చివరి షో!

Spread the love

జీవితం ఒక్కసారిగా మారిపోదు. ముందుగా ఒక ప్రశ్న మనసులో పుడుతుంది. ఆ ప్రశ్న నెమ్మదిగా మన ప్రశాంతతను మార్చేస్తుంది. చివరికి ఒక సాధారణ రోజే జీవితాన్ని మరో కోణంలో చూపించే అనుభవంగా మారిపోతుంది. అనిరుధ్ జీవితంలో కూడా అలాంటి ఒక రోజు వచ్చింది.

జీవితాన్ని మార్చేది ఒక సంఘటన కాదు; దానిని చూసే దృష్టిలో ఉంటుంది.

అనిరుధ్‌కు ముప్పై సంవత్సరాలు. మంచి ఉద్యోగం, ఆప్యాయమైన కుటుంబం, భవిష్యత్తు గురించి కలలు కనడానికి కావాల్సినంత సమయం—జీవితం అతనికి అవసరమైనవన్నీ ఇచ్చింది. బయటివాళ్లకు అతని జీవితంలో ఏ లోటూ కనిపించేది కాదు. కానీ ప్రతి మనిషిని కలవరపెట్టేది ఏదో తెలియని అసంతృప్తి . కొన్నిసార్లు అన్నీ ఉన్నాయనే భావన సంతృప్తి కలిగించడం లేదు.

ఆ వెలితి కొంతకాలంగా అనిరుధ్‌ను వెంటాడుతోంది.

ప్రతిరోజూ అదే ఉదయం. అదే రహదారి. అదే కార్యాలయం. అదే ముఖాలు. రోజులు మారుతున్నాయి; కానీ తన జీవితం మాత్రం కదలకుండా ఒకే దృశ్యంలో నిలిచిపోయినట్టుగా అనిపించేది. తాను జీవించడం లేదని, తన జీవితాన్ని ఎక్కడో దూరంగా కూర్చొని చూస్తున్నానని అతనికి అప్పుడప్పుడు అనిపించేది.

తన జీవితంలో తానే నటుడా? ప్రేక్షకుడా? లేక ఎవరో తెలియని దర్శకుడి సూచనల ప్రకారం కదులుతున్న పాత్రా? ఒక మర మనిషినా? మనిషినా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు అతని వద్ద లేవు.

అయినా ఒక ప్రశ్న మాత్రం పదేపదే అతని మనసులో తొలుస్తుంది.

“”మానసిక ఒత్తిడి పెరిగేకొద్దీ వేదాంతం ఓదార్పులా అనిపించడం మొదలవుతుంది.”

“మనిషి తన జీవితంలోని చివరి రీల్‌లోకి ఎప్పుడు అడుగుపెడతాడో అతనికే తెలిసే అవకాశం ఉంటుందా?”

మనిషి తన మొదటి రోజును గుర్తుంచుకోలేడు. చివరి రోజు ఎప్పుడు వస్తుందో కూడా తెలుసుకోలేడు. కానీ ఆ రెండు రోజుల మధ్య ఎక్కడో ఒక క్షణం తప్పకుండా ఉంటుంది—జీవితం నెమ్మదిగా ముగింపు వైపు మళ్లడం ప్రారంభించే క్షణం.

ఆ క్షణం గురించి ఆలోచించినప్పుడల్లా అనిరుధ్ మనసులో కారణం తెలియని భయం పుట్టేది.

ఆ రాత్రి కూడా అలాంటి ఆలోచనలతోనే అతను ఇంటి వైపు నడుస్తున్నాడు.

కొద్దిసేపటి క్రితమే వర్షం తగ్గింది. రోడ్డు మీద నీటి గుంటల్లో తడిసిన రోడ్డుపై వీధి దీపాల వెలుగు వణుకుతోంది.  దుకాణాల షట్టర్లు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. దూరంగా వాహనాల శబ్దం తగ్గిపోయింది. నగరం అలసిపోయిన మనిషిలా నిద్రలోకి జారుతోంది.

అప్పుడే అతని చూపు ఒక ఇరుకైన సందువైపు మళ్లింది.

ఆ సందు చివర ఒక పాత సినిమాహాల్ కనిపించింది.

అనిరుధ్ ఆగిపోయాడు.

ఆ రహదారిలో అతను ఎన్నోసార్లు నడిచాడు. కానీ ఆ భవనం అక్కడ ఉన్నట్టు అతనికి ఎప్పుడూ గుర్తులేదు. కాలం మరచిపోయినట్టున్న గోడలు, వర్షానికి ఊడిపోయిన రంగు, చిట్లిపోయిన పోస్టర్లు, మూసుకుపోయిన కిటికీలు—అన్నీ ఎన్నాళ్లుగానో అక్కడే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి.

ప్రవేశ ద్వారం పైన ఒక నియాన్ బోర్డు వెలిగి ఆరిపోతోంది. సినిమా పేరు చెరిగిపోయింది. మిగిలింది రెండు మాటలు మాత్రమే.

LAST REEL .

అనిరుధ్ కొద్దిసేపు ఆ అక్షరాలనే చూస్తూ నిలబడ్డాడు.

“ఇది ఇక్కడ ఎప్పటి నుంచి ఉంది?”

అతని ప్రశ్నకు సమాధానంగా లోపల నుంచి  ప్రొజెక్టర్ తిరుగుతున్న శబ్దం వినిపించింది.

టక్…

టక్…

టక్…

సినిమా అప్పటికే మొదలైందేమో అనిపించింది.

వెళ్లిపోవాలని ఒక క్షణం అనుకున్నాడు. కానీ ఆసక్తి అతని అడుగులను మెట్లవైపు నడిపించింది.

టికెట్ కౌంటర్ దగ్గర చీకట్లో ఒక వృద్ధుడు అక్కడే కూర్చొని ఉన్నాడు, రావాల్సిన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నట్టుగా కనిపించాడు.

అనిరుధ్ అతని దగ్గరకు వెళ్లగానే వృద్ధుడు నెమ్మదిగా తలెత్తాడు.

అతన్ని చూసి గార పళ్ళతో నవ్వాడు.

“వచ్చారా… మీ కోసమే ఎదురు చూస్తున్నాను.”

అనిరుధ్ కనుబొమ్మలు ముడిచాడు.నేను మీకు తెలుసా?

“నన్నే అంటున్నారా?”

వృద్ధుడు సమాధానం చెప్పలేదు. కౌంటర్ కింద నుంచి ఒక పాత టికెట్ తీసి క్షణం పాటు దానివైపు చూశాడు.

“ఈ టికెట్ మీ కోసం ఎదురుచూస్తుంది అన్నాడు.”

అని చెప్పి టికెట్‌ను అనిరుధ్ చేతిలో పెట్టాడు.

“ఇదే ఈరోజు చివరి టికెట్.”

అనిరుధ్ దాన్ని పరిశీలించాడు. దానిపై సినిమా పేరు లేదు. సమయం లేదు. సీటు నంబర్ లేదు. కేవలం ఒకే పదబంధం ఉంది.అది

REEL NO.

“నేను సినిమా చూడటానికి రాలేదు,” అన్నాడు అనిరుధ్.

“తెలుసు.”

“అయితే ఈ టికెట్ ఎందుకు?”

వృద్ధుడు అతని కళ్లలోకి నేరుగా చూస్తూ అన్నాడు.

“సినిమా మిమ్మల్ని చూడటానికి ఎదురుచూస్తోంది.”

అనిరుధ్ చేతిలోని టికెట్ ఒక్కసారిగా భారంగా అనిపించింది.

“ఏ సినిమా?”

“మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనది.”

“లోపల ఎవరు ఉన్నారు?”

వృద్ధుడు హాలు వైపు చూపించాడు.

“రావాల్సిన వాళ్లంతా వచ్చారు. మీరు మాత్రమే మిగిలారు.”

అనిరుధ్ వెనక్కి తిరిగి బయటివైపు చూశాడు. సందు ఖాళీగా ఉంది. వర్షపు నీరు మెట్ల కింద చిన్న ప్రవాహంలా పరుగు తీస్తుంది. నగరం అక్కడి నుంచి చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపించింది.

“నేను వెళ్లిపోతా?” అన్నాడు అనిరుద్

వృద్ధుడు ప్రశాంతంగా నవ్వాడు. అది మీ ఇష్టం.

“వెళ్లిపోవచ్చు.”

కొద్దిసేపు ఆగి మళ్లీ అన్నాడు.

“కానీ చివరి రీల్ ప్రేక్షకుడి కోసం ఎదురుచూడదు.”

ఆ మాటల్లో బెదిరింపు లేదు. అయినా అనిరుధ్ వెన్నులో చలి పరిగెత్తింది.

అతను చేతిలోని టికెట్‌ను గట్టిగా పట్టుకున్నాడు.

తలుపు దగ్గరకు వెళ్లాడు.

అక్కడి నుంచి చల్లటి గాలి బయటకు వచ్చింది. లోపల చీకటి తప్ప మరేమీ కనిపించలేదు. కానీ ఆ చీకటిలో ఎవరో తనను గమనిస్తున్నారనే భావన అతనికి కలిగింది.

అనిరుధ్ ఒక క్షణం అక్కడే నిలబడ్డాడు.

తన జీవితాన్ని తానే దూరంగా కూర్చొని చూస్తున్నాననే భావన ఎన్నో రోజులుగా అతన్ని వెంటాడుతోంది.

ఈ సినిమాలో ఏముంది? ఆ వృద్ధుడు మాటలకు అంతరార్ధం తెలుసుకోవాలి.

  ఒకవేళ నిజంగానే తన జీవిత అశాంతి తెరపై కనిపిస్తుందా?

ఆ ప్రశ్న అతనిలోని భయాన్ని మించిన ఆసక్తిని రేపింది.

అతను తలుపును నెమ్మదిగా తోశాడు.

లోపలి చీకటి నిశ్శబ్దంగా అతన్నిఅతన్ని చుట్టేసింది.హాలు దాదాపు నిండిపోయి ఉంది.

డెబ్బై మందికి పైగా ప్రేక్షకులు కూర్చుని ఉన్నారు. సినిమా ఇంకా మొదలు కాలేదు. అయినా ఎవరూ మాట్లాడటం లేదు. అక్కడ ఎవరూ ఫోన్లు చూడటం లేదు. ఎవరూ తమ పక్కవారిని చూసి నవ్వలేదు.

 అందరి దృష్టి సినిమా తెరమీద ఉంది.

అనిరుధ్ లోపలికి అడుగుపెట్టగానే ప్రతి ముఖం అతని వైపు తిరిగింది.

అది ఆలస్యంగా వచ్చిన ప్రేక్షకుడిని చూసే చూపు కాదు.

చాలాకాలంగా ఎదురుచూసిన వ్యక్తి వచ్చాడనే ఉపశమనం ఆ చూపుల్లో కనిపించింది.

మొదటి వరుసలో కూర్చున్న ఒక వృద్ధుడు అతన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. ఇంకొకరు నెమ్మదిగా తల ఊపారు. మరొకరు దీర్గంగా ఊపిరి తీసుకున్నారు.

అనిరుధ్ గొంతు తడి ఆరిపాయింది. గొంతు ఎండిపోయింది.

చివరి వరుసలో ఒక్క సీటు మాత్రమే ఖాళీగా ఉంది.అతను నెమ్మదిగా వెళ్లి కూర్చున్నాడు.

అతను కూర్చున్న వెంటనే హాలు తలుపు మూసుకుంది.

బయట నుంచి టికెట్ ఇచ్చిన వృద్ధుడి స్వరం వినిపించింది.

“మన అతిథి వచ్చేశారు.”

దయచేసి నిశ్శబ్దం పాటించండి.“షో ప్రారంభమవుతోంది.”

లైట్లు ఆరిపోయాయి.ప్రొజెక్టర్ శబ్దం స్పష్టంగా వినిపించింది

టక్…

టక్…

టక్…

తెరపై మొదటి దృశ్యం ప్రత్యక్షమైంది.వర్షం తర్వాత తడిసిన నగరం కనిపించింది.

నీటి గుంటల్లో కంపిస్తున్న వీధి దీపాలు.ఒంటరిగా నడుస్తున్న ఒక మనిషి.

అనిరుధ్ ఆశ్చర్యంగాముందుకు వంగి చూశాడు.

తెరపై నడుస్తున్న ఆ మనిషి నేను. అది ఎలా సాధ్యం?

అనిరుధ్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది.

తాను కొద్దిసేపటి క్రితమే నడిచిన అదే వీధి. అదే వర్షం. అదే సందు. అదే పాత థియేటర్. టికెట్ కౌంటర్ దగ్గర నిలబడి ఉన్న తానే. వృద్ధుడు టికెట్ ఇవ్వడం, తాను హాల్లోకి రావడం, చివరి వరుసలో కూర్చోవడం—కొద్ది నిమిషాల క్రితం జరిగిన ప్రతి క్షణం తెరపై యథాతథంగా కనిపిస్తోంది.

అతను వెనక్కి తిరిగి హాలంతా పరిశీలించాడు.

ప్రేక్షకులంతా తెరవైపే చూస్తున్నారు. ఎవరి ముఖంలోనూ ఆశ్చర్యం లేదు. ఈ సినిమా వాళ్లు ఇప్పటికే ఎన్నిసార్లో చూసినట్టుగా ప్రశాంతంగా కూర్చున్నారు.

అనిరుధ్ మళ్లీ తెర వైపు చూశాడు.దృశ్యం మారిపోయింది.

ఒక చిన్న పిల్లవాడు తల్లి చేయి పట్టుకుని పాఠశాలకు వెళ్తున్నాడు. అతను మొదటిసారి సైకిల్ తొక్కిన సాయంత్రం. పరీక్షలో విఫలమైన రోజు. ఎవరితోనూ చెప్పని చిన్ననాటి భయం. తల్లి ఒడిలో దాక్కొని ఏడ్చిన రాత్రి.ఆ జ్ఞాపకాల గురించి మరెవరికీ తెలియదు.

కొన్నింటిని తానే మర్చిపోయాడు.

అయినా అవి తెరపై స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అనిరుధ్ శ్వాస భారమైంది.

ఇది కేవలం సినిమా కాదు.

తాను మరచిపోయిన కాలం మళ్లీ తన ముందుకొచ్చినట్టుంది.

దృశ్యాలు వేగంగా మారాయి.

కళాశాల రోజులు.

మొదటి ప్రేమ.మొదటి నిరాశ.

ఉద్యోగం.వివాహం.తండ్రి మరణం.

కొడుకు పుట్టిన రోజు.

సంతోషాలు, పశ్చాత్తాపాలు, కోల్పోయిన మనుషులు, పలకకుండా మిగిలిపోయిన మాటలు—జీవితమంతా నిశ్శబ్దంగా తెరపై చూస్తున్నాడు ఒక ప్రేక్షకుడిగా…

తాను వాటిని మరోసారి గుర్తు చేసుకున్నట్లు ఉంది.

కొద్దిసేపటికి కాల చక్రం ఒక్కసారిగా వేగం పుంజుకుంది

తెరపై కనిపిస్తున్న అనిరుధ్ క్రమంగా వృద్ధుడవుతున్నాడు. జుట్టు నెరిసింది. ముఖంపై ముడతలు పడ్డాయి. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఇంట్లో కొత్త ముఖాలు కనిపించాయి. తనకు తెలియని సంవత్సరాలు కొన్ని క్షణాల్లో దాటిపోయాయి.

అనిరుధ్ కళ్లను తెరపై నుంచి తిప్పుకోలేకపోయాడు.

తాను ఇంకా జీవించని రోజులు ఎవరి జ్ఞాపకాలు?

సినిమా చివరి దృశ్యానికి చేరుకుంది.

ఒక ఆసుపత్రి గది.

తెల్లని గోడలు.

పడక చుట్టూ నిలబడి ఉన్న కొంతమంది.

ఎవరో మౌనంగా ఏడుస్తున్నారు.

పడకపై ఒక వృద్ధుడు ఉన్నాడు.అతని ముఖం కనిపించడం లేదు.

కెమెరా నెమ్మదిగా దగ్గరవుతోంది.

అనిరుధ్ వేళ్లు కుర్చీ చేతిని గట్టిగా పట్టుకున్నాయి.

ఇంకో క్షణంలో ఆ ముఖం కనిపించబోతోంది.

అప్పుడే తెర మీద బొమ్మ ఒక్కసారిగా అదృశ్యమైంది.కొద్దిసేపటి తర్వాత నల్లటి తెరపై తెల్లటి అక్షరాలు వెలిశాయి.

THE END?

ప్రశ్నార్థకం మాత్రం అలాగే నిలిచిపోయింది.

“తర్వాత ఏమైంది?”

అనిరుధ్ గొంతు హాల్లో మార్మోగింది. ఎవరూ సమాధానం చెప్పలేదు.

అతను మళ్లీ తెరవైపు చూశాడు.అది నిశ్శబ్దంగానే ఉంది.

అప్పుడే అతని చుట్టూ కూర్చున్న ప్రేక్షకులంతా నెమ్మదిగా అతని వైపు తిరిగారు.

ఒక్క మాట కూడా మాట్లాడకుండా.

ఒక్క చూపు కూడా మార్చకుండా.

అందరూ అతనినే చూస్తున్నారు.

అనిరుధ్ గుండెల్లో తెలియని భయం వ్యాపించింది.

అతను ఒక్కసారిగా కళ్లు మూసుకున్నాడు.

……….

అతను ఉలిక్కిపడి లేచాడు.

తన మంచం మీద ఉన్నాడు.

పక్కనే భార్య కంగారుగా కూర్చుంది.

“ఏమైంది? పీడకల వచ్చిందా?”

అతను చుట్టూ చూశాడు.

గది.

ఫ్యాన్.

కిటికీ.

తెల్లవారుతున్న వెలుగు.

అన్నీ మామూలుగానే ఉన్నాయి.

“కల…” అని మాత్రమే అన్నాడు.

భార్య నీళ్లు ఇచ్చింది.

అతను నెమ్మదిగా తాగాడు.

కానీ గుండెల్లోని భయం మాత్రం తగ్గలేదు.

కొద్దిసేపటి తర్వాత కిటికీ దగ్గరకు వెళ్లి బయట నిలబడ్డాడు.

వాన ఆగిపోయింది.

తడి రోడ్డుపై ఉదయపు వెలుగు పడుతోంది.

అప్పుడే అతని చూపు టేబుల్ మీద పడింది.

అక్కడ ఒక పాత సినిమా టికెట్ ఉంది.

అతని గుండె మళ్లీ ఒక్కసారిగా కొట్టుకుంది.

అతను నెమ్మదిగా దాన్ని చేతిలోకి తీసుకున్నాడు.

అదే టికెట్.

REEL NO.

చేతులు స్వల్పంగా వణికాయి.

అతను టికెట్‌ను వెనుకవైపు తిప్పాడు.

అక్కడ ఒకే వాక్యం ఉంది.

“ముగింపు ఇంకా నిర్ణయించబడలేదు.”

అనిరుధ్ చాలాసేపు ఆ వాక్యం చూస్తూ కూర్చున్నాడు.

తాను చూసింది ఒక కలే కావచ్చు.

కానీ ఆ టికెట్ మాత్రం కలలోంచి బయటకు వచ్చినట్టుగా అతని చేతిలో ఉంది.

ఆ క్షణం నుంచి అతనికి ఒక విషయం మాత్రమే స్పష్టంగా తెలిసింది.

సమాధానం వెతకకపోతే తనకు ప్రశాంతత దొరకదు.

………………………

ఆ టికెట్ దొరికిన తర్వాత అనిరుధ్ జీవితంలో నిశ్శబ్దమే ఎక్కువైంది.

పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, కుటుంబంతో గడుపుతున్నా—అతని మనసు మాత్రం ఆ పాత థియేటర్‌ను వదల్లేకపోయింది. కళ్లను మూసుకుంటే ప్రొజెక్టర్ శబ్దం వినిపించేది. నిద్రపోతే నల్లటి తెరపై మెరిసిన ఆ ఒక్క మాట మళ్లీ అదే కనిపించేది.

THE END?

ఆ ప్రశ్నార్థకం అతని మనసులోనే ఆగిపోయింది.

కొన్ని రోజుల పాటు అతను తనను తాను గమనించడం ప్రారంభించాడు. చిన్న చిన్న మతిమరుపులు కూడా ఇప్పుడు అతనికి భయంగా అనిపించసాగాయి. ఫోన్ ఎక్కడ పెట్టాడో గుర్తుకు రాకపోయినా, పరిచయమైన వ్యక్తి పేరు చెప్పడానికి క్షణం ఆలస్యమైనా, తనలో ఏదో మార్పు మొదలైందేమోనని కలవరపడేవాడు.

చివరికి ఒక న్యూరాలజిస్టును కలిశాడు.

పరీక్షలు పూర్తయ్యాక డాక్టర్ ఫైల్ మూసి చిరునవ్వు నవ్వాడు.

“మీ జ్ఞాపకశక్తి బాగానే ఉంది. మీరు ఆందోళన చెందాల్సిన సమస్య కనిపించడం లేదు.” పదే పదే కొన్ని ఆలోచనలు మనల్ని కంగారు పెడతాయి. “you are perfectly alright!” డాక్టర్ అన్నాడు.

“అయితే నేను చూసినది?”

“కల.”

“కానీ అది కలలా అనిపించలేదు.”

డాక్టర్ కాసేపు మౌనంగా అతని వైపు చూశాడు.

“మనిషి నిద్రలో చూసేవే కలలు కావు. కొన్నిసార్లు భయం కూడా కలలను నిర్మిస్తుంది. మరణం గురించి ఎక్కువగా ఆలోచించే మనసు, జీవితాన్నే ఒక హెచ్చరికగా చూపిస్తుంది.”

“అంటే అది నిజం కాదా?”

“నిజమో కాదో నేను చెప్పలేను,” అన్నాడు డాక్టర్. “కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను. భవిష్యత్తు గురించి భయపడుతూ వర్తమానాన్ని కోల్పోవద్దు.”

అనిరుధ్ తల ఊపాడు.

వైద్యశాస్త్రం అతని మెదడును పరీక్షించింది.

కానీ అతని ప్రశ్నను కాదు.

ఆ టికెట్ గురించి మాత్రం డాక్టర్ ఒక్క మాట కూడా చెప్పలేకపోయాడు.

కొన్ని రోజుల తర్వాత అతను ఒక వృద్ధ జ్యోతిష్యుడిని కలిశాడు.

జాతకం చూసే ముందు అనిరుధ్ తన కల గురించి మొత్తం వివరించాడు.

జ్యోతిష్యుడు శ్రద్ధగా విన్నాడు.ఆ తర్వాత ఒక్క ప్రశ్న మాత్రమే అడిగాడు.

“సినిమా పూర్తయ్యిందా?”

“లేదు. చివరి దృశ్యం చూపించకముందే ఆగిపోయింది.”

వృద్ధుడు స్వల్పంగా నవ్వాడు.

“అయితే నువ్వు ఎందుకు ముగింపు గురించి భయపడుతున్నావు?”

“ఆ ఆసుపత్రి గదిలో ఉన్నది నేనే అనిపించింది.”

“అది నువ్వే అయి ఉండవచ్చు.”

అనిరుధ్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది.

వృద్ధుడు మళ్లీ అన్నాడు.అది “కాకపోవచ్చు కూడా.”

అనిరుధ్ అయోమయంగా చూశాడు.“మీరు ఏమంటున్నారు?”

జ్యోతిష్యుడు అతని చేతిలో ఉన్న టికెట్‌ను చూసి నెమ్మదిగా అన్నాడు.

“జాతకం మనిషి ఎంతకాలం బతుకుతాడో చెప్పవచ్చు. కానీ ఆ కాలాన్ని ఎలా జీవిస్తాడో చెప్పదు.”

కొద్దిసేపు ఆగి మళ్లీ అన్నాడు.

“మనిషి మరణం గురించి తెలుసుకోవాలని ఆత్రపడతాడు. కాలం మాత్రం అతను ఎలా జీవిస్తున్నాడో మాత్రమే గుర్తుంచుకుంటుంది.”

“అయితే ఆ కలకు అర్థం ఏమిటి?”

“అది నీ భవిష్యత్తును చూపించడానికి రాలేదేమో.”

“మరి?” మీరు చెప్పేది ఏమిటి?

“నువ్వు వర్తమానాన్ని మర్చిపోతున్నావని గుర్తు చేయడానికి వచ్చి ఉండొచ్చు.”

ఆ మాటలు అనిరుధ్ మనసులో చాలాసేపు మారుమోగాయి.

ఆ సాయంత్రం అతను చిన్నప్పుడు తల్లితో కలిసి వెళ్లిన పాత దేవాలయానికి వెళ్లాడు.

గర్భగుడి ముందు నిలబడి కళ్లను మూసుకున్నాడు.

ఈసారి తన ఆయుష్షు గురించి అడగలేదు.

తాను ఎప్పుడు చనిపోతానని కూడా అడగలేదు.

చాలాసేపు మౌనంగా నిలబడి చివరికి తనను తాను ఒక్కటే ప్రశ్న అడిగాడు.

“నాకు ఈ అనుభవం ఎందుకు వచ్చింది?”

దేవాలయం నిశ్శబ్దంగానే ఉంది.కొద్దిసేపటికి గంట మోగింది.

ఆ శబ్దం ఆలయంలో ప్రతిధ్వనించి నెమ్మదిగా అతని మనసులోకి దిగిపోయింది.

ఆ క్షణంలో అతనికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది.

బహుశా ఆ సినిమా తన మరణాన్ని చూపించలేదు.

తాను ఇంకా జీవించని జీవితాన్ని చూపించింది.

తల్లి ఫోన్ కోసం ఎదురు చూస్తోందని గుర్తు చేసింది.

ఎన్నాళ్లుగానో మాట్లాడని స్నేహితుడిని గుర్తు చేసింది.

ప్రేమను, క్షమాపణను, కృతజ్ఞతను ఎప్పటికీ వాయిదా వేయొద్దని చెప్పింది.

అతను నెమ్మదిగా కళ్లు తెరిచాడు.

మనసులోని భయం పూర్తిగా పోలేదు.

కానీ ఆ భయానికి ఇప్పుడు ఒక దిశ దొరికింది.

మెట్లు దిగుతుండగా అతని అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి.

ఎదురుగా ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు.

తెల్లటి జుట్టు.ప్రశాంతమైన చూపు.

థియేటర్‌లో తనకు టికెట్ ఇచ్చిన అదే మనిషి.

అనిరుధ్ ఆశ్చర్యంతో అతని దగ్గరకు వెళ్లాడు.

“మీరు…”

వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు.

“సినిమా ఎలా ఉంది?”

“మీరు ఎవరు?”

వృద్ధుడు సమాధానం చెప్పలేదు.

తన జేబులో నుంచి ఒక చిన్న తెల్లటి కాగితాన్ని తీసి అతని చేతిలో పెట్టాడు.

అనిరుధ్ దాన్ని విప్పి చూశాడు.

అందులో ఒకే వాక్యం ఉంది.

“కల ముగిసింది… కథ ఇంకా కొనసాగుతోంది.”

అతను వెంటనే తలెత్తి చూశాడు.

వృద్ధుడు అక్కడ లేడు.మెట్లపై భక్తులు ఉన్నారు.

దేవాలయ గంటధ్వని గాలిలో తేలుతోంది. సాయంత్రపు గాలి నిశ్శబ్దాన్ని సుతిమెత్తగా స్పృశిస్తోంది.

కానీ ఆ మనిషి మాత్రం ఎక్కడా కనిపించలేదు.

అనిరుధ్ చేతిలో కాగితం ఉంది.

అతని మనసులో మాత్రం మరో కొత్త ప్రశ్న పుట్టింది.

జీవితం ముందే రాసిన కథనా?

లేక… ప్రతి నిర్ణయంతో మనమే రాస్తున్న కథనా?

………

మూడు నెలలు గడిచాయి…..

జీవితం మళ్లీ తన పాత రీతిలో సాగిపోయింది. అనిరుధ్ ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. కుటుంబంతో గడిపేవాడు. బయటికి చూస్తే అతనిలో ఎలాంటి మార్పూ కనిపించేది కాదు.

కానీ అతని లోపల ఒక నిశ్శబ్దం స్థిరపడిపోయింది.

ముందులా రేపటి గురించి అంతగా ఆందోళన చెందడం తగ్గింది. చిన్న చిన్న ఆనందాలను తర్వాతకు వాయిదా వేయడం మానేశాడు. చాలా రోజులుగా మాట్లాడని తల్లికి ఫోన్ చేశాడు. ఎలాంటి సందర్భం లేకుండానే పాత స్నేహితుడిని కలిసి వచ్చాడు. ఆఫీసు పనిని ఇంటికి తీసుకురావడం తగ్గించాడు. రాత్రిళ్లు ఫోన్ స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం మానేసి, భార్యతో కలిసి నడకకు వెళ్లడం అలవాటు చేసుకున్నాడు.

తన జీవితంలో పెద్ద మార్పులేమీ రాలేదు.

కానీ ప్రతి రోజును చూసే తన చూపు మాత్రం మారింది.

అయినా ఒక ప్రశ్న మాత్రం అతన్ని పూర్తిగా వదల్లేదు.

ఆ టికెట్.అది ఇప్పటికీ అతని డైరీలోనే ఉంది.

అప్పుడప్పుడు దాన్ని తీసి చూస్తాడు. ముందు వైపు అదే రెండు మాటలు.

REEL NO.

వెనుకవైపు అదే వాక్యం.

“ముగింపు ఇంకా నిర్ణయించబడలేదు.”

ఒక సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ అతను మళ్లీ ఆ పాత సందు దగ్గర ఆగిపోయాడు.

వర్షం కురిసింది.

రోడ్డుపై నీటి గుంటల్లో వీధి దీపాల వెలుగు అలలల్లా చిందులేస్తోంది.అతను నెమ్మదిగా ఆ సందులోకి నడిచాడు.చివరి వరకు వెళ్లాడు.

అక్కడ సినిమా థియేటర్ లేదు.

పాత భవనం ఒకటి ఉంది.

REEL NO. అనే బోర్డు లేదు.

ఖాళీ గోడ మాత్రమే ఉంది.

అతను చాలాసేపు అక్కడే నిలబడ్డాడు.

“అయితే… నేను చూసింది ఏమిటి?”

చిరుగాలి తెరలు మాత్రమే స్పృశించాయి

అతను నెమ్మదిగా తన జేబులో చేయి పెట్టాడు.

టికెట్ ఇంకా అక్కడే ఉంది.

అది నిజమైతే థియేటర్ ఎందుకు లేదు?

థియేటర్ నిజం కాకపోతే టికెట్ ఎందుకు ఉంది?

అతను చిరునవ్వు నవ్వుకున్నాడు.

మూడు నెలల క్రితం అయితే ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆందోళనపడేవాడు.

ఈరోజు మాత్రం అలా చేయలేదు.

కొన్ని ప్రశ్నలు సమాధానాల కోసం పుట్టవని అతనికి ఇప్పుడు అర్థమైంది.

అవి మనిషిని మార్చడానికి మాత్రమే వస్తాయి.

ఆ రాత్రి ఇంటికి వచ్చాక డైరీని తెరిచాడు.

టికెట్‌ను బయటకు తీసి కొద్దిసేపు చూస్తూ కూర్చున్నాడు.

అప్పుడే అతని చూపు వెనుకవైపు పడింది.

ఇంతవరకు గమనించని ఒక చిన్న వాక్యం టికెట్ అంచున మసకగా కనిపించింది.

అతను దాన్ని వెలుగులోకి తీసుకెళ్లాడు.

నెమ్మదిగా చదివాడు.

“నువ్వు ఇప్పుడు చిత్రీకరిస్తున్న దృశ్యాన్ని జాగ్రత్తగా ఎంచుకో.”

అనిరుధ్ చాలాసేపు ఆ వాక్యాన్నే చూస్తూ కూర్చున్నాడు.

ఆ తర్వాత టికెట్‌ను డైరీ మధ్యలో పెట్టి కలం తీసుకున్నాడు.

ఒకే వాక్యం రాశాడు.

“చివరి రీల్ ఎప్పుడు మొదలవుతుందో నాకు తెలియదు. కానీ అది మొదలయ్యేలోపు నేను జీవించాల్సిన జీవితాన్ని వాయిదా వేయను.”

డైరీని మూసేశాడు.గదిలోని లైట్ ఆర్పేశాడు.

కిటికీ బయట వర్షం ఇంకా కురుస్తూనే ఉంది.

కొద్దిసేపు అతను ఆ వర్షాన్ని చూస్తూ నిలబడ్డాడు.

తనకు ఎదురైనదంతా నిజమా?

ఆ ప్రశ్నకు సమాధానం అతనికి ఎప్పటికీ దొరకకపోవచ్చు.

కానీ ఒక విషయం మాత్రం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాడు.

జీవితం చివర ఎలా ముగుస్తుందన్నదానికంటే…

తెర పడేలోపు తాను ఎలా జీవించాడన్నదే ముఖ్యమని.

అతను కిటికీ మూసి మంచం వైపు నడిచాడు.

ఈసారి అతను ప్రేక్షకుడిలా వెనక్కి తిరిగి చూడలేదు.

దూరంగా…ఎక్కడో…

ఒక పాత ప్రొజెక్టర్ శబ్దం వినిపించింది.

టక్…టక్…టక్…

అనిరుధ్ పెదవుల చివర చిరునవ్వు కదిలింది.ఈసారి ఆ శబ్దం అతనికి భయాన్ని గుర్తుచేయలేదు.

జీవితం ఇంకా కొనసాగుతోందని మాత్రమే గుర్తుచేసింది.

ప్రతి కథలో జీవితం ఉంటుంది.

 అనిరుధ్‌కు మాత్రం అనేకనేక ప్రశ్నలు మిగిలిన శేషంలా….

ఇది నిజమా, కలా, లేక అతని మనసు సృష్టించిన భ్రమా అన్న ప్రశ్నకు అనిరుధ్‌కు ఎప్పటికీ సమాధానం దొరకలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది. మనిషిని మార్చేది ఎప్పుడూ సమాధానాలు కావు; కొన్నిసార్లు ఒక ప్రశ్నే జీవితాంతం అతనితో పాటు నడుస్తుంది. ఆ ప్రశ్నకు జవాబు దొరకకపోయినా, దానితో కలిసి సాగిన ప్రయాణంలో మనిషి మునుపటి మనిషిగా మాత్రం మిగలడు. మనం మొదటి దృశ్యాన్ని గుర్తుంచుకోలేం, చివరి దృశ్యం ఎప్పుడు వస్తుందో తెలుసుకోలేం. అయినా ప్రతి రోజూ మన చేతుల్లోకి వచ్చే ఒక కొత్త దృశ్యాన్ని మాత్రం ఎలా జీవించాలో మనమే నిర్ణయిస్తాం. చెప్పాల్సిన మాటను, క్షమాపణను, ప్రేమను, కృతజ్ఞతను “తర్వాత” కోసం వాయిదా వేస్తాం. కానీ జీవితంలో అత్యంత అనిశ్చితమైనది మరణం కాదు—”తర్వాత” అనే మాట. జీవితం తన ముగింపును ముందే చెప్పదు; అది ప్రతి రోజూ ఒక అవకాశాన్ని మాత్రమే ఇస్తుంది. బహుశా జీవితానికి అసలు ప్రశ్న “చివరి రీల్ ఎప్పుడు మొదలవుతుంది?” అనేది కాదు; “ఈ రోజు నేను జీవిస్తున్న జీవితం, రేపు వెనక్కి తిరిగి చూసినప్పుడు గర్వంగా గుర్తు చేసుకునేదేనా?” అనేదే. తెర ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదు. కానీ అది పడేలోపు ఏ కథను జీవించాలో మనమే నిర్ణయిస్తాం. చివరికి మనిషిని నిర్వచించేది అతని ముగింపు కాదు—అతను జీవించిన కథే.

బొల్లిముంత వెంకట రమణారావు

తెలుగు, ఆంగ్ల భాషల్లో రచనలు చేస్తున్న కవి, కథకుడు, నాటక రచయిత. కొత్తగూడెం ఆకాశవాణి (ఎఫ్‌.ఎమ్‌) కేంద్రంలో సుమారు ఎనిమిది సంవత్సరాలు క్యాజువల్ ఉద్యోగిగా పనిచేశారు. విదేశీ సంస్థలో కంటెంట్ రివ్యూయర్‌గా, స్థానిక పత్రికలో సంపాదక సహాయకుడిగా కూడా సేవలందించారు.
ఇప్పటివరకు ఆయన 150కు పైగా తెలుగు కవితలు, 15 కథలు రచించారు. ఆయన రచించిన 20 రేడియో నాటికలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి. అలాగే 150కు పైగా ఆంగ్ల కవితలు వివిధ అంతర్జాతీయ సాహిత్య వెబ్‌సైట్లలో ప్రచురితమయ్యాయి.2002 సంవత్సరంలో Poetry.com నిర్వహించిన కవితా పోటీలో బహుమతి అందుకున్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో కలిపి ఇప్పటివరకు 15 పుస్తకాలను ప్రచురించారు. సాహిత్యం, మానవ సంబంధాలు, సామాజిక అంశాలు, సమకాలీన జీవన అనుభవాలు ఆయన రచనల్లో ప్రధానంగా ప్రతిఫలిస్తాయి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *