తొలి కానుపు బిడ్డవు , ఓహ్ అందరికీ ప్రియమైన వాడివి
నీ శైశవ కాలపు అమాయకత్వమూ మధురిమా
అన్నీ దూరపు మేఘాల్లో మాయమయ్యాయి
నువ్వు మేటి బాల పురస్కారాన్ని గెల్చుకున్న సందర్భాన్ని
గుర్తు చేసుకుంటున్నాను
ఆశ్చర్య చికితులను చేసిన ప్రియమైన బొద్దు పిల్లాడా
నీ అందాన్ని నేను రోజూ నెమరేసుకుంటాను
నిన్ను చూస్తూ ఆనందలోకంలో విహరించాను
నీ ప్రతి అల్లరి చేష్టకూ ఆటపాటకూ మురిసిపోయాను
ప్రతి నిముషమూ నిన్నంటి పెట్టుకునే వున్నాను
నీ నూతన వికాసాలకు నా ఆనందం పొంగి పొర్లింది
నా ప్రేమాతిశయపు హృదయం నిన్ను కట్టడి చేయలేకపోయింది
అది పేరాశకూ స్వార్థ పరత్వానికీ ప్రేరణ అయింది
అపుడు నువ్వు సంపన్న మిత్రులతో జల్సా చేస్తూ
నైరుతి ప్రాంతపు స్థానిక మద్యాల్లో మునిగి తేలావు
ప్రేమతో హెచ్చరిస్తే నువ్వు పెడచెవిన పెట్టావు
కుటుంబానికి మిగిలిన తలవంపు హింస
మీదకు విరుచుకుపడే అప్పుల దాడులు
ఒక అద్భుత శిశువు పచ్చి తాగుబోతైన పరిణామం
మద్యపు కాలువల్లో ఈదడానికే ఇచ్చగించావు
ప్రియపుత్రుడా అడుగుతున్నాను చెప్పు
నీ జీవన లక్ష్యం ఇదేనా ఇదేనా
నీ మధుపాన మూర్ఖత్వం నుంచి బయటికి రా
వృథాగా దొర్లిపోయిన వత్సరాల గురించి యోచించు
మంచి అనిపించుకోకుండానే జీవితాన్ని ముగించొద్దు
అయినా నిన్ను ద్వేషించడానికి నేను ఎవరిని కొడుకా
దేశం కోసం నలుమూలలకు పరుగెత్తడంతోనే నాకు సరిపోయింది
నా బిడ్డలను దగ్గరికి తీసుకోవడానికి సమయమే చిక్కలేదు
ఆమె! తల్లిగా చేయగలిగిందంతా చేసింది పిల్లలకు –
కానీ ఒక మనిషి లేని ఖాళీని నింపలేకపోయింది
వ్యామోహాల వరద కట్టలు తెంచుకుని ముంచెత్తింది
కొడుకా , ఇపుడు నువ్వు జీవితపు చివరి తలుపును తెరిచావు
ఏ అర్థమూ లేని నీ జీవితమూ దాని విషాదపు ముగింపూ
నాకు ఒక కొత్త పాఠం నేర్పింది, అది రాయబడని పాఠం !
*
దర్భశయనం శ్రీనివాసాచార్య
కవి, విమర్శకుడు. అనువాదకుడు, “కవిత్వం “ వార్షిక సంకలనాలకు సంపాదకుడు .1961లో వరంగల్ లో జననం . ఇప్పటివరకు 12 తెలుగు కవితాసంపుటాలు, ఒక ఆంగ్ల కవితాసంపుటి (Scents of the Soil), ఒక విమర్శ గ్రంథం (ఇష్ట వాక్యం ), పిల్లల కోసం “బాలల కోసం బాటసారి పదాలు” అనే సంపుటిని వెలువరించారు.