పాట – 29
చిత్రం : పెళ్లీడు పిల్లలు (1982) సంగీతం : ఎం. ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : శ్రీశ్రీ గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుశీల
వయసే వెల్లువగా…
వయసే వెల్లువగా… వలపే వెన్నెలగా…
పులకరించి పరిమళించి ఊగేనులే ఉయ్యాలగా…..!
వయసే వెల్లువగా….వలపే వెన్నెలగా….
మనసు నేడే కలత తీరి ఊగిందిలే ఉయ్యాలగా …..!!
చెలరేగేను సుడిగాలులు, విడిపోయేను మనదారులు (2)
వలపు చిందించి జడివానలు, చిగురు వేయాలి మన ఆశలు (2)
చెలిమి నిండి కలలు పండి చేరాలిలే చేరువగా
వయసే వెల్లువగా వలపే వెన్నెలగా
పులకరించి పరిమళించి ఊగేనులే ఉయ్యాలగా…..!
మది కళ్యాణ శుభవేదికా, ఇది వాసంత సుమవాటికా (2)
హృదయ భావాలు సిరిమల్లెలై, మధుర గీతాలు పలికించెలే(2)
గులాబీలే గుబాళించి మురిపించెలే దీవెనెలే
వయసే వెల్లువగా వలపే వెన్నెలగా
పులకరించి పరిమళించి ఊగేనులే ఉయ్యాలగా …..!
ఒక సినిమా నిర్మాణంలో ఎంతో మంది పాత్ర ఉంటుంది. సినిమా ఎన్నో కళల కలబోత. రచయితలు, ఛాయాగ్రహకులు, ఆర్ట్ డైరక్టర్లు, సంగీతకారులు, ఇలా ఎందరో కలిసి సృష్టించే కళామాధ్యమమే సినిమా. వీళ్లందరినీ ఉపయోగించుకునే నైపుణ్యం దర్శకుల సొంతం. రచయితలకు, కవులకు ప్రాధాన్యత లేకుండా సినిమా మొత్తం హీరో డామినేషన్ తో నడవడం సినీ పరిశ్రమలో దిగజారుతున్న సినీమాల స్థాయికి సంకేతం.
హిందీ సినీ కవి సాహిర్ లుధియాన్వి అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఆయన పాటల రచయితకు సముచిత గౌరవం ఇవ్వాలని సినీ జగత్తులో యాభైవ దశకంలో ఒక పెద్ద యుద్దమే చేశారు. పోస్టర్లపై పాటల రచయిత పేరు ఉండాలని, రికార్డులపై గాయనీ గాయకులదే కాక తమ పేరు ఖచ్చితంగా ఉండాలని ఒంటరిగా మొండి పట్టుదలతో పోరాడారు. ఈయన పోరాట ఫలితమే రేడియోలో పాటను ప్రసారం చేసున్న సందర్భంలో గేయ రచయిత పేరు ప్రకటించడం మొదలెట్టారు. ఈ పోరాటంలో చాలా మంది సాహిర్ ని శతృవుగా చూసినా ఆయన చలించలేదు. తాము రాసిన గేయాలను పాడినవారు, నటించినవారు స్టార్లుగా చెలామణి అవడం, ఆ పాట సృష్టికర్తలుగా తమను ఎవరూ కనీసం గుర్తు కూడా చేసుకోకపోవడం ఏంటని ఆయన చాలా బలంగా వాదించారు. గాన కోకిల లతామంగేష్కర్ కన్నా ఒక్క రూపాయి తనకు రెమ్యునరేషన్ రూపంలో ఎక్కువగా రావలసిందే అని వాదించి పుచ్చుకునేవారు. ఇక్కడ ఆయన మొండితనం వెనుక ఉన్నది సంపాదన పై ఆశ కాదు. రచయిత ముందు వరసలో ఉండాలన్న తపన మాత్రమే. దీనికి ఆయన్ని ఎంత మంది ద్వేషించినా చివరి దాకా ఆయన ఇదే బాటలో నడిచారు.
శ్రీ శ్రీ గురించి చర్చిస్తూ సాహిర్ ను గుర్తు చేసుకోవడానికి కారణం, ఇద్దరూ ప్రజా కవులు, వామపక్షభావజాలంతో జీవించినవారు, వామపక్ష సాహితీ సంస్థలకు ప్రాతినిద్యం వహించినవారు, తమ భాషపై అమోఘమైన పట్టు ఉన్న ఉద్దండులు. ఇద్దరి పాటల్లోనూ సారూప్యం కనిపిస్తుంది. కాని సాహిర్ వ్యక్తిగతంగా సినీ జగత్తులో తనదైన ముద్ర కోసం చూపిన ఆ పట్టుదల శ్రీ శ్రీ తెలుగు సినీరంగంలో చూపలేదు. అందుకే ఆయన రాసిన పాటలెన్నో మరుగునపడిపోయాయి. ఒకే సినిమాలో ఇద్దరు కవులు పాటలు రాస్తే ఎవరు ఏది రాసారో తెలియని అయోమయంలో శ్రీ శ్రీ రాసిన ఎన్నో పాటలు మాయమయిపోయాయి. పాట రాసి ఇచ్చేసి, వాళ్లిచ్చింది పుచ్చుకుని ఆ పాటను గురించి ఆయన మర్చిపోయారనిపిస్తుంది. సాహిర్ విషయానికి వస్తే ఆయన పాడిన పాటల్లో ఒక్క పాటలోనూ ఎటువంటి తప్పు దొర్లే ఆస్కారం లేదు. ఆయన్ని ఎక్కువమంది విమర్శిస్తారు, కాని సినీ జగత్తులో ఆయన స్థానంలోకి ఎవరూ వెళ్లలేరని వాళ్లే ఒప్పుకుని తీరతారు కూడా. శ్రీ శ్రీ వ్యక్తిత్వంలో ఆ కటుత్వం లేకపోవడం ఆయన పాటలు నిర్లక్ష్యానికి గురవడానికి కారణం అయిందన్నది నా అభిప్రాయం.
సినిమా సరిగ్గా ఆడకపోయినా అందులోని పాటలను జనం మర్చిపోతారు. 1982లో బాపు దర్శకత్వంలో ‘పెళ్ళీడు పిల్లలు’ అనే సినిమా వచ్చింది. ఇందులో ఆత్రేయ, శ్రీ శ్రీ పాటలు రాసారు. శ్రీ శ్రీ కవిత్వాన్ని బాగా ఉపయోగించుకున్నారు బాపు. సినిమాలో ముఖ్యపాత్రలో నటించిన శరత్ బాబు శ్రీ శ్రీ కవిత్వాన్ని ప్రతి సందర్భంలోనూ కోట్ చేస్తూ కనిపిస్తారు. అయితే ఇందులో శ్రీ శ్రీ ఎన్ని పాటలు రాసారన్న విషయంలో మాత్రం స్పష్టతలేదు. మనం ఇప్పుడు చర్చించుకునే పాట కాక, మరో రెండు పాటలు శ్రీ శ్రీ రాసినట్లు కొన్ని చోట్ల ఉన్నా దాని పట్ల పూర్తి స్పష్టత లేదు. ఈ పాట మాత్రం శ్రీ శ్రీ పాటగానే అన్ని చోట్ల రికార్డ్ అయింది. ఈ సినిమాకు సంగీతం అందించింది ఎం. ఎస్. విశ్వనాథన్. పూర్తి మెలడీ బేస్ తో ఉన్న ఈ పాట మధురంగా ఉంటుంది. పైగా ఇందులోని అచ్చ తెలుగు పదాలు, తెలుగు భాష రుచిని పరిచయం చేస్తాయి. అయినా ఈ పాట చాలా మంది దృష్టికి రాకపోవడం శ్రీ శ్రీ అభిమానులకు బాధ కలిగించే విషయం.
ఓ యువజంట ప్రేమకు కుటుంబ రాజకీయాలు అడ్డవుతాయి. వాటి నుండి విడిపోయి తమ ప్రేమను గెలిపించుకోవాలనే ధ్యేయంతో ఇద్దరూ తమ మధ్య వచ్చిన అపార్ధాలను దాటుకుని, ఒకటిగా జీవితాన్ని ఎదుర్కోవడానికి సిద్దపడిన సందర్భంలో వచ్చే ఈ పాటలో ప్రధాన ఆకర్షణ ఆ పదాల ఎంపిక.
వయసే వెల్లువగా, వలపే వెన్నెలగా, పులకరించి పరిమళించి ఊగేనులే ఉయ్యాలగా అంటూ సాగే పల్లవి ఆ జంట ఆనందడోలికలలో విహరించే సందర్భాన్ని వివరిస్తుంది. వయసు వలపు తోడుగా జీవితంలో పరిమళాలను వెదజల్లుతూ ఆనందపు తీరాలకు ఊగుతూ తామ భవిష్యత్తు వైపుకు ప్రయణిస్తామన్న ఆత్మవిశ్వాసం వారిద్దరిలోనూ కనిపిస్తుంది. ఆమె ఆనందానికి జతవుతూ అతను వయసే వెల్లువగా వలపే వెన్నెలగా మనసు నేడే కలత తీరి ఊగిందిలే ఉయ్యాలగా అని జవాబిస్తున్నాడు. తమ మధ్య వచ్చిన కలతలు తీరిపోయాయన్న నిశ్చింత అతనిలో ద్వనిస్తుంది. బాలు సుశీలలు మధురంగా గానం చేసిన పాట ఇది.
చెలరేగేను సుడిగాలులు, విడిపోయేను మనదారులు, అంటూ గతాన్ని తలచుకుంటుందీ జంట. సుడిగాలులు చెలరేగి కొంత కాలం తమ దారులు విడిపోయాయని కాని ప్రేమ జడివానగా కురియగా దాన్నిదాటివచ్చామని ఇక తమ ఆశలు చిగురించి, చెలిమి నిండి, కలలు పండి ఇద్దరమూ జీవితంలో చేరువవ్వాలని వాళ్లు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకుంటున్నారు.. వలపు చిందించి జడివానలు, చిగురు వేయాలి మన ఆశలు, చెలిమి నిండి కలలు పండి చేరాలిలే చేరువగా ఈ వాక్యం దగ్గర ఆ జంట భావోద్వేగాలకు సంగీతపరంగా అతి గొప్ప న్యాయం చేసారు సంగీత దర్శకులు. పాట వింటున్నప్పుడు ఈ వాక్యం శ్రోతలను కదిలిస్తుంది.
ఈ పాటలోని సంగీతం ప్రతి పదాన్ని స్పష్టతతో గానం చేయడానికి అవకాశం ఇవ్వడంతో ఆ పదాల అల్లిక అత్యంత మధురంగా అనిపిస్తుంది. కవి తన పదాలతో జోడించిన లాలిత్యాన్ని సంగీతం ఎలివేట్ చేస్తుంది. మాహాప్రాణక్షరాలను విరివిగా కవిత్వంలో ఉపయోగించే శ్రీ శ్రీ ఇక్కడ అలతి అలతి మధురమైన పదాల కోసం, ఉత్సాహపరిచే పద ప్రయోగాలను కాక, ఆహ్లాదపరిచే పదాలతో ప్రశాంతమైన ఉల్లాసాన్ని అందించే పాటను రచించారు. కవి పదాలతో శ్రోతల భవోద్వేగాలను నియంత్రించే శక్తిని కలిగి ఉంటాడు. దానికి శ్రీ శ్రీ కలం నుండి సృష్టించబడ్డ ఈ పాట ఓ ఉదారహణగా తీసుకోవచ్చు. ‘పదండి ముందుకు పదండి తోసుకు’ అని రాసిన కవి ‘చెలిమి నిండి కలలు పండి చేరాలిలే చేరువగా’… అని కూడా రాసి తానో భావకవినని నిరూపించుకుంటూ మన మనసులను రొమాంటిజంతో నింపేయగలరు. పై వాక్యం కేవలం ప్రేమికుల సంభాషణే కానక్కరలేదు, భవిష్యత్తు పట్ల వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒకరి మనసులో చెలరేగే కోరిక అదే కదా. స్నేహంతో జీవితం నిండి మన కలలు పండాలనే ఆశకు వయసుతోనూ, ప్రత్యేకమైన బంధాలతోనూ సంబంధం లేదు. అది ఈ భూమిపై సంచరించే ప్రతి ఒక్కరి కోరిక. అందుకే ఈ పాట కేవలం ప్రేమ గీతంలా అనిపించదు. జీవితాన్ని ఆనందంతో నింపుకోవాలనుకునే ప్రతి వ్యక్తి అంతరంగ నివేదనగా వినిపిస్తుంది.
శ్రీ శ్రీ కలం లలితమైన భావకవిత్వ మధురిమలను కూడా పండించగలదు. ఈ తర్వాతి చరణంలో కవి ప్రదర్శించే లాలిత్వం గొప్ప ఆనందానుభూతిని కలిగిస్తుంది. వివాహం, ప్రేమ పట్ల ఎంతో నమ్మకాన్ని చిగురింపజేసే ఈ చరణం ఇలా సాగుతుంది.
మది కళ్యాణ శుభవేదికా, ఇది వాసంత సుమవాటికా, హృదయ భావాలు సిరిమల్లెలై, మధుర గీతాలు పలికించెలే అని ఆ జంట తమ ఆనంద గీతాన్ని గానం చేస్తుంటే వింటున్న వాళ్ల మనసులు ఆ భావపరంపరలో పులకిస్తాయి. ‘వాసంత సుమవాటిక’ ఎంతటి లాలిత్యంతో నిండిన అందమన పదం? మనసే శుభప్రదమైన పెళ్లి వేదికగా మారిపోవడం అన్న భావన చాలా గొప్పగా అనిపిస్తుంది. జీవితం వసంత కాలంలో వికసించిన అందమైన పూల తోటలా కళకళలాడుతోందట. ఈ వాసంత సుమవాటిక అనే పదబంధాన్ని ఈ పాట విన్నవాళ్లు మర్చిపోలేరు. హృదయంలో చెలరేగుతున్న తీపి ఆలోచనలు, భావాలు తెల్లని, స్వచ్ఛమైన సిరిమల్లె పూలలా వికసిస్తున్నాయి. ఆ ఆనందంలో మనసు మధురమైన పాటలను ఆలపిస్తోందంటూ హృదయ భావాలు సిరిమల్లెలై, మధుర గీతాలు పలికించెలే అని వాళ్లు పాడుతుంటే వింటున్న శ్రోతల హృదయాలు పులకరించకుండా ఉండవు. ఆ ప్రేమానందాన్ని వ్యక్తీకరించడానికి కవి ఎంచుకున్న పదాల మధురిమ వెన్నంటే ఉండిపోతుంది. ఇంతటితో ఆగడు కవి గులాబీలే గుబాళించి మురిపించెలే దీవెనెలే అంటూ సువాసనలను వెదజల్లుతూ మురిపిస్తున్న గులాబీ పూల అందం తమపై ప్రకృతి కురిపించే దీవెనలని తన్మయత్వంతో ప్రకటిస్తుంది ఈ జంట.
ఒక ప్రవాహంలా పొంగిపొర్లుతున్న యవ్వనపు ప్రేమను ఆఘ్రానిస్తూ, ఆ అనుభూతుల వెల్లువలోని ఆనంద స్థితిని అత్యద్భుతంగా వివరించే పాట ఇది. ఈ పాట శ్రీ శ్రీలోని భావ కవిని పరిచయం చేస్తుంది. ఎన్నో యుగళ గీతాలు రాసిన శ్రీ శ్రీ ప్రతి పాటలో కొత్తగా కనిపిస్తారు. ముఖ్యంగా తెలుగు సాహిత్యం పరిచయం చేసిన విప్లవ కవి ఆయనలోని ఒక కోణం మాత్రమే అని ఇలాంటి గీతాలు ప్రతి సారి ఆశ్చర్యపరుస్తూ నిరుపిస్తూ ఉంటాయి. శ్రీ శ్రీ అభిమానులు గుర్తుంచుకోవలసిన పాట ఇది.
పాట – 30
చిత్రం : బలిపీఠం (1975) సంగీతం :చక్రవర్తి
గీతరచయిత : శ్రీశ్రీ నేపధ్య గానం : ఎస్ పి బాలు
కలసి పాడుదాం తెలుగు పాట
కదలి సాగుదాం వెలుగుబాట
తెలుగువారు నవజీవన నిర్మాతలనీ
తెలుగుజాతి సకలావనికే జ్యోతియనీ (కలసి పాడుదాం)
కార్యశూరుడు వీరేశలింగం… కలంపట్టి పోరాడిన సింగం…
దురాచారాల దురాగతాలను తుదముట్టి౦చిన అగ్నితరంగం
అడుగో.. అతడే.. వీరేశలింగం
మగవాడెంతటి ముసలాడైనా మళ్ళీ పెళ్ళికి అర్హత వుంటే…
బ్రతుకే తెలియని బాల వితంతువు కెందుకు లేదా హక్క౦టాను
చేతికి గాజులు తొడిగాడు చెదిరిన తిలకం దిద్దాడు…..
మోడు వారిన ఆడబ్రతుకుల పసుపూ కుంకుమ నిలిపాడు..
నిలిపాడు (కలసి)
అడుగో.. అతడే.. గురజాడ
మంచిచెడ్డలు లోకమ౦దున ఎంచి చూడగా రెండే కులములు (2)
మంచియన్నది మాలయైతే… మాల నేనౌతాను..
మాల నేనౌతాను అన్నాడు….. (కలసి పాడుదాం)
తెలుగువారు నవజీవన నిర్మాతలనీ…
తెలుగుజాతి సకలావనికే జ్యోతియనీ (కలసి పాడుదాం)
కుల, లింగ వివక్షలకు విరుద్దంగా గళం విప్పిన ఓ యువకుని భావావేశాన్ని ప్రకటించే సందర్భం ‘బలిపీఠం’ సినిమాలో వచ్చినప్పుడు, ఆ సన్నివేశానికి సరిపోయే పాటను శ్రీ శ్రీతో రాయించుకున్నారు దాసరి నారాయణరావు. రంగనాయకమ్మ నవలను తెరకెక్కిస్తూ అప్పటి ప్రముఖ సినీ కవులందరితో పాటలు రాయించుకున్నారాయన. అభ్యుదయాన్ని గేయరూపంలో వ్యక్తీకరించడానికి మాత్రం ఆయన ఎన్నుకున్నది శ్రీ శ్రీనే. ప్రగతీశీల భావజాలంతో నిండిన పాటలను, సమాజంలోని రుగ్మతలకు విరుద్దంగా గళం విప్పిన గేయాలను శ్రీ శ్రీ చేతే రాయించుకోవడం అన్నది, ఆయన సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పటి నుండి ఆయన మరణం దాకా ప్రతి ఒక్క నిర్మాతా, దర్శకులూ పాటించిన నియమమే. అలా బలిపీఠం సినిమాలో శ్రీ శ్రీ రచించిన పాట “కలిసి పాడుదాం తెలుగు పాట”
శ్రీ శ్రీని ఎంతో ప్రభావితం చేసిన సంఘ సంస్కర్తలు కందుకూరి, గురజాడ. వీరిద్దరూ చేపట్టిన సమాజహిత కార్యక్రమాలు తన వ్యక్తిత్వ నిర్మాణంలో ఎంతో సహాయపడ్డాయని ఆయన పలు సందర్భాలలో చెప్పారు. కందుకూరి వీరేశలింగం గారిపై ఒక సినిమా తీయాలని శ్రీ శ్రీ కు కోరిక ఉండేదని ఆ రోజుల్లో ఆయనతో కలిసి పని చేసిన చాలా మంది చెప్పారు. వీరిద్దరి ప్రభావంతోనే సాంప్రదాయ తెలుగు కవిత్వాన్ని వదిలి తాను ఆధునిక కవిత్వం వైపుకు మరలానని శ్రీ శ్రీ చెప్పుకున్నారు. తెలుగుజాతి గర్వించదగ్గ వైతాళికులు ఈ ఇద్దరని శ్రీ శ్రీ బలంగా నమ్మారు. కుల, లింగ వివక్షలపై ఈ ఇద్దరూ సాగించిన పోరాటం తనకు ఎంతో స్పూర్తిదాయకం అని ప్రకటించారు శ్రీ శ్రీ.
అందుకే ఈ పాటలో కలిసి పాడుదాం తెలుగు పాట అంటూ పల్లవి రాసుకున్నారాయన. వీరిద్దరూ తెలుగు జాతికి ఆణిముత్యాలని, తెలుగు దేశంలో వెలుగులు చిమ్మిన మహానుభావులని వర్ణిస్తూ శ్రీ శ్రీ రాసిన పల్లవి కలసి పాడుదాం తెలుగు పాట, కదలి సాగుదాం వెలుగుబాట అంటూ సాగుతుంది. పైగా తెలుగువారు నవజీవన నిర్మాతలనీ, తెలుగుజాతి సకలావనికే జ్యోతియనీ చాటి చెబుదాం అంటూ నినదిస్తారు ఈ గీతంలో మహాకావి. సమాజంలో మార్పుకు తెలుగు జాతి సదా తన వంతు పాత్ర నిర్వహించిందని, ఈ గడ్డపై పుట్టిన వారు నవజీవన నిర్మాతలని, కొత్త తరాలకు నవీన మార్గాన్ని చూపించిన ధీరులని ప్రకటిస్తున్నారు ఈ పాటలో కవి.
తన మాటకు బలాన్ని చేకూరుస్తూ ఇక్కడ వీరేశలింగాన్ని ప్రస్తావిస్తారు కవి. ఆ మహానుభావుడు జీవితాంతం నడిపిన స్త్రీ సంక్షేమం అనే యజ్ఞాన్ని, దానితో పాటు సంఘ సంస్కర్తగా ఆయన నెరవేర్చిన బాధ్యతలను గుర్తుచేస్తుకుంటూ, వీరేశలింగం కార్యశూరుడని, కలంపట్టి పోరాడిన సింహం అని అంటాడు కవి. చాలా మంది కేవలం మాటల వరకే స్త్రీ సంక్షేమాన్ని పరిమితం చేస్తే ఒంటరిగా ఆ మార్గాన నడిచిన కార్యశూరుడు వీరేశలింగం. దానితో పాటు కలాన్ని తన ఆయుధంగా చేసుకుని సమాజ రుగ్మతలకు ఎదురు నిల్చి పోరాడిన సింహం కూడా. స్త్రీలపై సాంప్రదాయం పేరుతో జరుగుతున్న దురాచారాలను, దురాగతాలను ప్రశ్నించడంతోనే ఆగిపోకుండా వాటిని తుదముట్టించడానికి నడుం బిగించిన ధీరుడతను.
వచనాన్ని, గానాన్నికలుపుకుని గేయనాటకాలను రచయితలు ప్రదర్శించే కాలం అది. బుర్రకథలు, హరికథలు ప్రజల జీవితంలొ ముఖ్యభాగంగా ఉన్న రోజులలో ప్రజానాటకాల వరవడిలో పాటలు రాసేవారు కవులు. ముఖ్యంగా సందేశాత్మకమైన పాటలలో మధ్యలో వచనం వస్తూ ఉండేది. ఈ పాట అదే బాటలోకి వస్తుంది. మగవాడెంతటి ముసలాడైనా మళ్ళీ పెళ్ళికి అర్హత వుంటే, బ్రతుకే తెలియని బాల వితంతువు కెందుకు లేదా హక్క౦టాను అంటూ పాట మధ్యలో ప్రశ్నను సంధిస్తాడు కవి. ఈ ప్రశ్న ద్వారా వీరేశలింగం ఏ దిశగా మార్పు కోసం ప్రయత్నించాడో స్పష్టపరిచే ప్రయత్నం చేసాడు కవి.
భర్త చనిపోయిన స్త్రీ అందంగా తయారవకూడదని, అప్పటి అలంకారాలయిన బొట్టు కాటుక, గాజులు, రంగు చీరల నుండి ఆమెను దూరం చేసి, జుట్టు తీయించి తెల్ల చీరలోకి ఆమెను మార్చి ఇంటికి బందీని చేసింది సమాజం. నిజానికి సాంప్రదాయం పేరుతో స్త్రీపై జరిగిన ఘోరమైన శారీరిక, మానసిక హింస అది. ఈ అన్యాయాన్ని ఎదిరించిన ధైర్యశాలి వీరేశలింగం. మగవాడికి లేని వివక్ష ఆడదానికెందుకని ప్రశ్నించిన మొదటి సంస్కర్త అతను. బాల్య వివాహాలను ఎదిరిస్తూ వితంతు వివాహాలకై కృషి చేసిన మహామనిషి. ఏ గాజులు, తిలకానికి స్త్రీ అకారణంగా దూరమవుతుందో, పునర్వివాహం జరిపి ఆమెకు వాటికి తిరిగి అందించిన మానవతావాది.
నిజానికి ఆ రోజుల్లో స్త్రీకి పసుపు కుంకుమ కేలవం అలంకారాలే కాదు గౌరవ చిహ్నాలు కూడా. స్త్రీ అస్థిత్వానికి పరిపూర్ణతను అందించిన అలంకార సామగ్రి అది. స్త్రీలకు వాటిని తిరిగి అందుకునే స్వేచ్చను అందించిన వీరేశలింగం నేటి ఆధునిక స్త్రీ జీవితానికి బాటను వేసిన మహనీయుడు. ఆ మహామనిషి సంస్కరణాలను ప్రస్తావిస్తూ చేతికి గాజులు తొడిగాడు చెదిరిన తిలకం దిద్దాడు, మోడు వారిన ఆడబ్రతుకుల పసుపూ కుంకుమ నిలిపాడు అంటూ కందుకూరికి నివాళులర్పిస్తాడు కవి.
నిజానికి పసుపు కుంకుమ ఇప్పుడు ఆధునిక స్త్రీ జీవితంలో అంతగా ప్రాధాన్యత ఉన్న వస్తువులు కాదు. వాటికి స్త్రీని దూరం చేసి స్త్రీ స్వేచ్చను, మానవిగా జీవించే అధికారాన్ని హరించే ప్రయత్నం జరిగిన ఆ నాటి కాలంలోని సామాజిక స్థితిగతులను అర్ధం చేసుకోగలిగితేనే స్త్రీ జీవితంలో వాటికున్న ప్రాముఖ్యత అర్ధం అవుతుంది. నిజానికి వస్తువులకన్నా వాటి చుట్టూ ఉన్న సామాజిక, మానసిక అంశాలకే ప్రాధాన్యత ఎక్కువ. గాజులు, బొట్టు అన్నవి ఆ నాటి సమాజంలో కేవలం వస్తువులు కావు. స్త్రీ ఆనందకర జీవితానికి అవసరమైన సాధనాలు. వాటిని స్త్రీలకు తిరిగి ఇచ్చి వారికి స్వేచ్చను అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని తిరిగి అందించడానికి పూనుకున్న కందుకూరిని కార్యశూరినిగా, అగ్నితరంగంగా వర్ణిస్తూ శ్రీ శ్రీ ఈ పాటలో రాసిన చరణం ఆ మహానుభావుడికి లభించిన ఘణమైన నివాళి.
కందుకూరి స్త్రీ సాధికారతకు బాట వేస్తే, కుల వివక్షపై యుద్దం చేసిన తొలి తరం సంస్కర్త గురజాడ. గురజాడను అర్ధం చేసుకుని అతని సంస్కరణాభిలాషను రెండే రెండు వాక్యాలలో అత్యద్భుతంగా అవిష్కరించారు శ్రీ శ్రీ. మంచిచెడ్డలు లోకమ౦దున ఎంచి చూడగా రెండే కులములు, మంచియన్నది మాలయైతే మాల నేనౌతాను అంటూ గురజాడ మానసాన్ని మన ముందుంచాడు మహాకవి.
ఈ లోకంలో ఉన్నవి రెండే కులాలు మంచి, చెడు. ఒక వేళ మంచే మాల అయితే ఆ మాల అవడమే నా ధ్యేయం అన్నట్లుగా అణగారిన వర్గాల ప్రక్క నిలబడిన గురజాడను శ్రీ శ్రీ జీవితాంతం తన గురువుగా తలచాడు. గురజాడను జీవితంలో చూడలేకపోవడమే తన జీవితంలో అతి పెద్ద లోటని ఎన్నోసార్లు చెప్పారు శ్రీ శ్రీ.
ఈ ఇద్దరు సంఘ సంస్కర్తలు తమ జీవితాంతం దేనికోసం సంఘర్షించారో రెండు వాక్యాలలో సంపూర్ణంగా వివరించి, వారికి ఘనంగా నివాళి అర్పించారు వారినెంతో అభిమానించే తరువాత తరం కవి శ్రీ శ్రీ. రెండు జీవితాలను, జీవన సంఘర్షణలను, ఆదర్శాలను రెండు వాక్యాలలో కుదిస్తూ కూడా సంపూర్ణంగా చెప్పగలగడం మామూలు విషయం కాదు. ఈ పాట ద్వారా అది చేసి చూపించారు మహాకవి. అలాగే తెలుగువారిగా ఆ ఇద్దరు మహానుభావులను స్మరించుకోవడం మన కర్తవ్యమని ఈ పాట పల్లవి ప్రకటిస్తుంది. గురజాడ, వీరేశలింగం తెలుగు జాతికి వెన్నె తెచ్చిన మానవతామూర్తులు. తెలుగువారు నవజీవన నిర్మాతలనీ, తెలుగుజాతి సకలావనికే జ్యోతియనీ నిరూపించిన మహోన్నత మానవులు. వీరికి శ్రీ శ్రీ సమర్పించిన అక్షరాంజలి ఈ గీతం.








