రోజూ కొంచెం కొంచెంగా నువ్వు నరుక్కు వెళుతున్నదేమిటో నీకు బాగా తెలుసు
నువ్వు గీసే నఖ చిత్రాలకు కాన్వాసు
ఎంత మెత్తని మాంసపు ముద్దో
అదీ తెలుసు
కాస్త చిరునవ్వు ను ధారబోయాలంటే
నువ్వెంత గిజాటు పడతావో తెలుసు
కొన్ని సుతి మెత్తని మాటలు
వెలువరించాలంటే మరెంత
ప్రసవ వేదన అనుభవిస్తావో
లోతుగా తెలుసు
నీ చూపుడు వేలు చివరే ప్రపంచపటాన్ని
శాసించాలని చూస్తావు
భూగోళాన్ని చిటికెన వేలిపై తిప్పాలని
పంతం పడతావు
ఆకాశం నీ ముందు వంగి సలాం చేయాలంటావు
నీ పక్క సింహాసనం కాళ్లిరిగి
నీ కాళ్ళ వద్ద పడి ఉండాలంటావు
నువ్వు అనుక్షణం స్వాప్నిస్తున్న
అధికారమేమిటో తెలుసు
నువ్వు గాయపరుస్తున్న హృదయపు
నెత్తుటి వాసన నీకు బాగానే తెలుసు
నీకు తెలియనిదల్లా ...
ప్రేమిస్తేనే తిరిగి ప్రేమించబడతావు అనీ!
బహుశా ఇది తెలిసినా నువ్వు నటిస్తుంటే
ఒక రోజు ఖచ్చితంగా ఓడిపోతావు
ఎందుకంటే 'ఆమె'
ఇప్పుడు నీ పాద సమాధి కింద ఉండొచ్చు కాక
నువ్వు భూమి పైకి రావాలంటే
ఆమె విసర్జించిన నెత్తుటి వాగులోనే కొట్టుకురావాలి
యాద్ చేసుకో!

