విచిత్రమైన ప్రవర్తన కలిగిన వ్యక్తులు మన జీవితాల్లో రంగులను నింపుతారని స్టెర్న్ ఏదో ఒక పుస్తకంలో చదివాడు, కానీ తన పడవపైకి వచ్చిన వ్యక్తిని ఎవ్వరూ ఇష్టపడలేదు. అతను చాలా లూజుగా ఉన్న, పసుపు రంగు చెక్స్ ప్యాంటు వేసుకున్నాడు. దాని రంగు స్టెర్న్‌కు కోపాన్ని కలిగించింది. బహుశా చుట్టూ ఉన్న వాతావరణం, ఫిన్లాండ్ గల్ఫ్ యొక్క నీరు, అతని పడవ బోరెయ్ బూడిద రంగులో ఉండటమే దానికి కారణం కావచ్చు. రంగు ఊడిపోయిన చోట ఉన్న కొన్ని ఎరుపు రంగు మచ్చలు మినహా, బోరెయ్ పడవ తడి మసిపోయిన గుడ్డ రంగులో ఉండేది. ఆ వింత వ్యక్తి దానిని చాలా అందంగా ఉందనుకున్నాడు, కానీ పడవ కెప్టెన్ మాత్రం పడవకు కొత్త రంగు వేయాల్సిన సమయం వచ్చిందని భావించాడు.
ఆ వింత మనిషి క్రేట్‌లు ఎత్తుగా పేర్చి ఉన్న డెక్ చుట్టూ ఆస్ట్రిచ్ పక్షి లాగా నడుస్తున్నాడు . తన ముదురు నీలం రంగు జాకెట్, ఆకుపచ్చ టోపీ, ఎర్ర రంగు టైతో రంగుల ఈకలు ఉన్న పొడవైన కాళ్ల పక్షిలా కనిపిస్తున్నాడు. అతని లగేజీలో ఒక సూట్‌కేస్, వైయోలిన్ మాత్రమే ఉన్నాయి.
అతను బొమ్మల సరుకుతో గ్రేట్ బ్రిటన్‌కు వెళుతున్నాడు. పడవలో కలప, తోలు, ధాన్యపు బస్తాలను నింపడం ఒక ఎత్తయితే, బొమ్మలను తీసుకెళ్లడం పూర్తి అవమానకరంగా అనిపించింది. దగ్గరలో నిలిపి ఉంచిన పడవలలోని పాత కెప్టెన్లు తమ భుజాలు ఎగురవేశారు.
ఆ బొమ్మలను తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, అవి ఏదో పేలే పదార్థాలు అన్నట్లుగా పడవ బేస్‌మెంట్‌లోకి దించాలని ఆ వింత మనిషి కోరాడు.
జీవితంపై అసంతృప్తితో ఉండే, మూఢనమ్మకాలు కలిగిన మొదటి నావికుడు చోఖ్, ఈ “అల్పమైన ఆటబొమ్మలు దేనికీ మేలు చేయవు” అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. చోఖ్ ఉద్దేశం ఏమిటో స్టెర్న్ అడిగినప్పుడు, చోఖ్ గొణుగుతూ పడవలో ఈ సరుకు చాలా తేలికగా ఉండటం వల్ల గట్టిగా కట్టడానికి వీలులేదని, ఒకవేళ తుఫాను వస్తే మీకే తెలుసుగా ఆ పెట్టెలు ఒక వైపుకు జారిపోయి, బోరెయ్ ఒక పక్కకు ఒరిగిపోతుందని, దానితో కథ ముగుస్తుందని చెప్పాడు. తన అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత, చోఖ్ కొన్ని సిగరెట్ల కోసం తీరానికి వెళ్లాడు.
“నీ అభిప్రాయాలను నీ వద్దే ఉంచుకో,” అని స్టెర్న్ అతని వెనుక అరిచాడు. “పంది కాళ్లను లోడ్ చేయమని ఆదేశిస్తే, నువ్వు వాటినే లోడ్ చేయాలి. దాంతో నీకేం తేడా వస్తుంది?”
పడవలోని కోపం తగ్గలేదు. మరుసటి ఉదయం వారు రేవును విడిచిపెడుతుండగా, ల్యాండ్ ఆఫ్ ది సోవియట్స్ అనే ఓడకు చెందిన ఒక నావికుడు మెగాఫోన్ ద్వారా వారిని పిలిచి,”టెడ్డీ బేర్ల సరుకు అంతా బానే ఉందా?” అని అడిగాడు.
సముద్రంపై పొగమంచు వ్యాపించి ఉన్నందుకు స్టెర్న్ కు హాయిగా వుంది , అది తన చిన్నపాటి సరుకును కప్పిపుచ్చుతుందేమో అనిపించింది.
సముద్రంలో పక్కన వెళ్లే ఓడల నుండి మర్యాదపూర్వకమైన పలకరింపులు వస్తాయని అతను ఊహించుకున్నాడు.
“మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ పడవలో ఉన్న సరుకు ఏమిటి?”
“బెల్ఫాస్ట్‌కు బొమ్మలు,” అని పడవ పర్యవేక్షకుడు సమాధానం ఇస్తాడు.
ఇది పక్కన వెళ్లే ఓడలలో పెద్ద సంచలనాన్ని కలిగిస్తుంది వారి డెక్‌లు నవ్వుతున్న నావికుల ముఖాలతో నిండిపోతాయి. బోరెయ్ సిబ్బందిని చూసి నావికులంతా పరిహాసంగా “అమ్మ-అమ్మ” అని కకేకలు వేస్తారు. వారి కెప్టెన్ బ్రిడ్జ్ పైనుండి:
“బొమ్మలతో సురక్షితమైన ప్రయాణం చేయండి” అని అరుస్తాడు.
చోఖ్ ఆ వింత మనిషిని “హాస్యగాడు” అని పిలిచాడు, అతనికి ఎవరూ పెద్దగా గౌరవం ఇవ్వకపోవడం నిజమే. నావికులు సాధారణంగా తమ ప్రయాణికులు సరుకు పట్ల నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు, కానీ ఇప్పుడు వారి ఆత్మగౌరవం దెబ్బతింది. వారు అతని ఎర్రటి, పదునైన ముక్కు కలిగిన షూలను చూపిస్తూ, సూటిగా అతనిని ఎగతాళి చేస్తూ అడిగేవారు:
“ఆ బూట్లకు ఎంత పెట్టావు?”
మరికొందరు తింగరి నావికులు ఆ ప్రశ్నను వేరేలా అడిగేవారు:
“ఆ మొరటు బూట్ల ఖరీదు ఎంత?”
ఆ వింత మనిషి ఎప్పుడూ కోపపడలేదు, తను వాటిని మాస్కోలోని పెద్ద GUM డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో ఇరవై రూబుల్స్‌కు కొన్నానని నవ్వుతూ సమాధానం చెప్పేవాడు.
అతను చాలా ఆనందకరమైన మూడ్‌లో ఉన్నాడు. సాయంత్రం అవుతుండగా అద్భుతమైన విషయాలు జరుగుతాయి. మేఘాలు గులాబీ రంగు దూది పింజల్లా ముసురుకున్నాయి, సముద్రపు పొగమంచు గుండా లైట్‌హౌస్‌లు వెలుగులు జిమ్మాయి, డెన్మార్క్ తీరాలు తాజా చేపల విప్డ్ క్రీమ్ సువాసనను వెదజల్లుతున్నట్లు అనిపించాయి. ఆ వింత మనిషి కింద ఉన్న మెస్‌రూమ్‌లోకి వెళ్లిపోయాడు…
స్టెర్న్‌తో అన్నాడు.
“నేను చాలా సంతృప్తిగా ఉన్నాను.”
స్టెర్న్ దీనికి తన కనుబొమ్మలు ముడివేశాడు, ఎందుకంటే అక్కడ సంతృప్తి చెందడానికి తగిన కారణాలేమీ లేవు. వారు ఉత్తర సముద్రంలోకి ప్రవేశిస్తున్నారు, గడియారం ముల్లులాగా బేరోమీటర్ వేగంగా పడిపోతోంది.
“తుఫాను పెరుగుతోంది” అని అతను బదులిచ్చి, తన క్యాబిన్‌లోకి వెళ్లిపోయాడు.
ఐదవ రోజు భోజన శాలలో రాత్రి భోజనం ముగిసిన తర్వాత, ఆ విచిత్ర వ్యక్తి కత్తితో తన మినరల్ వాటర్ గ్లాసుపై మెల్లగా తట్టి మాట్లాడటానికి అనుమతి కోరాడు. బయట నల్లటి మబ్బులతో సన్నటి జల్లులు కురుస్తున్నాయి, డైనింగ్ హాలులోని దీపాలు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. ఆ దీపాలు, ఆ విచిత్ర వ్యక్తి యొక్క ప్రతిబింబాలు అక్కడున్న నాలుగు అద్దాలలోనూ ఒకేసారి కనిపిస్తున్నాయి. స్టెర్న్ ఆ విచిత్ర వ్యక్తిని గమనిస్తున్నాడు. అతడి మెత్తని, మంచి మనస్సత్వానికి గుర్తుగా ఉన్న ముక్కుపై కొద్దిగా వంకరగా ఉన్న కళ్లద్దాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆ అభ్యర్థన స్టెర్న్‌ను ఇబ్బందికరమైన పరిస్థితిలో పడేసింది. ఓడ కెప్టెన్‌గా, కఠినమైన సముద్ర నియమాలకు విరుద్ధంగా ఉపన్యాసాలు ఇవ్వకూడదని చెప్పి ఆ విచిత్ర వ్యక్తిని అతను అడ్డుకోవచ్చు. నావికులు తక్కువ మాట్లాడేవారని, లెక్చర్లు దంచడాన్ని ద్వేషిస్తారని (ఒకవేళ మద్యం మత్తులో ఉంటే తప్ప) అతనికి గుర్తు చేయవచ్చు. కానీ అతను మిగతా నావికుల అసంతృప్తి చూపులను పట్టించుకోకుండా, చేతి సైగతో వారించి,
“అతన్ని మాట్లాడనివ్వండి” అని అన్నాడు.
ఆ విచిత్ర వ్యక్తి అందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు.
“ఒక విచారకరమైన పొరపాటు జరిగింది. నేను తీసుకువస్తున్న సరుకు మీకు చాలా ఇబ్బంది కలిగిస్తోంది, దానికి కారణం మీకు ఆడుకునే బొమ్మల గురించి చాలా తక్కువ తెలుసు.
మీ వృత్తిపరమైన ఆత్మగౌరవం దెబ్బతింది. నిజమే, ఉత్తర ధ్రువ యాత్రలో పాల్గొనడం బొమ్మల సరుకును మోసుకెళ్లడం కంటే ఎంతో గొప్ప విషయంలా అనిపిస్తుంది. నావికులు గొప్ప విషయాలను మాత్రమే ఇష్టపడతారని, తమకు తెలియని విషయాల పట్ల ఆలోచించకుండా ఇంత వ్యతిరేకత ప్రదర్శిస్తారని నేను ఊహించలేదు.”
ఈ మాటలు యుద్ధ ప్రకటనలా మోగాయి. ఆ విచిత్ర వ్యక్తి అసలు విషయానికి వచ్చాడు. ఓడ నడపడం ఎంత గొప్పదో, బొమ్మల తయారీ కళ కూడా అంతే గొప్పదని వాదించాడు. ఒక జర్మన్ బొమ్మల తయారీదారు సైనికుల బొమ్మలు తయారు చేయడం వల్ల కోటీశ్వరుడయ్యాడని చెప్పి అతను ‘చోక్’ ని షాక్‌కు గురిచేశాడు. సోవియట్ బొమ్మలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని, ప్రస్తుతానికి బోరీ ఓడ బెల్ఫాస్ట్‌లోని ఒక ప్రదర్శనకు అత్యుత్తమమైన బొమ్మలను తీసుకెళ్తోందని అన్నాడు. కెప్టెన్ క్యాబిన్‌లో ఉన్న చిన్న పసుపు రంగు పడవ బొమ్మను తాను చూశానని యాదృచ్ఛికంగా చెప్పి స్టెర్న్‌కు కోపం తెప్పించాడు. బొమ్మలు చాలా అమూల్యమైన సరుకు. వాటిని పగలగొట్టే హక్కు కేవలం పిల్లలకు మాత్రమే ఉంది, రేవు కార్మికులకు గానీ, ఓడ సిబ్బందికి గానీ ఎంతమాత్రం లేదు. అతను చోక్ భయాలను కేవలం ‘చెత్త ఆలోచనలు’ అని అన్నాడు. బొమ్మల సరుకు వల్ల ఓడ మునిగిపోతుందా అని ఏ నావికుడినైనా అడిగి చూడండి, వారు మీ ముఖం మీదే నవ్వుతారు అని అన్నాడు.
చోక్ నిరసన తెలిపాడు. లెనిన్‌గ్రాడ్‌లో ఒక పనివాడు దూది మోపు కింద పడి నలిగి చనిపోయిన సంఘటనను అతను గుర్తుచేసుకున్నాడు. ఎవడైనా ఒకరి వద్దకు వెళ్లి దూది కింద పడి ఒక మనిషి చనిపోయాడని చెబితే నవ్వుతారా అని ఎదురుదాడి చేశాడు…దూది వల్ల చనిపోయాడని చెబితే? ఆ వాదన తీవ్రరూపం దాల్చింది, దాంతో స్టెర్న్ తన కుతూహలాన్ని దాచుకోలేక మధ్యలో జోక్యం చేసుకుంటూ:
“అసలు అవి ఏ రకమైన బొమ్మలు?” అని అడిగాడు.
“రెండు రకాలు,” అని ఆ విచిత్ర వ్యక్తి బదులిచ్చాడు.
అతను తన పెట్టెను భోజన శాలలోకి లాగి, ఎర్రటి బుగ్గలు ఉన్న ‘మాత్రియోష్కా’ బొమ్మలు ( రష్యన్ చెక్క బొమ్మలు), పడవలు, కుందేళ్ళు, టెడ్డీ బేర్లను టేబుల్‌పై గుమ్మరించాడు.
“ఇది రెండవ రకం,” అని వివరించాడు. “ఇంగ్లాండ్ కస్టమ్స్ అధికారులు బోల్షెవిక్ బొమ్మల సరుకును తెరిచినప్పుడు, ఎర్రటి బుగ్గలు, అందమైన కనుబొమ్మలు, నకిలీ నవ్వులతో ఉన్న వందలాది బొమ్మలు వారికి స్వాగతం పలికినప్పుడు వారు ఆశ్చర్యపోతారు. ఈ నవ్వుల వెనుక నిజమైన సరుకు, అంటే ‘మొదటి రకం’ బొమ్మలు దాగి ఉంటాయి. అవి ఇక్కడ ఉన్నాయి.”
అతను పెట్టెను ఊపగానే, కాగితగుజ్జు తో చేసిన కొమ్సోమోల్ బొమ్మలు, పయనీర్లు, బూడిద రంగు గుర్రంపై బుద్యోన్నీ, ఎర్రటి బుగ్గలు ఉన్న రెడ్ ఆర్మీ సైనికులు, నాగళ్లను తయారుచేసే కమ్మరులు, వింత ముఖాలు ఉన్న పోలీసులు, రాట్నం వడికేవారు, గనుల్లో పనిచేసే కార్మికులు, మే డే ఊరేగింపుల్లో ఉన్న పిల్లల సమూహాలు, చివరిగా చిన్న స్పర్శకే బొంగురు గొంతుతో అరిచే తెల్లటి కళ్ళున్న ఒక విచిత్రమైన రాజు బొమ్మ కింద పడ్డాయి.
ఆ బొమ్మలను ఒకరి చేతి నుండి మరొకరు మార్చుకుంటూ చూశారు. జూనియర్ మేట్ ఒక పోలీసు బొమ్మను పంచదార గిన్నెపై కూర్చోబెట్టి, దాని ముక్కుపై మెల్లగా తట్టి, దాని నోట్లో ఒక సిగరెట్ పెట్టాడు. ఆ పోలీసు బొమ్మ తన కళ్ళను కోపంగా తిప్పింది. స్టెర్న్, చోక్‌తో పడవల
నమూనాల గురించి చెప్పడం ప్రారంభించాడు. చోక్ అవి ‘టీ క్లిప్పర్లు’ (వేగంగా వెళ్లే టీ రవాణా పడవలు) అని అనగా, స్టెర్న్ కోపంగా అవి రెండు స్తంభాల ఓడలు ఉండేవి. వారు పాత ఓడల గురించిన ఒక పుస్తకాన్ని బయటకు తీశారు. తరువాత వైర్‌లెస్ ఆపరేటర్ పియానో దగ్గర కూర్చున్నాడు, మెకానిక్ మార్గదర్శకత్వంలో ఒక ‘పయనీర్’ బొమ్మ ట్యాప్-డాన్స్ (తాళానికి తగినట్లు డ్యాన్స్) చేయడం ప్రారంభించింది.
నావికులు చిరునవ్వుతో తలుపు గుండా తమ తలలను లోపలికి పెట్టి చూస్తూనే ఉన్నారు. ఓడ అధికారి వేగం గురించి చెప్పడానికి వచ్చాడు, ఒక ఆటబొమ్మ ఈలని తీసుకుని నైటింగేల్ పక్షి పాడే అన్ని పాటలను ఈల వేసి వినిపించాడు.
ఆ ఉత్సాహం సిబ్బంది గదులకు కూడా పాకింది. ఓడ చుక్కాని పట్టుకునే వ్యక్తి షిర్యాఎవ్ తాను కేవలం ఒక బెరడు ముక్కతో మస్త్‌లు, పొగగొట్టాలు కనింగ్-టవర్ ఉన్న ఒక టార్పెడో పడవను చెక్కగలనని గొప్పలు చెప్పుకున్నాడు. ఎవరూ అతన్ని నమ్మలేదు. అతను తన గౌరవప్రమాణం చేసి ఒక బెరడు ముక్కను కోరాడు, కానీ బోరీ ఓడలో అలాంటిది ఏదీ దొరకలేదు. హాంబర్గ్, ఒడెస్సా
లండన్ నుండి వచ్చిన మోడల్ ఓడల తయారీదారుల పేర్లతో ఆ వాతావరణం మారుమోగింది.
చోఖ్ తన మూఢనమ్మకాల పట్ల నిజాయితీగా ఉన్నాడు; ఆ బొమ్మలను, మెత్తటి టెడ్డీ బేర్‌లను, విధి రాతల నుండి రక్షణగా భావించాడు.
లీ హావ్రేలోని కార్మికుల పిల్లలు హార్బర్‌లోని ఎవరూ లేని, చెత్తతో నిండిన ప్రదేశాలలో ఆడుకోవడం తాను ఎలా చూశాడో స్టెర్న్ వారికి చెప్పాడు. అక్కడ పోర్ట్ కాపలాదారులు కూడా వారిని పెద్దగా పట్టించుకునేవారు కారు. వారి ఆటబొమ్మలు చాలా సాధారణమైనవి. వారు పడవల కోసం చెక్క పలకలను, లంగర్ల కోసం తుప్పు పట్టిన మేకులను ఉపయోగించారు. వారు చాలా నిశ్శబ్దంగా ఆడారు. వారి ఆనందంలో చాలా విచారకరమైన విషయం ఉంది, ఎందుకంటే అది ఎంతో భయంతో కూడుకున్నది.
ఆ విచిత్రమైన వ్యక్తిని అడ్డుకుంటూ బొమ్మల తయారీలో ఎంతో నైపుణ్యం ఆప్యాయత ఉంటాయని, బహుశా వాటిని తయారు చేసిన వారికి అసంతృప్తికరమైన బాల్యం ఉండటం వల్ల కావచ్చు అని చెప్పాడు. బొమ్మలు లేని పిల్లవాడికి, తన చుట్టూ ఉన్న విసుగు పుట్టించే పెద్దల ప్రపంచం తప్ప మరేమీ ఉండదు. అతను ఆవిరి రైళ్లతో,
కుందేళ్లతో మాట్లాడలేడు, లేదా ఒక పోలీసు అధికారి బొమ్మ తలను తీసి, ఖాళీగా ఉన్న ప్లాస్టర్ బంతి లోపలికి చూసే అద్భుతమైన అనుభవాన్ని పొందలేడు.
“లేస్ నిక్కర్‌బోకర్స్ తొడిగిన బొమ్మల లోడ్‌ను మోసుకెళ్లడం ఎంత అవమానకరంగా ఉంటుందో నాకు బాగా అర్ధమవుతోంది,” అని అతను కొనసాగించాడు. “కానీ నా సరుకు చాలా భిన్నమైనది. మీరే స్వయంగా చూడవచ్చు. పిల్లలు పాత డబ్బాలు, ఎండిపోయిన చేపల తోకలతో ఆడుకునే పట్టణంలోని ప్రాంతాల కోసం మనం బొమ్మలను రవాణా చేస్తున్నాము. మీరు ఎంతగానో అసహ్యించుకునే బోరీ స్టోర్‌రూమ్‌లోని ఆ పెట్టెలలో ఎన్ని కన్నీళ్లు, నవ్వులు దాగి ఉన్నాయో ఊహించడం కష్టం. కానీ ఉప్పు వేసిన మాంసం లోడ్‌ను తీసుకువెళ్లడానికి మీరు అభ్యంతరం చెప్పరు, అవునా?”
అర్థరాత్రి వరకు ఆ అల్లరి తగ్గలేదు;. చీకటి, గాలి లేని ఆ రాత్రి నాలుగు గంటలకు గంటలు చాలా మధురంగా మోగాయి.
స్టెర్న్ ఓడ బ్రిడ్జి పైకి వెళ్ళాడు. బోరీ స్కాటిష్ తీరం చుట్టూ ప్రయాణిస్తోంది. అతను బేరోమీటర్‌ను చూసి తిట్టుకున్నాడు. అట్లాంటిక్ నుండి తుఫాను వస్తోంది.
పొగమంచు పొరల గుండా నక్షత్రాలు అయోమయంతో మిణుకుమిణుకుమంటున్నాయి.
ఆ విచిత్రమైన వ్యక్తి క్యాబిన్ నుండి వైలిన్ సున్నితమైన నాదం వినిపించింది. స్టెర్న్ విన్నాడు. రాత్రి వేళ ఓడలో వైలిన్ శబ్దం వినబడటం, ఆ స్టోర్‌రూమ్‌లో ఉన్న సరుకు వలే చాలా వింతగా ఉంది. అతను తన నోటి దగ్గరకు ఈలను తెచ్చి, కాసేపు సంకోచించి, ఆపై ఊదాడు.
ఒక నావికుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు.
“సరుకు భద్రంగా ఉందో లేదో చూడమని చోఖ్‌కి చెప్పండి,” అని అతను ఆదేశించాడు. “తుఫాను వస్తోంది.”
“సరే సార్,” అని చెబుతూ ఆ నావికుడు పరుగెత్తాడు.
స్టెర్న్ కిందకి వెళ్ళినప్పుడు, స్టోర్‌రూమ్‌లో దట్టమైన వలలతో కప్పబడిన లాంతర్లు వెలుగుతున్నాయి చోఖ్ అని అరుస్తున్నాడు:
“జాగ్రత్త! అది సబ్బు కాదు, తెలుసా!”
వారు ఉదయం వరకు కష్టపడి పనిచేశారు, కానీ చోఖ్ మంచి మూడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే చేయగలిగినట్లుగా ఆ సరుకు చాలా అందంగా, భద్రంగా ఉంచారు .
ఆ విచిత్రమైన వ్యక్తి వేకువజాము వరకు వైలిన్ వాయిస్తూనే ఉన్నాడు.
ఓడ లాంతర్లపై దట్టమైన చీకటి అలముకుంది, ఓడ వెనుక భాగానికి వ్యాపించింది. బేరోమీటర్ స్థాయి వేగంగా పడిపోతోంది.
ఆ విచిత్రమైన వ్యక్తి తన రొమ్ముపై డికెన్స్ రాసిన డేవిడ్ కాపర్ ఫీల్డ్ పుస్తకంతో నిద్రలోకి జారుకున్నాడు. అతను పాత ఇంగ్లాండ్ గురించి కలలు కన్నాడు – అక్కడ పసుపు రంగు పోస్ట్ బండ్లు, తెల్లటి ముఖాలు కలిగిన యువతులు, చెక్ కోట్లు వేసుకున్న లాయర్లు, ఖాళీ కడుపుతో మద్యం తాగిన గ్లాసులు ఉన్నాయి…
ఉదయం ఆరు గంటలకు అతని నిద్ర చెడింది, పుస్తకం నేలమీదకి జారిపడింది. బోరీ ఓడ అగాధంలోకి మునిగినంత పనిచేసింది.
ఆ విచిత్రమైన వ్యక్తి మేల్కొని, ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి తన కళ్లజోడ పెట్టుకున్నాడు. పసుపు రంగు పొగమంచు గోడపై నిలువుగా వేలాడుతూ అతని ముఖానికి తగులుతున్న రెయిన్‌కోట్ తప్ప అతనికి ఏమీ కనిపించలేదు. మంచం కింద నుండి ఒక నల్లటి రాక్షసి మెల్లగా బయటకు వచ్చి గది చుట్టూ పాకడం ప్రారంభించింది – అది అతని పాత తోలు సూట్‌కేస్.
బోరీ ఓడ ఒక పెద్ద అలల మధ్య చిక్కుకున్నట్లు అనిపించింది…
సీసాలోకి ఎవరో తమ శక్తినంతటినీ ఉపయోగించి గాలి ఊదుతున్నట్లుగా ఉంది చుట్టూ వినిపిస్త్హున్న శబ్దం.
అక్కడ తుఫాను ఉందనే విషయం అతనికి వెంటనే అర్థం కాలేదు. మొదట్లో బోరే నౌక, ఒక భారీ జలపాతం అడుగున కొట్టుకుపోయే చిన్న ఎండుపుల్లలా అటూ ఇటూ ఊగిసలాడుతోందని అతను అనుకున్నాడు. ఎండిపోయిన ఆ నౌక చెక్కలోని మేకులు కిర్రుమంటున్నాయి, ఇనుప గడియలు వికృతంగా అరుస్తున్నాయి. కానీ వీటన్నింటికంటే దారుణమైన శబ్దం ఏమిటంటే, బయట నౌక తాళ్ళ గుండా సుడిగాలి నిరంతరం, స్పష్టంగా చేస్తున్న భయంకరమైన హోరు.
అతను త్వరత్వరగా కొన్ని దుస్తులు వేసుకొని మెస్ వైపు వెళ్లాడు. అక్కడ అతనికి వేకువజాము ఎదురైంది. ఆ దృశ్యం అతనికి మిలటరీ ఆసుపత్రిలోని ఒక శీతాకాలపు రోజును గుర్తుచేసింది. ఆర్పివేయడం మర్చిపోయిన దీపాలు గ్రుడ్డు ఆకారపు మంటలతో వెలుగుతున్నాయి, కిటికీల నుండి అసహ్యకరమైన వెలుతురు ఇంకి వచ్చి చిన్న చిన్న నీటి మడుగుల్లా తయారవుతోంది.
అతను తలుపు తెరిచి డెక్ మీదికి వెళ్లాడు. ఆకుపచ్చగా, మసకగా ఉన్న ఆ ఉదయం నౌక ప్రక్క భాగాలను ముంచెత్తుతూ, భయంకరంగా గర్జిస్తోంది. సముద్రం ఒక గోడలా కదులుతోంది, తాళ్ళ అమరిక నుండి వస్తున్న మూలుగుల శబ్దం అతని శరీరంలో వణుకు పుట్టించింది. అతను ప్రాకుకుంటూ బ్రిడ్జ్ వైపు వెళ్లాడు, కానీ అక్కడ దృశ్యం ఇంకా దారుణంగా ఉంది. మంచు గడ్డకట్టి తిరిగినట్లుగా బోరే నౌక ఇక్కడ గుండ్రంగా తిరుగుతోంది.
స్టెర్న్ వేసుకున్న వాటర్‌ప్రూఫ్ కోటు పూర్తిగా తడిసిపోయింది, జూనియర్ ఆఫీసర్ కోటు కూడా అంతే. స్టెర్న్ ఆ విచిత్రమైన వ్యక్తి వైపు చూసి నవ్వి, కిందకి వేలు చూపెట్టాడు. దాంతో ఆ విచిత్రమైన వ్యక్తి రక్తం గడ్డకట్టుకుపోయింది. దీని అర్థం బోరే ఏ క్షణంలోనైనా మునిగిపోబోతోందని అతను అనుకున్నాడు. కానీ అతను తనను మర్యాదగా కింద ఉన్న తన కేబిన్‌కు వెళ్లమని కోరుతున్నాడని ఆ తర్వాత అర్థం చేసుకున్నాడు. అతను మొండిగా తల అడ్డంగా ఊపి, బ్రిడ్జ్ పైనే ఉండిపోయాడు.
స్టెర్న్ అతనిని పట్టించుకోవడం మానేశాడు. అతను ముందుకు పదునుగా చూస్తూ, పదే పదే నౌక ఇంజిన్-రూమ్ టెలిగ్రాఫ్ హ్యాండిల్‌ను లాగుతున్నాడు. నీటి ప్రవాహాలు బోటుపై విరుచుకుపడుతున్నాయి, వాటి ముందు భారీగా నురుగు కుప్పలను లేపుతున్నాయి. ఒకానొక క్షణంలో బోరే నౌక పని అయిపోయిందని ఆ విచిత్ర వ్యక్తి నమ్మాడు. ఆ బోటు అలల మధ్యలోకి కూరుకుపోయింది, కొన్ని నిమిషాల పాటు నురుగులతో నిండిన సముద్రం పైన ఎర్రటి పొగగొట్టం స్టెర్న్ నిలబడి ఉన్న బ్రిడ్జ్ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ తర్వాత బోటు అయిష్టంగా పైకి లేచింది, చిల్లులున్న బకెట్ నుండి నీరు ఒలికినట్లుగా దాని డెక్ నుండి నీరు బయటకి ప్రవహించింది. స్టెర్న్ యొక్క బిగుతుగా ఉన్న వీపును చూసి ఆ క్షణం ఎంత ప్రమాదకరమైనదో ఆ విచిత్ర వ్యక్తి గ్రహించగలిగాడు.
మెగాఫోన్ ద్వారా వచ్చిన ఒక కోపపు అరుపుతో అతను తేరుకున్నాడు, ఆ అరుపు తుఫాను హోరులో దాదాపు కొట్టుకుపోయింది. స్టెర్న్ బొంగురు గొంతుతో అరిచాడు:
“హోల్డ్‌లో ఉన్న బొమ్మల సంగతేంటి, చోఖ్?”
“ఇప్పటివరకు బాగానే ఉన్నాయి,” అని ఇత్తడి గొట్టం నుండి ప్రతిధ్వని వచ్చింది.
స్టెర్న్ ఆ విచిత్ర వ్యక్తి కాలర్ పట్టుకుని అతని చెవిలో అరిచాడు.
“మనం నార్త్ ఛానల్‌లోకి ప్రవేశించి తీరాలి!”
ఆ విచిత్ర వ్యక్తి సమాధానంగా తల ఊపాడు, కానీ దాటుకొని ముందుకు వెళ్లడం అసాధ్యమని మనసులో అనుకున్నాడు. ఒక గుంపు దాడి చేసినప్పుడు ఒక మనిషి ముఖంపై ఇటు అటూ దెబ్బలు పడితే అతను ఎలా ఊగిపోతాడో, అలాగే బోరే నౌక కూడా ఊగిపోతోంది. నౌక ముందు భాగం ఆ రాపిడి దెబ్బల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించకుండా, నిలువెత్తున లేచే అలల మీదికి ఎదురుగా దూసుకెళ్లడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఇది నిరాశ నుండి వచ్చిన ధైర్యం లేదా కేవలం పొగరుబోతుతనం అయి ఉండాలి. లేదా కేవలం అహంకారం.
స్టెర్న్ తన పెదవులను రబ్బరుతో చేసినట్లుగా వెడల్పుగా తెరిచి, బొంగురు గొంతుతో అరిచాడు.
“గాలి తీవ్రత పదకొండు! నేను చెప్పేది వినిపిస్తుందా? అవును. రాత్రికి. రాత్రికి మనం ఖచ్చితంగా సరుకును చేరవేస్తాం. కిందకి, కిందకి…”
అతని పెదవులపై ఒక చిరునవ్వు వికసించింది.
ఆ విచిత్ర వ్యక్తి కిందకి ప్రాకుకుంటూ వెళ్లాడు. మెస్‌రూమ్‌లోని సోఫా పై ఒక పనిమనిషి పడుకుని ఉన్నాడు. వంటగది పని చేయడం లేదని, చల్లటి ఆహారాన్ని మాత్రమే వడ్డించాల్సి వస్తుందని అతను అసహనంగా
ఉన్నాడు. అసలు తిండి తినాలనే ఆలోచనే విపరీతంగా అనిపించింది, ఆ వ్యక్తి మాటలను అతని మానసిక సమతుల్యత లోపించడం వల్ల వచ్చినవిగా ఆ విచిత్ర వ్యక్తి కొట్టిపారేశాడు.
మధ్యాహ్నం మూడు గంటలకు డెక్ పైన సైరన్ భయంకరంగా మోగింది. ఆ విచిత్ర వ్యక్తి తన ముక్కును మంచు గడ్డకట్టిన కిటికీకి ( ఆనించి చూశాడు; సముద్రం నుండి వెనుక భాగం పైకి లేచి,జండా స్తంభం పై జెండా ముక్కలు ఎగురుతున్న ఒక తుప్పు పట్టిన బోటు కనిపించింది. ఆ బోటు నీటిలోకి మునిగి వర్షంలో మాయమైపోయింది. అతను నావికుడు కాకపోయినప్పటికీ, ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాడు: బోరే జెండా దాని నౌక వెనుక భాగంలో ఉంది, కానీ ఆ ఇతర బోటు జెండా మాత్రం సగం ఎత్తులోఎగురుతోంది. అతను దాని గురించి స్టీవర్డ్‌ను అడిగాడు.
“దానిలో విచిత్రం ఏముంది?” అని స్టీవర్డ్ విసుగ్గా సమాధానమిచ్చాడు. “వాళ్లు సహాయం కోసం అడుగుతున్నారు.”
సహాయం కోరడం తక్కువలో తక్కువ ఊహించినా వ్యర్థమని ఆ విచిత్ర వ్యక్తికి కూడా అర్థమైంది. ఆ ఇతర
బోటు సుడి తిరుగుతున్న నురుగులో కొట్టుకుపోయింది. ఆ తర్వాత అలల మధ్య విరామాలలో దాని ఎర్రటి అడుగు భాగం కేవలం కొద్దిగా మాత్రమే మెరుపులా కనిపించింది.
ఆ విచిత్ర వ్యక్తి వణికిపోతున్నాడు. అతను బోరే నౌక భద్రతపై దాని సమర్థతపై నమ్మకాన్ని కోల్పోయాడు…
“నేను ఉప్పు పరిచిన మాంసం సరుకు తీసుకెళ్తుంటే, నేనెప్పుడూ దారి మార్చుకునేవాడిని కాను,” అని స్టెర్న్ గొణుక్కున్నాడు. “ఇక వెళ్లి పడుకో.”
ఆ విచిత్రమైన మనిషి మౌనంగా తన క్యాబిన్‌లోకి వెళ్లి, బట్టలు మార్చుకుని పడుకున్నాడు. సముద్రపు అలల ఉధృతి తగ్గి, సమానంగా, ఆహ్లాదకరంగా మారింది. అతనికి వెచ్చగా అనిపించి నిద్రలోకి జారుకున్నాడు.
అతనికి ఒక నగరం కలలోకి వచ్చింది. అక్కడ మంచు దట్టంగా, నిశ్శబ్దంగా కురుస్తూ, ఇళ్ల పెంకులను ఓడల బ్రిడ్జిలను కప్పివేస్తోంది.
సముద్రం నుండి వీచే చలి గాలి వసంతకాలం లాగా తాజాగా, ఎప్పటికీ మరచిపోలేనిదిగా ఉంది. సంధ్యా సమయంలో లక్షలాది దీపాలు మిలమిలా మెరుస్తున్నాయి.
స్టెర్న్ బంగారు రంగు వి-ఆకారపు గీతలు ఉన్న కొత్త జాకెట్ ధరించి బ్రిడ్జి మీదికి వచ్చాడు. శుభ్రంగా గడ్డం గీసుకున్న
అతని ముఖంలో యవ్వనం కనిపిస్తోంది.
‘బోరీ’ ఓడ గంభీరంగా హారన్ మోగించింది. పెద్ద పెద్ద దివిటీలు వెలిగించారు, వారు సరుకు దించడం ప్రారంభించారు. బొమ్మల పెట్టెల నుంచి కొత్త పెయింట్ వాసన వస్తోంది.
ఆ విచిత్ర మనిషి ఒడ్డుకు వెళ్లి, మంచుతో మెత్తగా ఉన్న సందులలో తిరిగాడు. జూల్స్ వెర్నే కథలలోని పాత్రల లాంటి వృద్ధులను అతను కలుసుకున్నాడు, వారి పైపుల నుండి వచ్చే ఘాటైన పొగను ఆస్వాదించాడు.
ఆ నగరంలో పాత ఓడల వాసన వస్తోంది. వీధుల్లో ఉత్సాహంగా, ఎర్రటి బుగ్గలు కలిగిన ఆయాలు తమ పిల్లలకు కథలు చెప్తున్నారు. పిల్లల కోసం బొమ్మలు తీసుకురావడానికి ‘బోరీ’ ఓడ ప్రళయం లాంటి భయంకరమైన, మంచుగడ్డ లాంటి చల్లనైన తుఫానును ఎలా ఎదుర్కొందో వివరిస్తున్నారు. పిల్లల కళ్ళు ఆనందంతో, చెప్పలేని కన్నీళ్లతో మెరిసాయి.
మంచు తెరిచిన పొయ్యిల నుండి వచ్చే మంటలు హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ కథల్లోని మాయా సన్నివేశాలను గుర్తుచేశాయి. ఆ విచిత్ర మనిషి సున్నితమైన…సిండ్రెల్లా అడుగుజాడలను గమనించాడు. ఆమె చిన్న పాదాలు
చాలా వెచ్చగా ఉన్నాయి, ఆమె అడుగులు వేస్తుంటే మంచు కరిగిపోతోంది. అతను ఆ అడుగుజాడలను అనుసరించగా, అవి అతన్ని ‘బోరీ’ ఓడ వద్దకు తీసుకెళ్లాయి. సిండ్రెల్లా పడవపై నిలబడి స్టెర్న్‌తో మాట్లాడుతోంది. స్టెర్న్ ముఖం చిరునవ్వులతో వికసిస్తోంది.
ఆమె అతని వైపు తిరిగినప్పుడు ఆ విచిత్ర మనిషి ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆమె కళ్ళు మెరిసాయి, ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. ఆమె నల్లటి జుట్టులో చిన్న మంచు తుంపరలు చేరాయి. సముద్రపు నీటి రంగులో ఉన్న ఆమె దుస్తులు, నగరం పైన పేలుతున్న బాణసంచా వెలుగుల్లో రంగులు మారుతూ మెరిసాయి. ఆ బాణసంచా ఒక పెద్ద శీతాకాలపు పండుగ ప్రారంభానికి సంకేతం.
ఆ విచిత్ర మనిషి నిద్రలేచాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. అతను డెక్ మీదికి వచ్చాడు. ప్రశాంతమైన వేకువ వెలుగులో అతని ముందు బెల్ఫాస్ట్ కనిపిస్తోంది. లేత మంచులో దాగి, ఇంకా దీపాలు వెలుగుతున్న ఒక పాత నగరం. అక్కడ శరదృతువు గడ్డి వాసన వస్తోంది. ‘బోరీ’ ఓడ నీటిపై మెల్లగా ఊగుతూ, ఆ నగరానికి నెమ్మదిగా నమస్కరిస్తున్నట్లు ప్రయాణిస్తోంది.
1929
—-
