కష్టం వస్తే మనసు తల్లడిల్లుతుంది. కొద్దిసేపటికో , కొంతకాలానికో తేరుకొని ఆ కష్టాల నుండి గట్టెక్కడానికి ప్రయత్నిస్తాం. ఆ కష్టం తీరేది కాదనుకుంటే ఆ కష్టంతోనే కలిసి జీవించడానికి అలవాటు పడతాం ప్రపంచంలో తమ ప్రమేయం లేకుండా చితికి పోతున్న బతుకులు ఎన్నో. వారెవరో ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు. కానీ వారి కష్టం తెలిశాక మన మనసుకూ కష్టం కలుగుతుంది. వారిని ఆ స్థితిలోకి నెట్టిన పొగరును అణిచేందుకు గొంతెత్తి అరవాలనిపిస్తుంది.
మానవత్వం పరిమళించిమారాకులు తొడగా అంటే ముందు ఆ దూరపు బతుకుల జీవిత చిత్రాలు మన కళ్ళ ముందుకు రావాలి. కష్టాలనే కాదు, ఆనందాలైనా, అనుభూతులైనా, అసలు భావోద్వేగాలకు హద్దులు సరిహద్దులు గీయగలమా? నలుపు తెలుపు ఛాయాబేధాలు చూస్తామా?
ప్రపంచంలో పలు రకాల పరిస్థితులు. కొండలే ఆవాసం కొందరికి. అక్కడి ప్రజల జీవనస్థితిగతులు మైదాన ప్రాంతాల వారి ఊహకు అందకపోవచ్చు. చలిలో గడ్డకట్టెదొకరు. ఉక్కపోతలతో వేసారేదొకరు. వీరందరికీ జీవన వ్యాసంగాలు, సంస్కృతులతో పాటు భాషలు వేరు. ప్రతిభాషలోను ఎన్నో రీతులు. ప్రాంతానికో పలుకుబడి. వీరందరూ జీవితాలను స్వయంగా తరచి చూడాలంటే ఒక్క భాష, ఒక జీవితకాలము సరిపోదు.
ఈ పరిస్థితులలో దూర తీరాలను దగ్గరకు చేర్చి బతుకు చిత్రాల బహుముఖీనత్వాన్ని ఆవిష్కరించడానికి సులువైన మార్గం అనువాదమే. ఒక భాష, ఒక ప్రాంతం, ఒక జాతిలో భిన్న కాలాల్లో వెలువడుతున్న రచనలను కొన్ని అయినా ఇతర భాషలలోకి తర్జుమా చేసుకుంటే దూరాలు తరిగి దగ్గరతనాలు, ఆత్మీయతలు మొగ్గ తొడుగుతాయి. వారిని మరింత బాగా అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. అనువాదాల విశ్వ వారధి పై అక్షరాలు ఉరకలెత్తి కొత్త లోకాలను మన ముందు ఉంచుతాయి. ఎన్నో ఊసులు ఉత్సాహాలనిస్తా యి. ఊహలకు రెక్కలను ఇచ్చి మానసికంగా నైనా అక్కడ సంచరించి వచ్చే శక్తినిస్తాయి. మనుషుల మధ్య మానసిక బంధాలు, అనుబంధాలు బలపడి చేతులు చాచి హత్తుకోగలిగిన సామరస్యాన్ని, సంస్కారాన్ని, విశాల హృదయాన్ని ఇస్తాయి. అప్పుడు ఎల్ల లోకములొక్క ఇల్లుగా సరికొత్త వెలుగు రేఖలు ప్రభవిస్తాయి.
దక్షిణాది భాషల రచయితలను రచనలను దగ్గరకు చేర్చే ప్రయత్నాలు ఇటీవల కాలంలో ఊపందుకున్నాయి. అనువాద రచనలకు తెలుగులో లభిస్తున్న ఆదరణ అనువాదకులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. తెలుగు సాహిత్యం కూడా మునుముందు విరివిగా ఇతర ప్రపంచ భాషల్లో అందుబాటులోకి తేవలసిన అవసరం ఉంది. ఉభయ భాషల్లో పట్టు, ప్రావీణ్యం ఉండే సమర్థులైన అనువాదకుల అవసరం ఇప్పుడు ఎంతో ఉంది. అనువాదం ఏదో ఆషామాషీగా చేసే వ్యవహారం కాదు. మూల రచనలకు ప్రతిబింబంగా అనువాదాలు చేసినప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు ఉంటాయి. తెలిసో తెలియకో దొర్లే తప్పులతో పెను ప్రమాదాలు తలెత్తవచ్చు.
అనువాదానికి సంబంధించిన అన్ని పార్శ్వాలపై దృష్టి సారిస్తూ వెలువరించిన పుస్తకం – అనువదించడం ఎలా?
జర్నలిస్టు, రచయిత గోవిందరాజు చక్రధర్ అనువాదకులకు అవసరమైన మెలకువలు, ఉదాహరణలతో ఈ పుస్తకాన్ని రాశారు.
గూగుల్ ట్రాన్స్లేషన్, కృత్రిమ మేధ (AI) ను ఆసరాగా చేసుకుని చాలామంది దగ్గర దారులు వెతుకుతున్నారు. దానివల్ల జరిగే కీడుతోపాటు ఏ రకమైన నైపుణ్యాలను పెంచుకోవాలో వివరించారు. ఆయా సందర్భాలకు తగిన ఉదాహరణలు ఇస్తూ లోతైన అధ్యయనం, పరిశీలనతో ఈ పుస్తకాన్ని వీలైనంత సమగ్రంగా అందించారు.
అనువాదాలు చేయాలన్న ఆసక్తి, ఉత్సాహం ఉన్న ఔత్సాహికులు తప్పకుండా రిఫర్ చేయాల్సిన పుస్తకమిది.
(అనువదించడం ఎలా? రచన: గోవిందరాజు చక్రధర్. పేజీలు: 167, వెల: రూ. 180)
కాపీలకు: 7989546568, 9849870250
pusthakam.in