మానవ స్వభావ వైరుధ్యాల పుట్టను పగలగొట్టిన నవల

Spread the love

మానవ స్వభావ వైరుధ్యాల పుట్టను పగలగొట్టి ప్రపంచ ప్రజల ముందుంచిన దొస్తొయేవ్ స్కీ సుప్రసిద్ధ నవల – ఇడియట్
1821లో పుట్టి అరవై ఏండ్లు బతికి 1881లో ( తన అరవైయ్యవ ఏట) భౌతికంగా కాలగమనంలో కలిసిపోయిన రష్యన్ మహా రచయిత దొస్తొయేవ్ స్కీ 156 ఏండ్ల కిందట (1869లో) ఈ ఇడియట్ నవల రాశాడు. తన 20వ ఏట పేదజనం నవలికతో రచనా రంగంలో కాలుమోపిన దొస్తొయేవ్ స్కీ 40 ఏండ్ల తన సుధీర్ఘ రచనా జీవితంలో పదమూడు నవలలు, మూడు నవలికలు, పదిహేడు కథలతో పాటు అనేక వ్యాసాలు కూడా రాశాడు. దొస్తొయేవ్ స్కీ శారీరకంగా బలహీనుడు. నరాల వ్యాధిగ్రస్తుడూ అయినప్పటికీ రచనా వ్యాసంగంలో మాత్రం మేరునగధీరుడనే పేర్కొనవచ్చు.
ఇడియట్ నవలా నాయకుడు ప్రిన్స్ మిష్కిన్. కథానాయిక నస్తస్య ఫిలిపోవ్నల తోపాటు మరో పాతిక, ముప్పై ప్రధాన పాత్రలతోపాటు మరికొన్ని అప్రధాన పాత్రలు కూడా పాఠకులకు నవల పొడవునా తటస్థపడుతుంటాయి. ఇంతమంది పేర్లు రష్యా దేశ సామాజిక, సమూహ గుర్తింపులను సూచిస్తూ వచ్చి పోతుంటాయి.
పాఠకులు వారి వారి వైయక్తిక సామర్ధ్యంతో, నిశిత పరిశీలనతో ఆయా వ్యక్తుల పేర్లను, వారి మధ్యగల సంబంధాలను గుర్తుపెట్టుకుంటూ చదివితే నవల యొక్క స్వారస్యం ఏమిటో? ఈ రచనతో రచయిత ఏం చెప్పదల్చుకున్నాడో? ఆనాటి రష్యా దేశ ఆచార వ్యవహారాలు, నివాస సముదాయాలు, ఆహార్యాలు, యజమాని, సేవక సంబంధాలు, నగర గ్రామీణ జీవన వైరుధ్యాలు క్రమ క్రమంగా అవగతమవుతూ ఒక కొత్తవెలుగును కళ్ళ ముందు ఆవిస్కృతం చేస్తూ పోతుంటాయి.
ఆరువందల యాభై ఐదు పేజీల బృహత్ నవలకు నాయకుడైన ప్రిన్స్ మిష్కిన్ ఎంతటి ధీరోదాత్తుడో? ఎన్నెన్ని అద్భుతాలు చేస్తాడో? కథాకాలం ఎన్ని తరాల నేపథ్యంతో? నిడివితో కొనసాగుతుందో? నని పాఠకులు అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే నవలా కాలం కేవలం మూడు మాసాల్లోనే ముగిసిపోతుంది .
కథానాయకుడు ప్రిన్స్ మిష్కిన్ కులీన వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే అతడు రాకుమారుడు కాదు, ఒక స్వంత కుటుంబంలేని ఒంటరి. నరాల, మూర్చ వ్యాధిగ్రస్తుడు. ఆ రోగాలకు వైద్యం చేయించు కోవడానికి స్విర్జర్లాండ్ దేశం వెళ్ళి నాలుగు సంవత్సరాల తరువాత తన స్వదేశమైన రష్యాలోని పీటర్స్ బర్గ్ పట్టణానికి రైల్లో వస్తుండడంతో నవల ఆరంభమౌతుంది. ఆ రైల్లో అతనికి అదే పట్టణానికి వస్తున్న ఇద్దరు సహప్రయాణీకులుకలుస్తారు. ఒకరి కొకరు పరిచయమవుతారు. వారిమధ్య ఆ పట్టణ, అక్కడి వ్యక్తులమీద అనేక విషయాలమీద ప్రస్తావనలొస్తాయి.
పీటర్స్ బర్గ్ స్టేషన్ లో దిగిన మిష్కిన్ని తనకు దూరపు బంధువులైన జనరల్ యెపాంచిన్, మేడమ్ ఎలిజవెటా కుటుంబం స్వాగతిస్తుంది. ఆ దంపతులకు పెండ్లీడుకొచ్చిన ముగ్గురు కుమార్తెలుంటారు. వాళ్లందరితో మాట్లాడి ఒక పార్టీ కి హాజరైయినప్పుడు, నిస్సంతుడైన ఓ రాజకుటింబీకుడు చనిపోతూ తన యావదాస్తిని మిష్కిన్ పేర రాసిపోయాడన్న విషయం అందరికీ తెలుస్తుంది. దాంతో అతను విస్తుపోతాడు. జనరల్ యెపాంచిన్ దంపతులు తమ చిన్న కుమార్తెను అతనికిచ్చి పెండ్లు చేయాలన్న ఆలోచనకొస్తారు.
ఆ క్రమంలోనే ప్రిన్స్ కున్న ద్వంద్వ ప్రవృత్తితోకూడిన మానసికరోగం విషయం ఆ కుటుంబంతో పాటు పాఠకుల ముందుకొస్తుంది. ఆ జబ్బు కారణంగా అతను ఎదుటివాళ్ళు చెబుతున్నది మౌనంగా ఆలకిస్తున్నట్టు, దాన్ని విశ్లేషించుకుంటున్నట్టుగా కన్పిస్తూనే అంతరంగంలో మాత్రం మరోవిధంగా ఆలోచిస్తుంటాడు. ఈ క్షణంలోనే తానో తెలివైన వ్యక్తిగా అనేక విషయాలని ఎదుటివారికి వివరించి చెబుతుంటాడు. మరుక్షణంలోనే ఏమీ తెలియని అమాయకుడు మాదిరిగా ప్రవర్తిస్తుంటాడు. ఓకే మనిషిలో రెండు విరుద్ధ స్వభావాలు కలిగివుండే అరుదైన మానసిక వ్యాధిని గురించి 156 ఏండ్ల క్రిందటే విస్తృతమైన అవగాహనతో ఓ నవల వ్రాయడమేకాదు. తదనంతర కాలంలో నీషే వంటి ప్రపంచ ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్తలకు ఎందరికో మార్గదర్శకుడు అయ్యాడంటే ఒక రచయితగా దొస్తొయేవ్ స్కీ ప్రతిభాపాఠవాలు ఏపాటివో మనం అర్ధం చేసుకోవచ్చు.
మిష్కిన్ యెపాంచిన్ ఇంట్లోనే మొట్ట మొదటిసారిగా నస్తస్య ఫిలిపోవ్న చిత్రపటాన్ని చూసి ఆవిడపట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. ఆ మరునాడే ఓ విందులో అనుకోకుండా పిలిఫోవ్నను ప్రత్యక్షంగా చూసిన మిష్కిన్ ఆవిడ పట్ల ఆకర్షితుడవ్వడమేకాక, పెండ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు.
పీటర్స్ బర్గ్ లోని యువకులు, వృద్ధులు ఆవిడ పొందుకోసం వెంపర్లాడుతుంటారు. వాళ్ళల్లో నవలా ప్రతినాయకుడు రోగోజీన్ కూడా ఒకడు. అతను ఫిలిపోవ్నను తీవ్రంగా ఇష్టపడుతు, ఆవిడకోసం ఎంతకైనా తెగించడానికి సిద్దమౌతాడు. అందుకు తన పథకాలు తను వేస్తుంటాడు.
ప్రిన్స్ మిష్కిన్ అనుకున్నట్టుగానే ఫిలిపోవ్న కూడా పెండ్లికి ఒప్పుకుంటుంది. అయితే, అదే సమయంలో జనరల్ యెపాంచిన్ దంపతులు తమ చిన్న కూతుర్ని మిష్కిన్ కిచ్చి పెండ్లు చేయాలనుకుంటారు.
ఆరోజు రాత్రి ఫిలిపోవ్న, ఏమైందన్నది ఆసక్తికరంగా మారి చివరకు పాఠకుడు ఊహించని సంఘటనలతో కథ ముగుస్తుంది
జరిగిన విషయాలకు తీవ్రంగా చలించిపోయిన మిష్కిన్ కి రోగం తిరగబెట్టడంతో వైద్యం కోసం రైలెక్కి మళ్ళీ స్విర్జర్లాండ్ వెళతాడు.
ఈ మధ్యలో ఎన్నెన్ని అనూహ్య సంఘటనలో!?, ఎన్నెన్ని చిత్ర విచిత్ర స్వభావాల పాత్రలో!? ఎన్నెన్ని మానసిక సంఘర్షణలో!? ఓ జాలరి నైలాన్ దారంతో జాలెపోస్తూ వల అల్లినట్టుగా రచయిత దొస్తొయేవ్ స్కీ నవలను కూర్పుపోసుకుంటూ తీసుకుపోయిన తీరుకు పాఠకులకు విస్తుపోవడం వినా మరో దారిలేదు.
ఆయితే, తెలివైన పాఠకులు మాత్రం దొస్తొయేవ్ స్కీ నవలకు ముందుగా శీర్షికను ఎంచుకొని, దానిచుట్టూ సంఘటనల మీద సంఘటనలను కార్పెంటర్ ఒకడు టేకు చెక్క మీద లతల్ని, పువ్వుల్ని, ఆకుల్ని చిత్రిక పట్టినట్టు పేర్చుకుంటూ నవలను అందమైన, విలక్షణమైన అక్షర సౌధంగా తీర్చిదిద్దాడు. రచనలో అంత నైపుణ్యం సాధించిన రచయిత కాబట్టే దొస్తొయేవ్ స్కీ రచనలు ప్రపంచ వ్యాప్తంగా 172 భాషల్లోకి అనువదించబడ్డాయి.
ఒకపాఠకుడిగా ఈనవలను చదువుతున్నంతసేపు ఎందుకోగాని నా ప్రమేయం లేకుండానే నా మనో నేత్రం ముందు వంగ రచయిత శరత్ చంద్రుడు రాసిన దేవదాస్ నవల అనేక సన్నివేశాల్లో, పాత్రల్లో కన్పించింది. ఇదే విధంగా ఇడియట్ నవల ప్రపంచ వ్యాప్తంగా ఎన్నెన్ని దేశాల్లో? ఎన్నెన్ని భాషల్లో? ఎందరెందరిలో స్ఫూర్తిని నింపిందో ఎంతటి వారికైనా ఊహకు అందని అంశం.
నవల పొడవునా పాఠకులను కట్టిపడేసే సందర్భాలు కోకొల్లలుగా కంట పడతాయి. వాటిల్లో మచ్చుకు కొన్ని:-
 ఓ సైనికుణ్ణి యుద్ధంలో ఫిరంగితో కాల్చు, ఎక్కడో అక్కడ బతికే అవకాశం వుంటుంది. అదే సైనికునికి మరణశిక్ష వేసిన తీర్పు చదివి విన్పించు. ఆ క్షణం నుండి వాడు ఎంతో క్షోభను అనుభవిస్తాడు. అదే వ్యక్తిని ఉరితీయబోయే ముందు క్షమాభిక్ష లభిస్తే వాడు మాత్రమే ఆ క్షోభ, భయాలను గురించి చెప్పగలడు. పే.49 &84.
 మానవ జీవితంలోని శూన్యత ఎన్ని నేర్పులు ప్రదర్శిస్తుందో చెప్పలేం. పే.149.
 ఆరోజుల్లో (12వ శతాబ్దంలో) మతాధిపతులు సాధారణ ప్రజలకన్నా అరవై రెట్లు సంపన్నులుగాను, లావుగాను వుండేవాళ్లు. పే.414.
 జీవితంలో ముఖ్యమైనది జీవితమే. జీవితాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం ముందు ఏ ఆవిష్కరణ అయినా నిలుస్తుందా? పే. 430.
 పరమాత్మను అర్ధం చేసుకోలేక మన ఆలోచనలు, అతనికి ఆపాదించడమంటే ఆయన్ని మన స్థాయికి తగ్గించడమే పే.450.
 బలహీనమైన మనస్తత్వం వున్న వాళ్లకు నేరం చేయడం ఆఖరి మార్గంగా వుంటుంది పే. 458.
 అందరికీ రెండు రకాల మనసుంటుంది. ఒకటి పట్టించుకునేది రెండు పట్టించుకోనిది పే.464.
 పే 534 నుండి 544 పేజీల మధ్య నెపోలియన్ కి కోల్యా అనే ఓకుర్రవాడికి మధ్య నడిచే సన్నివేశాలు ఎవరికైనా చదవడమే తప్ప, వివరించడానికి వీలుకానంత గొప్పగా నెపోలియన్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన దొస్తొయేవ్ స్కీ రచనా సామర్ధ్యం అద్భుతంగా పండింది.
ఇటువంటి వ్యాఖ్యలు నవలాకాశమంతటా పునాస దుక్కిలో ఎద గొర్రుకున్న జడ్డిగం గుండా పజ్జొన్నలను ఎదబెట్టినట్టుగా గుప్పించి వదిలాడు దొస్తొయేవ్ స్కీ.
ఇక చివరిగా 156 ఏండ్లుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లోకి అనువదించబడిన ఈ ఇడియట్ నవల, ఇన్నేండ్ల తరువాతనైనా తెలుగులో వెలుగు చూసిందంటే అందుకు ప్రధాన కారకుడైన కుమార్ కూనపరాజు, దాదాపు ఆరు మాసాలపాటు ఆంగ్లభాషలో వున్న నవలతో రేయింబవళ్ళు హోరా హోరీ కుస్తీలుపట్టి విజయవంతంగా తెలుగులోకి అనువాదం చేసిన అడ్వకేట్ వై.వేణుగోపాల్ రెడ్డి గార్లకు తెలుగు పాఠకులు ఋణపడిపోయినట్టే.
ఇటువంటి విలువైన రచనలను వెలువరించడంలో ఎప్పుడూ ముందు వరుసలో నిలిచే సాహితి ప్రచురణలు విజయవాడ వారు సదా అభినందనీయులు.
ప్రచురణ : సాహితీ ప్రచురణలు పేజీలు :- 655 వెల :- రూ.500/- లు.
శిరంశెట్టి కాంతారావు,

సిరంశెట్టి కాంతారావు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *