ఫలత్వం అవగతమయ్యింది హాన్‌కు. తర్వాత కూడా, గీతం రాసిన ప్రతిసారీ ఇలాగే జరిగింది. ఏడాది గడిచింది. హాన్ కంజీర మీద పట్టు సాధించాడు. కాని కవిత సృష్టి మాత్రం ఎండమావిగానే మిగిలింది.

            రెండేళ్లు గడిచాయి. హాన్‌కు ఇంటిమీద మనసు పోయింది. తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ప్రియురాలు గుండెకు గాలంవేసి లాగింది.

            హాన్ వాచస్పతి అనుమతి తీసుకోవాలనుకున్నాడు. “ఎప్పుడు వెళ్లదలచుకుంటే అప్పుడు వెళ్లు. రావాలనిపించినప్పుడురా. నీకు పూర్తి స్వేచ్ఛ ఉందిక్కడ” అన్నాడు వాచస్పతి తను అడగకముందే.

            ఊరు చేరిన హాను సుపరిచితమైన ప్రదేశాలన్నీ స్వాగతం పలికాయి. ఆ తొలి సంధ్యలో నదిమీది వంతెనా, విశాలమైన యింటి ఆవరణా, తోటలోని యింట్లో గది కిటికీ పక్కన నిల్చుని పరిశీలించాడు. సమవూపిరి తీసుకొంటూ గాఢనిద్రాణలో వున్నాడు తండ్రి. ప్రియురాలి యింటిగోడ దూకి, చెట్టెక్కి గమనించాడు. తన కలల రాణి తల దువ్వుకుంటున్నది. దృగ్గోచరమైన ఈ లోకాన్ని చూసి మండిపోతున్న హాన్‌కు కవితా సృష్టికే తన జీవితమంకిత మైనదిగదా అని గుర్తుకు వచ్చింది. ప్రపంచమూ ఈ మనుషులూ అందులోనే వుండొచ్చుగాక. కవుల వూహల్లో యిదే ప్రపంచమూ, యిదే మనుషులూ మరెన్నో రెట్లు మనోహరంగా మారిపోతారు.

            నిశ్శబ్దంగా వాచస్పతి కుటీరానికి ప్రయాణమయ్యాడు హన్. కంజీర వాయిస్తూ, చాప మీద కూర్చున్న పరిపూర్ణ పదప్రపంచ వాచస్పతి చిరునవ్వు నవ్వి ‘కవితా సాధన’ వల్ల మాత్రమే జీవితానికి సార్థకత వస్తుంది’ అని అర్థం వచ్చే రెండు చరణాలు విన్పించాడు. భావోద్వేగంతో కన్నీళ్ళాపుకోలేకపోయాడు హాన్.

            మరో ఏడాది గడిచింది. మరో వాయిద్యం నేర్చుకొమ్మన్నాడు వాచస్పతి. ఎండవేడికి కరిగే మంచులా గడిచింది కాలం. అప్పుడప్పుడూ యింటికి పారిపోవాలనిపించేది. ఒక రాత్రి కుటీరం వదిలి చాలా దూరం నడిచాడు. కాని ఆ చల్లటి గాలితోపాటు వచ్చిన సంగీత ధ్వనులు ఆడుగులు ముందుకు పడనివ్వలేదు.

            తనకు పెళ్లైనట్టూ, భార్యా, పిల్లల్తో కలిసి మొక్కలకు నీళ్లు పోస్తున్నట్లూ కలొచ్చిందొక సారి. తీరా లేచిచూస్తే పూర్ణచంద్రుడు నెత్తి మీదున్నాడు. పక్కన గాఢ నిద్రలో వాచస్పతి. తన జీవితాన్ని నాశనం చేసిన ఈ గడ్డం మనిషి మీద అసహ్యం ముమ్మరమయ్యింది. ‘చంపితే పీడా పోతుంద’నుకొని దగ్గరగా వెళ్లాడు.

            వాచస్పతి కళ్లు తెరచి, చిరునవ్వుతో దయగా, “నిన్ను ఎవరూ యిక్కడ కట్టిపడేయ్యలేదని చెప్పానుగా హాన్. వెళ్లదలచుకుంటే వెళ్లు. భార్యా, పిల్లల్తో కలిసి చెట్లకు నీళ్లుపడుతూ గడుపు. అసహ్యం ఆపుకోలేక పోతే నన్ను చంపు. ఇవన్నీ చాలా అల్పమైన విషయాలు” అన్నాడు.

            “మిమ్మల్నెలా అసహ్యించుకోగలను గురువర్యా! దేవుణ్ణి, స్వర్గాన్నీ అసహ్యించుకున్నట్టే కదా!” అన్నాడు హాన్.

            కాలక్రమంలో ఒకదాని తర్వాత ఒకటి అనేక వాయిద్యాలు నేర్చుకున్నాడు హాన్. నెమ్మదిగా వాచస్పతి శిక్షణలో కవితలు అల్లటమనే రహస్య కళనూ అభ్యసించాడు. అతిసులభమైన, అందరికీ పరిచితమైన పదాలే వాడుతూ, గాలివీస్తూ నీళ్ల వుపరితలం మీద అలల్ని సృష్టించినట్టుగా, శ్రోతల హృదయాల్ని కదిలించటం, రావాలా వద్దా అని సందేహిస్తూ పర్వత శిఖరాల మీద సాక్షాత్కరించే సూర్యుడూ, నల్లటి నీడల్లాగ నీళ్లలో ఈదే చేపలూ, గాలికి నాట్యం చేసే సన్నటి గులాబీ మొక్కలూ అన్నీ కవితా వస్తువులే. కాని పత్రిసారీ కవిత అల్లిన క్షణాన మాత్రం మొత్తం ప్రకృతి, ఆకాశం, నేల అన్నీ ఒక అంతర్లయలో ఏకమైన అనుభవం. ఆ అనుభవమే శ్రోతలకూ కలిగి తమ తమ స్వభావాల కనుగుణంగా ఆనందమో, విషాదమో, ప్రేమో, ద్వేషమో ముంచెత్తేవి. కుర్రాళ్లకు క్రీడలూ, యువకులకు ప్రేయసులూ, వృద్ధులకు మృత్యువూ.

            అక్కడ ఎన్నాళ్లు వున్నాడో హాన్‌కు తెలియదు. కాని ఎప్పుడు చూసినా క్రితం సాయంత్రమే అక్కడికి వచ్చినట్టుగా వుండేది. వాచస్పతి కంజీరను మొదటిసారి వింటున్నట్టుగానే, ఏళ్లూ, తరాలూ, మన్వంతరాలూ అన్నీ కల. అసత్యం. సంగీతం, కవిత్వం మాత్రమే సత్యం.

            ఒక ఉదయం లేచిచూస్తే వాచస్పతి కనిపించలేదు. ఎక్కడా లేడు. అదృశ్యమయ్యాడు.

వసంతకాలంలో ఆకురాలుకాలం వచ్చేసింది. జీర్ణకుటీరం ముందర చలిగాలి రొద చేసింది. కొండల మీద పక్షులు ప్రదక్షిణం చేశాయి.

            కంజీర తీసుకుని తన వూరివైపు కదిలాడు హాన్. దారిలో తారసపడిన వాళ్లంతా వృద్ధులకు నమస్కరించే పద్ధతిలోనే తనకు అభివాదాలు తెలిపారు. ఊళ్లో తండ్రీ, ప్రియురాలూ, యితర బంధువులూ అందరూ కాలం చేశారు. తన యింట్లో ఎవరో కొత్తవాళ్లుంటున్నారు. సాయంత్రం నదిమీద దీపోత్సవం జరిగింది. ఆవలి తీరాన, చీకట్లో హాన్ కవితలల్లాడు. కంజీర నాదాలు యువతుల్లో విరహాగ్ని రగిలించాయి. ఎవరీ సంగీతకారుడంటూ యువకులు అంధకారంలో వెదకటానికి ప్రయత్నించారు. సంగీతమైతే వినవస్తున్నదిగాని సంగీతకారుడు కనిపించడు. అటువంటి మధురనాదాలు వాళ్లెప్పుడూ వినలేదు మరి.

            హాన్ నవ్వుకున్నాడు.

            నదిలో వెయ్యిదీపాల నీడలు ప్రతిబింబిస్తున్నాయి.

            కాని వస్తువుకూ, ప్రతిబింబానికీ అంతరం అంతరించిపోయింది. ఈనాడు చూస్తున్న ఈ దీపోత్సవమూ ఆనాడు వాచస్పతితో కలిసి తొలిసారిగా చూసిన దీపోత్సవమూ ఒకలాంటి దృశ్యాలు కావు. ఒకే దృశ్యం.

హెర్మాన్ కార్ల్ హెస్సే

(2 జూలై 1877 – 9 ఆగస్టు 1962) ఒక జర్మన్-స్విస్ కవి మరియు నవలా రచయిత. 1946 సాహిత్య నోబెల్ బహుమతి గ్రహీత. ప్రాచ్య మత, ఆధ్యాత్మిక మరియు తాత్విక సంప్రదాయాలపట్ల ఆయనకున్న ఆసక్తి జంగియన్ విశ్లేషణతో ఆయనకున్న ప్రమేయంతో కలిసి, ఆయన సాహిత్య కృషిని తీర్చిదిద్దడంలో దోహదపడింది.

హెస్ తన జీవితకాలంలో జర్మన్ మాట్లాడే దేశాలలో విస్తృతంగా చదవబడిన రచయిత, కానీ అతని మరణం తర్వాత కొన్ని సంవత్సరాలకే, అంటే 1960ల మధ్యలో, అతని రచనలు యునైటెడ్ స్టేట్స్, యూరప్ మరియు ఇతర ప్రాంతాలలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి తరం పాఠకులలో విపరీతంగా ప్రాచుర్యం పొందినప్పుడు మాత్రమే అతనికి మరింత శాశ్వతమైన అంతర్జాతీయ ఖ్యాతి లభించింది.

ముక్తవరం పార్థసారథి

సుప్రసిద్ధ కథకుడు, నవలాకారుడు, అనువాదకుడు ప్రగతిశీల మేధావి ముక్తవరం పార్థసారథి గారు జులై 7, 1944 న భువనగిరిలో జన్మించారు. అసంఖ్యాకమైన ప్రపంచ ప్రసిద్ధ కథలను తెలుగులోకి అనువదించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. జాక్ లండన్, బాల్జాక్ వంటి ప్రసిద్ధ రచయితల జీవితాలను, వాళ్ళ రచనలను తెలుగువాళ్లకి పరిచయం చేశారు. కథ, నవల, విమర్శ, వ్యాస రచన, సాహిత్య చరిత్ర, అనువాదం ఇలా ప్రతి ప్రక్రియలోనూ పార్థసారథిగారు తమదైన ముద్రవేశారు. రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం చేసి పదవీవిరమణ చేసారు. ఈ సంవత్సరం మార్చ్ 4 న ఈలోకం నుంచి సెలవు తీసుకున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *