”నాన్నా… నాకొక డౌటు, అడగొచ్చా?”
ఎప్పటిలాగే ప్రశ్నతో పాటు పర్మిషన్ కూడా అడిగాడు తరుణ్. వాడి వయసు ఎనిమిది. 3వ తరగతి ఆఖరి పరీక్ష రాసి, చదువు పూర్తయిపోయినంత ఉత్సాహంలో ఉన్నాడు. స్కూల్ బస్ ఉన్నా సరే అప్పుడప్పుడూ పికప్ చేసుకోవాలన్నది అమ్మానాన్నకు వాడు పెట్టిన కండిషన్. ఇవాళ నాన్న వంతు. బండి మీద రివర్స్‌లో కూర్చుని దాటిపోతున్న ప్రపంచాన్ని చూడటం తరుణ్‌కి ఇష్టమైన విన్యాసం. అందులోనుంచే అనేక ప్రశ్నలు పుడుతూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి విసుక్కున్న పొరపాటుకి ‘అడగొచ్చా?’ అంటూ ఒక కవచం ముందే తొడుక్కుని అడుగుతూ ఉంటాడు.
పాఠాల గురించి మాత్రం ఎప్పుడూ అడగడు. ఆ ఒక్క ధీమాతో ”ఏంటా డౌటు?” అన్నాడు నారాయణ.
”ఈ స్కూల్లో పిల్లలకి రోజూ భోజనాలు ఎందుకు పెడతారు నాన్నా?” రోడ్డు పక్కనే ఉన్న స్కూల్ దాటుతున్న విషయం గమనించి…
”అది గవర్నమెంట్ స్కూల్ కదా!” అని ఇంకా ఏదో చెప్పబోతుండగానే… ”అయితే..! వాళ్లు లంచ్ బాక్సు తెచ్చుకోరా?” మళ్లీ ప్రశ్న.
”అక్కడ చదువుకునే పిల్లల కోసం మిడ్ డే మీల్స్ అనే ఒక పథకం ఉంది. ఆ పిల్లలందరికీ మధ్యాహ్నం స్కూల్లోనే భోజనం పెడతారు.”
”దానికి నెల నెలా ఫీజు కట్టించుకుంటారా?” ఒడ్డు తెగిన పెద్దచెరువులో నీళ్ల ప్రవాహంలా ఉంటాయి వాడి ప్రశ్నలు.
”చదువే ఉచితంగా చెప్పేటపుడు, భోజనానికి ఎందుకు కట్టించుకుంటారు ఫీజు?”
ఎదురు ప్రశ్న వచ్చేసరికి ఆలోచనలో పడ్డాడు తరుణ్. దాటిపోతున్న దారివైపు చూడటం ఆపేసి ఆకాశం వైపు చూస్తున్నాడు. తరువాతి ప్రశ్న కోసం నారాయణ సమాధానాలు సిద్ధం చేసుకుంటూ బండి పోనిస్తున్నాడు.
”నాన్నా…”
కొంచెం స్పీడ్ తగ్గించాడు నారాయణ.
”నన్ను కూడా ఆ గవర్నమెంట్ స్కూల్లో వేసేయొచ్చు కదా!”
”ఏం.. మీ స్కూల్ నచ్చలేదా?”
”నచ్చింది. కానీ పొద్దున్నే లంచ్ బాక్స్ రెడీ అవ్వకపోతే బస్ మిస్ అవుతున్నా. అప్పుడప్పుడూ స్కూల్ లేట్ అవుతున్నా. అదే ఈ స్కూల్ అయితే అమ్మకి లంచ్ బాక్స్ పెట్టే పనే ఉండదు కదా!”
ప్రతిరోజూ పొద్దున్నే స్కూల్ బస్ హారన్ వినిపించే సమయానికి ఇంట్లో ఉండే యుద్ధ వాతావరణం గుర్తొచ్చి నవ్వుకున్నాడు నారాయణ.
“సరే… నెక్ట్స్ ఇయర్ నుంచి అమ్మను త్వరగా బాక్స్ రెడీ చెయ్యమని చెప్తాలే. ఇంతకీ ఈ భోజనాలు పెట్టడం గురించి నీకెలా తెలుసు?”
టాపిక్ కాస్త దారి మళ్లించే ప్రయత్నంగా అడిగాడు నారాయణ.
“ఎగ్జామ్స్ కదా! స్కూల్ మధ్యాహ్నమే అయిపోతుంది. బస్ లో వస్తున్నప్పుడు ఇక్కడకు రాగానే వంటలు వాసనొస్తూ ఉంటాయి. ఇంతలోనే టంగ్ టంగ్ టంగ్ మంటూ ఒక బెల్లు మోగుతుంది. వెంటనే పిల్లలు ప్లేట్లు పట్టుకుని లైన్‌లో నిలబడటం చూశా. అందుకే అడిగా.” తన దగ్గర ఉన్న డేటా అప్‌డేట్ చేశాడు తరుణ్.
”అది భోజనానికి రమ్మని కొట్టే గంట. మేము చదువుకునే రోజుల్లో దాన్ని అన్నంబెల్ అని పిలిచేవాళ్ళం” అన్నాడు నారాయణ.
”అవునూ… ఈరోజు నుంచి నన్ను బ్యాడ్మింటన్ జాయిన్ చేస్తా అన్నావు గుర్తుందిగా!” బండి అపార్ట్‌మెంట్ గేటులోకి ఎంటర్ కాగానే భవిష్యత్తు కార్యాచరణ గుర్తు చేశాడు. ఇంట్లో అమ్మానాన్న ఇచ్చిన ఏ ఒక్క మాటా మర్చిపోడు తరుణ్. వాళ్లను మాట తప్పని మనుషులుగా నిలబెట్టాలన్నది వాడి తపన. అలాగని, వాడు చెప్పినవి ఏవీ గుర్తుపెట్టుకోడు. అది బాల్యం వాడికిచ్చిన వరం.
‘సరే..సరే.. గుర్తుంది’ అనేవరకు నాన్న చెయ్యి పట్టుకుని గుంజుతూనే ఉన్నాడు.
”హాయ్ నాన్నా… ఎగ్జామ్ ఎలా రాసావ్?” గుమ్మంలోకి రాగానే తల నిమురుతూ అడిగింది కల్యాణి.
”బాగా రాశానమ్మా… సోషల్ చాలా ఈజీపీజీ అని ముందే చెప్పా కదా..!” వాడి మాటలకు ఎప్పటిలాగే మురిసిపోయింది. మార్కుల భయాన్ని బయటపడకుండా మేనేజ్ చేస్తూ… ”హ్యాపీ హాలీడేస్ కన్నా… తొందరగా డ్రెస్ మార్చుకుని కాళ్లూ చేతులూ ముఖం కడుక్కుని వస్తే అన్నం పెడతా. ఏవండీ వస్తున్నారా..?” డైనింగ్ టేబుల్ మీద వేడివేడి వంటకాలు సర్దుతూ, బెడ్ రూంలో ఉన్న భర్తకు కూడా లంచ్ ఇన్విటేషన్ ఇచ్చింది కల్యాణి.
భోజనానికి కూర్చున్నారు తండ్రీకొడుకులు.
“నువ్వు కూడా వచ్చేయ్ అమ్మా…” యథా తరుణ్.
“అబ్బా… వస్తాన్రా. వడ్డించనీ ముందు” సదా కల్యాణి.
నారాయణ ఏదో ఆలోచిస్తున్నట్టుగా అన్నం అటూ ఇటూ నెరుపుతున్నాడు. ఎప్పుడూ కంచం ముందు అలా ఉండడు. భోజనం చేస్తే ప్లేట్ కడగాలా వద్దా? అన్నట్టుంటుంది. వద్దనుకున్నవి ముందే చెయ్యి అడ్డుపెట్టేసి మరీ ఆపేస్తాడు. వడ్డించుకున్నవి పోపులో మిరపకాయతో సహా ముగిస్తాడు.
తరుణ్ కి అన్నం కలిపి ఇవ్వడం, అందులో మిరపకాయలు, టమోటాలు, కరివేపాకు, కొత్తిమీర కాడలు వడకట్టడంలో కల్యాణి బిజీగా ఉంది. అవన్నీ పూర్తయి భర్త కంచంవైపు చూసేసరికి అతని భోజనం ముగింపులోకి వచ్చేసింది.
నారాయణ అంతే… ‘కడిగిన కాళ్లు ఆరేలోగా అన్నం విస్తరి మడతపెట్టేయాలి మగాడు,’ అనేది అతని తండ్రి మాట.
“అన్నం వడ్డించనా మజ్జిగలోకి..?” అంగీకార పత్రం అందగానే వేడి వేడి అన్నం ఒక కరుడు వడ్డించింది కల్యాణి. అందులోకి వెంటనే మజ్జిగ పోసుకున్నాడు. “అదేంటీ… అన్నం చల్లారకుండా..? మీరే కదా అంటారు వేడన్నంలో మజ్జిగ…”
కల్యాణిని కొనసాగనివ్వలేదు. “ఏదో ఆలోచిస్తూ పోసేసుకున్నాన్లే..!” అనేసాడు కాస్త రిక్వస్ట్‌గా మొహం పెట్టి.
పొగలు కక్కే అన్నంలో మజ్జిగ పోసి కలుపుతుంటే ఒకలాంటి రుచికరమైన వాసన. సగం కడుపు నిండిన వారికి కూడా నోట్లో నీళ్లూరతాయి. నారాయణ ఆస్వాదిస్తున్నాడు. కలుపుతున్నట్టే కలుపుతూ రెప్పలు మూసి గుండెలనిండా గట్టిగా ఒకసారి ఆ ఫ్లేవర్ పీల్చుకున్నాడు. శ్వాస లాగినంత వేగంగానే అనేక జ్ఞాపకాలు అతన్ని చుట్టేశాయి. ఆ జ్ఞాపకానికి 36 ఏళ్ళు.
***
అప్పుడు నారాయణ ఏడవ తరగతి విద్యార్థి . లైన్లో నిలబడి ఉన్నాడు, పొద్దున ఏడున్నరకే. వెనకబడిన తరగతుల ప్రభుత్వ సంక్షేమ వసతి గృహం, రాజమండ్రి. నొట్టలు పడ్డ స్టీలు కంచం చేతిలో. జుట్టు ఇంకా తడిగానే ఉంది. స్నానం చేసిన వొళ్లు ఆరలేదు. లైఫ్ బాయ్ సబ్బు వాసన గుబాళిస్తోంది. దాన్ని కూడా తరిమేస్తూ ఆవిరిగా వచ్చి కడుపులో ఆకలిని కవ్విస్తోంది ఒక కమ్మటి వాసన. నారాయణకు పదిమంది దూరంలో ఇనప కాళ్ల కుర్చీలో మీసాలతో పాటు కండలు తిరిగిన ఒక మనిషి. పెద్ద డేషా గిన్నెలో పొడవాటి తెడ్డె పట్టుకుని కూర్చున్నాడు. అక్కడున్న 90 మందినీ తానే పోషిస్తున్నట్టుగా ఉంది అతని తీరు. పేరు శంకర్.
డేషాలో ఉన్న వేడి వేడి గంజి అన్నంలో రెండు బకెట్లతో చిక్కటి మజ్జిగ తెచ్చి ఒంపేశాడు మీరా. వడ్డన శంకర్ వంతు అయితే వంట మీరా తంతు. వేడి అన్నంలో మజ్జిగను కలుపుతూ తెడ్డె తిప్పడం మొదలు పెట్టాడు శంకర్. అన్నపరిమళం అమాంతం మారిపోయింది.
ఆ కమ్మటి వాసన ఆవిరిఆవిరిగా గాలికి ఎటు వెళుతుంటే అటు తలను కదిలిస్తూ, మెడను చాపుతూ, మునివేళ్లపై లేస్తూ తన ముఖమంతా ఆవిరి పట్టించుకుంటున్న నారాయణ, కడుపునిండా వాయుభోజనం చేస్తున్నాడు.
వడ్డన మొదలైంది. నారాయణ అడుగు ముందుకు పడింది. గుండె నిండా గుబులు. అలవాటుగా ఆకలి మందగిస్తున్నా ఎక్కడో చిన్న ఆశ లోలోపల. కంచంలో వేడివేడి మజ్జిగన్నం జారింది. కళ్లు తెరిచీ తెరవనట్టుగా, వడ్డించిన అన్నంవైపు తేరిపార చూడకుండా తనకిష్టమైన వాసన ఒకసారి దగ్గరగా పీల్చుకున్నాడు. గబగబా వెళ్లి డైనింగ్ హాల్లో కిటికీ దగ్గర చోటు చిక్కించుకుని కూర్చున్నాడు ఎప్పట్లాగే.
అన్నాన్ని అటూ ఇటూ కలిపే ధైర్యం చేయలేదు. నాలుగే నాలుగు ముద్దలు కడుపులో వేశాడు. కంచంలో పెట్టుకున్న అన్నం మొత్తం తింటాననే ఆశ కలిగింది నారాయణకి. ఐదో ముద్ద తీశాడు. తిరగబడ్డ పురుగు, అతని ఆశతో పాటు ఆకలినీ చంపేసింది. ఒక్కటి కనిపించాక ఎన్ని ఏరాల్సి వస్తుందో నారాయణకు బాగా తెలుసు. వెతికే ప్రయత్నం చేయలేదు. భంగపాటు ఆ బాల్యానికి కొత్తేమీకాదు.
వడ్డన అయిపోవడంతో డైనింగ్ హాల్లోకి వచ్చిన శంకర్ ‘కానివ్వాలి.. కానివ్వాలి’ అంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రదర్శన ఇచ్చేవాడిలా. కంచంలోని మెతుకు కాదు కదా పురుగు కూడా కింద పడకుండా తినాలనేది అతని రూల్.
నారాయణ దృష్టంతా ఇప్పుడు ‘మిషన్ విండో’ మీద పడింది. ఎలాగైనా కష్టపడి కంచంలోని అన్నం కిటికీనుంచి బయట పడేయాలి. అది హాస్టల్ వెనకవైపు కిటికీ. అటువైపు ఎవరూ వెళ్లే వీలుండదు. దాన్ని ఆనుకొనే ఒక డ్రైనేజీ పారుతూ ఉంటుంది. ఒక్కో ముద్ద వెనక్కి వేసేస్తూ నాలుగు ముద్దలు కడుపులో వేసుకోవడం నారాయణకు అలవాటే. కానీ… ఈ సారి కిటికీ ఊసల మధ్యనుంచి కంచం బయటకు పెట్టి ఏకంగా తిరగేసేశాడు. ఆ పని చెయ్యగానే కడుపు నిండినంత పనైంది నారాయణకు.
హమ్మయ్య..! ఇవాల్టిటి గండం గడిచింది దేవుడా అనుకుంటూ ఖాళీ కంచం తీసుకుని పైకి లేచాడు. ఎదురుగా నిలువెత్తు రాక్షసుడిలా శంకర్. చేతిలో పొడవాటి కర్ర. అప్పటికే పిల్లల్ని కొట్టీకొట్టీ అది నున్నగా అరిగిపోయి మెరుస్తుంది. నూనె పట్టించిన బెత్తంలా.
”ఏరా..! ఎప్పటినుంచి ఈ ప్లాన్?” నారాయణకు నోట మాట రాలేదు. ధైర్యం చేసి వణుకుతున్న గొంతుతో ”పురు… పురుగు… పురుగులు ఉన్నాయని…” మాట పూర్తయ్యే లోపే కాళ్లమీద కర్ర చేసుకున్నాడు శంకర్. ”ఏరా.. నీ కొక్కడికే స్పెషల్‌గా వండి వార్చమంటావా? అందరూ తినడంలేదా? నీకేంటి రోగం?” మళ్లీ ఇంకోసారి కాళ్లమీద కర్ర పడబోతుంటే చెయ్యి అడ్డుపెట్టాడు. నారాయణ చేతిలో కంచం ఎగిరి కింద పడిపోయింది. శంకర్ కోపం రెట్టింపయింది. ”ఇంతకంటే గొప్ప కూడు పెట్టేస్తార్రా మీ ఇంటికాడ, మరి ఇక్కడికెందుకు తగలడ్డావ్!” అందరికీ వినిపించేలా గర్జించాడు. ఆ మాట వినగానే నారాయణకు అమ్మ గుర్తొచ్చింది. ”ఈరోజు ఏం కూర..? వంకాయా, బెండకాయా, పులుసా…” ఆమె వడ్డించిన కంచాన్ని ఎడం చేత్తో నెట్టేసిన సందర్భాలు కళ్లముందు కదలాడాయి. రెప్పలు తడిశాయి.
ఆరోజు మొదలు మళ్లీ కిటికీ దగ్గర కూర్చుంటే చర్మం వలిచేస్తానన్నాడు శంకర్. సాయంత్రం వార్డెన్ వచ్చాక అసలైన పండగ ఉందని బెదిరించాడు. ఆ మాటకు మరింత ఉలికిపాటుకి గురయ్యాడు నారాయణ.
“ఏదో కోపంలో అన్నాడే కానీ, విషయం వార్డెన్ వరకూ వెళ్లదులే” అంటూ తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు.
సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక స్నానం చేసి, పొద్దున్న కాళ్లమీద పడిన దెబ్బకు కాస్త కొబ్బరినూనె పట్టించి స్టడీ అవర్‌లో కూర్చున్నాడు నారాయణ. ఇంతలో వార్డెన్ పిలుస్తున్నారని కబురు. జ్వరమొచ్చినట్టు అయిపోయాడు. దడదడగా లోపలికి వెళుతుంటే డోర్ దగ్గర నిలబడి వంకర నవ్వుతో స్వాగతం పలికాడు శంకర్.
”ఏంటీ తమరికి భోజనం నచ్చడం లేదంటా..?” సమాధానం చెప్పలేక బిక్కచచ్చిపోయాడు నారాయణ. ”అన్నంలో పురుగులొస్తే పురుగులు పారేయాలి కానీ… అన్నం పారేస్తే ఎలా సార్!” వార్డెన్ రాజారావు తీరు ఎప్పుడూ పేదరికాన్ని వెక్కిరిస్తున్నట్టే ఉంటుంది. నెమ్మదిగా ప్యాంటుకి ఉన్న తోలు బెల్ట్ తీశాడు. వార్డెన్ టేబుల్ చుట్టూ నారాయణ పరుగు. రాజారావుకి పోలియో. అంత వేగంగా నడవలేడు. అతనికి అందకుండా పారిపోతున్న నారాయణపై కోపంతో రెచ్చిపోయి తిడుతున్నాడు. భయంతో తప్పించుకుంటున్నాడే కానీ దెబ్బ మిస్సయిన ప్రతిసారీ నారాయణలో భయం పెరుగుతూనే ఉంది. ఇంకో రౌండ్ అలాగే తిరిగితే, శంకరే లోపలికి వచ్చి వార్డెన్ బెల్టుకి నారాయణ వీపును అందించేస్తాడని అర్థమైపోయింది. రెండు బెల్టు దెబ్బలకు దొరికేసి రూం బయటకు పారిపోయాడు.
ఆ తర్వాత కిటికీ దగ్గర కూర్చోవాలి అనుకోలేదు. ఎప్పుడైనా శంకర్ సెలవులో ఉంటే మాత్రం ధైర్యం చేసి అక్కడే కూర్చునేవాడు. కంచంలో అన్నం కిటికీ నుంచి బయట పడేస్తే, తృప్తిగా భోజనం చేసిన ఫీలింగ్.
రాత్రిపూట ఎక్కువగా అన్నం మిగిలిపోతే ఒక్కోసారి చద్దన్నం బ్రేక్‌ఫాస్ట్‌గా పెట్టేవారు. ఆరోజు నరకమే. కడుపునిండా పీల్చుకోడానికి కనీసం అన్నం వాసన కూడా రాదు. రాత్రంతా గంజిలో మునిగి మెతుకులతో పాటు పురుగులు కూడా వళ్లు చేసేవి. కళ్లు మూసుకుని తిందామన్నా అవే కనిపించేవి. పెద్దగా వాంతి చేసుకున్నరోజు మాత్రం శంకర్ నుంచి దెబ్బలు తప్పేవి. గాయపెట్టే తిట్లు, గుచ్చుకునే వెక్కిరింపులూ షరా మామూలే.
రాను రాను ‘అన్నంలో పురుగులు రాకపోతే బావుండు’ అనే అత్యాశ పోయి… ‘తినేదాకా అవి కనిపించకపోతే చాలురా’ అనే ఆశ పుట్టింది నారాయణకి. అన్నంలో కలపడానికి భయపడి, లంచ్‌బాక్సులో కూర మాత్రమే తిని నీళ్లు తాగేసేవాడు చాలా మధ్యాహ్నాలు.
ఆకలితో హాస్టల్‌కి తిరిగొస్తుంటే దారిలో బడ్డీకొట్ల దగ్గర ‘కోకిల’ సినిమా పాటలు మోగుతుండేవి. అందులో టైటిల్ సాంగ్ వింటుంటే నారాయణకు ఇల్లే గుర్తొచ్చేది. ఎందుకో తెలీదు కానీ… ఆ పాట వింటున్నంతసేపు కుటుంబం తనను పిలుస్తున్నట్టే ఉండేది. ఆకలి కడుపు నుంచి దుఃఖం తన్నుకొచ్చేది.
ఉన్నపళంగా వెళ్లిపోయినా ఆపేవాళ్లు, అనేవాళ్లు ఎవ్వరూ లేరు. కానీ… హాస్టల్‌లో చేరడం కోసం మూడురోజులు పస్తులున్న సంగతి గుర్తొచ్చి పౌరుషం పొడుచుకొచ్చేది. ఊళ్లో టీచర్లు లేని బడి, ఏడవ తరగతి ఫెయిలై పొలంపనికి పోతున్న పిల్లలు… కళ్లముందు కనిపించేవారు. ఆకలి, బెంగ చిన్నవైపోయేవి.
ఎంత దిగులుగా ఉన్నా పొద్దున్నే వేడివేడి మజ్జిగన్నం ఆవిరి ముక్కును తాకగానే ఎక్కడలేని బలం. ఆ కొన్ని క్షణాలే నారాయణకు దొరికే తృప్తి. మూడేళ్ల పాటు తన కంచంలో పెట్టిన భోజనంతో ఏ రోజూ లేదది.
***
మధ్యాహ్నం ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద మజ్జిగన్నం కలుపుతున్నపుడు అదే కమ్మటి వాసన. తన కంచంలో ఆఖరి ముద్ద తింటున్నప్పుడు నారాయణ కళ్లు చెమ్మగిల్లాయి.
రాత్రంతా సరిగా నిద్ర పట్టలేదు.
ఉదయాన్నే ఫోన్ డేటా ఆన్ చేయగానే అప్‌డేట్స్ అన్నింటిలో ఒకటే వార్త. బడిలో పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడంపై ఒక ప్రవచనకర్త నోరు పారేసుకున్న వార్త. అందరూ అతన్ని ట్రోల్ చేస్తున్నారు. పోస్టులు పెడుతున్నారు. తప్పులు పడుతున్నారు.
ఆఫీసుకి బయలుదేరాడు నారాయణ. దారిలో సిగ్నల్ దగ్గర విద్యార్థుల ధర్నా. ట్రాఫిక్ జామ్.
పంచెకట్టిన దిష్టిబొమ్మకు శోభనం పెళ్లికొడుకు గెటప్ వేసి తగలబెడుతున్నారు.
‘మధ్యాహ్న భోజనం చట్టబద్ధమైన హక్కు’…
‘క్లాసు రూం కడుపు ఆకలితో మాడుతుంటే…
రాజ్యాంగం ఇచ్చిన విద్యా హక్కు నెరవేరదు’… ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. మరోపక్క అవధాని ఫొటో ముఖం మీద పగిలేలా గుడ్లు పెట్టి కొడుతున్నారు.
మరో నలుగురు కుర్రాళ్లు ట్రాఫిక్‌లో ఆగిన వాళ్లకు తలో గుడ్డు పంచుతున్నారు. నారాయణ చేతికి కోడిగుడ్డు అందింది. దానిపై ‘గాడిద గుడ్డు’ అని రాసి ఉంది.
‘బడిలో భోజనం పెట్టడమేంటండి అసహ్యంగా? పైగా వాడికి గుడ్డు, గాడిదగుడ్డూనూ..! అవన్నీ తిని శోభనం పెళ్లి కొడుకులా మంచమెక్కి కూర్చుంటాడా?’ పొద్దున్నే విన్న ప్రవచనకారుడి మాటలు గుర్తొచ్చాయి నారాయణకి.
బండి సైడ్ స్టాండ్ వేశాడు. గుడ్డు గురి తప్పకుండా ఉండటం కోసం రెండడుగులు ముందుకేశాడు. అవధాని ఫొటోకేసి చూశాడు. గాడిదగుడ్డులో ప్రవచనం వింటూ చప్పట్లుకొట్టిన వాళ్లందరి ఫొటోలు కూడా అక్కడే ఉన్నట్టు ఊహించుకున్నాడు. లాగిపెట్టి కొట్టాడు. గురి తప్పలేదు.
చాలాసేపటికి ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు. గుడ్డు పగలగొట్టే ఛాన్స్ తమకు లేదన్న నిరాశ తప్ప వాళ్ల ముఖాల్లో ఎక్కడా చికాకు, కోపం కనిపించలేదు.
***
పెద్దబడి దాటుతున్నాడు నారాయణ. కమ్మటి వాసనలు ఘుమాయిస్తున్నాయి.
”నాన్నా… నన్ను కూడా గవర్నమెంట్ స్కూల్లో వేసేయొచ్చు కదా..!” తరుణ్ మాటలు గుర్తొచ్చాయి.
”నన్ను హాస్టల్ లో వేస్తావా? వెయ్యవా నాన్నా!” అన్నం తినడం మానేసి అలిగిన ఒకనాటి తన బాల్యం గుర్తొచ్చింది నారాయణకి.
నవ్వుకున్నాడు.
కాస్త దూరం వెళ్లగానే టంగ్ టంగ్ టంగ్ మని గంట శబ్దం వినిపించింది. అది అన్నంబెల్. అది నారాయణ హాస్టల్ బెల్లే!

