స్వీడన్ – నేరం – సంస్కరణ -1

Spread the love

మా స్వీడన్ ప్రయాణం

నేరం చేసిన వారిని ఏ దేశంలో ఉపేక్షించరు.  వారిని అదుపులోకి తీసుకుని ఆ దేశ చట్టాల ప్రకారం శిక్షిస్తారు. అందుకోసం జైళ్లలో పెడతారు. ఇది మనందరికీ తెలిసిన విషయం.  

కానీ అక్కడ? 

నేరం చేసిన వారిని ఆ దేశ చట్టం కూడా ఊరుకోదు. అదుపులోకి తీసుకుంటుంది.  అయితే వారిని శిక్షించడం వారి అభిమతం కాదు.  అందుకే నేరస్థులను సంస్కరించడానికి కృషి చేస్తుంది. వారి పునరావాసానికి ప్రాధాన్యత ఇస్తుంది.  జైల్లో ఉన్న వారికి అన్ని మానవ హక్కులు కల్పిస్తుంది.  

గతంలో నేనెప్పుడూ వినని, చూడని విషయాలు అనేకం నన్ను అబ్బురపరిచిన స్వీడన్ జైళ్లని సంస్కరణాలయాలు అంటే బాగుంటుందనిపించింది.  ఎందుకంటే అవి ఖైదీల మానసిక చికిత్స అందిస్తాయి, పునరావాసం కల్పిస్తాయి,  జైలు నుంచి సమాజంలోకి వచ్చి అందరిలా బతకడానికి కావలసిన సంసిద్ధతను ఇస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ జైళ్లు ఒక సామాజిక కార్యకర్త పాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు. 

20 ఏళ్ల క్రితం అంటే అక్టోబర్ 2005 లో మా స్వీడన్ పర్యటన అనుభవాలు మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చా. 

SIDA (స్వీడిష్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ )  KRIS (క్రిమినల్స్ రిటర్న్డ్ ఇన్ టు సొసైటీ) ల ఆహ్వానం మేరకు వారి జైళ్లు – సంక్షేమ కార్యక్రమాలు అధ్యయనం చేయడం కోసం సంస్కార్ నుండి ఒక ప్రతినిధి బృందం స్వీడన్ ప్రయాణం ఆరంభమైంది.  ఆ బృందంలో సంస్కార్ అధ్యక్షుడు,  శ్రీ లవణం తో పాటు కె.హెచ్. ఎస్. ఎస్. సుందర్, నేను ఉన్నాం.  

మా పర్యటన నేపథ్యం

KRIS (Kriminals Returned Into Society) గురించి నేను మొదట విన్నది 2005 మార్చి లో.  Mr. యూహ డెడర్సన్, Mrs. అన్నేల్లి విక్లాండ్ ల భారత పర్యటనకు కొద్దిగా ముందు మాత్రమే. 

మన దేశంలో మానవతావాదులు, సంఘసంస్కర్తలు శ్రీ లవణం, శ్రీమతి హేమలతా లవణం ల ఆధ్వర్యంలో  సంస్కార్ స్వచ్ఛంద సంస్థ ద్వారా నేరస్థుల సంస్కరణ జరిగింది. స్టువార్టుపురం నేరస్థుల పేరు వింటేనే గజగజ లాడిపోయేవారు ఆనాడు. అటువంటి చోట లవణం దంపతులు సంస్కరణ కార్యక్రమాలు చేపట్టారు. 

1871 లో బ్రిటిష్ కొలోనియల్ ప్రభుత్వం ‘క్రిమినల్ ట్రైబ్స్ ఆక్ట్’  చట్టం ద్వారా కొన్ని కులాలు, తెగలను పుట్టుకతోనే నేరస్థులుగా పేర్కొంది.  నేరం చేస్తే నేరస్తులవుతారుగానీ నేరస్థుల కడుపున పుడితేనో, ఆ నేరస్తులున్న కులంలోనో తెగలోనో పుడితే నేరస్థులయిపోతారా?! అదే వారు చేసిన నేరమయితే ..? అది మానవత్వం అవుతుందా? 

పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు వారిని నేరం చేయకపోయినా నేరస్థులుగా చిత్రీకరించడం అంటే.. వారి కోసం ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేయడం అంటే..   వారు నేరస్థులు కాకుండా మరో మార్గం ఉందా?  

అలా నేరస్థ జాతిగా ముద్రపడిన వారి కోసం ఏర్పడిన కాలనీ స్టూవర్టుపురం. 

సాధారణ ప్రజలు నిద్రలోనైనా స్టూవర్టుపురం అంటే ఉలిక్కిపడతారు.  కరడు కట్టిన గజదొంగలను తలచుకుని భయపడతారు.  అలాంటి ఊళ్ళో డెబ్బయ్యవ దశకంలో సంస్కార్ స్వచ్ఛంద సంస్థ సంస్కరణ కార్యక్రమాలు ప్రారంభించింది.   నేరస్థులుగా ముద్ర పడ్డ వారిని మానవతా దృక్పథంతో చూసింది. వారిని చైతన్యవంతం చేసింది.  మార్పుకి కృషి చేసింది.  దేశంలో స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన మొదటి సంస్కరణ కార్యక్రమం ఇదేనేమో ..!

నేరస్తులను సంస్కరించే ఇలాంటి కృషి స్వీడెన్ దేశంలో కూడా ప్రారంభం అయింది.  అయితే అది చేసింది నేరాలను, నేరస్థులను బయటి నుంచి చూసి, స్పందించి వారిని సంస్కరించాలన్న సంస్కరణవాదులు కాదు.  అక్కడ జైళ్ళలోని ఖైదీలు.  వారు శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత తమను తాము సంస్కరించుకోవాలని అనుకున్నారు. 

ఆ ఆలోచనల్లోంచి 1997లో KRIS (క్రిమినల్స్ రిటర్న్డ్ ఇన్ టు సొసైటీ ) అనే లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది.  స్వీడెన్ రాజధాని స్టాక్ హోమ్ లో మొదటి సమావేశం జరిగింది.  2005 నాటికి దాదాపు 5000 మంది మాజీ ఖైదీలు, నేరస్తులు సభ్యులుగా చేరారు.

స్వీడెన్ దేశంలో నేరస్తులు అంటే మాదక ద్రవ్యాలకు లేదా మత్తు పదార్థాలకు అలవాటు పడి వాటి  కోసం నేరాలు చేసిన వారే ఎక్కువ.  ఇప్పుడు KRIS సభ్యులంతా వారు మాదకద్రవ్యాలకు , మత్తు పదార్ధాలకు దూరంగా ఉంటున్న వారు.

జైళ్లలో ఉన్న నేరస్తులని క్రిస్ సభ్యులు కలుస్తారు.  వాళ్ళ తో తరచు మాట్లాడుతూ ఉంటారు.  కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు .

మేం మాజీ నేరస్తులం.  కొన్నేళ్ళ పాటు జైల్లో మగ్గాం.  నేరస్థ జీవితంలో మాకు గౌరవం లేదు. అందులోంచి బయట పడాలని అనుకున్నాం.  అందుకే అలాంటి వారందరం కలిశాం.  ఒక సంస్థగా ఏర్పడ్డాము.  మమ్మల్ని గుర్తించండి. గౌరవించండి.  ఈ పౌర సమాజంలో మమ్మల్నీ భాగస్వాములు కానీయండి .   మమ్మల్ని మంచి పౌరులుగా ఎదగనీయండి .   మా పాత జీవితాన్ని మరచి మమ్మల్ని మీలో ఒకరు గా అంగీకరించండి అంటూ ముందుకు వెళ్తోంది KRIS.  వీరితో కలిసి పనిచేసే పౌర సమాజాలు  సంస్థలు తక్కువే కావచ్చు.  కానీ వారిని తక్కువ చేసి చూడలేం.  వారి ప్రయత్నాన్ని అభినందించి తీరాల్సిందే.

సంస్కార్ KRIS  రెండూ నేరస్తుల సంస్కరణ కోసం పని చేసినా, చేస్తున్నా వాటి పనితీరు మాత్రం భిన్నం. మన దేశంలో నేరస్థ జాతుల సంస్కరణ పౌర సమాజం నుండి అంటే సంస్కార్ సంస్థ నుండి వచ్చింది .  స్వీడన్లో మాజీ నేరస్థుల నుంచి వచ్చింది.  స్వీడెన్ రాజుతో సహా వివిధ వర్గాల వారు దాదాపు 900 మంది వీరికి సహకరిస్తున్నారు.

యుహ డెడర్సన్ , అన్నేల్లి విక్లాండ్ లు మనదేశంలో సువార్ట్పురంలో సంస్కార్ చేస్తున్న సంస్కరణ కార్యక్రమాలు చూశారు.  ఎక్స్ క్రిమినల్స్ తో మాట్లాడారు.  మన జైళ్లను చూశారు.  వారు తిరిగి తమ దేశం వెళ్లిన తర్వాత సంస్కార్ నుండి ముగ్గురు సభ్యుల బృందాన్ని స్వీడన్ ఆహ్వానించారు.  ఆ బృందంలో సంస్కార్ చైర్మన్ లవణం గారు, సంస్కార్ – ప్లాన్ డైరెక్టర్ సుందర్ తో పాటు అప్పుడు  ప్రోగ్రాం మేనేజర్ గా ఉన్న నాకు చోటు లభించింది.   

SIDA , Forum Syd , KRIS ల  ఆర్థిక సహాయంతో మా ప్రయాణ ఏర్పాట్లు జరిగిపోయాయి.

ప్రయాణం

అది 2005 సంవత్సరం. అక్టోబర్ 6వ తేదీ రాత్రి 10.30 కి బేగంపేటలోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం చేరుకున్నాం. 11 గంటలకు బ్యాగేజ్ స్క్రీనింగ్ ప్రారంభమైంది.  ఆ తర్వాత ఇమ్మిగ్రేషన్  ప్రాసెస్ పూర్తి చేసుకునే సరికి 12 గంటలైంది.  లాంజ్ లో ఓ గంట కబుర్లతో గడిచిపోయింది. 

అదే సమయంలో ఇండియన్ ఎయిర్ లైన్స్, ఎమిరేట్స్  ఫ్లైట్స్ కూడా ఉండడంతో ప్రయాణికులతో రద్దీగా ఉంది.   ఒంటి గంటకు సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుని బోర్డింగ్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాం. 

లుఫ్తాన్సా పాసెంజర్స్  గేట్ నెంబర్ 2 కి వెళ్ళమని 2. 15 గంటలకు అనౌన్సమెంట్ వచ్చింది.  మేం బోర్డు అయ్యేసరికి 2.45దాటింది.  మరో పది నిమిషాల్లో అంటే   2.55 కి మేం ఎక్కిన లుఫ్తాన్సా ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుంది.   

హైదరాబాద్ నుండి ఫ్రాంక్ఫర్ట్ 4382 మైళ్ళ దూరం. 52 వేల అడుగుల ఎత్తులో ఎగిరిన విమానం  ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ ) లో దిగేసరికి అక్కడ సమయం 8.30 అయింది.  

దిగిన టెర్మినల్ లో ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ వంటి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని మరో టెర్మినల్ లో స్వీడన్ వెళ్లే విమానం ఎక్కాము. 

9.55 కి ఫ్రాంక్ఫర్ట్ లో బయలుదేరి 11. 45 కి ఆర్లాండో ఎయిర్పోర్ట్, స్టాక్ హోమ్ లో ల్యాండ్ అయింది మా విమానం.  

2004 లో మొదటిసారి విదేశీ గడ్డపై అడుగుపెట్టిన నేను మరో సారి విదేశీ గడ్డపై కాలు పెట్టాను. అప్పుడు అమెరికా వెళితే ఇప్పుడు యూరోప్ లోని స్వీడన్ లో అడుగు పెట్టడం ఒకింత ఉద్వేగంగా ఉన్నాను. 

మా బ్యాగేజ్ తీసుకుని వచ్చేసరికి మా కోసం ఎదురు చూస్తూ KRIS సభ్యులు యూహ ఆండర్సన్, అన్నేల్లి విక్లాండ్, కై ఎల్లింగ్లాస్, హెర్మా  లతో పాటు లవణం గారి మానస పుత్రిక రత్న, ఆమె సహచరుడు పెర్తి , వారి మిత్రుడు, లవణం గారి అభిమాని  తిరునగరు వెంకట్, యూనివర్సిటీ విద్యార్థి బిర్గిట్  మాకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ… 

ఆర్లాండో విమానాశ్రయం స్టాక్ హోమ్ నగరానికి 27 మైళ్ళ(43 కి మీ ) దూరంలో ఉంది.  ప్రయాణ మార్గం విశాలమైన రోడ్లతో అటు ఇటు అంతా చిట్టడవులతో పచ్చగా ఉంది. రోడ్డు పక్కన పచ్చగడ్డి పై కొన్ని చోట్ల దట్టంగా, మరికొన్ని చోట్ల పలచగా తలెత్తుకుని చూస్తూ ఆహ్వానించే గడ్డి చేమంతులు నన్ను ఆకట్టుకున్నాయి. మన దగ్గర కనిపించే గడ్డి చేమంతి చూడడం భలే అనిపించింది. మేమున్న కారు KRIS వాళ్ళది. అందరూ కొత్తవాళ్లు. సుందర్ వాళ్లతో ముచ్చట పెడుతున్నాడు. లవణం గారు రత్న వాళ్ళ కారులో ఉన్నారు.  నేను పరిసరాలను పరిశీలిస్తూ కూర్చున్నాను.  స్టాక్ హోమ్ నగరంలోకి వచ్చేవరకు దారిలో అక్కడక్కడ పొలాల్లో ఒకటీ అరా ఇల్లు అంతే. 

మేమంతా నేరుగా Tjar Hovs Gatan లో ఉన్న KRIS ఆఫీసుకు చేరుకున్నాం.  ఆ సంస్థ అధ్యక్షుడు క్రిస్టోఫర్ కార్ల్ సన్, ఉపాధ్యక్షుడు పీటర్ సూదర్ లుండ్ ఇంకా కొందరు KRIS సభ్యులు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. 

లోపలికి వెళ్ళగానే గోడపై KRIS నాలుగు ముఖ్య సూత్రాలు నిజాయితీ, స్నేహం, సంఘీభావం, మత్తు వ్యసనం లేని జీవితం అని తెలిపే పోస్టర్ పలకరించింది. 

ఇరవై నిమిషాల సమావేశంతో మా అఫీషియల్ ప్రోగ్రాం ప్రారంభమైంది.  తర్వాతి రోజుల్లో మా పని గురించి కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత అక్కడి నుంచి బయటపడ్డాం. 

లవణం గారిని వెంకట్ గారి కారులో రత్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు.  నన్ను, సుందర్ ని  వొర్బిగార్డ్  లో ఉన్న యూహ ఉండే అపార్టుమెంట్ కు తీసుకెళ్లారు.  హోటల్ అయితే అలవాటు లేని భోజనం తో ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఇక్కడైతే మాకు కావాల్సిన విధంగా వంట చేసుకోవచ్చని ఈ ఏర్పాటు చేశామని చెప్పారు యూహ, అన్నేల్లి.  అప్పుడప్పుడు మేం కూడా ఇండియన్  స్పైసీ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు  అని నవ్వేసింది అన్నేల్లి. 

మాకు అవసరమైన వస్తువులు కొనుక్కోడానికి  స్వీడిష్ క్రోనార్ లు, మా రోజువారీ ప్రయాణం కోసం ఒక నెలరోజులు వాలిడిటీ ఉన్న ట్రావెల్ కార్డు ఇచ్చారు.  మొదటిసారి ఆ  కార్డు చూసి ఆశ్చర్యపోయాను.

ఆ కార్డుతో రోడ్డు, రైలు, జల మార్గాల్లో స్టాక్ హోమ్ నగరంతో పాటు సబర్బు ప్రాంతాల్లో కూడా ఎక్కడికైనా ఎన్ని సార్లైనా ప్రయాణం చేయొచ్చని అన్నేల్లి చెప్పింది. 

ఫ్రిజ్ నిండా రకరకాల బ్రెడ్, బటర్, జామ్, జ్యూస్ లు ఫ్రెంచ్ ఫ్రై లు ఇంకా ఏవేవో తెచ్చి నింపేశారు.  మేం మాతో మన పచ్చళ్ళు, కారం పొడులు, సాంబార్ పొడి, పులిహోర పేస్ట్, ఉలవచారు తెచ్చుకున్నాం.  

మరుసటి రోజు ఉదయం అన్నేల్లి, యూహ లతో కలిసి ఐదు నిమిషాల నడక దూరంలో ఉన్న ICA సూపర్ మార్కెట్ కి నడచి బయలుదేరాం.   అప్పుడు తెలిసింది చలి. 

ఎయిర్ పోర్ట్ లో వివిధ అంతస్తుల్లో ఉన్న పార్కింగ్  అంతా ఎయిర్ కండిషన్డ్ కాబట్టి అక్కడ  కారు ఎక్కినప్పుడు చలి తెలియలేదు.  ఈడ్చి కొడుతున్న చలిగాలి. లోపల థర్మల్స్ వేసుకుని తలకు క్యాప్, కోటు ఉన్నప్పటికీ ఆ చలి తట్టుకోవడం చాలా కష్టమనిపించింది.  ఈ వాతావరణంలో నెల రోజులు గడపాలా అని భయపడిపోయాను.  

ఆ స్టోర్ లో కావలసిన వస్తువులు తీసుకుంటుంటే అక్కడ పనిచేసే అమ్మాయి నవ్వుతూ మీరు శ్రీలంక వారా అంటూ నన్ను  పలకరించింది.  కాదు,  ఇండియా అని చెప్పగానే  నేను తమిళియన్ లాగా కనిపించానేమో  తమిళ్ వారా అంటూ తమిళంలో పలకరించి  తను శ్రీలంక తమిళియన్ అని చెప్పింది. నేను హైదరాబాద్ అని చెప్పగానే కొద్దిగా డిసప్పాయింట్ అయినట్లనిపించింది.  పరాయి దేశంలో తమ ప్రాంతం, తమ భాష తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఎంత ఆనందమో తర్వాత నాకు అర్థమైంది. 

 8,9 తేదీలు శని ఆదివారాలు కావడంతో మాకు అఫీషియల్ పనిలేదు.  ఆ రోజు సాయంత్రం 7 గంటల వరకు అన్నేల్లి నేను  స్వీడన్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం.  ముఖ్యంగా అక్కడి మహిళల స్థితిగతులపై మాట్లాడుకున్నాం. రాడికల్  ఫెమినిస్టులు ఒక రాజకీయ పార్టీ పెట్టారు.  ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నట్లు అక్కడి వారు కూడా ఇంటి బాధ్యత ఆడవాళ్లదే అనుకుంటారట.  

పిల్లల పెంపకం, ఉద్యోగం ల మధ్య స్త్రీలు నలిగిపోతున్నారు, అందుకే చాలా మంది మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చిన ఉద్యోగానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు.  మొదట్లో ఆడపిల్లలను బడికి దూరంగా ఉంచారు, స్వీడిష్ మహిళలకు వందేళ్ల క్రితం ఓటు హక్కు వచ్చింది. ఇలా ఎన్నో విషయాలు అన్నేల్లి ద్వారా తెలుసుకున్నాను. 

రాడికల్ ఫెమినిస్టులు పెట్టిన రాజకీయ పార్టీ గురించి చెప్పినప్పుడు నాకు చాలా ఆసక్తి కలిగింది.  ఆ పార్టీ పేరు ఫెమినిస్ట్ ఇనిషియేటివ్ . ఏప్రిల్ 4, 2005 లో ఏర్పాటయింది.  లెఫ్ట్ పార్టీల్లోంచి విడిపోయి ఏర్పడింది.  కొత్తగా ఏర్పాటైన పార్టీ. ఇంకా ఎన్నికల్లోకి పోలేదు. 

 స్త్రీలు జెండర్ సమానత్వం కోసం పోరాడడం తెలుసు. స్త్రీల కోసం ఒక పార్టీ అంటే అది ఎన్నికల్లో నెగ్గుతుందా, అసలు ఆ అవసరం ఉందా.. అనేక ప్రశ్నలతో ఆ విషయమే అడిగాను.  మహిళలకు ఓటు హక్కు వచ్చినప్పటి నుండి స్వీడిష్ మహిళలు రాజకీయాల్లో తమ స్థానం కోసం పోరాడుతున్నారు. పార్లమెంట్ లో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకుంటున్నారు.  తమ గొంతు స్పష్టంగా వినిపిస్తున్నారు నేను అక్కడ ఉన్న సమయంలో(2005) స్వీడిష్ పార్లమెంట్ లో మహిళలు 43. 6 శాతం.  అది నాకు చాలా గొప్పగా కనిపించింది.  అధికారం 50:50 ఉండాల్సిందేనని అక్కడి మహిళల పట్టు.  

ఆ తర్వాత యూహ నన్ను, సుందర్ ని వెర్బిగోడ్  అనే ప్రదేశంలో దించితే వెంకట్ గారు వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు.  ఆరోజు అక్కడే ఉన్నాం. 18 ఏళ్ల వాళ్ళబ్బాయి సంజయ్ ఆలోచనా సరళి నేను చూసిన ఆ వయసు పిల్లల ఆలోచనలకూ చాలా భిన్నంగా ఉంది. అతని ఆలోచనల్లో మెచ్యూరిటీ ఉంది.  మనం మన పిల్లలకు స్వతంత్రంగా వ్యవహరించడం నేర్పించం.  ఆధారపడే విధంగా పెంచుతామని సంజయ్ ద్వారా అర్థమైంది నాకు.  మనం పిల్లల్ని పెంచే విధానానికి భిన్నంగా  స్వీడన్ లో పిల్లల పెంపకం ఉంటుంది కావచ్చు ముందు ముందు తెలుసుకోవాలని అనుకున్నాను. 

తెలుగింటి భోజనంతో అంతర్జాతీయ పుట్టిన రోజు వేడుక 

 9వ తేదీ ఉదయం వెంకట్ గారి ఇంటి నుంచి వచ్చి తయారై రత్న వాళ్ళ అమ్మాయి హెల్మీ సమైక్య మొదటి పుట్టిన రోజు వేడుకలకు ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళాం. మరుసటి రోజు లవణం గారి పుట్టినరోజు. అందుకే ఇద్దరి పుట్టినరోజు వేడుకలు కలిపి ఒకే వేదికపై  జరిపించారు రత్న, పెర్తి.  

స్వీడన్ , ఫిన్లాండ్ , నార్వే , రష్యా , నెదర్లాండ్, జర్మన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ , దక్షిణాఫ్రికా, డొమినిక్ రిపబ్లిక్ వంటి 25 దేశాలకు  చెందిన అతిథులు పాల్గొన్నారు. వారిలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు.  వీరందరిని కలవడం, మాట్లాడటం గొప్ప అనుభవం. వారిలో బియాన్ మెర్కర్ ఒకరు. 19 ఏళ్ల వయసులో మిలటరీ  నిర్ణయాన్ని వ్యతిరేకించి ప్రభుత్వం నుండి శిక్ష ఎదుర్కొన్న వ్యక్తి ఆయన. నార్వే నుంచి వచ్చిన  లెవీ ప్రాగల్ గొప్ప మానవతావాది. ప్రపంచ హ్యూమనిస్ట్ నాయకుడు.  

 విభిన్న దేశాల సంస్కృతులు, భాషల వారి మధ్య జరిగిన వేడుక లో అద్భుతమైన భోజనం.  అది స్వీడిష్ భోజనమో భారతీయ భోజనమో కాదు. అచ్చమైన తెలుగింటి భోజనం. ఆఖరికి ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, అప్పడం తో సహా. వచ్చిన అతిథులు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ తెలుగింటి భోజనాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదించారు.  ఐస్ క్రీం, కేకులు, శీతలపానీయాలు మాత్రం స్వీడిష్ వి. 

రత్న సహచరుడు పెర్తి హ్యూమనిస్ట్ అసోసియేషన్ లో క్రియాశీలమైన వ్యక్తి. లవణం గారు వచ్చారని నార్వే , నెదర్లాండ్స్, ఫిన్లాండ్, డెన్మార్క్ ల నుండి కొందరు హ్యూమనిస్ట్ లు వచ్చారు. 

పెళ్లి అయి వెళ్లిన నాలుగేళ్లలోనే రత్న ఏర్పరచుకున్న స్నేహాలు, పెంచుకున్న మానవీయ బంధాలు చూసి అబ్బుర మనిపించింది. 

భోజనాల అనంతరం రెస్టారెంట్ ఓనర్ ని కలిశాను. భోజనం బాగుందని చెప్పి పిచ్చాపాటి మాట్లాడుతూ ఇండియా లో ఏ ప్రాంతం అని అడిగా.  అతను చెప్పిన జవాబు విని అవాక్కయ్యా. 

నిజానికి అతను భారతీయుడు కాదు బంగ్లాదేశీ.  కానీ స్వీడిష్ సమాజం దృష్టిలో భారతీయుడు.  

అమెరికాలో సెప్టెంబర్ 11 సంఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక మతం వారిపై వచ్చిన అపనమ్మకం వల్ల మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధంగా చెప్పుకోవలసి వస్తున్నది.  అందుకు మేమేమీ బాధపడడం లేదు. మేమూ భారత ఉపఖండ వాసులమే కదా.. అని ఆ రెస్టారెంట్ ఓనర్ సమాధానం. 

నిజమే కదా..!  

ఇక్కడ మన దేశాల మధ్య మనమంతా ఒకటే అనే భావన ఎప్పుడు వస్తుందో … 

వి. శాంతి ప్రబోధ 

వి. శాంతి ప్రబోధ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *