వర్షం జైలు గోడలతో పాటు కాలాన్నీ తడుపుతున్నట్టు ఏకాగ్రతతో కురుస్తోంది.
ఏ జైలు ట్రయల్ బ్యారక్‌లోనైనా నిద్ర అందరికీ ఒకేసారి రాదు. కొందరి తీర్పు ముందే వచ్చేస్తుంది. కొందరికి శిక్ష పడకముందునుంచే మొదలవుతుంది. కొందరికి అసలు నిద్ర ఎప్పటికీ రాదు.
ఇనుప తలుపు కీచుమన్నది.
వార్డెన్ ఒక స్త్రీని లోపలికి నెట్టి
“కొత్తది”
అని తలుపు మూసేసింది.
ఆ కొత్తామె వంటినుంచి పోలీస్ స్టేషన్ వాసన వస్తోంది. చెదిరిపోయిన జుట్టు ఆమె బతుకు చింపిరి అని చెపుతున్నట్టుంది. చీర అంచు నిండా మట్టి మరకలు. కుడి మణికట్టు మీద బేడీల చారికల తాజాదనం ఇంకా పోలేదు.
అన్నీ కలిపి ఏదో కథ చెపుతున్నాయి. బ్యారక్‌లో ఉన్న ఐదుగురూ ఆమెవైపు చూశారు.
ఆ చూపుల్లో జాలి లేదు.
అసహ్యమూ లేదు.
కుతూహలమూ లేదు.
ఇలాంటి సందర్బాలు మాకు అలవాటేలే అనే నిర్లిప్తచూపులవి.
కొత్తగా వచ్చినామె గోడ పక్కకు వెళ్లి ఉలుకూ పలుకూ లేకుండా కూచుంది.
ఎవరూ మాట్లాడటంలేదు.
కేవలం చినుకుల చప్పుడు.
చివరకు
“ఏ రకంగా?”
ఓ మూలన కూర్చున్న తెల్లజుట్టావిడ అడిగింది.
కొత్తావిడ తలెత్తి చూసింది.
అర్థం కాలేదు.
మరో స్త్రీ నవ్వింది.
“ఇక్కడ కేసు అడగరు. ఎలా అనే అడుగుతారు “
“విషమా?”
“పామా?”
“కుక్కరా?”
అందరూ తలా ఓ ప్రశ్న వేసారు.
“బ్లూ డ్రమ్ లో సిమెంటా?”
“లోయలోకి తోసావా?”
వెటకారంగా అడిగినట్టున్న ఆ ప్రశ్నల్లో కొండంత విషాదం ఉంది.
కొత్తావిడ వణుకుతున్న పెదవుల్లోంచి “…దిండు”
అంది.
“మొదటిసారా?” అని ఇంకొకరు అడిగారు.
“హత్య”
“…అవును”
“మొదటి హత్య ఎప్పుడూ చేతులతోనే జరుగుతుంది “
ఆ మాట అన్నది నల్లటి కళ్లున్న పలచటి మహిళ. ఆమె స్వరంలో విచిత్రమైన ప్రశాంతత ఉంది. కొత్తావిడ ఆమెను చూస్తూ
“తర్వాత అలవాటైపోతుందా?” అంది అమాయకంగా.
ఆ మహిళ చిరునవ్వు నవ్వుతూ
“అవును, అవుతుంది, హత్య కాదు, పశ్చాత్తాపం “
అన్నది.
కొత్తగా వచ్చిన మహిళకు వాళ్లంతా కొంచెం విచిత్రంగా అనిపించారు. వాళ్లను గత వారం రోజులుగా చూస్తున్న జైలర్ రాఘవేంద్రకు మాత్రమే తెలుసు వాళ్ల గురించి. వాళ్ల కథల గురించి. ఆ విచిత్రం లోతు గురించి.
సీతది ఆత్మరక్షణ సమస్య.
నసీమాది ఆర్థిక దోపిడీ.
మాధవిది దీర్ఘకాలిక మానసిక హింస.
లావణ్యది కోరిక, స్వార్థం, నైతిక సంక్లిష్టత.
రేణుక సమస్య మానసిక అయోమయం, పిల్లల హత్య వరకు పరుచుకున్న చీకటి. అదీ ఆ ఐదుగురి సంక్షిప్త రక్తచరిత్ర.
…….
జైలు సైరన్ తెల్లవారు ఝాము మౌనాన్ని చెరిపేస్తూ మోగింది.
బ్యారక్ తలుపు తెరుచుకుంది.
జైలర్ లోపలికి వచ్చాడు.
వయసు యాభైకి పైనే ఉండొచ్చు.
బలంగా మెలితిరిగిన మీసాలు.
గంజి చొక్కా ఇస్త్రీ మడతలాగే అతని ఆలోచనలు కూడా నిగడతీసుకుని ఉంటాయని అందరూ చెప్పుకుంటుంటారు.
అతను కొత్త ఖైదీ ఫైల్ తెరిచాడు.
పేరు చదివాడు.
“మాధవి, భర్త హత్య కేసు, నిజమేనా?”
అతను ఫైల్ మూసేశాడు.
మాధవి తల ఊపింది.
“ఎందుకు?”
ఆమె సమాధానం చెప్పలేదు.
రాఘవేంద్ర అందరినీ చూస్తూ నవ్వాడు.
“అదే…మీ అందరికీ అదే ప్రశ్న. మీరు కూడా ఒక్కొక్కరు ఒక్కో కత చెప్పారు.
కోర్టులో.
పోలీసులకు.
మీ లాయర్లకు.
ఇప్పుడు ఇంకో కత సిద్ధం చేస్తారా?”
కథ అనకుండా కత అనే మాటను వత్తి పలికాడు.
ఓ మూలన కూర్చున్న నసీమా సూటిగా అడిగింది.”సార్…
మీకు పెళ్లయిందా?”
జైలర్ వంకరగా
” ఎందుకో?” అన్నాడు.
“మీకు పెళ్లి అయి ఉంటేనే
మా కతలు అర్థమవుతాయి”
అన్నది నసీమా. తను కూడా కత అనే మాటను వత్తి పలుకుతూ.
రాఘవేంద్ర గుంభనంగా నవ్వాడు.
” అయింది”
“ఆవిడ?”
“బతికే ఉంది “
“మీతోనే ఉందా?”
ఈ ప్రశ్నకు జైలర్ ముఖం మరింత బిగుసుకుంది.
“లేదు. అయినా అది నా వ్యక్తిగత విషయం” అన్నాడు.
నసీమా చిరునవ్వు నవ్వింది.
“అదే సార్…
మా హత్యలూ మా వ్యక్తిగత విషయాలే ” బ్యారక్‌లో గాలి స్థంభించింది.
రాఘవేంద్ర కొంచెం గ్యాప్ ఇచ్చి
” వ్యక్తిగతమా?
హత్య ఎప్పుడూ వ్యక్తిగతం కాదు.
ఒక ప్రాణాన్ని తీసిన మరుక్షణం అది సమాజానిదే “
అప్పటివరకు మౌనంగా ఉన్న తెల్లజుట్టు సీతమ్మ మాట్లాడింది.
” సరే సారూ
అయితే…
ఒకడు కొన్నేండ్ల పాటు దినాం ఇంకో మడిసి పేణాలు కొంచెం కొంచెంగా తీత్తుంటే…
అది కూడా సమాజం ఇషయమేనా?”
“అందుకే చట్టం ఉంది ” జైలర్ వెంటనే అన్నాడు.
“చట్టం…
మా కొంప దర్వాజ మూసినంక లోపలినికి వస్తదా సారూ. నా పడగ్గదిలోకి ఏనాడూ రాలేదే. నా వంటింట్లోకి రాలేదే
“
రాఘవేంద్ర సమాధానం చెప్పలేదు.
ఫైల్ మూసి బయటకు నడిచాడు.
తలుపు దగ్గర ఆగి తిరిగి చూసి అన్నాడు.
“మీ అందరూ ఒకే తప్పు చేసారు.
మీ భర్తలు మీ జీవితాలను నరకం చేసి ఉండొచ్చు.
అంత మాత్రాన వాళ్లను చంపే హక్కు మీకు లేదు”
ఈసారి లావణ్య నవ్వింది.
” మేమూ అదే అనుకుంటున్నాం సార్, మమ్మల్ని హత్యలదాకా తీసుకెళ్లే హక్కు కూడా వాళ్లకు లేదు “
రాఘవేంద్ర కనుబొమ్మలు ముడిచాడు.
“ఇదేదో గొప్ప ఉమెన్ లిబ్ అనుకుంటున్నారా?” అన్నాడు కోపంలాంటి అసహనంతో.
“లిబరేషన్ అంటే
చనిపోవడం, చంపడం కాదు సార్.
ఎవ్వరూ చనిపోవాల్సిన అవసరం లేకపోవడం ” లావణ్య అంది.
ఏడు ఊచల తలుపు మళ్లీ మూసుకుంది.
కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు.
కొత్తగా వచ్చిన మాధవి నెమ్మదిగా అడిగింది.
“మీరు… నిజంగానే పశ్చాత్తాప పడుతున్నారా?”
ఎవరూ వెంటనే జవాబు చెప్పలేదు.
ఆగిన వర్షం మళ్లీ మొదలైంది.
సీతమ్మ గోడకు ఆనుకుని కూర్చుంది.
“పశ్చాత్తాపమా?
ఉంది.
కానీ వాడ్ని సంపినందుకు కాదు అంత ఆలీసంగా సంపినందుకు “
ఆ మాట వినగానే బ్యారక్‌లో కూర్చున్న నలుగురు మహిళలు ఒకేసారి ఆమెవైపు చూశారు.
ఎవరి ముఖంలోనూ అంగీకారం లేదు.
ఎవరి ముఖంలోనూ వ్యతిరేకత లేదు.
మాధవి మాత్రం ఆ మాటను ఇంకా జీర్ణించుకోలేదు.
కానీ మూలన మోకాళ్లు దగ్గరకు లాక్కుని కూర్చున్న రేణుక మాత్రం తలెత్తి చూస్తూ
“అది తప్పు “
అన్నది.
సీతమ్మ ఆమెవైపు ప్రశ్నలా చూసింది.
“ఆలస్యంగా చంపానని చెప్పడం “
సీతమ్మ చిన్న నవ్వు నవ్వింది.
“ఎందుకంటే… నువ్వు హత్యను సమర్థించుకుంటున్నావు”
బ్యారక్ లో చీమ చిటుక్కుమన్న చప్పుడు.
లావణ్య వెంటనే జోక్యం చేసుకుని
“ఇక్కడ మనందరం హంతకులమే.
కానీ…
మనం ఎవరి తరఫునా వకాల్తా పుచ్చుకోం “
ఆ మాటకు అందరూ తల ఊపారు.
మాధవికి ఏదో అర్థమైంది.
ఈ బ్యారక్‌లో ఎవరూ ఎవ్వరినీ పవిత్రులుగా చూడడం లేదు.
ఎవరూ ఎవ్వరినీ రాక్షసులుగానూ చూడడం లేదు అని.
…..
ఉదయం అల్పాహార వేళ.
అల్యూమినియం గిన్నెల్లో పలుచటి ఉప్మా.
జైలర్ స్వయంగా వచ్చి పంపిణీని చూస్తున్నాడు.
“కొత్తావిడకి ఎక్కువ పెట్టండి “
వార్డెన్ కొంచెం ఎక్కువ వేసింది.
మాధవి గిన్నె తీసుకుంది.
తినలేదు.
రాఘవేంద్ర గమనించాడు.
“తిను”
అన్నాడు .
ఆమె తల ఊపింది.
“ఆకలి లేదు “
“ఆకలి లేకపోయినా తినాలి “
నసీమా నవ్వింది.
” అది కూడా పెళ్లి తర్వాతే నేర్చుకున్నాం సార్ “
రాఘవేంద్ర ఆమె వైపు తిరిగాడు.
“మళ్లీ మొదలుపెట్టొద్దు, ప్రతి మాటకూ మగాళ్లనే తీసుకురావద్దు “
నసీమా గిన్నె కింద పెడుతూ
” మేమేం తీసుకురావట్లేదు సార్?
మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి కారణమే వాళ్లు “
రాఘవేంద్ర వెంటనే అన్నాడు.
“కాదు.
మీరు చేసిన నేరం. మీ వెనుక ఉన్న వేరే మగాళ్లు “
నసీమా వెంటనే రియాక్ట్ అయింది. ” ఏంటి సార్, మా వెనుక ఉన్న మగాళ్లా.
నిర్దారణకొచ్చేసారా మేం వేరే మగాళ్ల మోజులో పడి ఈ హత్యలు చేసామని, అయినా మీరన్నట్టుగా మా వెనుక మగవాళ్లు ఉంటే ఉండొచ్చు. లేకపోనూ వచ్చు. మేం నిజంగానే వేరే మగవాడి దగ్గరికి వెళ్లి ఉంటే అందుకు కారణం మా మొగుళ్లు కాదా. ఒక మగవాడ్ని వదిలించుకోవాలనుకుంటున్న మేం ఇంకో మగవాడి దగ్గరకే ఒకవేళ వెళితే ఆ తప్పు ఎవరిది సార్. మమ్మల్ని మగవాడు అనే ఊతం లేకుండా బతకనివ్వని మీలాంటి వాళ్లది కాదా. ఒంటరిగా ఉండాలనుకున్నా ఉండనిచ్చారా. అయినా ఉంటూనే ఉన్నాం. అన్నీ భరిస్తూ సహిస్తూ ” ఆవేశంగానే అన్నది.
జోక్యం చేసుకుని లావణ్య మాట్లాడింది.
” సార్…
ఒక ప్రశ్న అడుగుతాను ఏమీ అనుకోవద్దు, మీరు మమ్మల్ని ప్రస్తావించాల్సి వచ్చినపుడల్లా మా పేర్ల బదులు కుక్కర్, స్లో పాయిజన్, పాము, బ్లూ డ్రమ్, లోయ అంటున్నారట “
” అవును అలానే ప్రస్తావిస్తున్నాను, నేను ప్రధానంగా మగవాడ్ని, నేను మీ చుట్టూ ఉండే సమాజాన్ని కూడా , ఒక మగవాడు, ఒక సమాజం మిమ్మల్ని ఎలా ప్రస్తావిస్తోందో నేనూ అలానే ప్రస్తావిస్తున్నాను, ఏం తప్పా”
” తప్పు కాకపోవచ్చు సార్ కానీ “హింస” “భయం?”
“ఆర్థిక బంధనం”
“శరీరాన్ని వస్తువులా చూడటం” ఇవి కూడా పెట్టుడు పేర్లు కావచ్చు సార్.
“వీటన్నింటికీ చట్టంలో సెక్షన్లు ఉన్నాయి .
వీటిని ఎప్పుడయినా నిక్ నేమ్స్ చేసారా. కానీ…
ఒక మనిషిని రోజూ కొంచెం కొంచెంగా ముక్కలు చేస్తుంటే సెక్షన్ ఏది?, ప్రతిరోజూ రాత్రి పక్కలో ఉండే పాము ఏది “
రాఘవేంద్ర నేరుగా ఆమె కళ్లలోకి చూశాడు
” అందుకని చంపేయాలా?”
లావణ్య వెంటనే అంది.
“లేదు.
అందుకే అడుగుతున్నాను.
హత్య మొదటి అడుగు ఎప్పుడు అని? ”
“
మీరు మగజాతికి, సమాజానికి ప్రతినిధిని అని గర్వంగా చెప్పుకుంటూ ఈ రకం హత్యలన్నింటికీ మమ్మల్ని ప్రతినిధులుగా చేసేసారు సార్. ప్రతి సందర్బాన్నీ వేర్వేరుగా చూడండి. అన్నింటినీ ఒకే గాట కట్టి ముద్దుపేర్లు పెట్టకండి “
జైలర్ జవాబు చెప్పకుండా వెళ్లిపోయాడు.
హత్య మొదటి అడుగు ఎప్పుడు అనే ప్రశ్న మాధవిని ఆలోచనల్లోకి నెట్టింది. నిజమే కదా, నేను చేసిన హత్య ఎప్పుడు మొదలయిందో అని మనసులోనే అనుకుంటూ
మాధవి మెల్లగా సీతమ్మను అడిగింది.
“నీ భర్త ఏం చేసేవాడు?”
సీతమ్మ చాలాసేపు మాట్లాడలేదు.
తర్వాత కిటికీ బయటే చూస్తూ చెప్పింది.
“ఎవసాయం “
ఆ ప్రశ్న సీతమ్మను తన కథలోకి నడిపింది.
“ముందుగాల ఆడు శానా మంచోడే.
మా పెళ్లప్పటికి ఆడ్కి మూడెకరాల పొలం
, జత ఎద్దులు,
ఒక పాత ఇల్లు ఉండేవి.
నాకేం పెద్ద పెద్ద ఆశలు లేవు.
పోద్దుగూకినంక ఇద్దరం పొలం కాణ్నుంచొచ్చి సావిట్ల కూసుని అన్నం తింటే గంతే సాలు అనుకున్నా.
అయిదేండ్లు గట్లనే గడిచినయి.
అటెంక వరుసగా మూడేండ్లు వానల్లేవు.
ముందు సొమ్ములు అమ్మేసిండు. ఆ పైన ఎద్దులు, పొలం ” మాధవి ఊపిరి బిగబట్టింది.
” అప్పు ఇచ్చినవాళ్లు ఇంటికొచ్చేటోళ్లు.
ముందుగాల డబ్బే అడిగేటోళ్లు.
నన్ను తేడాగా చూసేటోళ్లు.
ఒకడు నవ్వుతూ అన్నాడు ‘డబ్బు లేకపోతే ఇంకోలా తీర్చొచ్చు కదా ‘
నేను లోపలికి ఎళ్లిపోయిన. ఆడు ఏమీ అన్లేదు.
నా మొగుడు కూడా. ఆడట్లా అడగడం కంటే నా మొగుడు మాట్లాడకపోవడమే ఎక్కువ నొప్పి పెట్టింది. “
బ్యారక్‌లో అందరూ కేవలం వింటున్నారు.
” అయాల రాత్రి నేను గదే అడిగిన.
‘ఏం మాట్లాడలేదేం అని?’
‘మన పరిస్థితి చూడు.’
అన్నాడతను. అంతే.
ఆ రోజు మొదటిసారి…
నా కాపురం నాకు కాపురంలా అనిపించలేదు”
సీతమ్మ గొంతు కొద్దిగా బొంగురుపోయింది.
” అప్పు ఇచ్చినోడు ఊర్కూర్కె రావడం మొదలెట్టాడు.”
ఆమె మాట అక్కడే ఆగిపోయింది.
మాధవి ఎదురు చూస్తోంది.
నసీమా కళ్లు మూసుకుంది.
రేణుక ముఖం తిప్పుకుంది.
లావణ్య మాత్రం సీతమ్మనే చూస్తోంది.
అప్పుడే ఇనుప తలుపు గట్టిగా చప్పుడైంది.
జైలర్ రాఘవేంద్ర లోపలికి వచ్చాడు.
“సీతమ్మా, నీ లాయర్ వచ్చాడు,
రా “
సీతమ్మ మెల్లగా లేచింది.
తలుపు దగ్గరకు వెళ్లి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది.
మాధవిని చూసి అంది “కథలు ఎప్పుడూ హత్యతో మొదలవవమ్మా, ఎవరో మొదట్ల గమ్మున ఉన్న దినాన మొదలయితయి”
ఆమె జైలర్ వెంట బయటకు నడిచింది.
బ్యారక్ తలుపు మళ్లీ మూసుకుంది.
మాధవి చాలాసేపు ఆ తలుపునే చూస్తూ నిల్చుంది.
లావణ్య మెల్లగా అంది
“ఆమె కథ ఇంకా మొదలే కాలేదు”
………
సాయంత్రానికి వాన పూర్తిగా ఆగిపోయింది.
బ్యారక్‌లో మాటలు ఇంకా చెమ్మగానే ఉన్నాయి. జైలు ప్రాంగణంలో నిలిచిన నీళ్లలో ఇనుప కంచెల నీడలు పొడవుగా పడుతున్నాయి.
మాధవి కిటికీ దగ్గర నిలబడి బయట చూస్తోంది.
“లాయర్ ఏం చేస్తాడు?” అంది.
లావణ్య నవ్వింది.
“నిజాన్ని కుదిస్తాడు. లేదా అబద్ధాన్ని సాగదీస్తాడు”
నసీమా అంది.
“కోర్టులో జీవితాలను వినరు.
ఒక సంఘటన మాత్రమే ఉంటుంది “
అప్పుడే సీతమ్మ తిరిగి వచ్చింది.
ఆమె ముఖంలో మార్పేమీ లేదు.
వచ్చి తన పాత చోటే కూర్చుంది అదేదో తనది మాత్రమే అన్నట్టు.
మాధవి అడిగింది.
“ఏమన్నాడు లాయర్?”
“నిజం సెప్పొద్దన్నాడు”
సీతమ్మ కొనసాగించింది.
” ‘నీ మీద జాలి కలిగే నిజాలే చెప్పు.
మిగతావి ఇడిసెయ్ ‘ అన్నాడు
“
నసీమా చప్పున అంది.
“నిజాన్ని గంపకింద కమ్మేయాలనమాట”
…….
రాత్రి భోజనం అయిపోయింది.
వార్డెన్ లైట్లు ఆర్పేసింది.
కిటికీలోంచి వచ్చే పలచటి వెన్నెల వెలుగు మాత్రమే బ్యారక్‌లో మిగిలింది.
అలాంటి వెలుతురులో మనుషుల ముఖాలు కాదు వాళ్ల అలసట మాత్రమే కనిపిస్తుంది.
మాధవి నిద్రపోలేకపోతోంది.
“సీతమ్మా…మీ కథ పూర్తికాలేదు.”
సీతమ్మ నెమ్మదిగా ఊపిరి తీసుకుంది.
“ఏ కథా ఒడవదమ్మా. నువు ఇనాలనుకునేడ్ది సంపుడు.
నేను ‘సెప్పాలనుకునేడ్ది జీవితం “
“అదే చెప్పండి.”
సీతమ్మ కొద్దిసేపు మౌనంగా ఉంది.
ఆ పై
ఆమె మాటల్లో మళ్లీ ఆ ఊరు కనిపించడం మొదలైంది.
“…ఆ అప్పు ఇచ్చినోడి పేరు జగన్నాథమంట.
అందరూ ‘జగన్నాథం గారు’ అనేవారు.
నేను మాత్రం ఎప్పుడూ ‘అప్పు
‘ అనే అనేదాన్ని.
ఆడు ఇంటికొచ్చిన రోజుల్లో మా ఇంటి రంగు కూడా మారినట్టనిపించేది.
నా గది గోడలన్నీ దగ్గరకు కమ్ముకొచ్చినట్టుండేడ్ది. నా ఒళ్లు నాకే కమురు కంపు కొట్టేది. ఒకరోజు నేను వంటింట్లో ఉన్నాను.
వాళ్లిద్దరూ బయట గుసగుసలాడుతున్నారు.
‘రేపు పంపించు ‘
అంటున్నడు అప్పుగాడు.
నా మొగుడు ఏమీ మాట్లాడట్లేదు.
మళ్లీ అదే మాట.
‘రాత్రి పంపించు.’
ఈసారి కూడా సప్పుడు లేదు.
నేను బయటికి వచ్చి అడిగాను.
‘ఎవరిని?’
ఆడు నన్ను చూసి నవ్విండు.
ఇంకో దగ్గరికి అని నాకు తెలుస్తాంది. ‘నీకు చెప్పలేదా?’
అన్నాడు అప్పు. నేను నా మొగుడి వైపు చూశాను. వాడు నేల చూపులు సూస్తున్నడు.
ఆ దినాం మొదటిసారి
నాకు వానిమీద కోపం రాలేదు.
జాలేసింది.”
“జాలా?”
మాధవి ఆశ్చర్యంగా అడిగింది.
“అవును.
ఎవడైనా ఆత్మగౌరవంకంటే కురసైపోతే.. ఆడు ఇంకెవరికీ మొగుడిగా ఉండలేడు”
లావణ్య మెల్లగా అంది.
” అయినా వెళ్లలేదుగా?”
“ఎక్కడికి?”
“ఇంట్లోంచి “
సీతమ్మ నవ్వింది.
“మా ఊళ్ల ఆడోళ్లు ఎళ్లేట్ది రెండే సోట్లకమ్మా.
పుట్టింటికి…
కాకుంటే బొందలగడ్డకి “
ఆ రాత్రి అతను నాతో ఒక మాట అన్నాడు.
‘ ఒక్కసారి వెళ్లిరా,
అప్పు తీరిపోతుంది.’
నేను అతని ముఖం చూసాను.
ఏడుస్తున్నాడు.
అప్పుడు అతను ‘వద్దు’ అంటడేమోనని ఆసపడ్డా.
అనలేదు.
అంతే.
ఆ రాత్రి నేను చనిపోలేదు.
కానీ
నా భర్త చనిపోయాడు. “
రేణుక ఒక్కసారిగా తలెత్తింది.
” అబద్ధం.”
అందరూ ఆమెవైపు చూశారు.
“ఎందుకు?” అని సీతమ్మ అడిగింది.
“ఆ రాత్రే చనిపోయి ఉంటే…
నువ్వు తర్వాత చంపేదానివి కాదు.”
సీతమ్మ నిశ్శబ్దంగా ఆమెను చూస్తోంది.
రేణుక గొంతు కొద్దిగా కంపించింది.
“మనం అందరం ఇదే అబద్ధం చెబుతాం.
‘ అప్పుడే చనిపోయాడు. ‘
‘ ఆ రోజే చనిపోయింది. ‘
కాదు.
వాళ్లు బతికే ఉన్నారు.
అందుకే…
మన చేతుల మీద రక్తం ఉంది.”
ఆ మాట విన్న తర్వాత చాలా సేపు ఎవరూ మాట్లాడలేదు.
మాధవి మొదటిసారి రేణుకను జాగ్రత్తగా చూసింది.
ఈమె…
తనను తాను కూడా విడిచిపెట్టడం లేదు.
బయట నుంచి రాఘవేంద్ర గొంతు వినిపించింది.
“ఏవో మాటలు వినపడుతున్నాయి “. జైలర్ క్వార్టర్ జైలు పక్కనే. అందుకే డ్యూటీ టైంలోనూ డ్యూటీ కాని టైంలోనూ కూడా అతను జైల్లోనే ఉంటుంటాడు. మీరే యావజ్జీవ ఖైదీ సార్ అని నసీమా అంటుంటుంది కూడా.
“సార్…వాళ్లు మాట్లాడుకుంటున్నారు “
వార్డెన్ సమాధానం.
రాఘవేంద్ర తలుపు దగ్గరికి వచ్చి లోపలికి చూడకుండా అన్నాడు.
“చంపిన కథలు చెప్పుకుంటున్నట్టయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చనిపోయిన వాళ్లకు కూడా కథలు ఉంటాయి “
అంటూ వెళ్లిపోయాడు.
అందరి మెదళ్లలో ఆ మాటే సుళ్లు తిరుగుతోంది.
కొద్దిసేపటికి…
లావణ్య నెమ్మదిగా అంది
“అదే కదా అసలు ప్రశ్న”
“ఏది?” మాధవి అడిగింది.
“మన కథల్లో…
వాళ్ల కథ ఎంత ఉంది?”
సీతమ్మ తల వంచుకుంది.
” చాలా ఉంటది. వాళ్లది యుగయుగాల కథ. హింస ఉంటది. దౌర్జన్యం ఉంటది. దేహం ఉంటది. కామం ఉంటది, కట్నం ఉంటది . ఇంకో ఆడది ఉంటది. కిరోసిన్ వర్షాలుంటాయి. ఆడపిండాల గర్బస్రావాలుంటాయి. మన కథలు మొదలయింది వాళ్ల కథల ముగింపుల్లోంచే కదా” లావణ్య అంది.
నసీమా కళ్లు మూసుకుంది.
రేణుక గోడవైపు తిరిగి పడుకుంది.
ఎవరూ జవాబు చెప్పలేదు.
ఎందుకంటే ఆ బ్యారక్‌లో ఉన్న ఐదుగురు మహిళలకు కూడా ఒక సందేహం మొదలైంది.
తమ కథ సరే… తాము చంపిన మనిషి కథ సంగతేంటి ?
” తరతరాలుగా స్త్రీ కూడా సహించి, నిరసించి, తిరగబడి, పోరాడి అంచెలంచెల ప్రయాణం అనంతరం విసిగి వేసారి హింసనే ఆశ్రయించిందా. ఏమో ” నసీమా గొణుక్కుంది.
……….
మరుసటి ఉదయం.
వర్షం లేదు.
జైలు ప్రాంగణంలో తడి నేల మీద కాకులు గెంతుతున్నాయి.
రాఘవేంద్ర ఒక ఫైల్ పట్టుకుని బ్యారక్‌లోకి వచ్చాడు.
“నసీమా”
ఆమె తలెత్తి చూసింది.
“నీ కేసు డైరీ నిన్న రాత్రి చదివాను “
ఆమె నవ్వలేదు.
“చదవడానికే రాశారు సార్”
అన్నది.
రాఘవేంద్ర ఫైల్ తెరిచాడు.
బిగ్గరగా చదవడం ప్రారంభించాడు.
“నిందితురాలు నసీమా బేగం గత ఆరు నెలలుగా తన భర్త ఆహారంలో స్వల్ప మోతాదులో విషపదార్థం కలుపుతూ వచ్చింది. భర్త మరణానంతరం కుటుంబ ఆస్తి ఆమె పేరుకు బదలాయించే అవకాశం ఉండడంతో, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్యగా దర్యాప్తులో తేలింది “
ఫైల్ మూసేశాడు.
“ఏదైనా తప్పుందా ఇందులో?”
నసీమా నెమ్మదిగా అతని కళ్లలోకి చూసింది.
“ఉంది”
“ఏమిటది?”
“విషం గురించి అన్నీ రాశారు.
విషం పుట్టిన చోటు రాయలేదు”
సర్ మీకు అర్దం అయినా కాకున్నా ఆ చోటు గురించి ఒక కథలాగా చెపుతాను వినండి అని మొదలు పెట్టింది.
నాకు
పెళ్లయిన మొదటి సంవత్సరం భర్త అంటే భయమూ కాదు, ప్రేమా కాదు ఒక అలవాటు అని తెలిసొచ్చింది. అతడు మెకానిక్. రోజూ చేతుల నిండా గ్రీజుతో ఇంటికొచ్చేవాడు. మొదట్లో నవ్వేవాడు. తర్వాత నవ్వడం మానేసి తాగడం మొదలుపెట్టాడు. తాగాక పేకాట. పత్తాల వల్ల అప్పులు.
మొదట అమ్మింది బంగారం.
తర్వాత కుట్టుమిషన్.
ఒకరోజు ఇంట్లో ఉన్న ఫ్రిజ్ కూడా కనిపించలేదు.
“అప్పు తీర్చాను” అన్నాడు.
నేనేమీ అనలేదు.
ఇవన్నీ సహించడం అలవాటు చేసుకున్నాను కనుక పెద్దగా భారం అనిపించడం లేదు. పైగా అతనికి ఆ యావ ఎక్కువ. వేళా పాళా, అవతలి వ్యక్తి మానసిక స్థితి, ఆరోగ్యం వంటి విషయాలేమీ పట్టవు. తన వేడి తను దింపేసుకోవడమే. నేను దానికీ అలవాటు పడిపోయాను. కానీ ఓ రాత్రి ” నువు మీ అమ్మకు చాలా చిన్న వయసులోనే పుట్టావనుకుంటా కదా” అన్నాడు ఉన్నట్టుండి.
అవును. అన్నాను. “నాకు మీ అమ్మ మీద మనసవుతుందోయ్ కొద్ది రోజులుగా అడుగుదాం అనుకుంటున్నాను. అమ్మకు చెప్పు, లేకుంటే నీకూ నాకూ చెల్లు ” అన్నాడు వంకర నవ్వుతో. నాకేం అర్దం కాలేదు. గుండెలో ఏదో అడ్డుపడ్డట్టయింది. మాట రాలేదు. ఒక మనిషి మీద అంత అసహ్యం కలుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ సంఘటన తర్వాత నేను మాట్లాడటం తగ్గించాను.
తినడం తగ్గింది.
నవ్వడం మరిచిపోయాను. అప్పుడప్పుడూ అతను ఆ విషయం ప్రస్తావిస్తూనే ఉన్నాడు. ఒక రోజు ఎలుకల మందు కొని తెచ్చాను.
నిజానికి నేనది తెచ్చింది నేను తినడానికే.
పొట్లం తెరిచి చాలాసేపు చేతిలో పట్టుకున్నాను కానీ తినలేకపోయాను.
అదే పొట్లాన్ని డబ్బాలో దాచేసా.
వారం గడిచాక మళ్లీ అదే ప్రస్తావన.
ఈసారి నాకు కోపం రాలేదు.
అసహ్యం కూడా కలగలేదు.
డబ్బాలో ఉన్న పొట్లం మాత్రమే గుర్తొచ్చింది.
ఆ రోజు నుంచి ప్రతిరోజూ చిటికెడు
అతనికి బాగా ఇష్టమైన మటన్ కూరలో కలిపాను.
ఆరు నెలలు.
అతడు ఒక్కరోజూ సందేహించలేదు.
చనిపోయే ముందు రోజు మాత్రం”ఇప్పుడే నువ్వు మంచి భార్యలా కనిపిస్తున్నావు” అని నవ్వుతూ అన్నాడు.
మరుసటి ఉదయం అతను లేవలేదు.
బ్యారక్‌లో చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు.
మాధవి మొదట అడిగింది.
“నువ్వు… అతడిని ప్రేమించేదానివా?”
నసీమా చాలాసేపు ఆలోచించింది.
“మొదట , తర్వాత్తర్వాత…
భయపడేదాన్ని”
లావణ్య వెంటనే అడిగింది.
” అయినా విషమే ఎందుకు?”
“ఎందుకంటే…
కత్తి పట్టే ధైర్యం నాకు లేదు, పైగా అలవాటైన పనేం కాదు కదా”
“విడాకులు?”
నసీమా చిరునవ్వు నవ్వింది.
” నా దగ్గర లాయర్ ఫీజు కాదు కదా, ఆ రోజు రాత్రి బతికే డబ్బు కూడా లేదు “
రేణుక ఒక్క మాట అంది
“అయినా… ఆరు నెలలు.”
నసీమా తల ఊపింది.
“అవును.”
“అంటే ప్రతిరోజూ నిర్ణయం తీసుకున్నట్టే “
“కాదు. ప్రతిరోజూ నిర్ణయం మార్చుకోలేకపోయాను.”
ఆ ఒక్క వాక్యానికి బ్యారక్ కూడా ఉలిక్కిపడింది.
రాఘవేంద్ర లేచాడు.
ఫైల్ చేతిలోనే ఉంది.
” ఇది అంతా నిజమే అనుకుందాం “
నసీమా ఏమీ అనలేదు.
“అయినా… హత్యే కదా?”
అదే మాట బయటకే అనేసాడు.
నసీమా క్షణం కూడా ఆలస్యం చేయకుండా అన్నది ” హత్య కాదని నేననడం లేదు. నాది తప్పే అని కూడా నేను అంగీకరిస్తాను. నాకు పడబోయే శిక్షను కూడా నేను బాధ్యతగానే అనుభవిస్తాను. చంపినందుకు రవ్వంత కూడా బాధ లేదు, కానీ ఆ విషం ఎక్కడనుంచి పుట్టిందో అర్దం చేసుకొమ్మంటున్నాను అంతే “
అదే ప్రశ్నను గోడకు ఆనుకుని కూర్చున్న లావణ్య కూడా తనకు తానే వేసుకుంది.
రాఘవేంద్ర వెళ్లిపోయాక చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు.
చివరికి లావణ్యే మౌనాన్ని చెరిపింది.
“నసీమా…నీ కథలో…
నాకు ఒక సౌకర్యం కనిపించింది”
అందరూ ఆమెవైపు చూశారు.
“సౌకర్యమా?ఏమిటది?”
“నీ భర్త చెడ్డవాడు”
నసీమా ముఖం బిగుసుకుంది.
లావణ్య కూల్ గా కొనసాగించింది.
” నీ కథ విన్నవాళ్లలో చాలా మంది నీమీద జాలి పడతారు. నా కథలో ఆ సౌకర్యం లేదు”
మాధవి అయోమయంగా చూసింది.
“అంటే?” లావణ్య నవ్వింది.
“నా భర్త మంచి మనిషి”
బ్యారక్‌లో ఉన్న ఐదుగురూ ఒక్కసారిగా ఆమెవైపు చూశారు.
నా భర్త రమేష్ నన్ను ఎప్పుడూ కొట్టలేదు.
తిట్టలేదు.
తాగి ఇంటికిరాలేదు.
నా జీతాన్ని అడగలేదు.
పెళ్లయిన పదేళ్లలో ఒక్కసారి కూడా అనుమానించలేదు.
అందరూ అతన్ని మంచి భర్తగానే చూశారు.
కానీ సమస్య ఇంకోచోటుంది.
రమేష్ జీవితంలో ప్రతిదానికీ ఒక క్రమం ఉంది.
ఉదయం ఆరు గంటలకు లేవడం.
ఏడు గంటలకు పేపర్.
తొమ్మిదికి ఆఫీసు.
రాత్రి తొమ్మిదికి భోజనం.
పది గంటలకు నిద్ర.
ఆ క్రమంలో నిద్రకు ముందు కాంక్షగా నేను కూడా ఉన్నాను.
కానీ
ఒక మనిషిగా కాదు.
ఒక కాలక్రుత్యంగా.
పుట్టినరోజు మరిచిపోడు.
పెళ్లిరోజు మరిచిపోడు.
కానీ
నా కళ్లలో దుఃఖం ఎప్పటి నుంచి ఉందో మాత్రం ఎప్పుడూ అడగలేదు.
ఒకసారి నాకు తీవ్రంగా జ్వరం వచ్చింది.
మూడు రోజులు నీరసంగానే ఉన్నాను.
రమేష్ సెలవు పెట్టలేదు.
పక్కింటి ఆంటీ వచ్చి మందులు వేసేది.
సాయంత్రం వచ్చిన రమేష్ ఒక్క మాట మాత్రం అన్నాడు ” డాక్టర్ దగ్గరకు వెళ్లావా?”
“లేదు “
“ఎందుకు?”
“నువ్వు లేవు “
“నేనెందుకు, నాకోసం ఎందుకు ఎదురు చూశావు?”
అన్న రమేష్ మాటల్లో తప్పేమీ లేకపోవచ్చు.
కానీ ఆ మాటలో నేను లేను కదా.
నా మీద ప్రేమ లేదు కదా. ఆ రోజు మొదటిసారి నాకు నేనే పరాయిగా అనిపించాను.
అదే టైంలో కొలీగ్ అరవింద్ స్నేహం మొదలైంది. అతను అందగాడు కాదు.
గొప్పవాడూ కాదు.
నేను మూడీగా ఉంటే కంగారు పడేవాడు. నేను కవిత చదివితే వినేవాడు.
నేను నవ్వితే నవ్వేవాడు. నవ్వకపోతే నవ్వించడానికి ప్రయత్నించేవాడు. మొదట నాలుగు మాటలు.
ఆ పై కాఫీ.
తర్వాత ప్రేమ.
“విడాకులు తీసుకో”
ఒక రోజు అరవింద్ అనేసాడు. నేను ఆ ప్రయత్నం కూడా చేసాను. రమేష్ కు ఆ విషయం
ఆ రాత్రి చెప్పినపుడు చాలా ప్రశాంతంగానే స్పందించాడు.
” నీ ఇష్టం నువ్వు వెళ్లాలనుకుంటే వెళ్లు.
కానీ…
అమ్మ ఈ వార్త వింటే బతకదు”
మరో మాట కూడా అన్నాడు.
“నేను నిన్ను బలవంతంగా ఉండమని కూడా అనను”
నేను వెళ్లలేదు.
అమ్మ కోసమా.
సమాజం కోసమా
. ధైర్యం లేకనా .
నాకే తెలియదు.
రోజులు గడిచాయి.
అరవింద్ ఒత్తిడి పెరిగింది.
“ఇలా ఎన్నాళ్లు?”
ఒకరోజు అతడే ఐడియా ఇచ్చాడు.
తల మీద కొట్టి చంపి ముక్కలు ముక్కలు చేసి కుక్కర్ లో పెట్టి…ఆ తరువాతదంతా అందరికీ తెలిసిందే.
బ్యారక్‌లో మౌనం.
మాధవి నెమ్మదిగా అడిగింది. నీ కథలో నేను లేను.”
లావణ్య ఆమెవైపు చూసింది.
“అంటే?”
“భయం లేదు.
హింస లేదు.
ఆకలి లేదు.
పిల్లల ప్రాణాలు లేవు.
అయినా
చంపావు. ” లావణ్య అవును
అన్నట్టుగా తల ఊపింది.
“ఎందుకంటే…
నాకు ప్రేమ కావాలి.
“
రేణుక నవ్వింది.
” అది కారణం కాదు.
సాకు “
బ్యారక్ లో ప్రతి ఒక్కరి ఊపిరి చప్పుడు మిగతా అందరికీ వినిపించేలా శూన్యం ఆవరించింది.
లావణ్య కొనసాగించింది.
“అరవింద్ లేకపోయినా…
ఏదో ఒకరోజు నేను ఈ పెళ్లి నుంచి బయటపడాలని అనుకునేదాన్ని.
కానీ హత్య?
అది నా నిర్ణయం.
దాన్ని నేను అరవింద్ మీదో ఇంకెవరి మీదకో తోయలేను “
మాధవి ఆశ్చర్యంగా చూస్తోంది.
“అంటే…
నిన్ను నువ్వే తప్పుపట్టుకుంటున్నావా?”
లావణ్య చిన్నగా నవ్వింది.
“ప్రతిరోజూ.”
“పశ్చాత్తాపమా?”
“సిగ్గు “
” నాకు లావణ్య భర్తలో లోపం ఏమీ కనపడడం లేదు. అతనిని ఎందుకు” ….మాట మధ్యలో ఆపింది సీతమ్మ.
అన్నీ పద్దతిగా ఉండడం ఎంత చికాగ్గా ఉంటుందో అనుభవించిన నాకు మాత్రమే తెలుసు. జీవితంలో ఎంతో కొంత అవకతవక తనం ఉండాలి. జీవితంలో పగుళ్లుండాలి, విభేదాలుండాలి, గొడవలుండాలి, చిరాకులుండాలి…నేనిలా మాట్లాడడం చాలా మందికి జీర్ణం కాకపోవచ్చు, టైం టేబుల్ లాగా జీవించడం చాలా బాధాకరం. అది నాకు తెలిసొచ్చింది. దాన్ని నేను భరించలేకపోయాను. “
అప్పుడే తలుపు బయట నుంచి రాఘవేంద్ర బూట్ల చప్పుడుతో పాటు అతని స్వరం వినిపించింది.
“లావణ్యా నీ ప్రియుడు అరవింద్ అప్రూవర్ గా మారాడు” అందరూ బిక్క మొఖం వేసారు.
లావణ్య ముఖంలో మాత్రం రంగులు మారాయి.
“అంటే?”
“నేరం అంతా నీ మీదకే తోసేస్తూ కోర్టుకు వాంగ్మూలం ఇచ్చాడు “
రాఘవేంద్ర కాసేపు ఆగాడు.
” ఇలాంటి ప్రేమ
సాక్ష్యంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదులే, సహజమే”
అంటూ వెళ్లిపోయాడు.
లావణ్య గోడకు ఆనుకుని
కళ్లు మూసుకుంది.
నసీమా నెమ్మదిగా అంది
” అతను నిన్ను ప్రేమించలేదా?”
లావణ్య కళ్లు తెరవలేదు.
“ప్రేమించాడు. కానీ తనను తాను ఎక్కువ ప్రేమించుకున్నాడేమో “
.
ఈసారి…
ఆ నిశ్శబ్దంలో ఎవరూ లావణ్యను సమర్థించలేదు.
అలా అని ఆమెను పూర్తిగా ఖండించనూ లేదు.
ఎందుకంటే…
ఆమె కథలో బాధ ఉంది.
అయితే…
బాధ నిర్దోషిత్వానికి ఎలిబీ కాదు.
ఆ రాత్రి బ్యారక్‌లో ఎవరికీ నిద్ర పట్టలేదు.
లావణ్య కథ ముగిసినా, ఆమె చివరి మాట మాత్రం ఇంకా గోడల్లోంచి ప్రతిధ్వనిస్తూనే ఉంది.
“ప్రేమించాడు… తనను తానే ఎక్కువ “
మాధవి రేణుకవైపు చూసింది.
“నువ్వేం చెప్పలేదు”
రేణుక నేల మీద వేళ్లతో గీతలు గీస్తోంది.
“ఏం చెప్పను?”
“నీ కథ.”
“అది కథ కాదు. శిక్ష”
నసీమా మెల్లగా అంది.
“మనందరిదీ అదే “
రేణుక తల అడ్డంగా ఊపింది.
“మీరు మీ భర్తలను మాత్రమే చంపారు ” ఆమె గొంతు ఒక్కసారిగా జీరవోయింది.
“…నేను నా పిల్లలను కూడా చంపాను “
మాధవి మొదటిసారి రేణుకను భయంగా చూసింది.
రేణుక అది గమనించింది.
“అలానే చూడమ్మా. నేను కూడా నన్ను చూసి భయపడతాను”
అంది నవ్వులాంటి ఏడుపుతో.
రేణుకకు
పెళ్లయిన రెండేళ్లకే మొదటి దెబ్బ తగిలింది.
ఆ తర్వాత రోజూ తగిలాయి. దెబ్బలకు కారణాలు మారాయి.
ఉప్పు ఎక్కువైంది.
టీ చల్లారింది.
పిల్లాడు ఏడ్చాడు.
పక్కింటి వాళ్లతో మాట్లాడింది.
చివరికి
ఏ కారణమూ లేకుండా కూడా.
భర్త కోపం ఇంటి వాతావరణంలా మారిపోయింది.
ఆమె దానికీ అలవాటుపడింది.
పిల్లలూ అలవాటుపడ్డారు.
ఏడేళ్ల కొడుకు తండ్రి అడుగుల శబ్దం విన్న వెంటనే చెల్లిని తీసుకుని మంచం కింద దాక్కోవడం నేర్చుకున్నాడు.
ఐదేళ్ల పాపకు “నాన్న వచ్చాడు” అనే మాట ఆనందం కాదు, అదొక హెచ్చరిక.
రేణుక మూడు సార్లు పుట్టింటికి వెళ్లింది.
మూడు సార్లూ తిరిగి పంపించారు.
“పిల్లల కోసం భరించు.”
“మగాళ్లు అంతే.”
“ఇంటి విషయం బయట పెట్టకు.” బుజ్జగింపో బెదిరింపో అర్దంకాని మాటలు.
ఆమె జీవితం మళ్లీ అదే ఇంట్లో మొదలైంది.
ఒకసారి పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది.
డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మొదట భర్తను పిలిచాడు.
ఇద్దరినీ చూసి నవ్వుతూ అన్నాడు
“ఇంట్లో కొట్టుకుంటే ఇక్కడికి వస్తారా?”
ఆమె మళ్లీ వెళ్లలేదు.
రోజులు గడిచాయి.
పిల్లలతో పాటు వాళ్లకు సంబంధించిన భయమూ పెద్దదైంది.
ఒక రాత్రి భర్త తాగి ఇంటికొచ్చాడు.
కొడుకును గోడకేసి కొట్టాడు.
పాపను ఈడ్చి బయటకు విసిరేశాడు.
రేణుక అడ్డుపడింది.
ఆ రాత్రి ఆమెకు కూడా తీవ్రంగా గాయాలయాయి. పిల్లలు నిద్రపోయాక చాలాసేపు వాళ్ల ముఖాలనే చూస్తూ కూర్చుంది.
ఆమె మనసులో ఒక్కటే ప్రశ్న.
“రేపూ ఇదేనా?”
“ఎల్లుండీ?”
“ఇంకా పది సంవత్సరాలూ?”
ఉదయం భర్త ఇంకా నిద్రలోనే ఉన్నాడు.
ఆమె వంటగదిలోకి వెళ్లింది.
మళ్లీ బయటికి వచ్చింది.
చాలాసేపు పిల్లలిద్దరినీ కౌగిలించుకుంది.
వాళ్లకు నరకం నుంచి విముక్తి కల్పించాలనుకున్నది. తర్వాత పోలీస్ చార్జ్‌షీట్‌లో ఉన్నది మాత్రమే జరిగింది.
ఆ రోజు ముగ్గురు చనిపోయారు.
ఒకడు అక్కడే.
ఇద్దరు ఆసుపత్రిలో.
రేణుక మాత్రం బతికిపోయింది.
రేణుక బతుకులో పేరుకున్న విషం ముందు ఆ విషం పవర్ చాలా తక్కువ అయి ఉంటుంది. ఆమె మాత్రం బతికి పోయింది. అది హత్యకంటే దుఖ్కం. చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు.
చివరకు…
సీత అడిగింది.
“పిల్లల్ని ఎందుకు?”
రేణుక తలవంచుకుంది.
“తెలియదు.”
“తెలియదా?”
“ఇప్పుడు తెలియదు”
“అప్పుడు?”
రేణుక కళ్లు మూసుకుంది.
“అప్పుడు
వాళ్లను వదిలి వెళ్తే వాళ్లది నాకన్నాదరిద్రగొట్లు జీవితం అవుతుందని అనిపించింది”
నసీమా ఒక్కసారిగా అంది
” అది నీ నిర్ణయం.
వాళ్లది కాదు”
రేణుక వెంటనే తల ఊపింది.
“అవును
అందుకే ప్రతిరోజూ చస్తున్నాను “
లావణ్య మొదటిసారి రేణుక దగ్గరకు వచ్చింది.
“నీకు ప్రాయశ్చిత్తం కావాలా?”
రేణుక కళ్లలో నీళ్లు నిండాయి.
“లేదు. ఒక్కసారి…
నా కొడుకు నన్ను ‘అమ్మా’ అని పిలిచే పిలుపు మళ్లీ వినాలి “
అంతే.
ఆమె ఏడవడం మొదలుపెట్టింది.
బ్యారక్‌లోకి వచ్చిన తరవాత..
మొదటిసారి.
అప్పుడే తలుపు దగ్గరకు వచ్చిన రాఘవేంద్ర నెమ్మదిగా అన్నాడు
“రేణుకా “
ఆమె తలెత్తలేదు.
” రేపు నీ మానసిక వైద్యుడి రిపోర్ట్ కోర్టుకు వెళ్తుంది.”
ఎవరూ మాట్లాడలేదు.
రాఘవేంద్ర మెల్లగా కొనసాగించాడు
“అందులో ఒక వాక్యం ఉంది “
అతను ఫైల్ చూడలేదు.
అతనికి కంఠస్థమైపోయింది.
“నిందితురాలు ఘటన జరిగిన సమయంలో తీవ్రమైన మానసిక సంక్షోభంలో ఉండి ఉండే అవకాశం ఉంది “
అతను ఆగాడు.
“కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు, కానీ
రేణుకా ఒక మాట చెప్పనా, నువు చెప్పేది నిజమే కావచ్చు కానీ పోలీసులతో సహా అందరూ ఏమనుకుంటున్నారంటే నీ ప్రియుడు నువు పిల్లలతో సహా వస్తే కుదరదు అన్నాడు కనుక పిల్లలను చంపావని “
“
సార్, అలా అనుకునే వాళ్లను అనుకోనివ్వండి. నేను చేసింది దుర్మార్గం, నీఛం, అసహ్యం, అది నా సుఖం కోసం చేసానా, పిల్లల భవిష్యత్తు బాగుండాలని చేసానా అన్న చర్చ అనవసరం, నన్ను ఎవరూ క్షమించకూడదు. నేనెందుకు చేసానో నాకు తెలిసిందే నిజం , ఎందుకు చేసినా తప్పు తప్పే”
రాఘవేంద్ర ఏమీ మాట్లాడలేక వెనక్కి తిరిగాడు.
తలుపు మూసుకున్న శబ్దం బ్యారక్‌లో చాలా సేపు వినిపిస్తూనే ఉంది.
మాధవి గోడకు ఆనుకుని కూర్చుంది.
ఇప్పటివరకు ఈ బ్యారక్ ఐదుగురు మహిళలను చూసింది.
ఆ రాత్రి మొదటిసారి…
ఐదు వేర్వేరు నేరాలు కాదు ఐదు వేర్వేరు ఓటములకు సాక్షి అయింది.
……..
ఉదయం పది గంటలు. బ్యారక్ తలుపు తెరుచుకుంది.
రాఘవేంద్ర లోపలికి వచ్చాడు.
ఈ సారి అతని చేతిలో ఫైల్ లేదు.
కుర్చీని లాగి వాళ్ల ఎదురుగా కూర్చున్నాడు.
ఐదుగురూ ఆశ్చర్యంగా చూశారు.
“ఈరోజు ఎవర్నీ విచారించను, కేవలం ఒక ప్రశ్న అడుగుతాను.”
అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు.
రాఘవేంద్ర ఒక్కొక్కరి ముఖం చూశాడు.
“మీలో ఒక్కరైనా నిజంగా మరోదారి వెతికారా?”
.
బ్యారక్ గోడలు ఆ ప్రశ్నకు సమాధానాన్ని వినడానికి చెవులు రిక్కించాయి.
సీతమ్మ గొంతు విప్పింది.
“ఏ తొవ్వ సార్?”
“చంపడం కాకుండా.”
“వెతికాను”
“ఏం చేశావు?”
“భరించాను”
“అది దారి కాదు”
సీతమ్మ నవ్వింది.
“మా లాంటోళ్లకు అదే మొదటి దారి “
“నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్లాను”
నసీమా అంది.
” ఏమయింది”
” నన్నే కోప్పడి, నాకేమీ పనిలేదనీ ఉబుసుపోక మొగుడితో గొడవ పెట్టుకుంటున్నాననీ తిట్టి తిప్పి పంపారు”
రేణుక అంది.
“నేను పుట్టింటికి వెళ్లాను, నన్నే తిరిగి పంపించారు “
రాఘవేంద్ర తల ఊపాడు.
“లావణ్య , నువ్వు?”
“విడాకులు అడిగాను”
“తర్వాత?”
“భయపడ్డాను.
సమాజానికి కాదు. నా నిర్ణయానికే.”
రాఘవేంద్ర మౌనంగా కూర్చున్నాడు.
మాధవి మాత్రం ఇప్పటివరకు ఒక్క మాటా మాట్లాడలేదు.
అతను ఆమెవైపు తిరిగాడు.
“నువ్వు?”
మాధవి తలెత్తి చూసింది
“నేను… ఎలాంటి దారీ వెతకలేదు”
అందరూ ఆమెవైపు చూశారు.
“ఎందుకు?”
“అతన్ని చంపాలని కూడా అనుకోలేదు. ఆ రాత్రి…”
ఆమె మాట మధ్యలోనే ఆగిపోయింది.
రాఘవేంద్ర ఆమెను ఆపలేదు.
మిగతావాళ్లూ మాట్లాడలేదు.
మాధవి తన చేతులను చూసుకుంటూ కూర్చుంది
“ఆ రాత్రి…
నేను అతన్ని చంపలేదు.
అతను చనిపోకూడదని కూడా అనుకోలేదు. చాలా కాలంగా లోపల ఉన్నదేదో ఒక్కసారే నాకే తెలియకుండా బయటకు వచ్చేసిందేమో”
ఆ మాటతో బ్యారక్‌లో గాలి బరువెక్కింది .
చివర్లో సీతమ్మ “సారూ..
ఇడుపు కాగితాలు కూడా డబ్బున్నోళ్ల జాగీరే ” అంది.
……….
మాధవిది ప్రేమ వివాహం.
ఇద్దరూ ఒకే కాలేజీలో చదివారు.
ఆమె లెక్చరర్.
అతను సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.
మొదటి ఐదేళ్లు వాళ్ల ఫోటోలు చూసి అందరూ అసూయపడేవారు.
ప్రయాణాలు.
పుట్టినరోజులు.
చిన్న చిన్న వీడియోలు.
సోషల్ మీడియాలో “పర్ఫెక్ట్ కపుల్.”
కానీ…
ఇంట్లో ఒక నిశ్శబ్దం పెరుగుతోంది.
అది గొడవల మౌనం కాదు.
మాట్లాడకపోవడం.
ఒకే ఇంట్లో ఉండి, ఒకరి జీవితంలో ఇంకొకరు అతిథులుగా మారిపోవడం.
అతను రాత్రంతా ల్యాప్‌టాప్ ముందు.
ఆమె పుస్తకాల ముందు.
ఒకరోజు అతని ఉద్యోగం పోయింది.
మూడు నెలలు.
ఆరు నెలలు.
సంవత్సరం.
మాధవి జీతంతో ఇల్లు నడిచింది.
అతను నెమ్మదిగా లోపలికి ముడుచుకుపోయాడు.
మాటలు ఇంకా ఇంకా తగ్గిపోయాయి.
కోపం పెరిగింది.
ఆ కోపం దెబ్బలుగా బయటపడలేదు.
అవమానాలుగా వచ్చింది.
“నీ డబ్బుతోనే బ్రతుకుతున్నానని అనుకుంటున్నావా?”
“నువ్వు లేకపోయినా నేను బతుకుతాను”
“నువ్వు గెలిచావు కదా “
ప్రతి రోజు అదే.
ప్రతి రాత్రి అదే.
ఒక రాత్రి…
అతను తాగి వచ్చాడు.
జీవితంలో మొదటిసారి.
మంచం మీద పడిపోయాడు.
ఏడుస్తున్నాడు.
“నేను పనికిరానివాడిని “
ఆమె దగ్గరికి వెళ్లింది.
అతని తల నిమిరింది.
అతను ఆమె చేతిని తోసేశాడు.
“నా మీద జాలిపడకు “
ఆమె వెనక్కి వెళ్లిపోయింది.
అప్రయత్నంగా దిండు తీసుకుని అతని ముఖం మీద పెట్టింది.
మొదట అతను దాన్ని సరదా అనుకున్నాడు.
తర్వాత చేతులు తోసేసాడు.
ఇంకా తరవాత చేతులు నెమ్మదించాయి.
ఆమెకు ఎంతసేపు పట్టిందో గుర్తులేదు.
దిండు తీసేసేసరికి అతను ప్రశాంతంగా కనిపించాడు.
జీవితంలో ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా.
బ్యారక్‌లో నిశ్శబ్దం.
సీతమ్మ అడిగింది.
“ముందే అనుకున్నావా?”
“లేదు. నేను కూడా నమ్మలేదు.”
నసీమా అడిగింది.
“పోలీసులకు ఏం చెప్పావు?”
“నిజం.”
“నమ్మారా?”
“ఇంత పెద్ద హత్య…
ఒక్క క్షణంలో జరగదన్నారు.”
మాధవి తలవంచుకుంది.
“కానీ…
జరుగుతుంది “
రాఘవేంద్ర చాలాసేపు మౌనంగా ఉన్నాడు.
తర్వాత నెమ్మదిగా అన్నాడు.
“అంటే…
మీ అందరి కథల్లో ఒకే మాట ఉంది.”
ఎవరూ స్పందించలేదు.
“భరించాను అన్న మాటే, అయితే నాకు అర్థం కానిది ఒక్కటే.
ఎందుకు?
ఎందుకు అంతకాలం భరించారు?”
ఈసారి జవాబు చెప్పింది సీతమ్మ కాదు.
నసీమా కాదు.
రేణుక కాదు.
లావణ్య కాదు.
మాధవి.
ఆమె చాలా ప్రశాంతంగా అంది.
“ఎందుకంటే…
చిన్నప్పటి నుంచి మాకు ఇల్లు నిలబెట్టుకో అని నేర్పించారు కానీ…
నిన్ను నువ్వు నిలబెట్టుకో అని ఎవరూ నేర్పలేదు సార్..అందుకు”
రాఘవేంద్ర అర్దం లేని చూపు చూసాడు.
ఆ వాక్యం అతనిని వెంటాడింది.
అతను ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్లిపోయాడు.
తలుపు మూసుకుపోయింది.
ఆ తలుపు శబ్దం కంటే…
మాధవి చివరి మాటే బ్యారక్‌లో ఎక్కువసేపు మిగిలిపోయింది.
……….
మధ్యాహ్నం.
కోర్టు నుంచి వచ్చిన మహిళా ఖైదీలను ఒక్కొక్కరిని బ్యారక్‌లోకి పంపిస్తున్నారు.
ఎవరికో బెయిల్ వచ్చింది.
ఎవరికో మరో పద్నాలుగు రోజుల రిమాండ్.
ఎవరిదో తీర్పు వాయిదా.
బ్యారక్‌లో ఐదుగురూ కిటికీ దగ్గర నిలబడి చూస్తున్నారు.
అప్పుడే ఎదురుగా ఉన్న పురుషుల బ్యారక్ నుంచి ఒక అరుపు వినిపించింది.
“నేను చంపలేదు…”
మరో అరుపు.
“నమ్మండి…”
ఇంకో గొంతు.
“ఆమెనే…”
ఆ అరుపులు క్రమంగా దూరమయ్యాయి.
మాధవి గుసగుసగా అడిగింది.
“అక్కడ కూడా ఇలానే ఉంటారా?”
తలుపు దగ్గర నిల్చున్న రాఘవేంద్ర అన్నాడు
“అక్కడా ఇదే “
“ఏమిటి?”
“ప్రతి ఒక్కరూ తానే నిర్దోషి అని నమ్ముతారు “
సీతమ్మ నవ్వింది.
“ఇక్కడ మేం ఎవరమూ అలా అనలేదు కదా సార్ “
రాఘవేంద్ర ఆ మాటకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు.
అవును. నిజమే.
ఈ బ్యారక్‌లో ఉన్న ఐదుగురూ…
“నేను చేయలేదు” అని ఒక్కసారి కూడా అనలేదు.
రాఘవేంద్ర లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
ఈసారి అతని చేతిలో టీ గ్లాసులు ఉన్నాయి.
వార్డెన్ ఆశ్చర్యపోయింది.
“సార్… వీళ్లకా?”
“అవును.”
ఆమె ఒక్కొక్కరికీ గ్లాసు ఇచ్చింది.
మాధవి గ్లాసు పట్టుకుని చాలాసేపు చూస్తూనే ఉంది.
“ఏమైంది?” అడిగాడు రాఘవేంద్ర.
“చాలా రోజులైంది…”
“ఏమిటి?”
“ఎవరో నేను అడగకుండా టీ ఇచ్చి”
టీ ఆవిరి బ్యారక్‌లో నెమ్మదిగా వ్యాపిస్తోంది.
ఆ ఆవిరిలాగే మాటలు కూడా.
“సార్…
ఒక ప్రశ్న అడగనా?”
లావణ్య పిలిచింది.
“అడుగు.”
“మీరు మమ్మల్ని ఎందుకు అసహ్యంలాగా చూస్తారు?”
రాఘవేంద్ర గ్లాసు కింద పెట్టాడు.
కొద్దిసేపు మాట్లాడలేదు.
“ఎందుకంటే…”
ఆగిపోయాడు.
“ఎందుకంటే? నా కూతురు.”
బ్యారక్‌లో ఉన్న ఐదుగురూ అతని వైపు షాకింగ్ గా చూశారు.
“ఆమెది కూడా మీ కథే. చిన్న చిన్న తేడాలుండొచ్చు”
అతని గొంతు బలహీన పడింది.
“భర్త కొట్టేవాడు. మేమంతా ‘విడిపో’ అన్నాం. విడిపోలేదు. ఎందుకు? అంటే , పిల్లల కోసం.”
అన్నది. బ్యారక్‌లో అందరూ ఊపిరి బిగబట్టారు.
“ఒకరోజు…”
రాఘవేంద్ర కిటికీ బయటికి చూశాడు.
“ఆమె ఫ్యాన్ కు వేళ్లాడింది”
అన్నాడు. చాలాసేపు మౌనం.
“అందుకే…”
అతను మళ్లీ వాళ్లవైపు తిరిగాడు.
“అందుకే మీ మీద కోపం “
నసీమా ఆశ్చర్యంగా అడిగింది.
“మా మీదా? అదే నిజమైతే మా మీద సానుభూతి ఉండాలిగానీ కోపం ఎందుకు సార్”
“ఆమె తనే చనిపోయింది.
మీరు ఎవరినో చంపారు “
ఆ మాట గదిని బరువెక్కించింది.
“నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఒకటే”
అతని గొంతులో కోపం కంటే బాధ ఎక్కువగా ఉంది.
“ఒకే పరిస్థితుల్లో ఒకరు తమను చంపుకుంటారు.
మరొకరు ఇంకొకరిని చంపుతారు.
ఆ తేడా ఎందువల్ల?”
ఎవరూ వెంటనే మాట్లాడలేదు.
చివరికి…
సీతమ్మ నెమ్మదిగా అంది
“అదే మేమూ తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ “
“ఏమిటి?”
“ఆ రోజు…”
ఆమె తన అరచేతిని చూసుకుంది.
“నా చేతులు ఎందుకు ఆగలేదో “
నసీమా అంది.
“నేను విషం కలపకుండా ఎందుకు ఉండలేకపోయానో “
లావణ్య
“కుక్కర్ వాల్వ్ ఎందుకు మూయలేకపోయానో “
రేణుక.
“తలుపు తీసుకుని పిల్లలతో బయటికి ఎందుకు పరిగెత్తలేకపోయానో.”
మాధవి.
“దిండు ఎందుకు తీసేయలేకపోయానో.”
ఐదుగురి మాటలు ముగిశాయి.
బ్యారక్‌లో మళ్లీ నిశ్శబ్దం.
ఈసారి ఆ నిశ్శబ్దాన్ని రాఘవేంద్రే పోగొట్టాడు.
“అంటే…”
అతను నెమ్మదిగా అన్నాడు.
“మీరు కూడా మీకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారా?”
” అందుకే మనం కోర్టులో ఉన్నాం సార్”
లావణ్య చిన్నగా నవ్వింది.
……….
సాయంత్రం.
వార్డెన్ ఒక వార్తాపత్రిక తీసుకొచ్చి తలుపు దగ్గర పెట్టింది.
మొదటి పేజీలో పెద్ద అక్షరాలు.
“భర్తను చంపడానికి సుపారీ ఇచ్చిన భార్య “
మాధవి పేపర్ తీసుకుంది.
ఎవ్వరూ చదవలేదు.
సీతమ్మ ఒక్కసారి చూసి పక్కన పెట్టేసింది.
రాఘవేంద్ర అడిగాడు.
“చూడరా?”
నసీమా తల ఊపింది.
“ఎందుకు?”
“ప్రతి హత్య…
మా కథ కాదు సార్ “
రాఘవేంద్ర ఆశ్చర్యపోయాడు.
“అంటే?”
లావణ్య నెమ్మదిగా అంది.
“ఒక మహిళ హత్య చేసిందంటే…
ఆమె తరఫున మేము న్యాయవాదులం కావల్సిన అవసరం లేదు.”
రేణుక జత కలిపింది.
” ఎలా ఒక పురుషుడు హత్య చేస్తే మీరు అందరూ ఒకటే కాదో…”
” అలాగే.”
రాఘవేంద్ర ఆమె మాట పూర్తిచేశాడు.
వాళ్లిద్దరి వాక్యం ఒకే చోట కలిసింది.
టీ గ్లాసులు ఖాళీ అయ్యాయి.
కానీ…
బ్యారక్ నిండా ఏదో ఆవహించింది.
అది అంగీకారం కాదు.
క్షమాపణ కాదు.
ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి సరిపడేంత సందేహం.
……….
మరుసటి రోజు ఉదయం.
బ్యారక్ తలుపు సాధారణం కంటే ముందే తెరుచుకుంది.
వార్డెన్ లోపలికి వస్తూనే
“రేపు మీ అందరికీ తీర్పు”
అంది. అందరిముఖాల్లో అభావం.
ఆమె వెళ్లిపోయింది కానీ
ఆ ఒక్క వాక్యం బ్యారక్‌లో రోజంతా చక్కర్లు కొడుతూనే ఉంది.
“మనం హంతకులమేనా?”
అందరూ మౌనం.
రేణుక.
“నేను హంతకురాలిని “
సీతమ్మ.
“నేను బాధితురాలిని”
లావణ్య.
“నేను రెండూ “
మాధవి కిటికీ దగ్గర నిలబడి ఉంది.
“మనం మళ్లీ కలుస్తామా?”
ఎవరూ సమాధానం చెప్పలేదు.
సీతమ్మ నవ్వింది ” జైళ్లు చాలా చిన్నవి మేరే దోస్త్”
నసీమా అంది.
“బయటి ప్రపంచమే పెద్ద జైలు.”
లావణ్య ఆ మాటను కొనసాగించలేదు.
రేణుక నేలనే చూస్తోంది.
మధ్యాహ్నం.
రాఘవేంద్ర బ్యారక్‌లోకి వచ్చాడు.
ఈసారి అతని చేతిలో ఫైళ్లు లేవు.
టీ లేదు.
ప్రశ్నలు కూడా లేవు.
“ఈరోజు…
నేను ఏమీ అడగను, కారణం తెలియదు కానీ ఎందుకో మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది “
అన్నాడు.
ఎవరూ మాట్లాడలేదు.
సీతమ్మ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ
“సార్.”
అతను తిరిగి చూశాడు.
“మీరు మమ్మల్ని చూస్తున్నారు కదా మీరు ఏ నిర్దారణకు వచ్చారో రెండు మాటలు చెప్పండి మా గురించి “
అంది.
రాఘవేంద్ర చాలాసేపు మాట్లాడలేదు.
ఒక్కొక్కరి ముఖం చూశాడు.
తర్వాత మెల్లగా అన్నాడు.
“మొదటి రోజు…
నేను మీ అందరినీ ఒకేలా చూశాను. కానీ
ఇప్పుడు
మీ నేరాలు ఒకటేనని అనిపించినా మీరు ఒక్కటే కారు. మీరు ఎదుర్కున్న సమస్యలు మాత్రం దాదాపుగా ఒక్కటే. అంతమాత్రాన నేను హత్యను సమర్దిస్తున్నాననుకోకండి. కానీ…
హత్య జరిగిన రోజును మాత్రమే చూస్తే సగం సత్యమే కనిపిస్తుందని ఇప్పుడు నాకు కొత్తగా అర్దమయింది . మీరంతా ఒకే భాషలో మాట్లాడడం ఒకే వాదనను వేర్వేరుగా వినిపించడం మొదట్లో నాకు ఆశ్చర్యంగా అనిపించింది, కానీ మీకందరికీ జీవితం కొద్ది తేడాలతో ఒకే అనుభవాన్ని , ఒకే వేదనను , ఒకే రకమైన ఎక్స్ప్రెషన్ ను ఇచ్చిందని నాకు కొంత ఆలస్యంగా అర్దమైంది”
అతను తలుపు తెరిచాడు.
బయటికి వెళ్లబోతూ ఆగి
వెనక్కి తిరగకుండా అన్నాడు.
“చట్టం…
హత్య జరిగిన రోజును విచారిస్తుంది. జీవితం…
హత్యకు ముందు గడిచిన సంవత్సరాలను.”
అతను వెళ్లిపోయాడు.
తలుపు నెమ్మదిగా మూసుకుంది.
ఆ తలుపు మూసుకున్న శబ్దం తర్వాత
బ్యారక్‌లో ఎవరూ మాట్లాడలేదు.
మొదటిసారి వాళ్లకు అనిపించింది
రేపు కోర్టు తీర్పు చెప్పొచ్చు.
కానీ తమ జీవితాలపై తీర్పులు కొనసాగుతూనే ఉంటాయని.
చీకట్లో ఐదుగురూ మెలకువగానే ఉన్నారు.
ఎవ్వరూ మాట్లాడలేదు.
“మనకు శిక్ష పడతది. మనమెవరం కూడా అభ్యంతర పడట్లేదు, బాధ కూడా పడట్లేదు. మనం ఆ శిక్షకు అర్హులమే అయితే మన సహహంతకుల సంగతేమిటి వాళ్లింకా బయటనే ఉన్నారు కదా.
” కొద్దిసేపటి తర్వాత మాధవి నెమ్మదిగా అడిగింది.
……….
బ్యారక్ బయట రాత్రి ఎందుకో బరువుగా ఉంది.
పట్టణంలో లైట్లు జోరుగా వెలుగుతున్నాయి.
ఇళ్లలో భోజనాల వేళ.
ఎక్కడో ఒక ఇంట్లో
“భరించు “
అని,
మరో ఇంట్లో “పిల్లల కోసం”
అని,
ఇంకో ఇంట్లో
“ఇంటి గుట్టు బయట పెట్టొద్దు”
అని,
మరోచోట
“రేపు చూద్దాం ఆలోచించుకో “
అని, ఒక నిర్ణయం రకరకాలుగా వాయిదా పడుతోంది.
ఆ సలహాలు ఏ చార్జ్‌షీట్‌లోనూ నమోదుకావు.
ఏ కోర్టులోనూ సాక్ష్యం చెప్పవు.
ఏ జైలుకూ రావు.
కానీ చాలాసార్లు,
అవే ఒక హత్యకు చాలా సంవత్సరాల ముందే
సహ హంతకులుగా మారిపోతాయి.
….
మరుసటి రోజు.
జైలు వ్యాన్ కోర్టు నుంచి తిరిగొచ్చింది.
తీర్పులు మనుషులను మార్చవు.
వాళ్ల చిరునామాను మాత్రమే మారుస్తాయి.
సీతమ్మ,
నసీమా,
లావణ్య,
రేణుక, మాధవి, ఐదుగురూ మళ్లీ అదే బ్యారక్‌లోకి నడిచారు.
అదే గోడలు.
అదే కిటికీ.
కానీ లోపలికి వెళ్లిన వాళ్లు మాత్రం నిన్నటి వ్యక్తులు కాదు.
ఆ గోడలలోంచి వాళ్ల మాటలు ఇంకా ప్రతిధ్వనిస్తున్నట్టే ఉంది.
“నేను అతన్ని చాలా ఆలస్యంగా చంపాను.”
“విషం అన్నంలో కాదు… అవమానంలో పుడుతుంది.”
“ప్రేమ కారణం కాదు… సాకు”
“అమ్మలకు సర్టిఫికెట్లు అవసరం లేదు”
అదే సమయంలో రాఘవేంద్ర తన టేబుల్ ముందు కూర్చుని రిజిస్టర్ తెరిచాడు.
పేరు.
సెక్షన్.
తీర్పు.
శిక్ష.
రోజూ రాసే వరుసలే.
మాధవి ఫైలు దగ్గర పెన్ను ఒక్క నిముషం ఆగిపోయింది.
చార్జ్‌షీట్‌లో నేరం ఉంది.
కోర్టు తీర్పు ఉంది.
సాక్ష్యాలున్నాయి.
ఒక్క విషయం మాత్రం లేదు.
హత్యకు ముందు నిశ్శబ్దంగా గడిచిన సంవత్సరాలు.
సీతమ్మ ఫైల్లో అప్పులున్నాయి.
అవమానం లేదు.
నసీమా ఫైల్లో విషముంది.
అనుబంధాల చరిత్ర లేదు.
లావణ్య ఫైల్లో అగ్ని ఉంది.
చల్లారిపోయిన దాంపత్యం లేదు.
రేణుక ఫైల్లో ముగ్గురు మృతులున్నారు.
మంచం కింద దాక్కున్న ఇద్దరు పిల్లల భవిష్యత్తు లేదు.
ఏదో ఆలోచిస్తున్నట్టు శూన్యంలోకి చూస్తూ తన రిమార్క్స్ రాయాల్సిన చోట
“ప్రతి హత్యకూ ఒక హంతకుడుంటాడు.
కొన్ని హత్యలకు మాత్రం సమాజం సహ హంతకి. ఈ అయిదుగురి కధలు ఎక్కడా “అందరూ బాధితులే” అని కూడా చెప్పవు.
” అందరూ రాక్షసులే” అని కూడా చెప్పవు. అయిదుగురు మహిళలు నిందితులు.
వాళ్లను నేను నిర్దోషులని చెప్పలేను.
కానీ
ఈ ఫైళ్లలో
కనిపించని నిందితుల పేర్లు ఇంకా కొన్ని ఉండాల్సింది. అవి మనం మన కొడుకులకు నేర్పిన మాటలు .
మన కూతుళ్లకు నేర్పిన మౌనం .
ఇంటి గోడల మధ్య చట్టం పని చేయదనే కుటుంబాల నమ్మకం.
హత్య చేసిన చేతిని శిక్షించడం న్యాయం.
ఆ చేతిని ఆ స్థితికి తీసుకొచ్చిన చరిత్రను మర్చిపోవడం…
మరొక హత్యకు సిద్ధపడటమే.” అని రాసి రిజిస్టర్ మూసాడు. ఇన్ని సంవత్సరాలుగా తాను చదివిన ప్రతి చార్జ్‌షీట్‌లో నేరం ఉంది.
నేరం పుట్టిన తొలి నొప్పి మాత్రం లేదనే విషయం రాఘవేంద్రకు కొత్తగా అర్దమయింది.
“ఈ కథలు హత్య చేసిన మహిళల కథలు కాదు. నేరాన్ని మాత్రమే విచారించే చట్టానికీ, నేరం పుట్టిన మూలాలను మరచిపోయే సమాజానికీ మధ్య జరిగే సంభాషణ ” అని నిట్టూర్చాడు.
తెల్లారి.
సీతమ్మను మరో జైలుకు మార్చారు.
నసీమాకు బెయిల్ వచ్చింది.
లావణ్య తరఫున ఎవరో అప్పీల్‌కు వెళ్లారు.
రేణుకను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
బ్యారక్‌లో మాధవి మిగిలింది.
వాళ్లు కూర్చునే మూలలో ఇంకా ఐదు స్టీల్ గ్లాసులు అలానే ఉన్నాయి.
వార్డెన్ వాటిని తీసుకెళ్లబోతుండగా ఒక గ్లాసు జారి తలుపు వరకూ దొర్లింది.
“ఉండనీ,
ఎవరైనా కొత్తగా వస్తారు “
అన్నాడు రాఘవేంద్ర.
అంతలోనే తాళాల చప్పుడు వినిపించింది.
ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఒక యువతిని లోపలికి తీసుకొచ్చారు ” కొత్తది ” అంటూ. ఆమె
చేతులు వణుకుతున్నాయి.
కళ్లు ఉబ్బిపోయాయి.
అదే పోలీస్ స్టేషన్ వాసన. మణికట్టుకు అదే బేడీల చారికలు. ఆమె చాలాసేపు నిలబడే ఉంది.
మాధవి నెమ్మదిగా వెళ్లి ఆ గ్లాసులో నీళ్లు పోసి ఆమె చేతిలో పెట్టింది.
ఆమె ఒక గుక్క నీళ్లు తాగి
వణుకుతున్న గొంతుతో అడిగింది “నన్ను… మీరు కూడా దెయ్యంలాగే చూస్తారా?”
మాధవి మాట్లాడలేదు.
ఆమె పక్కనే నిశ్శబ్దంగా కూర్చుంది.
తలుపు అవతల నిలబడ్డ రాఘవేంద్ర వార్డెన్ వైపు తిరిగి అన్నాడు
“చార్జ్‌షీట్ తెప్పించు…”
కొద్దిసేపు ఆగాడు.
మొదటిసారి తన మాటను తానే సరిదిద్దుకున్నాడు.
“లేదు… ముందు ఆమె పేరు తెలుసుకుందాం “
తలుపు మెల్లగా మూసుకుపోయింది.
బ్యారక్‌లో మరో కథ మొదలైంది.
