అంతర్యుద్ధం
డాక్టర్ ప్రభాకర్ జైని
…..
మనిషి జీవితంలో జరిగే యుద్ధాలన్నీ బయటకి కనిపించవు.
కొన్ని యుద్ధాలకు శత్రువులుంటారు. కొన్ని యుద్ధాలకు ఆయుధాలుంటాయి. ఆ యుద్ధంలో గెలిస్తే జయజయధ్వానాలుంటాయి. అలాగే, ఓడిపోతే గాయాలుంటాయి.
కానీ అన్నింటికన్నా భయంకరమైన యుద్ధం జరిగేది మన మనసులోనే.
ఎందుకంటే, అక్కడ మనకు ఎదురుగా నిలబడే శత్రువు కూడా మనమే. ముందు నడిచే సైనికుడూ మనమే. యుద్ధాన్ని నడిపించే సైన్యాధిపతీ మనమే.
అందుకే జీవితంలో అసలు ప్రశ్న, మన మనసు అనే యుద్ధభూమిలో మనం సైనికులుగా మిగిలిపోతామా? సేనాధిపతులుగా మారతామా?
అసలు ఇటువంటి ఆలోచనలన్నీ నాకే వస్తాయా? అందరికీ అంతేనా?
ఈ అంతులేని, అంతూ పొంతూ లేని ఆలోచనలతో ఒక్కో రోజు నాకు నిద్ర కూడా పట్టదు.
—
నా పేరు సంహిత.
ఇరవై ఎనిమిదేళ్ళు. హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ లీడ్‌గా పనిచేస్తున్నాను.
ఆఫీసులో అందరూ నా గురించి, ‘సంహిత చాలా కాన్ఫిడెంట్!’ అని అనుకుంటుంటారు.
కానీ, వాళ్ళకు కనిపించే సంహిత మాత్రమే.
అద్దంలో నాకు కనిపించే నేను వేరే.
ఎందుకంటే, ఆఫీసులో నలభై మంది ముందు నిలబడి నేను కాన్ఫిడెంట్ గా ప్రెజెంటేషన్ ఇవ్వగలను. క్లయింట్లు అడిగే ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు చెప్పగలను. టీమ్‌లో సమస్య వస్తే నిర్ణయం తీసుకోగలను.
కానీ రాత్రి ఇంటికి వచ్చి బెడ్ మీద పడుకున్నాక నా మనసును మాత్రం నియంత్రించలేకపోయేదాన్ని.
‘ఈ రోజు మీటింగ్‌లో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందేమో!’
‘మేనేజర్ నా ప్రెజెంటేషన్ మధ్యలో ఎందుకు మొహం మార్చాడు?’
‘నాతో పాటు చేరిన కావ్యకు ప్రమోషన్ వచ్చింది. నాకు రాకపోతే?’
‘ఈ ప్రాజెక్ట్ ఫెయిలైతే?’
‘నా కెరీర్ ఇక్కడితో ఆగిపోతే?’
ఒక్క ఆలోచనతో ప్రారంభమయి, తలాతోకా లేని అనేక ఆలోచనలకు దారితీసి, నా మనసొక రణరంగంగా మారేది.
చివరకు ఏమీ జరగకముందే నా మనసు యుద్ధంలో నేను ఓడిపోయేదాన్ని.
మనసులో ఒక పక్క, అవన్నీ లాజిక్ లేని భయాలే అని తెలుస్తూనే ఉన్నా, ఆ ఆలోచనల పరంపర ఆగేది కాదు. నా ఆలోచనల వెల్లువకు జడిసి నిద్రాదేవి పారిపోయేది.
—
ఒక సోమవారం ఉదయం మా కంపెనీలో అత్యంత కీలకమైన మీటింగ్ జరిగింది, సింగపూర్‌కు చెందిన ఒక పెద్ద సంస్థ ప్రాజెక్ట్ గురించి.
దాదాపు ఏడాది పాటు కొనసాగే పని. ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు మా కంపెనీకి వస్తే మా టీమ్‌కు మాత్రమే కాదు, ఇండస్ట్రీలో మా కంపెనీకే పెద్ద బూస్ట్ లభిస్తుంది.
వారి టీముకు ప్రెజెంటేషన్ ఇచ్చే బాధ్యత నాదే.
మూడు వారాలు కష్టపడ్డాను. ప్రతీ స్లైడ్ నాకు కంఠస్థమే.
కానీ మీటింగ్‌కు అరగంట ముందు మా టీమ్‌లోని రోహిత్ నా దగ్గరకు వచ్చాడు.
“సంహిత! క్లయింట్ వాళ్ళ టెక్నికల్ హెడ్ చాలా టఫ్ అంట. చిన్న తప్పు కనిపించినా ప్రాజెక్ట్ ఇవ్వడట.”
అంతే!
అతను వెళ్ళిపోయాడు.
కానీ అతని మాట నా మనసులో ఉండిపోయింది. నాలోని ‘భయం’ అనే స్విచ్ ను ఆన్ చేసి వెళ్ళిపోయాడు.
‘చిన్న తప్పు కనిపించినా ప్రాజెక్ట్ ఇవ్వడు.’ అన్న మాటే నా భయం స్విచ్.
నా మెదడు వెంటనే పని ప్రారంభించి, ప్రశ్నలను సంధించడం మొదలు పెట్టింది.
‘ప్రెజెంటేషన్‌లో తప్పు జరిగితే? వాళ్ళ ప్రశ్నకు నేను సరైన సమాధానం చెప్పలేకపోతే? నా వల్ల కంపెనీ ప్రాజెక్ట్ కోల్పోతే?నా ఉద్యోగం? నా భవిష్యత్తు?’
ఆ ఆలోచనలతో నా మనసుకు బాగానే గాయాలయ్యాయి.
కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళేసరికి నా చేతులు చల్లబడిపోయాయి.
ప్రెజెంటేషన్ ప్రారంభించాను. మొదటి ఐదు నిమిషాలు బాగానే సాగింది.
అంతలో క్లయింట్ ఒక ప్రశ్న అడిగాడు. నాకు సమాధానం తెలుసు. కానీ నా మనసు అప్పటికే నాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంది కదా!
‘తప్పు చెప్పకు!’; ‘జాగ్రత్త!’
‘నీకు పూర్తిగా తెలియదు!’ అంటూ తప్పుడు సంకేతాలు పంపింది.
నేను తడబడ్డాను.
మా మేనేజర్ మధ్యలో కల్పించుకుని సమాధానం చెప్పాల్సి వచ్చింది.
అంతే!
ఆ తర్వాత ప్రెజెంటేషన్ నేను చేయలేదు. నా భయం చేసింది.
—
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నామీద నాకే విపరీతమైన కోపం వచ్చింది.
హ్యాండ్ బ్యాగ్ సోఫాలో విసిరేసి బాల్కనీలోకి వెళ్ళాను.
వర్షం పడేలా ఉంది. నల్లటి మేఘాలు నగరం మీదకు వచ్చి నిలబడ్డాయి. దూరంగా మెరుపు మెరిసింది.
నా ఫోన్ మోగింది.
అమ్మ.
లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేసింది. అప్పుడూ చేయలేదు. మూడోసారి చేసినప్పుడు విసుగ్గా లిఫ్ట్ చేసి,
“ఏంటమ్మా?” అని అరిచాను.
“ఏమైందే?” అంది అమ్మ ఆప్యాయంగా.
“ఏమీ కాలేదు.”
“ఏమీ కాకపోతే నీ గొంతు అలా ఎందుకుంది?”
అమ్మలకు అదొక విచిత్రమైన శక్తి. మన ముఖం కనిపించకపోయినా, మన మనసు కనిపిస్తుంది.
జరిగిందంతా చెప్పాను.
అమ్మ పెద్దగా ఓదార్చలేదు.
“నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. సమాధానం చెప్పు.”
“ఏంటి?”
“ఈ రోజు మీటింగ్‌లో నిన్ను ఓడించింది ఎవరు?”
నేను నవ్వాను.
“సింగపూర్ క్లయింట్.”
“కాదు.”
“మరి?”
“నువ్వే.”
ఆ మాటకు నా నవ్వు ఆగిపోయింది.
“నీకు సమాధానం తెలుసన్నావు. అయినా చెప్పలేకపోయావు. అంటే సమస్య నీ తెలివిలో లేదు. నీ మనసును ఎవరు నడిపించాలన్న విషయంలో ఉంది.”
నేను మాట్లాడలేదు.
“మనసు చెప్పిన ప్రతి మాటా నిజం కాదు సంహితా! అది కొన్నిసార్లు భయపెడుతుంది. అనుమానిస్తుంది. జరగనివి జరిగినట్టు చూపిస్తుంది. నువ్వు వాటన్నింటినీ ఆదేశాలుగా తీసుకుంటే సైనికురాలివి అవుతావు. ఏది వినాలో, ఏది పట్టించుకోకూడదో నువ్వే నిర్ణయిస్తే సేనాధిపతివి అవుతావు.”
ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా అమ్మ మాటలు నా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి.
—
ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు.
కానీ మొదటిసారిగా నా ఆలోచనలతో పోరాడలేదు.
వాటిని గమనించాను.
“ప్రాజెక్ట్ పోతుంది.”
ఒక ఆలోచన.
“ఉద్యోగం పోతుంది.”
రెండో ఆలోచన.
“నీ కెరీర్ అయిపోయింది.”
మూడో ఆలోచన.
అప్పుడు నాకు నవ్వొచ్చింది.
ఒక మీటింగ్ సరిగా జరగలేదు.
నా మనసు అప్పటికే నన్ను నిరుద్యోగిని చేసి రోడ్డుమీద నిలబెట్టేసింది!
లేచి టేబుల్ దగ్గర కూర్చున్నాను.
ఒక నోట్‌బుక్ తీసుకున్నాను.
మొదటి పేజీలో రెండు కాలమ్స్ గీసాను.
ఒకవైపు—
నా మనసు చెబుతున్నది.
మరోవైపు—
నిజంగా జరిగింది.
“ప్రెజెంటేషన్ మొత్తం పాడైంది.”
నిజం?
ఒక ప్రశ్న దగ్గర మాత్రమే తడబడ్డాను.
“మేనేజర్‌కు నామీద నమ్మకం పోయింది.”
నిజం?
ఆయన అలాంటి మాట ఏదీ చెప్పలేదు.
“ప్రాజెక్ట్ పోయింది.”
నిజం?
క్లయింట్ ఇంకా నిర్ణయమే తీసుకోలేదు.
“నా కెరీర్ దెబ్బతింది.”
నిజం?
ఒక మీటింగ్‌తో ఎవరి కెరీరూ ముగిసిపోదు.
అప్పుడు అర్థమైంది.
నా సమస్యలు నన్ను బాధించడం లేదు. సమస్యల గురించి నేను ఊహించుకుంటున్న ఆలోచనలు నన్ను బాధిస్తున్నాయి.
…
మరుసటి రోజు ఆఫీసుకు వెళ్ళాను.
మేనేజర్ నన్ను పిలిచాడు.
“నిన్న ఏమైంది సంహితా?” అని అనునయంగా అడిగాడు.
ఇంతకుముందైతే ఏదో కారణం చెప్పేదాన్ని. కానీ,
ఈసారి మాత్రం అలా చెప్పలేదు.
“భయపడ్డాను సర్!”
ఆయన ఆశ్చర్యంగా చూసాడు.
“ఎందుకు?”
“తప్పు చేస్తానేమోనని భయపడి, నిజంగానే తప్పు చేసాను.”
ఆయన నవ్వాడు.
“గుడ్.”
నేను ఆశ్చర్యపోయాను.
“ఏంటి సర్?”
“నీ తప్పు ఏమిటో నీకు తెలిసింది. ఇప్పుడు దాన్ని సరిచేయగలవు.”
అప్పుడే ఆయన మరో విషయం చెప్పాడు.
“క్లయింట్ రేపు మరో టెక్నికల్ సెషన్ కావాలన్నాడు. ఈసారి కూడా నువ్వే చేస్తావు.”
నా మనసు వెంటనే అరిచింది.
వద్దు!
నేను మనసులోనే దానికి సమాధానం చెప్పాను.
నిర్ణయం నీది కాదు. నాది.
“తప్పకుండా సర్!” అన్నాను.
‘ఇతని గురించా నేను చెడుగా ఊహించుకుంది?’ అని అనుకుని బయటకు నడిచాను గర్వంగా.
—
ఆ రాత్రి ప్రెజెంటేషన్ కోసం సిద్ధమవుతుంటే మళ్ళీ భయం వచ్చింది.
నేను దాన్ని తరిమేయడానికి ప్రయత్నించలేదు.
భయాన్ని ఉండనిచ్చాను.
“రేపు మళ్ళీ తడబడితే?”
నా మనసు అడిగింది.
“అప్పుడు సమాధానం సరి చేసుకుంటాను.”
“క్లయింట్ నవ్వితే?”
“నవ్వనివ్వు.”
“ప్రాజెక్ట్ రాకపోతే?”
“తర్వాతి ప్రాజెక్ట్ కోసం ప్రయత్నిస్తాను.”
ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పాను.
కొంతసేపటికి నా మనసు చల్లబడింది. దాని పప్పులు నా దగ్గర ఉడకలేదు. ఆ ఆలోచనకే నవ్వొచ్చింది. నేను నా మనసును పరాయి వ్యక్తిలా భావించి ‘దాని పప్పులు ఉడకలేదు’ అని అనుకున్నాను.
అప్పుడు నాకు మరో విషయం అర్థమైంది.
భయాన్ని జయించడానికి ధైర్యం అవసరం లేదు. భయం చెప్పిన మాట వినకుండా ముందుకు నడవడమే ధైర్యం.
…
మరుసటి రోజు కాన్ఫరెన్స్ హాల్లో నిలబడ్డాను.
అదే క్లయింట్.
అదే స్క్రీన్.
అదే నేను.
కానీ ఒక చిన్న తేడా ఉంది.
మొన్న నా మనసు నన్ను నడిపించింది.
ఈ రోజు నా మనసును నేను నడిపిస్తున్నాను.
ప్రెజెంటేషన్ మధ్యలో క్లయింట్ టెక్నికల్ హెడ్ ఒక క్లిష్టమైన ప్రశ్న అడిగాడు.
ఒక్క క్షణం గుండె వేగంగా కొట్టుకుంది.
“నీకు తెలియదు!”
మనసు చెప్పింది.
నేను చిరునవ్వు నవ్వి,
“ఒక్క నిమిషం సర్! మీ ప్రశ్నను రెండు భాగాలుగా విభజించి సమాధానం చెబుతాను.”
బోర్డు దగ్గరకు వెళ్ళాను.
వివరించాను. అతను మరో ప్రశ్న అడిగాడు.
దానికీ సమాధానం చెప్పాను. చివరికి అతను తల ఊపుతూ,
“That’s exactly what I wanted to know.”
అన్నాడు.
ఆ మాట వినగానే నాకు ప్రాజెక్ట్ వస్తుందా లేదా అన్న ఆలోచన రాలేదు.
ఎందుకంటే అప్పటికే నేను మరో పెద్ద ప్రాజెక్ట్ గెలిచాను. అది,
*నన్ను నేను*
—
రెండు రోజుల తర్వాత ప్రాజెక్ట్ మాకే వచ్చిందని తెలిసింది.
ఆఫీసులో అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు.
రోహిత్ నా దగ్గరకు వచ్చాడు.
“సంహితా! అసలు భయమే లేకుండా ఎలా ప్రజెంట్ చేసావ్?”
నేను ‘మొదటిసారి నీ పుణ్యమే నాయనా! అనవసరంగా నాలో భయాన్ని చొప్పించి చెడగొట్టావ్’ అని మనసులోనే అనుకుని,
నవ్వుతూ,
“భయం ఉంది.”
“మరి?”
“కానీ, దానికి ఈ సారి నిర్ణయాధికారం ఇవ్వలేదు.”
అతనికి అర్థం కానట్టు బుర్ర గోక్కున్నాడు.
‘ఇంకా బాగా గోక్కో!’ అని అక్కడి నుంచి వచ్చేసాను.
—
కొన్ని నెలల తర్వాత మా కంపెనీలో కొత్తగా చేరిన అమ్మాయి ఒక రోజు నా దగ్గరకు వచ్చింది.
ఆమె పేరు మానస.
“మేడమ్! మీతో మాట్లాడాలి.”
“చెప్పు.”
“నాకు ఎప్పుడూ భయమే. నేను చేసే పని తప్పవుతుందేమో, అందరూ నాకంటే తెలివైనవాళ్ళేమో, ఈ ఉద్యోగానికి నేను సరిపోనేమో అనిపిస్తుంటుంది.” అని అన్నది.
ఆమె మాటలు వింటుంటే కొన్ని నెలల క్రితం నన్ను నేను చూస్తున్నట్టు అనిపించింది. నేను నవ్వి,
నా డ్రాయర్ తెరిచి పాత నోట్‌బుక్ బయటకు తీసాను.
మొదటి పేజీలో రెండు కాలమ్స్ ఇంకా అలాగే ఉన్నాయి.
నా మనసు చెబుతున్నది.
నిజంగా జరిగింది.
ఆమెకు చూపించాను.
“మానసా! నీ మనసులో యుద్ధం జరగడం సమస్య కాదు. ప్రతి మనిషి మనసులోనూ జరుగుతుంది. సమస్య ఏమిటంటే ఆ యుద్ధంలో నీ పాత్ర ఏమిటన్నది.”
ఆమె నా వైపు చూసింది.
“అంటే?”
“ప్రతి భయానికీ సెల్యూట్ చేస్తూ అది చెప్పినట్టు చేసే సైనికురాలివా? లేక ఏ ఆలోచనతో ముందుకు వెళ్ళాలో, ఏ ఆలోచనను వెంటనే తుంచేసి, అక్కడే ఆగిపోవాలో నిర్ణయించే సేనాధిపతివా?” అని అన్నాను.
ఆ టైములో నన్ను నేను, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి గీత బోధించిన ఓ బుల్లి శ్రీ కృష్ణుడి పాత్రలో ఊహించుకున్నాను.
ఆమె కళ్ళలో చిన్న మెరుపు కనిపించింది.
—
ఇప్పుడు కూడా నాకు భయాలు కలుగుతాయి.
ఇప్పుడు కూడా కొన్నిసార్లు నిద్రపోయే ముందు నా మనసు లేనిపోని కథలు చెబుతుంది.
“రేపు ఏదైనా తప్పు జరిగితే?”
“ఎవరైనా నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటే?”
“నువ్వు అనుకున్నది జరగకపోతే?”
నేను వాటితో యుద్ధం చేయను.
ప్రశాంతంగా, నవ్వుకుంటూ వింటాను.
ఆ తర్వాత నాలో నేనే ఒక మాట చెప్పుకుంటాను.
“మీ అభిప్రాయాలు విన్నాను. నిర్ణయం నేను తీసుకుంటాను.”
ఎందుకంటే నా మనసు యుద్ధభూమి కావచ్చు.
కానీ దాని మీద అధికారం భయానిది కాదు.
అనుమానానిది కాదు.
గతంలో జరిగిన అపజయాలది కాదు.
ఇతరుల అభిప్రాయాలది అంతకన్నా కాదు.
ఆ అధికారం నాది.
మనసులో పుట్టే ప్రతి ఆలోచనను నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతి భయానికి లొంగాల్సిన అవసరం లేదు. ప్రతి అనుమానంతో వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు.
మనసు యుద్ధభూమి అయినప్పుడు—
అందులో సైనికుడిగా మిగిలిపోకూడదు.
సేనాధిపతిగా నిలబడాలి.
ఆ రోజు నుంచి నా జీవితంలో యుద్ధాలు ఆగిపోలేదు.
కానీ ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది.
ఇప్పుడు నా మనసు యుద్ధం ప్రకటించవచ్చు…
కానీ యుద్ధం ఎలా జరగాలో నిర్ణయించేది నేనే!
ఎందుకంటే అది నా యుద్ధభూమి. నా మాటే శాసనం. ఆ శాసనాన్ని నా మనసు శిరసావహించవలసిందే!
…

ప్రభాకర్ జైని
డా. ప్రభాకర్ జైనీ.రిటైర్డ్ అసిస్టెంట్ కమీషనర్ (కమర్షియల్ టాక్సెస్). 46 నవలలు +కథలి+కవితా సంపుటాలు; 6 సినిమాలు; 300 షార్ట్ ఫిల్మ్స్; సినీవాలి ఆన్లైన్ వారపత్రిక చీఫ్ ఎడిటర్. మా జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన సాహిత్య సభలకు ఒక ప్రత్యేకత ఉంది. మా కార్యక్రమాలన్నీ, ప్రతీ చిన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని అంగరంగ వైభోగంగా, ఫ్యామిలీ ఫంక్షన్ లా, మా అందరు కుటుంబ సభ్యులం పాల్గొని నిర్వహిస్తామని సాహితీ వర్గాలలో ఒక ప్రచారం ఉంది. నాకు సాహిత్య సభలను ఘనంగా, అంగరంగ వైభోగంగా అవార్డు గ్రహీతలను ఆనందపరిచే విధంగా, నిర్వహించడం ఇష్టం.
