విష్ణు మూర్తి వరం

Spread the love

నా గురించి నాకే కొన్ని సార్లు చాలా చిరాగ్గా ఉంటది. అందరిలాగా ఏదో ఒక ఉద్యోగం చేసేసి, మరేదో పెద్ద  

కార్యక్రమం నిర్వర్తించి పేరు ప్రఖ్యాతులు తెచ్చేసుకుని బతికేయాలని నాకుండదు. నా కోరికలు, ఆశయాలు, అందరి కోరికలు, ఆశయాల కన్నా భిన్నంగా ఉంటాయి. నాకెలావుంటుందంటే, రాస్తే చలం లాగ కథలు రాయాలి, కవిత్వం శ్రీశ్రీలాగ చెప్పాలి. పాడితే బాలకృష్ణ ప్రసాద్ లా పాడాల. వేస్తే రాజా రవి వర్మలా బొమ్మలు వేయ గలగాలి. అంతే గానీ, ఏ రాజకీయ నాయకుడో, ప్రవచన కారుడో అయి –  పేరు ప్రఖ్యాతులు వాటితో పాటు మిగతా ‘ఖ్యాతులూ’ సంపాదించాలని నాకు లేదు. ఇలా ఎందుకంటున్నానంటే, నా ప్రమాణాలు అంతటి స్థాయి లో వున్నాయని చెప్పడం నా ఉద్దేశ్యం.  

ఐతే, ఇవన్నీ ఎలా సాధ్యం? వాళ్లు మనం కాదు కద. వారిలో ఏ జీన్స్ వున్నాయో అలాంటి స్పార్కులు వాళ్లలో వెలగడానికి. మిగతా వన్నీ అటుంచి, శ్రీ శ్రీ మహా ప్రస్థానానికి చలం ఆ యోగ్యతా పత్రం రాశారు చూడండీ! తెలుగు ఉత్తి అక్షరాలతో ఏర్పడిన పదాలకి అంత పదును, మెరుపులు, వెటకారాల చెణుకులు  ఎలా వస్తాయో అనిపించదూ? ఆ యోగ్యతా పత్రానికే నేను పడిపోయా. శ్రీశ్రీ కైతే,  ఆ పదాలు మేమున్నాం, మేమున్నామంటూ దొర్లుకుంటూ  ఎలా వచ్చేస్తాయో కదా? తెలుగు ఉచ్చారణ గురించి తెలుసుకోవాలంటే గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కీర్తనలు వినాలి. ముఖ్యం గా మన ఆకాశవాణి వార్తలు చదివే వార్తకులకు ఇవి వినిపించి తీరాలి. రవి వర్మ చిత్రాలు సరేసరి. అపుడెపుడో మందసా దాటి ఓ మారు మూల కుగ్రామానికి వెళ్లా. అక్కడ ఆ ఇంట్లో రవి వర్మ వేసిన సీతారామ పట్టాభిషేకం చిత్రం వుంది. అయితే, వాళ్ల లాగ నేనెలా అవగలను? కానీ, కాకపోతే ఈ జీవితమే వ్యర్థం!

ఇలాగ చాలా రోజులు ఆలోచించుకుని ఒకరోజు యింకిలాగ కాదనుకుని ఉద్యోగానికి శలవు పెట్టేసి, నా రూమ్ లో కూచుని తపస్సు చేయడం మొదలు పెట్టాను. నయం – ఇంకా పెళ్లవలేదు కాబట్టి నన్ను డిస్టర్బ్ చేసేవారెవరు లేరు, ఉదయం పాల పాకెట్ వాడు తప్పించి. అలా మూడు రోజులు తీవ్ర స్థాయిలో తపస్సు చేసేటప్పటికి, దేవుడు నా తపోతాపానికి తట్టుకోలేక నా ముందు ప్రత్యక్షమయ్యాడు.

“ఓయీ, నీ తపస్సు ఆపుము. నీకేమి కావాలో కోరుకో, ఇచ్చెదను” అన్నాడు.

ఐతే , ఆ వొచ్చిన దేవుడెవరు? బ్రహ్మదేవుడు. చూస్తే నోరులేని బ్రాహ్మడ్లా వున్నాడు. పోనీ, నోరులేని శూద్రుడ్లా అనీ అనొచ్చు. ఈ మధ్య ఇదొక సమస్యైపోయింది. ప్రతీదీ తూకం వేసి మాట్లాడాలి. లేకపోతే ఎవరి మనోభావాలో దెబ్బతింటాయి. దాంతో సోషల్ మీడియా గానుగలో ఓ నెల్రోజులు చెరుగ్గడలై పోతాం. సరే – ఇంత పురాతనంగా వున్నాడు, యీయనేం వరాలివ్వగలడు అనుకున్నా. అందుకని –

“నేను క్రింది స్థాయి దేవుళ్లతో మాట్లాడను. నీ కన్నా పెద్ద దేవుడు ఉంటే పంపించు” నిర్లక్ష్యంగా అని మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయాను. నా ధైర్యానికి నాకే ఆశ్చర్యం వేసింది. తపస్సుకి అంత బలం వుందన్నమాట.

ఇక, ఆయన అటూ ఇటూ చూసి ‘సారీ’ అని అదృశ్యమైపోయాడు. మరొక్క రోజైనప్పటికి, శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమై “బాబూ, నీకేమిటి కావాలో కోరుకో. నాకున్నంతలో నీ కోరిక తీరుస్తా” అని బీదరుపులరిచాడు.

అతన్ని చూసి –  ‘ఈయన బట్టలు కట్టుకోకుండా, కేశసంస్కారమన్నా లేకుండా,  చర్మాలు చుట్టుకుని తిరుగుతున్నాడు, ఈయన నాకేమిస్తాడు’ అనిపించింది. అంతే కాదు, ఆ ముందొచ్చిన పెద్దాయనా, యీయనా ఇచ్చిన వరాలు ఫ్లాప్ అయినట్టు చారిత్రక సాక్ష్యాధారాలున్నాయి కూడా.

అందువల్ల, “నాకు మీతోనేం పని లేదు సార్. మీకన్నా పెద్దోళ్ళుంటే పంపించండి” అని అన్నాను. దాంతో ఆ మాదేవుడు మరేం మాట్లాడకండా అదృశ్యమైపోయాడు.

అలాగ మరొక్క రోజు తపస్సు చేసేటప్పటికి మూడో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయనెవరూ! విష్ణు దేవుడు. నా ముందు ప్రత్యక్షమైన ఆయన్ని పరిశీలించేను.  మంచి రంగు హంగులతో స్మార్ట్ గా ఉన్నాడు.  బంగారు జరీ పట్టు వస్త్రాలు, నాలుగు చేతుల్లో ఏదో ఒక వస్తువు, మొహం మీద చిర్నవ్వు – జగ్గి వాసుదేవ్ లాగా మంచి గెటప్ లో ఉన్నాడు. ఈయన్ని చూస్తే, ముందొచ్చిన ఆ ఇద్దరు పెద్ద మనుషులు మాయా మర్మం అంతగా తెలీనోళ్లులాగా అగుపించారు.  ఇక విష్ణుమూర్తే పలకరించి మాట్లాడడం మొదలెట్టేడు. 

“ఏమోయ్! చాలా కాలం నుంచి నువ్వు తపస్సు చేస్తున్నావు. నీ తపోప్రభావం వల్ల చుట్టూ వాతారణం లో మార్పులొచ్చేశాయి.  ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ఉత్తర దక్షిణ ధృవాల్లో మంచు కరిగిపోగా పసిఫిక్ మహా సముద్రం నుండి, బంగాళాఖాతం దాకా నీటిమట్టాలు పెరిగి పోయి దేశాలు అల్ల కల్లోలం అయిపోతున్నాయి. లోకోపకారం కోసం నీ తపస్సు ఆపటం అవసరం అనిపిస్తోంది. అంచాత, నీకేం కావాలో అడుగు. చూద్దాం” అని శలవిచ్చేరు.

అద్గదీ! అలా ఉండాలి దేవుడంటే! ఈయన్ని చూడండి. ఎంత ఎంకరేజింగ్ గా, పాజిటివ్ గా మాట్లాడేడో చూడండి!  ఏదైనా చెప్పే ముందు మన గురించి కొంత మెప్పుగా మాట్లాడాల కదా? ఈయనేదో అప్డేటెడ్ వెర్షన్ లా వున్నాడు కదా అనుకొని, “సరేలే అండి, ఇవీ నా కోరికలు” అని, నా చిట్టా ఆయన ముందు పెట్టా.

“నాకు ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా నా బుర్రలో ఉండాలి. కానీ దానికోసం నేనేమీ ప్రత్యేకం గా చదువుకోవలసిన అవసరం వుండకూడదు. ఇప్పుడు నన్ను కష్టపడమంటే నేను పడలేను. కానైతే అవన్నీ, నా చూపుడు వ్రేలు మీద ఉండాలి.” అన్నా.

“అలాగే. ఇంకా ఏమిటి కావాలి?” అన్నాడాయన అత్యంత వుదారంగా.

“అది ఏ జ్ఞానమైనా – టెక్నాలజీ, వేదాంతం, సాహిత్యం, చిత్రలేఖనం, గానం – ఏదైనా నేను చెప్పగలిగేట్టు, చేయగలిగేట్టు – ఆ విజ్ఞానమంతా నా బుర్ర లోపల ఉండాలి.”

“సరే, ఇంకా ఏమిటి?” అన్నాడాయన చిర్నవ్వుతో. నాకు చాలా సంతోషమనిపించింది. ఎంకరేజ్ మెంట్   అంటే ఇలా వుండాలి అనుకున్నా.

 “నేను ఏదైనా కవిత రాయాలనుకుంటే – మామూలు కవులు గంటలకొద్దీ, రోజులకొద్దీ ప్రయత్నించేది – నేను ఐదు క్షణాలలో వ్రాసేయ గల తెలివితేటలు నాకు కావాలి. అలాగే నా బుర్రలో బొమ్మ గురించి వూహ ఒచ్చేస్తే చాలు, ఆ బొమ్మ కాగితం మీద పడిపోవాల”

“సరేలేవయ్యా. ఇంకా ఏమన్నా ఉన్నాయా?” చెదరని చిరునవ్వుతో పెద్దాయన.

అప్పటికే అలసిపోయేనేమో, ఆలోచిస్తే మరింకేం తట్టలేదు. “ఈ వరాలిచ్చేస్తే నా ఆశయాలు నెరవేరిపోతాయి సార్” అన్నా.

“సరే. అవన్నీ నీకు కావాలంటావు. ఊ… నువ్వు సంవత్సరానికో  పదిహేడు వేలు కేటాయించగలవా?”  విష్ణుమూర్తి గారి ప్రశ్న.

“ఎందుకలా అడుగుతున్నారు?” అని అడిగా.

“మరేం లేదు. నువ్వు కేటాయిస్తావా లేదా నాకు చెప్పు” అంటే,  “మీరు వరం ఇవ్వాలే గానీ, అదొక పెద్ద లెక్కా నాకు?” అని జవాబిచ్చా.  

“సరే, ఓ పని చేయి. సంవత్సరానికి పదిహేడు వేలు చందా కట్టి, ఆ ‘చాట్ జీపీటీ’ ని  నీ స్మార్ట్ ఫోన్ లోకి  డౌన్లోడ్ చేసుకో. పని అయిపోద్ది.” అని అదృశ్యమైపోయాడు.

***

బమ్మిడి దేవీ ప్రసాద్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *