పాడేరులో (23-02-24) నాకిది రెండవ రోజు. ప్రణాళిక ప్రకారం మేమీ రోజు తారాబు జలపాతం సందర్శనానికి వెళ్ళాల్సి వుంది. నేను ఎప్పటి మాదిరిగానే చీకటితోనే లేచి కాలకృత్యాలు, స్నానం వగైరాలు పూర్తి చేసుకుని కూర్చున్నాను. ఇంతలో షెటిల్ ఆడి వచ్చిన మణి కుమార్ గార్ వెంటనే స్నానం చేసి, తయారై ఫలహారం కోసం బయలుదేర దీయడంతో వెంటనే రాజ్ ధూత్ వెనుక సీట్ మీద ఎక్కి కూర్చున్నాను.
మేము ఫలహారం చేసి వచ్చే సరికి ఓ జీప్ వచ్చి కళాశాల ముందు ఆగివుంది. ఇంతలో చోడవరం నుండి మురళీధర్ గారు కూడా రానే వచ్చారు. నిన్న మాతోపాటు బాల్డా గుహాలకు వచ్చిన ముగ్గురు విధ్యార్ధుల్తో పాటు అమిత్, దిలీఫ్ గార్లు కూడా ఈరోజు మా రావడంలేదట. వారి స్థానంలో లైబ్రరీ సార్ మణి కుమార్ గారితో పాటు తారాబు జలపాతాన్ని ఇంతకు ముందోకసారి చూసి వున్న ‘శివ’ అనే మరో విద్యార్ధి వస్తున్నారని తెలిసింది. జీప్ డ్రైవర్ పేరు కిరణ్. ఆదివాసీ యువకుడు. మొత్తం మీద మేము బయలు దేరేసరికి పది గంటలు కావస్తుంది.నిన్న మేము వెళ్ళిన రోడ్డుకి వ్యతిరేక దిశలో వున్న దిలీఫ్ గారి స్వంత ఊరైన జి.మాడుగుల మీదుగా బయలు దేరాము. గంటలో జి.మాడుగుల చేరాము. ఆ ఊరు దిలీఫ్ గారి స్వంత ఊరే కాదు. మురిళీధర్ గారు ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన ఊరు కూడా కావడం మరో విశేషం. అక్కడ తప్పితే మరొక చోట భోజనం దొరకదన్న ఉద్దేశ్యంతో డ్రైవర్ ప్రవీణతో కలిపి ఐదు భోజనాలు పార్సిల్ కట్టించుకొని, సరిపడా వాటర్ బాటిల్స్ కూడా తీసుకుని అక్కణ్ణుండి కుడి పక్కకు తిరిగి సుమారు పాతిక కి.మీ. దూరంలో వుండే బొంగరం అనే ఓ కూడలి గిరిజన గ్రామం దిశగా జీప్ పరుగందుకుంది.
![](https://udayini.com/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-13-at-4.35.45-PM-1.jpeg)
అందమైన ఆకుపచ్చ కొండల మీద మనుషుల కదలికలకు గుర్తుగా ఏర్పడిన ఎర్రెర్రని రహదారులు, ఆ కొండల తల్లులు ధరించిన అందమైన వడ్డాణాల మాదిరిగా ఎంతో దూరం కనిపిస్తూ, చూసే వారిని మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. దారి పొడవునా ఎన్నెన్నో అందమైన ‘ఈరికలు’ కన్నుల పండువుగా ప్రత్యక్షమవుతూ ప్రకృతి మీద మనిషి సాధిస్తున్న పట్టుకు నిదర్శనమా!? అన్నట్టు మనుషుల్ని ఆలోచనా సుడుల్లోకి వడి వడిగా లాక్కుపోతుంటాయి.
‘ఈరికలు’ అంటే ఏమిటో? వాటి ప్రత్యేకత ఏమిటో? ఓసారి పరిశీలించి చూస్తే, మనకు మొట్ట మొదటి సారి 1966లో రష్యన్ రచయిత చింగీజ్ ఐత్ మాతోవ్ రచించిన నవలిక ‘మదర్ ఎర్త్’ ను 1969లో ఉప్పల లక్ష్మణరావు గారు ‘తల్లి భూదేవి’ పేరుతో ‘రాదుగ’ ప్రచురణ సంస్థ కోసం తెలుగులోకి అనువాదం చేశారు. అందులో వారు ఈ ‘ఈరికలు’ అన్న పదాన్ని తెలుగు వారి దృష్టికి తీసుకొచ్చారు. ఎత్తైన కొండలు తోటి కోడళ్ళ మాదిరిగా తమలో తాము మాట్లాడుకుంటూ సమాంతరంగా ఏ దూర తీరాలకో సాగిపోతుంటాయి. ముచ్చట్ల పారవశ్యంలో అవి ఒక్కోసారి మరీ సమీపంగా వస్తుంటాయి. ఇంతలో అత్త గారు తమ కోసం వస్తున్నారన్న విషయాన్ని గ్రహించి దూరంగా జరిగి పోతుంటాయి. అలా దూరంగా జరిగినప్పుడు ఏర్పడిన ఖాళీలు, ఒక్కోసారి కొన్ని వందల గజాల దూరం వరకూ వుంటాయి. వర్ష ఋతువుల్లో కొండల మీద కురిసిన వాన నీరంతా కిందకు దిగి, ఆ ఖాళీల గుండా ‘నీరు పల్లమెరుగు – నిజం దేవుడెరుగు’ అన్న చందాన దిగువకు వెళ్ళిపోతూ చిన్న చిన్న సెల ఏళ్ళుగా, వాగులు (గెద్దలు) గా ఏర్పడి మానవ హితానికి దోహద పడుతుంటాయి.
ఈ ప్రకృతి వైచిత్రిని గమనించిన మానవుడు ఆ ఖాళీల్లో నీటి జాలుకి అడ్డంగా కట్టలు కట్టి మళ్ళు తయారు చేశాడు. వాటిల్లో పంటలు పండించడం మొదలు పెట్టాడు. ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడు లబ్ది పొందుతాడన్నట్టు ప్రకృతి అత్త గారి భయానికి, కోడళ్ళైన కొండలు దగ్గరికి జరుగుతూ, దూరంగా వెళుతూ వున్న సందర్భంలో ఏర్పడిన ఆ ఖాళీలనే ‘ఈరికలు’ అంటారు. కొండల మీది నుండి వచ్చే నీటితో పంటలు పండించిన మనిషి మరింత బలవంతుడుగా తయారై తన సంతతిని పెంపుచేసుకున్నాడు.మేము వెళుతున్న కొండదారిలో అటువంటి ‘ఈరికలు’ లెక్కలేనన్ని దర్శన మిచ్చాయి. వాటిల్లో ఇటీవలే కోసిన వరి పంట కొయ్యకాళ్ళు బంగారు వర్ణంతోనూ, దుగాల మీద పెరిగిన గడ్డి పచ్చగా పసర్లు కక్కుతూ చూపరులకు గొప్ప ఆనందాన్ని పంచుతున్నాయి. మనుషులకు అన్నం పెట్టె అటువంటి ‘ఈరికల’ సౌందర్యాన్ని గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే అన్పించింది.
![](https://udayini.com/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-13-at-4.35.45-PM-edited.jpeg)
అట్లాంటి అద్భుతమైన దృశ్యాలను చూసుకుంటూ ముందుకు సాగుతున్న మా వాహనానికి ఎడమ పక్క, రోడ్డుకు నాలుగు అడుగుల ఎత్తున ఓ పెద్ద వృక్షం దాపున, అందమైన ఓ చిన్న దేవాలయం తళ తళా మెరుస్తూ ఎదురయ్యిది.
అది ఏ దేవాలయమో ఎరుగని నేను నా పక్కనే వున్న మురళీధర్ గారితో “అదేం గుడి? సార్!” అంటూ అడిగాను.
“వెన్నెలమ్మ గుడి” మురళీధర్
“ఏం గుడి?!!” నేను
“ఔ నండీ! వెన్నెలమ్మ గుడే” మురళీధర్
“వెన్నెలమ్మ గుడా!!?” నేను
“ఎందుకంత ఆశ్చర్య పడుతున్నారు?” మురళీధర్.
నాకు తెలిసినంతవరకు చంద్రుడికే ఎక్కడా గుడి లేదు. అటువంటిది వెన్నెలకు గుడా!? దాని పేరు వెన్నెలమ్మ గుడా?! ఒహ్హో.. గిరిజనులకు ఇంతటి భావుకత వుంటుందని నేనిప్పటిదాకా ఊహించలేక పోయాను. వారి ప్రకృతి ఆరాధనకు ఇంతకు మించిన నిదర్శనం ఇంకేమి కావాలి?” ఆ క్షణంలో నా మనసు క్షేత్రంలో సుడులు తిరుగుతున్న ఆనందాన్ని వ్యక్తం చేయలేక మౌనాన్ని ఆశ్రయించాను.
![](https://udayini.com/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-13-at-4.35.46-PM-1.jpeg)
మరికొంత దూరం పరుగులు తీసిన మా వాహనం ‘బొంగరం’ చౌరస్తాకు చేరుకుంది. అక్కణ్ణుండి తారాబు జలపాతానికి ఎటు దిక్కుకు వెళ్ళాల్లో అర్ధం కాక ఎడమ పక్కన వున్న ఓ పాకలో కూర్చున్న మహిళలను ఉద్దేశించి “తారాబు జలపాతానికి ఎటు దిక్కు వెళ్ళాలి?” అంటూ ప్రశ్నించాము.
మా ప్రశ్న వింటూనే చంక పాపలతో కూర్చున్న ఆ మహిళలిద్దరూ చప్పున లేచి మా దగ్గరికి వస్తూ ”ఇటు దిక్కు” అంటూ మాకు ఎడమచేతి వైపు చూపించారు.
“సరే”అన్నట్టు డ్రైవర్ జీపును ఆ దిక్కుకు తిప్పుతుండగా దగ్గరికొచ్చిన వాళ్ళు “మేము గూడ వస్తాం” అంటూ అడిగారు.
“తీసుకుపోతాం గాని, మాకా తారాబు
జలపాతానికి దారి చూపిస్తారా?” అడిగాడు మణి కుమార్ గారు.
“చూపిస్తం” అంటూ జీపు వెనుక సీట్లో ఎక్కి కూర్చున్నారు.
దారి తెలిసిన వాళ్ళు దొరికారన్న సంతోషంతో మా సారధి వాహనాన్ని పరుగులేత్తించ సాగాడు.
“అధికారం, సంపదా వికేంద్రీకరణ జరిగినప్పుడు మాత్రమే ఏ జాతి అయినా సంతులిత అభివృద్ధి పథంలో ముదుకు సాగుతుంది” అంటూ చెప్పిన సైద్ధాంతిక వేత్తల ఆలోచనలకు భిన్నంగా వ్యవస్థ పయనం, కొనసాగుతున్న వైనం మైదాన ప్రాంతంలో కన్నా అడవి మధ్యలో మరింత స్పష్టంగా కనిపించ సాగింది.
![](https://udayini.com/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-13-at-4.35.46-PM.jpeg)
కొండల గుండెల్ని చీలుస్తూ, మహా మహా వృక్షాలను కూకటి వేళ్లతో కుళ్ళగించి లోయల్లోకి నెట్టి వేస్తూ మైళ్ళ కొద్దీ రోడ్లు వేస్తూ పోతున్నారు. ఆ రోడ్ల పని, పావలా వంతు కూడా కాక ముందే, రోడ్డు పక్క నున్న గిరిజనుల గుంపుల్లో నిర్మించిన సెల్ ఫోన్ టవర్లు ఎండకు తళ తళా మెరుస్తూ కి.మీ. ల దూరం కనిపిస్తున్నాయి.
నేడు ఆధునిక మేథావులం అని చెప్పుకునే చాలామంది “అంటే! కొండ, కొనల్లో వుండే వాళ్ళకు కరెంట్; రోడ్డు, ఫోన్ లాంటి సదుపాయాలు అక్కర్లేదా?” అంటూ చాలా తెలివిగా ప్రశ్నిస్తుంటారు. వద్దని ఎవరంటారు? శతాబ్దాలుగా నాగరికతకు దూరంగా వుంటున్న ఆదివాసీలను, విస్తృత జన బాహుళ్యంలోకి తీసుకు రావాల్సిందే. అందుకు అనేక వర్గాల ప్రజలను సామీకరించాల్సి వుంది, తద్భిన్నంగా కేంద్రీ కృత పద్ధతుల్లో కొందరికే ప్రయోజనం చేకూరేవిధంగా వ్యవహారం కొనసాగుతుంది. ఆ కరెంట్, రోడ్లు, ఆ సెల్ టవర్లు వేస్తున్న కంపెనీలు ఎవరివో తెలుసుకుంటే, సుడిగాలికి కరిమబ్బులు చెదిరిపోయి, ఇన బింబం స్పుటంగా కనిపించినట్టుగా వ్యవస్థ నగ్నస్వరూపం మనకు తెలిసివస్తుంది” అంటూ మురళీధర్ గారు చాలా పెద్ద చర్చనే లేవనెత్తారు. రోడ్డు పొడవునా ఈరికల వెంట చిన్న చిన్న ‘కోపిరి గడ్డి’ పొదలు పచ్చగా కనిపించ సాగాయి. ఈరికల్లో వరి పంట కోసి మెదలు వేసిన వారం రోజుల తరువాత, ఈ కోపిరి గడ్డితో పేనిన సన్నని తాళ్ళతో మెదను చిన్న చిన్న కట్టలు కట్టి కల్లాల్లోకి చేర్చి గూళ్ళు వేస్తారు. ఆ చర్చల మధ్య పాకలపాటి మఠం, బీరం, నుర్మతి దాటి ముందుకు పోతుండగా మాకు ఎడమచేతి పక్క, లోయకు ఆవల కొండవాలులో పల్చబారిన అడవి మధ్య, మానవతుల అశృకణం లోయలోకి జారిపడుతున్నట్టు నిశ్శబ్ధంగా వున్న ఓ ఊరిని చూపిస్తూ “అదుగో అటు చూడండి! అదే వాకపల్లి” అంటూ మణి కుమార్ గారు చూపించారు.
ఆ మాట వింటూనే నేను ఒక్కసారిగా స్థబ్ధీభూణ్ణైపోతూ అటు చూస్తుండగా, నా మనో నేత్రం ముందు ఆగస్ట్ 20, 2007 ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య రక్షక భటులే భక్షకులై సాగించిన ధుశ్శాసన పర్వం కళ్ళముంది ప్రత్యక్షమయ్యింది. పదిహేనేండ్ల న్యాయ పోరాటంలో పరాజితులు కాబడిన ఆ అడవి బిడ్డల ఊరు, ఇంకా భయం ముసుగు కప్పుకుని మౌనంగా రోధిస్తున్నట్టు అన్పించడంతో నేను మౌనంగా వుండి పోయాను. చూస్తుండగానే ఆ ఊరి మీద నుండి వస్తున్న గాలి కూడా సోకనంత దూరం ముదుకు వెళ్ళిపోయింది మా వాహనం.
పులుసు మామిడి గ్రామంలోకి ప్రవేశించాం. గ్రామంలోని ఓ ఇంటి వారి అమ్మాయికి ఘనంగా ఓణీల పండుగ జరుగుతుంది. ఆ గ్రామస్తుల సందడిని గమనిస్తూ ముందుకుసాగు తుంటే చూసిన నేను “భోజనాలు చేసి వెళుతున్న కొంతమంది చేతుల్లో పెద్ద పెద్ద టిఫిన్ డబ్బాలున్నాయేంటి సార్!” అంటూ మురళీధర్ గారిని అడిగాను.
దానికి వీరు “ఇంటిదగ్గరున్న వృద్దులకు, బాలింతలకు, రోగులకు, పిల్లలకు పెట్టి పంపకపోతే కార్యం చేస్తున్న ఇంటి వారికి తప్పేస్తారు. కాబట్టి ఇండ్ల దగ్గర వున్న వాళ్ళందరికీ సద్దులు కట్టి పంపిస్తుంటారు. ఆ సద్దులే ఈ టిఫిన్ డబ్బాలు” అంటూ గత పదిహేను ఏండ్లుగా మన్యంలో ఉపన్యాసకుడుగా పనిచేస్తూ గమనించిన అనేక గిరిజన ఆచారవ్యవహారాలను సందర్భోచితంగా వివరిస్తుండే మురళీధర్ గారు ఆక్షణంలో నాకా డబ్బాల విషయాన్ని వివరించారు. మాటల్లోనే మా వాహనం ‘పిట్టల బొర్ర’ అడ్డ రోడ్డు దగ్గరికి చేరుకుంది. మాతోపాటు వచ్చిన స్త్రీలు అక్కడ దిగి, మౌనంగా ఊళ్ళోకి వెళ్ళిపోయారు.
ఆ రోడ్డు పక్క ఇంటి ముందు పసుపు పంటను ఎండబెట్టి తిరగేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని “తారాబు జలపాతానికి ఎట్లా వెళ్ళాలి? అంటూ అడిగాము దానికి వాళ్ళు “ఇంకొంచం ముందుకు పోతే, ఎడమ చేతి పక్క రోడ్డు వస్తాది. ఆ రోడ్డున బడి ముందుకు పోతే తారాబు వస్తాది” అంటూ వివరించారు.అయితే, పులుసు మామిడి గ్రామం దగ్గర మేము గెడ్డ దాటినప్పటి నుండే ‘’ఇది పిట్టల బొర్రకు వెళ్ళే దారి. మనం అనుకుంటున్నట్టు
గుంజివాడకు వెళ్ళే దారి కాదు. నేనొకసారి ఈ దారిన జలపాతం దగ్గరికి వెళ్ళి, వచ్చే సరికి నా ప్రాణం పోయినంత పనయ్యింది. కాబట్టి నేను ఇక్కడే కూర్చుంటాను. మీరంతా వెళ్ళి చూసి రండి!” అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు మురళీధర్ గారు.
ఆ దెబ్బతో అదిరి పడిన మణి కుమార్ గారు “లేదు సార్! ఈ దారిన మీరే కాదు మేము కూడా వెళ్ళలేము. ఇంతకు ముందు ఆ స్త్రీలు చెప్పినట్టు ఈ రోడ్డున్నే మరికొంత దూరం ముందుకెళదాం. ఎక్కడో ఒకచోట మనకు తప్పకుండా గుంజివాడ రోడ్డు దొరుకుతుందని నా మనసు గట్టిగా చెబుతుంది” అంటూ మురళీధర్ గారిని తిరిగి బండి ఎక్కించారు.
మా డ్రైవర్ కిరణ్ కి కూడా ఆ జలపాతం చూడాలన్న కోరిక బలంగా వుండడంతో ‘’సరే పోదాం పదండి!” అంటూ జీప్ ను పార్టీ ఎం.ఎం. మెటల్ పరిచిన రోడ్డు మీద మూడు, నాలుగు కి.మీ. దూరం మునుపటి వేగానికి ఏమాత్రం తగ్గకుండానే పరుగెత్తించాడు.మరో ఇరవై నిమిషాల తరువాత మణి కుమార్ గారు ఊహించినట్టే ‘సంత బయలు’ అనే ఊరు దగ్గర గుంజివాడ వెళ్ళే డాంబర్ రోడ్డు ఎక్కాము. మేము జి.మాడుగుల దగ్గర నుండి గుంజివాడ అడ్డ రోడ్డు ఎక్కే దాకా రోడ్ల పొడవునా ఎన్నెన్నో నక్సలైట్ అమర వీరుల స్థూపాలు శిథిలమైపోతూ కనిపించాయి. వారి అసమాన త్యాగాలు కాలం పొరల్లో కనుమరుగైపోతున్న దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా గుండెలు ద్రవించిపోకతప్పదు. మరో అరగంట ప్రయాణం తరువాత ఎదురైన పెద్ద గెడ్డను కూడా లెక్క చెయ్యకుండా జీప్ ను దాటించిన డ్రైవర్ కిరణ్ మరో పావు గంట తరువాత శ్రవణ పేయంగా విన్పిస్తున్న ‘తారాబు’ జలపాతానికి సమీపంలోని టికెట్ కౌంటర్ ముందర ఆపాడు.
(ఇంకా వుంది)
![](https://udayini.com/wp-content/uploads/2024/03/2-150x150.jpeg)