చిత్రం :మరో ప్రపంచం(1970) నేపధ్యగానం : బాలు, జానకి
రచన – శ్రీ శ్రీ సంగీతం – కె. వి. మహదేవన్
అణగారిన బ్రతుకులలో… ఆశా జ్యోతులు వెలిగించి
మానవత్వమే మతమని చాటిన మహాత్ముడే మన దైవం
గాంధీ మహాత్ముడే మన దైవం
మహాత్ముడే కలలుగన్న మరో ప్రప్రపంచం
మెరిసింది పిలిచింది మరో ప్రపంచం
గాంధీ మహాత్ముడే కలలుగన్న మరో ప్రప్రపంచం
మెరిసింది పిలిచింది మరో ప్రపంచం
గాంధీ మహాత్ముడే కలలుగన్న మరో ప్రప్రపంచం
మరో ప్రపంచం మరో ప్రపంచం
ఈ దేశం నీది నాదని, ఇది ఒక్కరికే సొంతం కాదని (2)
గంగా కావేరి నదులు కలుపుతాం
కలపి సరిహద్దులు చెరిపి చెలిమి నిలుపుతాం (గంగా…)
మన నేతాజీ ఆశించిన మరో ప్రపంచం (2)
మరో ప్రపంచం, మరో ప్రపంచం
ఒకే గూటి గువ్వలం…ఒకే తీగ పువ్వులం
తరతరాల చీకట్లను తొలగించే దివ్వెలం (ఒకే గూటి)
మన నెహ్రూజీ ఆశయం మరో ప్రపంచం (2)
మరో ప్రపంచం, మరో ప్రపంచం
మహాత్ముడే కలలుగన్న మరో ప్రపంచం
గాంధీ మహాత్ముడే కలలుగన్న మరో ప్రపంచం
అహం మీరి జులుం చేయు ద్రోహుల..
బలం చూపి హతమార్చే వీరులం.. (అహం)
హలం బూని పొలం దున్ని మట్టిలో
మేలి బంగారం పండించే రైతులం (హలం)
మన శాస్త్రీజీ కృషి చేసిన మరో ప్రపంచం (2)
జై జవాన్ జై కిసాన్ (2)
బ్రతుకు విలువ చాటుతాం, ప్రగతి దారి సాగుతాం
విజ్ఞానం పెంచుతాం విశ్వశాంతి పంచుతాం (బ్రతుకు)
మన ఇందిరమ్మ సందేశం మరో ప్రపంచం (2)
మెరిసింది పిలిచింది మరో ప్రపంచం
గాంధీ మహాత్ముడే కలలు గన్న మరో ప్రపంచం
మరో ప్రపంచం, మరో ప్రపంచం
మహాత్ముడే కలలుగన్న మరో ప్రప్రపంచం
మెరిసింది పిలిచింది మరో ప్రపంచం
గాంధీ మహాత్ముడే కలలుగన్న మరో ప్రప్రపంచం
శ్రీ శ్రీ మహా ప్రస్థానం 1950లో మొదటి సారి ప్రచురించబడింది. ఇందులోని కవితలన్నీ ఆయన 1930, 40ల కాలంలో రాసారు. ఇందులోనే వస్తుంది ‘మరో ప్రపంచం’ కవిత. శ్రీ శ్రీ తన కవితలకు వాడిన పదాలు ఆనాటి ప్రజా జీవితంలోకి, ప్రజల ఆలోచనలలోకి పూర్తిగా చొచ్చుకుపోయాయి. తెలుగు నాట ఆయన ప్రభావం అంత తీవ్రంగా ఉండేది. 1970లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఓ సినిమాకు అక్కినేని నిర్మాతగా మారారు. దానికి ‘మరో ప్రపంచం’ పేరు ఖరారు చేశారంతా. దానికి కారణం శ్రీ శ్రీ కవిత్వం అందించిన ప్రేరణే.
కుల, వర్గ భేధాలు, స్వార్థం లేని సమానత్వ సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నించే ఆదర్శవాద యువత కథాంశంతో ఈ సినీ కథ తెరకెక్కింది. శ్రీ శ్రీ చర్చించిన మరో ప్రపంచాన్నే ప్రేరణగా తీసుకుని కథను నిర్మించుకున్నారు బి. ఎస్. థాపా. శ్రీ శ్రీ విప్లవాత్మక వామపక్ష భావజాలం నుండి ఈ సినిమా ఎంతగానో ప్రేరణ పొందింది. కాని దాన్ని గాంధీయిజం బాటలో చర్చకు పెట్టింది. ఆ రోజుల్లో తెలుగు నేలపై శ్రీ శ్రీ ప్రభావం ఎంత ఉండేదో ఈ సినీ కథ, దీని చిత్రీకరణ నిరూపిస్తాయి. ఇందులో రెండు పాటలను శ్రీ శ్రీ రాసారు.
దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ అనుసరించిన మార్గం, ఆయన కోరిన వర్గ, మత, భేదాలకు అతీతంగా మానవత్వంతో నిండిన సమాజాన్ని ఈ పాట ప్రస్తావిస్తుంది. ఆ నాటి దేశనాయకులు స్వాతంత్రం తర్వాత దేశాన్ని ఏ దారిలో నడిపించాలనుకున్నారో వారెలాంటి కలలు కన్నారో ఈ పాట ప్రస్తావిస్తుంది. కాని స్వార్ధ రాజకీయాలు ఆ కలలను అడ్డుకున్నాయి. రాజకీయ నాయకులతో విసిగి వేసారిన యువత తమ నాయకుల స్పూర్తితో మరో ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. ఆ ప్రపంచం ఎలా ఉంటుందో వాళ్ళే ఈ పాటలో వర్ణించి చెబుతున్నారు.
పాటను సాకీతో మొదలు పెడతారు కవి. దేశభక్తి గీతాలు సాకీలతో మొదలవడం అరుదు. ఆ ప్రయోగం ఈ పాటకు అందాన్నిస్తుంది. అణగారిన బ్రతుకులలో ఆశా జ్యోతులు వెలిగించి, మానవత్వమే మతమని చాటిన మహాత్ముడే తమ దైవమని, ఆయనే గాంధీ మహాత్ముడని చెబుతూ ఈ పాట ప్రారంభమవుతుంది. ఇదే సినిమా సారం కూడా. తమ మరో ప్రపంచం గాంధీ మహాత్ముని కల అని ప్రస్తావిస్తూ పాట పల్లవి మొదలవుతుంది. ‘మహాత్ముడే కలలుగన్న మరో ప్రపంచం, మెరిసింది పిలిచింది మరో ప్రపంచం,గాంధీ మహాత్ముడే కలలుగన్న మరో ప్రప్రపంచం’ అంటూ సాగే ఈ పల్లవిలో ఒక అందమైన లయ ఉంటుంది. ఈ పదాల అమరిక సంగీతపరంగా కూర్చినట్లు అనిపిస్తుంది.
గాంధీ మహాత్ముడు కలలు కన్న మరో ప్రపంచంలో ఈ దేశం, ఒక్క వర్గానికో, మతానికో సొంతం కాదు. అందరికీ ఇది జన్మ భూమి అంటున్నారు కవి. పాటలో పతి వాక్యానికి ఒక క్రమం ఉంది. ఆ నాటి చరిత్ర సూచన ఉంది. గాంధీ అహింసా సిద్దాంతాన్ని ఆమోదించలేని శ్రీ శ్రీ అందుకే ఇక్కడ మహాత్మున్ని ప్రస్తావించేటప్పుడు అతని ఐకమత్య సిద్దాంతాన్ని మాత్రమే గుర్తు చేస్తున్నారు. శ్రీ శ్రీ రచనలు చేస్తున్న తొలి రోజుల్లో జాతీయవాద ఆరాధనను ప్రదర్శించినా, ఆయన పూర్తిగా విప్లవ కమ్యూనిస్టుగా మారినప్పుడు, స్పష్టంగా తీవ్ర విమర్శనా దశలోకి ప్రవేశించారు. కార్మిక వర్గ దుస్థితిని మార్చడానికి గాంధీ అహింస, సత్యాగ్రహ తత్వాలు నిష్క్రియాత్మకమైనవని, సరిపోని సాధనాలని శ్రీ శ్రీ విమర్శించేవారు. అందుకే గాంధీ పట్ల భక్తిని ద్వనింపజేసే ఈ పాటలోనూ ఆయన ఐకమత్య సిద్దాంతాన్నే చెప్పుకొస్తారు తప్ప అహింసా సిద్దాంతం ప్రశక్తి ఇక్కడ ఉండదు. ఇది పరీక్షగా పాటను పరిశీలిస్తేనే అర్ధం అవుతుంది.
ఆ తర్వాత ఉత్తర భారతంలోని గంగను దక్షిణ ప్రాంతపు కావేరిని కలిపి దేశాన్ని ఒకటి చేస్తాం అంటాడు కవి. ఈ నదులను కలిపి సరిహద్దులను చెరిపి స్నేహాన్ని నిలుపుతాం అని యువకులతో చెప్పిస్తూ ఇదే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కలలు కన్న ప్రపంచం కూడా అని గుర్తు చేస్తున్నాడు.
దేశంలోని ఉత్తర దక్షిణాలను సంఘిటిత పరచాలనే లక్ష్యంతో ముందడు వేసిన నేతాజీ సిద్దాంతాన్ని ఈ సందర్భంలో వివరిస్తున్నాడు కవి. నేతాజీ స్థాపించిన ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’ (INA) – నిర్మాణంలో దక్షిణాది భారతీయులు అత్యంత కీలకమైన, భారీ పాత్ర పోషించారు. వాస్తవానికి, యుద్ధ ఖైదీల (POW) నుండి వచ్చిన సాధారణ సైనికులలో ఎక్కువమంది ఉత్తర, పశ్చిమ భారతదేశానికి చెందినవారైనా ‘రెండవ INA’ను నిర్మించిన పౌర స్వచ్ఛంద కార్యకర్తలలో అత్యధిక సంఖ్యాకులు దక్షిణాది భారతీయులే, వారిలోనూ ప్రధానంగా తమిళులే ఉండేవారు. దానికి సూచనగానే గంగా కావేరీ నదులను కలుపుతాం అనే వాక్యం నేతాజీ లక్ష్యాణ్ని, పనిని వివరిస్తుంది. శ్రీ శ్రీ ఏ వాక్యాన్ని అర్ధరహితంగానో, లయ కోసమో, ప్రయోగం కోసమో వాడలేదు. నేతాజి ఆశయాన్ని, ఆయన పని తీరుని అలతి అలతి పదాలతో ఇక్కడ బంధించగలగడం కవిగా శ్రీ శ్రీ గొప్పతనం.
1943లో నేతాజీ ఆగ్నేయాసియాలో ఐఎన్ఏకు నాయకత్వం వహించినప్పుడు, ఆయన ప్రసంగాలతో అనేకులు ప్రేరణ పొందారు. రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ కు తమిళ వైద్యురాలైన కెప్టెన్ లక్ష్మీ స్వామినాథన్ (తరువాత లక్ష్మీ సహగల్) నాయకత్వం వహించారు. నేతాజీకి దక్షిణ భారతదేశంలో అపారమైన రాజకీయ మద్దతుండేది. తమిళనాడులోని పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ వంటి నాయకులు విదేశాలకు వెళ్లి ఐఎన్ఏ శ్రేణులలో చేరడానికి యువతను ప్రోత్సహించారు. ఆ నాటి చరిత్ర తెలిసిన వారికి ఈ చరణంలో వచ్చే గంగా కావేరీల కలయిక పెద్ద సామాజిక పాఠం గా అర్ధం అవుతుంది.
నదుల పేరుతో గొడవలు పడుతున్న నేటి తరానికి ఆ నాటి నాయకుల ఆశలను గుర్తుకు తీసుకొస్తుందీ తరువాతి చరణం. ఐకమత్యాన్ని, సామరస్యాన్ని సందేశంగా మోసుకొస్తున్న ఈ గీతంలో యువత తామంతా ఒకే గూటి గువ్వలమని, ఒకే తీగ పువ్వులమని, తరతరాల చీకట్లను తొలగించే దివ్వెలమని ప్రకటించుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తుంది. నెహ్రూజీ ఆశయం ఈ మరో ప్రపంచమే అని ఆ సందర్భంలో జవహర్ లాల్ ను తలుచుకుంటున్నారు పిల్లలు.
శ్రీ శ్రీ స్వాతంత్ర్యం తర్వాత విస్తృతమైన పేదరికం, ఆకలి, కార్మికుల దోపిడీ వంటి సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన పాలకవర్గ నాయకుడిగానే నెహ్రూను భావించారు. భావజాలపరంగా గాంధీ, నెహ్రూల సామాజిక-రాజకీయ సిద్ధాంతాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులను ఆయన తీవ్రవాద వామపక్ష దృక్పథం నుండే చూసేవారు. నిజమైన స్వాతంత్ర్యం అంటే సోషలిజం సాధించడమేనని, గాంధీజీ కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న బూర్జువా వర్గం నేతృత్వంలోని పెట్టుబడిదారీ సమాజం సామాన్యుడికి నిజమైన విముక్తిని అందించదని ఆయన విశ్వసించారు. అయినా ఈ చరణంలో ఎక్కడా ఆ వ్యతిరేక కనిపించదు.
నెహ్రూ ని గుర్తుచేస్తూనే దేశ ప్రజల ఐకమత్యాన్ని చెడగొట్టడానికి స్వార్ధపు రాజకీయాలను తమపై ఆయుధంగా ప్రయోగించే అహం మీరి జులుం చేయు ద్రోహులను, తమ బలం చూపి వీరులుగా హతమారుస్తాం అని యువకులతో చెప్పిస్తాడు కవి. ఇక్కడ నెహ్రూ నేతృత్వంలో చైనాపై భారతీయులు యుద్ద భూమిలో చూపిన విజయార్తిని గుర్తు చేస్తాడు కవి.
శ్రీ శ్రీ తన సామాజిక గీతాలలో రైతన్నలను, కార్మికులను, ప్రస్తావించకుండా ఉండరు. ఆ తర్వాత పాటను నడిపిస్తూ హలం బూని పొలం దున్ని మట్టిలో మేలి బంగారం పండించే రైతులను గుర్తు చేస్తూ లాల్ బహాదుర్ జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రస్తావిస్తాడు. మన శాస్త్రీజీ కృషి చేసిన మరో ప్రపంచం అంటూ తాము సృష్టించిన ఆ మరో ప్రపంచం శాస్త్రీజి కలలను ఎలా నిజం చేయగలదో ఆ యువకుల నోట చెప్పిస్తాడు.
బ్రతుకు విలువ చాటుతాం, ప్రగతి దారి సాగుతాం, విజ్ఞానం పెంచుతాం విశ్వశాంతి పంచుతాం అంటూ తాను ఆశించే యువకుల భవిష్యత్ ప్రణాళికను అప్పటి ప్రధాని ఇందిరమ్మ కలకు జోడిస్తూ మన ఇందిరమ్మ సందేశం మరో ప్రపంచం, మెరిసింది పిలిచింది మరో ప్రపంచం అంటూ ఆ మరో ప్రపంచాన్ని వీక్షించమని ఆహ్వానిస్తాడు కవి.
భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన నాటి నుండి గాంధీ, సుభాష్, నెహ్రూ, శాస్త్రీ, దేశ సాధికారత దిశగా కన్న కలలకు రూపం ఇచ్చే ప్రయత్నాలను స్వార్ధపు రాజకీయాలు, అణిచివేత సంస్కృతి అడ్డు కుంటున్నాయి. వీటిని ఎదిరించి మరో ప్రపంచాన్ని సృషించుకునే భాద్యత ఈ దేశ యువతదే. తమ భాద్యతను గుర్తించి తమ దేశాధినేతల కలలను సాకారం చేయడానికి ప్రయత్నించే యువత, ఆ మహానుభావులను మరో సారి గుర్తు చేస్తూ అలనాటి గాంధీ నుండి నేటి ఇందిరమ్మ వరకు అంతా ఏ ఆశయాలతో దేశానికి సారద్యం వహించారో, వాటిని ఆధారం చేసుకునే తాము మరో ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నామని ఆత్మవిశ్వాసంతో చెప్పుకుంటున్నారు.
ఈ పాట ఈ నాటి పరిస్థితులకు కూడా సరిగ్గా సరిపోతుంది. మరో ప్రపంచం అనేది ఎప్పటికీ దేశ ప్రజల కలే. దాన్ని సాకారం చేసుకోవాలంటే కుల వర్గ, మత లింగ భేధాలకు అతీతమైన నిర్మాణాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. ఆ దిశగా ప్రజలను ప్రేరేపించే గీతం ఇది.
సాధారణంగా శ్రీ శ్రీ పాటలు ఆవేశంతోనూ, ఉప్పొంగే ఉత్సాహంతోనూ పొంగి పొర్లుతూ ఉంటాయి. కాని ఈ పాట చాలా ప్రశాంతంగా, లయబద్దంగా సాగుతుంది. వీరావేశం, ఉత్తేజం కాకుండా ఒక లోతైన స్పష్టత, మృదుత్వం ప్రతి పదం లోనూ కనిపిస్తుంది. అందుకే శ్రీ శ్రీ ప్రభోదాత్మక గీతాలలో ఇది ప్రత్యేకం అని చెప్పవచ్చు. ప్రార్ధనా గీతంలా ప్రశాంతంగా, భక్తి గీతంలా మధురంగా సాగుతూ, శ్రోతలకు ఉత్తేజాన్ని పంచే ఈ పాటను స్వరపర్చింది కె. వి. మహదేవన్.
కాంగ్రెస్ కు వ్యతిరేకిగా అప్పటికే మారిన శ్రీ శ్రీ గాంధీయిజం పై భక్తికి ఏ లోటు రాకుండా, ఆ నాయకుల పై తనకున్న విమర్శనాత్మక ధోరణిని కనిపించనీయకుండా, ఎక్కడా రాజీ పడకుండానూ తాను నమ్మిన వర్గరహిత సమాజాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ ఈ గీతం రాసేరు. గాంధీ భక్తులు పరవశించిపోయేటట్లు, లెఫ్టిస్టులకు విమర్శించే అవకాశం లేకుండానూ పాట రాయగల నేర్పరి శ్రీ శ్రీ. ఎక్కడా అనవసరమైన పొగడ్త, ప్రశంస, అతిశయోక్తి ఉండకుండానూ జాగ్రత్తపడ్డారు. అది శ్రీ శ్రీ శైలి మరి.
చిత్రం : ప్రేమించి చూడు (1965) సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీశ్రీ నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
దొరికేరూ దొరగారు.. ఇక నన్ను విడలేరు
దోచుకున్న వలపులు దాచలేరు… అమ్మమ్మ.. ఆ.. ఆ..
దొరికేరూ దొరగారు… ఇక నిన్ను విడబోరు
ఆశలన్నీ తీరేదాకా ఆగలేరు… అమ్మమ్మ.. ఆ.. ఆ..
ఏ మాయ చేసినారో వీరు… నిలిచారు నా కంటిచూపులో (2)
మాయ నీదే మర్మం నీదే… హాయి నాదే అమ్మమ్మ.. ఆ.. ఆ..
అనురాగ మధువులు చల్లే.. ఓ మల్లే.. ఈ సిగ్గు నీకేలా.. ఆ.. ఆ.. (2)
అందం అంతా తమదే కాదా… తొందరేలా అమ్మమ్మ… ఆ.. ఆ..హోయ్
దొరికేరూ దొరగారు.. ఇక నన్ను విడలేరు
దోచుకున్న వలపులు దాచలేరు… అమ్మమ్మ.. ఆ.. ఆ..
నీవాడనని చేరినంత… నన్నింత ఊరించనేలనే…(2)
అందీ అందని అందంలో ఆనందం ఉందీ… అమ్మమ్మ.. ఆ.. ఆ.. హోయ్
దొరగారిని దొంగంటేనే చాలా.. ప్రియురాలా.. బంధించరావేలా(2)
పారిపోయే దొంగైతేనే బంధించాలి… అమ్మమ్మ… ఆ.. ఆ. హోయ్
దొరికేరూ దొరగారు.. ఇక నన్ను విడలేరు
దోచుకున్న వలపులు దాచలేరు… అమ్మమ్మ.. ఆ.. ఆ..
సినిమా పాటలు మెలడీ నుంచి మారుతూ స్పీడందుకుంటూ స్టేప్పుల వైపుకు వెళ్లుతున్న సమయంలో ‘ప్రేమించి చూడు’ అనే రొమాంటిక్ కామెడీ సినిమా పి. పుల్లయ్య దర్శకత్వంలో తెలుగులో వచ్చింది. నిజానికి ఇది ‘కాదలిక్క నేరమిల్లై’ అనే తమిళ చిత్రం రీమేక్. ఆ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. అందులో పాటలన్నీ గొప్ప హిట్లే. అందుకే ఆ ట్యూన్లను యథావిధిగా తెలుగులో వాడుకోవాలని పుల్లయ్య అనుకున్నారు. సంగీత దర్శకులు మాస్టర్ వేణుకు ఇది నచ్చకపోయినా తమిళ ట్యూనులనే తెలుగులోకి తీసుకోక తప్పలేదు. తమిళంలో అన్ని పాటలు పి. బి శ్రీనివాస్ పాడి అవి సూపర్ హిట్లయినందుకు తెలుగులోనూ మెయిన్ హీరో అంటే అక్కినేనికి అన్ని పాటలు పి. బి. శ్రీనివాస్ తోనే పాడించారు మాస్టర్ వేణు. సెకెండ్ హీరో జగ్గయ్య పై చిత్రించిన పాటను మాత్రమే ఘంటసాల పాడారు.. అందుకే సినీ క్రెడిట్శ్ లో పి. బి. శ్రీనివాస్ పేరు తరవాత ఘంటసాల పేరు వస్తుంది. ఇది ఆ తర్వాత మరెప్పుడూ తెలుగులో రిపీట్ కాలేదు. సెకెండ్ హీరో పై చిత్రించిన ఈ పాటనే తెలుగులో శ్రీ శ్రీ రాసారు.
దీని నిండా చిలిపితనం తొణికిసలాడుతూ ఉంటుంది. ట్యూన్ ని బట్టి తమిళ పాటను తెలుగీకరిస్తూ సన్నివేశానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ అనువాదం లా కాకుండా, స్వచ్చమైన తెలుగు పాటను సృష్టించారు శ్రీ శ్రీ. తమిళంలో నీ చూపు ఎంత వాడిగా ఉందో, దాని మాయలో పడి ఈ కన్నె పిల్ల నీ విరహంలో చిక్కిపోయింది’ అనే అర్ధంతో అక్కడ పాట సాగుతుంది. శ్రీ శ్రీ ఆ తమిళ ట్యూన్, సినిమాలో ఆ పాట వచ్చే సన్నివేశం, అందులో ప్రధానంగా పండించాల్సిన హాస్య రసాన్నిఆధారం చేసుకుని ‘దొరికేరు దొరగారు ఇక నన్నూ విడలేరు దోచుకున్న వలపులు దాచలేరు… అమ్మమ్మ” అంటూ పల్లవి రాసారు.
అమ్మమ్మా అన్న పదం, తొలి ప్రేమలోని పరవశాన్ని తమిళ పాటలో సూచిస్తూ సాగితే, దాన్ని అలాగే తెలుగులో ఉంచేయాలన్న నిబంధన ఉండడంతో తెలుగులో దాన్ని పూర్తి చిలిపితనపు వ్యక్తీకరణగా, ఆ పాత్రల అల్లరికి సూచనగా మార్చేసారు శ్రీ శ్రీ. కవి తలచుకుంటే చేయలేనిది ఏం ఉంటుంది? ప్రియురాలు అన్న మాటకు జవాబుగా అతను ‘దొరికేరూ దొరగారు… ఇక నిన్ను విడబోరు ఆశలన్నీ తీరేదాకా ఆగలేరు… అమ్మమ్మ’ అంటూ జవాబిస్తాడు.
ఈ పాటలోని చిలిపి శృంగార రసాన్ని శ్రీ శ్రీ సృష్టిగా ఒప్పుకోవడం నాకు చాలా కష్టమయ్యింది. ఆయన రాసిన శృంగార గీతాలన్నిటిలోని ఇది వెరైటీగా ఉంటుంది. సరదా సరదాగా సాగిపోతూనే ఆశ్చర్యపరుస్తుంది. ప్రేమలో టీనేజ్ యువకుల అర్ధం లేని కవిత్వం, ఒకరి ప్రభావంలో మరొకరు ఆలోచనలేకుండా మునకలేస్తూ ఉండడం, ఆ తొలి నాటి తొందర, ఆత్రం, ఇవన్నీ రంగరించి ఈ పాటలో టీనేజ్ రొమాన్స్ ను పండించాడు శ్రీ శ్రీ. ‘ఏ మాయ చేసినారో వీరు… నిలిచారు నా కంటిచూపులో’ అని ఆమె అంటే ‘మాయ నీదే మర్మం నీదే… హాయి నాదే అమ్మమ్మ.. ఆ.. ఆ.’ అని జవాబిస్తాడు అతను.
ప్రేమ మత్తులో కొట్టుకుపోతూ ఆ కొత్త రుచిలో మునిగి తేలుతున్న యువజంట తన్మయత్వాన్ని కూడా ఈ ప్రజా కవి అంత పక్కాగా పట్టేసుకోవడం మనకు కనిపించే ఆయనలోని మరో కోణం. ‘అనురాగ మధువులు చల్లే.. ఓ మల్లే.. ఈ సిగ్గు నీకేలా’ అని అతను ఆమెతో ఇంకాస్త చనువు తీసుకోబోతాడు. దానికి ఆమె ‘అందం అంతా తమదే కాదా… తొందరేలా అమ్మమ్మా’ అంటూ బదులిస్తుంది.
ఇదే సన్నివేశాన్ని శ్రీ శ్రీ ఇంకొన్ని శృంగార గీతాలలో పాట రూపంలో రాసారు. ప్రియుడు ప్రియురాలి పొందు కోసం తొందర పడుతుంటే, అక్కడ స్త్రీలు ప్రపంచం నియమావళి, నైతికత, వివాహం కాలేదన్న ఎరుకతో కూడిన భయ్యాన్ని ప్రకటిస్తారు. ఈ పాట దగ్గరకు వచ్చే సరికి దుడుకు మనస్థత్వం గల యువకుల మనోభావాలకు అనుకూలంగా భావ వ్యక్తీకరణ కనిపిస్తుంది. పాత్రలను ఎంతగా అర్ధం చేసుకుని పాటను ఆ నాటి కవులు రాసేవారో అర్ధం చేసుకోవచ్చు. పై చరణంలో ఆమె అతన్ని దూరంగానే ఉంచుతుంది, తన అందం అంతా అతనిదే అని తొందర వద్దని లౌక్యంగానే చెబుతుంది. కాని దానికి అతను ‘నీవాడనని చేరినంత… నన్నింత ఊరించనేలనే’ అని అడినప్పుడు, లోకం అనో, పెళ్ళి అనో సాకు చెప్పకుండా ‘అందీ అందని అందంలో ఆనందం ఉందీ… అమ్మమ్మ’ అంటూ అతన్ని ఉడికిస్తుంది. పూర్తిగా ఆ పాత్ర స్వభావం, రొమాంటిక్ కామెడిలో ప్రేయసీ ప్రియులు ప్రదర్శించే వ్యక్తిత్వానికి సరిగ్గా సరిపోయే వ్యక్తీకరణ ఇది.
దానికి అతను ఇంకా చమత్కారం జోడించి, ‘దొరగారిని దొంగంటేనే చాలా.. ప్రియురాలా.. బంధించరావేలా’ అని కొంటేగా ప్రశ్నిస్తాడు. మరి అతన్ని వలపు దోచుకున్నాడని అన్నప్పుడు అతను దొంగ అయినట్లే కదా. దొంగను మని బంధించాలి కదా, అలా దురం పెట్టకూడదు కదా.. అన్నది అతని కొంటే ఊహ. ఆమె చేతుల్లో బందీనవ్వాలన్న కోరిక ను అతను అంత లౌక్యంగా అమాయకత్వం నటిస్తూ అడుతున్నాడూ.
ఆమె అంత కన్నా ఘటికురాలు. అందుకే ‘పారిపోయే దొంగైతేనే బంధించాలి… అమ్మమ్మ’ అంటూ జవాబిస్తుంది. మరి దొరికేరు దొరకారు ఇక నన్నూ విడలేరు అని ఆమె అన్నప్పుడు దొరగారు నిన్ను విడబోరు అని అతను ముందే ప్రమాణం చేసేసాడు కదా. దాన్నే అయుధంగా వాడుకుంటూ పారిపోయేవాడిని బంధించాలి కాని వీడిపోని వాడిని బంధించేదెందుకు అని ఎంతో లౌక్యంగా అతని మాటలనే అతనికి గుర్తు చేస్తూ తమ మధ్య దూరాన్ని పాటిస్తుంది.
ఆ పాటలోని మూడ్ ను ఆస్వాదిస్తున్న శ్రోతలు ఆమె తెలివికి చమత్కారానికి ఫిదా అయిపోతారు. శ్రీ శ్రీ లోని ఈ కొంటే కోణం ఇతర శృంగార గీతాలలో ఎక్కడా కనిపించదు. గంభీరమైన శృంగారం, లోతైన ప్రేమ వ్యక్తీకరణ, సౌందర్యానుభూతి ఆయన పాటల్లో చాలా సార్లు కనిపిస్తాయి కాని ఈ పాటలోని చమత్కారపూరిత కొంటేతనం, చిలిపితనం, ఇతర ప్రేమ గీతాలలో ఆయన కలం పలికించగా కనిపించదు. ఆయన సహజ శైలికి మినహాయింపుగా నాకు కనిపించిన ఏకైక శృంగార గీతం ఇది. అందుకే శ్రీ శ్రీ పాటల్లో ఇది నాకు ప్రత్యేకంగా ఇష్టం. టీనేజ్ లవ్, ఆ వయసులోని వేడిని గొప్ప చమత్కారంతో జోడించి రాసిన పాట ఇది.
శ్రీ శ్రీ పాటలను వరుసగా ఒకొక్కటిగా వింటుంటే దేనికది శైలి పరంగానూ భావవ్యక్తీక్రణలోనూ విలక్షణంగా కనిపిస్తాయి. ఎన్ని విధాలుగా పాటలు రాయవచ్చో అన్నిటినీ ఆయన రాసి చూపించినట్లు అనిపిస్తుంది. తెలుగు సినీ సాహిత్యంలో నవరసాలను సమపాళ్లలో పండించిన కవి శ్రీ శ్రీ.





