After all tomorrow is another day

చివరకు మిగిలేది అని బుచ్చిబాబు రాసినా, చివరకు మిగిలింది అంటూ మార్గరెట్ మిచెల్ రాసినా మిగిలేది, మిగిలింది పక్కనపెడితే అసలు ఆ ‘చివరికి’ ప్రశ్నే క్లిష్టమైనది. ఏం మిగులుతుంది? అసలెందుకు మిగలాలి ? అంటూ ప్రశ్నల చిక్కుముడులు విప్పుకుంటూ పోతే ‘చివరికి మిగిలేది’ మనిషి, ఆ మిగుల్చుకోవడానికి మనిషి నడిచొచ్చిన దారి మాత్రమే.


ప్రతిదారీ ఎప్పటికప్పుడు ఎవరికి వారికి ప్రశ్నలు సంధిస్తూనే ఉంటుంది. కొందరికి అప్పుడే సమాధానం దొరుకుతుంది, మరికొందరికి ఆ దారి దాటుకొచ్చిన చివర కాలం సమాధానమిస్తుంది.
అలాంటి సమాధానం లేని ప్రశ్న స్కార్లెట్. అలెక్స్ హేలీ రాసిన ‘రూట్స్’ నీగ్రో బానిస కోణాన్ని పరిచయం చేస్తే,
1861లో అబ్రహం లింకన్ బానిస వ్యవస్థను రద్దు చేసిన తర్వాత అమెరికాలో చెలరేగిన అంతర్యుద్ధ సమయాన భూస్వామ్య కుటుంబాల కోణంలో మార్గరెట్ మిచెల్ రాసిన నవల ‘గాన్ విత్ ద విండ్’.
బానిస వ్యవస్థ రద్దుతో అన్నాళ్లుగా బానిసల మీద తమ వ్యవసాయ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ వచ్చిన అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లోని భూస్వామ్య వర్గాల్లో ఒక్కసారిగా అసమ్మతి పెల్లుబుకుతుంది. దాన్ని అనగదొక్కడానికి ప్రభుత్వం సైన్యాన్ని పంపిస్తుంది.యుద్ధం మొదలవుతుంది. యాంకీల సైనిక శక్తి, సుశిక్షిత యుద్ధ తంత్రాల ముందు దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ప్రతి కుటుంబంలో విషాదమే. స్త్రీలు, వికలాంగులు తప్ప కుటుంబాలకు కుటుంబాలే తుడుచుకుపోతుంటాయి.అలాంటి ఒకానొక భూస్వామ్య ఉన్నత కుటుంబాల్లో అందం ఉండి, ఆ అందాన్ని అందరూ ఆరాధించాలనే ఒక రకమైన మనస్తత్వంతో తనకంటూ ఒక ప్రత్యేకతను కోరుకునే స్కార్లెట్ ఒకటి.


నవల మొత్తం ఆమె చుట్టూనే, ఆమె కోణంలోనే తిరుగుతుంటుంది. యుక్త వయసు రాగానే యాస్లీ విల్కీష్ తో ప్రేమ. అతడు నిరాకరిస్తే అతను అసూయపడేలా చెయ్యాలని అప్పటికప్పుడు చార్లెస్ ను పెళ్లి చేసుకుంటుంది. చేసుకుంటుందే గానీ అతని మీద ఎటువంటి ఆపేక్షా ఉండదు. పెళ్లైన నెలకల్లా అతను యుద్ధంలో మరణిస్తాడు గానీ అతని మూలంగా కొడుకు పుడతాడు. కొడుకు పైన స్కార్లెట్ కు ఎలాంటి ప్రేమాభిమానాలూ ఉండవు. అదొక భారంలా భావిస్తుంటుంది.
యుద్ధం ముదిరి వీళ్లు నివాసముంటున్న అట్లాంటా, టారా ల్లోని నివాసాలు సహా మొత్తం నేలమట్టం అవుతుంది. తిండికి కూడా గతిలేని స్థితిలో యాష్లీ యుద్ధం నుంచి తిరిగొస్తాడు. స్కార్లెట్ ఎంత చెప్పినా తను తన భార్యకే స్వంతం అంటాడు యాష్లీ. యాష్లీ భార్య మెలనీ చార్లెస్ తరపున బంధువు.మెలనీ తొనకని కుండాల నిండైన సాంప్రదాయ గృహిణి ఆలోచనలు.స్కార్లెట్ అందుకు పూర్తి విరుద్ధం. తొనికే కుండ. ఎప్పటికప్పుడు తన ఆలోచనల వెంట, అనుభవాల వెంట పరిగెడుతూ పోతుంటుంది.


విధిలేని పరిస్థితుల్లో యాష్లీ, అతని భార్య మెలనీతో పాటు పదిమంది పోషణ స్కార్లెట్ మీదే. కష్టాలే పడుతుందో, కన్నీళ్లే కారుస్తుందో, తప్పులే చేస్తుందో. కుటుంబాన్ని మాత్రం కష్టపడి నిలబెడుతుంది. తన సంస్థానం టారా దివాలా పరిస్థితుల్లోకి జారుతుందనగా విధిలేని పరిస్థితుల్లో తన స్వంత చెల్లెలు ప్రేమించిన కెన్నెడీని తనే వివాహం చేసుకుని సంస్థానం, కుటుంబంతో పాటు తను కూడా నిలబడుతుంది. అతనితో కూతురు.
మధ్యలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలు దేశ ద్రోహిగా అసహ్యించుకునే బ్లాక్ మార్కెట్ స్మగ్లర్ రెడ్ బట్లర్ తో స్నేహం. రెడ్ బట్లర్ అంటే స్కార్లెట్ కు ఒళ్లంతా కంపరం కానీ ఆమె అంతరంగం అంతా చదివినట్టుగా ఉండే అతన్ని, అతని ద్వారా సమకూరే తన అవసరాల్ని దూరం పెట్టలేని మానసిక, ఆర్తిక స్థితి.


కెన్నెడీ చనిపొయ్యాక ఆస్థి కోసం రెడ్ బట్లర్ ను చేసుకుంటుంది. అతనితో ఒక కూతురు. ఇప్పుడు స్కార్లెట్ ది ఆర్థికంగా అట్లాంటాలోనే ఆ మాటకొస్తే దక్షిణాది రాష్ట్రాల్లోనే సంపన్న కుటుంబం ఇప్పుడు. ఏ లోటూ లేదు అయినప్పటికీ తన తొలిప్రేమ యాష్లీ మీద ఆశను వదులుకోదు.అది ప్రేమో వ్యామోహమో ఆమెకే తెలియదు కానీ ఆమెను అణువణువూ చదివిన రెడ్ బట్లర్ కు స్కార్లెట్ ఆలోచనల తాలూకు ప్రతి అంతరంగమూ తెలుసు.ఇక్కడ ఆమె ప్రేమ పేరుతో కోరుకునేది యాష్లీని అయితే వాస్తవం మాత్రం రెడ్ బట్లర్ చుట్టూరా తిప్పుతుంది, మన ఆలోచనలకు వాస్తవాలకు అంతరంలా.


ఊహల్లో ఎవ్వరైనా ఎంతో నిక్కచ్చిగా, నిబద్ధంతగా ఉండొచ్చు గానీ వాస్తవం ముందు మాత్రం తలొంచక తప్పదు. స్కార్లెట్ చేసింది అదే. కుటుంబం, సమాజం మొత్తం తనని, తన చర్యల్ని చీదరించుకుంటున్నా కూడా కళ్ళముందర కనపడే వాస్తవం ప్రతిసారి ఆమె కోరుకున్న జీవితం నుంచి దూరంగా విసిరేస్తుంటుంది.
‘గాన్ విత్ ద విండ్’ ‘పరిస్థితుల వెంట ప్రయాణం’ అంటూ సాగే ఈ 514 పేజీల నవల చదువుతున్నంత సేపూ మనలో, మనతో మనం అంటూ స్థలకాల పరిస్థితులకతీతంగా ఎక్కడోచోట కనిపిస్తూనే ఉంటాము.
చివరికి రెడ్ బట్లర్ కూడా ఆమెను వదిలిపోతుంటాడు. వదిలి వెళ్లొద్దు అని బతిమాలుతుంది. బట్లర్ వినకుండా బయటికి నడుస్తాడు. అప్పుడు స్కార్లెట్ నోటినుంచి వచ్చే మాట ‘After all tomorrow is another day’. ఈ మాటతో నవల ముగుస్తుంది.
తెలుగులో అన్వయించాలంటే ‘అన్ని దారులూ మూసప్పోయినా రేపంటూ ఒకటుండకపోదు’ అని.
ఆ ఆశావాద దృక్పథమే మనిషిని ముందుకు నడిపేది. అదే స్కార్లెట్. అదే నవల కూడా.


రాయలసీమ హక్కులువకావొచ్చు, మరొకటి కావొచ్చు రాజకీయంగా ఎప్పుడూ ఒక ఉద్విగ్న పరిస్థితుల్లో గడిపిన ఎంవీ రమణా రెడ్డి గారు రాజకీయాలకు ఆవల ఆయన చేసిన ఈ అనువాదం ఆయన సాహిత్యాభిలాషిగా ఆయన స్థాయిని తెలుపుతుంది. ఆయనకు ఈ నవల పరిచయం చేసిన మాలతీ చందూర్ గారికి, అంత గొప్ప పుస్తకాన్ని నవలను నాకు బహుమతిగా ఇచ్చిన భూమన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.


నవల చదివిన తర్వాత సినిమా చూశాను. 1940ల్లో తీసినా కూడా నాటి పరిస్థితులను ఒడిసిపట్టేలా సినిమాటోగ్రఫీకి ఒక మాస్టర్ పీస్.

Vivek Lankamala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *