ఆయుధం పట్టని యోధుడు

Spread the love

 ఒక చెడు ఒక మంచికి దారి తీస్తుందన్న మాట అక్షర సత్యం. దానికి అమెరికా దేశస్థుడైన డేవిడ్ హెన్రీ థోరో జీవితం ఒక తిరుగులేని నిదర్శనం. అవి అమెరికాలో మెక్సికన్ సివిల్ వార్ జరుగుతున్న రోజులు. ఆ సివిల్ వార్ ని ప్రజల అభిష్టానికి భిన్నంగా నాటి అమెరికా ప్రభుత్వం కొనసాగించడాన్ని సహించలేక పోయిన పౌరహక్కుల ఉద్యమకారుడైన థోరో “ఎటువంటి రాచరిక వ్యవస్థ అయినా సామాన్య ప్రజల శారీరక శ్రమతోను, వారు చెల్లించే పన్నులతోనూ తన మనుగడ సాగిస్తుంది. వారి అభిప్రాయాలకు వ్యతిరేకంగా  ప్రభుత్వం సివిల్ వార్ నడిపిస్తుంది కాబట్టి నేనో బాధ్యత గల పౌరుడుగా ఈ ప్రభుత్వం విధించే ఎటువంటి పన్ను నైనా చెల్లించను” అంటూ  ప్రకటిస్తాడు.

 ఆ ప్రకటన  మొత్తం అమెరికన్  సమాజాన్ని కదిలిస్తుంది. దాంతో కోర్ట్ అతనికి ఒక రాత్రి జైల్ శిక్ష విధిస్తుంది. ఆ రాత్రి జైల్లో వున్న థోరో అప్పటిదాకా తను  ‘సివిల్ డిస్ ఒబిడియన్స్’ అంటూ జనానికి  చెబుతూ వస్తున్నాడో దాన్నే ఓ ఆరు పేజీల వ్యాసంలా వ్రాసి ప్రకటిస్తాడు. అదే  ‘సివిల్ డిస్ ఒబిడియన్స్’ గా జగద్విఖ్యాతమయ్యింది. ఆ విధానం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది సుప్రసిద్దులైన పౌరహక్కుల ఉద్యమకారులపాలిటీ పారాయణ గ్రంధమయ్యింది.

 ఆ సిద్ధాంతాన్ని అందిపుచ్చుకున్న మహాత్మా గాంధీ దాన్ని తన ఉద్యమానికి అనువుగా మల్చుకుని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయనిరాకరణోద్యమాన్ని  నిర్మించాడు. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజా నాయకులు గాంధీజీ మార్గంలో సహాయనిరాకణ పద్ధతిలో విజయాలు సాధించారు. అందులో అగ్రగణ్యుడు అమెరికా నల్లయోధుడు  డా.మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్. కులవ్యవస్థలేని అమెరికాలో అంతకంతే ధారుణమైన జాతులభేదముంది. మూలవాసులైన నల్లవారి మీద వలసవాదులైన తెల్లవారి దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. వారిని పశువులకన్నా హీనంగా పీడించసాగారు. అటువంటి సమయంలో తన ప్రజల పౌరహక్కుల కోసం గాంధీజీ అడుగుజాడల్లో శాంతియుత పద్ధతుల్లో సమరం సాగించి విజయంసాధించాడు మార్టిన్ లూధర్ కింగ్ జూ.

 మార్టిన్ లూధర్ కింగ్ జూ. జీవిత చరిత్రను డా.యమ్.వి.రమణారెడ్డి గారు ఏ ఇంగ్లీష్ పుస్తకానికి అనువాదంగా కాకుండా, ఆయన మీద  ఆంగ్లభాషలో వచ్చిన అనేక పుస్తకాలను చదివి ఆకళింపుచేసుకుని రెడ్డి గారే  స్వయంగా ఈ పుస్తకాన్ని వ్రాయడం నిజంగా గొప్ప విషయం.

 మార్టిన్ చేసిన ప్రసంగాలను, వ్యాసాలను కలిపి వేస్తే ఇంగ్లిష్ లో 700 పేజీల పుస్తకమయ్యింది. దానిని యధాతధంగా తెలుగులోకి అనువదిస్తే మరింత పెద్దదౌతుంది. అందుకే రమణా రెడ్డి గారు కొన్ని ముఖ్యమైన ప్రసంగాలను మాత్రమే ఎంచుకున్నారు. ఓ పది ప్రసంగాల అనువాదం తరువాత రెడ్డి గారికి అసలు తెలుగువారిలో ఎంతమందికి లూధర్ని గురించి, ఆయన సాగించిన పోరాటం గురించి తెలుసునన్న సందేహామొచ్చింది.  ఆయనెవరో తెలియకుండా ఆయన వ్యాసాలను చదివే ఆసక్తి ఎందరికుంటుంది? కాబట్టి ముందుగా మార్టిన్ జీవిత చరిత్రను వ్రాయడం మంచిదన్న నిర్ణయానికొచ్చారు.

 మార్టిన్ గురించిన అనేక ఆంగ్లపుస్తకాలు సేకరించిన వుంచిన  హెచ్.బి.టి. గీతా రామస్వామి గారు  వాటన్నింటినీ రెడ్డి గారికిచ్చారు. ఆయన వ్రాసిన ఈ పుస్తకంలో పది పేజీలు వ్రాయడానికి ఆంగ్లంలో సుమారు నాలుగు వందల పేజీలను చదవాలివచ్చింది. వారి ఆ శ్రమ ఫలితమే ఈ ‘ఆయుధం పట్టని యోధుడు’.

 15 జనవరి, 1929 న శ్రీమతి అల్బర్ట, శ్రీ మైకేల్ లూధర్ కింగ్ సీనియర్ దంపతులకు మార్టిన్ లూధర్ కింగ్ జూ. జన్మించాడు. సీనియర్ మతబోధకుడుగా పనిచేసేవాడు. ఆరోజుల్లో అక్కడ ఒకేరకమైన పనికి తెల్లవారికి ఎక్కువగాను, నల్లవారికి తక్కువగాను జీతాలిస్తుండేవారు. అమెరికా మొత్తంలో ఈ తారతమ్యాన్ని  మొట్టమొదట వ్యతిరేకించినవారు ఉపాద్యాయులే కావడం వారి మేధో పరమైన శక్తిని సూచిస్తుంది.

 1863 అమెరికా అధ్యక్షుడు అబ్రాహిం లింకన్ బానిస విధానాన్ని రద్దు చేస్తూ బిల్లు తీసుకోచ్చేంత వరకు నీగ్రోలను పశువులకన్నా హీనంగా భార్యా భర్తలను, తల్లీ పిల్లను విడదీసి బానిస సంతలలో పశువుల మాదిరిగా అమ్మేవారు. ఈ దుర్మార్గం ఆ దేశంలో సుమారు రెండు వందల ఏండ్లు కొనసాగింది.

 మార్టిన్ జూ.చదువుకునే రోజుల్లోనే తర్కానికి తట్టుకోలేని సమాచారం దీర్ఘకాలం మనలేదన్న అభిప్రాయానికొచ్చాడు. తన కండ్ల ఎదురుగా జరుగుతున్న అనేక ఘటనల పరికించిన యువ జూ. నీగ్రో మనస్తత్వమే నీగ్రోను ఎదక్కుండా అడ్డుకుంటుందనే అపవాదును వమ్ము చెయ్యాలన్న దీక్షపూనాడు.  1951లో మాస్టర్ డిగ్రీ కాగానే  లూధర్ బోస్టన్ యూనివర్సిటీలో ‘మతం, ఆధ్యాత్మికత’ అనే అంశం మీద   పి.హెచ్.డి. పరిశోధక విద్యార్ధిగా చేరాడు.1953  జూన్, 18న  కొరెట్టాతో మార్టిన్ వివాహం జరిగింది.

 1954 మే 17 న అమెరికా సుప్రీం కోర్ట్ పాఠశాలల్లో జాతీవివక్ష రాజ్యాంగ విరుద్ధమనీ, అందుకు పాల్పడడం నేరమని తీర్పునిచ్చింది. 1954 సెప్టెంబర్ 1 నుండి మార్టిన్ కింగ్ జూ. తండ్రి మాదిరిగానే డెక్స్ అవెన్యూ చర్చికి పూర్తికాలం పాస్టర్ గా బాధ్యతలు స్వీకరించాడు.

 1955 లో ఒక సిటీ బస్సులో రోజా పార్క్స్ అనే  నీగ్రో మహిళకు జరిగిన అవమానానికి ప్రతిగా మార్టిన్ నేతృత్వంలో సాగిన బస్సుల బహిష్కరణ ఉద్యమం తదనంతరకాలంలో జరిగిన స్వేచ్చా ప్రయాణం లాంటి అనేక మహోద్యమాలకు మాతృకలాంటిది . ఆ పోరాటంలో నల్లవారు విజయాన్ని సాధించారు. 

 నల్లవారి కనీస హక్కుల కోసం స్థాపించిన  మాంట్గోమెరీ సంస్థలో సభ్యునిగా చేరిన మార్టిన్ జూ.  అతి త్వరలోనే దాని అధ్యక్షుడయ్యాడు. ఆ సందర్భంగా మాట్లాడుతూ “మా ఉద్యమానికి ఆత్మను  సమకూర్చింది ఏసుక్రీస్తైతే, విధానాన్ని సమకూర్చింది మాత్రం మహాత్మా గాంధీనే  అంటాడు.

 లూధర్ కార్యకలాపాలు నచ్చని ‘కు క్లక్స్ క్లాన్’ అనే తెల్లజాతి దురహంకారుల హింసావాద సంస్థకు నీగ్రోల ఆస్తులు తగలబెట్టడం, కొట్టి హింసించడం, హత్యలు చెయ్యడమే ఆశయం. అంతర్యుద్ధంలో ఓడిపోయిన దక్షిణాది తెల్లజాతివారి ఆక్రోశం నుండి మొలకెత్తిన విషబీజమది. గాంధేయ విధానాన్ని, క్రిస్టియానిటీనీ, యూరోపియన్ మానవతావాదాన్ని ఆధారంగా చేసుకుని, నీగ్రో ఉద్యమానికి లూధర్ కింగ్ ఒక సైద్ధాంతిక  పునాదిని తయారుచేశాడు.     

 మార్టిన్ బృందం శ్రమ ఫలితంగా 1954 మే 17 న  విద్యాలయాల్లో వేర్పాటు  విధానాన్ని రద్ధు చేస్తూ అమెరికా సుప్రీంకోర్ట్  తీర్పునిచ్చింది. దక్షిణ ప్రాంత రాష్ట్రాల్లో నల్లవారికి ఓటు హక్కు కోసం మార్టీన్ సాగించిన పోరాటం అమెరికా చరిత్రలో మరువలేనిది.

 “పెరిగిన స్వాభిమానం నీగ్రోను రెండవశ్రేణి పౌరునిగా వుండనివ్వడంలేదు. నలుగురితోపాటు ప్రథమశ్రేణి పౌరుడుగా ఎదిగేవరకూ ఏ పోరాటానికైనా, ఎన్ని త్యాగాలకైనా అతన్ని ఉసిగొలుపుతుంది. ఇది మాంట్గోమెరీ పోరాటంలో దాగిన అసలు కథ” అంటాడు మార్టీన్ జూ.

 “హింసా మార్గం చావగా మిగిలిపోయిన వారిలో ద్వేషాన్ని, చంపిన వారిలో పశుత్వాన్నీ  రెచ్చగొడుతుంది. అహింసా మార్గం వల్ల సౌభ్రాతృత్వం వెల్లివిరిసే  సమాజం లభిస్తుంది” 1959లో మార్టిన్ లూధర్ భారతదే శానికొచ్చినప్పుడు రాజ్ ఘాట్ లో మహాత్ముని సమాధిని సందర్శించినప్పుడన్న మాటలివి.

 అమెరికా అధ్యక్షపీఠం కోసం నిక్సన్, కెనడీల మధ్య ఎన్నికలు జరిగినప్పుడు మార్టిన్ కెనడీకి మద్ధత్తిచ్చాడు. అతను గెలిచినప్పటికీ అర్ధంతరంగా కెనడీ హత్య నల్లవారి పౌరహక్కుల ఉద్యమానికి పెద్ద. 1964 జనవరి 3 న  లూధర్ ముఖచిత్రంతో  వెలువడిన ‘టైమ్ మ్యాగజైన్’ సంచిక అతన్ని 1963 కు ‘మ్యాన్ ఆఫ్ ఇయర్ గా ప్రకటించింది. మార్టిన్ కి అదో ఘనమైన పురస్కారం కిందేలెక్క.                                   1964 జూలై 2వ లూధర్ తో పాటు సమస్త నల్లజాతివారు కలలుగన్న పౌరహక్కుల బిల్లు ప్రసిడెంట్ జాన్సన్ చేతుల మీదుగా బిల్లు వెలువడింది. ఆ సమయంలో అనేకమంది పౌరహక్కుల నాయకుల సమక్షంలో బిల్లు మీద సంతకంచేసిన పెన్నును ప్రసిడెంట్ జాన్సన్ మార్టిన్ కి బహూకరించాడు. వాస్తవంగా ఆ బహుమతి అందుకునే అర్హత ఒక్క లూధర్ కే వుందనేది నిర్వివాదమైన అంశం. ఆయన చేసిన అవిశ్రాంత పరిశ్రమే         ఆ చట్టానికి పుట్టుకనిచ్చిందని దేశం మొత్తం ప్రశంసించింది.

 నీగ్రో సమస్యల మీద పెదవులతో కాకుండా హృదయంతో మాట్లాడిన అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తరువాత, లిండన్ జాన్సన్ ఒక్కడే! ఆదే సంవత్సరం లూధర్ కి నోబెల్ శాంతి పురస్కారం లభించింది. బహుమతి మొత్తం సొమ్మును ఉద్యమ అవసరాలకు వినియోగిస్తానని లూధర్ ప్రకటించాడు.      

 వియత్నాంలో అమెరికా జోక్యాన్ని, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో జరుగుతున్న మారణ హోమానికి  లూధర్ మనసు తల్లడిల్లింది. ఆ యుద్ధం కోసం ఎంపికైన యువకుల్లో నీగ్రోల నుండి 69 శాతం, తెల్ల జాతీయుల నుండి 31 శాతం వియత్నాం ఎగుమతి చేస్తున్నారు. యుద్ధంలో కోల్పోయిన తెల్లోళ్ళ కంటే నీగ్రోల సంఖ్య రెండింతలు. తన జీవితంలో ఏనాడూ ప్రజాస్వామ్యాన్ని అనుభవించని నీగ్రో సైనికుణ్ణి మరొకరి ప్రజాస్వామ్యానికి  త్యాగం చెయ్యమని పంపడం విడ్డూరం కదా?!

 శ్రమజీవుల పోరాటానికి గుర్తుగా ఎర్రజెండాను ప్రపంచానికి అందించిన చారిత్రాత్మక చికాగో నగరంలో ఉద్యమాన్ని నిర్వహించే అవకాశం దొరకడం తన అదృష్టంగా భావించాడు మార్టిన్ లూధర్. ఉద్యమంలో లూధర్ ప్రవేశం చికాగోను కలవరపెట్టింది.

 ఉత్తరాది నీగ్రోను నలిపేస్తున్నది పౌరహక్కుల సమస్య కాదు. జీవన ప్రమాణాల సమస్య. అందుకే దక్షిణాది వారికి, ఉత్తరాది వారికి మధ్య ప్రవర్తనలో వ్యత్యాసం కన్పిస్తుంది. ఉత్తరాదిలో కొరవడింది పౌరహక్కులుకాదు. వాటిని అనుభవించడానికి అవసరమైన ఆర్ధిక స్వాతంత్ర్యం. అది రాజ్యాంగం ప్రస్తావించని కొత్త హక్కు.

 1966 ఆగస్టు 26 న ఉత్తరాది వారి కోరికలను అంగీకరిస్తూ ఒప్పందం మీద సంతకాలు జరిగాయి. అదే ‘శిఖరాగ్ర ఒడంబడిక’ గా చికాగో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.

 ఆర్ధిక స్వేచ్ఛలేని లేని జాతి మిగతా ఏ హక్కునైనా నిలబెట్టుకోవడం సాధ్యం కాదని ఉత్తరాది రాష్ట్రాలు నిరూపించాయి. “నా దేశం నాలుకతో శాంతిని వల్లిస్తూ, చేతల్లో నరమేధం కొనసాగిస్తుంది. నిజాయితీ లోపించిన ప్రభుత్వం మాటలు నమ్మి నేను ఇంతకాలం నోరు మెదపకుండా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను” అంటాడు లూధర్.

 ఇంట్లో పేదరికం సహించరాని స్థాయికి పెరిగి హింసాత్మకంగా మారుతుంటే, గొప్పలకోసం లక్షల కోట్ల డాలర్లు విదేశాల్లో తగలేసి శవాలను మోసుకొచ్చుకోవడం చూడగలిగితే, ఆ రెంటికీ  మధ్యగల పరస్పర సంబంధం బోధపడుతుంది. అన్నింటికంటే నన్ను క్రుంగదీసింది ‘నీగ్రోలు’ ఇలాటి విషయాలు మాట్లాడగూడదనడం.

 1968  మార్చి 18 న లూధర్  మెమ్ఫిస్ చేరుకుని 15 వేల మందిని ఉద్దేశించి ప్రసంగించిన తరువాత కార్మిక సమస్యల మీద అర్జంటుగా న్యూయార్క్ వెల్లాల్సొస్తుంది. వాతావరణ ఇబ్బందులతో  22న తిరిగి రావాల్సిన వాడు కాస్తా 28 న మెమ్ఫిస్ చేరుకుని హుటాహుటిన ఊరేగింపుస్థలానికి చేరుకుంటాడు. 11 గం.కు ఊరేగింపు ప్రారంభమయ్యింది. ప్రదర్శన పదడుగులు వేసిందో లేదో  లూధర్ కి వంద గజాల దూరంలో పెద్ద విస్పోటనం జరిగింది. దాంతో ప్రదర్శనను వాయిదా వేసిన లూధర్ అట్లాంటా వెళ్ళిపోతాడు.

 ఏఫ్రియల్ 3 న లూధర్  తిరిగి మెమ్ఫిస్ చేరుకుని లారైన్ మోటెల్ 306 వ నెంబర్ గదిలో దిగుతాడు.

 ఏఫ్రియల్ 4 న మధ్యాహ్నం 3 గం.కు ఆ హోటల్ 5 బి నెంబర్ గదిలో జాన్ విల్లార్డ్ పేరుతో ఒక వ్యక్తి దిగుతాడు. దిగిన గంటలోనే బయటకెళ్లిన అతను ఒక రైఫిల్ని, బైనాక్యులర్స్ ను కొనుక్కుని తన గదికొచ్చాడు.  విల్లార్డ్ స్నానాల గది నుండి లూధర్ బాల్కనీ స్పష్టంగా కన్పిస్తుంది.

 లూధర్ తన స్నేహితులను బయటకు వెళ్లడానికి తయారుకండంటూ బాల్కనీ తలుపు తోసుకుని  బాల్కనీలో అడుగుపెట్టాడో లేదో! ఎదుట వున్న స్నానాల గదిలో నుండి రైఫిల్ గర్జించింది.

 తన జాతి జనులకు  స్వేచ్చా వాయువులను అందించిన ‘ఆయుధం పట్టని  యోధుడు’ నేలకొరిగాడు.  

 పుస్తకంలో రమణా రెడ్డి గారి రచనా శైలి ఎప్పటి మాదిరిగానే కదం తొక్కింది. తెలుగు పాఠకులకు లూధర్ జీవిత చరిత్రతోపాటు రెండు వందల ఏండ్ల పాటు అమెరికాలో జరిగిన జాత్యహాంకార అమానుషత్వాన్నీ కళ్ళముందు నిలిపారు.    

ప్రచురణ:  కవిత పబ్లికేషన్స్,  ప్రొద్దుటూరు

పుటలు : 256          వెల : రూ.120 /- లు.

సిరంశెట్టి కాంతారావు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *