ఏ వైపు వెళ్లాలని కలలు కంటామో
ఆ దారులన్నీ ఎవరి గుప్పిట్లోనో చిక్కుకుని ఉంటాయి.
కాళ్ల కింద గట్టి నేలే ఉన్నా…
నిలబడిన ప్రతిచోటా మనదనే హక్కు కోరుకోవడానికి
ఎవరి అనుమతో కావాల్సి వస్తుంది.
మనం చెమటోడ్చి నడిచిన దారంతా మన గుర్తే,
కానీ ఆ సరిహద్దుల పుస్తకంలో మన పేరు మాత్రం ఉండదు..
కనిపించని ఆంక్షలకు పేర్లుండవు, రూపాలుండవు
కానీ మన మాటను , మన అడుగులను కూడా అవే నియంత్రిస్తుంటాయి.
అవి ఎలాంటి పేర్లతోనైనా పిలవబడుతుంటాయి
ఒక గీత కావచ్చు, ఒక కట్టుబాటు కావచ్చు,
లేదా తరతరాలుగా మనల్ని కమ్ముకున్న ఒక అలవాటు కావచ్చు..
ఎక్కడ చూసినా ఒక హెచ్చరిక కనపడుతుంది,
ప్రతి అడుగు చుట్టూ ఒక ఉచ్చు బిగుసుకుంటుంది.
మనం పెదవి విప్పి మాట్లాడబోయే ప్రతిసారీ
ఎవరో ఒకరు వచ్చి మన గొంతును నొక్కిపడుతుంటారు ..
ఈ గదుల మధ్య, ఈ గోడలమాటున ఉక్కపోతలో
గొంతు ఎండిపోయి, చూపు అలిసిపోయింది.
ఎక్కడో దూరంగా, ఎవరికీ తలవంచని
ఒక చల్లటి గాలి కోసం
మన ప్రాణం పరితపిస్తోంది..
కాళ్ల కింద నేల ఉన్నా
నాకు పెద్ద పెద్ద హామీలు అక్కర్లేదు,
ఆ హామీల వెనుక దాగిన బూటకాలు అంతకంటే వద్దు.
నాకొక చిన్న ఆకాశం చాలు
ఎవ్వరి పేరు రాసి లేని,
ఎవ్వరి సరిహద్దులూ తాకని స్వచ్ఛమైన గాలి చాలు..
ఎక్కడో జరుగుతున్న ఘర్షణల తెరవెనుక
శాంతి వచనాలు వినిపిస్తుంటాయి.
ఎక్కడో నలుగుతున్న బతుకుల మధ్య
పవిత్రమైన సిద్ధాంతాలు ముసుగులు కప్పుకుని తిరుగుతుంటాయి.
వాటన్నింటినీ దాటుకుంటూ…
నా ఊపిరిగా మారే గాలికి
ఎవరి సంతకాలు ఉండకూడదు.
అది కులాన్ని అడగకూడదు, మతాన్ని తూకం వేయకూడదు,
మనుషుల మధ్య గోడలు కట్టకూడదు.
కేవలం ప్రాణాన్ని నిలబెట్టే ఒక అరుదైన స్పర్శలా
అది నన్ను తాకాలి..
నా ఊపిరికి హద్దులు గీసి,
నా ఆలోచనలకు సంకెళ్లు వేసే అధికారం ఎవరికుంది?
విశాలమైన ఈ ఆకాశం కింద
నా ఉనికిని నిరూపించుకోవాల్సిన అవసరమేముంది?
నన్ను నేను మలుచుకునే ప్రతి క్షణం
ఎవరో విధించిన కొలతల్లో ఒదిగిపోవడం ఎంత కష్టం
నాకంటూ ఒక దారి, నాకంటూ ఒక దిక్కు,
నన్ను నేను చేరుకునేంత స్వేచ్ఛ చాలు.
నా గమనాన్ని శాసించని చోట,
నా ఉనికిని అణచని చోట,
మనిషిగా బతకడానికి మనిషి అనుమతి అక్కర్లేని చోట
నా రెక్కలను ముడివేయని కాస్తంత విశాలత,
నా ప్రాణాన్ని నాదిగా బతకనిచ్చే
కాసింత ఊపిరి కావాలి!!

