ఆశల దారిలో…

Spread the love

చాలా సంవత్శ రాల తర్వాత వంశీ , ఇండియా కి వస్తున్నాడు . అందుకే ప్రయాణమంతా, చాలా రకాల భావొద్వేగాలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ వచ్చాడు.
తల్లి తండ్రులు చని పోవడం తో ఇండియా కి రావడానికి, సరి ఆయిన కారణం కూడా వంశీకి దొరక లేదు. అతని
చెల్లెలు కూడా అమెరికా లో నే సెటిల్ అయింది . దానితో రావాల్సిన అవసరం కూడా అతనికి ఏమీ కలగలేదు .
కానీ ఇప్పుడు , తన దగ్గర స్నేహితుడి సుధీర్ కొడుకు పెళ్ళి .. రాక తప్ప లేదు. ఎలానూ, వెళ్తున్నాను. ఈసారి అందరినీ కలవాలని అనుకుంటూ , రెండు వారాలు శెలవు పెట్టాడు . తన కాలేజీ క్లాస్ మేట్స్ అందరూ తలో చోటా వున్నారు . వాళ్ళల్లో కొంత మందిని పెళ్ళి లో కలవొచ్చు, మిగిలిన వాళ్ళని వాళ్ళ వుండే వూర్లకి వెళ్ళి కలవొచ్చు , అని రెండు వారాలు పకడ్బందీగా ప్లేన్ చేసాడు.
అతని భార్య శ్రావ్య అభ్యంతరం చెప్పలేదు ,” ఇక్కడ అంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు .” అంది.
దానికి ఇంకో కారణం కూడా వుంది . వంశీ చెల్లెలు రమ్య , ఆమె కుటుంబం దగ్గర లోనే వుంటారు . అది కూడా శ్రావ్య కి ధైర్యం . శ్రావ్య , పిల్లలూ ఎప్పుడూ ఇండియా కి , ఆమె తల్లి తండ్రుల దగ్గరకి వెళ్ళి వస్తూనే వుంటారు . అప్పుడప్పుడు. పిల్లలని , వంశీ కి వదలి , శ్రావ్య ఒక్కతే కూడా వెళ్ళి వస్తూ వుంటుంది . అందుకే , వంశీ వెళతానంటే వెళ్ళమని ప్రోత్సహించింది .
తల్లి తండ్రులు వున్నపుడు వుండే ఫ్లాట్ , ఎప్పుడయినా ఎవరు వెళ్ళినా వుంటుందని , అలానే వుంచేసారు . శ్రావ్య తల్లి తండ్రులు కూడా దగ్గర లోనే వుండడం తో , వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ ఫ్లాట్ శుభ్రం చేయిస్తూనే వుంటారు .. అందుకే వంశీ కి గానీ, అతని చెల్లెలు రమ్య కి కానీ , ఇండియా కి వెళ్తే , ఎక్కడ వుండాలనే సమస్య రాదు . ఎందుకో హొటల్ లో వుంటే ఇంట్లో వున్న , ఫీలింగ్ రాదు అని వంశీ అనుకుంటాడు. రమ్య కూడా అదే అంటుంది.
ఫ్లైట్, లేండ్ అయి, అన్ని ఫార్మాలిటీస్ అయి బయటకి వచ్చిన వంశీని , సుధీర్ ఆప్యాయంగా కౌగలించుకున్నాడు.
వంశీ లగేజ్ ని కార్ లొ కి ఎక్కించి ఎద్దరూ కార్లో కూర్చున్నారు . సుధీర్ కార్, డ్రైవ్ చేస్తూ ముందు ఒక భవనం ముందు ఆపాడు . అక్కడ ఒక బోర్డ్ వుంది . ” ఈ స్టేట్ లోకి , ఈ సిటీ లోకి, ప్రవేశించ డానిని అవసరమయిన భాష అవగాహన పరీక్ష చేయబడును .” అంటూ .
” రా ! , వెళ్ళేముందు ఈ పరీక్ష చేసుకోవాలి.” , అంటూ ..ముందుకు దారి తీసాడు సుధీర్ . వంశీ అయోమయంగా అతనిని వెంబడించాడు. లొపల ఒక గదిలోకి వెళ్ళారు . అక్కడ ఒక అతను వంశీ పాస్పోర్ట్ చూసి తెలుగులో కొన్ని ప్రశ్నలు వేసాడు.
అన్నిటికీ వంశీ చెప్పిన జవాబులు విని ఒక పత్రం మీద స్టాంప్ వేసి ఇచ్చాడు .ఏమిటా అని కుతూ హలం తో చూసిన వంశీ , దానిలో వున్నదానికి ఆశ్చర్య పోయాడు.
వంశీ పేరు , లోకల్ ఎడ్రెస్ ప్రస్తావిస్తూ , ఇతను ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడే . భాష బాగా మాట్లాడగలడు. అని వుంది.
ఆశ్చర్య పోతూ అన్నాడు . ” ఇదేమిటిరా ? ” అంటూ
ఈ మధ్య ప్రవేశ పెట్టారు రా . అన్ని రాష్ట్రాల లోనూ. ఇదే నడుస్తోంది. ” ఒకరిని చూసి ఒకరు, మా రాష్ట్ర భాష రాకపోతే రావద్దు .” , అంటూ.
అది , నోరు తెరిచి మరీ విన్నాడు వంశీ . తెరుకునేసరికి కొంచెం సేపయింది. చుట్టూ చూసాడు ఒకసారి . చాలామందే వున్నారు అక్కడ. అక్కడ చాలా గదులు పక్క పక్కనే వున్నాయి . అన్ని టికీ బోర్డ్స్ వున్నాయి .
” రెండు రోజులు వుండడానికి అవసర మయిన భాష నేర్ప బడును .” ,
” పది రోజులు వుండడానికి అవసరమయిన భాష నేర్పబడును. “
” నెల రోజులు ఇంకా అంత కన్న ఎక్కువ వుండ దలిచిన వాళ్ళ కోసం … భాష నేర్పబడును , “
” మీ వ్యాపార తదితర వ్యవహార సంబంధిత అవసరాలకి అవసరమయిన భా ష కోసం ..”
అన్ని బోర్డ్స్ చదువుతూ ” ఏమిటిరా ఇదంతా ?…” అన్నాడు వంశీ, విస్తు పోతూ , భయం గా .
” రాష్ట్ర భాష లోనే అందరూ మాట్లాడాలని . రాకపోతే నేర్చుకుని రండి … “, అని అన్ని రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి .
చూసావుగా. దానికి తగ్గట్లు పుట్టగొడుగుల్లా, ఈ కోచింగ్ సెంటర్స్…… .”
” నువ్వు ఈ రోజు రెస్ట్ తీసుకో . రేపు పెళ్ళి . మన క్లాస్ మేట్స్ వస్తారు అంతా హడవిడిగా వుంటుంది . ఫుల్ బిజీ గా వుంటుంది. మీ అపార్ట్మెంట్ వాచ్ మెన్ ని ‘ఫ్లాట్ శుభ్రం చేసావా?’ , అని అడిగాను . మీ మామగారు, మొన్నే వచ్చి అన్ని శుభ్రం చేయించారు, అన్నాడు. నీకు ఫుడ్ అంతా నేను ఏర్పాటు చేస్తాను . నా ఇల్లు , ఇక్క డకి దగ్గరే గా ఏమీ వర్రీ అవకు . “
” లేదురా . అంకుల్ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ దగ్గరే కదా . ..”
” నువ్వు అదేమీ పెట్టుకోకు. ఎప్పుడూ రాని వాడివి, మా ఇంట్లొ పెళ్ళి కని సముద్రాలు దాటి వచ్చావు . నువ్వు వున్నన్నాళ్ళు , నీ బాధ్యత నాదే …” మాట్లాడుతూనే ఇంటికి వచ్చేసారు.
సుధీర్ , వంశీని ఇంట్లో దింపి వెళ్ళిపోయాడు .
ఇల్లంతా ఒకసారి కలయ తిరుగి చూసాడు . ” ఇల్లు అమ్మ నాన్న వున్నపుడు ఎలా వుందో , అలానే వుంది . ఏమీ మార్పు లేదు .” , అనుకుంటూ, లగేజ్ ఒపెన్ చేసి బట్టలు తీసి స్నానం చేసి ఫ్రెష్ అయి కూర్చుని శ్రావ్యకి , శ్రావ్య తండ్రి కీ ఫోన్ చేసాడు, ” ఇంటికి చేరాను .”, అని .
వాళ్ళతో మాట్లడుతూ వుండగానే సుధీర్ క్యారీరు తెచ్చి, టేబుల్ మీద పెట్టి , కూర్చున్నాడు.
” నువ్వు తిన్నావురా ? ” అంటూ అడిగాడు వంశీ .
“లేదు . నీతో తింటాను అని చెప్పాను. ఇద్దరికీ సరిపోయినట్లే సద్దింది, నా భార్య కుమారి . ..”, అంటూ లేచి రెండు కంచాలు గరిటెలు అన్నీ కడిగి తిసుకుని వచ్చి , కూర్చున్నాడు. .
ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తినడం పూర్తి చేసాక వంశీ అన్నాడు. . “ నీకు పెళ్ళి పనులు బోలెడు పెట్టుకుని నా కోసం అటూ ఇటూ తిరగడం బాగోలేదు . ఈ రోజు కాస్త సద్దుకున్నాక , నేనే రేపు మీ ఇంటికి వస్తాను లేరా . నువ్వు నాకోసం తిరగకు .” , అన్నాడు వంశీ .
” పర్వాలేదురా . నాకూ నువ్వు అనుకున్నట్లు పెద్ద పనులు ఏమీ లేవు . . ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో .
వాచ్ మేన్ భార్య వచ్చి నీకు అన్ని పనులు చేస్తుంది . ఏ అవసరం వచ్చినా వాచ్ మేన్ కి చెప్పు . అతను చేసి పెడతాడు . ఫుడ్ అంతా, టైం కి ఇంటి దగ్గరనుంచి వస్తుంది. వీలవుతే రాత్రి డిన్నర్ కి కలుస్తాను .” అంటూ వెళ్ళిపోయాడు .” , సుధీర్ .
వంశీ కూడా జెట్ లేగ్ కి ఎంత కంట్రోల్ చేసుకున్నా నిద్ర ఆగక పోవడం తో నిద్ర పోయాడు .
మధ్య రాత్రి మెలుకువ వచ్చి చూసేసరికి , సుధీర్ వచ్చినట్లు వున్నాడు. ఫుడ్ టేబుల్ మీద అంతా ఎరేంజ్ చేసి వుంది .
ఒక బౌల్ లో పళ్ళ ముక్కలు కూడా కోసిపెట్టి వున్నాయి . వాటిని చూసేసరికి , ఎక్కడ లేని ఆకలి వేసింది వంశీకి . టైం చూస్తే ఒకటి అయింది . బ్రష్ చేసుకుని ఫుడ్ తిన్నాడు. నిద్ర పట్టక భార్య తో పిల్లలతో కాస్సేపు మాట్లాడేడు.
టైం వుంటే చదువు కోవచ్చు అని మూడు పుస్తకాలు కూడా తెచ్చుకున్నాడు . ఒకటి తీసి కాస్సేపు చదివాడు , చూస్తూండగానే తెల్లారింది. వాచ్ మేన్ , పాల పేకట్ తెచ్చి ఇచ్చాడు. శ్రావ్య తండ్రి, కాఫీ , టీ , చక్కెర , అన్నీ ముందే తెచ్చి పెట్టాడు .
ఆయనకి , థేంక్స్ చెప్పుకుంటూ కాఫీ తాగి, సుధీర్ దగ్గరకి వెళ్ళడానికి రెడీ అయ్యేసరికి సుధీర్ వచ్చాడు.
“పెళ్ళి వెన్యూ లో టిఫిన్ కాఫీ అరేంజ్మెంట్స్ వున్నాయి . అక్కడే, తిందాం రా మన క్లాస్ మేట్స్ కూడా వస్తూ నే వుంటారు .”, అంటూ , వంశినీ కూడా కార్ లో పెళ్ళి వెన్యూ కి తీసుకు వెళ్ళాడు . సుధీర్ అన్నట్లు అప్పటికే వంశీ క్లాస్ మేట్స్ , ప్రసాద్ , రవి , కుమార్ వచ్చివున్నారు .
“నువ్వు వస్తున్నావని చెప్పాడు సుధీర్ . అందుకే మేము ముందే వచ్చాం .” అంటూ అందరూ ఆప్యాయంగా వంశీని ఆలింగనం చేసుకుని, కుశలప్రశ్నలతో, అందరూ అందరినీ వుక్కిరి బిక్కిరి చేసుకుంటూ కాస్సేపు భావోద్వేగాలకి గురి అయ్యారు .
ఇంక ఆ రొజు పెళ్ళి హడావిడితో నూ స్నేహితుల కబుర్లతోనూ తెలియకుండానే జరిగి పోయింది
ఆ తర్వాత రెండు రోజులూ కూడా అందరూ వంశీ ఇంట్లోనే మీట్ అవడం తో. వంశీకి , టైం కూడా తెలియ లేదు.
మూడు రోజులయ్యేసరికి అంతా హడావడి సద్దు మణిగింది .
శ్రావ్య తల్లి తండ్రుల దగ్గరకి కూడా వెళ్ళి కాస్సేపు వాళ్ళతో కబుర్లు చెపుతూ గడిపాడు . వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు . ” మాదగ్గరకి, వచ్చి మాతో వుండండి .”. అని చెపు తూనే ఉంటాడు. కానీ వాళ్ళకీ, ఇక్కడ అలవాటు అయి , వదలి రావాలంటే వాళ్ళకి కష్టం . శ్రావ్య అన్నయ్య , ప్రభాకర్ , ఇండియా లో నే వుంటాడు . అతను వచ్చి చూసి పోతూంటాడు .
వంశీ తల్లి తండ్రులు కూడా అక్కడకి వచ్చి వుండడానికి ఇష్ట పడే వారు కాదు . వచ్చి రండు మూడు నెలలు కన్నా కూడా ఎక్కువ వుండే వారుకాదు .
తను ప్లేన్ వేసుకున్నట్లు , శ్రీధర్ ని, చక్రి ని ,సుధాకర్ ని, వాళ్ళ వుండే సిటిస్ కి వెళ్ళి కలవాలి . వాళ్ళకి పెళ్ళి కి రావడానికి కుదరదని ముందే చెప్పారు .
ముగ్గురి దగ్గరకి తలొ రెండు రోజులూ అంటూ ప్లేన్ చేసాడు .
ముందుగా శ్రీధర్ దగ్గరకి వెళదామని, ఆన్ లైన్ టికెట్స్ బుక్ చేసాడు .
సుధీర్ వచ్చి ఏయిర్ పోర్ట్ లో దింపాడు .
” ఒరేయ్ ! ఎయిర్ పోర్ట్ లో నీకు భాష అవగాహన గురించి ఇచ్చిన సర్టిఫికేట్ జాగ్రత్త . అందు బాటులో వుంచుకో . మళ్ళీ వచ్చేడప్పుడు అవసరం అవుతుంది ..” అంటూ జాగ్రత్త చెప్పాడు .
” నేను కూడా శ్రీధర్ కి ఫోన్ చేసాను రా. నువ్వు వస్తున్నావని నీ ఫ్లైట్ వివరాలు కూడా ఇచ్చాను . వాడు వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటాడు.. “
” పర్వలేదురా నేనెమయినా చిన్న పిల్లాడినా ? .. వాడి ఫోన్ నంబర్ నాదగ్గర వుంది . ఏడ్రెస్ కూడా తీసుకున్నాను. “
అంటూ నవ్వేసాడు . వంశీ .

సుధీర్ అన్నట్లే. శ్రీధర్ వచ్చి. ఎయిర్ పోర్ట్ లో వంశీని, రిసీవ్ చేసుకున్నాడు .
అక్కడ బయటకి వచ్చేటప్పుడు భాష అవగాహన పరిక్ష , కోసం ఆగాల్సి వచ్చింది . అక్కడ శ్రీధర్ గెరంటీ పత్రం రాసి ఇచ్చాడు , ” ఇతను రేపు వెళ్ళిపోతాడు . వుండేదే ఒక్క రోజు కాబట్టి, భాష శిక్షణ కోసం ఒక రోజు అయినా వెచ్చించ లేడు . ఇతనిని నేను వెళ్ళే వరకూ వెంబడించే వుంటాను కాబట్టి , ఇతని తరపున నేనే అందరితో నూ మాట్లాడుతాను. కాబట్టీ, ఎటువంటి అసౌకర్యమూ ఎవరి కీ కలుగకుండా చూసుకునే బాధ్యత నాది .” అని .
చూస్తున్న వంశీ కి, మతి పోయినంత పని అయింది.
అక్కడ వున్నట్లుండి ఒక ఆటో డ్రైవర్ గట్టిగా అరుస్తున్నాడు . ” బతుకు తెరువు కోసం. ఏదొ ఒక పట్టణానికి వెళ్ళక తప్పదు మాకు . . ఎక్కడకి వెళ్ళినా అక్కడ భాష నేర్చుకునే వెళ్ళాలని ఆంక్షలు పెడితే , మేము ఏమవాలి? ….భాష నేర్చుకోవాలంటే, ఏభయి వేలు ఇమ్మంటున్నాడు .. అదీ కాక నేర్చుకోవడానికంటూ ఇక్కడ వుండడానికి మళ్ళీ ఖర్చు . మేము ఎలా బతకాలీ ? మేము బతక కూడదనా ? … .”
పక్క వున్న అతను, కూడా గట్టిగా అరుస్తున్నాడు, ” ఇంత ఖర్చు పెట్టగలిగితే మేము ఏ అరబ్ దేశానికో వెళ్ళేవాళ్ళం ..

రా ! …రా !…. ..ఇంత ఖర్చు పెట్టీ లోపలకి వెళ్ళినా , రేపు మళ్ళీ వీళ్ళు, మా ప్రాంతం వాళ్ళు కాదని, వెళ్ళ గొట్టినా వెళ్ళ గొడతారు .. . ఇదంతా మన ఖర్మ … మన దేశం లోనే మనం స్వేచ్చగా తిరిగే అవకాశం లేకుండా చేస్తున్నారు. . పరాయి వాళ్ళల్లా బతకాల్సి వస్తోంది. ఇదంతా చూస్తే బయట దేశం వాళ్ళే , నయం ఏమో అనిపిస్తోంది … ” , అంటూ విసురుగా బయటకి వెళ్ళిపోయాడు. అతనితో పాటు, అంతకు ముందు అరిచిన అతను, కూడా వెళ్ళి పోయాడు..

ఆ గొడవకి , అక్కడ వున్న జనం కూడా అసహనం తో వాళ్ళ అసంతృప్తి ని వాళ్ళ ల్లో వాళ్ళు పంచుకుంటూ కాస్సేపు గుస గుస లాడుకో సాగారు ..

” అవును, ఎక్కడకీ స్వేఛ్చగా వెళ్ళ లేకపోతున్నాం ….”

” మొన్నటికి మొన్న , వాళ్ళ భాష లో మాట్లాడ లేదని ఒకరిని కొట్టేరుట. …”

” అదేమిటి భాష నేర్చుకోకుండా అసలు లోపలకి వదలటం లేదు కదా ? అసలు అటువంటివి జరుగుతున్నాయనేగా ఇవన్నీ పెట్టారు “

” అటువంటివి జరిగితే మందలించకుండా వాటికి మద్దతు ఇస్తూ ఇవన్నీ ఏమిటి చెప్పు ? ఇప్పుడు చూడు. ఇంకా. జరుగున్నాయి అంటే ! …. ఎంత నేర్చుకున్నా కాస్త తడబడతారు !…ఏదో చూసీ చూడనట్లు వదిలెయ్యాలి కానీ …..”
” ఇటువంటి పరిస్థితిల్లో, ఎక్కడి వాళ్ళు అక్కడ వుండి కల్లో గంజో తాగడం మేలు ..”
అన్నీ వింటూ , అదంతా చూస్తున్న వంశీ , బయటకి వచ్చాక ,
” ఏమిటిరా ఇదంతా? “, అడిగాడు వంశీ , అయోమయం గా అసహనం గా .
“. ఈ మధ్య ఎవరయినా సరే, రాష్ట్ర భాష రాని వాళ్ళు ఆ రాష్ట్రం లో కి వెళ్ళకూడదు. ఆ రాష్ట్ర భా ష నేర్చుకుని మాట్లాడగలిగితే నే , ఆ రాష్ట్రానికి వెళ్ళాలి అని ఆదేశాలు. అందుకే అన్ని ఎంట్రీ పాయింట్స్ దగ్గర ఎవరి అవసరాన్ని బట్టి వారికి భాష నేర్పే కోచింగ్స్ కూడా ఏర్పాటు చేసారు . “
” మరి కూలి వాళ్ళ మాట ఏమిటి ? ప్లంబర్స్ , కార్పెంటర్స్ , ఆటొ నడిపే వాళ్ళు ….వాళ్ళ మాట ఏమిటి ..”
” ఎవరయినా సరే , భాష నేర్చుకోక తప్పదు . వాళ్ళు చాలా నెలలు, సంవత్శరాలు వుండే అవకాశం వుంది కాబట్టి వాళ్ళకి నెల రెండు నెలలు కోచింగ్ ఉంటుంది . డబ్బులు కూడా ఎక్కువే తీసుకుంటారు . ఇప్పుడు చూసావుగా, ఆటొ డ్రైవర్లు గొడవ పెట్టుకోవడం . అక్కడ వున్న అందరి లో కనిపిస్తున్న అసంతృప్తి … ..”
” బదిలీ లు అయే ఉద్యోగస్తులు అవుతే …”
” వాళ్ళకి , బదీలీ అయిన వూరు లో వేరే భాష వుంటే , రిపోర్ట్ చేసేముందు వాళ్ళకి సంబంధించిన ఆఫీసు వాళ్ళు ఆ భాష కోచింగ్ ఇప్పిస్తారు ….”
” ఇంతకీ ఇంకో దేశం నుంచి టూరిస్ట్స్ వస్తే ?…..”
” ఏముంది ఇప్పుడు నేను గేరంటీ ఇచ్చినట్లే , టూర్ ఆపరేటర్ గెరంటీ ఇస్తాడు. శత కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ..” అంటూ గట్టిగా నవ్వాడు, శ్రిధర్.
” అన్ని రాష్ట్రాలు మన దేశ మే కదా , ఈ ఈ నియంత్రణలు ఏమిటిరా ? ” .
” అంటే , ఈ మధ్య అందరికీ , వారి ప్రాంతం , భాష , సంస్కృతి మీద మక్కువ ఎక్కువ అయింది. ఎవరి భాష ని సంస్కృతిని వాళ్ళు కాపాడు కోవాలంటే , ఇటువంటి నియంత్రణలు అవసరం అని , ఎవరితిన్న వాళ్ళు బలం గా నమ్మడం తో , ఈ మార్పు రాక తప్ప లేదు . ఒకరిని చూసి ఒకరు , అందరూ , మాప్రాంతం, మా భాష , మా సంస్కృతి , గొప్ప అంటూ , మాది గొప్ప అంటే , మాది గొప్ప అని …..అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్తితి.. “
” ఆకశ్మికం గా, ఈ కొత్త అభి మానాలు ఎక్కడనుంచి వచ్చాయి రా ? ..”
” ఇదివరకూ నిద్రాణం లో వుండేవేమో . వాటికి అనుగుణమయిన వాతావరణం దొరికి వుంటుంది. బయట పడ్డాయి . . తర్వాత సామూహిక ప్రభావం వలన, ఎటువంటి భావన లేని వాళ్ళలో కూడా కొత్త గా ఏర్పడతాయి .. నీకు తెలియనిది ఏముంది ? ..” , అంటూ నవ్వాడు శ్రీధర్ .
” ఇంతకీ , ఇటువంటి వాటికి అనుగుణమయిన వాతావరణం ఏలా ఏర్పడింది ….”
” వాటి అవసరం ఎవరికో పడి వుంటుంది … అందుకే వాటిని నిద్ర లేపారు .. ..”, గట్టిగా నవ్వాడు శ్రీధర్.
” మనిషిల లో , ప్రేమ ని నిద్ర లేపే అవసరం ఎవరికీ కలగలేదా ?.. వున్న విభేధాలు చాలవన్నట్లు ఇవి కూడానా ? .. ఇన్నాళ్ళు కులం , మతం , అంటూ … ఇప్పుడు ఇవి. .. బాగుంది ! ” , వంశీ కూడా నవ్వుతూ అడిగాడు .
మళ్ళీ అన్నాడు, ” మనం అవస రాన్ని బట్టీ , ఎవరూ చెప్పక పోయినా ఎక్కడికి వెళ్తే అక్కడ భాష నేర్చుకుంటూనే వుంటున్నాం . కానీ ఇటువంటి ఆంక్షలు పెడితే మాత్రం, ఇబ్బందిగా వుంటుంది . కనిపించకుండానే అడ్డు గోడలు కట్టినట్లు అనిపిస్తుంది. ..”
” కనిపించకపోవడం ఏమిటి , కనిపిస్తున్నాయిగా ! .. నువ్వూ చూసావు ! …” , అంటూ నవ్వాడు , శ్రీధర్.
ఒకసారి, శ్రీధర్ కేసి ఆశక్తి గా చూసి , తనూ నవ్వేసాడు వంశీ .
” చిన్నపుడు , హద్దులు, ఎల్లలు లేని ప్రపంచం చూడాలని అనుకునే వాళ్ళం . ..అది చూడలేకపోయాం. కానీ, ఇలా చూస్తామని ఎప్పుడూ అనుకోలేదు ….. వున్న విభేధాలు చాలవన్నట్లు , రాను రాను కొత్తవి ఏడ్ అవుతున్నాయి .. .. ఇన్నాళ్ళు, కులం , మతం, అంటూ … ఇప్పుడు ఇవి. .. బాగుంది ! .. “
” ఊ ! … ఏదో, ఒక మార్పు వస్తూనేవుంటుంది … అన్నిటినీ అంగీరించడమే . దేనినీ ప్రశ్నించే పరిస్తితిలో ఎవరమూ లేము ….. ఇప్పుడు, ఇలా వుంది . భవిషత్తు లో ఎలా వుంటుందో ఎవరికి తెలుసు ” అన్నాడు శ్రీధర్ .
” ఏ మార్పు అయినా అందరినీ కలిపేది అవుతే , సరే . అందరినీ విభజించేది అవుతేనే , బాధగా వుంటుంది ” , అన్నాడు, వంశీ .
” అని మనం అనుకుంటాం . కానీ, విభజించడం లో లాభం పొందేవాళ్ళు వుంటే ?….. ప్రపంచమంతా లాభ నష్టాల బెరీజుల తోనే నడుస్తోంది గదా …..మంచి , చెడులతో కాదు . నిజానికి మంచి , చేడుల ని కూడా కూడా చివరికీ లాభ నష్టాల తోనే , కొలవాల్సి వస్తోంది .. …”
మాట్లాడుకుంటూనే , శ్రీ ధర్ ఇల్లు చేరారు . ” నాభార్య పుట్టింటికి వెళ్ళింది పిల్లలతో సహా . వచ్చే వారం వరకూ రాదు . ఫీల్ ఫ్రీ .. వంశీని ఇంట్లో కి తీసుకువెళ్తూ అన్నాడు , శ్రీధర్ .
మర్నాడు వంశీని, ఫ్లైట్ ఎక్కిం చేవరకూ కబుర్లు చెపుతూ వూరంతా తిప్పుతూనే వున్నాడు , శ్రీధర్ .
” వాడు చిన్నప్పటినుంచీ అంతే .. కబుర్లు ఎక్కువ . వాడితో వుంటే , టైం తెలియదు అనుకునేవాళ్ళు , కాలేజీ రోజుల లో . ఇప్పుడూ అలానే వున్నాడు .” , అనుకున్నాడు. వంశీ . శ్రీధర్ ఎయిర్ పోర్ట్ లో దింపి వెళ్ళిపోతుంటే, తెలియకుండానే కాస్త వెలితిగా అనిపించింది వంశీకి ..
**
ఇంటికి వచ్చాక కాస్త రిలాక్స్ అయ్యాక చక్రి కి , సుధాకర్ కి వరస గా ఫొన్ చేసి ,
శ్రీధర్ దగ్గరకి వెళ్ళప్పుడు తనకు ఎదురయిన అనుభవం గురించి మాట్లాడుతూ , ” నువ్వే వీలు చేసుకుని , రారా. ఎక్కడకి వెళ్ళినా, భాష, కోచింగులు ..అవీ … అంటూ , నేను తట్టుకోలేకపోతున్నాను . మళ్ళీ, నువ్వూ శ్రీ ధర్ , ఇచ్చినట్లు గేరంటి ఇవ్వడం… ఆ సమస్యలు అన్నీ ఎందుకు ? నువ్వే రా . ..” అంటూ , ఇద్దరికీ వేరు వేరుగా చెప్పాడు.
ఈ లోపు , అనుకోకుండా, శ్రావ్య అన్నయ్య ప్రభాకర్ కుటుంబం తో వచ్చాడు . ” అమ్మ నాన్న ని , చూసినట్లు వుంటుంది . నిన్నూ కలిసినట్లు వుంటుంది అని వచ్చాను . అయినా నిన్ను చూసి కూడా చాలా రోజులు అయింది గదా ..” , అంటూ ఫోన్ చేసి చెప్పాడంతో వంశీ , వాళ్ళతో ఒక రోజంతా వాళ్ళ ఇంట్లోనే గడిపాడు .
చక్రి , సుధాకర్ కూడా ఆఫీస్ ప్రోగ్రాం పెట్టుకుని , వచ్చారు. హొటల్ కన్నా వంశీ ఇంట్లో నే సౌకర్యంగా వుంటుందని , సుధీర్ , ప్రభాకర్ , చక్రి , సుధాకర్ అంతా , వంశీ ఇంట్లోనే కలిసే ఏర్పాటు చేసుకున్నారు . అవసరమయిన. కాఫీ టీ , ఫుడ్ ఏర్పాటులు అన్నీ సుధీర్ చేసాడు.

అందరూ, కుశలప్రశ్నలు వేసుకుని, ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ చాలా సేపు మాట్లాడు కున్నారు .

అలా మాట్లాడుతూ వుండగా నే, వంశీ , భాష గురించిన ఆంక్షల ప్రస్తావన తెచ్చాడు .
“అదేమిటిరా ! .. ఎక్కడికి వెళ్ళినా, అక్కడ భాష నేర్చుకునే వెళ్ళాలనే ఆంక్షలు ఏమిటి ? అవసరాన్ని బట్టి , మనమే నేర్చుకుంటాం . నేర్చుకున్నాం కూడా . ఈ విధం గా బారికేడ్స్ పెట్టి బలవంతం చేయడం ఏమిటిరా , ఆశ్చర్యం గా వుంది. ఏదో పరాయి దేశానికి వెళ్ళినట్లు వుంది తప్ప , మన దేశం అనే భావన ఏదో , మిస్స్ అవుతున్నట్లు అనిపించింది . నేను నాలుగు రోజులు వుండి వెళ్ళిపోతాను , మీరంతా ఇక్కడే వుంటున్నారు .. ఎలా భరిస్తున్నారు ? ..”
వంశీ మాటలకి అందరూ కాస్సేపు నిశ్శబ్దం గా వుండి పోయారు .
సుధాకర్ అన్నాడు … ” ఎందుకు ఏమిటి అని ప్రశ్నించడం కన్నా , తల వంచుకుని ఫాలో అయిపోతే, సరి పోతుంది గదా. ఎనెర్జీ సేవ్ అవుతుంది , అనుకుంటాం అందరమూ.. దేనికయినా , ఎవరికయినా ఎక్కడ సమయం వుంటోంది ? ఇంట్లో పనులు, బయట పనులు , బాధ్యతలు , ఆఫీసు పనులు.. అందరూ చాలా వొత్తిళ్ళకి గురి అవుతున్నారు . ఇంక ఇటువంటి విషయాల గురించి, ఆలోచించడానికి కూడా సమయం వుండటం లేదు.. ఇంక , ప్రశ్నించడం అనేది ఊహకి కూడా రాదు . .. “
“ఈ మధ్య ఈ వేర్పాటు వాదాలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయిరా .. ప్రాంతం, భాష , సంస్కృతి ..ఇలా ఏదో ఒకటి ..మనుషులని వేరు చేయడానికి, సవాలక్ష కారణాలు .. కలప డానికి మాత్రం, ఒక్క కారణం కనబడదు .. ” అన్నాడు చక్రి .
“రక రకాల ఒత్తిళ్ళు….. ఎవరయినా ఏమిటి ఈ పరిస్తితి ? అని అనుకోవడం కూడా, అనుకో లేక పోతున్నారు . ఇంక ప్రశ్నలు ఎక్కడ వస్తాయి ? అయినా ప్రశ్నలు ఎవరికి అయినా సరే ఇబ్బందికరం గా వుంటాయి. అందుకే ఎవరూ ప్రశ్నించడాన్ని సమర్ధించరు సరి గదా తప్పు పడతారు . వేరు చేస్తారు . అటువంటి ఇబ్బందికరమయిన ఏవో పరిణామాలు .. ఏవయినా ఎదుర్కోవాలి . ఎవరు పడతారు అవన్నీ ?…. అందుకే, ఎవరూ మాట్లాడడానికి ఇష్టపడరు. ” , అన్నాడు సుధీర్.
“కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు భిన్న త్వాలు ఎన్ని వున్నా , భిన్నత్వంలో. ఎకత్వం సాధించ గలిగాం అంటూ చిన్నప్పుడు చదువుకున్నాం . ఇప్పుడు ఇదంతా చూస్తూంటే , భిన్నత్వమే కనిపిస్తోంది . ఏకత్వం కనిపించటం లేదు . ” అన్నాడు వంశీ సాలోచనగా .. కాస్త దిగులుగా .
” ఇవన్నీ ప్రభుత్వాలు మారినప్పుడు జరిగేవే .. వీటినీ సీరియస్ గా తీసుకో వల్సిన అవస రం లేదు .” , అన్నాడు సుధీర్ .
” ఏ ప్రభుత్వం అయినా, అందరినీ కలిపే దిశగా వెళ్ళాలి కానీ , విడ దీసే విధం గా వుండకూడదు కదా ..” అన్నాడు వంశీ.
” ఆవిధమయిన ఆలోచన , ఇప్పటి పరిస్తితులలో ఐడియలిజం అనిపించుకుంటుంది . ఐడియలిజం, ఆశించడం అవివేక మే కదా. విభజించి పాలించడం లో , బిటీష్ వాళ్ళ దగ్గర గట్టి శిక్ధణ పొందాము గదా … అదేమీ, మనకి తప్పుగా కూడా అనిపించకపోవడం, … ఆశ్చర్య పోవాల్సిన విషయం కూడా కాదు . ..” , అన్నాడు , సుధాకర్.
” ఈ వేర్పాటు వాదాలు , అటువంటి చర్యలు వల్ల , ఒకరి పట్ల ఒకరికి , అప నమ్మకం , ద్వేషం కలగ చేయడం వల్ల అందరిలోనూ అభద్రత ఏర్పడుతుంది . అది ఏవిధం గా నూ ఎవరికీ మంచిది కాదు . ద్వేషం అంటూ ఏర్పడితే , ఒకరి తోనూ , ఒక అంశం తోనూ ఆగిపోదు …అంతై , అంతంతై , అందరినీ దహిస్తుంది . అఫ్కోర్స్ , ప్రేమ కూడా అంతే .. అందరినీ సంతోష పెడ్తుంది . .. ” అన్నాడు వంశీ .
మళ్ళీ, అన్నాడు , ” అంతేకాదు . డాక్టర్స్ కూడా చెపుతున్నారు. ప్రేమ మంచి హార్మోన్స్ ని , ద్వేషం , చెడ్డ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి అని .
” అది నిజమే . కానీ ఈ వేర్పాటు వాదం వల్ల లాభం పొందే వాళ్ళకి తప్ప , తమకి ఎటువంటి లాభమూ లేదని అందరూ తెలుసుకోవడానికి సమయం పడుతుంది . ఎప్పటికో అప్పటికి తెలుసు కుంటారు . అంత వరకూ వేచి వుండాల్సిందే . ” అన్నాడు సుధాకర్ .
” అయినా మనిషుల మధ్య , ప్రేమ , నమ్మకం , లేకపోతే ..ఎటువంటి బతుకు అది ?…” వంశీ గొంతులో కాస్త బాధ .
” ఇవన్నీ , మనం ఆలోచించడం వల్ల, మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది ? .. ఆలోచించాల్సిన వాళ్ళు, ఆలోచించనా , మాట్లాడినా ప్రయోజనం కానీ .. ” ప్రభాకర్ మాట పూర్తి చేయ కుండా నే ,
” సమాజం అంటే మనమే కదా . మనం వుంటున్న సమాజం గురించి మనమే కదా ఆలోచించాలి ? .. అవసరం అయితే సంస్కరించు కోవాల్సినదీ మనమే … “, చక్రి అన్నాడు.
” ఊ ! …. మనమవుతే , కష్టమనుకున్నా, అన్నిటినీ తల వంచుకుని అంగీకరి స్తున్నాం . ఇప్పుడు పిల్లలు మనలాగ , తల వంచుకుని వెళ్దామని అనుకోవటం లేదు .. .. .ఎటువంటి వేర్పాటు వాదాన్ని అంగీకరించడానికీ ఇష్ట పడటం లేదు .. అక్కడక్కడ ఈ వేర్పాటు వాదానికి వ్యతిరేకం గా నిరసనలు జరగుతూనే వున్నాయి …. ఇప్పుడు పిల్లలకి, వివక్ష లతో పని లేదు . ఇజాలతో సంబంధం లేదు . వారికి కావాల్సినది బతుకు భద్రత .. ..” అన్నాడు సుధాక ర్ .
“అవును. ….. ” కోరస్ పలికాడు , సుధీర్ .
” అమెరికాలో ఏమయినా బాగుందా ? అక్కడా వివక్ష , అసహనం చూస్తునే వున్నాం ..” అన్నాడు, ప్రభాకర్.
” నిజమే .. కానీ ఎక్కడ అయినా సరే ఇటువంటివి , మాట్లాడినా మాట్లాడక పోయినా మనసుకి బాధ కలిగితూనే వుంటాయి . ..”
” చాలా ఏళ్ళ తర్వాత కలిసాం. ఇటువంటి సీరియస్ విషయాలు కాకుండా, వేరే ఏమయినా మాట్లాడు కోవచ్చు కదా.”, అంటూ సుధాకర్ , మాట మార్చాడు
దానితో అందరి సంభాషణ , మళ్ళీ చిన్న నాటి విషయాలు , కాలేజీ విషయాల మీదకీ మళ్ళింది. ఎవరిని ఎవరు ఎలా రేగ్ చేసారు . వాళ్ళ వాళ్ళ , ఫస్ట్ క్రష్ … అన్నిటినీ తలుచుకుని , జోక్స్ వేసుకుంటూ , రాత్రి అంతా కబుర్లతో అందరూ సరదాగ గడిపారు .


వంశీ , తను అనుకున్న విధం గా అందరినీ కలవ గలగడం తో , సంతృప్తిగా తిరుగు ప్రయాణం పట్టాడు. కానీ , అంత సంతోషం లోనూ , ఏదో అసంతృప్తి . ” మనుషుల మధ్య, ఏమిటీ గోడలు , ఎన్ని రకాల గోడలు, “, అనే ఆలోచన , హృదయాన్ని ఎక్కడో కాస్త గుచ్చుకుంటూనే వుంది. …
ఫ్లైట్ లొ సిట్లో, కూర్చుని కిందకి చూస్తూ, ” మళ్ళీ నేను వచ్చినప్పుడు , ఎలావుంటుంది ? మారుతుందా ? …సుధాకర్ చెప్పినట్లు , వివక్షలు , ఇజాలు ఏమీ లేని సమాజానికి , శ్రీకారం చుట్ట గలుగుతారా ఈ కాలం పిల్లలు ? ….
మారుతుందేమో ! .. అన్నీ మారుతూనే వుంటాయి . ఏదయినా, ఏ మార్పూ లేకుండా ఎలా వుంటుంది ?….. ఇదీ అంతే . ద్వేషాన్నీ నిద్ర లేపినట్లే , ఎవరో ఒకరు ప్రేమనీ జాగృతం చేస్తారు . .. అప్పుడు , అన్నీ గోడలూ బద్దలు కొట్టుకుని మరో ప్రపంచం ఊపిరి పోసుకుంటుంది. “, అని అనుకున్నాడు.
ఆలోచిస్తున్న , అతనికి వున్నట్లుండి ” మరో ప్రపంచం , మరో ప్రపంచం, … పిలిచింది ” శ్రీ శ్రీ గేయం మనసులో కదిలింది.
అతని మొహం లో ఒక చిన్న ఆశ…… చిరునవ్వు పోసుకుని , వెలుగు లా వెలిగింది. ఫ్లైట్ , రన్ ఎవే లో టేక్ ఆఫ్ చేయడానికి ముందుకు వెళ్తూంటే , ఆశల దారిలో ముందుకు మరో ప్రపంచంలోకి వెళ్తున్నట్లు, అనిపించింది , వంశీకి .


మణి భూషణ్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *