కిరాణాకొట్టుగుమస్తా

Spread the love

బుర్రకథ నేర్చుకుందానుకున్నా, అదీ పడలేదు. ఏడనన్న హార్మోనీయం నేర్చుకుందామనుకున్నా, అదీ పడలేదు. ఏందో- అట్ల అయిపోయింది. తీరిక ఉన్నట్లు ఎప్పుడూ లేదు. చుట్టూతా ఆకలి. ఎటుచూసినా ఆకలి. ఒక కవితల ‘ఆకలి నాకు పరోక్ష గురువు’అని రాసుకున్నాను. ఎప్పుడూ అమ్మా అబ్బా కష్టపడుతున్నా, కొట్టు నడుపుతున్నా, ఎవుసాయం చేస్తున్నా, చిల్లర మల్లర పన్లు చేస్తున్న అదేందో ఎప్పుడూ కటకట. దరిందరాగీ. ఆయమన్నట్టు తిన్నది లేదు. 

జొన్నన్నం. గోంగూర తొక్కు, మామిడికాయ పచ్చడి, రోట్ల నూరిన తొక్కు, పప్పుచారు, ఎల్లిపాయ కారం, పచ్చిమిరపకాయతొక్కు, లేదూ..ఊళ్లకు పోయి అలవలకు పాకిన చిక్కుడుకాయలో, ఆనపకాయలో, కాకరకాయలో, బచ్చలికూరో, దొండ కాయలో, బుగ్గఒడ్డు చెట్లకు పాకిన తీగెలకు బుడ్డ కాకరకాయలో కూర. ఇందుల ఏదో ఒకటి. పంట పండింది, కౌళ్లకో, పాళ్లకో, ఖర్చులకో, జీతగాళ్ళకోపోను ఏం మిగిలిందంటే నాలుగైదు బస్తాల గింజలు, కొన్ని గడ్డిమోపులు, కందికట్టె, జొన్నరొట్ట, జనపకట్టలు.. ఎటెల్ల్లుతది ఇల్లు, తిండికి ఎట్ట సరిపోతది. 

పిలగాళ్ళం అందరం కూడ పన్లు అందుకుంటున్నా, మధ్యల మధ్యల అమ్మ కూలినాలికి జొన్నకోయడానికో, కందికోయడానికో,మిర్చి ఏరడానికో ఎళ్తున్నా ,అప్పుడప్పుడు తునికాకుకు పోతున్నా ఎటమెటంగానే ఉండేది. గందుకే ఇంట్ల ఎప్పుడూ గొడవలు, కొట్లాటలు, తన్నులు, అరుపులు.

ఎండాకాలం వస్తే, మా ఖతీజ పెద్దమ్మ (ఖాల) పిల్లలు ఇద్దరు కారేపల్లి కిరాణం దుకణంలల్ల పనిచేసేటోళ్లు. ఎండాకాలాలు ఐస్ క్రేట్ లు ఊళ్ళల్ల తిరిగి అమ్మేటోల్లు. 

మాయింట్ల గూడ పిలగాండ్లకు తప్పలే. అన్న కూడా షురూ అయ్యిండు. ఆయనెంట నేను గూడ. 

రాత్రి ఇల్లందు రైలెక్కి పోవాలె. రాత్రి ఐస్ క్రేట్ కంపెనీ ముందు పండుకోవాలె. పొద్దుగాల నాలుగింటికి డబ్బాల్ల ఐస్ క్రేట్ లు ఏసుకోవాలె. మళ్ళి రైలెక్కాలే. కారేపల్లిల దిగాలె. కొన్నేళ్ళు డోర్నకల్ నుంచి కూడా తెచ్చేటోళ్లం. మా అన్నది పెద్దడబ్బా. సైకిల్ కి కట్టుకుని రేగులగూడెం వైపుకి, మా పెద్దమ్మ పిల్లలు ఒకరు గాదెపాడు, ఒకరు గేట్ కారేపల్లి వైపుకి పోయేటోళ్లు. నాది భుజానికి తగిలించుకునే చిన్న డబ్బా.  నేను కారేపల్లిల అమ్ముకుంట తిరిగేటోడ్ని.  మా మేనమామ షుకూర్ మియా  సోడాలు అమ్మేటోడు. ఆయన సోడాబండి  నెట్టుకుంట కన్పించేటోడు. మా అత్త కూరగాయలు అమ్ముకుంట కన్పించేది. నాతోటి చిన్నబడిల చదువుకుంటున్న దోస్తులు కన్పించేటోళ్లు. కొందరు దగ్గరికొచ్చేటోళ్లు. కొందరు దూరంగా నిలబడి వింతగ చూసేటోళ్లు. 

గవన్ని పట్టించుకుంటే ఎట్ల.? అమ్మితినే డబ్బులొస్తయ్. తిండికి ఎల్తది. ఎంతోకొంత  ఏదో నా మందం నేను చేస్తున్న అనుకుంట తిరిగేటోడ్ని. స్కూలుల మంచిగ చదువుకునే పిలగాడినని పేరుందికదా, నన్ను సార్లు చూసినా, మా క్లాసు అమ్మాయిలు చూసినా వాళ్లు ఏం అనుకునేవాళ్ళు కాదు, మంచిగనే మాట్లాడేవాళ్ళు. క్లాసుల పాటలు పాడేటోడ్ని కదా – అందుకని !

ఎండల కాళ్లు కాలతాంటే కష్టమే. కానీ సాయంత్రం లోపల అమ్మాలె. కరిగిపోతయ్, అప్పుడప్పుడు కరిగిపోయేడివి కూడా. లుక్సాన్ అయ్యేది. మా అన్న కొట్టే దెబ్బలు తినేటోడ్ని.  అట్ల అమ్ముకుంట ఇంటిముందుకుపోయి ఐస్ క్రేట్ అని రెండుమూడుసార్లు అరిచేటోడ్ని. ఇండ్ల పిలగాళ్ళు వాళ్ళ అమ్మా నాయినల దగ్గర పోరి పైసలు తీస్కొని ఉరుక్కుంటావచ్చి, కొనేటోళ్లు. కొందరు “మా ఇంటిముందట వచ్చి అరవకు” అని గద్దిచ్చేటోళ్లు. 

అట్లనే కె.ఎల్. గారి ఇంటిముందుకు పోయికూడా అరిచేటోడ్ని. అప్పట్ల కె.ఎల్. గారి కూతురు సుధక్క ఎండాకాలం పిల్లలతో వస్తే, ఆ పిల్లలకోసం కొనేటోళ్లు. అట్లనే దుర్గమ్మ గారు తెలిసింది. నువ్వెవ్వరివి అని అడిగింది. తెలుసుకుని, పక్కన ఎవరో  ‘ఈ పిలగాడు పాటలు కూడా పాడతాడు’ అంటే, ”ఒక పాట పాడరా” అని పాడిచ్చుకునేది. అప్పుడప్పుడు ఇంట్లకు పిలిచి కూచోబెట్టుకుని అన్నం కూడా పెట్టేది. వాళ్ళ అబ్బాయిలు కొండపల్లి ఉత్తమ్ కుమార్, పావన్ గారు కన్పిస్తుండేవాళ్ళు. ఉత్తమ్ సార్ నేను ఏడవ తరగతి తర్వాత మా క్లాసుకు వచ్చి సోషల్ కూడా చెప్పిండు.

ఐదారు తరగతులకు వచ్చిందాక ఇట్లనే నడిచింది. చిన్నతనం ఏది కష్టమో, ఏది సుఖమో తెలియకుండా జారిపోయింది. ఉండటం, లేకపోవడం అంటే ఏమిటో అర్థం కాకుండానే వెళ్ళిపోయింది. 

కొంచెం పెరుగుతుంటే ఐస్ క్రేట్ అమ్మడం నుంచి కిరాణా కొట్టుల్ల పనిచేయడం వంటి పనుల్లోకి పెరిగిన. కొన్నాళ్ళు ఎర్ర కృష్ణమూర్తి కొట్టు, ఆ తర్వాత మొరిశెట్టి లక్ష్మయ్య గారి కొట్లో పనిచేసిన. ఎర్ర కృష్ణమూర్తి ఎర్ర పుల్లయ్య గారి కొడుకు. రెండుమూడు సార్లు చెంపమీద కొట్టిండు కూడా. సరిగ్గ పన్జేయలేదని. కొట్టినా మంచిగనే చూసుకునేటోడు. ఆ తర్వాత మొరిశెట్టి లక్ష్మయ్య కొట్టుల. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఆయనది. పొట్టిగూడెం. ఆ పొట్టిగూడెం ఊరోళ్ళు రజాకార్ల కాలంల అక్కడ్నుంచి లేచిపోయి కొందరు కారేపల్లిల, కొందరు పేరేపల్లిల ఇళ్ళు కట్టుకున్నరు. మా అమ్మమ్మ అంటే ,ఆమె కష్టం చేసిన తీరు అన్నా ఆయనకు గౌరవం. అట్ల మమ్మల్ని మంచిగ చూసుకునేటోడు. 

అట్ల పొట్టిగూడెం నుంచి కారేపల్లి వచ్చింది ఆయుర్వేద డాక్టర్ లక్ష్మీనారాయణ కూడా.

లక్ష్మయ్య గారిని తాత అని పిలిచేటోళ్లం. ఆయన కొడుకు శంకర్ నారాయణ నన్ను ఇష్టంగా చూసేటోడు చదువుకుంటున్ననని. శంకర్ మామ అని పిల్చుడు అప్పట్నుంచే. స్కూలుల పాటల పోటీలప్పుడు నేను ఒకసారి పాట పాడంగ విన్నడు. మంచిగ పాడిన్నని కొట్టుకు వచ్చేటోళ్లకు, దోస్తులకు చెప్పేటోడు.

~

ఈ బాల్యాన్ని ఎప్పుడో ఓసారి కవిత్వంలోకి ఒంపే ప్రయత్నం  చేసిన. అటువంటిది ఈ కవితకూడా !

#రెక్కలగుర్రాన్నెక్కి 

*

రైలుపట్టాల నడుమ పారేసుకున్న బాల్యాన్ని
బాల్యం సరిహద్దులు దాటి కంకరరాళ్లమీద
నలుగుతూ
పరుగెత్తిన యవ్వనాన్ని చూసి, ‘పదహారో నంబరు’మైలురాయి
ముసిముసిగా నవ్వుకుంటూ మసకచీకట్లో కలిసిపోయింది.
మోదుగాకురసాన్ని కమ్మగా మింగి
పొలంగట్టుమీద బురద కాళ్ళనీడ్చుకుంటూ
బొటనవేలుదెబ్బను పట్టించుకోని రోజున చద్దిమూటే సంతోషాన్నిచ్చింది.
గూడ్సుబండి ఎక్కినా, వంతెనకింద నక్కినా
గుండెదిటవు మీద పసితనమే నమ్మకంగా మారిపోయింది.
ఎర్రనీళ్ళవాగు రోజంతా ఈతలా పరుగులు పెట్టినప్పుడు
మామిడిచెట్టే ముచ్చటేసి కాయల్ని కోసిచ్చింది.
మంచెమీద కూసోని పిట్టకావిలి కాసినా
జొన్నచేలో పరిగేరుకున్నా
కడుపులో చల్ల మాత్రం నిద్రనే మోసుకొచ్చేది.
ఊరు పండుగలా సందడి పడుతున్నప్పుడు
ఊపిరి తెలియనినిద్ర కంటిమీంచి పిట్టలా ఎగిరిపోయేది.
రాత్రి రాత్రంతా తిరునాళ్ళగా మారినప్పుడు
మనసు రబ్బరు బూరలా పొంగిపోయేది.
బీడులో గొడ్లు తోలి, కందిచెట్ల మీదికి ప్రాణం లేచిపోయేది.
చిరిగిన పుస్తకం మీదికి తుమ్మచెట్టు కొమ్మే వాలిపోయేది.
ఒకటేమిటి –
తుమ్మెద రెక్కలు విప్పుకుని పిన్నీసులా మట్టికడుపులోకి దూరిపోయేది.
తాటాకుచక్రం తిరిగితిరిగి అలిసిపోయి చెట్టుకిందకు పారిపోయేది.
పసిపాదాల మీద బతుకుభారాన్ని మోసి
తప్పటడుగులమీద తలకు మించిన అనుభవాన్ని చూసి
రోజంతా వాడిన చెమటపువ్వు మగతగా నులకమంచం మీద గుర్రుపెట్టేది.
అమ్మఒడిలో గంజితాగి, అమృతం కోసం కలలోకి జారి
తెల్లగుర్రాన్నెక్కి మేఘాలమీద స్వారీ చేస్తున్నట్టు మాత్రం గుర్తు.
మబ్బుల దీగూట్లో దాపెట్టిన రత్నాల ఉంగరం కోసం
నా బంగారు కత్తితోటి గుడ్లగూబదయ్యంతో
యుద్ధం చేయడం నాకింకా గుర్తే …!?

13.11.1989.

(ప్రవహించే జ్ఞాపకం కవితాసంపుటి నుంచి)

Kavi Yakoob

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *