ఎప్పుడూ తలవనిది, చూడాలని అనుకోనిది చూడటం గొప్ప అనుభూతినిస్తుందేమో!
నాకైతే ఉప్పలపాడు పక్షుల రక్షిత కేంద్రం చూడటం అటువంటి గొప్ప అనుభూతి మిగిల్చింది. అది ఊహించని బహుమతి అని చెప్పుకోవచ్చు.
నవంబర్ 15 -17తేదీలలో VVIT బాలోత్సవం కోసం గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలోని నంబూరు వెళ్ళాను.
మేము వెళ్ళిన ప్రదేశానికి అతి సమీపంలో ఉప్పలపాడు వలస పక్షుల కేంద్రం ఉందని శిరంశెట్టి కాంతారావు గారు చెప్పారు.
17 వ తేదీ ఉదయం పాల్వంచ నుంచి వచ్చిన అబ్రహాం గారి కారులో శిరంశెట్టి కాంతారావు గారు, మండువ సుబ్బారావు గారితో పాటు నేను వెళ్ళాను. మరో వాహనంలో బాలోత్సవ్ కి వచ్చిన కృష్ణమూర్తి, ఆనంద్, సాంబమూర్తి చెల్లూరి, నోముల తదితరులు మాతో జత కలిశారు.
ఊరినానుకుని మానవ నివాసాల పక్కనే పక్షుల రక్షిత కేంద్రం. చెరువు కట్ట మీదకు అడుగు పెడుతుంటే అలలు అలలుగా ఆకాశంలో ఎగిరే పక్షులు, ఆకుపచ్చని చెట్ల పై తెల్లటి పూలు గుత్తులు గుత్తులుగా విరగ బూసినట్లున్న పక్షులు దర్శనమిచ్చి వావ్.. అనుకున్నాను.
కారు దిగగానే ముక్కుపుటాలను తాకిన ఒక రకమైన వాసన కొద్దిగా ఇబ్బంది పెడుతూ.. కానీ, వేల మైళ్ల దూరం ప్రయాణించి ఎక్కడెక్కడినుంచో వచ్చి అక్కడ చేరిన పక్షుల కోలాహల ముచ్చట్లు ఆ వాసనని మరిపించాయో లేక నా ముక్కు అలవాటిపడిందో…
అబ్రహం గారు కారు పార్క్ చేసి వచ్చేసరికి శిరంశెట్టి కాంతారావు గారు టికెట్స్ తీసుకున్నారు.
మేం వెళ్ళేప్పటికి దాదాపు ఉదయం 8. 30 అయింది. అప్పటికి ఎవరూ ఉండరు అనుకున్న నా అంచనా తారుమారు చేస్తూ కొంత మంది కనిపించారు. కొందరు నిశ్శబ్దంగా పక్షులను తదేకంగా చూడటం లో నిమగ్నమై కనిపించారు.
వాటి నివాసంలోకి మేం వెళ్ళాం కాబట్టి వాటికి ప్రైవసీకి ఎటువంటి భంగం కలగకుండా, వాటిని గౌరవిస్తూ మేము నిశ్శబ్దంగా ఉన్నాం.
ఏదైనా మాట్లాడినా, అక్కడ పనిచేస్తున్న వారిని పలుకరించినా చాలా చిన్నగా లో గొంతుకతో.
గుంటూరు డివిజన్ వన్యప్రాణి విభాగం నిర్వహణలో ఉన్న ఈ కేంద్రం గురించి తెలుపుతూ బోర్డు ఉంది. 1994లో ఈ కేంద్రం ఏర్పడింది. ఎక్కువగా వచ్చే పక్షుల సమాచారం ఫొటోలతో ఉన్న బోర్డులు కనిపించాయి.
ఆ కోలాహలంలోంచి మూలుగు లాంటి ఓ రకమైన శబ్దం.. ఆ పక్షుల్లో ఏ జాతి పలకరింతో..
పెయింటెడ్ స్టార్క్ (కొంగలు), స్పాట్ బిల్డ్ డక్, గ్రే పెలికాన్, గాసీ ఐబిస్, ఓపెన్ బిల్ స్టార్క్, బ్లాక్ హెడేడ్ ఐబిస్, లిటిల్ కార్మోరాంట్, డార్తర్ స్నేక్ పక్షి ఇలా చాలా రకాలు వలస పక్షులతో పాటు మన ప్రాంతంలో ఉండే పక్షులు కూడా ఉన్నాయి.
వాటి సహజ ఆవాసాల్లో ఉన్న వివిధ రకాల పక్షులను చూడడం ప్రకృతి ప్రియులను పండగే. బైనాక్యులర్స్ తెచ్చుకుంటే దూరాన ఉన్న పక్షులను నిశితంగా మరింత బాగా చూడొచ్చనిపించింది.
అలా నడుస్తూ ఓ వైపు పక్షుల్ని, మరో వైపు బోర్డులు చూస్తూ నడుస్తున్నాం. అంతలో మమ్మల్ని చూసి మాకు ఎదురొచ్చి ఒకావిడ పలుకరించింది. మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నించి వచ్చారా అని అడిగింది. కాదని చెప్పాం . సివిల్స్ ప్రిపేర్ అవుతున్న గ్రూప్ 2 అధికారి ఆవిడ. విజయవాడ నుండి మిత్ర బృందంతో వచ్చారు. అటవీశాఖ వాళ్ళైతే కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలని అనుకున్నారట.
పర్యాటకుల కోసం ఒక వాచ్ టవర్ ఉంది. దానిపైకి ఎక్కి నీటి మధ్యలో మట్టి దిబ్బలపై ఉన్న తుమ్మచెట్లపై, కృత్రిమంగా ఏర్పాటు చేసిన నివాస స్థలాలలో కొలువుదీరి సందడి చేస్తున్న రకరకాల పక్షులను కాసేపు చూసాం. అలా ఎగురుతూ ఎగురుతూ చటుక్కున నీటిపైకొచ్చి లటుక్కున చేపను అందుకుపోతున్న పక్షుల్ని, నీళ్లలో ఒంటి కాలిపై జపం చేసే కొంగల్ని, కునుకుతీసినట్లున్న గూడబాతుల్ని, తెలుపు, బూడిదకలిసిన తెలుపు, తెలుపు నలుపు షేడ్స్, లేత గోధుమ రంగు కలిసిన రంగులో, నలుపు రంగులో ఎన్ని పక్షుల్లో.. ఎన్నెన్ని జాతులో .. ఎక్కడెక్కడినుంచి వచ్చి ఇక్కడ చేరాయో..
గ్రే పెలికాన్
గ్రే పెలికాన్ పక్షిని మనవాళ్ళు గూడబాతు అంటారు. వీటిని సిడ్నీ, ఆస్ట్రేలియాలో నార్తర్న్ బీచెస్ కి వెళ్ళినప్పుడు చూశాను. మళ్ళీ ఇదే చూడటం. దీన్ని గూడబాతు అనడం మాత్రం చాలా సార్లు విన్నాను. గూడ కొంగ అనికూడా అంటారట.
దీనికి మీద కింద పెద్ద సంచి ఉంటుంది. రాబందు కంటే పెద్దది, దృఢమైన పెద్ద నీటి పక్షి. ముఖ్యంగా ఊదా రంగులో ఉంటుంది. పొట్టిగానున్న దృఢమైన కళ్ళు పెద్దవి. పెద్ద దొబ్బ ముక్కు. దానికొక సంచి దీని ప్రత్యేకత . శీతాకాలపు వలస పక్షి. అర్ధచంద్రాకారంలో ఈదుతూ చేపల్ని తక్కువ లోతులోకి తరిమి వేటాడుతాయి. నత్తలు, చేపలు తింటుంది. అక్టోబరు – ఏప్రిల్ మాసాల్లో పెద్ద చెట్లమీద పుల్లలతో గూడు కట్టుకుంటుంది.
ఆస్ట్రేలియా నుంచి వేలాది మైళ్ళు నిరంతరంగా ప్రయాణించి వచ్చిన పక్షి ఇది.
ఈ పక్షులు చాలా ఎక్కువగా కనిపించాయి.
పెయింటెడ్ స్టార్క్
ఇవి ఎక్కువ దూరం వలస పోవు. తేమ ప్రదేశాల్లో ఉంటుంది. ఒంటి కాలిపై జపం చేస్తూ చేపల్ని, కప్పల్ని లటుక్కున అందుకుని తినే ఈ పక్షి మన దేశంలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ వలస పక్షి చిత్తడి నేలల్లో చెట్లపై గుడ్లు పెడుతుంది. అక్టోబరు – ఏప్రిల్ మాసాల్లో చెట్టుకొమ్మలకు గూళ్ళు కట్టుకుంటుంది.
బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్ లలో కూడా ఈ పక్షి కనిపిస్తుంది.
స్పాట్ బిల్డ్ డక్
ఆశ్చర్యంగా ఇది శాకాహార పక్షి ఇది. గింజలు, నీటిలో ఉండే నాచు తింటుంది.
చెరువు ఒడ్డున ఉండే చిక్కని గడ్డి దుబ్బుల్ల దగ్గర గూడు ఏర్పాటు చేసుకుంటుంది. జులై – డిసెంబర్ లలో గూళ్ళు కట్టి గుడ్లు పెడతాయి.
కొన్ని పక్షులు మెత్తగా ఉండే కీటకాలు తింటే, కొన్ని నత్తలు, చేపలు, పీతలు, కప్పలు, క్రిమికీటకాలు తింటాయి.
చెరువు అంచునే రైతులు వేసిన వరి పంట. బంగారు వర్ణంలోకి మారిన ఆ పంటను ఈ పక్షులు నాశనం చేస్తాయేమో అన్న సందేహాన్ని తీర్చారు అక్కడ వ్యక్తి . రైతులు వేసిన పంటను ఈ పక్షులు ముట్టుకోవట.
బహుశా, అందుకే రైతులు వాటి రాకను ఆహ్వానిస్తున్నారేమో! అదీ కాక ఈ పక్షుల వల్ల పంటను నాశనం చేసే క్రిమి కీటకాలను పక్షులు ఆహారంగా తీసుకోవడం వలన కూడా రైతుకు మేలు జరుగుతున్నదని అక్కడివారు చెప్పారు.
చెరువు చుట్టూ, చెరువు మధ్యలో మట్టిదిబ్బలపై ఉన్న తుమ్మ చెట్లపై, కృతిమంగా చెరువు మధ్యలో ఏర్పాటు చేసిన వాటిపై ఒక్కో జాతి పక్షి ఒక్కో సమయంలో గూళ్ళు కట్టి గుడ్లు పెడతాయి.
గుడ్లు పెట్టడానికి అనువైన వాతావరణం, ఆహారం లభించడం వల్ల ఈ పక్షులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నాయి, ఉంటున్నాయి. కొన్ని పక్షులు ఆస్ట్రేలియా నుంచి వస్తే కొన్ని సైబీరియా, చైనా, ఆఫ్రికా, శ్రీలంక, బాంగ్లాదేశ్, మయన్మార్ వంటి అనేక దేశాల నుంచి వస్తున్నాయి . దాదాపు 32 రకాల పక్షులు ఉప్పలపాడు వస్తాయి.
కొన్ని పక్షులు వర్షాకాలంలో వస్తే కొన్ని చలికాలంలో వస్తాయి. కొన్ని వేసవిలో వస్తాయి. దాదాపు 18 దేశాల నుండి పక్షులు వస్తాయి .
అయితే, గతంలో వచ్చినన్ని పక్షులు ఇప్పుడు లేవని అందులో సగం పక్షులే వచ్చాయని అక్కడ శుభ్రం చేస్తున్న మహిళ అన్నారు. బహుశా వాతావరణ పరిస్థితులు కారణమేమో ..
అక్కడ కనిపిస్తున్న పక్షులు చాలావరకు కొంగ, బాతు జాతికి చెందిన వాటిలాగే అనిపించాయి.
అనేక రాత్రులు, పగళ్లు నిర్విరామంగా ఎగురుతూ ఎలా వస్తాయో .. తాము ఎంపిక చేసుకున్న ప్రాంతాన్ని ఎలా గుర్తు పెట్టుకుంటాయో .. దారి తప్పకుండా ఎలా వస్తాయో .. అలాగే తిరిగి తమ స్వస్థలానికి ఎలా వెళ్ళిపోతాయో ఆశ్చర్యం
కొన్ని గంటలపాటు కూర్చుని వెళ్ళడానికే విసుగు వస్తుంది . అటువంటిది రోజుల తరబడి ఎగురుతూ వెళ్లడం, మధ్య మధ్యలో ఆహారం కోసం , విశ్రాంతి కోసం ఆగినప్పటికీ .. మామూలు విషయం కాదు కదా ..
ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, పక్షులు వలస రావడానికి ముందే కొన్ని పక్షులు వచ్చి రెక్కీ చేస్తాయట. తమకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటే అవి వెళ్లి చెప్పిన దాని మీద పక్షులు వచ్చి కొన్ని నెలలపాటు ఉంటాయి . గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి వాటికి ఎగరటం వచ్చాక పిల్లల్తో తమ ప్రాంతానికి వెళ్లిపోతాయి.
మానవ జీవనానికి అనుకూలమైన ప్రదేశాలని, వాతావరణాన్ని వెతుకుంటూ వెళ్లి వచ్చి అనుకూలంగా ఉంటే తన వెళ్లి నివాసం ఏర్పరచుకున్నట్లే పక్షులు కూడా..
జీవనం కోసం ఉన్న చోటు వదిలి కొత్త ప్రదేశానికి వెళ్లి వెనక్కి వచ్చేవి కొన్నయితే కొన్ని అక్కడే ఉండిపోయేవి కూడా పక్షుల్లో ఉన్నాయి. కొన్ని వలస పక్షులు అన్ని కాలాల్లో ఉప్పలపాడు లో ఉండటానికి అలవాటు పడిపోయాయట.
ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో వివిధ రకాల పక్షుల ఆటలు, సయ్యాటలు, కోలాహలం, ఆహారం కోసం వేస్తున్న ఎత్తులు జిత్తులు చూస్తూ ఓ గంట సమయం క్షణాల్లా దొర్లిపోయింది.
వెనుదిరిగిన సమయంలో నీటి ఉపరితలంపై మోచేయి అంత ఎత్తులో నలుపు రంగులో ఉన్నదేదో కదులుతూ నన్ను ఆకట్టుకుంది. పాము ఏదైనా అలా తల అంత పైకి ఎత్తి తిరుగుతున్నదా అని సందేహం వచ్చింది మొదట. ఫోటో తీశాను. జూమ్ చేసి చూసిన మొదట అర్ధం కాలేదు. అలా చూడగా చూడగా తెలిసింది అది పాము కాదు పక్షి అని. దాని పేరు డార్తర్ స్నేక్ బర్డ్. తల ఎత్తి నీటిలో ఈదుతుంది.
ఒకప్పుడు గ్రామ అవసరాల కోసం, మంచి నీటి కోసం వాడుకున్న చెరువు పూర్తిగా పక్షుల కోసమే ఇవ్వడం గ్రామస్తుల గొప్పదనం.
మంచినీటి చెరువు కాబట్టి వస్తున్న వలస పక్షులు తగ్గకుండా ఉండడం కోసం గ్రామస్థులు ఏడాదికి ఒకసారి శుభ్రమైన నీటిని నింపుతున్నారట.
చాలా కాలం క్రితం నుండి రకరకాల పక్షులు వచ్చేవట. వాటికి అనువుగా ఉండటం కోసం చెరువు వాటికే వదిలేశారు. వివిధ రకాల వలస పక్షులు సీజన్ల వారీగా వస్తుండటంతో చెరువు ఇప్పుడు పక్షుల సంరక్షణ కేంద్రంగా మారిపోయింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువు మధ్యలో మట్టి దిబ్బలు వాటిపై తుమ్మ చెట్లు గుబురుగా పెరిగి ఉన్నాయి. ఆ చెట్ల మీద వేలాది పక్షులు గూళ్ళు కట్టుకుని సందడి చేస్తున్నాయి . ఆకట్టుకుంటున్నాయి. శని ఆదివారాలలో పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారట.
కూర్చోడానికి అక్కడక్కడ బల్లలు, రక్షణగా చుట్టూ ఫెన్సింగ్ ఉంది. నడకదారి బాగుంది, చెత్త డబ్బాలు ఉన్నాయి . శుభ్రం చేస్తున్నారు. అందవరకూ బాగానే ఉంది కానీ మంచినీళ్లు, వాష్ రూమ్స్ సౌకర్యం ఉన్నట్టు కనిపించలేదు.
అక్టోబర్ నుంచి మార్చి వరకూ సందర్శకులకు మంచి సమయం. పక్షులు ఎక్కువ కనిపిస్తాయి .
ఉదయం వస్తే చాలా బాగుంటుందట. అందుకే అన్ని రోజులు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పర్యాటకుల కోసం తెరిచే ఉంటుంది .
గుంటూరు నుండి రావడానికి మరో మార్గం ఉంది. అక్కడి నుంచి పది కిలోమీటర్లలోపేనట.
పక్షుల రక్షిత కేంద్రం కి వెళ్ళేవారెవరైనా సరే బైనాక్యులర్స్ తీసుకువెళ్తే మరింత బాగా చూడగలరు. అదే విధంగా ఫోటో తీయడానికి మొబైల్ కన్నా లెన్స్ కెమెరా అయితే అద్భుతమైన ఫోటోలు సొంతమవుతాయి.
వి. శాంతి ప్రబోధ