చదువుకునేరోజుల్లో ఆదివారాలు, సెలవులు పిలగాండ్లకు సంబురమే. మా ఇంట్ల పిలగాండ్లకు మాత్రం ఇష్టం ఉండేది కాదు, చానామందికి పల్లెళ్ళ గంతేనేమో ! ఊరక కూసునేది ఉండదు. అట్లని తలిదండ్రులు ఉత్తగ కూసుంటరా అంటే అట్లనిగాదు. పనిచేస్తనే ఉండాలె. మా ఇంట్ల జీతానికి ఒక్కో ఏడు ఒక్కోరు జీతానికి కుదిరెటోళ్లు. చానామంది పక్కూర్లల్లకు జీతాలుండి పొద్దున్నే పోయి సీకటిపడ్డంక వచ్చేటోళ్లు.
అట్ల మా దగ్గర జీతమున్నోళ్లు ఆ సంవత్సరాల్లల్ల సర్వయ్య, నెల్లబోయిన సూరయ్య, ఇరప రాగోలు, ఇరప ఎంకటి, చింత రాములు, ఇరప రాములు , సమ్మయ్య ఎవుసాయం పనిల మా అబ్బా వెంబడి అరకలు కట్టుడు, చేను పనులు చేసుడు, గొడ్ల పనులు చేసుడు… ఇట్లా ఉండేది. ఇద్దరి ముగ్గురి ఇండ్ల గొడ్లుకాయడానికి , మేకలు కాయడానికి కలిపి ఒక్కళ్ళు ఉండేటోళ్లు. అట్లా వాళ్ళల్ల ఎవరు రాకపోయినా, ఎవుసాయం పనుల్ల వాళ్ళ అవసరం పడ్డా పిలగాండ్లకు ఆ పనిపడేది. గొడ్లు కాయడం నిమ్మలమే కానీ మేకలు కాయడం కష్టం. అవి ఒకచోట మేయవు. ఒకదగ్గర ఉండవు. అటుఇటు ఉరుకుతుంటయి.మల్లించాలంటే ఒకరికి అలిమి కాదు. అందుకనే తెలగోళ్ల మేకలెంబడో,కుంజోళ్ళ మేకలెంబడో పోవాలె.
పోనని చెప్పడానికి లేదు. భయం. కొడతరనో, బడికి పంపరనో లోపల భయం.
నల్లవాగు, బుగ్గవాగు ఒడ్డులెంబడి, రైలుకట్ట ఎంబడి, చీమలోరిగూడెం పక్కపొంటి, ఆ పక్కన తండా దగ్గర, ఇంకా ఇంకా ముందుకుపోతే బొల్లిగుట్ట దాకా మేకల్ని మేపుకుంట పోతనే ఉండాలే. చేన్లల్లకి మేకలు దూరకుండా, మేయకుండా చూసుకోవాలె. చిన్న గొడ్డలి ఎంబడి పెట్టుకుని తుమ్మమండలు, సీమచింత చెట్ల కొమ్మలు (గుబ్బకాయల చెట్టు)కొట్టి, మేకలకు అందించాలె. అవి మేసేందుకు వీలున్న ఆయమన్న చెట్ల కొమ్మలు వొంచి వాటికి అందించాలె. మేకలు మేపడం – అదొక కళ, టెక్నిక్. ఉత్తుత్తిగ కాదు.
ఈ నడిమిట్ల గుబ్బకాయలు (సీమసింతకాయలు) కోసుకుని తినడం, పక్కనున్న చేలల్లో కందికాయలు, పెసరకాయలు, అలిసెందకాయలు, పరిక్కాయలు, బుడంకాయలు, పచ్చి దోసకాయలో ; బీళ్ళల్ల, డొంకలల్ల తునికిపండ్లు, ఊడుగుపండ్లు, రేగ్గాయలు, పులిసేరి పండ్లు, బలుసుకాయలు, కలెంకాయలు, జబిలికి పండ్లు, ఇంకా మేడిపండ్లు, గిన్నెపండ్లు, ఏప పండ్లు, నేరేడుపండ్లు, ఎలక్కాయలు ,బర్రెంక చెట్ల చిగుర్లు ; వాగు ఎంబడి తవ్వితే దుంపలు గోవింద గడ్డలు, ముసలమ్మ గడ్డలు, అల్లిగడ్డలు,…ఇలా ఎన్నెన్ని పండ్లు, పచ్చికాయలు తినడానికి దొరికేయి.
విసిత్రం – మోదుగాకు దొన్నెలా కుట్టి లోపల ఆకుకి, బర్రెంక కొమ్మను విరిస్తే వచ్చే తెల్లని జిగురులాంటి పాలను పూసి అందులో మేకను పట్టుకుని, పొదుగునుంచి పాలని ఆ దొన్నెలోకి పిండితే అరనిమిషంలో జున్నులాగ గడ్డకట్టేది. మస్త్ మజాగ ఉండేది తింటే ! ఇంకొక రకం – పుట్టను పైపైన మట్టిని గిల్లి దాన్ని మోదుగాకు దొప్పలో వేసుకుని అందులో ఊడుగుపండ్లు చిదిపి వేసి కలిపి తింటే కమ్మగా ఉండేది.
గివేకాక, మా ఊరి ఒకపక్కన తోలెం ముత్యాలు వాళ్ళ ఐదు మామిడిచెట్లు ఉండేవి వాగు ఒడ్డు మీద. రాలిన పండ్లు వాగులో ఇసుకమీద, ఒర్రెల పడుండేవి. చిన్నగ వెతికి జేబులేసుకుని ఉరకడమే. ఆ మామిడిపండ్ల రుచి ఇప్పటికీ మర్వలేదు. అట్లుండేడిది.
మేకలు కాసుడు ఎట్లున్నా చెట్లూ చేమలెంబడి తిరగడం తీరొక్క పండు, కాయ రుచిచూడటం, ఆకులు, చెట్లు, చెట్లతీగెలు, కొమ్మలు, కొమ్మల తీరులు, వాగు, మడుగులు, చేపలు, ఎండ్రకాయలు, పాములు, తేళ్లు, జెర్రులు, పిట్టలు, గూళ్ళు, పిట్ట గుడ్లు, తుమ్మ బంక, రకరకాల మొక్కలు, వాటి చిన్ని చిన్ని పూలు , వీటన్నింటినీ కలగలిపిన ఓ కమ్మనైన పసరుతో కలగలిసిన వాసన. ఊరంటేనే గమ్మత్తైన పసరు పసివాసన మనసులోంచి ఎగుస్తుంటుంది. పురావాసన.
ముళ్ళతో పెద్ద సమస్య. ఎక్కడ కాలుపెట్టినా కొంచెం కన్ను తిప్పితే కసుక్కున దిగే ముళ్ళు. ముళ్ళలో నెప్పి ఎక్కువపెట్టే ముల్లు ఊడుగుముల్లు. దిగితే విషమే. ముల్లు కాల్లోంచి లాగాలన్నా బలంగా లాగడమే. లోపల విరిగిందంటే ఓ వారం పదిరోజులు అవస్థ. ముల్లు పిన్నీసుతోటి గుచ్చిగుచ్చి గెలికి గెలికి తీసినా దాని పొట్టు లోపలున్నా చాలు – చీము పట్టడం, కాలు వాయడం, అదంతా బయటికొచ్చేదాక ఎన్ని రకాల కష్టాలో ! మొత్తం ఒత్తి చీము నెత్తురు నీరు బయటికి తీసి, నిప్పు కొరకాసితో ముల్లు గుచ్చిందగ్గర వెచ్చచేసి, జీడిగింజ కాల్చి ఆ గాయంల దాని రసాన్ని పోస్తుంటే ,అప్పుడు తాత ముత్తాతలు గుర్తుకొస్తరు. ఇగ రేగుముళ్లు గుచ్చితే అదితీసినా లోపలెక్కడో ములుకు మిగిలుంటది.అది పెట్టే పోరు అంత ఇంతకాదు. తుమ్మముల్లు లోపలిదాకా పోతది. ఒడుపుగ తీయకపోతే కష్టాలే.!
ఇదిగిట్లుంటే, రకరకాల పాకుడు పురుగులు. ఒంటిమీద పాకితే దద్దుర్లు, పొక్కులు, దురదలు. ఏదో ఒక ఆకు పసరు రాసుకుని రోజంతా ఒళ్లు గీక్కోవడమే. ఇదికాక, ఎక్కడైనా మేకలు మేసుకుంట పుల్ల తేనెతుట్టెల్ని ,కందిరీగ తుట్టెల్ని గెలికితే ఇగ కష్టమే. తేనెటీగలు,కందిరీగలు వెంటపడి ఉరికిస్తయ్. కుడితే ఒళ్ళంతా ముళ్ళు. వాసిపోద్ది.
మేకలు కాసుడు ఎట్లున్నా, ఈ కష్టాలు వెంటుంటాయి. ఇయన్నీ దాటుకుని ఆ రోజు గడపాలి. తెల్లారి స్కూలుకు పోవాలె.
గొడ్లు కాయడంలోని అనుభవాలు ఇంకొన్ని.. బీడుంటే కొంచెం సులువు. లేకపోతే రైలు కట్టెంబడి, వాగు ఒడ్లమీద, కోసిన చేన్ల మొట్లల్ల, డొంకలల్ల తిప్పాలె. కొన్ని నిమ్మలంగ మేస్తయి. కొన్ని అటుఇటు ఉరుకుతుంటయి. ఉరికే గొడ్లకి ముందే మెడకు తాడు వేసి దానికో మేడిలాంటి కట్టెను కట్టి ,అది ఉరికితే ఆ కట్టె దాని కాళ్లకు తగిలేట్టు మేడి బంధం , అది కాకపోతే మెడకు కాలికి తాడు కట్టే ఒంగుడు బంధం వేసేదిడి. అప్పుడప్పుడు గొడ్లు కోసిన కందిమొట్లల్లనో, జొన్న మొట్లల్లనో ఉరికితే చూడాలి ఆ కష్టం. కొర్రులు కాళ్లకు గుచ్చకపోవడం, లేదా కింద అరికాళ్ళల్ల పల్లెరుకాయలు దిగడం- అదో పెద్ద నరకం.
ఇవన్నీ చేసుడు నాకు మంచిదే అయ్యింది. ఆ నేల అణువణువుతో అనుబంధం పెరిగింది.



















