హోళీ పండుగ రోజున, రాయ్ సాహెబ్ పండిట్ ఘసీట్ లాల్ తన తోట బంగ్లా అయిన బరాదరీ లో తన స్నేహితులు, బంధువులతో భంగు సేవిస్తూ, విశ్రాంతి తీసుకుంటుండగా, జిల్లా కలెక్టర్ మిస్టర్ బుల్ గారు వచ్చేరని ప్రకటించడం జరిగింది. మిస్టర్ బుల్ ఈ మధ్యనే ఇంగ్లాండ్ నుంచి వచ్చేడు. అతను స్వతహాగా కలుపుగోలు మనిషి. అతనికి భారతీయ ఆచారాలు, సంప్రదాయాల పట్ల ఆసక్తి ఎక్కువ. అంచేత తరచూ ఎక్కడ పండుగలు, జాతరలు జరిగినా వెళుతూ ఉంటాడు. అతని రాకతో అంతా కలవరపడ్డారు. అక్కడ చేరిన జనాలంతా గంజాయి పీలుస్తూ, అస్తవ్యస్తంగా తిరుగుతూ, ఆనందిస్తున్నారు. చెప్పా, పెట్టకుండా హఠాత్తుగా దొర గారు ఇలా ఊడి పడతారని ఎవరికి తెలుసు? కొందరు మిద్దె మీదకి పరుగులు పెడితే, కొందరు తడబడుతూ,బంగ్లా లోపలకి పరుగులు తీసేరు. పాపం అంతా కలిసి, రాయ్ సాహెబ్ గారిని అతని కర్మానికి ఒంటరిగా వదిలేసారు. సాధారణంగా అతనికి లేచి నిలబడడానికి అరగంట, సరిగ్గా నడవడానికి గంట పట్టి ఉండేది. అతను ఆ సన్నివేశం నుంచి తప్పించుకోగలగడం అసాధ్యం.తనని తాను రక్షించుకునే మార్గం ఏదీ కనిపించకపోవడంతో అతను తన పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలనుకున్నాడు. తన ఇంటికి అతిథిగా వచ్చిన ప్రముఖుడిని స్థానిక మర్యాదలతో స్వాగతించే భారతీయ గృహస్థు గా వ్యవహరించాలనుకున్నాడు. రాయ్ సాహెబ్ గారు చేతులు జోడించి, నమస్కరిస్తూ, “ హోళీ పండగ శుభాకాంక్షలు సర్!” అన్నాడు.
మిస్టర్ బుల్ , “ ఎర్ర రంగు మీకు బాగా నప్పింది,” అని ప్రశంసించేడు.
దొర గారు ఒక పిచికారి ని తీసుకుని, దాన్ని అక్కడున్న కుండలలోని బుక్కా నీటితో ( రంగు నీళ్ళు) నింపి, పండిట్ జీ మొహం మీదకి ఆ నీటిని పిచికారి చేసాడు. పండిట్ జీ పైకి లేవలేదు. అది తనకు ఎంత గౌరవం ! అసలు తనకి అంతటి అర్హత ఉందా? పాలితుల పట్ల ఎంత ప్రేమ! తన పట్ల ఈ ఆఫీసర్ దొర గారు చూపిస్తున్న ఆదరాభిమానాలను సేఠ్ జోకన్ రామ్ చూసి ఉంటే బాగుండేది. కలెక్టర్ దొర గారి వరకు ఎందుకు? ఎవరో ఒక సాదా సీదా తెల్ల దొర కూడా అతని పట్ల ఇంత ఆదరంగా వ్యవహరించేడని అతను చెప్పుకోలేడు. ఇదంతా తన పుణ్య కర్మల ఫలితం తప్ప వేరే ఏమీ కాదు. ఇలాంటి గౌరవం దక్కాలంటే, వేల ఏళ్ళు తపస్సు చేసి ఉండాలి.
అతను చేతులు జోడించి ఇలా అన్నాడు, “ దొర గారూ,ఇవాళ నా జన్మ ధన్యం అయింది. దొర వారు దయ తలచి నాతో హోళీ ఆడాలని నిర్ణయించుకుంటే, నా మనసులోని కోరిక ఒకటి తీర్చుకోవడానికి అనుమతి లభిస్తుందనుకుంటున్నాను.” ఇలా అంటూ అతను దొర గారి నుదుటన ఎర్రటి తిలకం దిద్దేడు.
మిస్టర్ బుల్ ఇలా అడిగేడు, “ రాయ్ సాహెబ్, అక్కడ ఉన్న పెద్ద కుండలో ఏం ఉందోయ్?”
“అది సంప్రదాయ పద్దతిలో తయారు చేసిన భంగు, దొర గారూ!”
“దాని ఉపయోగం ఏమిటి?”
“ అది మన కళ్ళు తెరిపిస్తుంది. చాలా గొప్ప పదార్థం.”
“ నేను కూడా కాస్త రుచి చూస్తాను.”
రాయ్ సాహెబ్ కి స్వర్గ ద్వారాలు తెరుచుకున్నట్టుగా ఉంది. అతనికి తాను పురాణాల్లో చెప్పిన పుష్పక విమానంలో ఎగురుతున్నట్టుగా ఉంది. అతను దొర గారికి గ్లాసు లో భంగు పోసి, ఇవ్వడానికి సంకోచించేడు.ఎందుకంటే గతంలో ఎన్నడూ భంగు గ్లాసులో తాగింది లేదు. కానీ, మట్టి పాత్ర లో పోస్తే మరీ అవమానంగా ఉంటుంది. చాలా సేపు తర్జనభర్జన పడ్డాక, అతను భంగు గ్లాసులో పోసి, దొర గారికి అందించేడు. మిస్టర్ బుల్ దాన్ని ఒక్క గుక్క లో తాగేసాడు.ఆ సువాసనకి వాళ్ళ మనసులు ఆనందంతో చిందులేసాయి.
2
రాయ్ సాహెబ్ కూడా మర్యాద కోసం మిస్టర్ బుల్ గారిని సందర్శించాలనుకున్నాడు. తెల్ల వారేక,అతను మంచి ముహూర్తం చూడమని, జ్యోతిష్కుడిని అడిగేడు. అతను సాయంత్రం సమయం దివ్యంగా ఉందని సలహా ఇచ్చేడు. రోజంతా రాయ్ సాహెబ్ ఏర్పాట్లలో తలమునకలుగా గడిపేడు. సరిగ్గా అనుకున్న ముహూర్తానికి రాయ్ సాహెబ్ మిస్టర్ బుల్ గారి నివాసానికి చేరుకున్నాడు. అతను వెళ్ళే వేళకి మిస్టర్ బుల్ భోజనం చేస్తున్నాడు. ఆ గదిలోకి అడుగు పెట్టడం తోనే ఘాటైన మద్యం వాసన గుప్పుమంటూ, అతని నాసికా పుటాలకు తాకింది. అతను అంత వరకు ఎన్నడూ ఇంగ్లీషు మందులను కూడా వాడి ఉండకపోవటంతో, మద్యం గురించిన ఆలోచనే అతనికి వెగటుగా తోచింది. ఆ కంపు ని తప్పించుకోవడానికి అతను తన ముక్కు మూసుకోవాలనుకున్నాడు. కానీ, దొర గారు ఏమనుకుంటారో! అతనికి తల తిరుగుతున్నట్టుగా అనిపించినా, ఊపిరి బిగబట్టి అక్కడే నిలబడ్డాడు. మిస్టర్ బుల్ ఒక గుక్క తాగి, గ్లాసు బల్ల పైన పెట్టి, ఇలా అన్నాడు: “రాయ్ సాహెబ్, నిన్న నేను మీరు ఇచ్చిన భంగు తాగేను. అంచేత, ఇవాళ నేను ఇచ్చే భంగు మీరు తాగాలి. నిన్నటి మీ సరుకు బ్రహ్మాండంగా ఉంది. నేను పూర్తిగా ఆనందించేను.”
“ దొర గారూ, మేం హిందువులం మద్యం ముట్టుకోం . మా శాస్త్రాల ప్రకారం అది మహా పాపం.”
ఇది విని, మిస్టర్ బుల్ పగలబడి నవ్వేడు. “ మంచి బావుంది, రాయ్ సాహెబ్! ఏది పాపం, ఏది పుణ్యం? ఇది మా భంగు. అది మీ భంగు. ఏ మాత్రం తేడా లేదు. అది తాగి మీకు ఉత్తేజం వస్తే, ఇది తాగితే మాకు మత్తెక్కుతుంది. అదీ కథ..అంతే.”
“ అది కాదు, దొర గారూ, మద్య పానం మాకు పూర్తిగా నిషిద్ధం.”
“అసాధ్యం. ఒకవేళ శాస్త్రాలు మద్యం పానాన్ని నిషేధిస్తే, దాన్ని కూడా నిషేధించినట్టే. మరి నల్లమందు కూడా నిషేధించబడాలి.మరేం బాధ లేదు. ఒక్క గుక్క తాగండి. భయపడకండి.ఇది అద్భుతమైన సరుకు.”
మిస్టర్ బుల్ ఒక పెగ్గు విస్కీ పోసి, దాన్ని రాయ్ సాహెబ్ పెదవుల వద్దకు తెచ్చాడు. రాయ్ సాహెబ్ మొహం ప్రక్కకి తిప్పుకుని, కళ్ళు మూసుకుని, దొర గారి చేతిని దూరంగా తోసేసాడు. ఈ వ్యవహారం మిస్టర్ బుల్ కి అర్ధం కాలేదు. రాయ్ సాహెబ్ మొహమాటం కొద్దీ తాగటం లేదని అతను భావించేడు. అతను తన బలమైన చేతులతో రాయ్ సాహెబ్ మెడని పట్టుకుని, గ్లాసుని అతని నోటి దగ్గర పెట్టేడు. ఇక రాయ్ సాహెబ్ కి కోపం కట్టలు తెంచుకుంది. దొర గారిని సంతోష పెట్టడానికి అతను ఏం చెయ్యడానికైనా సిద్ధమే.కానీ, ఇది తన ధర్మానికి సంబంధించిన వ్యవహారం.. ఇక్కడ మాత్రం రాజీ పడే ప్రశ్న లేదు.
“ దొర గారూ, మేం వైష్ణవులం. మద్యం ముట్టుకోవడం కూడా మా ధర్మంలో మహా పాపం.”
రాయ్ సాహెబ్ మరో మాట మాట్లాడలేక పోయేడు. ఆవేశంతో అతని గొంతు పూడుకుపోయింది. కాసేపటికి, తెప్పరిల్లి అతను ఇలా అన్నాడు: “ దొర గారూ, భంగు చాలా పవిత్రమైనది. మా సాధు, సన్యాసులు, ఋషులు, మునులు, దేవీ దేవతలు అందరూ భంగు స్వీకరిస్తారు. మా సంస్కృతి లో భంగు మహిమలు వివాదరహితమైనవి. నల్లమందు వేసుకోని పండితుడు మీకు ఎక్కడా కనిపించడు. కానీ, దొరా, మద్యం అనే మాట పలకడం కూడా మాకు మహా పాపం.”
మిస్టర్ బుల్ ఆ గ్లాసుని పక్కన పెట్టి, కుర్చీలో కూర్చున్నాడు. “ నువ్వు పిచ్చి వాడిలా పేలుతున్నావు,” అన్నాడతను. “ శాస్త్ర ప్రకారం, మద్యం, భంగు రెండూ నిషిద్ధమే. కానీ, మీరు వాటిని అపార్ధం చేసుకున్నారు. ప్రపంచమంతా మత్తు పదార్ధాలు మంచివి కావని ఎందుకు అంటుందంటే, అవి మన ఆలోచనా శక్తిని చంపేస్తాయి. మీ పండితులు, దేవతల విషయంలో కూడా అదే జరిగింది. మస్తుగా భంగు సేవించేక కూడా వారంతా తెలివిగా ఉంటారని నాకు కథలు చెప్పకు. వాళ్ళంతా తప్పకుండా రాక్షసులుగా మారతారు. ఇప్పుడు నీకు కొన్ని వాస్తవాలు చెప్తాను, విను. మీ పండితులంతా భంగు తాగి, పిచ్చి వాళ్ళు అయిపోయేరు. అందుకే వాళ్ళు ఇతరులని, అపవిత్రులనీ, అంటరానివారనీ అంటారు. అంచేతనే వారు ఇతరుల చేతి రొట్టెలు తినరు గానీ, మిఠాయిలు మాత్రం తింటారు. అంచేతనే వారు ఇతరులు ముట్టుకున్న నీళ్ళు తాగరు. బుద్ధీ, బుర్రా లేని సన్నాసులు. సరే, శలవ్.”
రాయ్ సాహెబ్ మళ్ళీ స్వేచ్ఛ గా ఊపిరి పీల్చుకున్నాడు. అతను కాళ్ళీడ్చుకుంటూ, వరండాలోకి వచ్చి, తన కారెక్కి ఇంటికి వెళ్ళేడు.



















