మోదుగుల గడ్డ

Spread the love

ధనుర్మాసం, సోమవారం ఏకాదశి తెల్లవారు జామున ఐదు గంటల కల్లా అర్చకుడు యామనాచార్యులు ఫణిగిరి గ్రామం నడిబొడ్డునున్న  శ్రీసీతారామచంద్రస్వామి వారి చిన్న కోవెలలో అభిషేకాదులను, నివేదనలను, తిరుప్పావై పాశురాల పారాయణాన్నీ  ముగించి  జేగంట మ్రోగించారు.

          గంటా నాదం విని, వచ్చిన భక్తులందరికీ తీర్ధ ప్రసాద వితరణ చేసిన తరువాత “ఇక ఈ రోజుకు రావాల్సిన భక్తులంతా వచ్చి పోయినట్టే” అనుకుంటూ గర్భగుడి అంతర ద్వారం ముందర కూర్చుని, గజేంద్ర మోక్షం ఘట్టాన్ని ఎత్తుకో బోతుండగా బయట మండపంలో ఎవరో  ఓ వ్యక్తి తనలో తను కుళ్లి కుళ్లి ఏడుస్తున్నట్టుగా వినిపించడంతో “ఎవరబ్బా!?” అనుకుంటూ చేతిలోని గ్రంథాన్ని వ్యాసపీఠం మీదుంచి,  గబ గబా బయటికి నడిచారు.

          అక్కడ, డొక్కలు ఎగిరెగిరి పడేలా ఏడుస్తున్న చాకలి ముకుందం కనిపించడంతో ఆశ్చర్యపడిపోతూ “నాయనా! ముకుందం! పట్నం నుండి ఎప్పుడొచ్చావు? ఎందుకేడుస్తున్నావ్? ” అంటూ అనునయంగా అడిగారు. 

          తనలోని  ధుఃఖపు వెల్లువ తీసిపోయిన తరువాత “నాయిన గారూ! అయ్యాల్టినాడు మీరెంత చెప్పినా ఇనకుంట,  తినే తినే అన్నాన్ని కాలదన్నుకొని, పిల్లగాండ్ల చదువు కోసమని ఊరు బంధం తెంపుకొని పట్నం పోయినం.

          పోయినందుకు ఆడ మంచిగనే ఓ అపార్ట్ మెంట్ ల వాచ్ మేను కొలువు దొరికింది.  నేనా పని చూసుకుంటనే, ఇస్త్రీ పెట్టె ఏసేటోణ్ణి. మా రేణుకేమో పొద్దు మాపు నాలుగు ఇండ్లల్ల పాసిపన్లు చేసేది. ఇద్దరమట్లా కష్టపడి పిల్లగాళ్లను చదివించుకుంట వచ్చినం. ఇప్పుడు చిన్నోడు ఎనిమిది, పెద్దోడు పది చదువుతున్నరు.

          ఆ పట్నం మీద మన్నుబడ చదువుకుంటున్న చిన్న చిన్న పొరలకు గూడ ఆ బళ్ళల్లనే ఏట్లా? అలవాటు చేస్తున్నరో  ఆ దేవునికే ఎరుక?” అంటూ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకోసాగాడు ముకుందం.        

          అతను చెప్పేదంతా జాగ్రత్తగా ఆలకిస్తున్న యామనాచార్యులు “ఇంతకూ వాళ్ళకు ఏమలవాటైంది!?” వల్లెవాటు సరిచేసుకుంటూ ఆశ్చర్యంగా అడిగాడు.

          “గంజాయి!” రుద్ధమైపోతున్న కంఠంతో బదులిచ్చాడు ముకుందం.

          “ఏంటీ! గంజాయా! అంత చిన్న పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారా?” సమాజం ఏమైపోతుందోనన్న భయాందోళనలు తన గొంతుని ఆకురాయిలా రాపాడుతున్నట్టు  విలవిల్లాడిపోతూ అడిగాడు అర్చకుడు యామనాచార్యులు.

          “ఔను నాయిన గారూ! ఎవరో మత్తుమందుల దందా గాళ్ళు వాళ్ళ యాపారం కోసం ఇస్కూళ్ళ మీదబడి చిన్న చిన్న పిల్లలకు గూడ గంజాయి అలవాటు చేస్తున్నారు. మా పిల్లగాళ్ళు గూడా దానికి అలవాటు పడ్డారు. ఆ ముచ్చట మాకు తెలిసేటప్పటికి ఆలస్యమైపోయింది. మేము ఎన్ని రకాలుగా బుజ్జగించిన, భయపెట్టిన వాళ్ళా అలవాటుకు దూరంగాలేక పోతుండడంతో ఏంచేయాలో తోచక మాకు తెలిసినోళ్లను సంప్రదించాము.    

          వాళ్లిచ్చిన సలహా ప్రకారం పిల్లల్ని తీస్కపొయ్యి పట్నం శివార్లలో వున్న ఓ స్వచ్ఛంద సంస్థలో చేర్పించాము. ఆ సంస్థవాళ్ళు  పిల్లగాళ్లను గంజాయి అలవాటు నుంచి  దూరం చెయ్యడం కోసం  ప్రత్యేకంగా ఏవో ఏర్పాట్లు చేశారట. వాళ్ళు  కనీసం ఆరు నుంచి పది నెల్లపాటు పిల్లగాళ్ళను అక్కడే వుంచాలని చెప్పారు. దాంతో ఇగ మేమక్కడ వుండలేక తట్టా బుట్టా సర్దుకొని మనూరొచ్చినం” చెబుతూ చెబుతూనే మళ్ళీ హోరుమంటూ ఏడవసాగాడు ముకుందం.

          “ఏడవకు, మనం చేసే పనుల ఫలితం,  మనమే  అనుభవించాలి తప్పదు. వద్దు వద్దంటున్నా వినకుండా  పిల్లల చదువుల కోసమని వీసమెత్తు అంటు సొంటూ లేకుండా ఇల్లు వాకిలి  అలవలు, సలవలుగా అమ్ముకొని ఊరిడ్చి వెళ్లిపోతిరి. ఇప్పుడు చూడు పర్యావసానం ఏవిధంగా ముందుకొచ్చిందో?” అంటూ తన సానుభూతిని వ్యక్తం చేశారు యామనాచార్యులు.

          “నాయిన గారూ! మీరేదన్నా చెయ్యండ్రి! మాకు మాత్రం ఊల్లే ఇంత బతుకు తెరువు చూపించురి!” అంటూ చేతులు జోడించాడు ముకుందం.

          “వుండు” అంటూ లోపలికెళ్లిన అర్చకస్వామి అక్షయపాత్రలో మిగిలున్న పొంగలిని మర్రాకుల డొప్పనిండా పెట్టుకొచ్చి “ముందిది తిను. తర్వాత మాట్లాడుదువుగాని” అన్నారు.

          ఆ ప్రసాదాన్ని అందుకున్న ముకుందం నేరుగా బావి దగ్గరికెళ్లి ప్రసాదాన్ని తిని, నీళ్లు తోడుకొని తాగి,  తిరిగి మండపం దగ్గరి కొచ్చాడు.

          అప్పటిదాకా మండపం చివరనున్న ఓ స్థంబాన్ని ఆనుకుని కూర్చుని, ఏదో ఆలోచిస్తున్న అర్చకుడి దగ్గరి కొచ్చిన ముకుందం అతనికి ఎదురుగా కొంచం ఎడంగా గచ్చు మీద కూర్చున్నాడు.

          మరికొంతసేపు అట్లాగే కూర్చున్న యామనాచార్యులు మెల్లగా తల ఎత్తి ముకుందం వంక చూస్తూ “ఒక పనిచేస్తావా?” అన్నారు.

          “చెప్పండయ్యా! “ అన్నట్టు చూశాడు ముకుందం.

          “మన పెద్దకోవెల గుట్ట వెనుక, గుర్రాల టప్పా బంగ్లాకు ఆవల, కోతుల మాన్యం దాటగానే, మోదుగుల గడ్డ వుందికదా?” అంటూ ఎందుకో! చెప్పేది చెప్పేది ఆపేశాడు యామనాచార్యులు.

          “ఆపిండేంద్రయ్యా ! చెప్పండ్రి!” ఆసక్తిగా అడిగాడు ముకుందం.

          “ఎంలేదు. నువ్వు రోజూ ఆ గడ్డకు పొయ్యి, మొయ్యగలిగినన్ని మోదుగు బడితెలు కొట్టుకొచ్చి సమిధలుగా కొట్టి, వాటిని తిర్మలగిరి తీసుకపొయ్యి మనూరి శేషయ్య శేట్ దుకాణంలో నేను చెప్పానని ఇవ్వు. ఆయన వాటిని తూకమేసి తీసుకొని  రేటు కట్టిస్తాడు తీసుకో. 

           నాగారం, తిర్మలగిరి రెండు మండలాల్లో ఏ ఊళ్లో,  ఏ అయ్యగారు  హోమం చెయ్యాలన్నా ఆ శేషయ్య శేట్ దుకాణానికే రాస్తారు. అక్కడైతే హోమద్రవ్యాలన్నిటితో పాటు మంచి సమిధలు కూడా దొరుకుతాయి.

          నువ్వు ఈపూటే తిర్మలగిరి పొయ్యి, శేట్ ను కలువు. అతను ఏం చెబుతాడో శ్రద్ధగావిని, మనసుకు పట్టించుకో అంతా మంచే జరుగుద్ది” అంటూ తక్షణమే ముకుందం కుటుంబానికి అవసరమైన జీవనోపాధికి, తనకు తెలిసిన మార్గాన్ని సూచించారు యామనాచార్యులు.       

          వారు చెప్పేదంతా శ్రద్ధగా విన్న ముకుందం “సరేనయ్యా! పది గంటలకల్ల తిర్మలగిరి పొయ్యొస్తా” అంటూ లేచాడు.

          “ఇంతకూ మీరెక్కడ దిగారు?”ముకుందం వంక చూస్తూ అడిగాడు అర్చకుడు.

          “ కుమ్మరోళ్ల రంగన్న ఇంటి ముందటున్న సుట్టు గుడిశల దిగినం” తల నేలకు  వాల్చి చూస్తూ బదులిచ్చాడు ముకుందం.

          “మీరీ ఊరు నుండి పట్నం పోయినంక మెల, మెల్లగా మా ఆవులన్నింటిని తీసేశాము. ఇంటి వెనుకనున్న ఆ కొట్టం మాత్రం అంతే వుండిపోయింది. మీకు ఇష్టమైతే దాన్ని బాగుచేకొని అందులో వుండండి!” గణించలేని మనిషి తనంతో చెప్పుకొచ్చాడు అర్చకుడు యామనాచార్యులు.

          “మంచి రోజెప్పుడో చెబితే ఆ రోజొచ్చి కొట్టాన్ని బాగుచేసుకుంటామయ్యా!” కోరకుండానే ఎదురుగా ప్రత్యక్షమై వరమిచ్చిన వేల్పును చూసినట్టుగా యామనాచార్యులు  ముఖంలోకి చూస్తూ బదులిచ్చాడు ముకుందం.

          “తరువాత చూసి చెబుతాలేగాని, ముందు నువ్వు తిర్మలగిరి పొయ్యి ఆ శేట్ ను కలిసిరాపో” అంటూ అతన్ని  పంపించేశాడు అర్చకుడు.

                                                          ***

          “ఏం ముకుందం చాన్నాళ్ళకు కన్పిస్తివి!?  ఊళ్ళో కెప్పుడొచ్చినవ్?” దుకాణం ముందుకొచ్చి, తనను ఏదో అడగాలని, అడగలేక తటపటాయిస్తున్న ముకుందం పరిస్థితిని గ్రహించి, తానే ఆదరంగా పలకరించాడు శేషయ్య శేట్.

          “మూడు దినాలైతుంది శేట్” అంటూ బదులిచ్చిన ముకుందం అప్పటిదాకా అర్చకునికి,తనకు మధ్యన జరిగిన విషయాలన్నింటినీ పొల్లుపోకుండా వివరించాడు.

          ముకుందం చెప్పిందంతా విన్న శేషయ్య శేట్ అతని ముఖంలోకి తీక్షణంగా చూస్తూ “బతుకంటేనే అంత. కొన్నాళ్లు చీకటి, కొన్నాళ్లు వెన్నెల.  అయినా ఎంగాదులే ధైర్యంగుండు. రోజులేప్పుడూ ఒక్కతీరుగనే వుండవు, మెల మెల్లగా మీ ఇక్కట్లన్నీ తొలిగిపోతాయిలే.

          బతుకు తెరువు కోసం అయ్యగారు నీకో మంచి తోవ చూపించిండు. ఆయనన్నట్టు మన కాడ, కూలి నాలి చేసుకొనే పాఠక జనం ఎవ్వరిగ్గూడ, యాగం జెయ్యనీకి మోదుగు కర్ర పనికొస్తుందన్న తెలివిడిలేదు. ఒకవేళ వున్నా ఆపని చెయ్యటం చిన్నతనంగా అనుకుంటారేమో తెలవదు. మన అయ్యగారే చెప్పినంక ఇంక ఎవ్వరైనా మాట్లాడేదేముంది? అట్లనే తీసుకుంటగాని తేపో” అంటూ ముకుందానికి భరోసా ఇచ్చిన శేషయ్య శేట్, వాటిని ఏవిధంగా తయారుచేసి తీసుకురావాలో కూడా   కూలంకషంగా వివరించాడు.     

          శేట్ చెప్పిన ప్రతి విషయ్యాన్ని శ్రద్ధగావిని, బుర్రలో పదిలపర్చుకున్న  ముకుందం “అట్లనే తెస్తా శేట్!” అంటూ బదులిచ్చి అతని దగ్గర శలవు తీసుకున్నాడు.

          శేట్ దగ్గర్నుండి నేరుగా ఇనుప దుకాణం కాడికి పోయి, ఓ పెద్ద గొడ్డలి,  ఓ చిప్ప గొడ్డలి, ఓ కోటకత్తి  కొన్నాడు. 

          అక్కణ్ణుండి కమ్మరి కొలిమి దగ్గరికెళ్లేసరికి అక్కడ పది పదిహేను మంది గొడ్డల్లు సాటేయించడానికని వరుసలో కూర్చుని వున్నారు. 

          వాళ్ళవంక ఆశ్చర్యంగా చూసిన ముకుందం “గొడ్డల్లు సాటేయించుకొటానికి ఇంతమందున్నరేంది!? ” అంటూ అక్కడున్న ఓ పెద్దమనిషిని అడిగాడు.

          “ఏముంది? ఊళ్ళల్లో ప్రతోడు యవసాయం బందుబెట్టుడు, పట్నం బోయ్యి ఆటో తోలుకుంటనో, అడ్డమైన పన్లు జేసుకుంటనో రోజులు ఎల్లదీసుకుంటుండ్రు. ఇక్కడ ఊల్లళ్ళనేమో చెలకల్నిండా సర్కార్ తుమ్మలు  కిర్రుమని అడివి పెరిగినట్టు పెరిగిపోయాయి.

           వాటిల్ల అడివి పందులు తయారయినాయి. గుడ్డిలో మెల్లన్నట్టు ఈ మధ్యన్నే ఆంధ్రా నుంచి ఎవరో శేట్లొచ్చి, ఎకరాని కింతని గుండు గుత్తగా చెట్లను మాట్లాడుకొని, డోజర్లు తెచ్చి, ఎకరాల కెకరాలు సాఫ్ జెయిస్తున్నారు. కూలిన చెట్లను కరెంట్ రంపాలతోటి తుంటలు కోయిచ్చి, ఇక్కడే భట్టిలు పెట్టిచ్చి బొగ్గు కాల్పిచ్చి ఎటో తోలకపోతున్నరు.

          అందుకే ఈమధ్య కమ్మరోళ్ళకు మాలావు గిరాకీ పెరిగింది.” అంటూ చెప్పుకొచ్చాడా పెద్దమనిషి. 

          ఆ వరుసలో ముకుందం వంతొచ్చి, గొడ్డళ్ళకు సాన బెట్టిచ్చేటప్పటికి పది గంటల రాత్రయ్యింది. 

          సాటేసిన గొడ్డల్లు చల్లబడిన తరువాత వాటిని గొడ్డలి కామకు తగిలించి, దాన్ని భుజాన పెట్టుకొని ఊరు దారిపట్టాడు ముకుందం.       

***

          మరునాడు పొద్దున్నే ముకుందం దంపతులు  ఇంత తిని, ఇంత సద్ది కట్టుకొని  గొడ్డల్లు, తీసుకుని మోదుగుల గడ్డకు చేరుకున్నారు.

          ఆ గడ్డ మీద నుండే ఎదురుగా వున్న గుట్ట మీది పెద్ద కోవెల్లోని రాముల వారికి దండం పెట్టుకుంటూ “పట్నంల వున్న మా పిల్లగాళ్లను సల్లంగజూడు, మేం మొదలు పెడుతున్న  ఈ పనిల నాలుగు పైసలు కండ్ల జూసేటట్టు జెయ్యి రామయ్య తండ్రీ!” అంటూ మొక్కుకున్నారు. 

          గొడ్డలి  అందుకున్న ముకుందం ఎదురుగా వున్న  ఓ మాదిరి మోదుగు చెట్టెక్కి పందిరి గుంజలంత లావునున్న కొమ్మల్ని తెగెయ్యసాగాడు.

          మధ్యాహ్నం భోజనాల వేళకు కొమ్మలన్నీ తెగిపడిన ఆ మోదుగు చెట్టు బోడిగుండు చేయించుకున్న సాధువులా కన్పించ సాగింది.

          చెట్టు కొమ్మలు తెగి  పడిన వెంటనే,  తను తెచ్చుకున్న పాత చీరను వీపుకు వంచె కట్టుకుని, సటా సటా ఆకులు తెంపి దానిలో వేసుకోసాగింది రేణుక. అట్లా కోసిన ఆకుల్ని బిర్రుగా రెండు మూటలు  కట్టి పక్కన పెట్టిన ఆవిడ, చిప్పగొడ్డలి అందుకొని భర్త పడేసిన కొమ్మల్ని మూరెడు, మూరెడు పొడవున తెగేసి పక్కన పడెయ్యసాగింది.

          ఆవిడ  తెగేసిన  ముక్కల ముందు కూర్చున్న ముకుందం వాటిని పెద్ద గొడ్డలితో రెండించుల మందాన ముక్కలు కొట్టి, పక్కన అద్ద వెయ్యసాగాడు. రెండు గంటల దాకా గొడ్డళ్ళకు విరామం ఇవ్వకుండా పనిచేసిన ఫలితంగా పచ్చి సమిధల రాశి అంతెత్తున పడింది.   

          అప్పుడు లేచి చద్ది మూట తీసుకుని దగ్గర్లోనే వున్న కొనేట్లో కాళ్ళు, చేతులు కడుక్కుని ఒడ్డెక్కి,  పక్కనే వున్న  మోదుగు చెట్టు కింద కూర్చుని పావుగంటలో తిని లేచారు. అప్పటిదాకా చీల్చిన సమిధల కుప్పలోని పేళ్లను మోసుకుపోయి పక్కనే వున్న పరుపు బండ మీద కర్రకు కర్ర  తగలకుండా ఆరబెట్టారు.

          పొద్దు గూట్లో పడబోతుండగా ఆరెయ్యాల్సిన కువ్వ గూడా అయిపోయింది. వెంటనే గొడ్డళ్లను ఓ పొదలో దాచిపెట్టి, చెరో ఆకుల మూటెత్తుకొని ఇంటి దారి పట్టారు.

          వారం రోజుల పాటు ఆదేవిధంగా పని చేసిన ముకుందం, రేణుక దంపతులు తరువాత రోజు తాటి కమ్మల్తో ఇరవై ఇరవై సమిధలను చేర్చి,  కట్టలు కట్టి పక్కన పడేశారు. అట్లా మొత్తం సమిధలను కట్టలు కట్టడానికి మరో రెండు రోజులు పట్టింది.  నాలుగో రోజున పది, పది కట్టల్ని కలిపి మరో ఇరవై పెద్ద  కట్టలు కట్టి పెట్టారు. వాటిల్లో కొన్నింటిని కావడికి రెండుపక్కలా పేర్చి కట్టి, భుజానికి ఎత్తుకున్నాడు ముకుందం.

          కావడిని ఎత్తుకున్న అతను గుట్ట వెనుక నుండి, చెలకలకు అడ్డం బడి గంట గంటన్నర సేపట్లో  శేషయ్య శేట్ కొట్టు ముందు కావడి దింపాడు.

          ముకుందాన్ని చూసిన శేట్ “అప్పుడే తెచ్చినవా?!” అంటూ ఓ గుమాస్తాను పిల్చి వాటిని కాటా వేయించాడు.

          ఓ కట్ట తక్కువ  క్వింటా  అయ్యాయి. కిలో ఇరవై రూపాయాల చొప్పున లెక్కచేసి, వెంటనే రెండు  వేలు ముకుందం చేతికిచ్చాడు శేట్.

          శేట్ ఇచ్చిన డబ్బుల్ని జేబులో పెట్టుకున్న ముకుందం, కొత్తగా సర్కార్ వారి కొలువు మీది కెక్కిన యువకుడు, మొదటి నెల జీతం అందుకున్నవాడి మాదిరిగా ఆనందంతో పొంగిపోతూ నేరుగా అర్చకుడు యామనాచార్యుల  ఇంటికి వెళ్ళి తన ఆదాయాన్ని , ఆనందాన్ని తెలియజేశాడు.

          అతని ఆనందాన్నిచూసి తనూ ఆనందపడిన అర్చకుడు “అంతా మన ఫణిగిరి రామయ్య తండ్రి  దయ” అంటూ సెలవిచ్చాడు. 

           ముకుందం అక్కణ్ణుండి ఇంటికెళ్లేసరి రేణుక మోదుగాకులను తోరణాలు గుచ్చి వాళ్లుంటున్న చుట్టింటి ముందున్న పందిరికి వెళ్లాడదీస్తుంది.

          శేట్ ఇచ్చిన నాలుగు వేలు ఆవిడ చేతికిచ్చి, స్నానం కోసం గోలెం దగ్గరికెళ్ళాడు ముకుందం

***

          ఆరు నెల్లు తిరిగొచ్చేటప్పటికి ముకుందం వాళ్ళు యామనాచార్యులు గారు చెప్పినట్టుగా వాళ్ళ ఆవుల కొష్టంలోకి మారిపోయారు.

          సమిధల మీద వారానికి అథమపక్షం పదిహేను వేలు చేతికి అందుతున్నాయి.

          రేణుక ఆడుతూ పాడుతూ కుట్టిన విస్తళ్ల మీద నెలకు వెయ్యి రూపాయలు కళ్ల జూడసాగింది.

          ఆరు నెల్లు సమిధల కట్టల మోపులు మోసి, మోసీ ముకుందం భుజాలు కాయలు కాయడంతో “ఇట్లా లాభం లేదు ఏదో ఒకటి పాత ఆటోనన్నా కొనుక్కోవాల” అన్న ఆలోచన చేయసాగాడు.

          సరిగ్గా అదే  సమయంలో తిర్మలగిరి గీతాంజలి ప్రైవేట్ స్కూల్లో చదివే ఫణిగిరి పిల్లల్నితోలే ఆటో శీనుకి పోలీస్ జాబ్ రావడంతో అతను ఆటో అమ్మేస్తానని  ముకుందంతో చెప్పాడు.

          శీను చెప్పిన వెంటనే ముకుందం “నీ ఆటోతో పాటు, నువ్వు తిర్మలగిరి బడికి తోలుతున్న ఆ పిల్ల గాళ్ళను గూడా నాకే ఒప్పజెప్పే లెక్కనైతే నేను తీసుకుంటా” అంటూ నిబంధన పెట్టాడు.

          దానికా కాబోయే పోలీసు “వేరేవాళ్లు ఎవరో తోలే బదులు నా ఆటో మీద, నా పిల్లల్నీ బడికి తోల్తనంటే నాకూ ఆనందమే గదా?” అంటూ ఆ ప్రతిపాదనను అంగీకరించాడు.  

          ఆటో అమ్మకం ఒప్పందం ప్రకారం కొన్ని డబ్బులు కట్టి వెంటనే ఆటోను స్వాధీనం చేసుకున్న ముకుందం, మరునాటి నుంచే పొద్దున్నే లేచి తయారై, పిల్లల్ని తీసుకుపొయ్యి తిర్మలగిరి బడిలో దింపి, ఇంటికొచ్చి భార్యను ఎక్కించుకొని మోదుగుల గడ్డకు పోసాగాడు. 

          అక్కడ నాలుగింటిదాకా ఇద్దరూ కలిసి సమిధలు కొట్టి, ఎండబెట్టి, కట్టలు కట్టి, ఎండిన కట్టల్ని వారానికోరోజు ఆటోలో పేర్చిన తరువాత ముకుందం వాటిని  తీసుకుపోయి తిర్మలగిరి శేషయ్య శేట్ దుకాణంలో దింపేవాడు. ఆ వెంటనే బడి పిల్లల్ని ఎక్కించుకొని ఫణిగిరిలోని ఇండ్లకు తీసుకొచ్చి దింపసాగాడు.  

          ఆటోకి రెండో ఆఖరి వాయిదా కట్టడానికి డబ్బులు సరిపోకపోతే శేషయ్య శేట్ కి విషయం చెప్పాడు

          అతను వెంటనే “ఎంతగావాలో తీసుకుపొయ్యి కట్టి, ఎమ్మటే బండి కాయితాల్ని నీ పేర  మార్పిచ్చుకో” అంటూ పైసలు లెక్కపెట్టాడు.  

          మరో పదిరోజుల్లో బండి కాయితాలు ముకుందం పేరు మీద వచ్చేశాయి.  

          ఇంతలో..

           ఒకరోజు హైదారాబాద్ గంజాయి ‘డి’ ఎడిక్షన్ సెంటర్ నుండి –

          “ప్రస్తుతానికి మీ పిల్లలు గంజాయి అలవాటుకు దూరమయ్యారు. కాబట్టి ఓ వారం రోజుల్లో మీరొచ్చి మీ పిల్లల్ని తీసుకుపోండి!. కాకపోతే తల్లిదండ్రులుగా మీరు మరి కొన్నాళ్ళపాటు వాళ్ళను జాగ్రత్తగా గమనిస్తూ వుండాలి” అంటూ ఫోన్ వచ్చింది.     

          ఆ ఫోన్ వచ్చిన దగ్గర్నుండి “హైదరాబాద్ లో చదువుకుంటున్న పిల్లల్ని మధ్యలో బడి మాన్పించి ఎట్లా తీసుకురావాలి? అట్లా తీసుకొస్తే ఒక ఏడాది చదువు వృధా అయిపోతుందిగదా? ఇప్పుడేం జెయ్యాలి?” అనుకుంటూ ముకుందం, రేణుక దంపతులు రెండు రోజులపాటు బుర్రలు బద్దలు కొట్టుకున్న సరైన మార్గం దొరక్క పోవడంతో..      

          మూడో రోజు సాయంత్రం  అర్చకుడు యామనాచార్యులు దగ్గరికెళ్లి రెండు రోజులుగా తాము పడుతున్న తొక్కులాటను వారికి వివరించి “ఇప్పుడు మమ్ముల్ని ఏం చెయ్యమంటారో శెలవియ్యండి సామీ!” అంటూ ప్రాధేయపడ్డారు.

          వారి మాటలను శ్రద్ధగా ఆలకించిన యామనాచార్యులు కొంతసేపు తనలో తాను ఆలోచించుకున్న మీదట “మీరు అనుకుంటున్నట్టు వాళ్లనిప్పుడు ఫణిగిరికి తీసుకొస్తే, వాళ్ళ చదువు ఒక్క ఏడాది మాత్రమే ఖరాబ్ ఔతుంది నిజమే. కానీ, మీరు వాళ్ళను హైదారాబాద్ లో,  ఆదే ఆశ్రమంలో, వుంచి చదివించాలని చూస్తే మాత్రం, వాళ్ళు జీవితాలనే నష్టపోయే ప్రమాదం పొంచివుంది.

          ఈ సమయంలో కన్న వాళ్ళుగా మీరు, ఏ నిర్ణయం తీసుకుంటారో జాగ్రత్తగా ఆలోచించి తీసుకొని,  అడుగు ముందుకెయ్యండి!” అంటూ లేచిపోయారు. 

          ముకుందం, రేణుక దంపతులు యామనాచార్యుల ఆంతర్యమేమితో వెంటనే అర్ధం చేసుకున్నారు.  దాని ఫలితంగా మరుసటి ఆదివారం వేకువఝామున్నే లేచి తమ ఆటోనే వేసుకుని హైదరాబాదు వెళ్ళి కొడుకులిద్దర్నీ తమ ఊరు ఫణిగిరి తీసుకొచ్చారు.

           తను  ప్రతిరోజు తిర్మలగిరిలోని గీతాంజలి స్కూల్ కి పిల్లల్ని తీసుకెల్లే ముకుందం ఆ స్కూల్ కరస్పాన్ డెన్స్ ను కలిసి, తమ పిల్లల విషయాన్ని కూలంకషంగా వివరించి “దయచేసి మా పిల్లల్ని మీ స్కూల్లో చేర్పించుకొని, వాళ్ళతో ప్రైవేట్ గా పరీక్షలు రాయించి పుణ్యం కట్టుకోండి సార్1” అంటూ బ్రతిమాలాడు ముకుందం.  

          పిల్లల సమస్యను పెద్ద మనసుతో ఆలోచించి, అర్ధం చేసుకున్న  ఆ స్కూల్ కరస్పాన్ డెన్స్ “సరే” అంటూ పచ్చ జెండా ఊపాడు. 

సిరంశెట్టి కాంతారావు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *