అపుడపుడూ మా అమ్మను నేను పుట్టింది తేదీ ఎప్పుడో కరక్టుగా చెప్పమని అడిగేవాడ్ని. మా నాన్న 2010 లో చనిపోయే ముందటిదనక కూడా అడిగిన .” అప్పుడు ముసురు పెట్టింది, బుగ్గల బాగ నీల్లొచ్చి ఊళ్లోకి నీల్లొచ్చినయ్” అని సెప్తుండే. నేనేమో మార్చి నెలల వానలు పడవు కదా – అని వాల్లను ఈల్లను అడగడం.
”నువ్వు, చింత రాములు, ఇరప రాములు, బజారవతోల్ల [ఇరప] సమ్మయ్య ఒకే తోటోళ్ళు. నాకు జ్వరమొస్తే నీకు బజారవతోల్ల పెద్దమ్మ [లక్ష్మీదేవమ్మ] పాలు కూడా తాపింది” అని గూడా చెప్పేది అమ్మ. మొత్తానికి నా తోటోల్లకు కూడా వాళ్ళెప్పుడు పుట్టిన్రో తెల్వదు. అట్ల పుట్టిన్రోజు తెలుసుకోవడం గురించి ఒక తీరని ముచ్చటగానే మిగిలిపోయింది .
మా అన్నా బందెల్లి, చనిపోయిన ఖాజా అన్న, నేను, నా తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు. మా అమ్మా’అబ్బ’లకు ఒకటే ఫికరు. మా ‘అబ్బ’కు ఎక్కువ – ఆడపిల్ల లేదని.
ఆ ముచ్చట కోసమే ఇగనైన కూతురు పుడతదని మా ఐదుగురిని కన్నడు. మా చిన్న తమ్ముడు ‘రంజాన్’కైతే చిన్నప్పుడు ఆడపిల్లలాగా జుట్టు పెంచడం, దువ్వడం, పూలు పెట్టడం, గౌన్లు తొడగడం చేసేడిది. ఎప్పుడు జూసినా మన్నతులు, మొక్కులు మొక్కుకునేటోడు. జెండాలు ఎత్తేటోడు.దర్గాల దగ్గర దండం పెట్టుకుని మొక్కుకునేటోడు. మా ఇంట్ల ఉప్పలమ్మ పెట్టే ఆచారం గూడ ఉండేది నా చిన్నప్పుడు. మా దాదా [మా ‘అబ్బ’వాళ్ళ నాన్న] వాళ్లకు ఆ ఆచారం ఉండేదట. అట్లగూడ మనసుల కూతురు కావాలని తెగ ఆరాటంతో మొక్కుకునేటోడు.
చివరికి, కోదాడ అవతల నేరేడుచర్ల దగ్గర ‘జాన్ పాడ్ దర్గా’కు మొక్కుకున్నడు. ఆ తరవాత మా చెల్లి పుట్టింది. అందుకే జాన్ బీ అని పేరు పెట్టిండు. చెల్లిని అందరం ‘బుజ్జి ‘అని పిలిచేటోళ్ళం. అప్పుడే కొన్న ఆవుకు బుజ్జి ఆవు అని,కోడికి బుజ్జి కోడి అని ,ఇవన్నీ బుజ్జివే అనెటోడు. అంత ఇష్టం.
బుజ్జావు తర్వాతర్వాత కోడె దూడల్ని,పెయ్యల్ని కన్నది. వాటిగురించి ఎంత ప్రేమగా ఉండేవాడంటే అదంతా బుజ్జి ఆస్తి అని, వాటికి గడ్డి కోసుకురావడం, ప్రత్యేకంగా చూడటం చేసేటోడు.
”ఇంట్ల ఆడపిల్ల ఉండాల్రా, తలిదండ్రుల కోసం తండ్లాడతది, పొతే ఏడుస్తది”అనేటోడు.
మన్నతు పూర జెయ్యడానికి మేకపోతు తీస్కుని , బంధువుల్ని పిలుచుకుని జాన్ పాడ్ దర్గా దగ్గర జెండాలు ఎత్తిండు. మా నాన [అబ్బ] పడ్డ సంతోషం ఇంత అంత కాదు.
ఇగ అప్పట్నించి ప్రతి ఏడు మొదట్లనే మేకపోతును జాన్ పాడు పేరుమీద వదలడం, ఎండాకాలంల జెండలెత్తడం మా ‘అబ్బా’ జీవితంల ఒక సిల్ సిలాగా మారింది. ఆయన ఆ జెండాల పండుగ కోసమే అన్నట్లు ఏడాది పొడుగూతా ఎదురు చూస్తుండేటోడు. ఆయన ఏ మాటలగూడా జెండాపండగ ఊసులేంది ఉండేది కాదు.
ఊళ్ళ ఎవరికీ పిల్లలు పుట్టకపోయినా జాన్ పాడు సైదులుకి మొక్కుకోమని చెప్పేటోడు. ఆ చుట్టుపక్కల మా నాయినను ఎవరైనా జాన్ పాడ్ గురించి అడిగేటోళ్ళు.జాన్ పాడ్ పోవాలంటే ఎట్ల పోవాల్నో,ఏడ దిగాల్నో, ఏడ ఎక్కాలే – విడమర్సి వివరంగా చెప్పేటోడు. జాన్ పాడ్ ఉర్సు గురించి ఆయన సేప్తుంటేనే వినాలే ! ఆ సుట్టుపక్కల జెండాలెత్తేటప్పుడు మేకపోతును హలాల్ చేయాలంటే మా అబ్బా కత్తినూరుకుని రడీ !
అందరం చిన్న పిల్లలం.ఆ రోజుల్లోనే మా పెదనాన్న లాల్ మొహమ్మద్ ను భార్య విడిచిపెట్టిపోతే , చినగూడూరు నుంచి మావూరు తమ్ముడిదగ్గరే ఉండి బతకడానికి వచ్చిండు. అక్కడ ఉన్నప్పుడు , మా దాదా కాలంనుంచి ఉగ్గంపల్లిలో ఎత్తుతున్న పీరీలను మా పాలోళ్ళకు అప్పగించి, అప్పటివరకు దాచుకున్న పైసలు దీసుకుని వచ్చిండు. మా వూరి ముఠాతో కలిసి వరినాట్లకు, జొన్న కోతలకు, కలుపులు తీయడానికి వెళ్ళేటోడు. మా నాన్న ,పెదనాయన పంచెలు కాసెపోసి నడుం దగ్గర గట్టిగ బిగదీసి కట్టేటోళ్ళు. మోకాళ్ళ దాకా పంచెచెంగులు ఎగదోపి నడుందగ్గర దోపేటోళ్ళు. సాయిబులు అని చెపితేగాని తెలిసేది కాదు . అందర్లాగే కట్టూబొట్టూ ఉండేడిది.
మా అబ్బ’కు చుట్టా , బీడీ, సాయంత్రం కొంచెం సారా గాని , ఎండాకాలంలో కల్లు అలవాటు ఉండేది. ఎప్పుడు చూసినా మోదుగాకులో పువ్వాకు చుట్ట చుడుతుండటం, మోదుగాకు ఈనెలు తీసి వాటిని , వాటిని ఉంగరంలా చేసి, చుట్ట విడిపోకుండా పెట్టడం చేస్తుండేవాడు. ఇంటిముందు నుంచి వచ్చే పొయేటోళ్ళను , చేను నుంచి వచ్చేటప్పుడు ‘గిన్ని మోదుగాకులు తేవే అన్నో!’ అని చెప్పడం; వాళ్ళను పక్కనే కూచోబెట్టుకుని చుట్టలు తాగుతూ ముచ్చట్లు చెప్పుకోవడం –ఇలా ఉండేది. చుట్ట గాని,బీడీ గానీ ఎప్పుడూ నోట్లో ఉండాల్సిందే !
All life stories are same
Yakoob ji athmakatha is same -not great
Waste