మొగుడూ పెళ్లాలిద్దరూ కారు దిగి చూసేసరికి సింహాద్రప్పడు ఎర్రటి ఎండలో రోడ్డు పక్కనున్న పేవ్‌మెంట్ మీద చతికిలబడి కూర్చుని అయోమయంగా పిచ్చి చూపులు చూస్తూ కనబడ్డాడు.
“మావయ్యేంటి, వడ్డాది గుడి మెట్ల మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు? ఇది అమెరికా అని మర్చిపోయినట్లున్నాడు!” అని భార్యతో వెటకారంగా అన్నాడు సూరిబాబు.
“నువ్వు ఊరుకో బావా! పాపం, ఎండకి కళ్లు తిరిగినట్టున్నాయి” అని గదమాయించింది ఉమ. ఇద్దరూ సింహాద్రప్పడు దగ్గరికి వెళ్లారు.
“నాన్నా! ఏంటలా కూర్చున్నావ్? లే, ఇంటికెళ్దాం” అంది ఉమ.
సింహాద్రప్పడు మన లోకంలో లేడు. మనిషి పాలిపోయి ఉన్నాడు. గజగజలాడుతున్నాడు నుదుటి మీద సిందూరం కారిపోయి ముక్కు మీదకి జారింది. కొంచెం వణుకుతున్నాడు. ఒళ్లంతా చెమటలు పట్టి ఉన్నాయి. కనుగుడ్లు అటూ ఇటూ కదులుతున్నాయి.
ఉమ ఒక క్షణం కంగారుపడింది. “ఇదేంటి? ఇందాక బాగానే ఉన్నాడు. గుళ్లో ప్రసాదం తిన్నాడు. చాలా సంతోషంగా అటూ ఇటూ తిరిగాడు. అమ్మని తలుచుకున్నాడు. అమ్మ ఉంటే బాగుణ్ణని అన్నాడు. సెల్ఫీలు దిగాడు. ఎండలో పార్కింగ్ దాకా నడవడం ఎందుకని ఈ పక్కనే నిలబడమని అంటే, కారు తెచ్చేలోపు రోడ్డు దాటేసి ఇక్కడ కూర్చుని ఇలా… అసలేమైంది?” అనుకుంటూ—
“నాన్నా, నాన్నా! మంచినీళ్లు తాగండి” అని కూలింగ్ వాటర్ బాటిల్ లోంచి కొంచెం చల్లటి నీళ్లతో మొహం తుడిచి, నీళ్లు తాగించింది. సింహాద్రప్పడు నీళ్లు తాగాక కొంచెం స్థిమితపడ్డాడు.
సూరిబాబు నవ్వి, “ఏటి మావయ్యా, ఈపాటి ఎండకే అలా అయిపోయావు? ట్రాక్టర్ ఎక్కి దుక్కి పట్టుకున్నావంటే బండిలో డీజిల్ అయిపోయే వరకు దిగేవాడివి కాదు. అప్పుడే వయసైపోయిందా? కార్ ఎక్కు, చల్లగా ఏసీలో కూర్చుంటే ఒళ్లు చల్లబడుద్ది” అని కార్ డోర్ తీసి వెనక సీట్లో కూర్చోబెట్టాడు.
సింహాద్రప్పడు మాట్లాడలేదు. ట్రాన్స్‌లో ఉన్నట్టున్నాడు. ఉమ కుడివైపున భర్త పక్కన కూర్చుంది. సూరిబాబు కార్ తీశాడు. కార్ కదిలింది.
అమెరికాలోని మనవాళ్లు ‘డల్లాస్’ అని పిలుచుకునే డేలస్ నగరంలో కార్యసిద్ధి హనుమాన్ ఆలయం దగ్గర రోడ్డు నుంచి 20 నిమిషాల దూరంలో ఉన్న తన ఖరీదైన బంగళాకి బయల్దేరాడు సూరిబాబు. విశాలమైన రోడ్డు మీద కార్లు చాలా వేగంగా, పద్ధతిగా దూసుకెళ్తున్నాయి.
“నాన్నా, బానే ఉన్నారుగా?” అని ఉమ అడిగింది. సింహాద్రప్పడు తలూపాడు.
“ఏటి మావయ్యా! గుళ్లో లంకకెళ్లే హనుమంతుడిలా చలాకీగా ఉన్నావు. బయటకొచ్చాక జడుపు జ్వరం . జలుబు జ్వరం వచ్చినోడిలా అయిపోయావు? షణ్ముఖ ఆంజనేయ రాజు పద్యాలు పెట్టమంవేటి? రెండు రాగాలు వినేసరికి ఇంటికెళ్లిపోతాం” అన్నాడు సూరిబాబు.
సింహాద్రప్పడు వద్దన్నట్టు తల అడ్డంగా ఊపి, “ఒరే అల్లుడూ! నాకొకటి చెప్పు. అమెరికాలో పట్టపగలు దెయ్యాలు రోడ్ల మీద తిరుగుతాయా?” అని అడిగాడు.
సూరిబాబు వెటకారంగా నవ్వి, “తిరుగుతాయి. ఈ కార్లోనే నా పక్కన కూర్చునుంది కదా!” అన్నాడు ఉమ వైపు కొంటెగా చూస్తూ.
“అవును, అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాను… సేమ్ క్లాన్!” అంది ఉమ.
“సూరిబాబు అనవసరంగా దీన్ని కెలికాను” అనుకుని నవ్వేసాడు.
“అసలేమైంది నాన్నా? ఏం చూశావు?” అని అడిగింది ఉమ.
“ఏటయిందంటే… నువ్వు నిలబడమన్న దగ్గర రెండు నిమిషాలు నిలబడ్డాను. ఎండకి మాడు పగిలిపోతున్నట్టు అనిపించింది. రోడ్డు కవతల పక్కన కొంచెం దూరంలో చెట్టు కింద బల్ల కనిపించింది. రోడ్డు దాటేసి నాలుగడుగులు ఆ పక్కకి నడిస్తే సరిపోద్దని గబుక్కున రోడ్డు దిగేసాను. రోడ్డు ఖాళీగా ఉంది. పిట్టా కాకీ లేవు. పెద్ద రోడ్డు కదా, గబగబా నడుస్తుంటే పంచె చెప్పులో ఇరుక్కుని ఒళ్లు తూలి తాగినోడిలా ఊగిపోయాను. సర్దుకుని చూసేసరికి భూతం లాంటి కారు ‘రయ్య్’మని దూసుకొచ్చింది. సింహాద్రప్పడు గాడు పెద్దల్లో కలిసిపోయాడు అనుకున్నాను. వడ్డాది కొండ మీద వేంకటేశ్వరస్వామి కళ్లముందు కనబడ్డాడు. విచిత్రం! కారు సరిగ్గా నాలుగడుగుల దాకా వచ్చి సడీ చప్పుడు లేకుండా ఆగిపోయింది.
గాభరాగా కింద కూలబడిపోయినోణ్ణి లేచి నిలబడ్డాను. ‘ఎవడ్రా నీకు డ్రైవింగ్ నేర్పింది? హారన్ కొట్టాలని తెలీదా?’ అని డ్రైవర్ గాడిని దులుపుదామని కార్ దగ్గరికెళ్లి డ్రైవర్ సీట్లో చూసాను. కళ్లు అంటుకుపోయాయి. ఎవడూ లేడు! కార్ లోపల ఎవరూ లేరు!
ఆ టైంకి హనుమాన్ చాలీసా కూడా గుర్తు రాలేదు. కాళ్లూ చేతులూ ఆడలేదు. పోనీ ఎవరికైనా చెబుదాం అంటే ఎవరూ లేరు. నాకేటి బోధపడలేదు. దెయ్యాలు కార్లు కూడా నడుపుతాయా ఇష్టానుసారంగా? ఇలా రోడ్ల మీద తిరిగేస్తాయా?
అదీ ఆంజనేయస్వామి గుడి ముందు! అనుకుంటూ లోన గుండెకాయ కొట్టుకుని అరచేతిలోకి జారిపోతుంటే, ప్రాణాలు ఉగ్గబెట్టుకుని పక్కకెళ్లి కూర్చుండిపోయాను. ఒరేయ్ అల్లుడూ! అప్పుడు ఇంకా చిత్రం… ఆ కారు దయ్యం నా కళ్ల ముందే నెమ్మదిగా కదిలింది. అలా అలా అలా వెళ్లి కనబడకుండా పోనాది.
పట్టపగలు దెయ్యాలు తిరుగుతున్న ఈ ఊళ్లో మా అమ్మి, నువ్వు ఎలారా బతుకుతున్నారు? దీనికేదైనా ఇరుగుడు ఉందా?” అని అమాయకంగా అడిగాడు.
సూరిబాబు ఈసారి నవ్వలేదు. సింహాద్రప్పడు అతనికి వరసకి మేనమామ అవుతాడు. చిన్నప్పటి నుంచి తనని ఎత్తుకుని పెంచాడు. తన పైచదువులకి సాయం చేసాడు, కూతుర్నిచ్చి పెళ్లి చేసాడు. సింహాద్రప్పడు జీవితకాలంలో తిరుపతి, సింహాచలం, అన్నవరం తప్ప పెద్దగా తీర్థయాత్రలు చేసింది లేదు. యాభై ఎకరాల ఆసామి. వ్యవసాయం, ఇల్లు తప్ప మరో పని తెలీదు. ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసాడు. కొడుకు విశాఖపట్నం పోర్టులో ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య పోయిన దగ్గర్నుంచి లోన్లీగా ఫీలవుతున్నాడని చాలా బలవంతం చేసి, నచ్చజెప్పి ఎవరో వస్తుంటే అమెరికా తీసుకొచ్చాడు.
సూరిబాబుకి ఏం జరిగిందో అర్థమైంది.
“మావయ్యా! నువ్వు చూసింది డ్రైవర్ లేని కారు. ఒక పెద్ద కారు కంపెనీ దీన్ని టాక్సీ కింద కొన్ని సిటీస్‌లో నడుపుతోంది. అది మనం బుక్ చేసుకుంటే మన ఇంటికొచ్చి ఎక్కించుకుని, కావలసిన దగ్గర దించేస్తది. అంతా ఆటోమేటిక్!” అన్నాడు.
సింహాద్రప్పడు కి మాట పెగలలేదు. “ఏట్రా? ఎకసక్కాలాడుతున్నావా? అదెలాగా? మనిషి లేకుండా దానంతటదే ఎల్లిపోద్దా? ఇన్ని వేల బళ్ల మధ్యన అంత స్పీడుగా, మధ్యలో మనుషులు, కార్లు, చిన్న పిల్లలు, మలుపులు, దారిలో సిగ్నళ్లు… అన్నీ దానికి ఎలా తెలుస్తాయిరా? మనిషికే ఇంత అయోమయంగా ఉన్న ప్రపంచకంలో మెషిన్ ఎలాగరా? ఎటెళ్లాలా? ఎలాగెళ్లాలా? పోలీసు ఆపి అడిగితే ఏటి చూపెడతది? అందులో ఎక్కిన మనుషులు ఎదవ పనులు చేస్తే అది ఏటి చేస్తది? పాపం ఇలాగా ఈ మెషిన్ కార్లు ఏలిపోస్తే డ్రైవర్లు ఏటైపోతారు? నాకేటి బోధపడటం లేదురా అల్లుడూ!” అని సగం షాకు, సగం ఆశ్చర్యంతో అలా అడుగుతుండగానే ఇల్లు వచ్చింది. అంతా దిగి లోపలికి వెళ్లారు.
సాయంకాలం ఆరు దాటింది. ఎండ ఇంకా తగ్గలేదు. సింహాద్రప్పడు కి అదో విచిత్రం. రాత్రి తొమ్మిది అయితే గానీ చీకటి పడదు. దాని గురించి కూతుర్ని అడిగితే ఆ ఉమ ఏదో చెప్పింది గానీ సింహాద్రప్పడు కి బోధపడలేదు.
“హాయ్ గ్రాండ్‌పా!” అని మనవడు పలకరించి వాడి గదిలోకి వాడు వెళ్ళిపోయాడు. వాడికి తెలుగు రాదు. మనవరాలు ఊర్లోనే ఉంటాది గానీ హాస్టల్లో ఉంటది. దానికి కొంచెం తెలుగు వచ్చు. వచ్చినప్పుడు తాతతో ఏవో కబుర్లు చెబుతుంది.
సింహాద్రప్పడు మల్లెపూవులా తయారై ఇంట్లో జరుగుతున్న హడావిడి చూస్తున్నాడు. ఇంట్లో చిన్న పార్టీ జరగబోతుంది అని కూతురు చెప్పింది. ఓ యాభై మంది వరకు గెస్టులు వస్తారట. వంటొండే పని లేదు, పదార్థాలన్నీ ఆర్డర్ పెట్టేస్తే టైంకి వచ్చేస్తాయి. ఇంటి వెనకాల చాలా ఖాళీ స్థలం ఉంది. అక్కడే వసారా లాగా ఉంది, కౌంటర్స్ ఉన్నాయి. సాయానికి ఎవరెవరో స్నేహితులు వచ్చారు. కొంచెం దూరంలో మందు సెటప్ ఉంది. లాన్ అంతా పద్ధతిగా ఉంది. సింహాద్రప్పడు కి అంతా కలలా ఉంది. ఎక్కడ వడ్డాది, ఎక్కడ డల్లాసు! తను డల్లాసు అన్నప్పుడల్లా మనవరాలు “డేలస్ ” అని సరిచేస్తూ ఉంటది.
, దుమ్ము, ధూళి, మనుషులు, పశువులు, దోమలు, పాములు, చెరువులు, ఏళ్లు, చీకటి… లోంచి ఇది వేరే లోకం. మంచిదా చెడ్డదా మనకి తెల్దు. బతుకులోనే తేడా. బళ్లల్లో తేడా. కుడిఎడంగా ప్రపంచం అంతా ఒకటే అంటారు గానీ కాదు. డ్రైవింగ్‌లోనే తేడా. స్టీరింగ్ మన దేశంలో కుడి పక్కన ఉంటది, ఇక్కడ ఎడమ పక్కన ఉంది. అక్కడ ఎడమలో నడపాలి, ఇక్కడ కుడిలో నడపాలి.. ఒక్కలాగా అనిపిస్తది కానీ ఒకటి కాదు.
సింహాద్రప్పడు భుజం మీద చేయి పడింది. చూస్తే సూరిబాబు. “మావయ్యా! ఏటిక్కడే నిలబడి ఆలోచిస్తున్నావు? పదా, మందేద్దువు గాని” అన్నాడు.
“వద్దురా అల్లుడూ! మానేసాను, చానాళ్లయింది.”
“అందుకే వేయమంటున్నాను! నిన్ను ఆపడానికీ, అడ్డం పడడానికీ అత్త లేదు. జీవితంలో ఎత్తుపల్లాలు చూసేసావు. మమ్మల్ని ఈ తీరుకు తీసుకొచ్చావు. ఇంకేటి కావాలా? సరదాగా రెండు పెగ్గులు వెయ్యి! అల్లుడు అమెరికా తీసుకెళ్లాడు గానీ సీమ సరుకైనా పోసాడు కాదని నాకు మాట వస్తది, కాదనకు. ఎండ కూడా గట్టిగానే ఉంది. ఈ మందు లైటుగా ఉంటది, పెద్దగా ఎక్కదు. రా!” అని మొహమాట పెట్టేసరికి కాదనలేకపోయాడు.
అల్లుడు పెగ్గు కలిపి అందించాడు. నెమ్మదిగా ద్రవం లోపలికి వెళ్తుంది. ఏదో కూల్ డ్రింక్ తాగుతున్నట్టుంది అనుకున్నాడు. చీకటి పడింది. అతిథులు ఒక్కరొక్కరుగా వస్తున్నారు. అల్లుడు సూరిబాబు ఒకాయన్ని తీసుకొచ్చి పరిచయం చేశాడు.
“మా మావయ్య… ఉమ వాళ్ళ డాడీ” అని, “మావయ్యా! ఈయన సుబ్రహ్మణ్యం గారు. పెద్ద కంపెనీలో చాలా పెద్ద ఉద్యోగం. మా గురువుగారు. మన వైజాగ్ సైడే” అని పరిచయం చేశాడు.
సింహాద్రప్పడు లేచి దండం పెట్టాడు. “అయ్యో కూర్చోండి! మాది కశింకోట… మాది కశింకోట అగ్రహారం వీధిలో ఉండేవాళ్లం. వడ్డాది నాకు తెలుసు. చిన్నప్పుడు అంతా చోడవరం, వడ్డాది ఇవన్నీ వేసవి సెలవుల్లో తిరిగేవాళ్ళం. అర్జాపురంలో కూడా మా చుట్టాలు ఉండేవారు” అన్నాడు.
సింహాద్రప్పడు సంతోషంగా చూశాడు. తనకు తెలిసిన ఊర్ల పేర్లు తెలిసిన మనిషి ఒకడు కనబడేసరికి, చెవులకి తెలిసిన పాట వినిపించినంత ఆనందం కలిగింది.
“చాలా సంతోషం సార్! మా వాడికి మీలాంటి పెద్దోళ్ల సావాసం దొరకడం అదృష్టం. ఏం పుచ్చుకుంటారు?” అని హడావిడి చేసాడు. అంతా సెటిల్ అయ్యారు. అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇంగ్లీషు, హిందీ, అక్కడక్కడ తెలుగు వినిపిస్తుంది. భోజనాలు అవుతున్నాయి. రకరకాల టాపిక్కులు నడుస్తున్నాయి. యుద్ధాల గురించి, మనుషుల గురించి .. మనుషుల చావుల గురించి మాట్లాడుకుంటున్నారు. చివరకు వెహికల్స్, యాక్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు.
సుబ్రహ్మణ్యం సింహాద్రప్పడు తో అన్నాడు, “ఇండియాలో మరీ ఘోరంగా యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయండి. జనాభా పెరిగిపోయింది, ట్రాఫిక్ రూల్స్ పాటించరు. పాపం ఈ మధ్య చూడండి రాజమండ్రి యాక్సిడెంటు, ఆ యాక్సిడెంట్ లో ఆ అమ్మాయిని కార్ తో గుద్దించి చంపేశారు. తాగి కార్ నడపడం ఏంటండీ, అన్యాయం!” అంటున్నాడు.
సడన్‌గా సింహాద్రప్పడు కి పొద్దుటి కార్ గుర్తొచ్చింది. అదే మనిషి నడిపితే తన్నీ గుద్దేసి ఉంటాదని అనిపించి భయమేసింది. గబగబా మందు తాగేసాడు. సుబ్రహ్మణ్యంతో అన్నాడు, “బాబు! తమరు బాగా చదువుకున్నారు. నాకొకటి చెప్పండి… మనిషి కనిపెట్టిన మిషను మనిషి కంటే గొప్పదైపోవడం గొప్పే కదా? పొద్దున్న నన్ను ఒక కారు గుద్దబోయింది. చూస్తే డ్రైవర్ లేడు. డ్రైవర్ లేని మనిషి… డ్రైవర్ లేని మిషన్ కార్… మిషన్ కారే పద్ధతిగా ఉన్నప్పుడు, మనిషి నడిపే కారు మరింత పద్ధతిగా ఉండాలా? మిషన్ కి లేని నిర్లక్ష్యం మనిషికి ఎలాగ వచ్చింది? మనిషి మరింత జాగ్రత్తగా ఉండాలి కదా? మనుషులు ఇంత దుర్మార్గంగా ఎందుకు తయారవుతున్నారు?
ఐదు కోట్ల రూపాయల కారు నడిపేవాడికి పది కోట్ల రూపాయల బలుపు ఉండొచ్చునా? డబ్బు పొగరు, అధికారం పొగరు, హోదా పొగరుతో మనుషులు అలాగ చెలరేగిపోవడం, నడమంత్రపు సిరితోటి జనాల్ని కాల్చుకు తినడం కరెక్టేనా?
మా ఊర్లో ఇసుక లేదు, ఏర్లు తవ్వేసారు, కొండలు తవ్వేసారు, భూములు తినేసారు, అడవులు తినేసారు, ఫ్యాక్టరీలు తినేసారు. మనిషి బలిసిపోవడానికి, సుఖ పడడానికి కొత్త కొత్త మిషన్లు కనిపెడుతున్నారు. మనిషికి లోన ఏదో అయిపోయినట్టుంది.
మా ఊర్లో మా చిన్నప్పటి నుంచి ఉన్న గ్రావెల్ కొండ ఎంత తవ్వినా తరగలేదు. అలాంటిది రోజుకి మూడు వందల లారీలు తెచ్చి, మిషన్లు తెచ్చి ఒక్క సంవత్సర కాలంలో కొండ తవ్వేసి ఖాళీ చేసేశారు. అదంతా ఎక్కడికెళ్లింది? ఎవడి బాగు కోసం వెళ్ళింది? ఊర్లు ఖాళీలు అయిపోతున్నాయి. మనుషులు పక్షులు ఎగిరినట్టు ఎగిరి దేశాలు పట్టి పోతున్నారు. ఏటి ఘోరం! ఏటి కలి!” అన్నాడు.
సుబ్రహ్మణ్యం నెమ్మదిగా అన్నాడు, “తప్పదు సింహాద్రప్పడు గారు, మనం ఆపలేము. డెవలప్‌మెంట్‌లో భాగంగా, స్పీడ్‌లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆపలేము, బాధపడి లాభం లేదు. పోటీ… పోటీ! మార్కెట్లో పోటీ. అందులో నీకెంత, నాకెంత… అంతే. మరొకటి లేదు” అన్నాడు.
“మీరు చెప్పింది నిజమే. మార్పు మనిషిని బతికించాలి కానీ చంపడం ఏంటి? మా తాత కుక్క కరిచి చచ్చిపోయాడు. మా నాన్న పాము కుట్టినా బతికాడు. నేను కరోనా వచ్చినా బతికాను. మందులొచ్చాయి, ఇంజెక్షన్లు వచ్చేశాయి, ఆపరేషన్లు వచ్చేశాయి. మోకాలి చిప్పలు మార్చేస్తున్నారు. గుండెకి ఆపరేషన్ చేసి బతికించేస్తున్నారు. కార్లు, రైళ్లు, విమానాలు… దూరాలు తరిగిపోయాయి. నాలాంటోడు ఇక్కడిదాకా రాగలిగాడు. ఇదంతా బాగుంది. కానీ వీటి వెనకాల మనిషి బుర్రలో దెయ్యాలు తిరుగుతున్నాయేమో అని భయమేస్తుంది.
మనిషి కనిపెట్టిన మిషన్లు దేవుడుల్లాగా, దేవతల్లాగా అయ్యి జనాలకి సేవ చేస్తుంటే, ఆ మిషన్లను కనిపెట్టిన మనిషి రాక్షసుడిలాగా అయిపోవడం, సాటి మనుషుల్ని లేపేయడానికి యంత్రాలను వాడడం… ఇలాగ చెయ్యొచ్చా? అడిగేవాళ్లు లేరా? ఇదంతా తప్పు కదా?
ఇక్కడెక్కడో బటన్ నొక్కితే అక్కడెక్కడో ఆయిల్ ఓడల మీద బాంబులు పడడం ఏంటి? అక్కడెక్కడో ఆయిల్ ఓడలు పేలిపోతే దానివల్ల మా ఊర్లో పెట్రోల్ బంకులు మూతపడిపోనాయి. వాహనాలు బబ్బున్నాయి. ట్రాక్టర్ కి డీజిల్ లేక దమ్ములు ఆగిపోయాయి, దుక్కులు ఆగిపోనాయి. మా ఊరు ఆస్పత్రిలో కరెంటు పోతే జనరేటర్ కి డీజిల్ లేక ఇద్దరు చిన్న పిల్లలు చచ్చిపోయారు.
ఎక్కడో ఏదో దేశంలో ఏదో జరిగితే మరోచోట ఎక్కడో మనుషులు పోతున్నారు. ఇదంతా మీరు మాట్లాడుకుంటుంటే నాకు బోధపడింది” అని గ్లాస్ ఖాళీ చేసాడు.
అతని కళ్లు ఎర్రబడ్డాయి. ఉన్నట్టుండి సింహాద్రప్పడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దుఃఖపడడం మొదలుపెట్టాడు.
సుబ్రహ్మణ్యం కంగారుపడ్డాడు. “అయ్యో! ఏంటిది, ఊరుకోండి. ఏమైందిప్పుడు?” అన్నాడు.
సింహాద్రప్పడు మన్నించాల … మనసు చెదిరిపోయింది. జాలి వచ్చేసింది, బాధ వచ్చేసింది.
“చచ్చిపోయిన మనుషుల గురించి కాదు, బతికున్న మనుషుల గురించి ఏడుపు.”
“పట్టించుకోకూడదు సింహాద్రప్పడు గారూ! ఎలా జరిగేది అలా జరుగుతుంది. మన చేతిలో ఏమీ లేదు. ఇది ఇలాగే ఉండిపోదు. నేను చాలా చూశాను, చూస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కూడా అంత బాగోలేదు. ఉద్యోగాలు పోతున్నాయి, ఇళ్లు ఖాళీలు అయిపోతున్నాయి. మనుషులు సొంత గూటికో మరో చోటికో ఎగిరిపోతున్నారు. వీడ్కోలు చెప్పడానికి మనసు కష్టంగా ఉంటోంది. మళ్లీ కలిసే అవకాశం ఉన్న మనుషులు వెళ్ళిపోతేనే అంత బాధ కలుగుతుంటే, బతుకులోంచి అర్థాంతరంగా మనుషులు మాయం అవుతే ఇంకెంత కష్టం కలుగుతుంది? నేను మీ బాధను అర్థం చేసుకోగలను.
మేం బండబారిపోయాం. మీలాగా మాకు ఎక్కడో ఎవరో చచ్చిపోతే ఏడుపు రావడం లేదు. ఆ స్టేజ్ దాటేశాం. ఇదే అభివృద్ధా అనుకుంటే సిగ్గేస్తుంది. లోపల తడి ఆరిపోకుండా ఉండాలంటే ఏమీ తెలియకుండా ఉండడం బెటరేమో! తెలుసుకున్న కొద్దీ బాధే తప్ప మరొకటి కనపడడం లేదు” అని తన గ్లాస్ ఖాళీ చేశాడు.
సింహాద్రప్పడు తడి కళ్ళతో నవ్వాడు.
“నా గుండె తేలికపడింది గురువుగారూ! సుఖపడాలంటే బుధీ బుర్ర ఉండకూడదని, నాలుగు విషయాలు తెలుసుకోకూడదని, ఇది ఇలా ఎందుకుందనే ఆలోచన చేయకూడదు అనీ… బతికే బతుకులో అర్థంపర్థం వెతకడం కూడా పనికిమాలిన గోలని, ఎవడెలా పోయినా పట్టించుకోకూడదనీ, మనం తయారుచేసిన యంత్రాలాగే మనం మారిపోవాలనీ… అప్పుడు వాటిలాగే మనకి ఏడుపు రాదనీ కొద్దికొద్దిగా అనిపిస్తుంది.
కానైతే గురువుగారూ ఒక మాట! మా మనవరాలు వడ్డాదిలోని మా ఇల్లుని మ్యాప్‌లో చూపెట్టింది. ఇన్ని వేల మైళ్ళ నుంచి మా ఇల్లుని చూపించగలిగినట్టే, ఎక్కడెక్కడ మనుషుల్లో దుర్మార్గాన్ని తీసేసి నేరాలు, ఘోరాలు చేయాలనే ఆలోచనను తీసేసే మిషన్లు కనిపెట్టలేరంటారా?” అని అడిగాడు.
సుబ్రహ్మణ్యం ఒక్క క్షణం ఆలోచించి, చెమటలు పట్టిన మొహం తుడుచుకుని, “కనిపెట్టొచ్చేమో! కానీ అలా చేయడానికి పెట్టుబడి పెట్టేవాడికి ఏంటి లాభం? అలా చేసే వ్యక్తికి, సంస్థకి ఏం కలిసి వస్తుంది?” అన్నాడు.
సింహాద్రప్పడు ఏమీ మాట్లాడలేదు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ‘లాభం’ అనే మాట ప్రపంచాన్ని నడిపిస్తుందని సింహాద్రప్పడు కి అన్ని వేల మైళ్ళ దూరంలో… ఆ డేలస్ నగరంలో ఆ అర్ధరాత్రి తెలిసింది.
నిజమే అన్నట్టు తలూపాడు. సుబ్రహ్మణ్యం చిన్నగా నవ్వాడు. చీకటి చిక్కబడింది. పార్టీ కొనసాగుతోంది.
***

