ఇరవైకుంటల పొలం

Spread the love

మా అబ్బ'(నాన్న) బేరం ఊళ్లెంబడి తిరుక్కుంటా కావిడి మోసుకుంటా అలిసిపోయేటోడు. గూడలు పడిపోతున్నయ్’ అని నొప్పుల్తో బాధపడేటోడు. నెత్తిమీద తట్టలు, మూటలు మోసిమోసీ వొత్తుజుట్టు పలచబడ్డది. ఇంటికొచ్చినంక కాళ్ళు నొక్కిచ్చుకునేటోడు. మాలో ఒకళ్లను కాళ్ళమీదకు ఎక్కి తొక్కమనేవాడు. పిక్కలు వడితిరిగి (cramps)గిలగిల్లాడేటోడు . కాలిపిక్కలకు జనపతాడు గట్టిగ చుట్టి కట్టి, దానిమీద నీళ్లుబోసేటోడు. అట్ల చేస్తే తాడు బిర్రుగ బిగుస్తదని. నొప్పి తగ్గుతదని ! ఇంకా నిమ్మలం కోసం, నిద్రపోవుడు కోసం సాయంత్రం అయితే ఇంత సార బొట్టో, కల్లు బొట్టో తాగి నిద్రబోయేటోడు. 

అపుడపుడు కూనిరాగం తీసేటోడు. కోపం ఎక్కువే దయ ఎక్కువే. పిలగాండ్లని దగ్గరకూసోపెట్టుకుని చిన్నప్పటి ముచ్చట్లు చెప్పేటోడు. పుట్టిన ఊరు మానుకోట దగ్గర చినగూడూరు, వాళ్ళ అమ్మ, నాయిన, అన్నదమ్ములు, పొట్టచేతబట్టుకుని బెజవాడ కూళ్ళు చేయడానికి వెళ్లడం, రైలు ఎక్కడానికి డబ్బుల్లేక మానుకోటనుండి బెజవాడ దాకా రైలుకట్టేంబడి నడుసుకుంటూ వెళ్లడం, అక్క విషయాలు, పక్కూర్లు ఉగ్గంపల్లి, జయ్యారం, మధ్యలో వాగు, పీర్లు, పీర్ల కొట్టం, పీర్లను ఊరేగించిన సంగతులు, దట్టీలు కట్టిన పద్ధతులు, దొరవారి సాయం, గొల్లోండ్లతో దగ్గరితనం, వేరే ఊరివాళ్ళ పీరీల ఊరేగింపు- వాళ్లకు వీళ్లకు మధ్యన మాటామాటా పెరిగిన సంగతులు విడమర్చి చెప్పేటోడు. ఆయన చెబుతుంటే  స్క్రీన్ ప్లే.లాగా దృశ్యాలు కళ్ళముందు మెదిలేవి.

తన అక్క కూతురితోనే మొదటి పెళ్లి ,ఆ తర్వాత అది తెగిపోయిన సంగతి, అందుకు కారణాలు , ఆ తర్వాత మా అమ్మతో పెళ్లి, తానెట్లా కారేపల్లి వచ్చిందీ ,మా తాత కరీంసాబ్ తో పరిచయం – ఆయన గుర్రం మీద ఎక్కి ఊర్లన్నీ తిరుక్కుంట ఆవులు,ఎడ్లు, మేకలు, గొర్లు కొనడం, అమ్మడం బేపారం, అంతేకాదు, తోళ్లు కొనడం ఇంకా గొడ్లుకోసి అమ్మే పనులు చేసేటోడు. కారేపల్లి చుట్టుపక్కల రెండు మూడు గుర్రాలు ఉన్నది మా తాత దగ్గరే ! -ఇవన్నీ మా అబ్బ మాటల్లో దొర్లేవి.

చిన గూడూరులో మడిపెల్లి వెంకయ్య షావుకారు దగ్గర జీతం ఉన్న రోజులు, గొడ్లు కాసిన వైనాలు, ధాన్యం కొలిచి గుమ్ముల్లో, గదుల్లో, బోషాణాల్లో నిలువచేసి వాటిని కాపాడిన పద్ధతులు, తాను మొదట అరకకట్టి దున్నిన సంగతి, ఏట పెట్టే తీరు, తాళ్ళు పేనడం, మోకులు చేసే పద్ధతులు, నాగలి, గొర్రు, గుంటక – ఇలా వ్యవసాయం, వాటికి అనుబంధంగా ఉన్న అన్ని విషయాలు తన బతుకు అనుభవంలోంచి చెప్పేటోడు. 

తాడు ముడులు – ఏయే తీర్లలో ఎన్నెన్ని పద్ధతుల్లో ఏస్తరో అన్ని ఆయనకు తెలుసు. అవన్నీ ఎవురైనా అడిగితే చాలు, వేసి చూపడం, వాళ్ళతో వేయించి వాళ్లకు వచ్చేదాకా ఓపిగ్గా మళ్లీ మళ్లీ వేయించేవాడు. వ్యవసాయం చిన్నప్పటినుంచి చేసినోడాయే. ఇష్టంగా అందరికీ ఆ పనుల్లో సాయం చేసేటోడు.

వ్యవసాయం అంత తేలిక కాదు. ఎప్పుడు వర్షాలు పడతయి, ఎప్పుడు జల్లులు పడతయి, ఎప్పుడు నేల అదునుకొస్తది, ఎప్పుడు అరక కట్టాలె, ఎప్పుడు మట్టి పెడ్డలు లేస్తయి, మట్టి ఎప్పుడు మెత్త పడతది, నాగలి, గొర్రు, గుంటక ఎప్పుడెప్పుడు కట్టి దున్నాలే- ఇదంతా రైతుకు మాత్రమే తెలుసు. మా అబ్బా దీంట్లో మొనగాడు. అందరూ అడిగేటోళ్లు. సాలు సాలుకు ఎంత ఎడం ఉండాలి, కొండ్ర పెట్టేటప్పుడు ఎట్ల పెట్టాలె ఆయనకు తెలుసు. పెంట చేనుకు ఎప్పుడు తోలాలో, జల్లు పడ్డాక పెంటను చేనుమొత్తం పారల్తో ఎట్టా జిమ్మాల్నో తెలుసు.

దుక్కులు దున్నడం అయ్యాక, విత్తనం పెట్టడానికి ముందు అదును వచ్చిందన్నాక జడ్డిగం గొర్రుకు కట్టి గింజలు వేసే పద్ధతులు , సాళ్లలో గింజలు చల్లుకుంటాపోయే పద్ధతులు – ఇలా మా అబ్బ రొట్టమాకురేవు చుట్టుపక్కల మంచి ఎగుసాయం విషయాల్లో పేరు తెచ్చుకుండు. 

ఇంత తెలిసినోడు ఎవుసాయానికి దూరంగా చిన్నప్పుడు జీతం ఉండుకుంట చేసిన ఎవుసాయం తర్వాత , పొట్టతిప్పల కోసం చింతపండు, ఎండుమిరపకాయలు ఊరూరా అమ్ముకుంటా ఊరూరు తిరగడం కొన్నాళ్ళు, తాపీ పని చేసుకుంట కొన్నాళ్ళు, ఆ తర్వాత రొట్టమాకురేవు చేరినంక చేస్తున్న బేరం వీటిలోనే ఉండిపోయిండు. ఎవుసాయం వైపుకే ఆయన మనసు మొగ్గుచూపెడిది. చివరికి,బేరం చేయడానికి ఊళ్ళు తిరగడం మానేసి, కొన్నాళ్ళకు పేరేపల్లి చెరువుకింద ఇరవై గుంటల పొలం ఏడాదికి ఇంతిస్తనని శంకర్రావు దొరదగ్గర  కొన్నడు, అది కూడా టైలర్ జమాల్ సాబ్ బలవంతంమీద.

ఆ ఇరవై గుంటల పొలం చిన్న చిన్న మళ్లు. ఆ చిన్న మడులను పెద్ద పెద్ద బందాలుగా మార్చడానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. మా పిలగాండ్లను వెంటేసుకుని, గడ్డలు తవ్వి దుగాలు పోసి దాన్నొక మొనగాడు పొలంగా మార్చిండు. రెండరకలు కట్టిండు. ఒక జీతగాడిని పెట్టుకుండు. మొదట పెట్టుకుంది నెల్లబోయిన సర్వయ్యను. అలా వ్యవసాయంలోకి దిగిండు. దానికితోడు విఠల్ బాబు చేను కౌలుకు పట్టిండు. చంద నారాయణ పొలం కొంత. ఇట్ల రెండరకలు చేసేంత ఎవుసాయం మొదలైంది. ఎక్కడ ఎగసాయం చేసినా బంగారంలా పంటలు పండినయ్. అట్లా రైతయ్యిండు మా అబ్బా !

Kavi Yakoob

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *