వెదకులాడే నిమిషాలందున పుట్టిన కథలు

Spread the love

కథలు రాయడం మొదలు పెట్టిన తొలిరోజుల్లో చాలామంది సునామీ వేగంతో రాస్తూ పాఠకులను తడిపేస్తారు. తాజాస్వరాలను ఇష్టంగా ఆహ్వానించే పాఠకుల ప్రేమ వారిని నిలువనీయదు. తాత్కాలికంగా ఖాళీ అయిపోయే వరకూ రాస్తూనే ఉంటారు.  పది పదిహేను కథలు పోగుబడ్డాక ఒక కథల సంపుటి కూడా అంతే వేగంగా తెస్తారు. ఆ తర్వాత పొంగులు వారే ఉద్వేగం కుదురుకుని నిమ్మళిస్తారు. నవలలు, వ్యాసాలు, ఒక్కోసారి రాజకీయ, సామాజిక కార్యకర్తృత్వంలోకి తరలి పోతారు.

‘ఇసుక అద్దం’ పుస్తకంగా రాకముందు శ్రీ ఊహ కథల వడి, చదివించే గుణం, భిన్న కథా వస్తువుల ఎంపిక చూసినపుడు ఆసక్తి కలిగింది. చాలామందిలా వేగం తగ్గుతుందా, కొనసాగుతుందా అన్నది కూడా ఆసక్తి వెనుక పని చేసింది. తన రెండవ కథాసంపుటి ‘బల్కావ్’ తెస్తున్నానని చెప్పినపుడు-తాటాకు మంటలా చప్పున చల్లారేది కాక కథా సాహిత్యంలో సుదీర్ఘకాలం వెలుగులీనడానికి అవసరమైన ఉద్వేగ నిర్మాణం ఆమెలో బలంగా పాతుకుని ఉందనిపించింది. 

‘బ్యాక్ పాక్ కథలు’ టాగ్ లైన్ తో వచ్చిన ‘బల్కావ్’, కొన్ని అంశాలలో కొత్త ప్రయోగం. ఉద్యోగ రీత్యా, ప్రవృత్తి రీత్యా అనేక ప్రదేశాలు తిరిగిన అనుభవాలను ఆమె యాత్రా కథనాలుగా కాక కథలుగా రాసింది. వెళ్ళిన ఒక్కో చోటున ఒక్కో కథ దొరికింది. తిరిగిన దారుల్లో, కలిసిన మనుషులలో, ఎదురైన అనుభవాలలో తనే కథల కోసం వెదుక్కున్నదో, కథలే ఆమెని వెతుక్కుని వచ్చి రాయబడ్డాయో- విభ్రమ కలిగించే అనేక జీవితాలు అక్షరాలుగా కళ్లముందు పరుచుకున్నాయి. బల్కావ్ కథల నేపథ్యం గురించి చెపుతూ ‘సోలో ట్రావెల్స్ సోల్ లిబరేటింగ్ ఎక్స్పీరియన్స్’ అంటుంది ఈ రచయిత. ప్రయాణాలలో చుట్టూ మెసిలే మనుషులని, అనుభవాలని గాఢమైన ఇష్టంతో, ప్రేమతో హత్తుకోవడానికి తన మనసు ఎంతటి స్వేచ్చతో వికసించిందో! అందుకే ఇటువంటి కథలు పాఠకుల ముందుకు రాగలిగాయి.

కథా వస్తువులకే కాక కథా స్థలాలకి కూడా అంతే ప్రాధాన్యతని ఇవ్వడం ఫలవంతమైన ప్రయోగం. మనిషి ఇచ్చే అనుభవాన్ని ఏకకాలంలో స్థలం కూడా ఇవ్వడం వల్ల పాఠకులకి రెండు అనుభవాలను మనసారా పొందిన అనుభూతి కలుగుతుంది. ధూల్ పేట్ నుంచి వర్జీనియా వరకూ ఎన్ని వైవిధ్యమైన ప్రదేశాలను కథాస్థలాలుగా ఎంచుకుందో, ఆయాస్థలాల్లో అంతే వైవిధ్యమైన జీవితాలను కూడా చూపించింది. మురికివాడల కుర్రాళ్ళు, బడుగు బ్రాహ్మణ మిత్రుడు, ఒక అయిస్ క్రీమ్ టేస్టర్ పురా జ్ఞాపక శకలాలు, ఆదివాసీల విప్లవ రాజకీయాలు, కాకతీయుల కాలం నాటి సంగీత, సాహిత్యాల మేలిమి తరానా నృత్య రీతి, నిజాముద్దీన్ దర్గాలో ముడుపు చెల్లించిన అమ్మాయి ప్రేమ కథ, ఇళ్ళకి వెళ్ళి సర్వీస్ చేసే పేద ముస్లిం బ్యూటీషియన్ ఘర్షణ, కాలాన్ని కిట్టిపార్టీల్లో కిల్ చేసే కొత్త స్త్రీలు, శరీరం అమ్ముకుని బతికే ఘుమంటూ జాతి స్త్రీల జీవనవ్యధలు, అమానవీయంగా మారిన వైవాహిక జీవితం నుంచి విముక్తి వైపు అడుగు వేసిన స్త్రీ – వీరంతా ప్రశ్నలుగా, సమాధానాలుగా మనసు లోపల నిలిచిపోతారు.

సాధారణంగా రచయితలు తమకి పట్టు ఉన్న జీవితాలను, ప్రదేశాలను, యాస, మాండలికాలను అలవోకగా రాస్తారు. కానీ శ్రీ ఊహ ఒకటి అరా కథలు తప్ప అన్నికథల్లోనూ అవి ఎన్నేళ్లుగానో తన అనుభవంలో ఉన్నంత సహజంగా రాయగలిగింది. ఇంతటి సాధికార వ్యాఖ్యానానికి ఆమె ఖచ్చితంగా చాలా పరిశ్రమ చేసి ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా ‘తరానా’ కథ రాయడం చాలా కష్టం. ఒక పక్క చారిత్రిక అంశం, అవాస్తవమన్న సందేహం కలుగకూడదు. మరో పక్క సంగీత, సాహిత్య, నృత్య రీతుల మేళవింపు. ప్రాచీన కళల గురించి రాసేపుడు ఒక మాదిరి పరిజ్ఞానానికి కూడా చాలా అధ్యయనం అవసరం. ఇక వీటన్నిటిని మానవ ప్రవృత్తులలోకి ఒంపి కథగా రక్తమాంసాలు అద్దాలి. ఈ పని చాలా నిబ్బరంగా చేసింది రచయిత. పదాలను గురి చూసి వాడటంలో నైపుణ్యం అబ్బురాన్ని కలిగిస్తుంది. తరానా కథలో ఈ కింది చిన్న వర్ణన సన్నివేశాన్ని దృశ్యమానం చేసి పాఠకానుభవాన్ని వెలిగిస్తుంది.

“త్రిభంగిలో కూచుని, అరచేతి వేళ్ళు అరపద్మలుగా విరిసి ‘నీవెవరు?’ అని ప్రశ్నిస్తున్నట్లుగా మాచలదేవి సాచిన చూపులకు మంత్ర ముగ్ధుడయ్యాడు అజ్మత్ ఖాన్.’

కొన్ని చిన్ని చిన్ని జాగ్రత్తల వల్ల కూడా ‘బల్కావ్’ సంపుటి తన ప్రత్యేకతను నిలుపుకుంది. శ్రీ ఊహకి సొంత డిక్షన్ ఉంది. అందుకు ఎన్ని కారణాలు ఉన్నా తన ఉద్యోగ, సామాజిక జీవితాల రీత్యా నిత్యం అనేక మందిని కలిసే అవకాశమే తన భాషని ముఖ్యంగా సంపద్వంతం చేసి ఉంటుంది. ఇందులో వాడిన పదజాలం రీత్యా ఇవి ఆధునిక కథలు. కొత్తతరాల వారు మాట్లాడే భాష సందర్భానుసారం వాడడం వల్ల ఈ కథలు తాజా అనుభూతులకి తావు ఇస్తాయి.

‘లడాయి’ కథ జార్జిరెడ్డి హత్య నేపథ్యంలో రాసినా అతను కథానాయకుడు కాదు. నిజానికి ఇందులో హీరోలు లేరు. పేదరికానికి, వ్యసనాలకి, నేరమయ జీవితాలకి తలొగ్గిన మనుషులు ఉన్నారు. ఈ కథా గమనాన్ని సమర్థంగా నిర్వహించింది రచయిత. ఎక్కడా తీర్పులు ఇవ్వలేదు. అన్యాపదేశంగా కానీ కథ మధ్యలో సూచ్యంగా కానీ ఏ పక్షమూ తీసుకోలేదు. పాఠకుల ఉదాత్తతకి, జ్ఞానానికి ఇంత చోటు ఇస్తూ రచయితగా తను పూర్తి అనామకంగా ఉండగలిగింది. రచయితలు తమ లౌల్యాలను అణచుకుంటే లడాయి వంటి ఆలోచనాత్మక కథలు వస్తాయి. ముస్లిం జీవితాల పట్ల రచయితకి ప్రేమ, అక్కర ఉన్నాయని చాలా కథల్లో వారి జీవన చిత్రణ చూసినపుడు బలంగా అనిపిస్తుంది. తెలంగాణ పేద ముస్లిములు, ముఖ్యంగా వారి కుటుంబాల్లో స్త్రీలని ‘బర్కత్’ వంటి కథలు ‘బహుళ అణచివేతలకి’ గురయ్యే పౌరులుగా రచయిత గుర్తించగలిగింది.

తను స్త్రీ కనుక కేవలం స్త్రీవాద కథలే రాయాలనుకోలేదు. మొత్తం మానవ జీవితాన్ని వ్యాఖ్యానించే క్రమంలో స్త్రీ సమస్యా మూలాలను లోతుగా చర్చ చేయగలదు శ్రీ ఊహ. ఇటువంటి భావజాల నిగ్రహం అవసర సందర్భాలలో రచయితగా తను నిలబడాల్సిన చోట్లని నిర్భయంగా గుర్తించగలదన్న విశ్వాసాన్ని  ‘బల్కావ్’ పుస్తకం ఇస్తోంది. బల్కావ్ అంటే బాల్కనీ అట. పాఠకుల కోసం బాల్కనీ మాత్రమే కాదు, పది కథా స్థలాల ఆకాశాలు తెరుచుకున్నాయి. అనేక ఆకాశాలను చదువుదాం రండి.

కంగ్రాచులేషన్స్ శ్రీ ఊహా!

కె.ఎన్. మల్లీశ్వరి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *