నా రెండవ కవితా సంకలనం ‘సరిహద్దు రేఖ’కు రాసుకున్న నా మాటలు ఇవి.
“… In my poems I could not shut the door to the street, just as I could not shut the door to love, joy, or sadness in my young poet’s heart” -Pablo Neruda ‘Memoirs’
గడ్డి కోసి రెండు కట్లమోపు మూడుకట్ల మోపు వేయడం తెలుసా? దుగాలమీద కాలు జారకుండా మోపు మోయడం తెలుసా? అరక దున్నడం తెలుసా? గొడ్లు కాయడం తెలుసా? పరిగేరడం తెలుసా? మంచెకావిలి తెలుసా? సందకావిలి తెలుసా? మొరం మోయడం తెలుసా? కూలిచేయడం తెలుసా? అరబస్తా వడ్లు ఆరు కిలోమీటర్లు దించకుండా మోయడం తెలుసా? ఊడుగుమండలు కొట్టడం తెలుసా? ఆ మోపు మోయడం
తెలుసా?
జొన్న కోయడం తెలుసా? మొట్లకెల్లి ఆవులురికితే తిప్పకరావడం తెలుసా? నీళ్లు పెట్టడం తెలుసా? చేపలు పునకడం తెలుసా? జొన్నన్నం తిని అరిగించుకోవడం తెలుసా? గటక తెలుసా? గంజి తెలుసా? ఎర్రకారం తెలుసా? రేగ్గాయలు ముళ్లకంపలోంచి కోయడం తెలుసా? జొన్న ఊసలు తెలుసా? దుగం చెక్కడం తెలుసా? నారు వేయడం తెలుసా? వాగులో దూకి కట్టెలు ఒడ్డు చేర్చడం తెలుసా? కాలివేళ్ళ పొట్టలు పగిలితే ఒంటేలు పోసి తగ్గించుకోవడమంటే తెలుసా? గజ్జికి వేపాకు, బర్రెరొచ్చు రాసుకోవడం తెలుసా? బి.సి. హాస్టల్లో పురుగులన్నం తెలుసా? బువ్వంటే తెలుసా? అరటిపండు తొక్క ఎనక పళ్లతో గీకి ఆకలి తీర్చుకోవడం
తెలుసా?
సారాకొట్టు ఉమ్ములమధ్య బతకడం, కిరాణాకొట్లో గుమాస్తాగిరి, సేటుకొట్టే చెంపదెబ్బలు, ఇళ్లు ఊడ్చి అన్నం అడగడం తెలుసా? సిన్నప్పుడు భుజమ్మీద ఐస్‌క్రేట్ డబ్బా మోస్తూ ఎర్రటెండలో ఐదు రూపాయలు సంపాయించిన వాడి గురించి, ప్రేమనెట్టా తెలియబర్చాలో తెలియని అమ్మానాన్నల కరుకుమాటలు, తిట్లూ, బూతుల మధ్య ప్రేమను ఎతుక్కోవడం, బతికున్నడో లేదోనన్నంత.. కాళ్ళతో, రాళ్ళతో, తాళ్ళతో, ముంతపొగల్తో దండించే వారి కసిలోని అజ్ఞానం గురించి తెలుసా? అరల్లో పేర్చుకున్న పుస్తకాల్ని చూసి అమ్మి డబ్బులివ్వమని అడిగే అమాయకపు అమ్మల గురించి తెలుసా? కోళ్ళగంపతోనో, చింతచిగురుతోనో, బుడంకాయలతోనో అమ్మ సంతకెలుతుంటే ఎనక తట్టలు మోస్తూ సంతంతా అదిరిపోయేట్లు అరిచే పిల్లాడి ‘చవుక చవుక’ అరుపులు
తెలుసా?
ఏ కులమో, ఏ మతమో తెలియని అమాయకత్వపు పెంపకం గురించి తెలుసా? ఈద్గాల దగ్గర తప్పిపోయి కౌడుపడ్డ గరీబు కుర్రాడి చిల్లర పైసల శోధన గురించి తెలుసా? సదువు కోసం పదిహేనేళ్లకే ఇల్లువిడిచి పల్లెవిడిచిన వాడి గురించి తెలుసా? పేపర్‌బాయ్‌గా ఇంటింటికి తిరుగుతూ ‘ఎవరైనా పిలిచి ఇంత చాయ్ పొయ్యరా?’ అని ఆశగా చూసే పిల్లాడి గురించి
తెలుసా?
ఫీజులు తగ్గించమని అర్ధరాత్రులు గోడలకు పోస్టర్లంటించిన వాడి గురించి తెలుసా? పోలీసుల దెబ్బలు తెలుసా? హాస్టల్ సీటు కోసం కాళ్ళా వేళ్ళా పడ్డవాడి గురించి తెలుసా? విద్యార్థి ఉద్యమాల గొడవల మధ్య రక్తమోడడం తెలుసా? ఫీజుల డబ్బుల కోసం గోదావరిఖని రామగుండం రోడ్లమీద మండే ఎండల్లో చల్లని ‘తాజ్ ఐస్‌క్రీం’లు అమ్ముతున్న పిల్లాడు
తెలుసా?
‘ఒరే ఫ్రెండూ ! అప్పివ్వమని, ఓ స్నేహితుడా! ఒక చొక్కా యివ్వమని’ అడుక్కుంటూ తిరిగినవాడి గురించి తెలుసా? పాటలవరసలతో కంజీర దరువులతో గొంతెత్తిన ఉద్యమగాయకుడి గురించి తెలుసా? సింగరేణీ యూనియన్ ఆఫీసులో అర్ధరాత్రులు ఒంటరిగా భయం భయంగా గడిపిన ఆఫీసుబాయ్ గురించి తెలుసా? ఆదరించి డిగ్రీలు చదివించిన అమృతమూర్తుల ఆదరం గురించి తెలుసా? పాటలు విని అన్నంపెట్టి కడుపు నింపిన అమ్మల గురించి
తెలుసా?
ఉద్యోగంలో కుదురుకోవడానికి ముప్ఫై ఆరేళ్ళు పైగా పట్టిన ఒక అనామకుడి గురించి చిన్న ఆధారాన్నైనా వదలుకుండా సైబరుకాలంలో గిద్దె, అరసోలెడు, సోలెడు, తవ్వెడు, మానిక, కుంచం అని ఇంకా వేళ్ళూ లెక్కపెట్టుకుంటున్న వాడి ఊరిదనం గురించి తెలుసా? కళ్ళిప్పగానే పేడరొచ్చు, బీదవాసన కంటపడినవాడి గురించిఒళ్ళొంచి పని చేస్తూ బాధ్యతలు మోస్తున్నవాడి గురించి
తెలుసా?
తీరిక లేనిదంతా జీవితమేమిగిలిన ప్రతిసగం కోర్కెలోఅసలైన జీవితం మనలో తెలియకుండానే లోపలే మిగిలి ఉంటుందేమోఆ సగమే సెగకవిత్వం ఆ సెగలోంచే శిరసెత్తిమాట్లాడుతూ ఉంటుందేమో!!
తెలుసా?
* ఈ మాటలు నా మాటలుగా కవిత్వసంపుటికి రాసుకున్న రోజుల్లో కవిత్వం చదవడానికి ఒక భూమిక ఉండాలని ఈ మాటలు రాసి ముద్రించాను. కవి నేపధ్యం అవసరం, అతని కవిత్వంలోకి ప్రవేశించడానికి. పరంపరగా నేను రాస్తున్న బతుకు కథ కేవలం నా వ్యక్తిగత అనుభవం మాత్రమే కాదు. అది వెనక్కివెళ్లి అప్పటి గ్రామీణ సాంఘికచరిత్ర కూడా. మానవ సంబంధాలు, గ్లోబలైజేషన్ కు పూర్వపు పల్లెల, పల్లెల్లోని సామాజిక అంశాలు కూడా అని భావించాను.
