‘మనసు విరక్తయింది. ఇరక్తయిపోయి మా వొళ్ళకి కూకోబెట్టి సెప్పీసినాను. మరిక నేను యీ ఇంట్ల వుండను. బగమంతుడి కోసం ఎలిపోతన్నాను. ఇకనుండి నా పని నాదే, మీ పని మీదే. నాకీ ఆస్తులొద్దు. మీరు నాకేటివ్వద్దు, నేను మీ కేటివ్వను’ అని.
బారాకత్ పాస్ ఆశ్రమం గెస్ట్ హౌస్ అనబడే పూరి పాక దువ్వారం మీద కూచుని, నా ప్రశ్నకి క్రిష్ణ మూర్తి చెప్పిన జవాబది.
అది ఏప్రిల్ 2019 ప్రాంతం. మహేంద్ర పర్వతం మీదికి వెళ్దామనుకొని – నేనూ, రామానందం, భవానీ – కుటుంబాలతో అక్కడికి చేరేం. మీదికి దారి బాగున్నట్టు లేదు. పర్వతారోహణకి దారేలా వుందో తెలుసుకోడానికి భవానీ, డ్రైవర్ మహేష్ – బుల్లెట్ మీద పైకి వెళ్ళేరు.
మిట్ట మధ్యాహ్నం దాటినా సూర్యుడి ప్రతాపం తగ్గలేదు. ఎండకి తాళలేక మా వాళ్లందరూ చెట్ల క్రిందకి చేరేరు. ఆ గెస్ట్ హౌస్ చూరు మీదనుండి విస్తరించిన కాము చెట్టు కొమ్మల ఆకులు, ఎండ వేడికి అల్లాడుతున్న కుక్క నాలికలా, గాలికి కొట్టుకుంటున్నాయి. గెస్ట్ హౌస్ ప్రక్కన విచ్చలవిడిగా పెరిగిన గులాబీ రంగు బోగన్ విల్లా ఆ పాకకి ఒక వింత అందాన్ని తెచ్చింది. పెద్ద గాలి రివట – ఆశ్రమం మట్టి దారి మీది దుమ్మంతా తెచ్చి మా మొహాల మీద చిమ్మింది.
అక్కడ, ఆ గుడిసె ద్వారానికి జేరబడి కూచుని క్రిష్ణ మూర్తి కనపడ్డాడు. అతన్ని చూస్తే మాట్లాడాలని పించి, ఆ ద్వారాన్ని ఆనుకుని ఉన్న గడప మీద కూర్చున్నా.
అతను ఐదడుగుల ఎత్తుంటాడేమో. గుబురుగా పెరిగిన గరిక గడ్డిలా – మీసాలు, గడ్డం, క్రాఫూ; వెలిసి పోయిన కాషాయ రంగు లుంగీ, కావి పట్టిపోయిన తెల్ల షర్టు, దాని మీద కాషాయ రంగు తువ్వాలు, నుదుట నిలువు నామాలు – ఇదీ అతని రూపం. ముడుతలు పడిన ఆ మొహం లో అతని కళ్ళు మాత్రం లైవ్లీ గా వున్నాయి.
క్రిష్ణమూర్తి తో కొంత సంభాషణ అయిన తరవాత, ‘నీవెందుకిలా సన్యాసివై పోయేవని’ అడిగితే అతనిచ్చిన సమాధానమది.
………..
అతనే మరలా మాటలు కొన సాగించేడు.
‘నేను ఇల్లు ఇడిసి పెట్టి ముప్పై సమత్సరాలైంది. ఇప్పుడికి నాకు డెబ్బై ఎనిమిది సమత్సరాలు. నేను సదివింది రెండో క్లాసే. ఎక్కడెక్కడో తిరిగేను. ఆశ్రమాలు చూసేను. రక రకాల సాదువుల్ని కలిసేను. ఆల్ల మాటలు ఇన్నాను. మన ప్రాంతం ఆశ్రమాలన్నీ నేనెల్లినవే. బారువా, కంచిలి, రాజపురం, సాలూరు, బెండి, మహేంద్రం – ఇవన్నీ. ఎక్కడా పది పదేను రోజులు దాటుండను. ఐతిప్పుడు నాలుగు సంవత్సరా లైంది బరంపురం లైను తప్తపాని లో వున్నాను.’
‘ఇదిగో యీలు మతిలబడ్డారని వోరం క్రితం ఇక్కడి కొచ్చినాను. ఎలిపోతాననుకున్నాను గాని యీలొదల్రు. లేదు నాయిన, నివ్విక్కడుండు అన్నారు. ఆ మహేంద్రగిరి లక్షణ సామి – అతన్ని పెద్ద సామి అంటారు – కృష్ణ మూర్తీ! నువ్వుండు. కొండమీదికి వొత్తూ గానీ – కూసుని మాట్లాడుదుమ! అన్నాడు. అందికే ఉండిపోయేను’
అతను మహేంద్రం లో అన్ని రోజులుండ వలసి వచ్చిన పరిస్థితికి అతనిచ్చుకున్న వివరణ.
‘ముఫ్ఫై సంవత్సరాలైందన్నావు కదా, నువ్వు ఇంటికి ఎప్పుడైనా వెళ్ళావా? పిల్లలు ఎలా వున్నారు? ఎలా బతుకుతున్నారు అని అనిపించలేదా?’ అని అడిగాను. విశ్వామిత్రుని కి మల్లే ఇతనికీ ఏదైనా తపోభంగం జరిగిందా అనేనా నా కుతూహలం?
‘ఆ పైన కబుర్లొ స్తుంటాయి. అయితే ఆళ్లు మనకాడికి రారు. మరి మన మెల్లము. అల్లు రాకపోడమే మంచిది. దేవుడికి అదే మొక్కు కుంతన్నాను. ఆళొస్తే మల్లి బిజారు’ అన్నాడు.
ఇంతలో అక్కడి యువ సాధు బాదం ఆకుల్లో – బెల్లం, శనగ పప్పు కలిపిన అటుకుల ప్రసాదం – తెచ్చి మా చేతుల్లో పెట్టేడు. అతను క్రిష్ణ మూర్తిని చూపిస్తో –
‘ఈ సాధు చాలా గొప్ప వారు. అతనిక్కడికి రాడం మా భాగ్యం’ అన్నాడు. అతని మాటల్లో ఒరియా యాస వినిపించింది.
క్రిష్ణమూర్తిని చూసి నవ్వేను. మరలా –
‘నీవు ఇల్లిడిచి వెళిపోతానంటే మీ ఆవిడా, పిల్లలు ఏమన్నారు?’ అని అడిగేను – అటువంటి విరక్తే వొస్తే, ఇవన్నీ ఒక అడ్డా? నా ప్రశ్నలోని అసంబద్ధత నాకే తెలుస్తోంది.
‘కొంచం బాద పడ్డారు. భగమంతుడి కోసమంతే ఇకనేమంతారు, పల్లకున్నారు’ అన్నాడు తల వంచుకొని నిర్వికారంగా.
ఉత్తరాంధ్ర గ్రామాలలో, అన్ని కులాల కుటుంబాలలోనూ ఇటువంటి వ్యక్తుల కథలు వినపడుతుంటాయి. ఎందుకు విరక్తి పొంది సన్యాసం లోకి వెళ్ళిపోతారో అనే సంగతి అటుంచితే, ఇలా ప్రాపంచిక సంబంధాలని త్యజించి, సంసారం వదిలి వెళ్లి పోయే వ్యక్తులకి – ఆడైనా, మగైనా – ఆశ్రయమిచ్చే ఆశ్రమాలు, కోవెలలు, మా ప్రాంతం లో చాలా కనపడతాయి. భగవంతుడి కోసమైనా, ఆత్మ శోధన కోసమైనా, అటువంటి మార్గం ఎన్నుకున్న వారికి ఈ స్థలాల్లో ఆశ్రయం దొరుకుతుంది. కొన్నిసార్లు ఈ సాధువులు సమీప గ్రామాల్లో గృహస్థుల వద్ద నుండి భిక్షాటన చేసుకుని ఆశ్రమాల్లో వండుకుని తినే ఆచారమూ వుంది. బుద్ధుడూ , ఆది శంకరుడూ, శిష్యులతో భిక్షాటన చేసి సన్యాసం పాటించిన వారే. ఈ ఏర్పాటు వల్ల హిందూ సమాజం లో విరాగులు బ్రతకటం కోసం ఐహిక కార్యక్రమాలలో పాల్గొనవలసిన అవసరం వుండేది కాదు. ఐతే, ఈ భిక్షాటన బ్రిటిషు వారి పాలనలో యాచకత్వం క్రింద చూడబడి, దాని నియంత్రణకి చట్టాలు వొచ్చేయి.
ఇతర మతాల్లోనూ ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. బౌద్ధులు, జైనులు ఈ వ్యవస్థల్ని విస్తృతం గా వాడేరు. ఐతే, ఆ ఆశ్రమ స్థలాలూ కొంత కాలానికి భ్రష్టు పట్టిపోయాయి. అనతోల్ ఫ్రాన్స్ నవల ‘థాయిస్’ లో, పంధొమ్మిదో శతాబ్ద కాలం మొనాస్టరీస్ లో క్రిస్టియన్ సాధువుల మనో వికారాల గురించి రచయిత చెప్పుకొస్తాడు. మాథ్యూ లెవిస్ ‘ద మోంక్’ నవల కూడా పద్దెనిమిదవ శతాబ్దం లో క్రిస్టియన్ సన్యాసుల నైతిక ఘర్షణ గురించి వర్ణిస్తుంది. బౌద్ధ మఠాల చరిత్రా అంతే.
ఈ సాధువుల్లో రెండు రకాలున్నారు. మొదటి రకం – సాధువుల్లా కనిపించేవారు, అలాగే సాధువుల్లా ప్రవర్తించే వారూ. మనకు తరచూ తటస్థ పడే వారిలో ఈ కోవకి చెందిన వారే ఎక్కువ. వీరు – అందరికీ, ముఖ్యంగా గృహస్థులకి, ఆమోద యోగ్యంగా ఉంటారు. గృహస్తుల్లో – మగ వారికీ , ఆడ వారికీ, గురువుల్లా వ్యవహరిస్తుంటారు. సత్సంగాలు, క్రతువులు నిర్వహిస్తుంటారు. భక్తుల్ని తీర్థ యాత్రలకి తీసుకెళ్తుంటారు. ఇక రెండో రకం వారిని విరాగులంటాను. వేమన, కబీరు, రమణ మహర్షి, బుద్ధుడు, శంకరాచార్యులూ – లాంటి వారు. వీరు జీవితంలో ఏదో ఒక దశలో విరక్తి చెంది ప్రపంచాన్ని త్యజించిన వారు. వీరు గృహస్థుల, సామాన్య జనుల ఇష్టాల చట్రంలో ఇమడరు. వీరి మాటలు, ప్రవర్తన కూడా – జన రంజకంగా ఉండవు. మనం ప్రయత్నించి అడిగితే మాట్లాడతారు. లేకపోతే మాట్లాడాలనే కుతూహలమూ ఈ విరాగులకి వుండదేమో. నేను చెబుతున్నది ఇట్టి వైరాగుల గురించే.
సమాజంలో, ఈ సన్యాసులు, విరాగులే – వారే మతమైనా – మానవ జీవితానికి ఆధ్యాత్మిక భావనాంశాన్ని చేర్చగలరు. దాని సత్యాసత్య విశ్లేషణ కొనసాగించ గలరు. హిందూ సమాజం లో ఈ అంశం మనగలగడానికి విరాగులకు నేను చెప్తున్న ఏర్పాట్లు, వ్యవస్థలు పనికొచ్చేయి. సాండ్రా హస్నర్, 2012 లో ప్రచురించిన ఆమె పుస్తకం – ‘హిమాలయాల్లో హిందూ సాధువులతో పర్యటనలు’ లో – నేటి హిందూ సమాజం లో ఈ వ్యవస్థలు విరాగుల మనుగడకి ఎలా ఉపయోగ పడుతున్నాయో పరిశోధించి వివరించింది. క్రిష్ణ మూర్తి వంటి విరాగులు ఇట్టి వ్యవస్థల నీడలో మనగలుగుతున్నవారే.
‘ఈ బంధాలూ, ఇల్లూ వొదిలి వెళ్లిపోవాలనే నిర్ణయం ఎలా తీసుకో గలిగేవు?’ కృష్ణమూర్తిని అడిగేను.
‘అది చాలా కష్టమైనదే. ఆ స్తితి ఎప్పుడొస్తాదో ముందల తెలీదు. కొంతమంది కైతే చిన్నప్పుడే అనిపిస్తాది. నా మట్టుకు నేనే ‘వుండాలా, ఎల్లిపోవాలా’ అని ఎన్ని రోజులు బాద పడ్డానో’ అన్నాడు.
తలొంచుకొని, కొంచెం సేపు ఆలోచించి మళ్ళా మాట్లాడేడు.
‘ఆ విరక్తి కలిగినప్పుడు “ఏదేమైపోతేనేం” అనిపిస్తాది. ఏ సంబందం మీదా ఇష్టం అనిపించదు. అలగని ఆల్ల మీద కోపమా అంటే అదీ కాదు. “ఇదిక తెగి పోయింది. మరిక కలవదు” అన్న బావనే.’
‘చెబితే పెళ్లాంకి అర్దమవదు. తోబుట్టువులు, పిల్లలు తెలిసికోలేరు. అర్దం చేసికొనే స్నేయితులు దొరకరు. నాకైతే గురువే లేడు. అంచేత నేనొక్కడ్నే నిర్నయం తీసుకోవాల.’
‘అయితే, ఏదో ఒక టైంల అంతా తేటతెల్లగ ఐపోద్ది. మబ్బు పింజ లాగ ఇడి పోద్ది. అప్పుడిక ముందు సూపే. ఎనక సూపుండదు. ఏ బాదా అనిపించదు. ఏ ఇకారాలూ ఉండవు. ఇక మన యాత్ర బగమంతుడి కోసం మొదలెట్టడమే.’
‘ఈ ముప్పై ఏళ్లు నీ జీవితం ఎలా సాగింది?’
‘నాకేం! ఎక్కడైనా నా కంతా వుంతారు. ఇల్లొదిలీసిన నాలుగు సమత్సరాల తరవాత – ఇరోచనాలు, జ్వరము, మంచాన పడిపోయేను. నాకు గుర్తు లేదు. ఆళే సేవలు. మరి ఆళ్ల రుణము ఎప్పుడు తీర్చికుంతానో గానీ. జీవితము అలగే గడిచిపోయింది.’
చాలా సేపు మాటల్లేవు. పేరు, గొప్ప, కుటుంబ సంబంధాలు, రాబడీ – ఇవేవీ లేకండా అలా బ్రతికేయ గలగడం – దీన్నేమని పిలవాలి? వైరాగ్యమా? ఆత్మానుభవ లక్ష్యాదర్శమా? ఈ దారి ఎటువంటిది? అటువంటి జీవితానికి ఏది గమ్యం? నాలాంటి వారికి కోరుకున్నా, ఎందుకు ఈ దారి సాధ్యమవదు?
ఎన్నడొ విజ్ఞానమిక నాకు …
నా ఆలోచనలు గ్రహించాడా అన్నట్లు –
‘అది కోరిక కాదు బాబూ. బగమంతుడి కరుణ. ఇల్లొదిలేస్తే గొప్ప, ఇంట్లో నుంతే నీరస అని లేదు. సాధులైపోయి ఎందరో ఎన్నో ఇకారాలు పడతన్నారు. ఆ గోస మనలో వుంతే ఇంటికాడైనా ఫరవాలేదు. చెట్టు కిందైనా ఫరవాలేదు,’ అన్నాడు.
క్రిష్ణ మూర్తి పదే పదే తన సంభాషణలో ప్రస్తావించే ‘భగవంతుడి’ సాంస్కృతిక మూలాలు నాకు తెలుసు. అన్ని సమాజాల్లో, మతాల్లో ఈ భావన కనపడుతుంది. నిజానికి, భగవంతుడంటే – నా నిర్వచనమూ, క్రిష్ణమూర్తి నిర్వచనము కలవక పోవచ్చు కూడా.
ఐతే, భగవంతుడి మాటకేం గానీ, అతని మాటల్లో అంతర్లీనం గా ఉన్న అనుభవ సారాంశం నాకు కొంత అర్థమైంది.
అప్పటికే పొద్దు వ్రాలి పోయింది. మేము బయలుదేర వలసిన సమయం వచ్చింది. కొండ మీదికి దారి చూడటానికి వెళ్లిన భవానీ, మహేశూ తిరిగొచ్చారు.
‘దారి బాగో లేదు. రెండు సార్లు బండి మీదనుండి కింద పడ్డాం’ అంటో మహేష్ తన పేంటు చిరుగుల్లోంచి తెగిన ముడుకులు చూపించేడు.
లేచినుంచుని కృష్ణ మూర్తికి నమస్కరించేను. అతనూ ప్రతినమస్కారం చేసేడు. మరలా అతన్ని చూస్తానో లేదో అనిపించింది.
***

