నింపాది నిద్ర లేని
రాత్రులామెవి.
పక్క మీద పల్లేరుజ్ఞాపకాల
సలపరింపు.
అంటుకోని కళ్ళ లోపల
కారునలుపు కలలు.
నిద్రలోనే నిద్రాభంగాలు
ఏవో ఆశాభంగాలు
ఆకు అల్లాడదు గానీ
లోన పెనుతుపాను
అన్నీ తెంచుకు పోయిన
పేగు తుంచుకు పుట్టినవాళ్ళు
మాగన్ను నిద్రలో గుండెసలుపులు
కడుపుతీపులు కడుపుకోతలు
కలవరపెడుతున్న కలలో
ఆర్తిగా పొగిలే చేతులను పొదువుకుంటే
సాంత్వన తెరిపి.
తెరవలేని కన్నుల అగాధాల్లో
నిద్రాచ్ఛాయల లోతుల్లో
అలల నీడల్లా తాకే బిడ్డలు
పంచుకున్న రక్తం పారే పిల్లలు
అల్లుకున్నట్టే అల్లుకొని
అందని చేతులు చాచి
అదృశ్యమయే పేగుతీగలు
ఒక్కోసారి ఆమె
ఆ మాగన్ను నిద్రచ్ఛాయల్లోనే
దిగులు మబ్బులు తొలగి
మొకమంతా వెన్నెల కమ్మి
పెదాల మీద నవ్వు వెలుగుతుంది.
బహుశా ఏ పంచుకున్న పాశమో
ఏ ఏ లోకాల్లోనో కలిసి
కనపడని కన్నీళ్ళు తుడిచాయో..
అప్పుడు ఆమె
ఆటబొమ్మను హత్తుకున్న పాపలా
నా చేతిని హత్తుకొని
నిశ్చింతగా నిద్ర పోతుంది.
ఆ తర్వాత ఎప్పుడైనా
ఆమె నిద్రలో వెలిగే
పెదాల మీద నవ్వు
నేనయితే బాగుణ్ణు.