మాతృత్వం

Spread the love

1930 నాటి శైశవ దశలో ఉన్న సోవియట్ యూనియన్‌లో, యువకులు, యువతులు చదువులు, పార్టీ సమావేశాలు, సామాజిక సేవ,  శ్రమ, ఇంకా అనేక ఇతర బాధ్యతల సుడిగుండంలో చిక్కుకుని ఉండేవారు. అలాంటి వాతావరణంలో స్త్రీ–పురుష సంబంధాలకు, లైంగికతకు, గర్భధారణకు సమయం ఉండేదా?

ఆ ఇద్దరూ— మరీనా, టెమ్కా, ఎప్పుడూ పనులతో మునిగిపోయి ఉండేవారు. చదువులు, సామాజిక బాధ్యతలు, అల్పమైన స్టైపెండ్ కోసం చేయాల్సిన పని—అన్నీ ఉండేవి. తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ వారి సమయం పూర్తిగా గడచిపోయ్యేది . ఆడిటోరియం నుంచి ప్రయోగశాలకు, ఫ్యాకల్టీ కమిషన్ సమావేశం నుంచి కొమ్సొమోల్ విభాగపు బ్యూరో సమావేశానికి. అలా రోజులు కలలోలా ఒకదాని వెంట మరొకటి గడిచిపోయేవి. తాము ప్రత్యేక వ్యక్తులమని, సజీవ మనుషులమని, ఇతరుల ఆసక్తులకు భిన్నంగా తమకంటూ ప్రత్యేక ఆసక్తులు ఉండవచ్చనే ఆలోచన  కూడా కొన్నిసార్లు పూర్తిగా మాయమైపోయేది.

అయితే అకస్మాత్తుగా, వారిద్దరి ముందూ వారికే సంబంధించిన—చాలా గంభీరమైన, ముఖ్యమైన, వారిద్దరికీ తప్ప మరెవరికీ ఆసక్తి లేని—ఒక విషయం వారి ముందు నిలిచింది.

శనివారం, ఎప్పటిలాగే, టెమ్కా మరీనా దగ్గర రాత్రి గడపడానికి హాస్టల్ నుంచి బయలుదేరాడు. ఆమె కళ్లలో అసాధారణమైన మెరుపు ఉంది. మాటల మధ్యలోనే అకస్మాత్తుగా ఆమె ఆలోచనల్లో పడిపోయింది. అతడు ఆమె నడుము చుట్టూ చేయివేసి, మెడపై ముద్దు పెట్టబోతుండగా, మరీనా అతని చేయిని ఆపి, కళ్ల కింద నల్లటి వలయాలున్న తన లోతైన కళ్లతో అతడిని నిశ్చలంగా చూస్తూ అంది:

“టెమ్కా! ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను గర్భవతిని.”

అతడు వెంటనే చేయి వెనక్కి తీసుకుని ఆమెను చూస్తూ ఉండిపోయాడు.

“నిజంగానా?!”

“అవును. డాక్టర్ దగ్గరకు వెళ్లాను..”

పొడవుగా, దృఢమైన శరీరంతో, పెద్ద తలతో ఉన్న టెమ్కా ఆ ఇరుకైన గదిలో నెమ్మదిగా అటూ ఇటూ నడవసాగాడు. మరీనా దిగులుగా అతని కదలికలను గమనించింది. అతని అంతరంగం లోతుల లో పూర్తిగా అహేతుకమైన ఆనందం, ఉపశమనంలాంటి అనుభూతి, ఒక విచిత్రమైన గర్వభావం ఉబికివచ్చాయి. అతడు అంతగా కుదేలై మాట కూడా పలకలేకపోయాడు. ఈ మూర్ఖమైన ఆనందం, ఈ ఉత్సవభావం అతడికి పూర్తిగా ఊహించనిది. ఆశ్చర్యంతో టెమ్కా నవ్వేశాడు; మరీనా పక్కన మంచంపై కూర్చుని, ఆమె చేతిని తన విశాలమైన అరచేతుల్లోకి తీసుకుని, సంతోషంతో కలిసిన కలవరంతో అన్నాడు:

“బాగుంది!”

తాను చెప్పిన వార్తకు అతడు ఇంత మంచిగా స్పందించినందుకు మరీనా సంతోషించింది. తన హృదయం లోతుల్లో ఆమెకూ జరిగినదాని పట్ల ఆనందమే ఉంది. కానీ దాంతో ఆమెకు ఏమాత్రం ఉపశమనం కలగలేదు. పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. ఆమె అడిగింది:

“మనం ఏం చేయబోతున్నాం? ఈ సంగతంతా చివరికి ఏం అవుతుందో, ఊహించు?”

“అవును, అవును….”

అతడు పరధ్యానంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. టెమ్కా ఇంకా తనకు అర్థంకాని, అకస్మాత్తుగా పుట్టిన ఆ ఆనందంలోనే మునిగి ఉన్నాడు. ఇంకా బాలికలా బిగుతుగా ఉన్న ఆమె పొట్టపై చేయివేసి నెమ్మదిగా నొక్కాడు.

“అద్భుతం! ఊహించు, నీ లోపల ఏదో పెరుగుతోంది; అది నీదీ, నాదీ. హా హా హా!”

అతడు గొంతు విప్పి నవ్వాడు. మరీనాకు కోపం వచ్చింది.

“మనమిద్దరం గంభీరంగా ఆలోచించాలి; నువ్వేమో మూర్ఖుడిలా గట్టిగా నవ్వుతున్నావు. దయచేసి నోరు మూసుకో!”

“కానీ నీకు ఆనందంగా లేదూ?”

“ఆనందం నా బొంద నాకు ఎప్పుడూ వాంతి వచ్చినట్టే ఉంటుంది. ఎంత అసహ్యంగా ఉందో! రొమ్ములు నొప్పిగా ఉన్నాయి; నువ్వు కూడా ఎంత అసహ్యంగా ఉన్నావో. నన్ను తాకవద్దు!”

మరీనా అతని చేయిని ఒక్కసారిగా తన శరీరం నుంచి తోసివేసింది.

ఆ రోజు వారు ఏ విషయంలోనూ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. వారి మనస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. కానీ అది భయంకరమైన ప్రశ్న; త్వరగా ఒక నిర్ణయానికి రావాల్సిందే. టెమ్కాపై తనకు కలుగుతున్న విచిత్రమైన అసహ్యాన్ని అదుపు చేసుకుని, మూడురోజుల తర్వాత తిరిగి వచ్చి ప్రతిదీ మాట్లాడుకుందామని మరీనా అంగీకరించింది.

కానీ నిజానికి చర్చించడానికి ఏముంది? విషయం పూర్తిగా స్పష్టమే. మరుసటి ఉదయం టెమ్కా కాస్త ప్రశాంతంగా ఆలోచించినప్పుడు అతనికి అర్థమైంది:

అసలు అర్థంలేని విషయం. బయటపడటానికి ఒకే మార్గం ఉంది.

తాము చేయబోయే పనిపట్ల అతని హృదయం లోతుల్లో ఆందోళన ఉంది; మరీనా నిజంగానే అలాంటి పని చేయడానికి దిగజారుతుందా అన్న అయోమయమూ ఉంది.

మూడు రోజుల తర్వాత వారు మాట్లాడుకున్నారు. అవును, నిర్ణయం తీసుకోవాల్సిందే. మరో దారి లేదు. మరీనా వేదనతో చేతులు మెలిపెడుతూ అంది:

“నాకు ఎప్పుడూ వాంతి వచ్చినట్టే ఉంది! దేని గురించీ ఆలోచించలేకపోతున్నాను! ఇంకో రెండ్రోజుల్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ పరీక్ష ఉంది!”

టెమ్కా ఆమెను దొంగచూపులతో చూశాడు; ఇంత సులభంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంటోందనే విషయంపై అతనికి లోలోపల బాధ కలిగింది.

ముందుగా ఆమె రెండు పరీక్షలు రాయాలి. వాటి కోసం మరీనా చాలా కాలంగా సిద్ధమవుతోంది; వాటిని వాయిదా వేయడం అసాధ్యం. ఆమెకు వాంతులు,  ఆహారం గురించిన ఆలోచనే భయంకరంగా అనిపిస్తుంది . ఆమె తల అసలు పనిచేయడం లేదు. పైగా టెమ్కా కూడా ఉన్నాడు. ఎందుకో ఆమెకే అర్థం కాకపోయినా, అతడిపై ద్వేషం పెరుగుతున్నట్టు  ఆమెకు అనిపిస్తోంది. అతడు కౌగిలించుకోవాలని ప్రయత్నించినప్పుడల్లా ఆమె ఒళ్లు విరుచుకుపడేది. ఆమె అతనితో ఇలా అంది:

“దయచేసి, దగ్గరకు రాకు నువ్వంటే నాకు చాలా అసహ్యంగా ఉంది.”

మహిళా వైద్యురాలు మరీనాను పరీక్షించి, ఆమె జీవన పరిస్థితుల గురించి అడిగింది.

‘ఇది తరచుగా జరిగే కథే. డాక్టర్‌గా నిన్ను సాధ్యమైనంతగా నిరుత్సాహపరచడం నా బాధ్యతే. కానీ నేను నీ స్థానంలో ఉంటే నేనూ ఇదే చేసేదాన్ని.”

ఆమె క్లినిక్‌కు వెళ్లేందుకు ఒక అనుమతి పత్రం ఇచ్చింది.

మూడు రోజుల తర్వాత టెమ్కా మరీనాను ఆమె గదికి తీసుకువచ్చాడు. మరీనా ముఖం పాలిపోయి, పీక్కుపోయి ఉంది; కళ్లూ నెమ్మదిగా కదులుతూ శూన్యంలోకి చూస్తున్నాయి. కానీ టెమ్కాను చూసినప్పుడు వాటిలో మమకారం కనిపించింది. అది మళ్లీ ఎప్పుడైనా జరుగుతుందని అతడు ఆశ వదిలేశాడు. మరీనా పడుకుని, సుత్తికారుడి చేతిలా కనిపించే అతని మొరటు విశాలమైన చేతిని మృదువుగా నిమురసాగింది.

అతడు అడిగాడు:

“చాలా నొప్పిగా అయ్యిందా?”

“శారీరకంగా అంతగా కాదు. పన్ను పీకడం కంటే చాలా నొప్పి. కానీ ఎంత భయంకరమో….”

ఆమె శరీరమంతా వణుకుతోంది. అతని చేతిని బిగించి తన చెంపకు అద్దుకుంది. చాలాసేపు మౌనంగా ఉంది.

సాయంత్రం ఆమె అంది:

“దాని నిర్లజ్జతే భయంకరంగా ఉంది. వ్యభిచారంలా. ఒక స్త్రీ ఇలాంటి పని చేయగలదని ఇప్పుడు నాకు వింతగా అనిపిస్తోంది. డబ్బు కోసం తనను తాను అమ్ముకోవడాన్ని ఊహించలేనట్టే, దీన్నీ ఊహించలేకపోతున్నాను. ఇది మొత్తం ఆత్మను వికృతం చేయగలదు… అక్కడ వారు నాతో చేసినదంతా. ఛీ … చెడిపోయిన ముద్ర పెదవులపై శాశ్వతంగా మిగిలిపోతుంది; బాధా, నిర్లజ్జతా కళ్లలో గడ్డకట్టిపోతాయి. భవిష్యత్ మనుషులపై…. ఇక దీని గురించి ఆలోచించలేను.”

ఆ సాయంత్రం వెచ్చగా, ఉంది. టెమ్కా తనను ప్రేమతో, అపరాధభావంతో కౌగిలించుకోవడంలో మరీనా తన మనసుకు ఓదార్పు పొందింది. అయినా ఆమె ఆలోచనలు జరిగినదాని వద్దకే తిరిగి తిరిగి వెళ్తున్నాయి. దీపం ఆర్పినప్పుడు—టెమ్కా ఆమె దగ్గరే రాత్రి ఉండి నేలపై పడుకోవడానికి ఏర్పాటుచేసుకున్నాడు—ఆమె అంది:

“గుర్తుందా, శరదృతువులో ‘రెడ్ స్టూడెంట్’లో ఒక వ్యాసం వచ్చింది? నేను దానిగురించే ఆలోచిస్తున్నాను. ఎలా ఉండేది? ‘మన రోజులు లిల్లీలు, అడవి పువ్వుల సువాసనతో; ఇప్పుడు అయోడిన్ వాసనతో నిండిపోయాయి. స్త్రీరోగ సింహాసనపు గోల్గొథాపై సిలువ వేయబడినప్పుడు, మన సాధారణ విద్యార్థి ప్రేమ గురించి ఎవరు మాట్లాడతారు?’”

ఆ రాత్రి, నిద్రలో టెమ్కా మరీనా మెల్లగా ఏడవడం విన్నాడు.

జీవితం మళ్లీ మామూలు గమనంలోకి వచ్చింది. మరీనా, టెమ్కా ఇద్దరూ మళ్లీ తమ రోజులు మాయమయ్యే పని సుడిగుండంలోదిగారు ; ఆడిటోరియం తర్వాత ప్రయోగశాల, పార్టీ విభాగ బ్యూరో, ఫ్యాకల్టీ కమిషన్ మళ్లీ వచ్చాయి. వారి పరస్పర సంబంధంలో మాత్రం ఇద్దరూ మరింత జాగ్రత్తగా, మరింత పరిణతితో మారారు. ఊహించని ఆ సంక్లిష్టత మళ్లీ రాలేదు.

సంవత్సరంన్నర గడిచింది. ఇద్దరూ పట్టభద్రులయ్యే దశకు చేరుకున్నారు.

మరీనా తుది పరీక్షలు పూర్తి చేసి తన పరిశోధనా వ్యాసానికి సిద్ధమవుతోంది. టెమ్కాకు కూడా వ్యాసం రాయాల్సి ఉంది; అదనంగా మూడు నెలల పారిశ్రామిక ప్రాక్టికల్ పని ఉంది.

అప్పుడు జరిగింది.

ఒక శనివారం టెమ్కా మరీనా దగ్గరకు వచ్చాడు; వారిద్దరూ సినిమా చూడటానికి వెళ్లారు.

ఒక కార్మిక విప్లవకారుడు. ఉదయం. అతడు నిద్రలో ఉన్నాడు. అతని నాలుగేళ్ల కొడుకు పరుగెత్తుకొచ్చి అతన్ని లేపుతాడు. తండ్రి ఆ చిన్నబాలుడితో ఆటలాడతాడు. తర్వాత ఆ బాలుడు మరో గదిలోకి వెళ్లి, వారితో ఉంటున్న ఒక విద్యార్థిని లేపుతాడు—అతడూ విప్లవకారుడే; కానీ చివరికి అతడు ద్రోహి అని తెలుస్తుంది.

మళ్లీ ఆ బిడ్డ నవ్వే ముఖం, జంతువులూ పిల్లలూ తెరపై చూపించే ఆ మధుర స్వభావం.

చీకటిలో మరీనా టెమ్కా మోచేయికి ఆనుకుని, ఉత్సాహంగా అడిగింది:

“ఎంత అద్భుతమైన పిల్లవాడు కదా? ఎంత ముద్దుగా ఉన్నాడు!”

టెమ్కా ఆశ్చర్యంగా విన్నాడు. ఆమె అంతగా ఎందుకు ఉద్వేగపడుతోంది? మాములు పిల్లాడిలానే ఉన్నాడు. సినిమాలో అచంచలంగా ఉండే కార్మిక విప్లవకారుల సాహసాలు గాని, విద్యార్థి ద్రోహం గాని ఆమెను ఏమాత్రం కదిలించలేదు. ఆ చిన్నబాలుడు మళ్లీ తెరపై కనిపిస్తాడా లేదా అన్నదే ఆమె ఎదురు చూసింది.

సినిమా హాలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మరీనా ఆ బాలుడి గురించే ఉత్సాహంగా మాట్లాడుతుండగా, టెమ్కా నవ్వుతూ అన్నాడు:

“వాడంటే నీకంత ఇష్టం ఎందుకు? వాడు ముక్కు కారే సాధారణ పిల్లాడే. అందులో ఏముంది?”

తర్వాత మరీనా చిన్న విషయమేదో పట్టుకుని టెమ్కాతో వాదించింది. తన భవనం మెట్లదగ్గర అతనితో “వీడ్కోలు” అంది. విచారంతో, అయోమయంతో అతడు రాత్రి గడపడానికి హాస్టల్‌కు తిరిగి వెళ్లాడు.

దీని తర్వాత మరీనాకు ఏదో విచిత్రమైన మార్పు వచ్చింది. ఆమె తన గదిలో ఒంటరిగా కూర్చొని, జియాలజీ పరీక్ష కోసం చదువుతూ లేదా ‘అజిటేటర్ సహచరుడు’ చదువుతూ ఉండేది. పక్క గది నుంచి శిశువు మృదువుగా ఏడుస్తున్న శబ్దం వినిపించేది. ఆమె పొరుగువారు అలెవ్టీనా పెట్రోవ్నా ఇటీవలే ప్రసవించింది; ఆ బిడ్డ చాలా చంచలుడు, ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేవాడు. మరీనా చదవడం ఆపి, ఆలోచనల్లో మునిగి, చాలాసేపు వినేది. తన రొమ్మును చేతితో, బల్ల అంచుకు నొక్కేది. తనకు పురుషుడి చేయి రొమ్మును నిమరడం గాని, పురుషుడి పెదవుల ముద్దులు గాని అవసరం లేదని అనుకుంది. ఆమెకు కావలసింది ఒక్కటే. ఆ పసిబిడ్డ శరీరాన్ని చేతుల్లోకి తీసుకోవాలని, చిన్న పెదవులు తన పాలుతాగాలని ఆమె తీవ్రంగా కోరుకుంది. ఇంతకుముందు తనను ఆకర్షించిన, ఎంతో మధురంగా అనిపించినవన్నీ ఇప్పుడు మురికిగా, భారంగా అనిపించాయి.

మరీనా వంటగదిలో ప్రైమస్ స్టవ్ వెలిగించి కెటిల్ పెట్టింది. సోవియట్ వాణిజ్య ఉద్యోగి, అలెవ్టీనా పెట్రోవ్నా భర్త అయిన సెవ్ర్యూగిన్ వంటగదిలోకి వచ్చాడు. క్షమాపణ కోరుతున్న స్వరంలో ఇలా అన్నాడు:

“మా చిన్నవాడు చాలా ఏడుస్తాడు. కొంచెం అదుపు చేయలేనివాడు. మీరు చదవాలి కదా. అతడు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడా?”

మరీనా కాసేపు మౌనంగా అతనిని చూసి, వెంటనే అంది:

“ఇబ్బంది పెడుతున్నాడు. నాకు అతడిపై చాలా అసూయగా ఉంది.”

ఆమె త్వరగా వంటగది నుంచి బయటకు వెళ్లిపోయింది.

ఒకసారి మధ్యాహ్న భోజనం తర్వాత, కలవరపడుతూ అలెవ్టీనా పెట్రోవ్నా మరీనా గది తలుపు తట్టి అంది:

“ఇలా అడగాల్సి వస్తున్నందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. నా నూనె రేషన్ కార్డు ఇవాళే గడువు తీరుతుందని ఇప్పుడే గుర్తొచ్చింది. నేను దుకాణానికి వెళ్లాలి; అక్కడ పెద్ద క్యూలైన్ ఉంటుంది. గోడ అవతల ప్రతిదీ వినిపిస్తుంది. నా బాబు ఏడవడం మొదలుపెడితే, కాస్త చూసుకుంటారా? దయచేసి క్షమించండి. పిల్లలు ఎంత పని పెడతారో, ఎంత తలనొప్పో!”

ఆ గోడ అవతల బిడ్డ అప్పటికే ఏడుస్తున్నాడు.

మరీనా జియాలజీ పుస్తకాన్ని కిందపెట్టి వేగంగా లేచింది.

“ఇప్పుడే వెళ్తాను. నాకు సంతోషమే. మీరు తొందరపడవద్దు.”

వారు పక్క గదిలోకి వెళ్లారు. అలెవ్టీనా పెట్రోవ్నా అంది:

“క్షమించండి. నేను చాలా ధైర్యం చేస్తున్నాను. వంటగదిలో నీళ్లు వేడెక్కుతున్నాయి. ఇవాళ అతనికి స్నానం చేయిద్దామని అనుకున్నాను. ఆ నీళ్లు కూడా కాస్త చూసుకుంటారా?”

“సరే, సరే, అన్నీ నేను చూసుకుంటాను. మీరు వెళ్లండి.”

“ఎంతో ధన్యవాదాలు. వాడు తడిస్తే, ఇక్కడ ఒక పొడి డైపర్ వేలాడుతోంది.”

కృతజ్ఞతతో నవ్వుతూ ఆమె వెళ్లిపోయింది.

బిడ్డ మంచంపై ఏడుస్తున్నాడు. మరీనా అతడిని ఎత్తుకుని గది చుట్టూ తిప్పసాగింది. ఓదారుస్తూ మురిపెంగా అంది:

“అయ్యో, ఏడవకు!”

బిడ్డ బొద్దుగా ఉన్న నుదుటి నునుపైన చర్మంపై ఆమె తన పెదవులను అద్దింది.

బిడ్డ ఏడుపు ఆపాడు; కానీ నిద్రపోలేదు. మరీనా అతడిని మంచంపై పెట్టి, తిరిగి పుస్తకం దగ్గరకు వెళ్లాలనుకుంది. కానీ ఆ బాలుడి వైపు చూస్తూనే ఉండిపోయింది; అతని కణత దగ్గరున్న సన్నని కొద్ది బంగారు వెంట్రుకలపై ముద్దు పెట్టకుండా ఉండలేకపోయింది. అతడు నవ్వేలా చేయడానికి అతని ముందు వేళ్లను చిటికేసింది. ఎంత సిగ్గుచేటు! చదవాల్సిన కఠినమైన జియాలజీ పాఠం ఉంది; కానీ ఆమె బొమ్మలాట ఆడాలని నిర్ణయించుకుందా?

ఆమె బిడ్డను మంచంపై పెట్టి, బల్ల దగ్గర కూర్చుని పుస్తకం తెరిచింది. కానీ బాలుడు మళ్లీ ఏడవసాగాడు. మరీనా డైపర్ చూసింది; అది తడిసి ఉంది. మళ్లీ అతడిని చూసుకోవాల్సి వచ్చిందనే విషయం ఆమెకు రహస్యంగా ఆనందం కలిగించింది. డైపర్ తీసి, చాలా జాగ్రత్తగా అతడిని శుభ్రమైన డైపర్‌పై పెట్టి చుట్టబోయింది. కానీ అతడిని చూసి మురిసిపోయి మరిచిపోయింది. పొట్ట మధ్యవరకే వచ్చే ఆ చిన్న పలుచని చొక్కాలో, బొద్దు కాళ్లను ఊపుతూ, ఏకాగ్రతతో ముద్దుముద్దుగా ఏదో పలుకుతూ, బిగించిన పిడికిలిని నోట్లో పెట్టుకుంటున్నాడు.

విచారంతో కూడిన కన్నీళ్లు, నిర్వచించలేని ఆవేదన ఆమె ఛాతీలో పొంగసాగాయి. మరీనా పెదవి కొరికింది. భుజాలు వెనక్కి లాగబడ్డాయి. మోచేతుల వద్ద గుంటలున్న ఆ నిండైన చేతులు, లోతైన మడతలతో కూడిన మణికట్టులు, నిజానికి ఆ ముద్దైన చిన్న శరీరమంతా తనకు ఎంత ప్రియమో ఆమె తీవ్రంగా—దాదాపు స్పర్శించగలిగినట్టు—అనుభూతి చెందింది. కొత్త కళ్లతో ప్రపంచాన్ని చూస్తున్నట్టుంది. తన ముందున్నది అసాధారణమైన, సాటిలేని మధురమైనదిగా అనిపించింది.

ఆ గంట మొత్తం మరీనా తన పుస్తకాన్ని తాకలేదు. అలెవ్టీనా పెట్రోవ్నా తిరిగి వచ్చి మళ్లీ క్షమాపణలు కోరుతూ, కృతజ్ఞతలు చెబుతూ ఉంది. మరీనా అడిగింది:

“ఇప్పుడు బాబుకు స్నానం చేయిస్తారా?”

“అవును.”

“నేను చూడవచ్చా?”

“అయ్యో తప్పకుండా! ఎందుకు కాదు!”

జింక్ తొట్టిలో నుంచి వెచ్చని ఆవిరి లేచింది. అలెవ్టీనా పెట్రోవ్నా బల్లపై సబ్బు, స్పాంజ్, పౌడర్ డబ్బా పరచింది. వారు బిడ్డ బట్టలు తీసి, థర్మామీటర్‌తో నీటి ఉష్ణోగ్రత చూశారు. నగ్నంగా ఉన్న బాబు మంచంపై అడ్డంగా పడి, కాళ్లు ఊపుతూ, ముద్దుముద్దుగా ఏడవసాగాడు. చేతుల మడతలు మడిచి ఉన్న తల్లి అతడిని ఎత్తుకుని, అతని శరీరమంతా తన మృదువైన తెల్లని చేతిపై ఆనేటట్లుగా పట్టుకుని, తర్వాత అతడిని తొట్టిలోని నీటిలోకి దించింది.

బిడ్డ వెంటనే కళ్లను పెద్దవిగా తెరిచి, ఆశ్చర్యంగా “ఓహ్!” అంటూ ఏడవసాగాడు.

పచ్చని షేడ్ ఉన్న విద్యుత్ దీపం వెలుగు పై నుంచి పడుతోంది. పచ్చటి ప్రతిఫలనాలతో మెరుస్తున్న నీటిలో బాలుడు కాళ్లను మెల్లగా కదుపుతూ, పైకప్పు వైపు శ్రద్ధగా చూశాడు. తల్లి అతని తలకు సబ్బు రాయబోతూ, అతని చూపును గమనించి ఆగిపోయింది. నవ్వింది.

“చూడు, ఎలా చూస్తున్నాడో!”

విశాలంగా తెరిచిన, పరిశీలించే కళ్లతో, తాను మాత్రమే చూడగలిగే, దాగి ఉన్నది  ఏదో తన ముందున్నట్టుగా అతడు పైకి చూస్తున్నాడు. అతడు నిశ్శబ్దమయ్యాడు. రెప్పవేయకుండా, గంభీరంగా, జాగ్రత్తగా చూస్తూనే ఉన్నాడు. చాలా దూరపు, చాలా పురాతనమైన ఏదో గుర్తుకు తెచ్చుకుంటున్నట్టుంది—ప్రపంచం తనలాగే చిన్నదిగా ఉన్న కాలం నాటిది. తనపై, తన చుట్టూ విస్తరించిన జీవితపు అపరిమిత సముద్రాన్ని—తాను దానిలో చిన్నదైనా సంపూర్ణమైన చుక్కననే విషయాన్ని—అతడు అనుభవిస్తున్నట్టుంది.

మళ్లీ ఆశ్చర్యంగా “ఓహ్!” అన్నాడు; పైకే చూస్తూ ఉన్నాడు.

మరీనా ఉద్వేగంగా గదిలో అటూ ఇటూ నడిచింది.

ఆ సాయంత్రం టెమ్కా వచ్చాడు. వారు మాట్లాడుతుండగా మరీనా అంతగా ఆలోచనల్లో మునిగిపోయింది కాబట్టి, చివరికి టెమ్కా ఆశ్చర్యంగా అడిగాడు: “నీకు ఏమైంది?”

“ఏమీ లేదు.”

ఆమె వెచ్చగా అతనికి దగ్గరగా చేరింది. రాత్రి పొడవుగా సాగింది. వారి మాటలు కూడా పొడవుగా ఉన్నాయి. ఉద్వేగభరితంగా,.

“వద్దు! నాకు అది వద్దు!”

“మరీనా, నీకు ఏమైంది? ఏడాదిన్నర క్రితం జరిగినట్టు మళ్లీ కావాలనుకుంటున్నావా? ఇప్పుడు మనకు పిల్లలు ఎందుకు? కాస్త వేచి చూద్దాం. ముందు చదువు పూర్తిచేద్దాం. ఇంకా ఎక్కువ సమయం లేదు కదా.”

మరీనా సవాలుగా జవాబిచ్చింది:

“మనకు పిల్లలు అవసరం లేదా?! నీ గురించి నువ్వు మాట్లాడు. నీకు అవసరం లేదా? ఆలోచించు. అసలు, నీకు కావాలా లేదా? టెమ్కా! అర్థం చేసుకో!”

ఆమె చీకటిలో మంచంపై కూర్చుని తన నగ్న చేతులను మెలిపెడుతూ అంది: “లేత జుట్టుతో, ఏడుస్తూ, చిన్న చేతులు చాచుతూ, ‘అమ్మా!’ అని అరుస్తున్న చిన్నబ్బాయి నాకు కావాలి! అది నాకు వ్యాధిలాఅంటుకుంది ; ఇంకేమీ ఆలోచించాలనిపించడం లేదు. నాకు బిడ్డ లేకపోతే నువ్వూ అసహ్యమే, ప్రతిదీ అసహ్యమే!”

టెమ్కా ఒక్కసారిగా లేచి తొందరగా బట్టలు వేసుకోవడం మొదలుపెట్టాడు. దీపం వెలిగించాడు. మరీనా దుప్పటి కింద నుంచి అతడిని శత్రువును చూసినట్టు  చూసింది. అప్పటికి తెల్లవారుజామున నాలుగు గంటలు. అతడు కోపంగా వెళ్లిపోయాడు.

చివరికి టెమ్కా ఒప్పుకోవాల్సి వచ్చింది. మరీనా కోరుకున్నది ఆమెకు దక్కింది.

మళ్లీ ఆమెకు చాలా కష్టంగా మారింది. వికారంతో మళ్లీ బాధపడింది; తలనొప్పి ఎప్పుడూ ఉండేది. కానీ ఆమె హృదయంలో తియ్యని ఎదురుచూపు నివసిస్తోంది; మరీనా తన భారాలన్నీ విజయోత్సాహంతో మోసింది. మంచానికే పరిమితమైనప్పుడు కూడా ఆమె ధైర్యంగా పుస్తకాలు మళ్లీ పట్టుకుంది. నూలు మిల్లు వద్ద ప్రస్తుత రాజకీయాలపై గుంపు చర్చను ఉత్సాహంగా నడిపింది.

నెలలు గడిచాయి. ఒకరోజు మరీనా తన వర్గంలోని అమ్మాయిలతో కలిసి కర్మాగార క్లబ్ నుంచి ఇంటికి వస్తోంది. వారు భారత విప్లవోద్యమం, గాంధీ, ఉప్పు గిడ్డంగులపై దాడి, “ఎర్ర చొక్కాలవారి ” గురించి ఉత్సాహంగా చర్చిస్తున్నారు. కొమ్సొమోల్ కార్యకర్త గాల్యా ఆండ్రేయేవా మరీనా ఉబ్బిన పొట్టను చూసి అంది:

“అయ్యో, మరింకా, ప్రస్తుత రాజకీయాల్లో ఎంత మునిగిపోయావు! ప్రపంచమంతా ఏమవుతోంది, ఎక్కడ ఏమి జరుగుతోంది, దాని అర్థం ఏమిటో అన్నీ చూస్తావు. కానీ శరదృతువులో ఏమవుతుంది?” అని ప్రశ్నిస్తూ ఆమె చేయిని మరీనా పొట్టపై ఉంచింది. “నువ్వు మమ్మల్ని వదిలేస్తావు. ఎప్పుడూ ఇలాగే. బిడ్డ పుట్టగానే అమ్మాయి తన పని అంతా వదిలేస్తుంది.”

మరీనా గట్టిగా నవ్వింది.

“నువ్వు మూర్ఖురాలివి, గాల్కా! ఇలాంటి చిన్నబుర్జువా జీవితం చేపట్టే కంటే యౌజా నదిలో వంతెనపై నుంచి దూకడం మేలు. పిల్లవాడిని కని, సామాజిక పనిని కొనసాగించడం సాధ్యమే.”

భర్త ఉన్న మరో కొమ్సొమోల్ కార్యకర్త విచారంగా అంది:

“మనమందరం అలానే అంటాం. పిల్లవాడి కోసం ఎంత పని చేయాలో నీకు ఇంకా తెలియదు.”

“చూస్తావు, వేచి ఉండు,” అని మరీనా నమ్మకంగా అంది.

మరీనాను తరచూ అలసట, నిస్సహాయత కమ్ముకొనేవి. వీధిలోనూ, ముఖ్యంగా రొట్టె లేదా పాలు కొనడానికి క్యూలో నిలబడినప్పుడూ, ఆమెకు తల తిరిగేది. మొత్తంగా తనంతట తానే జీవించడం మరింత కష్టమైంది.

టెమ్కా హాస్టల్‌ను విడిచి ఆమెతో కలిసి ఉండటానికి వచ్చాడు. తనకు సాధ్యమైనంత, సమయం దొరికినంత సాయం చేశాడు. మరీనా పట్ల అతడు మృదువుగా, శ్రద్ధగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆమెతో కలిసి వీధిలో నడవడం అతనికి ఇబ్బందిగా అనిపించేది; ఎదురయ్యేవారు, ముఖ్యంగా స్త్రీలు, మరీనా ఉబ్బిన పొట్టపై త్వరగా, ఆలోచనతో కూడిన చూపులు విసిరేవారు. ఆమె నడక ఎంత మారిపోయిందో!

ఇంతకుముందు ఆమె స్ప్రింగ్‌లపై నడుస్తున్నట్టుగా వేగంగా నడిచేది; ఇప్పుడు బాతులా కాళ్లను మార్చిమార్చి ఊగుతూ నడుస్తోంది. కూర్చున్నప్పుడు కాళ్లను వెడల్పుగా చాపుతోంది. సాధారణంగా ఆమె అందంగా లేదని టెమ్కా ఇప్పుడు గమనించాడు. మరీనా ఎప్పుడూ పెద్దగా అందగత్తె కాదు: చప్పటి ముక్కు, ఎన్నో మచ్చలు, ఫాక్స్‌ట్రాట్ శైలిలో కత్తిరించిన అదుపులేని జుట్టు. అయితే ఆమెలో కొమ్సొమోల్ శైలికి చెందిన బలం, ఆరోగ్యం, ఉత్సాహం ఉండేవి. ఇప్పుడు ఆమె ముఖంలోని మచ్చలన్నీ కలిసి ముక్కు మధ్యభాగాన్నీ చెంపలనూ కప్పిన ఒకే గోధుమ మచ్చలా మారాయి. పెదవులు తెల్లగా ఉన్నాయి. కళ్లలో ఎప్పటికీ తగ్గని అలసట కనిపిస్తోంది.

అయినా, ఇవన్నీ ఉన్నప్పటికీ టెమ్కా ఆమెవైపు బలంగా ఆకర్షితుడవుతున్నాడు. అతనికి ఆమె మునుపటిలాగే కావాల్సినదే. కానీ అతని కౌగిలింతలు ఆమెకు పూర్తిగా భరించలేనివిగా మారాయి; అసహ్యంతో ముఖం ముడుచుకుని, అతని చేతులను వణుకుతూ తోసివేసేది. ఇదంతా సహజమే, ప్రకృతి నియమాలకు అనుగుణమే అని టెమ్కాకు బాగా తెలుసు; అయినప్పటికీ అతని హృదయం నొచ్చుకునేది. మరీనా కఠినంగా ఉండడం, కోపపు విస్ఫోటనాలకు లోనవడం అతనికి ఇంకా ఎక్కువ బాధ కలిగించేది; అయినా తనకు ఆమె జీవితంలో అతడే అత్యంత దగ్గర, అత్యంత ప్రియమైన వ్యక్తి అని టెమ్కా ఎప్పుడూ అనుకునేవాడు.

మరీనా అతని గురించి చాలా అరుదుగా ఆలోచిస్తోందని అతడికి స్పష్టంగా కనిపించింది. ఆమె ఆలోచనలన్నీ దిక్సూచి సూదిలా తన శరీరంలో నెమ్మదిగా పెరుగుతున్న, పరిపక్వమవుతున్న ఆ వ్యక్తివైపే లాగబడుతున్నాయి. ఇది అతనికి ప్రత్యేకంగా అవమానకరంగా అనిపించింది.

కొన్నిసార్లు నిరంతర పనుల పొగమంచు నుంచి, తనతో వ్యక్తిగతంగా సంబంధంలేని ఆలోచనల మధ్య నుంచి, ఒక ప్రకాశవంతమైన మెరుపులా టెమ్కా మనసులో ఒక భావన దూసుకొచ్చేది: “తల్లిదండ్రులు.” వారి జీవితం అనే వేగంగా పనిచేసే యంత్రం కదిలే భాగాల్లో ఈ ఇసుక ఎలా చల్లబడుతుందో అతడు చాలా స్పష్టంగా ఊహించేవాడు. తల ఊపుతూ బాధగా గొణిగేవాడు:

“అయ్యో, అయ్యో!”

ఒక సాయంత్రం వారు రాబోయే పార్టీ సమావేశ అంశాలపై కలిసి పని చేస్తున్నారు. టెమ్కా చదువుతున్నాడు; మరీనా వింటూ, తన కాబోయే బిడ్డ కోసం చిన్న చొక్కాలు కుడుతోంది. ఆ రోజు అదృష్టవశాత్తూ కొనగలిగిన పత్తి వస్త్రం బల్లపై గర్వంగా విప్పి ఉంది; మరీనా దానిని డైపర్ల కోసం అప్పటికే కోసేసింది.

చిన్నగా మూడుసార్లు గంట మోగింది. వారికోసమే. టెమ్కా తలుపు తీయడానికి వెళ్లాడు. కారిడార్‌లో అతని పెద్దగా, ఉద్విగ్నంగా నవ్వే శబ్దం వినిపించింది. అతడు ఎవరితోనో  ఇలా అన్నాడు:

“ఇక్కడే వేచి ఉండండి! ఒక్క నిమిషం!”

అతడు వేగంగా గదిలోకి వచ్చి, ఉద్వేగంగా గుసగుసలాడాడు:

“త్వరగా! ఇవన్నీ తీసేయి!”

మరీనా ఆశ్చర్యంతో, బెదిరించే స్వరంలో అడిగింది:

“ఏం తీసేయాలి?”

టెమ్కా అపరాధభావంతో గుసగుసలాడాడు:

“ప్రాంతీయ కార్యదర్శి వాస్కా మయోరోవ్ వచ్చాడు.”

“అయితే?”

టెమ్కా ఒక బుట్ట మూత తీసి, బల్లపై కోసి ఉంచిన డైపర్లను త్వరగా అందులోకి విసరసాగాడు. మరీనా కదలకుండా కూర్చుని అతడిని చూస్తోంది. అతడు మళ్లీ బల్లవైపు దూసుకెళ్లి, ఆమె కుట్టుపనిని పట్టుకున్నాడు; సూది గుచ్చుకుని తిట్టాడు; చొక్కాలను నలిపేసి బుట్టలోకి తోసేశాడు. మూతను గట్టిగా మూసి, గుచ్చుకున్న వేలిని నోట్లో పెట్టుకుని తలుపువైపు వెళ్లాడు.

మయోరోవ్ లోపలికి వచ్చాడు—సన్నని, వ్యంగ్యభరితమైన పెదవులతో నవ్వుతూ. వారు రాబోయే పార్టీ మహాసభ గురించి మాట్లాడుకున్నారు. మరీనా ఆ సంభాషణలో పాలుపంచుకోలేదు. ఆమె కుర్చీలో మౌనంగా కూర్చుని, బల్లపై ఉన్న పుస్తకంపై పెన్సిల్‌తో టపటప కొడుతూ ఉంది—మొదట ఒక మూలపై, తర్వాత మరో మూలపై.

అరగంట తర్వాత మయోరోవ్ వెళ్లిపోయాడు. మరీనా మౌనంగా కూర్చునే ఉండి టెమ్కా వైపు చూస్తోంది. అతడు ఆమె చూపును తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

అకస్మాత్తుగా మరీనా గంభీరంగా అంది:

“నీ ముఖం ఎంత అసహ్యంగా ఉందీ!”

“ఏమిటి? నువ్వేం మాట్లాడుతున్నావు?”

మరీనా మౌనంగానే ఉండి, టెమ్కా వైపు గంభీరంగా చూస్తూనే ఉంది.

తర్వాత నెమ్మదిగా, అధికారభావంతో అంది:

“ఇదిగో, ప్రియమైన కామ్రేడ్! ఇక్కడి నుంచి వెళ్లిపో!”

“మరింకా! నీకేం అయింది? ఏమైంది?”

“నీకు అర్థం కావడం లేదూ? నీ దురదృష్టం. వెళ్లిపో! ఇక నీతో కలిసి ఉండాలని నాకు లేదు.”

వికెంటి వేరేసేయేవ్
Venu Gopal Reddy

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *