ఆశ్వయుజ మాసపు రోజులు. వేడీ, ఉక్కపోతా కలిసి జమిలిగా బెంబేలెత్తిస్తున్న వాతావరణం. బురదా రాళ్ళూ నిండిన మట్టి దారి. మడ్‌గార్డ్ లేని సైకిల్ పాతది, ఎదురుగా దారి కొత్తది. ఇకనుంచీ రాకపోకలు దీనిమీదే సాగుతాయి కాబట్టి ఇప్పుడీ దారితో స్నేహం చెయ్యక తప్పదు.
వాడకట్టు దాటి కొద్దిగా ముందుకు సాగితే చాలు, నాలుగు వైపులా అందంగా పరుచుకున్న పచ్చదనం కనిపిస్తోంది. కానీ ఆ అందం కూడా, మనసుని ఆవరించిన చిరాకూ నిస్సహాయతల మీద ప్రభావం చూపలేకపోతోంది. అయినా, మంచి మనిషికి తోడు నిలిచేదెవరు? నిజాయితీని గౌరవించేదెవరు? చేసే పని మీది నిబద్ధతకూ, చెంచాగిరీకీ పోటీ పెడితే, ఎప్పుడూ చెంచాగిరీయే నెగ్గుతుంది ఎందుకో? జవాబులు లేని, రాని ఇలాంటి ప్రశ్నలెన్నో నా మనసులో మెరుపుల్లా ఉండీ ఉండీ మెరుస్తున్నాయి. నిద్రకళ్ళ అధికారులు, పెట్టిన దణ్ణాన్నిబట్టి విలువ కట్టే నాయకులు, జేబుని చూసి గౌరవించే షావుకార్లు, పరీక్షా ఫలితాలను బట్టి మాత్రమే గౌరవించే సంరక్షకులు. ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇక్కడి బావులన్నిటిలోనూ భంగు కలిపారా ఏం?
థుస్స్.. వెనక చక్రంలో గాలి పోయింది. మెదడులో బూరలు ఉబ్బిపోతున్నట్లుంది. దానికి తోడు ఈ వేడి… అంతకంతకూ పెరిగిపోతోంది. ఎదురుగా ఎంతకూ తరగనట్లు సాగుతున్న బాటలో మెల్లిగా కాళ్లీడ్చుకుంటూ నడుస్తున్నాను. కాసేపటి తర్వాత ఊరు దగ్గర పడుతున్న చిహ్నాలు కనిపిస్తున్నాయి.
సైకిల్‌ని నడిపించుకుంటూ వచ్చాను కాబట్టి దాదాపు గంట పట్టింది. నన్ను ఇక్కడి స్కూల్లో ‘ఎటాచ్’ చేశారు. మనం ఎటాచ్ కాకూడదని కోరుకునే దాంతోనే మనకు ఎటాచ్మెంట్ జరుగుతుంది. అదే విచిత్రం. స్వాతంత్ర్య దినోత్సవం నాడు వచ్చింది నాకీ బహుమతి. పోనీ, శౌర్యపతకమే ఇచ్చారనుకుందాం. అది కూడా కాపీలు కొట్టకుండా ఆపినందుకు; వేధింపులనుంచి బీద పిల్లలని కాపాడినందుకు; ‘లెఫ్ట్ హాండ్ డ్రైవ్’ – అదే, ఎడమ చేత్తో ఆన్సర్ షీట్ల మీద జవాబులు రాసి, కుడి చేత్తో వాటికి మార్కులు వేయడం – ని అడ్డుకున్నందుకు. సిమెంట్‌లాంటి చెంచాగిరీతో, సిఫార్సుల కంకరతో కాంక్రీట్‌లా గట్టిపడిన ఆ అవినీతి స్తంభాలని కాళ్లతో తన్ని కూల్చే ప్రయత్నం చేశాను నేను.
వాటికేమీ కాలేదుగానీ, నాకు మాత్రం గట్టి దెబ్బలే తగిలాయి.
ఎందుకు తగలవూ? వూళ్ళోని విద్యాసంస్థ చేస్తున్న తప్పుడు పనులని అడ్డుకోవాలని కాలు అడ్డం పెట్టాను. దాంతో దెబ్బ నాకే తగిలింది. ఆ విద్యాసంస్థ నన్ను పానకంలో పుడకలా తీసి గిరాటు పెట్టింది. అధికారిక భాషలో దాన్నే ‘ఎటాచ్‌మెంట్’ అంటారు.
ఎంతో ఉత్సాహంతో, చక్కటి ఆశయాలతో నేనీ విద్యారంగంలోకి అడుగు పెట్టాను. చదువుకుంటున్నప్పుడు వారసత్వంగా అలవడిన ఆదర్శాలని విద్యాసంస్థలో విత్తనాల్లా నాటి చూపుదామనుకున్నాను. చదువు చెప్పడంలో కొత్త కొత్త ప్రయోగాలు చేశాను. వాటిని చూసి కొందరు పెద్దలు ఎక్కిరించేవాళ్ళు, చీవాట్లు పెట్టేవాళ్ళు. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా, నేను ఎంచుకున్న పద్ధతులని మార్చుకోలేదు. కానీ ఈ విభాగంలో, నకిలీ హాజర్లు, నకిలీ నెలవారీ ప్రణాళికలు, నకిలీ పరీక్షా ఫలితాలు, నకిలీ వోచర్లూ తప్పనిసరి అవసరాలాయె! అవసరం లేనిదల్లా ఒక్కటే – నేర్పడం, నేర్చుకోవడం. అధికారిక లేఖలకు టైముకి జవాబులు పంపడం, గమ్యాలను కాగితాల మీదనే చేరుకోవడం, పల్లెనుంచి దేశందాకా మొత్తాన్నీ అక్షరాస్యంగా మార్చడం. మీరు ఎలా చదువు చెప్తున్నారన్నది గమనించడానికి ఈ విభాగంలో ఎవరికీ తీరిక లేదు. చదువు చెప్పడంలో ప్రయోగాలు చేసే వాళ్ళకి ఇవన్నీ పనికిరాని మాటలుగా తోస్తాయి. ‘యూనిఫారాలు ఇంకా ఎందుకు పంపిణీ చెయ్యలేదు? స్కాలర్షిప్ వోచర్ల సంకలనం పూర్తయిందా లేదా? బుక్ బ్యాంక్‌లో పుస్తకాలను ఎడ్జెస్ట్ చెయ్యాలి. సగటు మార్కులు 75 శాతం కన్నా తక్కువ ఇవ్వొద్దు. ధనవంతులు చెప్పినట్టు దారిద్ర్యరేఖను గియ్యాలి. కేంద్రంలో ప్రతి స్కూలూ తెరిచే ఉండాలి.’
ఈ ఊబి నా ఆదర్శాలన్నిటినీ అవమానించింది. అయినా నేను వాటిని ఓడిపోనివ్వలేదు. ఒక ఉపాధ్యాయుడు చదువు చెప్పే విద్యార్ధులే ఆయనకు అద్దంగా నిలుస్తారు. ఏమైనా సరే, ఆ అద్దంలో మాత్రం ఆయన ప్రతిబింబం మలినం కాకూడదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే, నేను ఎవరినీ ఎప్పుడూ లెక్క చెయ్యలేదు. అందుకనే అధికారులు నన్నెప్పుడూ సంస్థకు అనుకూలవంతుడిగా లెక్క వెయ్యలేదు. దగ్గర్లోని ఒక పల్లెటూరిలోని స్కూలుకి నన్ను ఎటాచ్ చేశారు. నేను అందించిన సేవలకి అటువంటి గౌరవం దక్కుతుందనిగానీ, నా ప్రయోగాలకి అంతటి పేరుప్రతిష్ఠలొస్తాయనిగానీ నేనెప్పుడూ అనుకోలేదు. కానీ నా ఆదర్శాల మత్తు ఇప్పుడు దిగిపోతున్నట్టు తెలుస్తోంది.
ఆలోచనల్లో ఉండగానే ఆ పల్లెటూరి స్కూలు దగ్గరకు చేరుకున్నాను. స్కూలు పరిసరాల్లో ఆ వూరి పిల్లలు, బరువైన పుస్తకాల బ్యాగ్‌లు తగిలించుకునే కబుర్లు చెప్పుకుంటున్నారు. నేనొస్తానని వాళ్ళకి తెలుసేమో బహుశా. ‘కొత్త మాస్టారొచ్చారు, కొత్త మాస్టారొచ్చారు…’
‘నమస్తే మాస్టారూ…’
ఎవరైనా ‘నమస్తే మాస్టారూ…’ అంటే నాకు భయమేస్తుంది. ముఖ్యంగా పిల్లలు అన్నప్పుడు. అది నమస్తే చెప్పడమొక్కటే కాదు – ఒక చిన్న పద్యం కూడా పాడతారు వాళ్ళు…
పంతులుగారికి దండాలు…
బంగాళదుంపలు తింటారు
చల్లటి నీళ్ళు తాగుతారు,
బెత్తంతో వాతలు పెడతారు!
నిజానికి ఈ పద్యంలో ఉన్నవన్నీ బడిపంతుళ్ళ గురించిన వాస్తవాలే! అన్నీ చవకగా దొరికేవే కొనుక్కోవాలనుకుంటాడాయన. వాళ్ళకి ఎక్కడైనా దొరికేది ఉత్త, చల్లటి నీళ్లే. ఇక బెత్తం అంటే, పంతులుగారి రౌద్రరూపానికి చిహ్నమేగా! ఆ పద్యం అటు పంతులుగారి ఆర్థికపరిస్థితినీ, ఇటు సమాజానికి ఆయన అందించే అమూల్యమైన కానుకనీ తెలియజెప్తోంది. నిజం చేదుగా, భయంకరంగా ఉంటుంది. అందుకే దాని ఎదుటపడడానికి మనం జంకుతాం.
స్కూల్ ఆఫీస్‌లోకి ప్రవేశించి హెడ్‌మాస్టర్‌గారికి నమస్కారం చేశాను. చూడటానికి మంచివాడిలా కనిపిస్తున్నాడు. అందుకనే ఇక్కడ స్థిరపడ్డాడేమో; లేకపోతే పట్నంలోనే ఉండేవాడు కాదూ. బహుశా ఇలాంటి మంచి-చెడ్డ ఆలోచలతోనే నా మనసు నిండిపోయిందేమో. అయినా, మనిషిని ఇబ్బందులు చుట్టుముట్టినప్పడు అందరినీ అనుమానపు చూపులతోనే చూస్తాడు. అందరూ తనకు శత్రువులేనన్నట్లు తోస్తుంది.
నా జాయినింగ్ రిపోర్ట్ ఆయనకు ఇచ్చి, ఆఫీస్‌ని కలయచూడసాగాను. వెల్ల వేసి చాలా ఏళ్లయినట్లుంది. గోడల మీద కొన్ని సూక్తులు రాసి ఉన్నాయి; ‘ఉపాధ్యాయుడు కొవ్వొత్తివంటివాడు. తను స్వయంగా కరిగిపోతూ, ఇతరులకు వెలుగునిస్తాడు.’ నా మొహం. తన కింద మాత్రం చీకటి పరుచుకున్న దీపంలాంటి వాడు ఉపాధ్యాయుడు.
హెడ్‌మాస్టర్‌గారి తీరు హాయిగా ఉంది. ‘ఇక్కడికి రావడంలో మీకు ఇబ్బందేం కలగలేదు కదా’ అడిగారు నన్ను. తల అడ్డంగా ఆడించానుగానీ నా మనసుకు తెలుసు. ఇక్కడి టీచర్లందరూ నాకు పరిచితులే. వాళ్ళకి నా రాక సంతోషంగానే అనిపించింది. స్నేహం వల్ల కాదు; ఈ శ్లేష్మంలో ఇంకొకడొచ్చి పడ్డాడుగదా, ఈ పల్లెటూరి బురదగాలి తగిల్తే వీడి మెదడుకూడా తొందర్లోనే సెంటర్లోకొచ్చేస్తుంది గదా అని.
వాళ్ళంతా నామీద సానుభూతి చూపించబోయారు – ‘అయ్యో, మీకెన్ని కష్టాలొచ్చాయీ… అసలీ విద్యా విభాగానికి గౌరవించడం తెలీదు, చక్కగా పని చేసే వాళ్ళకి అన్యాయం చేస్తారు…’ అంటూ. నాలో ఉన్నవి నిప్పు రవ్వలా బూడిదా అన్నది తెలుసుకోవాలని వాళ్ళకి ఆబ.
అన్యాయం జరుగుతుంటే నేనూ సహించలేను. మనసులో సుళ్ళు తిరుగుతున్నదంతా నేనూ బయటికి కక్కాను. ‘ఈ విభాగంలో ఉపాధ్యాయులు కాదు, గుమాస్తాలు కావాలి. మీరు ఎంత మంచి టీచర్లయినా మిమ్మల్ని గుర్తించే వాడెవడూ ఉండదు. మీరు గుర్తుండేది విద్యార్థులకే. వాళ్ళైనా, మీ రేంజ్ లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కనీసం నమస్తే కూడా చెప్పరు,’ అన్నాడొక మాస్టారు. మిగిలిన వాళ్ళందరూ ఆ మాట ఒప్పుకుంటున్నట్టు తలలు ఊపారు. అక్కడితో ఆగకుండా, ఉద్యోగస్తులతో పోల్చితే టీచర్లని సంఘం చిన్నచూపు చూస్తుందన్న విషయం మీద చర్చ కొనసాగింది. ‘మీరు రావడం వల్ల ఈ స్కూలుకి చాలా ప్రయోజనం చేకూరుతుంది. మీరు సైన్స్ టీచర్ కాబట్టీ, ఇక్కడ సైన్స్ బోధించే టీచర్లెవరూ లేరు కాబట్టీ,’ అన్నారు హెడ్‌మాస్టారు.
ఇలాంటి మాటలు వినీ వినీ నాకు మొహంమొత్తింది. ఇంతవరకూ ఇలాంటి మెచ్చుకోలు మాటలతోనే ఇన్నాళ్ళూ నన్ను వెర్రివాడిని చేశారు. విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నించాను. అందువల్లనేనేమో, నేనిక్కడ తేలాల్సి వచ్చింది. ఇప్పుడు నా భవిష్యత్తు గురించి మాత్రమే పట్టించుకోవాలని మనసులోనే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆలోచనల్లో ఉండగానే ప్రార్థన గంట గణగణా మోగింది. విద్యార్థులందరూ ఆవరణలో పోగయ్యారు.
మేము కర్తవ్యపథంలో పయనించే
శక్తినివ్వు దయానిధీ…
ఇలాంటి ప్రార్థనలు వింటూనే ఏళ్ళు గడిచిపోయాయి. విద్యార్ధి దశనుంచీ ఇప్పటివరకూ ఇలాంటి ప్రార్థనలే వింటూ వచ్చాను. కర్తవ్యపధంలో ఎన్ని ఆటంకాలున్నాయో బహుశా ఆ భగవంతుడు కూడా మర్చిపోయే ఉంటాడు. ఇప్పటి కాలంలో కూడా మనం పిల్లలచేత ఎన్ని ప్రార్థనలు బట్టీ పట్టిస్తున్నామో చూడండి. వాటి ఆచరణ సంగతి అలా వుంచి, కనీసం వాటి అర్థాన్నైనా శ్రద్ధగా పట్టించుకున్నామా? ఇవన్నీ లాంఛనాలుగా మిగిలిపోయాయి.
ప్రార్థన ముగియడంతో పిల్లలందరూ తమ తమ క్లాసుల్లోకీ, టీచర్లు ఆఫీస్-కమ్-స్టాఫ్ రూమ్‌లోకీ చేరారు. ఇప్పుడు నా రాకవల్ల టైమ్ టేబుల్ మారింది. ఆరో తరగతి నుంచీ ఎనిమిదో తరగతివరకూ సైన్స్ పాఠాలు చెప్పే పని నాకు అప్పగించారు.
సైన్స్ నాకు అన్నిటికన్నా ఇష్టమైన సబ్జెక్ట్. పిల్లలకు ఈ సబ్జెక్ట్‌ని చాలావరకూ ప్రయోగాల ద్వారానే వివరించే ప్రయత్నం చేశాను. ఆమలకం ఉదాహరణగా, పిల్లలకు ఆమ్లం నిర్వచనాన్ని అందించాను. మూలల ఉదాహరణతో, కోణాల కాన్సెప్ట్‌ని విశదీకరించాను. వీలైనంతవరకూ సైన్స్‌ని, విద్యార్థుల పర్యావరణంతో జోడించేందుకు ప్రయత్నించాను. సంప్రదాయబద్ధమైన పద్ధతులన్నా, ప్రశ్నలకు జవాబులు బట్టీ వేయించడమన్నా నాకు నచ్చేది కాదు. క్లాస్‌లో కాక, పిల్లలను స్కూలు గోడలు దాటించి తీసుకెళ్ళి, బయటి వాతావరణంలో పాఠాలు నేర్పే నా పద్ధతులు చూసి చాలాసార్లు హెడ్‌మాస్టర్లకు కోపం వచ్చేది; తోటి ఉపాధ్యాయులకు వ్యంగ్యబాణాలు విసిరే అవకాశమూ దక్కేది. కానీ పిల్లల సంతోషం, ఆపేక్షలే నాకు అనేకమైన చేదు అనుభవాలనుంచి ఉపశమనాన్నిచ్చాయి.
అయినా సరే, ఇక మీదట అలాంటి తిక్క పనులేవీ చేయబోవడం లేదు నేను. ‘పాట ఉన్నట్లే వాయిద్యం కూడా మోగాలి’ అని మనసులో నిశ్చయించుకున్నాను.
హాజరు పుస్తకం తీసుకుని క్లాస్‌లో ప్రవేశించాను. నన్ను చూడగానే పిల్లలంతా లేచి నిలబడ్డారుగానీ, నేను మాత్రం పట్టించుకోకుండా నేరుగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను. చెప్పొద్దూ, పాఠం చెప్తున్నంతసేపూ కుర్చీలో కూర్చునే అలవాటు లేనే లేదు నాకు. కానీ ఇప్పుడు మాత్రం, కుర్చీలో కూర్చోవడానికే వచ్చాననిపించింది.
పిల్లలింకా నిలబడే ఉన్నారు. కూర్చోమన్నాను; కూర్చున్నారు. పిల్లల మనసుల్లో క్రమశిక్షణ పాఠాలు ఎన్నెన్ని నాటబడతాయో గదా. మన పబ్బం గడుపుకోవడానికి ఎక్కడబడితే అక్కడ మ్యావ్ మ్యావ్ మంటుంటాంగానీ, పిల్లల ముందు మాత్రం కాఠిన్యానికి నిర్వచనంలా నిలుస్తాం. క్లాసులో హాజరు తీసుకోకుండానే, జోలెలోంచి కాగితం తీసి, నాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ విద్యామంత్రికి లేఖ రాసే ప్రయత్నంలో మునిగిపోయాను. పేపర్‌ను మార్జిన్ కోసం మడిచి, విద్యామంత్రిగారికి అర్జీ రాయడం మొదలుపెట్టాను. మాస్టారు ఎప్పుడేమంటారో అని పిల్లలు బిక్కు బిక్కుమంటూ అంచనాలు వేస్తున్నారు.
బక్కపల్చగా ఉన్న ఒక పిల్లాడు, కుర్తా వెనకవైపు చిరుగు పట్టినట్టుంది, పైజమాలోకి టక్ చేశాడు… జోడించిన చేతుల మధ్య పెన్సిల్ ఇరికించి, బయటికి వెళ్ళడానికి అనుమతి కోరేడు.
ఆ పిల్లాడిని తేరిపార చూశాను. ఆ బక్కపల్చటి శరీరాన్నీ, కళ్ళలోంచి కారుతున్న దైన్యాన్నీ చూసి నా మనసు కరగడం మొదలైంది. నాకు శిక్ష వేసిన వాళ్ళని నేనేమీ చెయ్యలేను గానీ, ఆ శిక్షపట్ల నా వ్యతిరేకతనీ, శిక్ష వేసిన వాళ్ళ మీది నా కసినీ అమాయకులైన ఈ పిల్లల మీద చూపితే, ఆ దేవుడు కూడా నన్ను క్షమించడనిపించింది.
కాగితం మీద నా వేళ్ళు చకచకా పనిచేశాయి. చూస్తుండగానే అర్జీ పత్రం కాస్తా కాగితపు విమానంగా మారిపోయింది.
రెండు చూపుడు వేళ్ళ మధ్యా ఆ విమానాన్ని నొక్కి పట్టుకుని, ఎగరేశాను. పిల్లల ముఖాల్లో ఇప్పుడు చిరునవ్వులు విరిశాయి. నా మనసంతా అంతులేని శాంతి పరుచుకుంది.
(ఎటాచ్మెంట్ – ‘పరికథ’, జనవరి-మార్చి 2026 సంచికలో ప్రచురితం)
