నిన్న సాయంత్రం, నేను ఏవో నిత్యావసరాలు కొనుగోలు చెయ్యటానికి బజారుకి వెళ్ళేను. దారి పొడుగునా వరసగా పంజాబు నుంచి వచ్చిన ఎండు ఫలాల (డ్రై ఫ్రూట్) దుకాణాలు ఉన్నాయి. అయితే, వాటిల్లో ఒకదానిలో ఎర్రటి ఆపిల్ పళ్ళు చూసి, నేను ఆగలేక పోయేను. ఈ మధ్యన విద్యాధికులంతా విటమిన్లు, ప్రోటీన్లు మొదలైన వాటి పై విపరీతమైన శ్రద్ధ కనపరుస్తున్నారు. పూర్వం అయితే ఉచితంగా ఇచ్చినా, ఎవరూ టమాటాలని కన్నెత్తి కూడా చూసేవారు కాదు. కానీ, ఈ మధ్య టమాటాలు భోజనంలో ఒక ముఖ్యమైన భాగంగా మారేయి. పూర్వం కేరట్ దుంపలు కూడా పేదవాళ్ళ ఆహారంగా ఉండేవి. సంపన్నులు కేవలం కేరట్ హల్వా మాత్రమే తినేవారు. కానీ, కేరట్ కూడా ఎన్నో విటమిన్లకి గని అని తెలిసిన దగ్గర నుంచీ, అది కూడా భోజనాల బల్లని అలంకరించడం ప్రారంభించింది. ఇక ఆపిళ్ళ విషయానికి వస్తే, రోజూ ఒక ఆపిల్ తింటే, వైద్యుని అవసరం ఉండదనే సూక్తి ఉండనే ఉంది. వైద్యుడిని దూరంగా ఉంచడానికి, చేదుగా ఉండే వేప కాయని తినడానికి కూడా జనాలు వెనుకాడరు. మరి అలాంటిది, ఇక ఆపిల్ తినడానికేం? మామిడి పండంత రుచిగా ఉండకపోయినా, ఆపిల్ రుచిలో మరీ నాసి ఏమీ కాదు.వారణాసి లంగ్డా మామిడిపళ్ళు, లక్నో దసేరి మామిడిపళ్ళు, బాంబే అల్ఫాన్సో మామిడి పళ్ళ రుచి ముందు ప్రపంచం లోని ఏ పండైనా దిగదుడుపే అనుకోండి. అయితే వీటిల్లో విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయో, లేదో మరి ,తెలీదాయె! ఒకవేళ ఉన్నా, సరిపడా ఉంటాయో, లేదో? వీటికి సంబంధించి పాశ్చాత్య వైద్యుల పరిశీలనలేవీ వెలుగు లోకి రాలేదు. మరో ప్రక్కన ఆపిల్ కి తీర్పు కూడా ఇచ్చెయ్యడం జరిగింది. ఇక అది కేవలం రుచికరమైన ఫలం మాత్రమే కాదు,పోషకాహారం కూడా! అంచేత, నేను పండ్ల దుకాణం వాడితో బేరమాడి,ఒక అరకిలో ఆపిల్ పళ్ళు ఇమ్మని అడిగేను.
పండ్ల దుకాణం అతను ఇలా అన్నాడు, “ బాబు గారూ, కాశ్మీర్ నుంచి తియ్యటి ఆపిల్ పళ్ళు వచ్చేయయ్యా! మీకు బాగా నచ్చుతాయి.మీరు తీసుకెళ్ళాల్సిందే.”
నేను నా జేబు రుమాలుని బయటకు తీసి, అతని చేతికి ఇస్తూ, ఇలా అన్నాను, “ జాగ్రత్తగా ఎంచు. నాకు నాణ్యమైనవే కావాలి.”
అతను తన తక్కెడ పైకి తీస్తూ, దుకాణం లోని కుర్రాడికి ఇలా చెప్పేడు, “ అబ్బాయ్! అర కిలో ఆపిల్ పళ్ళు ఇవ్వు. మంచి నాణ్యమైన పళ్ళు ఇవ్వాలి.”
ఆ కుర్రాడు నాలుగు పళ్ళు తెచ్చేడు. పళ్ళ దుకాణం యజమాని, వాటిని తూకం వేసి, పొట్లాం కట్టి, ఆ పొట్లాన్ని నా సంచి లో పెట్టేడు. నేను అతని చేతిలో నాలుగణాలు పెట్టేను.
ఇల్లు చేరేక, నేను ఆ పొట్లాన్ని పక్కన పెట్టేను. ఆపిల్ పళ్ళు మాత్రమే కాదు, అసలు ఏ పండూ రాత్రి పూట తినకూడదు. పళ్ళు ఎప్పుడూ పొద్దున్నే తింటే మంచిది. మరుసటి రోజు పొద్దున్న నేను మొహం కడుక్కుని,ఫలహారం కోసం ఒక ఆపిల్ తీసి చూస్తే, దాని మీద రూపాయి కాసంత నల్ల మచ్చ కనిపించింది. పళ్ళ దుకాణం కుర్రాడు రాత్రి వేళ ఆ కుళ్ళు మచ్చ చూసుకోలేదనుకుని, నేను మరో ఆపిల్ పండు తీసాను. అయితే, అది కూడా సగం కుళ్ళిపోయింది. ఇక నా మనసులో చిన్న సందేహం మొదలైంది. పళ్ళ దుకాణం కుర్రాడు నన్ను మోసం చేసాడా? నేను మరో పండు తీసాను.అది ఒక ప్రక్కన బాగా వడిలి పోయి ఉంది. ఇక ఆఖరి పండు తీసాను. అది మచ్చ, మరక లేకుండా ఉంది.తీరా, దగ్గరగా చూస్తే,దానికి ఒక నల్లటి రంధ్రం ఉంది. సాధారణంగా బేరి పళ్ళలో కనిపించే లాంటిది. కోసి చూస్తే, పురుగులు పట్టిన బెర్రీ పళ్ళ మాదిరి నల్ల మచ్చలు లోపలంతా ఉన్నాయి. ఒక్క పండు కూడా తినడానికి వీలుగా లేదు.డబ్బు నష్టపోయాననే బాధ కంటే, సమాజంలో విలువలు పడిపోతున్నాయనే విషయం నన్ను బాధించింది. పళ్ళ దుకాణం అతను నన్ను తెలిసే మోసం చేసాడు. ఏదో ఒక పండు బాగా లేకపోతే, పోనీలే, ఏదో పొరపాటున చూసుకోలేదోమో అనుకోవచ్చు. కానీ, నాలుగూ బాగా లేవంటే, అది కచ్చితంగా మోసమే. కానీ, అందులో నా పొరపాటు కూడా ఉంది. నన్ను మోసం చెయ్యమని అడుగుతున్నట్టుగా, నేను నా జేబు రుమాలుని అతని చేతికి ఇచ్చేను మరి! ఈ పెద్దమనిషి తన కళ్ళని ఉపయోగించడు అని అతను భావించి ఉండొచ్చు. దానికి తగ్గట్టు నేను అతను ఇచ్చిన పళ్ళ వంక చూడనే లేదు. ఎప్పుడైనా సరే,మనం అవకాశం ఇస్తేనే ఎవరైనా మనని మోసం చేస్తారు.మన నిర్లక్ష్యం, తెలివి తక్కువతనం తో ఎవరికైనా మోసం చేసే అవకాశం ఇస్తున్నామంటే, మనం నేరాన్ని ప్రోత్సహిస్తున్నట్టే. ఈ కాలంలో చదువుకున్న ఆఫీసర్లనీ, గుమాస్తా లనీ ఎవ్వరూ నమ్మడం లేదు. ఒక్కసారి ఏదైనా పోలీసు ఠాణా కి గానీ, కోర్టు కి గానీ,మున్సిపల్ ఆఫీస్ కి గానీ వెళ్ళేరంటే, ఆ అనుభవంతో జీవితంలో మళ్ళీ ఆ ఛాయలకి కూడా వెళ్ళరు.ఎంత నష్టపోయినా సరే. వ్యాపారస్తులు, దుకాణదారులు ఇంకా పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోలేదు. తూకం వేసేటప్పుడు, వాళ్ళు కొంత మోసం చెయ్యొచ్చు,కానీ ఒకవేళ ఎప్పుడైనా, అయిదు రూపాయల కాగితానికి బదులు, పది రూపాయల కాగితం ఇచ్చేస్తే,ఆందోళన చెందాల్సిన పని లేదు.మళ్ళీ మీ సొమ్ము మీకు వెనక్కి వస్తుంది. నాకు బాగా గుర్తు.ఒకసారి ముహర్రం సమయంలో జాతరలో ఒక బండి వద్ద నేను ఒక పైసా మిఠాయి కొని, పొరపాటున అర్థ రూపాయి ఇచ్చేసాను. ఇంటికి తిరిగి వెళ్ళేక, నా పొరపాటు గ్రహించి,మళ్ళీ ఆ బండి దగ్గరకి పరుగు తీసాను.అతను నా డబ్బు తిరిగి ఇస్తాడని నేను అస్సలు ఊహించలేదు. కానీ, అతను డబ్బు తిరిగి ఇవ్వడమే కాక, నన్ను క్షమాపణ కూడా కోరేడు. ఇదుగో, ఇక్కడ చూస్తే, ఈ దుకాణదారులు కుళ్ళిన ఆపిల్ పళ్ళని కాశ్మీర్ ఆపిల్ పళ్ళు అని చెప్పి, అమ్ముతున్నారు.అంచేత నేను చెప్పేదేమంటే,పాఠకులారా, ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు, నా మాదిరిగా కళ్ళు మూసుకుని, కొనుగోలు చెయ్యకండి.లేదంటే,మీకు కూడా ఇదే గతి పడుతుంది.
కాశ్మీర్ ఆపిల్ పళ్ళు
