కొద్ది రోజుల కింద నా ఇంటి సంరక్షకురాలు యులియా వాసిల్సేవ్న ను తన జీతం తీసుకోమని నా ఆఫీసు రూంలోకి పిలిచాను.
ఆమెతో “కూర్చో యూలియా! మనం లెక్కలు చూసుకుందాం. నీకు అప్పుడప్పుడు డబ్బు అవసరమైనా అడగడానికి మొహమాటపడ్తున్నావు, మనం నెలకు ముప్ఫై రూబుల్స్ నీ జీతం అనుకున్నాం కదూ?”
యులియా “నలభై” అన్నది.
“కాదు, ముప్పయ్యే… నా దగ్గర లెక్క ఉంది. నేనెప్పుడూ పనోళ్ళకు ముప్ఫై కంటే ఎక్కువ ఇవ్వను” అన్నాను.
ఆమె “సరే మీయిష్టం” అన్నది.
“ఎన్ని నెలలు చేశావు?”
ఆమె “రెండు నెల్లా ఐదురోజులు” అని జవాబిచ్చింది.
“సరే, అయితే రెండు నెలలు అనుకుందాం. అది అరవై రూబుళ్ళవుతాయి. తొమ్మిది ఆదివారాలు తీసివేద్దాం, ఎందుకంటే ఆరోజు కోల్యాకు నువ్వేమీ చెప్పవు. కేవలం వాడితో కాలక్షేపం చేస్తావు, మూడురోజులు సెలవు కూడా తీసుకున్నావు.”
యూలియా వాసిల్సేవ్న మొహం మాడిపోయింది, బొటనవేలు చూపుడువేలుతో తన గౌను దారాన్ని చుట్టుతూ ఉండిపోయింది కానీ ఇలా ఎందుకు అని అడగలేదు.
నేను కొనసాగించాను.
“ఆ మూడురోజులకు పన్నెండు రూబుళ్ళు తీసివేస్తా. కోల్యాకు నాల్గురోజులు ఆరోగ్యం బాగాలేదు, ఫర్యాకు మాత్రమే సేవ చేశావు కాబట్టి ఇంకో ఏడు రూబుళ్ళు తీసేస్తున్నా. తర్వాత మూడురోజులు నీకు పంటినొప్పి వస్తే, నా భార్య నిన్ను మధ్యాహ్నం మాత్రమే పనిలోకి రమ్మంది కాబట్టి ఇంకో పన్నెండు రూబుళ్ళు తీసేస్తున్నా,
అంతా కలిపి నలభై ఒక్క రూబుల్ అయింది అవునా?”
యులియా వాసిల్సేవ్న కళ్ళల్లో నీళ్ళు, ఆమె గడ్డం వణుకుతోంది, అయినా నిశ్శబ్దంగా ఉండిపోయింది. నా లెక్కలు కొనసాగించాను.
“కొత్త సంవత్సరానికి ముందురోజు, నువ్వొక కప్పు, ప్లేటు పగులగొట్టావు, దానికొక ఆరు రూబుళ్ళు తీసివేస్తున్నా. నీ నిర్లక్ష్యం వల్ల కోల్యా తోటలోని చెట్టును ఎక్కబోయి, వాని కోటు చించుకున్నాడు, దాని ఖరీదు ఇంకో పది రూబుళ్ళు. పనిమనిషి బూట్లు దొంగతనం చేసింది, ఇల్లంతా జాగ్రత్తగా చూసుకోవల్సిన నువ్వు నిర్లక్ష్యం చేశావు అందుకు ఇంకో ఐదు రూబుళ్ళు తీసేస్తున్నా. తర్వాత జనవరిలో నువ్వు నా దగ్గర పదిరూబుళ్ళు అప్పు తీసుకున్నావు.”
యూలియా వాసిల్సేవ్న గొణుగుతూ అన్నది
“నేనెప్పుడూ మీ దగ్గర అప్పు తీసుకోలేదు.”
“కానీ నాదగ్గర లెక్క ఉంది” అన్నాను.
“మీ ఇష్టం” అన్నదామె.
మొత్తం లెక్కంతా చూసి “అంతా కలిపి ఇరవై ఏడు రూబుళ్ళయింది. నలభై ఒకటిలో అది తీసేస్తే పద్నాలుగు రూబుళ్ళు మిగిలాయి.
యూలియా కళ్ళల్లో నీళ్ళు, ముఖమంతా చెమట పట్టింది. నెమ్మదిగా తడబడ్తూ అన్నది “నేను మూడు రూబుళ్ళు మాత్రమే మీదగ్గర అడిగి తీసుకున్నా. అంతకంటే మించి ఏమీ తీసుకోలేదు.”
“అవునా? అది నా లెక్కలో లేదే! సరే అది కూడా తీసేస్తే, నీకు రావాల్సింది పదకొండు రూబుళ్ళు. ఇదిగో ఈ పదకొండు తీసుకో”
ఆమె వణుకుతున్న చేతుల్లో ఆ పదకొండు నాణేలుంచాను. ఆమె తన గౌను జేబులో వాటిని పెట్టుకుని చెప్పింది “ధన్యవాదాలు”
నాకు కోపం వచ్చింది. “ధన్యవాదాలు దేనికి?” అడిగాను.
“డబ్బిచ్చినందుకు” అన్నది.
“నేను నిన్ను మోసం చేశాను, నిన్ను దోచుకున్నాను, న్యాయంగా నీకు రావాల్సిందాన్ని గుంజుకున్నాను అయినా నాకు ధన్యవాదాలు చెప్తున్నావా?”
“వేరేచోట ఇది గూడా ఇవ్వరు” అన్నది.
“ఏంటీ! అస్సలేమీ ఇవ్వరా?” నేనూరికే నీకొక పాఠం చెప్పాలని ఎగతాళి చేశాను! ఇదిగో నీకు రావాల్సిన మొత్తం ఎనభై రూబుళ్ళు ఈ కవర్లో ఉన్నాయి తీసుకో” అని ఆమెకు కవరందిస్తూ అన్నాను.
“కానీ నువ్వెందుకింత బేలగా ఉన్నావు? కనీసంగా కూడా అడగకుండా మౌనంగా ఉన్నావు ఎందుకు? నీకు న్యాయంగా రావాల్సినదాన్ని కూడా గట్టిగా అడగలేవా? అంత బలహీనులా మీరూ? కాదు గదా? అలా అడగడం సాధ్యమే కదా?”
చిరునవ్వుతో అన్నది యూలియా
“అవును అది సాధ్యమే”
ఆమె వైపే చూస్తూ అనుకున్నాను
“బలహీనులుగా ఉండడం ఈ ప్రపంచంలో ఎంత బాధాకరం”
