నేను బొంబాయికి తిరిగి వెళ్ళడానికి ఢిల్లీని వదిలి వెళ్ళాల్సినప్పుడు, నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే మంచి మంచి స్నేహితులను, అలాగే నా భార్య మెచ్చుకున్న, ప్రతి నెలా ఒకటో తేదీన మాకు 250 రూపాయలు సంపాదించి పెట్టే స్థిరమైన, సులభమైన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, అకస్మాత్తుగా వెళ్ళిపోవాలనే బలమైన కోరిక నన్ను ఆవరించింది. నా భార్య ఏడుస్తూ, గొడవ చేస్తున్నా కూడా అది నన్ను ఆపలేకపోయింది.
నాకు బొంబాయిలో వందలాది మంది తెలుసు. చాలా సంవత్సరాల తర్వాత నా స్నేహితులను మళ్ళీ చూడటం నాకు నిజమైన ఆనందాన్ని ఇచ్చింది. అయినప్పటికీ నా నిజమైన సంతోషం ఇజ్జత్ జహాన్‌ను కలవడమే.
మీకు ఇజ్జత్ జహాన్ గురించి తెలిసి ఉండాలి. కమ్యూనిస్టు ఆశయం కోసం ఆమె సంవత్సరాల తరబడి ఎలా పనిచేసిందో మీకు తెలిసి ఉంటుంది. అంతేకాదు, ఆమె ఇటీవలే ఎవరో అపరిచితుడిని వివాహం చేసుకుందని కూడా బహుశా మీకు తెలిసి ఉంటుంది.
ఆ అపరిచిత వ్యక్తి నాకు మంచి స్నేహితుడు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మేము విద్యార్థులుగా ఉన్నప్పటి నుండి అతను, నాసిర్ నాకు తెలుసు. అప్పుడు నేను అతన్ని ‘నాసు’ అని పిలిచేవాడిని. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను చదువు మానేయాల్సి వచ్చింది. కానీ నాసిర్ ఎలాగోలా బీఏ పూర్తి చేసి ఢిల్లీలో ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదించాడు. చాలా సంవత్సరాల తర్వాత నేను బొంబాయిలో వున్నప్పుడు, నాసిర్ మరో ఫ్యాక్టరీ ఉద్యోగం కోసం వచ్చాడు. ఆ రోజుల్లో మేము తరచుగా కలుసుకునేవాళ్ళం. కానీ ఆ తర్వాత నేను వివిధ కారణాల వల్ల బొంబాయిని విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఆ కారణాల వల్లే నాకు ఢిల్లీలో ఆ ఉద్యోగం వచ్చింది. అది ఒక పెద్ద వైఫల్యంగా పరిణమించింది.
ఏదేమైనా, నేను రెండు సంవత్సరాల తర్వాత ఎంతోమంది ప్రియమైన స్నేహితులకు, ఢిల్లీకి వీడ్కోలు పలికి, ఇజ్జత్ జహాన్ వుంటున్న బొంబాయికి తిరిగి వచ్చేశాను. నేను ఒక కమ్యూనిస్టును. అంతే కాకుండా కమ్యూనిజంపై వందలాది వ్యాసాలు రాశాను. నేను వివిధ వార్తాపత్రికలలో ఇజ్జత్ జహాన్ వ్యాసాలను కూడా చదివాను. అవి నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. దేవుడి దయవల్ల, నేను ఆమె పట్ల మోహంతో ఉన్నానని దయచేసి అనుకోవద్దు! నేను కేవలం ఆమెను కలవాలని, ఆమెతో మాట్లాడాలని అనుకున్నాను. ఆమె కార్యకలాపాల గురించి నేను చదివాను. అప్పుడే ప్రేమలో పడిన యుక్తవయసు అబ్బాయిలు తమ ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడాలనుకున్నట్లుగా, కమ్యూనిజం పట్ల నాకున్న అపారమైన ప్రేమ గురించి మాట్లాడాలనుకున్నాను.
హెగెల్ నుండి కార్ల్ మార్క్స్ వరకు కమ్యూనిస్ట్ తత్వశాస్త్రం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడాలని, అలాగే లెనిన్, ట్రాట్స్కీ, స్టాలిన్‌ల దృక్కోణాలను చర్చించాలని నేను అనుకున్నాను. భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమంపై నా అభిప్రాయాన్ని ఆమెకు చెప్పి, ఆమె అభిప్రాయాన్ని కూడా వినాలని అనుకున్నాను. ఇతరులను మెప్పించాలనే ఏకైక ఆలోచనతో, కార్ల్ మార్క్స్ పుస్తకాలను చంకలో పెట్టుకుని తిరిగే యువకుల కథలను ఆమెకు చెప్పాలనుకున్నాను. కమ్యూనిజంపై ప్రచురించబడిన ప్రతీ ఆంగ్ల పుస్తకం ఉండి కూడా, దాని ప్రాథమిక సూత్రాలు కూడా తెలియని నా స్నేహితుడి గురించి ఆమెకు చెప్పాలనుకున్నాను. కుటుంబంలో ఒక ప్రముఖుడు ఉన్నప్పుడు, వారు వారి పేరును ప్రస్తావించడానికి ఏదో ఒక మార్గాన్ని కనుగొన్నంత తరచుగా కార్ల్ మార్క్స్ పేరును వాడే ఆ వ్యక్తి గురించి చెప్పాలనుకున్నాను. నా స్నేహితుడు, తనకి అల్లరి చేష్టలు ఉన్నప్పటికీ, కమ్యూనిస్ట్ ఆశయానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా సహించలేనంత నిజాయితీపరుడని ఇజ్జత్ జహాన్‌కు చెప్పాలనుకున్నాను.
ఆ తర్వాత, ఆడవాళ్ళను కలవడం కోసం కమ్యూనిస్టులుగా మారే యువతీ యువకుల గురించి ఆమెకు చెప్పేవాడిని. ఆ ఉద్యమంలో చేరే అబ్బాయిలలో సగం మంది, సూటిగా చెప్పాలంటే, కామంతో రగిలిపోతారని, వాళ్ళు ఎలా తదేకంగా చూస్తారో ఆమెకు చెప్పేవాడిని. చాలామంది అమ్మాయిలు ధనవంతులైన పారిశ్రామికవేత్తల తిరుగుబాటు కూతుళ్ళని, వారు కేవలం విసుగును పోగొట్టుకోవడం కోసం కొన్ని పరిచయ పుస్తకాలు చదివి, క్రియాశీల సభ్యులుగా చేరతారని ఆమెకు చెబుతాను. ఇంకా, ఈ అమ్మాయిలలో కొందరు సామాజిక, నైతిక నియమాల పట్ల గౌరవాన్ని పూర్తిగా కోల్పోయి, మన జాతీయ ‘నాయకుల’ లైంగిక బొమ్మలుగా మారి, ఎలా దురాచారంలో కూరుకుపోతారో కూడా ఆమెకు చెబుతాను.
క్లుప్తంగా చెప్పాలంటే భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమం, దాని భవిష్యత్ పరిణామాల గురించి వివరంగా చర్చించడం నాకు చాలా ఆనందాన్నిస్తుందని అనుకున్నాను. ఆమె వ్యాసాలు చదవడం వల్ల, ఆమె పదునైన అభిప్రాయాలు, ధైర్యం నాకు తెలుసు. మేము చాలా విషయాలలో ఏకీభవిస్తామని నాకు నమ్మకం కలిగింది.
నేను బొంబాయికి చేరుకున్నప్పుడు, ఒక ఇల్లు వెతికి దాన్ని సర్దుకునేంత వరకు ఒక స్నేహితుడి అపార్ట్‌మెంట్‌లో కొంతకాలం ఉండాల్సి వచ్చింది. నా భార్య అప్పటికింకా ఢిల్లీలోనే ఉంది. పనులన్నీ కుదిరిన వెంటనే ఫోన్ చేస్తానని ఆమెకు చెప్పాను.
నా స్నేహితులందరూ పెళ్లికాని సినిమా దర్శకులు. వారికి ఆడవాళ్ల గురించి విచిత్రమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళు సెట్‌లో ఉన్న అమ్మాయితో సంబంధాలలో చిక్కుకోవడానికి ఇష్టపడరు. అందుకే అవసరం అనిపించినప్పుడు, తమకు కావాల్సినవి అందించగల దళారులను సంప్రదిస్తారు. నా స్నేహితులు ఈ అమ్మాయిలను రాత్రికి ఉంచుకుని, ఉదయాన్నే పంపించేస్తారు. వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఎందుకంటే తాము తమ భార్యలను ఎప్పటికీ సంతోషపెట్టలేమని అనుకుంటారు. వాళ్ళు “నేను ఒక సినిమా దర్శకుడిని, మీకు తెలుసుగా. షూటింగ్ పగలైతే, నేను రోజంతా సెట్‌లో ఉండాలి. షూటింగ్ రాత్రి అయితే, రాత్రంతా బయటే ఉండాలి. నేను పగలు పని చేస్తే, రాత్రి విశ్రాంతి తీసుకోవాలి. రాత్రి పని చేస్తే, పగలు విశ్రాంతి తీసుకోవాలి.’ నా భార్య నన్ను అడుగుతుంది. ఆమె కోసం పనులు చేయాలి, కానీ నేను పూర్తిగా అలసిపోయినప్పుడు ఎలా చేయగలను? ప్రతిరోజూ ఒక కొత్త అమ్మాయి తారసపడటం మంచిదే. నాకు నిద్ర వస్తే, ‘కాసేపు పడుకో’ అని ఆమెతో చెప్పగలను. ఆమెతో విసుగొచ్చితే, టాక్సీ పిలిచి, ఛార్జీ చెల్లించి, ఆమెను పంపించేయగలను. ఒక స్త్రీ భార్య అయిన వెంటనే, ఆమె ఒక పెద్ద భారం అయిపోతుంది. నేను చాలా బాధ్యతాయుతంగా ఉంటాను, కాబట్టి నాకు ఆ ఒత్తిడి వద్దు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.” అంటారు.
ఒకరోజు నా స్నేహితుడు అమ్మాయి కోసం వెతుకుతుండగా నేను అతనితో పాటు టాక్సీలో వెళ్ళాను. అతని స్నేహితుడైన ఒక దళారి ఇద్దరు ద్రావిడ అమ్మాయిలను చూయించాడు. నాకు అయోమయంగా అనిపించగా, నా స్నేహితుడు వెంటనే “పరవాలేదు.. ఒకరికీ ఇద్దరికీ తేడా ఏముంది?’ అన్నాడు.
టాక్సీ అపార్ట్‌మెంట్ వైపు వెనక్కి తిరిగింది. తిరిగి వచ్చాక, నా ఫిల్మ్ డైరెక్టర్ స్నేహితుడు, కాష్టా చీరలు కట్టుకున్న ఆ ఇద్దరు అమ్మాయిలు, నేను మూడో అంతస్తు మెట్లు ఎక్కాము. నేను అతని అపార్ట్‌మెంట్ తలుపు తెరిచాను. లోపల ఏం కనిపించిందంటే, నాసిర్ నా ఉర్దూ టైప్‌రైటర్ ముందు కూర్చుని దాన్ని పరిశీలిస్తున్నాడు. సరిగ్గా అతని పక్కనే కళ్లద్దాలు పెట్టుకున్న ఒక మహిళ కూర్చుని ఉంది. ఆమె మా వైపు చూడటానికి తిరిగినప్పుడు, నేను ఆమెను గుర్తుపట్టాను. ఆమె ఇజ్జత్ జహాన్.
నా ఫిల్మ్ డైరెక్టర్ స్నేహితుడు కంగారుపడ్డాడు. కానీ ఆ ఇద్దరు అమ్మాయిలు అప్పటికే గదిలోకి వచ్చేశారు కాబట్టి నటించడం ఇక అనవసరం.
నేను నా స్నేహితుడిని నాసిర్‌కు పరిచయం చేశాను. నాసిర్ మమ్మల్ని తన భార్యకు పరిచయం చేశాడు. ఆ తర్వాత నేను వారి పక్కన కూర్చున్నాను. నా స్నేహితుడితో ఇజ్జత్ జహాన్ గురించి ఇంకా ఏమైనా చెప్పాలనుకున్నాను. కానీ అతని వైపు చూసేసరికి అతను సిగరెట్ వెలిగిస్తున్నాడు. “ఈమె భారతదేశపు గొప్ప కమ్యూనిస్ట్ మహిళల్లో ఒకరు. మీరు ఆమె వ్యాసాలు చదివి ఉంటారు.” అని నేను అన్నాను.
కానీ నా స్నేహితుడికి కమ్యూనిజంపై ఆసక్తి లేదు. ఆ తర్వాత అతనికి ఆ పదానికి అర్థం కూడా తెలియదని నాకు తెలిసింది. అతను యువతులకు సైగ చేస్తూ వారు వేరే గదిలోకి వెళ్లిన తర్వాత, “దయచేసి క్షమించండి. ఒక్క నిమిషంలో తిరిగి వస్తాను” అని అన్నాడు.
ఇజ్జత్ జహాన్ నా స్నేహితుడి ఇద్దరు సహచరులను తేరిపార చూస్తూ, వారి దుస్తులను, వారి ప్రవర్తనను, ఒక్క మాటలో చెప్పాలంటే వారిలోని ప్రతీ విషయాన్ని పరిశీలిస్తోంది. ఆ అమ్మాయిలు పక్క గదిలోకి వెళ్ళంగానే, నా స్నేహితుడు ఏమాత్రం సిగ్గుపడకుండా వారి దగ్గర నుండి అనుమతి తీసుకుని, తన వెనుక తలుపు మూసుకున్నాడు.
ఇజ్జత్ జహాన్ నా వైపు తిరిగి “మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజూ నాసిర్, ‘మంటోని కలవడానికి వెళ్దాం, మంటోని కలవడానికి వెళ్దాం” అని అనేవాడు. కానీ అప్పుడు చాలా తీరిక లేకుండా ఉండేదాన్ని. ఇంకా..” అంది. అంతలోనే ఏదో ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగించి, కొత్త విషయాన్ని మొదలుపెట్టింది. “మీరు ఇక్కడే ఉండబోతున్నారు కదా? ఈ ఇల్లు అస్సలు వంక పెట్టడానికి లేదు!” ఆమె గది చుట్టూ చూసి తలూపింది.
అవును, బాగుంది. చల్లగాలి వీస్తోంది. ఇక్కడ గాలి వీస్తూ శుభ్రంగా ఉంది. మీరు మధ్య తలుపు తెరిస్తే, మంచి గాలి వస్తుంది. మేము సుమారు అరగంట సేపు అటూ ఇటూ మాట్లాడుకుంటూ ఉన్నాము, కానీ ఇజ్జత్ జహాన్ పరధ్యానంగా ఉందని నాకు అనిపించింది. బహుశా నా స్నేహితుడు మాట ఇచ్చి తిరిగి రాలేదేమో అని ఆమె ఆలోచిస్తూ ఉండి ఉంటుంది. అప్పుడు అకస్మాత్తుగా ఆమె ఒక గ్లాసు నీళ్ళు అడిగింది.
ఆ అపార్ట్‌మెంట్‌లో ముందు వైపు ఒకటి, వెనుక వైపు ఒకటి, రెండు హాలులు ఉన్నాయి. నా స్నేహితుడికి ఇబ్బంది కలిగించడం మంచిది కాదనిపించి, నేను నీళ్ళను చుట్టూ తిరిగి తీసుకువచ్చాను. నేను గదికి తిరిగి వచ్చేసరికి, నాసిర్, ఇజ్జత్ జహాన్ ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవడం చూశాను.
ఇజ్జత్ జహాన్ గ్లాసును తీసుకుంది. “మిమ్మల్ని చాలా కష్టపెట్టాను.”
“అదేం లేదు, ఏ ఇబ్బందీ లేదు”
ఆమె నీళ్ళు తాగి, తన కనుబొమ్మలను వెనుకకు ముడిచింది. ఆమె తన మందపాటి కళ్ళద్దాలతో, సంభాషణ మొదలుపెట్టడం కోసం, ఆ అపార్ట్‌మెంట్‌లో రెండు హాలులు ఉన్నాయని గమనించింది.
మేము మళ్ళీ కాసేపు మాట్లాడుకున్నాము. సంభాషణ కమ్యూనిజం వైపు మళ్ళినప్పుడు, ఇజ్జత్ జహాన్, నేను ఇద్దరం ఉత్సాహపడ్డాము. కమ్యూనిజంపై నా అభిప్రాయాలను తెలియజేయాలని నేను మొదలుపెట్టాను.
“మతం, చరిత్ర, రాజకీయాలు మొదలైన మానవ సంస్థలన్నీ ఆర్థిక పరిస్థితులలోనే పాతుకుపోయి ఉన్నాయని కమ్యూనిజం చెబుతుంది. ధనిక, పేదల మధ్య విభజన ఉన్న ప్రస్తుత వ్యవస్థలో, ఉత్పత్తి సాధనాలన్నీ ఉన్నత వర్గాల చేతుల్లో ఉన్నాయి. వారు వాటిని కేవలం తమ ప్రయోజనం కోసమే వాడుకుంటారు. మీ ప్రకారం, ఈ వ్యవస్థ కూలిపోయినప్పుడు కమ్యూనిస్ట్ యుగం ప్రారంభమవుతుంది. మన ఆర్థిక పరిస్థితులను నిర్దేశించే ఉత్పత్తి సాధనాలు సామాన్య ప్రజల చేతుల్లోకి వస్తాయి.”
“అవును” అని ఇజ్జత్ జహాన్ అంగీకరించింది.
“ఆ తర్వాత ప్రజాశక్తికి ప్రాతినిధ్యం వహించడానికి ఒక ప్రత్యేక కార్యనిర్వాహక సంస్థ ఉంటుంది.”
“అవును.”
“కానీ కమ్యూనిజంలో కూడా అధికారం ఒక ఎంపిక చేసిన వర్గానికే పరిమితమై ఉంటుందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం, ఈ వర్గం ప్రజలందరి మంచి కోసం పనిచేస్తుంది తప్ప, వ్యక్తిగత ప్రయోజనాలతో, లాభాపేక్షతో ఏమాత్రం సంబంధం కలిగి ఉండదు. కానీ ప్రజల కోసం ఉండాల్సిన ఈ వర్గం, పెట్టుబడిదారీ విధానంగా మారి ఇతరులను అణచివేయడానికి ప్రయత్నించదని ఎవరు నిస్సందేహంగా చెప్పగలరు? వారు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయరా? కొంతకాలం పాలించిన తర్వాత, ఈ వ్యక్తులు వ్యక్తిగత ఉద్దేశ్యాలతో పనిచేయడం ప్రారంభించరా?”
ఇజ్జత్ జహాన్ నవ్వి..“మీ మాటలు వింటుంటే మీరు బకునిన్ సోదరుడిలా ఉన్నారు.” అంది.
“బకునిన్ ఎల్లప్పుడూ మార్క్స్‌తో పోరాడాడని నేను అంగీకరిస్తున్నాను. కొన్ని విషయాలను అంగీకరించలేకపోయానని, అతని చిత్తశుద్ధి ఉన్నప్పటికీ, అతను తనకంటూ ఒక తార్కికమైన, వ్యవస్థీకృతమైన తత్వాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయాడని కూడా తెలిసింది. కానీ అతను చెప్పిన ఈ మాట అబద్ధం కాదు. అదేమిటంటే, ఒక పెద్ద సమూహం ఒక చిన్న సమూహాన్ని అణచివేసే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం కూడా ఒక నాజూకైన పర్యాయపదమే. సమాజాన్ని అన్ని నియమాల నుండి, అణచివేత నుండి విముక్తి చేసే ఏ రాజకీయ వ్యవస్థకైనా నేను పూర్తిగా మద్దతు ఇస్తాను.”
ఇజ్జత్ మళ్ళీ నవ్వింది. “అయితే నీకు ఆచరణ సాధ్యం కాని అరాచకవాదం కావాలా? నీ బకునిన్, క్రోపోట్కిన్‌లు కూడా దాన్ని విజయవంతం చేయలేరు.”
నేను ఆమె మాటను మధ్యలోనే ఆపి “కమ్యూనిజం ఆచరణ సాధ్యం కానిది, అదొక పిచ్చి కల అని ప్రజలు భావించారు. కానీ మార్క్స్ దానిని ఒక ఆచరణాత్మక సామాజిక వ్యవస్థ రూపంలో ప్రదర్శించారు. బహుశా అరాచకవాదం కూడా తన మార్క్స్‌ను పొందవచ్చు.”
ఇజ్జత్ జహాన్ మూసి ఉన్న తలుపు వైపు చూసి, నేను ఇప్పుడే చెప్పింది విననట్లే “మీ స్నేహితుడు ఎందుకు తిరిగి రాలేదు?” అని అడిగింది.
నేను ఆమెకు నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను. “ఇందాక అతను కేవలం మర్యాద కోసం అలా అన్నాడు. తిరిగి రావాలనే ఉద్దేశం అతనికి లేదు.” అన్నాను.
“ఎందుకని..?”అని ఇజ్జత్ జహాన్ అమాయకంగా అడిగింది.
నేను నాసిర్ వైపు చూసి నవ్వాను. అతనికి మా సంభాషణ ఆసక్తికరంగా అనిపించడం మొదలైంది.
“అతనితో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళని వదిలి మనలాంటి బోరింగ్ స్నేహితుల కోసం ఎందుకు వస్తాడు?”
“వాళ్ళు నటీమణులా?”
“కాదు”
“స్నేహితులా?”
“అతను వారిని ఈరోజే కలిశాడు”
కొద్దికొద్దిగా నేను ఆమెకు అంతా చెప్పాను, అందులో సెక్స్ గురించి నా స్నేహితుడి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఆమె శ్రద్ధగా విని, ఆ తర్వాత తన తీర్పును వెలువరించింది “ఇది అత్యంత నీచమైన అరాచకవాదం. ఒకవేళ అందరూ మీ స్నేహితుడిలాగే ఆలోచిస్తే, ఈ ప్రపంచం నిస్సారంగా మారిపోతుంది. స్త్రీపురుషులు ఒకరినొకరు కేవలం లైంగిక భాగస్వాములుగా మాత్రమే చూసుకుంటారు, కదా? మీ స్నేహితుడు ఎవరైనప్పటికీ, అతను స్త్రీలను ఏమనుకుంటున్నాడు? ముక్కలుగా కోసిన బ్రెడ్, కేక్, లేదా బిస్కెట్ల లాగానా? తనకు నచ్చినంత తాగి, మిగిలినది పారేయడానికి వాళ్ళేమయినా కాఫీ, టీ కప్పులా? ఛీ..ఈ నీచమైన ప్రవర్తనను భరిస్తున్నారా ఈ ఆడవాళ్ళు..! కొంతమందికి శృంగారం ఎందుకంత ముఖ్యమో, మీ స్నేహితుడు స్త్రీలు లేకుండా ఎందుకు బతకలేడో నాకు అర్థం కావడం లేదు. అతనికి ప్రతి రాత్రి ఒక స్త్రీతో పడుకోవాల్సినంత అవసరం ఏముంది?”
నేను అనుకున్నది చెప్పాను “ పురుషులకు స్త్రీల పట్ల ఒక ప్రత్యేకమైన అవసరం ఉంటుంది. కొందరు దాన్ని ఎక్కువగా భావిస్తారు, మరికొందరు తక్కువగా భావిస్తారు. నా స్నేహితుడు ప్రతి రాత్రి ఒక స్త్రీతో పడుకోవాలని కోరుకునే రకం. అతనికి ఆహారం, పానీయం, నిద్ర ఎంత ముఖ్యమో, ఒక స్త్రీ కూడా అంతే ముఖ్యం. బహుశా అతను ఇలా ఆలోచించడం తప్పేమో. కానీ కనీసం అతను నటించడం లేదు.”
ఇజ్జత్ జహాన్ స్వరం మరింత కటువుగా మారింది. “అతను దాన్ని దాచడం లేదన్నంత మాత్రాన అది సరైనది అయిపోదు. వేశ్యలు తమ శరీరాన్ని అమ్ముకోవడానికి అంగీకరించినంత మాత్రాన అది సహజం అయిపోదు. మనం పనులు చేసే పద్ధతి తప్పు కావడం, అది అసహజం కావడం వల్లే వేశ్యలు ఉన్నారు. నీ స్నేహితుడి మతి సరిగా లేదు. అందుకే అతనికి ఆడవాళ్లకూ, ఆహారానికీ మధ్య తేడా తెలియడం లేదు. నువ్వు ఆహారం లేకుండా బతకలేవు, కానీ కచ్చితంగా శృంగారం లేకుండా బతకగలవు కదా!”
“తప్పకుండా, బ్రతకగలను. కానీ ఇది ఎప్పుడు జీవన్మరణ సమస్య అయ్యింది? నీకు తెలుసుగా.. ప్రతి మగాడికి స్త్రీ దొరకదు. కానీ దొరకిన వాళ్ళందరూ అదే చేస్తారు.” అన్నాను
నాసిర్‌కు మా సంభాషణపై అస్సలు ఆసక్తి లేదు. “సరే, ఇక చాలు. సమయం మించిపోయింది, మనమింకా పంతొమ్మిది మైళ్ళు వెళ్ళాలి. ఇజ్జత్, మనం వెళ్దామా?”
ఇజ్జత్ నాసిర్ ఆ మాట వినలేదు. కానీ నాతో “ మీరు ఏమైనా అనండి. కానీ నిజానికి మీ స్నేహితుడు చాలా మొరటుగా ప్రవర్తిస్తాడు. మన ముగ్గురం ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే, పక్క గదిలో ‘హే-లహౌల్ వాలా ఖువత్!’ అనడం నేను నమ్మలేకపోతున్నాను.” అంది.
నాసిర్‌కు నిద్ర వస్తోంది. “సరే, దయచేసి దాని గురించి మాట్లాడటం ఆపండి! పదండి!”
ఇజ్జత్‌కు కోపం వచ్చింది. “చూడు… చూడు ఇప్పుడు నువ్వు చివరికి నిజమైన భర్తలా ప్రవర్తించడం మొదలుపెట్టావు.” అంది.
నాకు నవ్వు ఆగలేదు. నాసిర్ కూడా నవ్వాడు. మేము నవ్వడం చూసి ఇజ్జత్ జహాన్ పెదవులపై చిరునవ్వు మెరిసింది.
“దీన్ని ఇంకెలా చెప్పాలి? భర్తలు అచ్చం ఇలాగే ఉంటారు- అంటే, అతను నన్ను బెదిరించాలని చూస్తున్నాడు.” అని ఆమె అంది.
నాసిర్, ఇజ్జత్ కాసేపు ఉండి వెళ్ళిపోయారు. మా మొదటి సమావేశం చాలా ఆసక్తికరంగా సాగింది. నేను ఆమెతో కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి వివరంగా మాట్లాడలేకపోయినప్పటికీ, ఆమె నన్ను బాగా ఆకట్టుకుంది. భవిష్యత్తు సమావేశాలు ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తాయని నేను ఊహించుకున్నాను.
ఆ తర్వాత నేను ఒక అపార్ట్‌మెంట్ తీసుకున్నాను. నా భార్య నాతో చేరింది. ఒకరోజు ఇజ్జత్ వచ్చింది. వాళ్లిద్దరికీ బాగా నచ్చింది. అప్పటి నుండి ఇజ్జత్ జహాన్ ప్రతి సాయంత్రం ఇంటికి వెళ్లే దారే కాబట్టి తరచుగా మా అపార్ట్‌మెంట్‌కు వచ్చేది. హెగెల్, మార్క్స్, ఏంగెల్స్ నుండి బకునిన్, క్రోపోట్కిన్, ట్రాట్స్కీల వరకు కమ్యూనిజంలోని ప్రతి అంశం గురించి ఆమెతో చర్చించాలని నేను అనుకున్నాను. కానీ ఆమె, నా భార్య పక్క గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుని ఏవేవో విషయాల గురించి మాట్లాడుకునేవారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతంపై స్టాలిన్ ప్రస్తుత యుద్ధ విధానం యొక్క ప్రభావాల గురించి నేను ప్రస్తావిస్తే, ఆమె నా భార్యను ‘తెల్ల ఉన్ని ధర ఎంత’ అని అడిగేది. నేను ఎం.ఎన్. రాయ్ యొక్క కపటత్వం గురించి ఏమైనా చెబితే, ఆమె ‘ఫ్యామిలీ’ సినిమాలోని ఏదో ఒక పాటను పొగిడేది. ఒకవేళ నేను ఆమెను నా పక్కన కూర్చోబెట్టి సంభాషణ మొదలుపెట్టినా, కొన్ని నిమిషాలు తర్వాత లేచిపోయి..నా భార్య కోసం ఉల్లిపాయలు ఒలవడానికి వంటగదిలోకి వెళ్ళిపోయేది.
ఇజ్జత్ జహాన్ పార్టీ కార్యాలయంలో రోజంతా పనిచేసేది. ఆమె అక్కడి నుండి ఇరవై, ఇరవై ఐదు మైళ్ల దూరంలో నివసించేది. రైలులో రానుపోను ప్రయాణానికి ఆమెకు గంట సమయం పట్టేది. అందువల్ల ఆమె ప్రతి సాయంత్రం అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చేది. నాసిర్ ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ప్రతి నెలా అతను యజమనిగా పదిహేను రాత్రులు పనిచేయాల్సి వచ్చేది. కానీ ఇజ్జత్ సంతోషంగా ఉండేది. ఆమె నా భార్యతో చెప్పేది “పెళ్లి అంటే కేవలం పడుకునే మంచం కాదు. భర్త అంటే కేవలం రాత్రిపూట పడుకోవడానికి తోడుగా ఉండేవాడు కాదు. మనుషులు కేవలం వీటి కోసమే పుట్టలేదు.”
నా భార్యకు ఈ మాటలు చాలా నచ్చాయి.
ఇజ్జత్ జహాన్ తన పనిలో తనను తాను పూర్తిగా నిమగ్నం చేసుకునేది. అందుకే ఆమె నాతో మాట్లాడలేనంతగా అలసిపోయిందని నేను ఏం అనుకోలేదు. అలాగే, ఆమె నా భార్యతో ఎక్కువ సమయం గడిపినా నేను బాధపడలేదు. ఎందుకంటే ఆమె నాకంటే నా భార్య సాంగత్యాన్నే ఎక్కువగా ఇష్టపడిందని స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ, ఒక సగటు మధ్యతరగతి పెట్టుబడిదారీ ఆలోచనలో ఉన్న నా భార్య ఆలోచనా విధానాన్ని ఇజ్జత్ తనదైన విధానంలోకి మారుస్తుందేమోనని చూడాలనే కుతూహలంగా ఉన్నాను.
ఒకరోజు నేను పని నుండి త్వరగా, బహుశా రెండు గంటలకల్లా ఇంటికి తిరిగి వచ్చాను. నేను తలుపు తట్టాను, కానీ నా భార్యకు బదులుగా నాసిర్ తలుపు తెరిచాడు. నేను ఎప్పటిలాగే వెంటనే నా బ్యాగ్‌ను నా బల్ల మీద పెట్టడానికి వెళ్ళాను. నాసిర్ దుప్పటి కప్పుకుని నా మంచం మీద పడుకున్నాడు. ఇజ్జత్ జహాన్ గదికి అవతలి వైపున ఉన్న సోఫాలో పడుకుని ఉంది.
“నాకు జ్వరం వస్తున్నట్టుంది” అని నాసిర్ అన్నాడు.
నేను ఇజ్జత్ జహాన్ వైపు చూసి “మరి మీకు?” అని అడిగాను.
“లేదు, నేను ఊరకే పడుకుని ఉన్నాను.”
“రుఖయ్యా ఎక్కడ ఉంది?” అని అడిగాను
“ఆమె పక్క గదిలో నిద్రపోతోంది” అని ఇజ్జత్ చెప్పాడు.
“ఇదేంటి? అందరూ నిద్రపోతున్నారా?” అప్పుడు నేను నా భార్యను “రుఖయ్యా! రుఖయ్యా!” అని పిలిచాను.
“ఆఁ…!” ఆమె నిద్రమత్తు గొంతుతో జవాబిచ్చింది.
“ఇక్కడికి రా. ఇంకెంతసేపు నిద్రపోతావు?”
రుఖయ్యా కళ్ళు నలుపుకుంటూ గదిలోకి వచ్చి ఇజ్జత్ పక్కన కూర్చుంది. నాసిర్ ఇంకా దుప్పటి కప్పుకుని పడుకునే ఉన్నాడు. నేను నా భార్య పక్కన కుర్చీలో కూర్చున్నాను. రుఖయ్యా ఎప్పుడూ చిన్నపిల్లలా నిద్రపోవడం వల్ల మేమిద్దరం గాఢ నిద్ర గురించి కాసేపు మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఇజ్జత్, నా భార్య సూదిపని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈలోగా టీ తయారు చేశారు. నాసిర్ మంచం మీదే ఒక కప్పు తాగాడు. నేను అతని జ్వరానికి రెండు ఆస్పిరిన్లు ఇచ్చాను.
ఇజ్జత్ జహాన్, నాసిర్ దాదాపు రెండు గంటల పాటు ఉండి, ఆ తర్వాత వెళ్ళిపోయారు.
ఆ రాత్రి నేను మంచం మీద పడుకున్నప్పుడు, ఎప్పటిలాగే పై దిండును సగానికి మడిచాను. కానీ చూస్తే కింద దిండుకు గలీబు లేదు. రుఖయ్యా నా పక్కన నిలబడి బట్టలు మార్చుకుంటోంది.
“ఈ దిండుకు గలీబు లేదు ఎందుకు?”అని అడిగాను.
రుఖయ్యా దిండు వైపు తదేకంగా చూస్తూ, ఆశ్చర్యంగా “అయితే, ఆ దిండు గలీబు ఎక్కడికి పోయింది? ఓ, అవును-అది నీ స్నేహితుడి పనే..” అంది.
నవ్వుతూ..”నాసిర్ తీసుకున్నాడా?” అని అడిగాను.
“నాకెలా తెలుస్తుంది?” అని రుఖయ్యా సమర్థించుకుంటూ అంది. తర్వాత ఒప్పుకుంది. “అయ్యో, చాలా ఇబ్బందిగా ఉంది! నీకు చెప్పలేకపోయాను. నేను పక్క గదిలో పడుకుని ఉన్నాను. వాళ్ళు.. నీ స్నేహితుడు, అతని భార్య- ఛత్! వాళ్ళు చాలా మొరటుగా ప్రవర్తించారు.”
మరుసటి రోజు మంచం కింద మాకు దిండు గలీబు కనిపించింది. దానిని ఎలుకలు, బొద్దింకలు పాడుచేశాయి. దానికి తోడు, నాసిర్ జ్వరం తగ్గించడానికి నేను ఇచ్చిన ఆస్ప్రిన్ మాత్రలు కూడా అక్కడే దొరికాయి.
మొరటు
