నా బాల్యంతో విడదీయరాని ఇద్దరు వ్యక్తులు, ఇప్పుడు లేరు!
ఏపె ఈరయ్య – మల్లయ్య మావ కొడుకు. చిన్నప్పుడే వాళ్ళమ్మ బాలమ్మ మారుమనువుకు పోతే తల్లిలేకుండా పెరిగినవాడు. ఒక చెల్లెలు, తండ్రి. నా కళ్ళముందే తన జీవితం ఎన్ని కష్టాల్లో సాగిందో. చిన్నప్పటినుంచి కష్టం తప్ప మరోమాట తెలియనివాడు. జీతాలకు కుదరడం, లేదా కూలిపనులకు పోవడం ఇంతే జీవితం. వ్యవసాయంలో దిట్ట. అలుపుసొలుపు లేకుండా కష్టపడే తత్వం. పెళ్లయ్యింది చుంచ గురవమ్మతో. నలుగురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెరిగి పెద్దయ్యారు. పెళ్లిళ్లు చేసుకున్నారు. ‘రెక్కలకు బొచ్చోచ్చి’ ఎక్కడివాళ్ళక్కడ ఎగిరిపోయారు. కొడుకులు ఊళ్ళోనే ఉంటారు కానీ వేరే కాపురాలు. వాళ్ళది కూడా రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి. ఈరన్నకు షుగర్ వచ్చింది. అయినా కష్టం తప్పలేదు. కూలికి పోవాల్సిందే. ఎప్పుడోగాని ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి. మందులు ఉన్నంత కాలం వేసుకోవడం. అయిపోయాక మళ్లీ తెచ్చుకునే స్థితి లేక తెచ్చుకోకపోవడం. ఎవరి అండలేదు. అలానే గడిచి గడిచి ఒళ్ళు కరిగి కరిగి వెళ్ళిపోయాడు.
నా బాల్యపు ఒక హీరో ఈ మధ్యే రొట్టమాకురేవును వదిలి వెళ్ళిపోయాడు.
చుంచ నర్సయ్య మావ – రొట్టమాకురేవులో ఒక ముఖ్యుడు. కులపెద్ద. పెద్ద మనిషి. చుంచ చంద్రయ్య , చుంచ ముత్తమ్మల కొడుకు. జెంటిల్ మెన్. కొంచెం చదువుకున్నాడు. మూడో క్లాసు అనుకుంటా. ఎక్కడన్నా పేపర్ దొరికితే అది పట్టుకుని అక్షరాల్ని పైకి అనుకుంటూ చదివేటోడు. ఇప్పుడు లైబ్రరీ కట్టిన ఇంటికి ఎదురు ఇల్లు. నా చిన్నప్పుడు ఇల్లు దూరంగా ఉండేది. గవర్నమెంట్ ఇంటిజాగలు ఇచ్చాక ఇటువైపు ఇల్లు కట్టుకున్నాడు. నా చిన్నప్పుడు చిరుతల రామాయణం భజన బజాట్లో వెన్నెల రాత్రుల్లో ఊరి వయసోళ్ళంతా గుండ్రంగా మద్దెల చుట్టూ తిరుగుతూ ఆడి పాడుకునేటప్పుడు, ఆ మధ్యలో కూచొని చిరిగిన పాత చిరుతల రామాయణం పుస్తకం పేజీలు సీసాబుడ్డిదీపం రెపరెపలమధ్య చూస్తూ గొంతెత్తి పాడేవాడు. దానికి అందరూ కోరస్ ఇస్తూ, చిరుతలు వాయిస్తూ. మిగతావాళ్ళు గెంతేవాళ్ళు గుండ్రంగా. అలా నా చిన్నప్పుడు నరసయ్య మావ నా హీరో.
రోజులు గడిచాయి. అందరం ఎగిరిపోయాం ఊరినుంచి. మా పెద్దన్న కూడా కొన్నాళ్లకు అక్కడనుంచి మకాం ఎత్తేసాడు. మా ముసలి నాన్న(అబ్బా), మా ముసలి అమ్మ, కొంచెం కొంచెం కూలుతున్న ఇల్లు, వాకిట్లో వేపచెట్టు. ఒకట్రెండు బర్లు, ఉన్నదని చెప్పుకోవడానికి ఉన్న కొంత వ్యవసాయభూమి అక్కడే మిగిలిపోయారు. మేం పండక్కో పబ్బానికో వెళ్లి వచ్చేవాళ్ళం. వెళ్లినప్పుడల్లా హత్తుకుపోయేవాడు నర్సయ్య మావ. అటుపోతూ ఇటుపోతూ ఇంట్లోకి తొంగిచూసేవాడు. పలకరించేవాడు.
కొన్నాళ్లకు నాన్న చనిపోయాడు. అమ్మ ఒక్కతయ్యింది. అన్నీ పడావు పడ్డాయి. బర్లు పోయాయి. భూమి కౌలు. అమ్మ పిల్లల దగ్గరకు కొన్నాళ్ళు తిరిగింది. ఎక్కడా ఉండలేకపోయింది. ఊరు.. ఊరు. ఊరు. ఇల్లు కూలిపోయింది. మళ్లీ వెళ్ళింది ఎవరికి చెప్పకుండా. ఇంటి వాకిట్లో వేపచెట్టుకింద మంచం వేసుకుని ఉంది… అదే తన ఇల్లని. ఆ ఊరే తన ఇల్లు అనుకుంది.
అప్పుడంతా అమ్మకు అన్నీ అయి చూసుకున్నాడు నర్సయ్య మావ. పళ్ళెంలో అన్నంతెచ్చి ‘అక్కా తిను’ అని పెట్టాడు.
ఆ తర్వాత “అల్లుడా యాకూబు – అమ్మకోసం ఇక్కడ ఇల్లు కట్టు. అమ్మ ఎక్కడా ఉండలేదు” అన్నాడు. అదే ఇప్పటి ఇల్లు. లైబ్రరీ. ఇప్పుడు అమ్మ అక్కడ ఎంతోకొంత నిబ్బరంగా ఆ నేల మీదే ఉందంటే అదంతా నర్సయ్య మావ ఇచ్చిన సలహా, స్ఫూర్తి.
నాకు ఆయన తోడు. నీడ. పెద్దదిక్కు. మంచికి చెడుకూ ఒక భరోసా. అమ్మ ఫోను ఎత్తకపోతే ‘మావా – అమ్మ ఫోను ఎత్తడం లేదు. ఒకసారి ఇంటికిపోయి చూడు’ అంటే క్షణాల్లో విషయం చెప్పేవాడు.
మామ ఇక ఫోన్ చేస్తే పలకడు. అమ్మను చూసుకోడు. లేడు. ఆర్నెల్ల క్రితం హఠాత్తుగా జబ్బుచేసి – ఆసుపత్రికి వెళితే ఖర్చులు అయితే పెట్టుకోవడానికి తనదగ్గర ఏం లేదని వెళ్లకుండా – తనకుతాను చావును ఆహ్వానించుకున్నాడు. మధ్యలో సారు బాలిన వెంకటరెడ్డి వైద్యం చేసి, మందులు ఇచ్చి కొన్నాళ్లపాటు చూసుకున్నా ఆయన ఊపిరితిత్తులు ఆయనకు సహకరించలేదు.
వెళ్ళిపోయాడు.
నా బాల్యపు హీరో అవతలితీరానికి చేరుకున్నాడు.
ఇప్పుడు నాకు రొట్టమాకురేవు కొంచెం కొంచెం పరాయిగా అనిపిస్తోంది. అమ్మ ఉన్నా, లైబ్రరీ ఉన్నా ఎందుకో ఈ ఫీలింగ్ లోపలికి ప్రవేశిస్తోంది.



















