ఇల్లందు వైపునుంచి ,అటువైపు ఉన్న అడవుల్లోంచి (ఇప్పుడు అడవులు?), గుట్టల్లోంచి వస్తుందది. ఎండాకాలం మాత్రం పారదు. మడుగులు మడుగులుగా అక్కడక్కడా నిలిచి ఉంటుంది. దాన్ని చూడాలంటే వర్షాకాలమే చూడాలి. బుగ్గొచ్చిందంటే ఒకటే సందడి. కట్టెలు కొట్టుకొస్తుంటాయి. వాటిని తీయడానికి ఊళ్ళోని చిన్నోళ్ళు, పెద్దోళ్ళు వాగులోకి దూకడం- మొద్దులు, దూలాలు, పొయ్యిల కట్టెలు -ఒడ్డుకి లాక్కురావడం, ఒక దగ్గర అద్దలు పెట్టడం. ఇదే పని.! అపుడపుడూ గొడ్లు,బర్రెలు, మేకలు చచ్చిపోయినవి కూడా కొట్టుకుపోతూ కన్పించేవి.
చాయ్ లాగా ముదురు ఎరుపులో ఉండేవి నీళ్ళు.అక్కడక్కడ సుడులు తిరుగుతూ ఒడ్లను వొరుసుకుంటూ పారేది బుగ్గవాగు. చూస్త చూస్తనే పెరిగేది. ఊళ్లదాక వచ్చేవి నీళ్ళు. నీళ్ళలో కొట్టుకుపోతున్న పాముల ముట్టెలు పైకి కన్పించేవి. వాగులోకి బయటినుంచి ఉన్న ఒర్రెలు, వాగు నిండిన రోజుల్లో నీళ్ళు ఒర్రెలవైపుకు ఎదురు తన్నేవి. ఈ రోజుల్లోనే కొత్త నీళ్ళకు చేపలు ఎదురెక్కేవి. వాగు గుంజినాక, తరవాత వాగును చూస్తే అక్కడక్కడా కట్టెలు చెట్ల పొదలకు చిక్కుకుని ఉండేవి. ఊళ్ళో జనమంతా బుగ్గ వాగు వెంబడే తిరుక్కుంట, కట్టెపుల్లల్ని ఏరుకుంటూ తిరుగుతుండే వాళ్ళు. ఎన్ని కట్టెలు దొరికితే ఆ సంవత్సరానికి పొయ్యిలకట్టెలు అన్ని జమ అయినట్లు.
ఇంకొందరేమో, ఒర్రెలల్ల ‘మావులు’ పెట్టేటోళ్ళు. మా ఊరిల ‘మావు’లు ఆరెం ముత్తయ్య, నెల్లెబోయిన పగిడయ్య దగ్గర ఉండేవి. మిగతా వాళ్ళేమో పంచెలు, చీరెలనే రెండు చేతులతో చెరో వైపు పట్టుకుని నీళ్ళలో దొన్నెలాగా వేసి, పట్టుకునే వాళ్ళు. పైనుంచి ఒక మనిషి నీళ్ళలో దిగి చప్పుడు చేసుకుంట, నీళ్ళను కల్లి కొంటుకుంటూ ఈ దొన్నెలవైపు చేపల్ని మళ్ళించేటోడు. అలా ఒక్కసారే ఆ దొన్నెను పైకెత్తితే , అందులో అప్పుడు చూడాలి – ఎగురుకుంటూ కొర్ర మట్టలు, చందమామ చేపలు, ఉల్లేసులు, బుడ్డ పరకలు, పాము చేపలు, బొమ్మిడీలు, రొయ్యలు, ఎండ్రకాయలు – ఇలా ఒకటేమిటి! చేపల ప్రపంచం అంతా అక్కడే కన్పించేది. ఎప్పుడో గాని పెద్ద పెద్ద చేపలు పడేవి కావు. అన్నీ ఒక మోస్తరు చేపలే !
ఆ రోజంతా పొద్దు దిగేదాకా వాగులో,ఒర్రెల్లో తిరిగి చేపలు పట్టుకుని ఇళ్ళకు చేరుకున్నాక, కొందరేమో తెచ్చిన చేపల్ని బండలమీద తోమి,ఎండేసుకునేవాళ్ళు. కొందరేమో ఆ రోజుకే చేపల పులుసు పొయ్యిలమీద ఎక్కించుకునేటోళ్ళు. ఆరోజు మా చిల్లరకొట్టు దగ్గర చింతపండు కోసం, మంచినూనె కోసం, ధనియాల కోసం సందడిగా ఉండేది.
చేపల ముచ్చట్లే ఆ రోజంతా.! ఊరంతా పుల్లపుల్లని ఆవిర్లతో చేపలపులుసు కమ్మని వాసన. చేపల పులుసు, జొన్నన్నం లేదా జొన్న గటక, + ఇప్పసారా/నల్లబెల్లంసారా ; ఇదీ మావూరి ఫేవరేట్ వంట. విందు.
వాగు వచ్చిందంటే – కేవలం రావడం, పోవడం మాత్రమే కాదు. అది ఊళ్లోకి చేపల పండుగను తెచ్చేది.
మా అమ్మ రాత్రి చాలా పొద్దు పోయ్యేదాక పొయ్యిమీదినుంచి చేపల కూర దించేది కాదు, పిల్లలం చూసి చూసి నిద్రపోయేటోల్లం. మేల్కొని ఉన్నోళ్ళు ఆ రాత్రికి తిన్నా , పొద్దున్నే జొన్నన్నంలో ఇంత పులుసు, రెండో మూడో చిన్ని చేపలు వేసి పెట్టేది అమ్మ. రాత్రి వొండిన చేపల కూర పోద్దుటికే బాగుంటుందని మా అమ్మ థియరీ. నిజమే, పొద్దున్న చేపలకూర అంత బాగుండేది.
ఆ బుగ్గవాగు, చేపల వేట, కట్టెల కోసం వెతుకులాట- అదొక భావచిత్రంగా ఎప్పుడూ మనసులో మెదులుతూ ఉంటుంది.
To be Continued ..