మా ఇంట్ల ఒక చిన్న అర్రల కొట్టు/దుకనం. రాత్రంతా మా అమ్మ జాగారం చేసి, పొయ్యి కాడకూచుని తయారుచేసిన కారపుచుట్లు, మిర్చీలు, బొంగుండలు, పకోడీలు, అరిశెలు – అన్నీ తినేటివి కావిడి తట్టలో ఒకవైపు, మరోవైపు తట్టల చిల్లర సామాను వేసుకుని – అటు ఇటు కలిపి 70,80 కిలోలైనా బరువు ఉండేది- బేరానికి పోయేటోడు.
అమ్మ చేసే ఆ పిండివంటల్లో విరిగిపోయిన అరిసెలు, మిగిలిపోయిన చూర తినడం కోసం – అవి మా పిల్లలవి. !
ఇంకా ఏమన్నా ఎక్కువ సామాను ఉంటే మా అన్నో, నేనో, లేకపోతే ఇంట్ల చిన్నపిల్లల్ని ఎత్తుకోవడానికని మా అమ్మ పిలిపించుకుంటే వచ్చే మా పేరేపల్లి అమీనా పెద్దమ్మ కూతురు మా చాంద్ బీ అక్కో ఆయనెంబడి తలమీద ఎత్తుకుని పోయేటోళ్ళం. మా అబ్బా నడక జింకలాంటి నడక. ఆయనెనక ఎవుడైనా ఉరుక్కుంట నడవాల్సిందే.
పొలాల దుగాల మీద, కందిచేన్ల గట్ల మధ్యన, జొన్నచేల చీరుకుపోయే కొమ్మల మధ్య రాసుకుంటూ, చిన్న దారెంబడి కాళ్ళకు గుచ్చుకునే రేగుముళ్ళు, గడ్డిముళ్ళు, పల్లేరుగాయలు – కాళ్ళు చేతులూ నెత్తుర్లు కారాల్సిందే!
చలికాలం సూసుకో నా సామిరంగా! చలి. గడ్డకట్టించే చలి. చేలు దాటేలోపు మంచుకు ముద్దముద్దయి పోవాల్సిందే! అట్టా మా అబ్బా ఎంబడి మేం అనంతారం దాటి, రేగుల గూడెం ఊళ్లకు పోయేదనక ఎవళ్ళు కూడా లేవకపోదురు. లేసుడేంది, అపుడే కోళ్ళు కూస్తుండేవి. అక్కడక్కడ ‘ఇగ లేవరాదురా – సాయిబు రానే వచ్చిండు’ అని విన్పిస్తుండేది. ఊళ్లల్ల తలో రకంగా పిలిసేటోళ్ళు. సాయిబన్న, సాయిబు, తురక సాయిబు, కావిడి సాయిబు, తురకాయన అని, ఒకరిద్దరు మాత్రం ‘మొమ్మదో’ అని పిలిసేటిది.
రేగులగూడెం పోయినంక కావిడి దింపుకునేది చుంచ ఈశ్వరమ్మ ఇంట్ల. ఆమె మొగుడేమో మావూరు చుంచ ముత్తయ్య కొడుకు. చుంచ లక్ష్మయ్య. ఇల్లరికం పోయి అత్తింట్లనే ఉన్నడు. ఆడికిపోయినంక కట్టెల పొయ్యి రాజేసుకుని, రాతెండి గిన్నెల బెల్లం, చాయ్ పత్తా [ఆ రోజుల్ల చిన్న పొట్లంల ఉండేది] ఏసి, మరగనిచ్చి, మరగనిచ్చి ముత్రాసోల్ల ఇంట్ల వాడిక పట్టిన మేకపాలు తీసకొచ్చి పోసి చాయ్ కాగింతర్వాతనే బేరం షురూ.
ఊళ్లల్ల డబ్బులేమో తక్కువ. జొన్నలు, వడ్లు, కందులు, పెసలు, అలిసెందలు, సజ్జలు, వేరు సెనక్కాయలు, నువ్వులు బుట్టల్ల తీస్కొచ్చి గిద్దెడు, అరసోలెడు, సోలెడు, తవ్వెడు, మానెడు – కొలతకు సోల,తవ్వ, మానిక, [రేకుతో చేసినవి పాత్రలు] ఉండెడివి – ఏం వస్తువులు కావాలనో దానికి సరిపడ గింజలు కొలిచి ఇచ్చి తీసుకునేటోళ్ళు. తునికాకు సీజన్లో పైసలు ఉండెడివి ఊళ్లల్ల. అవి గూడ కొత్త కొత్త పైసలు. మెరుస్తుండేవి. అప్పటిదంక చేతులల్ల మురికిగానివన్నమాట!
అట్ల, పొద్దెక్కేసరికి ఐదూర్లు తిరిగొచ్చేవాళ్ళం. వేరు వేరు సంచుల్లో ఒక్కోరకం గింజలు. చిన్న చిన్న మూటలల్ల కట్టి, తట్లల్ల సర్ది, మిగిలితే మా నెత్తిమీద మోసి తెచ్చి, చుంచ ఈశ్వరమ్మ ఇంట్ల గదిల వేసేటోళ్ళం. పదిరోజులయ్యాక గింజల్నిబస్తాల్లో నింపి, ఎడ్లబండిల కారేపల్లి ఎర్ర పుల్లయ్య కొట్టుకి ఏసుకుపోయి, మళ్ళీ సామాన్లు కొనుక్కొచ్చుకోవడం. అది మా అబ్బ బేపారం ముచ్చట.